“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

14, జులై 2017, శుక్రవారం

నిన్నటి వరకూ...

నిన్నటి వరకూ
ఏసీ రూముల్లో సుఖాలు పొందిన దేహం
ఈనాడు
శవపేటికలో పురుగులకు
ఆహారమౌతోంది

నిన్నటి వరకూ
సమసమాజం కోరి తపించిన మనసు
ఈనాడు
సమంగా పంచభూతాలలో
విలీనమౌతోంది

నిన్నటివరకూ
అధికారంతో విర్రవీగిన దర్పం
ఈనాడు
ఒంటరిగా శ్మశానపు మట్టిలో
అలమటిస్తోంది

నిన్నటి వరకూ
అడుగులకు మడుగులొత్తిన సేవకులు
ఈనాడు
పత్తా లేకుండా
పారిపోయారు

నిన్నటివరకూ
అన్నీ తెలుసన్న అహం
ఈనాడు
ఏం చెయ్యాలో తెలియక
బిక్కచచ్చిపోతోంది

నిన్నటి వరకూ
లోకాన్ని మారుస్తానన్న గర్వం
ఈనాడు
తన గతేమిటంటూ
కుములుతోంది

నిన్నటి వరకూ
ఆహా ఓహో అన్నవాళ్ళంతా
ఈనాడు
' ఆ ! ఏముందిలే?'
అంటున్నారు

నిన్నటి వరకూ
చిటికెలో అన్నీ వచ్చేవి
ఈనాడు
అరిచినా ఎవరూ
రావడంలేదు

నిన్నటి వరకూ
అందరూ నావారే అనుకున్నాను
ఈనాడు
నాకెవరూ లేరని
తెలుసుకున్నాను

నిన్నటి వరకూ అంతా
నాదే అనుకున్నాను
ఈనాడు
నాకేమీ లేదని తెలుసుకున్నాను

ఒకప్పుడు నేనుంది
విలాసాల సౌధంలో
ఈనాడు నేనుంది
శ్మశానపు మట్టిలో

దీనికోసమా నేను విర్రవీగింది?
దీనికోసమా నేను గర్వంతో పొంగింది?
దేనికోసం నేనిన్నాళ్ళూ పరుగెత్తింది?
దేనికోసం ఎందరినో బాధించింది?

ఇది ముందే తెలిస్తే ఎంత బాగుండేది?
ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతికేవాడిని
ఇది ముందే గ్రహిస్తే ఎంత బాగుండేది?
ఒళ్ళు పోయాక ఇలా చచ్చేవాడిని కాదు...