“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

9, జులై 2017, ఆదివారం

గురుతత్త్వం నీకు నిజంగా కావాలంటే ....

గురుపూర్ణిమ సందర్భంగా లోకానికి అసలైన సుప్రభాతం
-----------------------------------------------------------

గురుచరిత్ర వినోదపు పారాయణాలూ
మనుచరిత్ర వరూధిని వేషాలూ
ఇవన్నీ పరమచెత్త పనులు
గురుతత్వం నిజంగా నీకు తెలిస్తే
ఈ పనులు నువ్వసలు చెయ్యనుగాక చెయ్యవు

సామూహిక భోజనాలన్నీ
త్రైమాసిక తర్పణాలే
రెంటికీ పెద్ద తేడా లేదు
మొదటి దాంట్లో ఆత్మల్లేని దేహాలుంటాయి
రెండోదాంట్లో దేహాల్లేని ఆత్మలుంటాయి
అంతే తేడా

గుళ్ళల్లో నీక్కనిపించే భక్తులందరూ
అహంకారంతో కుళ్ళిపోయిన శవాలే
శవాలలో జీవం కోసం వెదుకుతున్నావా పిచ్చివాడా?
గురుపూర్ణిమ సెలబ్రేషన్స్ అన్నీ
మాయదారి అవినీతి వ్యాపారాలే
గురువంటే ఒక్క పూర్ణిమకే పరిమితమా వెర్రివాడా?

గురువంటే నీ కోరికలు తీర్చే వెలయాలు కాదు
గురువంటే నీ అవసరానికి గుర్తొచ్చే ప్రియురాలు కాదు
గురువంటే నువ్వేం చేసినా సమర్ధించే
ధృతరాష్ట్రపు తండ్రి కాదు
గురువంటే నిన్ను తప్పుదారి పట్టించే
మతమోహపు ఊబి కాదు

నీ దొంగపూజలు గురువుకు అక్కర్లేదు
నీ నంగివేషాలు అతని దగ్గర కాదు
నీ అక్రమ వ్యాపారంలో వాటా
అతనికి ఏమాత్రం అవసరం లేదు

నువ్వు కొట్టే కొబ్బరి కాయకు ఆశపడటానికి
అతను కోతి కాదు
హుండీలో నువ్వేసే రూపాయికి మోసపోవడానికి
అతను బిచ్చగాడు కాదు
నువ్విచ్చే బట్టలకోసం వేచిచూస్తూ
అతను దిసమొలతో లేడు
నువ్విచ్చే నగలకోసం ఆశపడి
అతను దరిద్రంలో లేడు

నాకు బట్టలు పెట్టడం కాదు
ముందు నువ్వు బట్టలు కట్టుకో
నాకు నగలివ్వడం కాదు
ముందు నీ దరిద్రాన్ని తొలగించుకో
నాకు నైవేద్యం పెట్టడం కాదు
ముందు నువ్వసలైన తిండి తిను
నాకు డబ్బులివ్వడం కాదు
ముందు నువ్వసలైన ధనాన్ని సంపాదించు

నీ హారతిని ఆశిస్తూ నేను చీకట్లో లేను
నువ్వు నిమ్నత్వపు చీకట్లో ఉన్నావు
నీ హారతి నీకే పట్టుకో
నీ నైవేద్యం ఆశిస్తూ నేను ఆకలితో లేను
నువ్వు అజ్ఞానపు ఆకలితో ఉన్నావు
నీ ఆకలి సరిగ్గా తీర్చుకో

గురుచరిత్ర పారాయణం చెయ్యడం కాదు
నీ చరిత్ర సక్రమంగా ఉండాలి
గురువారం గుడికెళ్ళడం కాదు
నీ గుండే గుడిగా మారాలి
అప్పుడప్పుడూ సరదాకి మడి కట్టుకోవడం కాదు
నువ్వే దైవానికి దడిగా మారాలి

గురువంటే విశ్వచైతన్యం
నువ్వు కదలలేని రోగివైతే
ఆ చైతన్యం నీకెలా అబ్బుతుంది?
గురువంటే ఎల్లలు లేని ఆకాశం
నువ్వు బురదలో పందివైతే
ఆ ఆకాశం నీకెలా అందుతుంది?

అసలైన గురుతత్త్వం అందరికీ అందేది కాదు
ఎందుకంటే దాని వెల చాలా ఎక్కువ
అసలైన గురుతత్త్వం మందలలో దొరికేది కాదు
ఎందుకంటే దానికి క్వాలిటీ అంటే చాలా మక్కువ

గురుతత్త్వం ఒక ధృవనక్షత్రం
దానికోసం ఆకాశంలోకి నువ్వు సుదూర ప్రయాణం చెయ్యాలి
గురుతత్త్వం ఒక ఎవరెస్ట్ శిఖరం
దానికోసం నీ ప్రాణాలనే పణంగా పెట్టగలగాలి

నువ్వు చేస్తున్న పూజలన్నీ వృధానే
అవి నీ వ్యధలను ఏమాత్రం తీర్చలేవు
నువ్వు వేస్తున్న మతవేషాలన్నీ వృధానే
అవి నీకు గురు అనుగ్రహాన్ని ఏమాత్రం అందించలేవు

నిజమైన గురు అనుగ్రహం నీకు కావాలంటే
ముందు నువ్వు మారాలి
నీ లోపలను నువ్వు కడుక్కోవాలి
నీ లోగిలిని నువ్వు శుభ్రపరచుకోవాలి
నీ పాత 'నేను' లేకుండా పోవాలి
నువ్వు కొత్త జన్మ ఎత్తాలి

అప్పుడే తెలుస్తుంది గురువంటే ఏమిటో
అప్పుడే తెలుస్తుంది గురుతత్త్వం ఏమిటో
చెయ్యలేవా ఈ పనిని?
అయితే అఘోరించు ఈ బురదలోనే
జీవించు ఈ నరకంలోనే

ఇదే నీకు సుఖంగా ఉంటే
నిన్నెవరూ రక్షించలేరు
నరకమే నీకు స్వర్గంలా తోస్తే
నిన్నెవరూ కాపాడలేరు

గురుతత్త్వం నీకు నిజంగా తెలిస్తే
గురుపూర్ణిమ నువ్వు సెలబ్రేట్ చెయ్యవు
నిన్ను నువ్వు కాలిబ్రేట్ చేసుకుంటావు
గురుతత్వం నీకు నిజంగా తెలిస్తే
ఎల్లకాలం బయట బయట తిరగవు
నీలోపలకు నువ్వు నడుస్తావు

ఇన్నాళ్ళూ తెలీలేదా?
పోనీ ఇప్పుడైనా తెలిసిందిగా?
మరి మొదలుపెట్టు నీ పనిని
వేచి చూస్తోంది నీకోసం దివ్యత్వపు అవని