“What is the use of human life if one is not enlightened while still living?" - Self Quote

15, జూన్ 2016, బుధవారం

చంద్రశేఖర సరస్వతి -6 (తపోవన్ మహారాజ్ - మూజీ - శాస్త్రాధ్యయనం)

"తపోవన్ మహారాజ్ ఆశ్రమానికి నేను ప్రతిరోజూ వెళ్లి ధ్యానం చేసేవాడిని అన్నగారు" - అంటూ చంద్రశేఖర్ కొనసాగించాడు.

హిమాలయాలలో తపోవన్ మహరాజ్ పేరు తెలియనివారు ఇప్పటికీ ఎవరూ ఉండరు.ఈయన స్వామి చిన్మయానందకు గురువు.తపోవన్ మహారాజ్ పరమ శివభక్తుడు. మహా తపస్వి. పరమాద్వైతి.

ఈయన కేరళలో నాయర్ కులంలో  1889 లో జన్మించాడు. చిన్నప్పుడు ఈయన పేరు సుబ్రమణ్య నాయర్. ఈ నాయర్లు మన ఆంధ్రాలో కమ్మవారికి సమానమైన కులంగా కేరళలో ఉన్నారు. కేరళ యుద్ధ విద్య అయిన కలారిపయట్టును వీరే పోషిస్తూ బ్రతికిస్తూ వస్తున్నారు.

చిన్నప్పటినుంచే ఈయన అనేక రంగాలలో బహుముఖ ప్రతిభను కనబరచాడు.పద్యాలు వ్రాయడం,తర్కం,వేదాంతం, శాస్త్రాధ్యయనాలలో చాలా పాండిత్యాన్ని స్వంత పరిశ్రమతో గడించాడు.30 ఏళ్ళ వయస్సులో సన్యాసాన్ని స్వీకరించి హిమాలయాలకు వెళ్ళిపోయాడు.ఆ పోవడం పోవడం ఇక తిరిగి రాలేదు.అక్కడే గంగోత్రి ఉత్తరకాశీ ప్రాంతాలలో నివసించి తపస్సులో జీవితాన్ని గడపి 1957 లో దేహాన్ని వదిలేసిన మహనీయుడు.

ఇప్పటికీ హిమాలయాలలో 'తపోవన్ మహరాజ్' అంటే సాధువులందరూ తలవంచి నమస్కారం చేస్తారు.అంత మంచి గౌరవాన్ని ఆయన తన తపోమయ జీవితం ద్వారా సంపాదించాడు.

"హిమగిరి విహారం,కైలాసయాత్ర" అనే రెండు గ్రంధాలను ఆయన తన జీవితకాలంలో రచించాడు.వేదాంతాన్ని ఔపోశన పట్టిన మహాపండితుడు.

ఒకసారి ఈయనకు అవసాన కాలం వచ్చిందని భావించారు. కొన ఊపిరితో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన్ను పాడె మీద పడుకోబెట్టి మోసుకు పోతున్నారు శిష్యులు. అలా పోతూ ఉండగా,బదరీనాథ్ సమీపంలో ఒక ప్రదేశానికి వచ్చేసరికి ఆయనకు మళ్ళీ హటాత్తుగా జవసత్వాలు వచ్చి పాడెమీదే లేచి కూచున్నాడు.ఆ తర్వాత చాలా ఏళ్ళు మళ్ళీ బ్రతికాడు.

ఆయన గురించి ఈ సైట్స్ లో చూడవచ్చు.'మీరు మూజీ అనే ఆయన పేరును విన్నారా అన్నగారు?' అడిగాడు చంద్రశేఖర్.

'లేదు.వినలేదు' అని నేను చెప్పాను.

'రమణమహర్షికి పాపాజీ అని ఒక శిష్యుడున్నాడు.ఈయన లక్నోలో ఉండేవాడు.ఈయనవల్ల ప్రభావితుడైనవాడే మూజీ అనే జమైకన్ బ్లాక్.ఈయన బ్రిటన్ లో స్థిరపడ్డాడు.ఈయన కూడా సన్యాసం స్వీకరించి అద్వైత వేదాంతాన్ని ప్రచారం గావిస్తున్నాడు.శ్రీరామకృష్ణులకు రమణమహర్షికి వీర భక్తుడు అనుచరుడు.బదరీనాథ్ లో ఈయన ఒక సత్సంగం చేశాడు. దానికి బ్రిటన్ నుంచి,అమెరికా నుంచి దాదాపు రెండువేల మంది ఆయన ఫాలోయర్స్ వచ్చారు. ఒకరోజున నేను కూడా ఈయన మీటింగ్ కు వెళ్లాను.చాలా బాగా చెప్పాడన్నగారు. రమణ తత్త్వాన్ని,మన వేదాంతాన్ని చాలా చక్కగా ఇంగ్లీషులో సింపుల్ గా చెబుతున్నాడు.

మా గురువు గారిని ఈయన గురించి అడిగాను.

'మూజీ చెబుతున్నది శాస్త్రబద్ధంగానే ఉన్నది.ఆయన సత్యాన్నే చెబుతున్నాడు' అని మా గురువుగారు కూడా అన్నారు.

ఈయన white fire అనే పుస్తకం వ్రాశాడు.మూజీ గురించి ఇక్కడ చూడవచ్చు.దాదాపు నలభై ఏళ్ళున్న ఒక అమెరికన్ సాధువును కూడా గంగోత్రిలో చూచానన్నగారు.అతను కూడా చాలా నిష్టగా ఉంటున్నాడు.మౌనం, అధ్యయనం, ధ్యానం - ఇవే అతని లోకం. మనవాళ్ళతో సమానంగా సాధన చేస్తున్నాడు.అతన్ని చూచి చాలా ఆశ్చర్యపోయాను.

అదే విధంగా - రామకృష్ణా మిషన్ నుంచి బయటకు వచ్చేసిన బ్రహ్మచారులను చాలామందిని చూచాను.వారందరూ హిమాలయాలలో అక్కడక్కడా ఉంటూ తపస్సు చేస్తున్నారు.

'అవును తమ్ముడూ.రామకృష్ణామిషన్ లో ఈ విధమైన సాంప్రదాయ తపస్సుకు అవకాశం లేదు.అదంతా కర్మయోగం. ఒంటరిగా కొండల్లో అడవులలో ఉంటూ శాస్త్రాధ్యయనం గావిస్తూ తపస్సు మాత్రమే చేసే ప్రాచీనపధ్ధతి వేరు.వివేకానందస్వామి ఏర్పరచిన కర్మయోగవిధానం వేరు.ప్రాచీనపధ్ధతి కంటే కర్మయోగం ఎంతో గొప్పది.కానీ దానిని అందరూ ఆచరించలేరు. చెయ్యగలిగితే మాత్రం వివేకానందస్వామి చూపిన బాట చాలా గొప్పది.అది అర్ధంకాక చాలామంది బ్రహ్మచారులు రామకృష్ణా మిషన్ వదిలేసి బయటకు వచ్చేస్తూ ఉంటారు.అది వాళ్ళ ఖర్మ.

'అవును గాని తమ్ముడూ. మధురానందగారు ఉన్నారా రమణాశ్రమంలో?' అడిగాను. 

'ఉన్నారన్నగారు.రోజూ క్రమం తప్పకుండా ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు ధ్యానం చేస్తాడు ఆయన.' అన్నాడు చంద్రశేఖర్.

'ఆయన రెండో భార్య ఉన్నదా? ఊడిందా?' అడిగాను.

'ఉన్నది.మొదటామె ఇటలీ వనిత.ఈయన్ను రమణాశ్రమంలో చూచి  ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఆమెతో ఈయన ఇటలీ వెళ్లి కొన్ని నెలలున్నాడు.కానీ ఆ జీవితం ఆయనకు నచ్చలేదు.ఆ విషయాన్ని ఆ అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పి ఇండియాకు వచ్చేశాడు.ఆ తర్వాత బెంగుళూరుకు చెందిన ఒక అయ్యర్ల అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు.కాషాయం తీసేశాడు.తెల్ల బట్టలే వేసుకుంటాడు.ఆ అమ్మాయి బెంగుళూరులో ఉద్యోగం చేస్తూ ఉంటుంది.ఈయనేమో రమణాశ్రమంలో ధ్యానంలో ఉంటాడు.ఆ అమ్మాయి ఎప్పుడో నెలకొకసారి వచ్చి పోతూ ఉంటుంది.అదీ సంగతి.ఏమిటో ఆయన ప్రారబ్ధం అలా ఉంది. కానీ ఆయన గొప్ప ధ్యాని అన్నగారు. Effortless Meditation అని ఒక పుస్తకం కూడా ఆయన వ్రాశాడు.

ఈయనతో సహ బ్రహ్మచారిగా బెంగుళూరు ఆశ్రమంలో ఉన్న ఒకాయన నాకు పరిచయం అయ్యాడు.ఆయనిలా చెప్పాడు.

'బ్రహ్మచారిగా ఉన్న రోజులలోనే మధురానంద చాలా నిష్టగా ఉండేవాడు.చాలా డీప్ మెడిటేటర్.అప్పట్లోనే బెంగుళూరు ఆశ్రమ   ఇంచార్జ్ స్వామి ఈయన్ను చాలా అభిమానించేవారు.'

'సన్యాసి అయిన తర్వాత రామకృష్ణా మిషన్ నుంచి బయటకు వచ్చేశాడు.ఆ తర్వాత ఇటలీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమూ, మళ్ళీ ఇండియాకు రావడమూ, ఆ తర్వాత ఈ అయ్యర్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడమూ, ఏంటో అంతా ఖర్మ.కానీ ఏది ఏమైనా ఇప్పటికీ ఆయన రమణాశ్రమాన్ని వదలి పోడు.రోజూ ఆరు గంటలు ఖచ్చితంగా ధ్యానం చేస్తాడు.' అన్నాడు చంద్రశేఖర్.

"ఎందఱో మహానుభావులున్నారన్నగారు.వీరందరినీ చూచి వీరి గురించి తెలుసుకుని ఆ లోకంలో మూడు నెలలు ఉన్నాను.ఎలా గడిచాయో ఆ మూడు నెలలు అసలు తెలీదు.ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను.' అని అర్ధ నిమీలిత నేత్రాలతో చెప్పాడు చంద్రశేఖర్.

అతని మాటలు వింటుంటే, నాకూ ఆనందం కలిగింది. కానీ ఇలా చెప్పాను.

'ఎంతమందిని గురించి తెలుసుకున్నా చివరకు మనకేం ఒరిగింది అనేదే అసలు ప్రశ్న చంద్రా ! ఈ తెలుసుకోవడం ఏమీ ఫలితాన్ని ఇవ్వదు.అసలు విషయం వేరే ఉంది.ఎవరి గురించి ఎంత తెలుసుకున్నా,ఎన్ని పుస్తకాలు చదివినా, చివరకు ఆధ్యాత్మికంగా నువ్వెక్కడున్నావు అనేదే అసలైన సంగతి.సరేగాని,ఒకమాట చెప్పు.శాస్త్రాధ్యయనం ఎంతవరకు అవసరం?శ్రీ రామకృష్ణులు ఈ విషయంలో ఏం చెప్పారు?' అడిగాను.

'సాధనామార్గంలో అది చాలాకాలం అవసరమే అన్నగారు.' అన్నాడు చంద్రశేఖర్.

'చెప్తా విను చంద్రా.అది అవసరం అవునా కాదా? ఎంతకాలం అవసరం? అనేది మనిషి యొక్క అంతరిక వికాసం మీదా, పరిపక్వత మీదా ఆధారపడి ఉంటుంది.కొందరు జన్మంతా గ్రంధపఠనం చేస్తూనే ఉంటారు.కొందరు ఒక్క పుస్తకం చదివి ఇక ధ్యాననిమగ్నులౌతారు.వీరిలో రెండోవారే సరియైనవారు. ఎంత చదివినా ఎంత తెలుసుకున్నా, చివరకు ధ్యానమగ్నత లోనే సత్యసాక్షాత్కారం కలుగుతుంది.పుస్తకాల వలన అది ఎన్నటికీ రాదు.పుస్తకాలు దారి మాత్రమే చూపిస్తాయి.నడక మనమే సాగించాలి.అందుకే ఎల్లకాలం పుస్తకాలను పట్టుకుని కూచోకూడదు.

"ఆత్మావారే ద్రష్టవ్య: శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య:" శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఈ మూటి ద్వారానే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది'-అని వేదం చెప్పింది.మొదట వినాలి.తరువాత విన్నదానిని మననం గావించాలి.ఆ తర్వాత దానినే లోతుగా ధ్యానం చెయ్యాలి.అంతేగాని ఎల్లకాలం శ్రవణం చేస్తూ ఉండకూడదు.నేటి మనుషులు చేస్తున్న తప్పు ఇదే.

అయితే ఒకటి. మామూలు మనుషులతో ముచ్చట్లు చెప్పి మానసికస్థాయి దిగజార్చుకోకుండా ఉండటానికి -  ఉన్నతమైన పుస్తకాలు చదువుతూ అవే భావాల గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండటం - ఎంతో సహాయపడుతుంది.అంతవరకే శ్రవణం యొక్క ప్రయోజనం.

మనుషులతో ఎప్పుడూ సోది మాటలు మాట్లాడుకుంటూ ఉంటే మానసికస్థాయి చాలా దిగజారుతుంది.అది సాధనకు చాలా ఆటంకం అవుతుంది.అందుకే సాధకులైన వారు అతివాగుడును తగ్గించాలి.ఎక్కువగా మౌనం పాటించాలి.ఉన్నత భావాలలో మనసును ఎప్పుడూ నిలపాలి.ఇలా చెయ్యడానికి సద్గ్రంధ పఠనం ఎంతగానో సాయపడుతుంది.అంతవరకే దానియొక్క ఉపయోగం.

కానీ - చదివి తలకెక్కించుకున్న విషయాలన్నీ తన సొంతమే అని,తన గొప్పే అని భ్రమించి,వాటిని ఇతరులకు బోధించాలని చూస్తే మాత్రం అహంకారం తలకెక్కి కూచుని భ్రష్టుడిని గావిస్తుంది.ఇతరులకు బోధించడం కాదు,ముందుగా వాటిని అనుభవంలోకి తెచ్చుకోవాలి.ఇదే అసలైన అంశం.దీనిని బాగా గుర్తుంచుకో.' - అన్నాను.

'నిజమే అన్నగారు.' అని ఒప్పుకున్నాడు చంద్రశేఖర్.

చాలా సేపటినుంచీ కూచుని మాట్లాడుతూ ఉన్నాను.ఇక ఇంటికి పోవాలి.వేరే పనులున్నాయి. అందుకని సెలవు తీసుకుని లేచాను.

ఇంతలో మళ్ళీ అమెరికా శిష్యురాలు ఫోన్ చేసింది. సరిగ్గా అదే సమయానికి తన ఫోన్ రావడం కాకతాళీయం కాదనిపించింది.

'ఇదుగో నువ్వడిగిన చంద్రశేఖర్ ఇక్కడే ఉన్నాడు.మాట్లాడు' అని ఫోన్ తనకిచ్చాను.

తను అటునుంచి ఏమందో ఏమోగాని - 'అబ్బే అదేం లేదండి. అన్నగారు వ్రాసేటంత గొప్పవాడిని కాను నేను.' అంటూ సిగ్గు పడి  ఫోన్ నాకిచ్చేశాడు చంద్రశేఖర్.

'సరే.చంద్రా.వస్తా ఇంక.మళ్ళీ అరుణాచలంలో కలుద్దాం.' అని నేను బైక్ తీసుకుని బయల్దేరి ఇంటికి వచ్చేశాను.