నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, జూన్ 2016, మంగళవారం

చంద్రశేఖర సరస్వతి -5 (పంజాబ్ హర్యానా గుజరాత్ వాసుల దాతృత్వం)

తన పరివ్రాజక జీవితంలో ప్రతిరోజూ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు విజయ్ జీ.ఎందుకంటే ఆయన దగ్గర ఏ విధమైన ఆస్తీ ఉండదు.అన్నింటికీ ఈశ్వరుని మీద ఆధారపడి ఉంటాడు.చివరకు నిత్యావసరాలకు కూడా దేవుడే వారికి దిక్కు. ఉదాహరణకు చెప్పాలంటే - సబ్బు లేకుంటే మనం స్నానం చెయ్యలేం.వారలా కాదు. గంగానది ఒడ్డున ఉన్న వండ్రుమట్టితో ఒళ్ళు తోముకుని అదే నదిలో స్నానం చేసేస్తారు. అంతే. తుడుచుకోడానికి తుండుగుడ్డ లేకపోతే ఎండలో నిలబడి ఒళ్ళు ఆరబెట్టుకుంటారు.ఆ గాలికీ ఎండకూ ఒళ్ళు శుభ్రంగా ఆరిపోతుంది. ఎంతో హాయిగా కూడా ఉంటుంది.

శరణాగతి గురించి మనం ఎంతో మాట్లాడతాం.ఎన్నో ఉపన్యాసాలిస్తాం.కానీ మన జీవితంలో అది ఎక్కడా కనపడదు. అందుకే మనవి హిపోక్రిటికల్ జీవితాలుగా ఉంటాయి.వారు ప్రతిక్షణమూ దానిని ఆచరిస్తారు. అందుకే వారి జీవితాలు ఎక్కడో హిమాలయ శిఖరాల మీద ఉన్న మంచులా ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ ఉంటే, మన బ్రతుకులు బురద గుంటల్లో పందుల్లా కంపుకొడుతూ ఉంటాయి.

ఆయన జీవితంలో జరిగిన ఇంకొక సంఘటన.

1980 లలో ఖాల్సా ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్నది. హిందూ సన్యాసులు ఎక్కడ కనిపించినా చంపి పారేస్తున్నారు ఖాల్సా వాదులు. అలాంటి సమయంలో అమృత్ సర్ స్వర్ణ దేవాలయం చూద్దామని కాలినడకన బయలుదేరాడు విజయ్ జీ. పంజాబ్ లో ప్రవేశించగానే సిక్కు టెర్రరిస్టులు అతన్ని ఆపేశారు.ఎక్కడికెళ్తున్నావని ప్రశ్నించారు.

'స్వర్ణ దేవాలయాన్ని చూడటానికి వెళ్తున్నాను' అని ఆయన చెప్పాడు.

'నువ్వు హిందూ సన్యాసివి కదా. నీకు దానితో పనేమిటి?' అని వాళ్ళు గద్దించారు.

'మీరు పొరపాటు పడుతున్నారు.గురు నానక్ గొప్ప జ్ఞాని. ఆయన్ను నేను అమితంగా గౌరవిస్తాను.ఆయన హిందువే. కాదంటారా? అసలు సిక్కు మతం పుట్టినదే హిందూ మతాన్ని ముస్లిం అరాచకాల నుంచి రక్షించడానికి. మీరు ఆ విషయాన్ని మర్చిపోయినట్లున్నారు.నేను స్వర్ణ దేవాలయంలో ప్రార్ధించడానికి వెళుతున్నాను.' అని ఆయన ధైర్యంగా జవాబు చెప్పాడు.

వాళ్ళేమనుకున్నారో ఏమో - వాళ్ళలో ఒకరి మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని స్వర్ణ దేవాలయం దగ్గర దించి వెళ్ళిపోయారు.

"అదేంటి వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చి దించారా? వాళ్ళు తీవ్రవాదులు.హిందూ సన్యాసి కనిపిస్తే చంపకుండా వదలరు. ఇదెలా సంభవం?' అంటూ అక్కడ పూజారి కూడా ఆశ్చర్యపోయాడట.

ఇలాంటి సంఘటనలు ఎన్నో ఆయన జీవితంలో జరిగాయి.

సిక్కులు చాలా మంచివాళ్ళు. నిజానికి పంజాబ్, హర్యానా, గుజరాత్ ప్రజల దాతృత్వం వల్లనే హిమాలయాలలో సాధువుల జీవనం సుఖంగా గడుస్తున్నది. వాళ్లకు కావలసిన తిండి పదార్ధాలన్నీ ఈ మూడు రాష్ట్రాల నుంచే సరఫరా అవుతూ ఉంటాయి.మిగతా రాష్ట్రాల వంతు చాలా స్వల్పం.మన ఆంధ్రా అయితే మరీ ఘోరం. మనంత పిసినారి మనుషులూ స్వార్ధపరులూ ఎక్కడా ఉండరు.మన డబ్బంతా ఎవరో దొంగ స్వామీజీల ఆశ్రమాలకే చేరుతూ ఉంటుంది గాని నిజమైన సాధువులకు సాధకులకు అది ఉపయోగపడదు.అటువంటి మంచి పనులకు మనం డబ్బు ఇవ్వం కూడా.కష్టపడి సంపాదించిన డబ్బైతే కదా మంచి పనికి ఉపయోగ పడటానికి?

ఒకసారి,విజయ్ జీ వద్దకు ఒక పంజాబీ సిక్కు కుటుంబం వచ్చింది.వాళ్ళేదో తీవ్రమైన సమస్యతో బాధపడుతూ ఉన్నారు. దానికి ఈయన్ను పరిష్కారం అడిగారు.దానికి విజయ్ జీ ఇలా చెప్పారు.

'మేము ఇలాంటి ఈతిబాధలకు పరిష్కారాలు చూపము. అన్నిటికీ దైవమే శరణ్యం.ఇక్కడ మాకందరికీ ఆ గంగామాతే దిక్కు.వెళ్లి ఆమె ఆలయంలో ప్రార్ధించండి.ఆమె అనుగ్రహిస్తే మీకు మంచి జరగవచ్చు.'

ఆ సిక్కులు అలాగే వెళ్లి, గంగామాత ఆలయంలో ప్రార్ధించారు. ఆశ్చర్యకరంగా,ఎన్నేళ్ళు గానో బాధిస్తున్న వారి సమస్య కొద్ది రోజులలో తీరిపోయింది. ఆ కృతజ్ఞతతో మళ్ళీ వాళ్ళు విజయ్ జీ వద్దకు వచ్చి దానికి ప్రతిఫలంగా ఏదైనా చేస్తామని అడిగారు. దానికి విజయ్ జీ ఇలా అన్నారు.

'నాకేమీ అవసరాలు లేవు.చూచారు కదా నేనెలా బ్రతుకుతున్నానో?పైగా ఇందులో నేను చేసింది ఏమీ లేదు. మాత అనుగ్రహంతోనే ఇది జరిగింది.కనుక నాకేమీ అక్కర లేదు.'

కానీ వాళ్ళు ఒప్పుకోలేదు.ఏదన్నా చేస్తామని పట్టు పట్టారు. అప్పుడు విజయ్ జీ ఇలా అన్నారు.

'నాకు మీరేమీ చెయ్యనక్కరలేదు.కానీ అక్కడ ఎంతమంది సాధువులు ఆకలితో అల్లాడుతున్నారో చూడండి.వాళ్ళు నిజమైన తపస్వులు.ఎవరినీ ఏమీ అడగరు.ఈశ్వరుని పైన సంపూర్ణ శరణాగతితో ఉంటూ ఉంటారు.అలాంటి మహనీయులు ఆకలితో బాధ పడకూడదు.అది ఎవరికీ మంచిది కాదు.కనుక, మీకు చెయ్యాలని ఉంటే, వారి తిండి కోసం ఏమైనా చెయ్యండి.అది చాలు. ప్రత్యేకంగా నాకోసం ఏమీ అక్కర్లేదు.'

వెంటనే అక్కడ ఉన్నవారికోసం ఒక ఆర్నెల్లకు సరిపడా గోధుమ పిండి,ఆలుగడ్డలు,పప్పు,ఇతర కొన్ని దినుసులు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు.మళ్ళీ ఖచ్చితంగా ఆర్నెల్లు తిరిగేసరికి ఒక ట్రక్కులో మళ్ళీ ఆర్నెల్లకు సరిపడా సామగ్రి పంపించారు. అసలు సంగతి అది కాదు.ఈ విధంగా గత 25 ఏళ్ళుగా వాళ్ళు అదే విధంగా మానుకోకుండా చేస్తూనే ఉన్నారు. ఈనాటికీ ఇది జరుగుతోంది. ఇదెంత గొప్ప విషయమో చూడండి అన్నగారు.

నేను అక్కడ ఉన్న మూడు నెలలలో పంజాబ్ నుంచి ఆ ట్రక్కు ఒకసారి వచ్చింది.నేనే కళ్ళారా చూచాను.అందులోని సామానంతా దించి వెళ్ళిపోయారు వాళ్ళు. 'విజయ్ జీ కే లియే యే ప్రత్యేక్ భండార్' అని మరికొంత సామగ్రి తెచ్చారు.కానీ విజయ్ జీ ఒప్పుకోలేదు.దానిని కూడా మిగతా సామగ్రితో కలిపి స్టోర్ లో ఇచ్చెయ్యమని చెప్పాడు.వాళ్ళలాగే ఇచ్చి వెళ్ళి పోయారు.అలా ప్రతి ఆర్నెల్లకూ వాళ్ళొక ట్రక్కులో వచ్చి తిండి దినుసులు ఇచ్చిపోతూ ఉంటారు.అలా గత 25 ఏళ్ళ నుంచీ క్రమం తప్పకుండా చేస్తూనే ఉన్నారు వాళ్ళు. 

ఈ విధంగా సాధువుల భోజన వసతి కోసం ఎంతోమంది ఈ మూడు రాష్ట్రాల నుంచి దినుసులు పంపిస్తూనే ఉంటారు. సాధువుల తిండి చాలా సింపుల్ గా ఉంటుంది.చపాతీలు, కొంచం పప్పు, ఆలుగడ్డ ఉడికించిన కూర.అంతే వారి ఆహారం.వారిలో చాలామంది రోజుకు ఒకసారే ఆహారం తీసుకుంటారు.ఈరోజు మధ్యాన్నం తింటే మళ్ళీ రేపు మధ్యాన్నమే వారు ఆహారం తింటారు.మధ్యలో ఇక ఏమీ ఉండదు.ఆ విధంగా ఉండటానికి వాళ్ళు అలవాటు పడిపోయారు.

పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలలోని ప్రజల దాతృత్వం వల్లనే హిమాలయాలలో సాధువులు నిశ్చింతగా సాధన చేసుకుంటూ బ్రతుకుతున్నారు.ఈ మూడు రాష్ట్రాల ప్రజలు చాలా అదృష్టవంతులు అన్నగారు. వారు హిమాలయాలలో ఉంటూ సాధన చెయ్యలేకపోయినా, అక్కడ చేస్తున్నవారిని వీరు సపోర్ట్ చేస్తున్నారు.ఇదెంత గొప్ప సంగతో చూడండి.ఆ కుటుంబాలు ఎంత పుణ్యాన్ని తమ ఎకౌంట్లో జమ చేసుకుంటున్నాయో కదా ! ఖచ్చితంగా వాళ్ళందరూ దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు. అందుకే దశాబ్దాలుగా అలా సేవ చేస్తూ వస్తున్నారు.

ఒక మహనీయుడైనవాడికి మన డబ్బు ఉపయోగపడాలంటే కూడా మనకు అదృష్టం ఉండాలి.ఇతర అవసరాలకు వాళ్ళు అసలు ఏమీ తీసుకోరు. కనీస అవసరం అయిన తిండికి మనం ఏదైనా చెయ్యగలిగితే అది మనకూ మన కుటుంబానికీ గొప్ప వరం అవుతుంది. మన చెడు కర్మను అది చాలా తగ్గిస్తుంది.

గంగోత్రి నుంచి కన్యాకుమారి దాకా కాలినడకన పరిక్రమ చేశాడు విజయ్ జీ.ఆ సమయంలో కూడా చేతులలో చిల్లిగవ్వ లేకుండా, దొరికినది తింటూ, లేకుంటే పస్తులుంటూ, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ, ఈశ్వరధ్యానంలో గంగోత్రి నుంచి కన్యాకుమారి దాకా భారతదేశం అంతా తిరిగి మళ్ళీ కాలినడకన గంగోత్రికి చేరుకున్నాడు.

మైసూరు స్వామీజీ కూడా చాలా ఏళ్ళ క్రితం ఈ పరిక్రమ చేశారు. భారతదేశం అంటే భగవంతుడు జన్మించి నడయాడిన పుణ్యభూమి.ఆ పుణ్యభూమే వారికి దేవాలయం.ఇలా దేశ పరిక్రమ చెయ్యడాన్ని వారు ఒక దేవాలయ ప్రదక్షిణంగా భావిస్తారు. మన దేశపు మట్టి, వారికి మహా పవిత్రమైనది.

వింటున్న నేను ఇలా అన్నాను.

'అవును చంద్రా. ఒక నెలరోజులు అమెరికాలో ఉండి వచ్చేసరికి ఆ విషయం నాకు బాగా అర్ధమైంది. హైదరాబాద్ లో విమానం ల్యాండ్ అవుతున్నదని ఎనౌన్స్ మెంట్ వినగానే నేను ఈ మట్టికే మనసులో నమస్కారం చేశాను. మన దేశంలో ఎన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ, ఈ దేశపు మట్టిలో గాలిలో ఏదో ఉంది. ఆ 'ఏదో' ఏమిటో కూడా నేను చెప్పగలను.

భౌతిక జీవితమే అన్నింటికీ పరమావధి కాదనీ, దైవానుభూతిని పొందటమే మానవజీవితం యొక్క నిజమైన గమ్యమన్న దృఢవిశ్వాసం కలిగి ఉన్న మనుషులు తరతరాలుగా ఈ గడ్డమీద ఉంటూ, తదనుగుణంగా వారి జీవితాలు గడుపుతూ ఉన్నందువల్లనే, ఈ నేలకు ఆ పవిత్రత చేకూరింది. మన దేశపు నిజమైన ఆత్మ - ఆధ్యాత్మికతే. అదే మన బలం. ఆ 'ఏదో' అన్నది అదే.

'వివేకానందస్వామి మొదటి సారి విదేశాలకు వెళ్లి వచ్చినపుడు కొలంబోలో ఓడ దిగి అక్కడ నుంచి మన దేశానికి సముద్ర ప్రయాణం ద్వారా చేరుకున్నారు.మన దేశపు నేలమీద కాలు మోపుతూనే ఆయన ఏం చేశారో తెలుసా? నేలకు తన నొసటిని తాకించి ప్రణామం చేశారు. ఈ మట్టిని కళ్ళకద్దుకున్నారు. తను కట్టుకున్న సూటూ బూటూ తీసి అవతల పారేసి, గుండు చేయించుకుని, తన కాషాయవస్త్రాలు మళ్ళీ ధరించి, కమండలం చేతబట్టుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

మన ప్రజలలో,మన మత గురువులలో ఉన్న అవలక్షణాలు ఆయనకు తెలిసినట్లుగా ఇంకెవరికీ తెలీదు.మన దేశంలో ఉన్న అజ్ఞానం ఎంతో ఆయనకు తెలిసినట్లు ఇంకెవరికీ తెలీదు.కానీ వీటన్నటినీ మించి ఈ దేశంలో దివ్యత్వం ఎక్కడ ఉన్నదో ఆయనకు తెలుసు.విదేశాలన్నీ భోగభూములు.మనది యోగభూమి.ఈ మట్టికి శ్రీరాముని, శ్రీకృష్ణుని, బుద్ధుని, శ్రీ రామకృష్ణుని పాదాలు సోకాయి.ఎందఱో మహర్షుల పాదాలు సోకాయి.అలా సోకడంతో ఈ మట్టి దివ్యత్వాన్ని సంతరించుకుంది.మనం మన అజ్ఞానంతో దాన్ని ఎంతగా పాడు చేసినా సరే, ఆ దివ్యత్వం దానినుంచి పోదు. సాక్షాత్తూ భగవంతుని అవతారాల యొక్క పాదాలు సోకిన నేల కదా? ఆ నేలకే ఆయన ప్రణామం చేశారు.అలా చెయ్యడం ద్వారా శ్రీరామకృష్ణుల పాదాలకే ఆయన ప్రణామం గావించారు." - అన్నాను.

వింటున్న చంద్రశేఖర్ అవునన్నట్లుగా తలాడించాడు.

(ఇంకా ఉంది)