“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, జూన్ 2016, ఆదివారం

మా అమెరికా యాత్ర - 17 (పైన పటారం లోన లొటారం)

అమావాస్య ఘడియలలో ఉన్నాము గనుక కొన్ని పిచ్చి మాటలు మాట్లాడుకుందాం !!

తనకు పిచ్చి అని తెలియని పిచ్చివాడు అమాయకుడు. తనకు పిచ్చి అని తెలిసీ, అది అమావాస్యకూ పౌర్ణమికీ ఉధృతం అవుతుందని కూడా తెలిసీ, అయినా ఆపుకోలేని వాడే అసలైన పిచ్చిమారాజని నా ఉద్దేశ్యం.అలాంటి పిచ్చిమారాజులూ మారాణులూ మా గ్రూపులో చాలామంది ఉన్నారు.అసలేమూలో కొంచమైనా పిచ్చి లేకపోతే మా గ్రూపులో చేరడం ఎవరికీ సాధ్యం కాదని నాకెప్పటినుంచో ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది.నా ఈ విశ్వాసం సన్నగిల్లిన ప్రతిసారీ, మా గ్రూపులో ఉన్న ఏ రాజో ఏ రాణో పిచ్చిపిచ్చిగా గోల చేసి, దాన్ని మళ్ళీ పునరుద్దరిస్తూ ఉంటారు.

సర్లే ఈ పిచ్చిగోలను అలా ఉంచి, అమెరికా పిచ్చిగోల గురించి కాస్త మాట్లాడుకుందాం.

నా అమెరికా యాత్రా విశేషాలు చదువుతున్న కొందరు లోలోపల - " పాపం మొదటిసారి అమెరికా రావడం కదా? అక్కడంతా చూచి బిళ్ళబీటుగా పడిపోయాడు గురుడు"- అనుకుంటున్నారనీ, అలా అనుకునే వారిలో నా శిష్యులూ శిష్యురాండ్రూ కూడా ఉన్నారనీ నాకు తెలీదనుకుని మీరనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.

అన్నీ తెలిసినా ఏమీ తెలీనట్లు నటించడమూ, కావాలని ఎదుటివారిని నేనే తప్పుదారి పట్టించే వేషాలు వెయ్యడమూ, ఏది నిజమో ఏది కాదో తెలియని భ్రమను సృష్టించడమూ, అప్పుడు జరిగే తమాషాను తమాషాగా చూడటమూ నాకు బాగా అలవాటేనని మీకు బాగా తెలుసుకదా !!

మొదట్నించీ కూడా, జీవితాన్ని ఒక తమాషాగా ఒక ఆటగా తీసుకోవడం నా అలవాటు. ఈ అలవాటు దురలవాటనీ, దానిని మార్చుకుంటే నలుగురిలో నీ గౌరవం పెరుగుతుందనీ చాలామంది శ్రేయోభిలాషులు నాకు చాలాసార్లు చెప్పారు.కానీ గౌరవం ఎవడిక్కావాలి? నాకు సరదా ముఖ్యంగాని గౌరవం కాదు.గౌరవం ఎక్కువై నాకు మొహం మొత్తిందన్న సంగతి వాళ్లకు తెలీదు. పాపం పిచ్చోళ్ళు !!

సెల్ఫ్ డబ్బా బాగా ఎక్కువైంది కదా? అందుకని కాస్త దీనికి ఫుల్ స్టాప్ పెట్టి, అసలు సబ్జెక్ట్ లోకి వస్తా.

అమెరికాలో నాకు నచ్చిన ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ, నచ్చని విషయాలు కూడా చాలానే ఉన్నాయి.అలాంటి కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం.

అమెరికాలో ఫుడ్ ఇండస్ట్రీ,మెడికల్ ఇండస్ట్రీ అంతా పెద్ద మాఫియా చేతుల్లో నడుస్తోంది.ఈ విషయం నాకు ఒక వారం రోజులకే అర్ధమై పోయింది.

మన ఇండియాలో అయితే ఒక కప్పు పాలు త్రాగితే వెంటనే శక్తి వచ్చేస్తుంది.కానీ అమెరికాలో అలాంటి కప్పులు ఒక పది పట్టేంత గ్లాసుతో పాలు త్రాగినా కూడా ఏ శక్తీ రాదు.పొట్ట నిండుతుంది. కానీ నీరసం తగ్గదు. ఈ వింత ఏమిటా అని రీసెర్చి చెయ్యగా కొన్ని భయంకరమైన నిజాలు తెలిశాయి.

అమెరికాలో ఫుడ్ మొత్తం ప్రాసెస్ అయినదే.వాళ్ళిష్టం వచ్చినట్లుగా అగ్రి- కల్చర్ చేసి పాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు,సమస్త ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ మార్చిపారేసి పాడు చేసి పారేశారు.

ఒక్కొక్క కూరగాయా రాక్షసి లాగా ఇంతింత లావున ఉంటాయి గాని వాటిల్లో నీరు తప్ప ఇంకేమీ ఉండదు.అవి వండితే మన రుచీ రాదు, తింటే శక్తీ రాదు.కానీ న్యూట్రిషన్ ప్యాక్ట్స్ అని ప్రతిదానికీ పెద్ద లేబుల్ ఉంటుంది.అందులో ఉన్నవి నిజాలో కావో ఎవరికీ తెలియదు.

ప్రతి ఫుడ్ ఐటమూ,పాలతో సహా, మామూలుది ఒకటి, ఆర్గానిక్ ఒకటి, రెండు రకాలు ఉంటాయి.మామూలు ఫుడ్ చీప్.ఆర్గానిక్ ఫుడ్ కొంచం ప్రియం. ఆ ఆర్గానిక్ వి కూడా ట్రై చేసి చూచాను.అవీ అలాగే ఏడిశాయి.వెరసి ఇదంతా పెద్ద మాఫియా లాగా కనిపించింది.

ఇష్టానుసారం కల్చర్ చేసెయ్యడం వల్ల, ఆయా ఆహార పదార్ధాలలో విపరీతమైన కెమికల్స్ చేరిపోతాయి.అవి తినడం వల్ల మనుషులలో చాలా శారీరక మార్పులు వస్తాయి.

ఉదాహరణకు - పాలు బాగా ఎక్కువగా ఇవ్వాలని ఆవులకు గ్రోత్ హార్మోన్ ఇంజక్షన్లు ఇక్కడ సర్వ సాధారణంగా ఇస్తారట.ఆ పాలల్లో ఆ గ్రోత్ హార్మోన్స్ చేరి ఉంటాయి.అవి త్రాగిన పిల్లలు జెయింట్స్ లాగా ఎదిగిపోతుంటారు.పదిహేనేళ్ళు వచ్చేసరికి ఇంతెత్తు అంత లావుతో ఊబకాయులుగా మారిపోతూ ఉంటారు. ఇక ఆ శరీరాలు ఎప్పటికీ తగ్గవు.ఆ ఊబకాయంతో భవిష్యత్తులో ఎన్నెన్ని సమస్యలు వస్తాయో,అసలు వీళ్ళకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో, అయిన తర్వాత ఎన్నెన్ని బాధలు పడాలో,అన్నీఆ దేవుడికే ఎరుక.

ఈ సమస్య అమెరికన్స్ లోనూ ఉన్నది.మన ఇండియన్స్ లో అయితే బాగా ఎక్కువగా ఉన్నది. అమెరికన్స్ చేసినట్లుగా మనవాళ్ళు పడీ పడీ వ్యాయామాలు చెయ్యకపోవడం దీనికి ఒక కారణమని నా ఊహ. రోడ్లపక్కన సైడ్ వాక్స్ లో జాగింగ్ చేస్తూ పరిగెత్తుతున్న అనేకమంది అమెరికన్స్ ను నేను గమనించాను. కానీ ఒక్కడంటే ఒక్క ఇండియా అబ్బాయి గానీ అమ్మాయిగానీ అలా చేస్తూ నాకు కనిపించలేదు.

శాకాహారుల పరిస్థితి ఇలా ఉంటే, ఇక మాంసాహారుల పరిస్థితి చూద్దాం. మాంసం కోసం పెంచే పశువులను వేలాదిగా ఒక చాలీ చాలని ఆవరణలో ఉంచుతారట.వాటికి సరైన లెగ్ స్పేసూ మూవింగ్ స్పేసూ ఉండవు.అవి చాలా చిరాకుగా ఉంటాయి.ఆ చిరాకు ఫలితంగా వాటి రక్తంలో అనేక స్రావాలు విడుదలై ఉంటాయి.వాటి మాంసం అనేక మార్పులకు లోనై ఉంటుంది.ఇది చాలదన్నట్లుగా, రోగాలు రాకుండా ఉండటానికి వాటికి కనీసం 10 రకాల వ్యాక్సిన్లు ఇస్తారు.యాంటీ బయాటిక్స్ విపరీతంగా ఇస్తారు. ఆయా మందులూ వ్యాక్సిన్లూ వాటి శరీరంలో రక్తంలో మాంసంలో చేరిపోయి ఉంటాయి.ఆ మాంసాన్ని ప్రాసెస్ చేసి,చక్కగా ప్యాకింగ్ చేసి అమ్ముతారు. తినేవాళ్ళు కొనుక్కుని లొట్టలేసుకుంటూ తింటారు.

వీళ్ళ శరీరాలలోకి ఆయా వ్యాక్సిన్లూ యాంటీ బయాటిక్సూ ఆ పాడుతిండి ద్వారా చేరిపోతాయి.దాని ఫలితంగా వీళ్ళకు అంతుబట్టని అనేక రోగాలు వస్తూ ఉంటాయి.చివరకు పేగు క్యాన్సర్, లివర్ క్యాన్సర్, మలాశయ క్యాన్సర్ మొదలైన అనేక భయంకర వ్యాధులు వస్తూ ఉంటాయి.

ఆయా వ్యాధులకు చికిత్స అంతా మళ్ళీ మాఫియా మెడికల్ కంపెనీల చేతుల్లో ఉంటుంది.మెడికల్ అంతా ఇన్స్యూరెన్స్ మయం. అక్కడ ఇంగ్లీషు వైద్యం తప్ప ఇతర విధానాలకు గుర్తింపు లేదు.ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్స్ ను 'కల్ట్ మెడిసిన్' అని ఎగతాళిగా పిలుస్తారు.అక్కడక్కడా కొంతమంది నేచురోపత్స్ ఏదో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ అవి సపోర్టింగ్ మెడికల్ సిస్టమ్స్ గానే ఉన్నాయిగాని గుర్తింపుకు నోచుకోలేదు.

కనుక ఆ ఇంగ్లీషు వైద్యంలో ఉన్న చికిత్సనే ఎవరైనా చచ్చినట్లుగా తీసుకోవాలి.ఇంగ్లీషు వైద్యంలో అన్ని రోగాలకూ మందులు లేవని మనకు తెలుసు.అందుకనే ఆయా రోగాలు పూర్తిగా తగ్గవు.కనుక జీవితాంతం ఆ మందులను వాడుతూ, క్రమేణా వాటి డోసేజి పెంచుకుంటూ,లేదా ఇంకా హయ్యర్ పవర్ ఉన్న మందులు వాడుతూ పోవాలి.ఈ లోపల ఆయా మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అసలు రోగం కంట్రోల్ లో ఉన్నట్లు అనిపించినా, ఇతర అనేక రోగాలు శరీరాన్ని చాపక్రింద నీరులా ఆక్రమిస్తూ ఉంటాయి.మళ్ళీ వాటికి ఇంకో స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ మొదలౌతుంది.ఇలా నానారకాల మందులను వాడటం వల్ల శరీరం గుల్ల అయిపోతుంది.

ఇదీ అమెరికాలో జరుగుతున్న ఫుడ్ + మెడికల్ మాఫియాల వాస్తవ చరిత్ర.

ఇదంతా తెలుసుకున్న అనేకమంది - మామూలు ఫుడ్ వదిలేసి, ఆర్గానిక్ ఫుడ్ వైపు మళ్ళుతున్నారు.అలాగే - మాంసాహారం వదిలేసి శాకాహారం వైపు మళ్ళుతున్నారు.

పంచవటి US ట్రస్ట్ కు ప్రెసిడెంట్ అయిన ఆనంద్ గారికి ఒక స్నేహితుడున్నాడు.ఆయన తన సబ్జెక్ట్ లో Ph.D చేసి మంచి ఉద్యోగం చెయ్యడమేగాక, ప్రస్తుతం వాలంటరీ తీసుకుని ఒక ఇల్లు కొనుక్కుని హాయిగా ప్రశాంత జీవితం గడుపుతున్నాడు. ఈయన, నేను వ్రాస్తున్న ఈ నిజాలన్నీ బాగా చూచి పరిశీలించి వాస్తవాలను గ్రహించిన బుద్ధిమంతుడు.కనుక, తన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీస్థలంలో చక్కగా కూరగాయలు పండ్లు పండించుకుంటూ ఆ కూరలే తింటూ కాలక్షేపం చేస్తూ అమెరికాలో కూడా ఒక రుషిలాగా బ్రతుకుతూ ఆరోగ్యంగా హాయిగా ఉన్నాడు.

పాతకాలంలో మన పల్లెల్లో కూడా ఎవరింట్లో వాళ్ళకు కూరగాయల పాదులు ఉండేవి.పొలంలో ధాన్యం పప్పూ పండేవి. ఏ కెమికల్సూ వాడకుండా, చక్కగా సహజంగా పండిన పంటా, పెరిగిన కూరలూ, ఏ కెమికల్సూ తినని ఆవులు గేదెల పాలూ ఉండేవి.అవి తిన్న ఆనాటి మనుషులు 90 ఏళ్ళు వచ్చినా ఉక్కుల్లా ఉండేవారు.రోజంతా పొలం పనులు చేసేవారు. వాళ్లకు సుగర్లూ బీపీలూ ఇతర ఏ రోగాలూ ఉండేవి కావు.ఈరోజున 20 ఏళ్ళు వచ్చేసరికి తుక్కై పోతున్నారు.తేడా స్పష్టంగా కనిపించడం లేదా? అంతా తిండి మహిమ మరి !!!

అమెరికాలో చాలామంది తమ ఒళ్ళు పెరిగిపోతూ ఉండటం గమనించి - రకరకాల వ్యాయామాల వైపు మళ్లుతున్నారు. విపరీతంగా వ్యాయామం చేస్తూ ఒళ్ళు కరిగించుకునే ప్రయత్నాలు చేసున్న అనేకమందిని జిమ్ముల్లో నేను చూచాను.లేకపోతే ఆ వాతావరణానికి,  తిన్నది ఏమాత్రం అరగదు.క్రమేణా ఒంట్లో ఫ్యాట్ పెరిగిపోవడం మొదలౌతుంది.

ఇదంతా గమనించి మొత్తుకుంటుంటే చూచి మా అబ్బాయి ఒకరోజున ఇలా అన్నాడు.

'నాన్నా.మన ఇండియాలో అయితే పేదవాడు బక్కగా ఉంటాడు.ఇక్కడేమో ఊబకాయునిగా ఉంటాడు.అదే విచిత్రం.ఎందుకంటే అమెరికా పేదవాడు డబ్బుల్లేక చీప్ తిండి తింటూ ఉంటాడు.ఒక డాలర్ కే కొన్ని కంపెనీలు ఇక్కడ హాం బర్గర్లు అవీ అమ్ముతాయి.అవి కొనుక్కుని తింటారు.వాటిల్లో చాలా హానికరమైన కెమికల్స్ ఉంటాయి.అవి ఒంట్లోకి చేరి లావెక్కి పోతూ ఉంటారు.కనుక ఇక్కడ ఊబకాయులను అందరినీ డబ్బు ఎక్కువైన వాళ్ళని అనుకోకు.వాళ్ళలో చాలామంది పేదవాళ్ళే.'

ఈ లాజిక్ విని నాకు మతిపోయినంత పనైంది.కానీ ఇది నిజమే అని పరిశీలనలో తెలిసింది.

నా వరకూ నేను - అమెరికాలో ఉన్నప్పుడు పెద్దగా తిన్నది కూడా ఏమీ లేదు.కానీ ఒక్క నెలలో నేను 4 కేజీలు బరువు పెరిగాను.ఆ బరువంతా పొట్ట దగ్గరే వచ్చింది.ఇండియా వచ్చిన ఈ పది రోజులలో యోగవ్యాయామాలు చేసి ఆ 4 కేజీలూ కరిగించి పారేశాను.పొట్టను మళ్ళీ మామూలు స్థితికి తెచ్చాను.

వ్యాయామం చెయ్యకపోతే మాత్రం అమెరికాలో కొవ్వు పెరగడం చాలా తేలిక.దానివల్ల ఆరోగ్యం పాడవడం కూడా చాలా తేలిక.ఒకసారి ఒళ్ళు పట్టు తప్పాక తిరిగి వెనక్కు తేవడం దాదాపు అసాధ్యం అవుతుంది.

అమెరికాలో అంతా స్వర్గమే అని నేను అనుకోవడం లేదు. అక్కడ ఉన్న నరకం కూడా నాకు బాగా తెలుసు.ఇప్పుడు వ్రాసిన నరకాలు కాదు, ఇంకా భయంకరమైన నరకాలు అక్కడ ఏమేమి ఉన్నాయో ముందు పోస్టులలో వ్రాస్తాను.చదవండి.

ఫుడ్ అండ్ మెడికల్ ఇండస్ట్రీ వరకూ చూస్తే, మన ఇండియానే అమెరికా కంటే వెయ్యి రెట్లు నయం అని నేను అనుభవపూర్వకంగా చూచి గ్రహించాను.మనది Unorganized pollution అయితే అక్కడ అంతా Well organized scientific pollution అని నాకనిపించింది.ఇది వాస్తవం కూడా.

అంతా వెలుగే ఉండటం ప్రకృతి నియమం కాదుగా? వెలుగు పక్కనే చీకటి కూడా ఉండాలి.ఉంటుంది కూడా.

కాకపోతే - ఈ చీకటి వెలుగులనేవి ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క కుటుంబంలో, ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఈ సూత్రానికి ఏదీ అతీతం కాదు.ఎవరూ అతీతులు కారు.

అమెరికాలో నేనున్న ఒక్క నెలలో - ఆ సొసైటీలో ఉన్న పైన పటారాన్ని మాత్రమే కాక, లోన లొటారాన్ని కూడా బాగానే గమనించాను.అక్కడి సోషల్ డిసిప్లిన్ కూ, ప్రకృతిని చక్కగా ఉంచడానికీ, వాళ్ళ మర్యాదపూర్వక ప్రవర్తనకూ నేను ముగ్దుడిని అయినప్పటికీ, ఆ సొసైటీ అంతా స్వర్గమే అని నేను ఏమాత్రం నమ్మడం లేదనీె,అక్కడిదంతా చూచి నేనేమీ బిళ్ళబీటుగా పడిపోలేదనీ చెప్పడమే నా ఉద్దేశ్యం.

నేను పిచ్చివాళ్ళకు గురువునే అయినప్పటికీ, ఈ విధంగా చూచినదంతా నిజమని నమ్మడానికి నేనేమీ అమావాస్య పిచ్చోడిని కాదుగా?

అమ్మో ! అమావాస్య ఘడియలు అయిపోవస్తున్నాయి.కొన్ని తంత్రసాధనలు చేసుకోవాలి.లేకుంటే ఆ శక్తులు నన్ను బ్రతకనివ్వవు. ఉంటా మరి !!

(ఇంకా ఉంది)