“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, ఫిబ్రవరి 2016, శుక్రవారం

అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 9 (జీవిత గమనం - దశాప్రకరణం)

జనన సమయం 4.33 అని నిర్ధారణ అయ్యింది గనుక,ఇక దీని అనుగుణంగా మెహర్ బాబా జీవితాన్ని ఒక్కసారి స్థూలంగా పరికిద్దాం.

జనన సమయంలో జరుగుతున్న రాహుదశ 5-6-1900 తో అయిపొయింది. అంటే ఈయన జననసమయానికి రాహుదశ 6 సం -3 నె -10 రోజులు మిగిలి ఉన్నది.

5-6-1900 వరకూ రాహుదశ జరిగింది.
16 ఏళ్ళు గురుదశ 5-6-1916 వరకూ జరిగింది.
19 ఏళ్ళు శనిదశ 5-6-1935 వరకూ జరిగింది.
17 ఏళ్ళు బుధదశ 5-6-1952 వరకూ జరిగింది.
7 ఏళ్ళు కేతు దశ 5-6-1959 వరకూ జరిగింది.
మిగిలిన శుక్ర దశలో 31-1-1969 న శుక్ర - రాహు - సూర్యదశలో ఆయన మరణించాడు.

రాహుదశ (1894-1900)
బాల్యంలో గడచిన ఆరేళ్ళ రాహుదశలో చెప్పుకోదగ్గ విషయాలు లేవు.

గురుదశ (1900-1916)

ఈ గురుదశలోనే ఈయన గురుకటాక్షాన్ని పొందాడు.1900 లో గురుదశ మొదలుకావడం తోనే ఈయన గురువైన బాబాజాన్ పూనాకు వచ్చి చేరుకుంది.ఆ తర్వాత 12 ఏళ్ళ పాటు మేర్వాన్ కు సరియైన స్థాయి రావడం కోసం వేపచెట్టుక్రింద రాత్రీ పగలూ కూచుని ఈమె ఎదురు చూచింది.

1913 మే లో సైకిల్ మీద వెళుతున్న మెహర్ ను బాబాజాన్ దగ్గరకు రమ్మని పిలిచింది.అప్పుడు గురు-కుజ-గురుదశ జరిగింది.గురువు అనుగ్రహం గురువు ద్వారానూ, ఆత్మకారకుడైన కుజుని ద్వారానూ ఆయన్ను ఆ విధంగా తాకింది.

1914 జనవరిలో గురు - రాహు- రాహుదశ జరుగుతున్న సమయంలో బాబాజాన్ ఈయనకు ఆలోచనాలోకానికి అతీతమైన విశ్వానుభవాన్ని కలిగించింది.ఇది ఒక విచిత్రమైన యోగదశ.రాహువు గురువును సూచిస్తూ, షష్ఠ నవమాధిపతి అయిన నీచబుధునితో కలసి ఉన్నాడు.మామూలు మనుషులైతే ఈ సమయంలో చెడుస్నేహాలు చేసి నానా అలవాట్లు నేర్చుకుని భ్రష్టు పట్టి పోయి ఉండేవారు.కానీ మహనీయుల జాతకాలు విభిన్నంగా ఉంటాయి.ఇంతకు ముందు చాలాసార్లు వ్రాశాను.మామూలు మనుషుల జాతకాలలో చెడుఫలితాలు ఇచ్చే యోగాలు వీరి జాతకలలో అత్యున్నతమైన ఫలితాలిస్తాయి అని.

రాహువుచేత మ్రింగబడిన నీచ బుధునివల్ల - సద్గురు అనుగ్రహంతో లభించిన 'మనోలయం' అనే స్థితి ఇక్కడ మనకు దర్శనమిస్తున్నది.అంటే ఆ సమయంలో ఈయన మనస్సుకు బుద్ధికి అతీతమైన భూమికను రుచి చూచాడు.ఇది ఈయన ప్రయత్నంతో కలిగిన స్థితి కాదు.పూర్తిగా గురు అనుగ్రహమే దీనికి కారణం.అయితే ఆ అనుగ్రహాన్ని పొందటానికి కావలసిన కష్టాన్ని ఆయన గత జన్మలలో పడి ఉన్నాడు.కనుక ఈ జన్మలో అది తేలికగా అందింది.

తరువాత ఎన్నో ఏళ్ళకు ఈయన అమెరికాకు వెళ్ళిన సమయంలో ఒక ప్రసిద్ధ మైండ్ రీడర్ ఈయన్ని పరీక్షించాడు.ఆ వ్యక్తి ఎదుటి మనిషి మనస్సును తేలికగా చదివేశక్తి ఉన్నవాడు.ఎదుటి మనిషి ఆలోచన ఏమిటో అతను చెప్పగలడు.కానీ మెహర్ బాబా మైండ్ ను ఆయన చదవాలని ప్రయత్నించినప్పుడు అతనికి ఒక "విశాలమైన శూన్యం" మాత్రమే దర్శనమిచ్చింది.అందులో ఏముందో అతను చదవలేకపోయాడు.

అప్పుడు మెహర్ బాబా ఇలా అన్నాడు.

'మామూలు భాషలో చెప్పాలంటే నాకు మనస్సనేది లేదు.నాలో ఉన్నది విశ్వ మానసం (Universal Mind) మాత్రమే.దానిని ఇంకొక విశ్వమానసం మాత్రమే చదవగలదు.'

1915 డిసెంబర్ లో గురు-రాహు-శుక్రదశ జరిగిన సమయంలో ఈయన సాయిబాబానూ, ఉపాసనీ మహరాజ్ నూ దర్శించాడు.గురురాహువుల గురించి పైన వ్రాశాను.ఇక్కడ ఇంకొంత వివరిస్తాను.

సామాన్యంగా రాహుశుక్రుల స్పర్శవల్ల జాతకునిలో కాముకత అధికమౌతుంది.కానీ ఇక్కడ ఉన్న గురుకటాక్షం వల్ల అది మ్రింగబడి, పరిణామం చెందింది.నిగ్రహింపబడిన కామశక్తే ఆధ్యాత్మిక శక్తిగా మారుతుంది.కామశక్తిని వృధా చేసేవారు ఎన్నటికీ ఆధ్యాత్మికంగా ఎదగలేరు.అది అసంభవం.

కానీ ఈ జాతకంలో శుక్రుడు పంచమాధిపతిగా లగ్నంలోకి వచ్చి ఉన్నాడు. కనుక ఈ ఇద్దరు సద్గురువుల అనుగ్రహం ఆయనకు లభించింది.1916 తో గురుదశ అయిపోయిందన్న విషయం గమనిస్తే,దశల ప్రకారం జీవిత సంఘటనలు ఎంత ఖచ్చితంగా జరుగుతాయో విశదమౌతుంది.

శనిదశ (1916-1935)

నవమ దశమాలతో ఉన్న సంబంధం వల్ల శని ఈ జాతకంలో గొప్ప ఆధ్యాత్మిక యోగాన్నిస్తున్నాడు.నిజమైన ఆధ్యాత్మికతను ఇచ్చేది ఎప్పుడైనా సరే శని భగవానుడే.ఈయన అనుగ్రహం లేకుంటే మనిషి ఆధ్యాత్మికంగా ఎన్నటికీ ఎదగలేడు.ఒక మనిషి జీవితంలో శనిదశ రాకపోతే ఆ జీవితం ఉత్త పనికిమాలిన జీవితం అవుతుంది.నిజమైన పాఠాలనూ శనిదశ మాత్రమే నేర్పుతుంది.నిజమైన ఔన్నత్యాన్ని కూడా శనిదశ మాత్రమే ఇస్తుంది.అలాగే మెహర్ బాబా జాతకంలో జరిగిన 19 ఏళ్ళ శని దశలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి.

1916-17 వరకూ శని-శనిదశ(దాదాపు మూడేళ్ళు)లో సగం జరిగింది.ఆ సమయంలో ఈయన పూర్తిగా మత్తులో మునిగిన స్థితిలో ఒక పిచ్చివాడిలాగా ఉండేవాడు.ఈ స్థితిలో ఉన్నవాళ్ళను సూఫీ పరిభాషలో 'మస్తు' లంటారు. ఇదే సమయంలో ఆయన ఎన్నో ఘజల్స్, సూఫీ ప్రేమగీతాలూ వ్రాశాడు.వాటిని గొంతెత్తి మధురంగా పాడేవాడు కూడా.ఇదే సమయంలో తన తలను గోడలకు గొబ్బెలకు వేసి బాదుకుంటూ ఉండేవాడు. బాబాజాన్ స్పర్శవల్ల కలిగిన శక్తిప్రసారంతో తల లోపల ఉన్న పినియల్, పిట్యూటరీ గ్రంధులు రూపాంతరం చెందుతూ ఉండటమే ఆ తలనొప్పికి గల అసలైన కారణం.

ఇదే సమయంలో తల్లి గొడవను తట్టుకోలేక ఒక టీచర్ గా కొన్నాళ్ళు పనిచేశాడు.ఆ తర్వాత ఒక సంచార నాటక కంపెనీలో పనిచేశాడు.ఆ తర్వాత తన తండ్రి ప్రారంభించిన టీ దుకాణం లోనూ, కల్లు దుకాణం లోనూ పనిచేసేవాడు. కల్లు దుకాణంలో ఉన్నప్పటికీ నిరంతరం తండ్రీ కొడుకులు దైవ ప్రేమను గురించి అదిచ్చే అమితమైన మత్తును గురించీ మాత్రమే మాట్లాడుకుంటూ ఉండేవారు.మేర్వాన్ అందరికీ కల్లు పోసేవాడు కాదు.బాగా అలవాటు పడిన త్రాగుబోతులకు మాత్రం - ఈ అలవాటు మంచిది కాదనీ - దాన్ని మానుకోమ్మనీ హితబోధ గావించేవాడు.

సారాయి కొట్లో కూచుని సారాయి తాగవద్దని కష్టమర్స్ కి చెబుతూ బ్రతిమాలుతూ,వారికి ఆధ్యాత్మిక బోధలు చేస్తూ ఉంటే ఆ వ్యాపారం ఎన్నాళ్ళు సాగుతుంది?

నేనొక సారి డిల్లీలో ఉన్న సాగర్ పబ్లికేషన్స్ వారి ఆఫీస్ కు వెళ్లాను.అదే వాళ్ళ బుక్ షాప్ కూడా.అనేక జ్యోతిష్య పుస్తకాలను వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు.

నేనక్కడ ఉన్నపుడు జమ్మూ నుంచి ఒక అమ్మాయి అబ్బాయి అక్కడకు వచ్చారు.వారి తాతయ్య ఒక జ్యోతిష్య పండితుడు.ఆయనేవో కొన్ని పుస్తకాలను కొని తెమ్మని వీళ్ళనా షాపుకు పంపాడు.వీళ్ళు నాతో మాటలు కలిపారు.మీరు ఏమేమి పుస్తకాలు కొనబోతున్నారని నేను వారిని అడిగాను.వాళ్ళొక లిస్టును నాకు చూపించారు.అవేవీ జ్యోతిష్యంలో మంచి పుస్తకాలు కావు. కానీ ఖరీదైన పుస్తకాలు.నేను నా ధోరణిలో కుహనా జ్యోతిష్యాన్నీ కుహనా జ్యోతిష్కులనూ విమర్శించాను.ఆ పుస్తకాలు కొనద్దనీ అసలైన మంచి పుస్తకాలు తక్కువధరలో వేరే ఉన్నాయనీ వాళ్లకు చూపసాగాను.ఆ దెబ్బతో వాళ్ళు ఏ పుస్తకాలనైతే కొనాలని వచ్చారో ఆ పుస్తకాలను కొనాలన్న సంకల్పాన్ని మార్చుకున్నారు.ఇదంతా షాపు ఓనరు తన రూము యొక్క గ్లాసు వాల్ లోనుంచి గమనిస్తున్నాడు.

ఆయన నా దగ్గరకు వచ్చి మర్యాదగా ఇలా అన్నాడు.

'సార్. ఒక్కసారి ఇలా వస్తారా?'

ఇలా అంటూ ఆయన నన్ను తన రూములోకి తీసుకెళ్ళి, కూచోబెట్టి, నాకు 'టీ' ఆఫర్ చేశాడు.అంటే మర్యాదగా నన్ను వారినుంచి ఐసోలేట్ చేశాడన్నమాట.

ఆయన చెప్పకుండానే నా తప్పు నాకర్ధమైంది.

వాళ్ళ షాపులో నిలబడి, వచ్చిన వాళ్ళందరికీ నేను అసలైన జ్యోతిష్యం గురించి లెక్చరు చెబుతూ ఉంటే, వారి వ్యాపారం సాగదు. వచ్చినవాళ్ళు కొనకుండానే వెనక్కు వెళ్ళిపోతారు.అది తప్పే కదా??

ఆయనకు సారీ చెప్పి, నాక్కావలసిన పుస్తకాలు తీసుకుని నా దారిన నేను బయటకు వచ్చేశాను.

వాళ్ళ నాన్నగారి కల్లుపాకలో మేర్వాన్ కూడా ఇదేపని చేసేవాడు. కల్లుదుకాణం కౌంటర్లో ఉన్నవాడు - "కల్లు మానండోయ్ బాబూ కళ్ళు తెరవండోయ్" - అని పాటలు పాడుతుంటే ఇంక ఆ వ్యాపారం ఎలా సాగుతుంది?

ఇదే సమయంలో మేర్వాన్ లో కొన్ని అతీత శక్తులు వికసించడం మొదలు పెట్టాయి.ఇతరుల మనస్సులలో ఏమి ఆలోచిస్తున్నారో అతనికి తెలిసిపోతూ ఉండేది.సాధనామార్గంలో ఇలాంటి శక్తులు కలగడం సహజమే.

ఈ సమయంలో జరిగిన ఒక సంఘటన మనకు లభిస్తున్నది.

మేర్వాన్ కు ఒక ముస్లిం పరిచయస్తుడు ఉండేవాడు.అతను ఒకరోజున ఇలా అనుకున్నాడు.

'కొన్నాళ్ళుగా మాంసాన్ని ఎక్కువగా తింటున్నాను.ఇకపైన కొంతకాలం అది ఆపి చేపలను తింటాను.'

అతను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.ఊరకే తనలో తాను అనుకున్నాడు.

మర్నాడు ఉదయమే సైకిల్ తొక్కుకుంటూ తన ఇంటికి వస్తున్న మేర్వాన్ ను అతడు చూచాడు.అతని చేతిలో ఒక చేప ఉన్నది.సైకిల్ ఆపి, ఆ చేపను ఇతనికి ఇచ్చి, మాట్లాడకుండా మళ్ళీ సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు మేర్వాన్. ఇలాంటి సంఘటనలు ఆ సమయంలో చాలా జరిగాయి.

1917-19 మధ్యలో మిగిలిన సగం శని-శని దశ జరిగింది.ఈ సమయంలో ఒక మిత్రునితో కలసి తన స్వంత కల్లు దుకాణం ప్రారంభించాడు మేర్వాన్.ఆ దుకాణం పక్కనే ఒక గదిలో తన మొదటి ఆశ్రమాన్ని మొదలు పెట్టాడు.ఇదే సమయంలో ఆయన ఆధ్యాత్మిక స్థాయికి ప్రభావితులై మిత్రులు, బంధువులు,శిష్యులుగా చుట్టూ చేరడం ప్రారంభించారు.దుకాణంలో పనిలేని సమయంలో ఆ గదిలో చేరి కీర్తనలు భజనలు పాడుతూ ఉండేవారు.లేదా వాళ్లకు ఆధ్యాత్మిక సూచనలిస్తూ ఉండేవాడు.ఇదే సమయంలో నాగపూర్ కు చెందిన తాజుద్దీన్ బాబాను సందర్శించాడు.అలాగే- బోర్గాడ్ పర్వతం మీద ఒక గుహలో ఉపాసనీ మహరాజ్ తో కలసి కొన్నాళ్ళు నివసించి సాధన గావించాడు.

1919-22 శని-బుధ దశ
ఈ దశ మొదలు కావడం తోనే మళ్ళీ ఈయన జీవితంలో మార్పులు కలిగాయి.పూనాకు తిరిగి వచ్చిన ఈయన ఎక్కువకాలం ఏకాంతంగా ఉండటం సాగించాడు.నవమాధిపతిగా రాహువుతో కలసి ఉన్న నీచ బుధుడు తన ప్రభావం చూపడం మొదలు పెట్టాడు.ఎప్పుడూ ఒక చీకటి గదిలో పడి ఉండేవాడు.ఒక సందర్భంలో నైతే, ఎవరిదో మనుషుల పెంటను తన మీదా తన చుట్టూరా పోసుకుని ఒక రాత్రంతా ఆ కంపులో ఒక చీకటి గదిలో పడి ఉన్నాడు.ఆ తర్వాత మళ్ళీ భోర్గాడ్ పర్వత గుహకు వెళ్లి అందులో 40 రాత్రులూ పగళ్ళూ ఉపవాస దీక్షలో ఉన్నాడు.ఇదంతా రాహు బుధుల ప్రభావమే.

1921 లో ఈయన మళ్ళీ ఉపాసనీ మహరాజ్ తో నివసించడం మొదలుపెట్టాడు.ఇదే సమయంలో ఈయనను పూర్తిగా భౌతిక ప్రపంచంలోకి తెచ్చే పనిలో ఉపాసనీ మహరాజ్ కృతకృత్యుడైనాడు.

'మేర్వాన్ ను నేను సిద్ధపురుషునిగా మార్చాను.అతనిని అనుసరించండి. సాయిబాబా నాకిచ్చిన తాళంచెవిని ఇప్పుడు మేర్వాన్ కు ఇచ్చాను.అతని ప్రతి ఆజ్ఞనూ నోరెత్తకుండా పాటించండి.' అని ఉపాసనీ మహరాజ్ తన శిష్యులకు చెప్పేవాడు.ఆ క్రమంలో అప్పటివరకూ ఉపాసనీ మహారాజ్ శిష్యులైన మెహర్ బాబా పినతల్లీ ఇంకొందరు బంధువులూ మెహర్ బాబా భక్తులుగా మారారు.కానీ పూనాకు చెందిన ఉపాసనీ శిష్యులు మాత్రం మెహర్ బాబాను ఒప్పుకోలేదు.

ఇదే సమయంలో ఒక్క మనిషి మాత్రమే పట్టే ఒక చిన్నఇరుకు గుడిసెను నిర్మించుకుని అందులో కొంతకాలం పాటు గడిపాడు మెహర్ బాబా.ఇలాంటి విచిత్రమైన పనులు ఆయన చాలా చేస్తూ ఉండేవాడు.ఆయన గురువైన ఉపాసనీ కూడా ఇలాంటి అంతుబట్టని పనులు చాలా చేస్తూ ఉండేవాడు.అదే లక్షణం గురువు నుంచి శిష్యునికీ వచ్చింది.

1922-23 శని-కేతు దశ

ఈ దశలో తీవ్రమైన సాధనా జీవితం ఎలా గడపాలో తన శిష్యులకు నేర్పించాడు. ఈ దశ మొదలు కావడంతోనే తన 45 మంది శిష్యులతో కలసి పూనా నుంచి బాంబే కు నడుచుకుంటూ వెళ్లి అక్కడ తన మొదటి ఆశ్రమాన్ని స్థాపించాడు.దానిపేరే 'మంజిలే మీమ్'. ఈ మాటకు అర్ధం - 'గురుస్థానం' అని.

తన జీవితంలో శని కేతువుల యోగదశలు ఎప్పుడు వచ్చినా ఆ సమయంలో తీవ్రమైన లోతైన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన గడిపాడు.తన చుట్టూ ఉన్న వారిచేత కూడా గడిపించాడు.దీనికి కారణం శనికేతువులిద్దరూ నవమంలో ఉండటమే.ఇది తీవ్రమైన వైరాగ్య యోగం అవుతుంది.

ఈ ఆశ్రమ నియమాలు చాలా కఠినంగా ఉండేవి.

ఈ ఆశ్రమ వాసులు ఉదయం 4 కే నిద్ర లేవాలి.చన్నీళ్ళు స్నానం చెయ్యాలి. రాత్రి 9 కి నిద్ర పోవాలి.ఈ మధ్యలో ఇతర సంభాషణలూ,న్యూస్ పేపర్లూ పుస్తకాలూ చదవటమూ,పిచ్చిమాటలూ,పిచ్చి కబుర్లూ ఏవీ పనికిరావు. స్నేహితులతోగాని బంధువులతోగాని ఎలాంటి సంబంధమూ పనికి రాదు. లోకంలో ఏం జరుగుతున్నదో పట్టించుకోకూడదు.లైంగికసుఖానికి పూర్తిగా దూరంగా ఉండాలి.జపం ధ్యానం చెయ్యాలి. ఖవ్వాలీలూ సూఫీ ప్రేమగీతాలూ పాడుకోవచ్చు.శరీర శ్రమకోసం ఆడుకుంటే కొన్ని అమాయకమైన ఆటలు ఆడవచ్చు.ఆశ్రమంలో ఉండే రోజువారీ పనులు చేసుకోవాలి.

ఇలాంటి భయంకరమైన జీవితానికి తోడు - అహంకారం అణచడానికి ప్రతిరోజూ బాబా పెట్టే పరీక్షలను ఎదుర్కోవాలి.ఇదొక చాలా కఠినమైన జీవితం.ఇలా జీవించడానికి ఇష్టపడిన 45 మంది మొదటి బ్యాచ్ శిష్యులు ఆయనతో ఆ సమయంలో ఉన్నారు.ఈ సమయంలో తన దగ్గరకు రమ్మని,తన ఆశ్రమంలో ఉండమనీ ఉపాసనీ బాబా అనేక సార్లు పిలిస్తే మెహర్ బాబా తిరస్కరించాడు.

అలా పది నెలల సాధన తర్వాత ఉన్నట్టుండి ఒకరోజున ఆ ఆశ్రమాన్ని రద్దు చేస్తూ మెహర్ బాబా ఆజ్ఞ ఇచ్చాడు.తనతో వచ్చిన వారినందర్నీ మళ్ళీ వెనక్కు వెళ్ళిపొమ్మని చెప్పేశాడు.ఈ ప్రయోగంతో వచ్చిన 'మోనోటోనీ' ని తొలగించడమూ, కొంతమంది శిష్యులలో పెరుగుతున్న అహంకారాన్నీ, పొసెసివ్ దృక్పధాన్నీ పోగొట్టడమే ఈ చర్య వెనుక ఉన్న కారణాలు.

(ఇంకా ఉంది)