“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, ఫిబ్రవరి 2016, గురువారం

అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 3 (జనన కుండలి)

తల్లిదండ్రులు ఈయనకు పెట్టిన పేరు 'మేర్వాన్ షరియార్ ఇరానీ'.ఆయన సంతకాన్ని కూడా M.S.Irani అనే చేసేవాడు.షరియార్ అనేది ఈయన తండ్రిగారి పేరు గనుక ఈయన పేరు మేర్వాన్ అని భావించవచ్చు.ఇది అరబిక్ నామం.దీనికి అనేక అర్ధాలున్నాయి.అగ్నిని సృష్టించే చెకుముకి రాయి అనీ, ధైర్యం,సాహసం,ఆత్మాభిమానం అనీ ఈ పేరుకు అర్ధాలున్నాయి.షరియార్ జొరాష్ట్రియన్ మతానికి చెందిన ఇరానీ గనుక తాము ఆరాధించే అగ్నికి సంబంధించిన పేరుగా దీనిని తన కుమారునికి పెట్టి ఉండవచ్చు.

ఈయన జాతకాన్ని గమనిస్తే - మహాపురుష లక్షణాలు స్ఫుటంగా కన్పిస్తాయి.

లగ్నం నుంచి పంచమంలో గురువు,నవమంలో కేతువులు ఉండటాన్ని చూడవచ్చు.లగ్నం నుంచి రెండు త్రికోణాలూ ఈ విధంగా ఉత్తమమైన ఆధ్యాత్మిక లక్షణాలను కలిగి ఉన్నాయి. కేతువు ఉచ్చస్థితిలో ఉన్న బుధుడిని సూచిస్తున్నాడు. గురుద్రుష్టి కేతువు మీద ఉన్నది, తిరిగి లగ్నం మీదా ఉన్నది. కేతువు దృష్టి గురువు మీదా మళ్ళీ లగ్నం మీదా ఉన్నది. కనుక లగ్నమూ, గురువూ, కేతువూ(ఉచ్ఛ బుధుడిని సూచిస్తూ) ఒక త్రికోణబంధంలో ఇమిడిపోయి ఉన్నాయి.

ఈయన చింతన ఎప్పుడూ ఉన్నతమైన ఆధ్యాత్మికభావాలతో నిండి ఉండేదని,దానికి తోడుగా మంచి బుద్ధి కుశలత కూడా తోడైనదని ఈ యోగం సూచిస్తున్నది.ఎన్నో జన్మల నుంచీ ఈయన లోతైన ఆధ్యాత్మికచింతనా పరుడన్న వాస్తవాన్ని కూడా ఈ యోగం చెబుతున్నది.అంతేగాక ఈయన చాలా ఉత్తముడైన గురువనీ,సత్యమైన దైవమార్గాన్ని లోకానికి బోధించగల ప్రజ్ఞ కలిగినవాడనీ కూడా ఈ యోగంవల్ల మనకు తెలుస్తున్నది.

లగ్నాధిపతి అయిన శనీశ్వరుడు దశమంలో ఉచ్చస్థితుడై ఉండటం చూడవచ్చు.లోకప్రసిద్ధిని కలిగించే కర్మను ఈయన గావిస్తాడని ఈ యోగం యొక్క అర్ధం.అంతేకాదు, లోకంతో ఈయనకు చాలా కర్మానుబంధం ఉన్నదనీ, ఎంతోమంది కర్మను తాను స్వీకరించి అనుభవించడం ద్వారా ఈయన క్షాళనం గావిస్తాడనీ ఈ యోగం చెబుతున్నది.

మహనీయుల జాతకాలలో చూడగానే కనిపించే శని చంద్రుల సంబంధం ఈయన జాతకంలో కొట్టొచ్చినట్లుగా కన్పిస్తున్నది. దశమంలో ఉన్న ఉచ్చశనితో కలసి చంద్రుడు ఉంటూ - ఈయన మనస్సు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమై ఉంటుందనీ, ఎందరిలో ఉన్నా ఈయన ఏకాంతంగా ఉండగలడనీ,లోక వ్యామోహాలకు ఈయన ఏమాత్రం చలించడనీ సూచిస్తున్నది. అంతేగాక లోకం యొక్క బాధలను తనవిగా భావించి, స్పందించడమే గాక తనదైన మార్మిక విధానం ద్వారా వాటిని పరిష్కరిస్తాడని ఈ యోగం సూచిస్తున్నది.

ఈయన జాతకంలో రెండు గ్రహాలు వక్రించి ఉన్నాయి.అవి శుక్ర శనులు. వీరిద్దరూ ఈ జాతకానికి యోగకారకులే.ఇందులో శుక్రుని వక్రత్వం వల్ల అవివాహితునిగా ఉండిపోవడమూ,లైంగిక వాంచలు అంతరించి పోవడమూ సూచింపబడితే, శనీశ్వరుని వక్రత్వం వల్ల తనకంటూ ఏమీ సంపాదన ఉండదన్న సూచన కనిపిస్తున్నది.జాతకంలో శుభగ్రహాలుగా ఉన్న వీరు తమతమ ప్రభావాల సమయంలో మహారాజును కూడా బిచ్చగాడిగా చేస్తారని ప్రామాణిక గ్రంధాలు చెబుతున్నాయి.మెహర్ బాబా కూడా అన్నీ ఉండి ఒక రాజులాగా బ్రతకగల స్థాయి ఉన్నప్పటికీ తనంతట తాను - ఉపవాసాలతో మౌనంతో ఆర్తుల సేవతో - కూడిన జీవితాన్నే ఎక్కువగా గడిపాడు.అన్నీ ఉండి అలా బ్రతకడం శుక్ర శనుల ప్రభావమే.

అంతేగాకుండా, ద్వితీయంలో వక్రించి ఉన్న యోగకారకుడైన శుక్రుడు - ఈ జాతకుడు తనంతట తాను మౌనాన్ని ఆశ్రయిస్తాడని - ఇంకొక విషయాన్ని కూడా సూచిస్తున్నాడు. మెహర్ బాబా తన జీవితమంతా దాదాపు 44 ఏళ్ళు మౌనంగానే ఉన్నాడు.ద్వితీయాదిపతి అయిన శనీశ్వరుడు వక్రించి ఉండటం కూడా దీనినే సూచిస్తున్నది.

వక్రత్వం ద్వారా శుక్రుడు లగ్నంలోకీ శనీశ్వరుడు నవమం లోకీ వస్తారు. శుక్రునివల్ల ప్రపంచ ప్రసిద్ధీ, దేనికీ లోటు లేని జీవితమూ కనిపిస్తుంటే, శనీశ్వరుడు కేతువుతో సంయోగం వల్ల అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తీ, దైవబలమూ కనిపిస్తున్నాయి.

ఒక్క గురువు తప్ప మిగతా గ్రహాలన్నీ కాలసర్పయోగంలో బంధింపబడి ఉండటం చూస్తే, ఒక సద్గురువుగా తప్ప ఇంక ఈయన జీవితంలో  ఏ విధమైన లౌకిక ఎదుగుదలా ఉండదన్న విషయం స్పష్టంగా కన్పీస్తున్నది.

ఇక్కడ ఇంకొక రహస్యాన్ని పరిచయం చేస్తాను.

ఈయన ఆత్మకారకుడు కుజుడు.కుజుడు శక్తి స్వరూపుడు. కుజుడు ఆత్మకారకుడుగా ఉన్నవాళ్ళకు చాలా గట్టి ఆత్మవిశ్వాసం ఉంటుంది.వాళ్ళలో అంతరిక శక్తి కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది. అటువంటి కుజుడు ఈయన వింశాంశ చక్రంలో మిథునంలో ఉన్నాడు గనుక ఆధ్యాత్మిక కారకాంశ మిథునం అవుతుంది.కనుక ఈయనయొక్క ఆధ్యాత్మికశక్తిని అంచనా వెయ్యాలంటే మిధునలగ్నం నుంచి గమనించాలి.

మిథునం నుంచి పంచమంలో ఉచ్చశని చంద్రులున్నారు. శనీశ్వరుడు నవమాధిపతి.ఇది ఒక గొప్ప ఆధ్యాత్మికయోగం. చందుడు వాక్కు స్థానానికి అధిపతిగా శనితో కలసి ఉంటూ - ఈయనకు మాటలతో పని లేదనీ,అంతా మౌనంగానే చేస్తూ శక్తిప్రసారం గావించగల సమర్ధుడనీ చూపిస్తున్నాడు. పంచమాధిపతి అయిన శుక్రుడు నవమంలో రవికి దూరంగా ఉంటూ ఈయన ఉత్త బోధకుడు కాదనీ నిజమైన శక్తి కలిగిన సద్గురువనీ సూచిస్తున్నాడు.

షష్టాదిపతి అయిన కుజుడు సప్తమంలోనూ, సప్తమాధిపతి అయిన గురువు ద్వాదశంలోనూ ఉంటూ - ఈయనకు వివాహం లేదన్న విషయాన్ని తేటతెల్లం గావిస్తున్నారు.దీనికి రుజువుగా కళత్రకారకుడైన శుక్రుడు సున్నా డిగ్రీలలో ఉన్నాడు.

ఈ విధంగా - ఎలా చూచినప్పటికీ ఈయన జాతకం ఒక గొప్ప ఆధ్యాత్మిక సిద్ధిని సూచిస్తున్నది.

(ఇంకా ఉంది)