“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, ఫిబ్రవరి 2016, ఆదివారం

అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 1 (పునాదులు)

శ్రీరామకృష్ణుల తర్వాత నేను అంతగా ప్రేమించేవారు కొందరు మహనీయులున్నారు.ఆ కొందరిలో అవతార్ మెహర్ బాబా ఒకరు.

'మెహర్' అనే పదాన్ని నేను చాలా ఇష్టపడతాను.ఈ పదం నా అంతరాంతరాలలో ఏదో తెలియని స్పందనను ఎప్పుడూ కలిగిస్తుంది.ఈ విషయాన్ని చాలాసార్లు గమనించాను.అలాగే 'మేర్వాన్' అన్న పదం కూడా.ఇది ఆయన అసలు పేరు.బహుశా ఆయనకూ నాకూ లగ్నమూ ఆత్మకారకుడూ ఒకటే కావడమే దీనికి కారణం కావచ్చు.జాతకాల మధ్యనా మనుషుల మధ్యనా ఇలాంటి సూక్ష్మమైన కర్మబంధాలూ పూర్వసంబంధాలూ దాగి ఉంటాయి.

ఇకపోతే, తేదీల ప్రకారం ఈ నెల 25 మెహర్ బాబా జన్మదినం. ఈ సందర్భంగా ఆయన జీవితాన్నీ జాతకాన్నీ పరిశీలిద్దాం.దానికంటే ముందు సూఫీ తత్వాన్ని గురించీ జొరాష్ట్రియన్ మతాన్ని గురించీ కొంత అనుకోవాలి.

ఇస్లాం లోని సూఫీ సాంప్రదాయంలో చాలామంది నిజమైన మహనీయులున్నారు.సూఫీ సాంప్రదాయం ఇస్లాం లోనుంచే పుట్టినప్పటికీ,దానిలో అనేక భారతీయ వేదాంతపరమైన భావాలు పడుగుపేకల్లా కలిసిపోయాయి. తత్ఫలితంగా అది ఒక ఉదారమైన విశాలమైన మార్మికపంధాగా రూపు దిద్దుకుంది. ఇస్లాంలోనూ దాని అనుయాయులలోనూ ఉండే మూర్ఖమైన పోకడలు దీనిలో ఉండవు.నిజమైన ఇస్లాం అనేది సూఫీ తత్వంలోనే దాగుందని నేను విశ్వసిస్తాను.

మెహర్ బాబా తల్లిదండ్రులు ఇరానీలు.వారిది జోరాష్టర్ మతం. జోరాష్టర్ మతస్తులు అగ్ని ఆరాధకులు.ఇస్లాం పుట్టకపూర్వం ఇరాన్ ప్రాంతాలలో జోరాష్టర్ మతమే ప్రాచుర్యంలో ఉండేది. ఇస్లాం వచ్చి దాన్ని ధ్వంసం చేసింది. ఒక రకంగా చూస్తే ఇస్లాం కంటే జొరాష్ట్రియన్ మతం చాలా ఉన్నతమైనది.ఎందుకంటే దానిలో ఇస్లాంలో ఉన్నట్లుగా పరమత విద్వేషమూ హింసాత్మక భావాలూ ఉండవు.

నేనెన్నో సార్లు వ్రాసినట్లు, మహనీయుల జాతకాలను పరిశీలిస్తే కూడా ఒక ధన్యత్వం వస్తుంది.ఎందుకంటే ఆ జాతకపరిశీలనా సందర్భంగా వారి జీవితాల మీదా ఆ జీవిత సంఘటనల మీదా చాలా లోతుగా ఆలోచించవలసి ఉంటుంది.చివరకు అది  వారి మీదనే ధ్యానంగా మారుతుంది.వారు మామూలు మనుషులు కారు గనుక ఆ ధ్యానం ఎన్నో అంతరిక అనుభవాలను మనకు అందిస్తుంది.అందుకనే మామూలు మనుషుల కంటే కూడా ఇటువంటి నిజమైన మహనీయుల జాతకాలు విశ్లేషణ చెయ్యడం అంటేనే నాకు చాలా ఇష్టం.

మనకు దొరుకుతున్న వివరాలను బట్టి మెహర్ బాబా 25-2-1894 న ఉదయం 5 గంటలకు పూనాలో జన్మించాడు.4.30 అని కొంతమంది అంటున్నారు.రెండింటిలో ఏది సరియైన సమయమో ఈ పోస్టులలో మనం సవరణ చేద్దాం.రెండు సమయాలకూ మకరలగ్నమే అవుతుంది.స్థూలంగా చూస్తె, ఈ సమయం ఆయన జీవితంతోనూ, జీవిత సంఘటనల తోనూ చక్కగా సరిపోతున్నందువలన ఇది సరియైన సమయమే అని నమ్ముతున్నాను.

ఇప్పుడు విశ్లేషణలోకి వెళదాం.


జాతకచక్రంలోని పన్నెండు లగ్నాలలోనూ రాశులలోనూ మకర కుంభ లగ్నాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇవి శనీశ్వరుని స్థానాలు.

శనీశ్వరుడు - ఒంటరితనానికీ,ఇంట్రోవర్ట్ స్వభావానికీ, ఉపవాసాలు ఉండటానికీ, ఇతరుల బాధలను తన మీదకు తీసుకుని నిష్కారణంగా మొయ్యడానికీ, తపస్సుకూ, నిజమైన ఆధ్యాత్మిక చింతనకూ,లోతైన నిశితదృష్టికీ సహజ కారకుడు.అంతేగాక సహజరాశి చక్రంలో మకరరాశి మన భారతదేశాన్ని సూచిస్తుంది.కనుక మకర రాశిలో జన్మించినవారికి మన దేశపు ఆధ్యాత్మికతతో సూక్ష్మమైన జన్మాంతర కర్మ సంబంధాలు తప్పకుండా ఉంటాయి.సహజ రాశిచక్రంలో మకరం దశమస్థానం అన్న విషయం మనం గమనిస్తే, ఈ జాతకులు ఎంత లోకహితకరమైన కర్మ చెయ్యవలసి ఉన్నదో అర్ధమౌతుంది.

ఇకపోతే కుంభరాశి లో పుట్టినవారు ప్రపంచానికి ఏదో ఒక గొప్ప మేలును చేసేవారై ఉంటారు.వ్యక్తిగత జీవితంలో అనేక బాధలను పడుతున్నప్పటికీ వారి ఉద్దేశ్యం మాత్రం లోకానికి ఏదో మేలు చెయ్యాలనే ఎప్పుడూ ఉంటుంది.సామాన్యంగా వీరికి స్వార్ధచింతన అనేది ఉండదు.కుంభం సహజ లాభస్థానం గనుక వీరు ప్రపంచం నుంచి గతంలో పొందిన లాభాలను ఈ జన్మలో తిరిగి లోకానికి ఇచ్చి ఆ రుణాన్ని తీర్చుకోవలసి వస్తుంది.కుండలోనుంచి నీటిని పోస్తున్న ఈ రాశి చిహ్నం సూచించేటట్లు వీరు లోకానికి ఏదో ఒక మేలును తప్పకుండా చేస్తారు.

కాకుంటే - వీరిద్దరిలో మకరలగ్న జాతకులు చాలా కష్టాలకు లోనౌతారు. తనకు సంబంధం లేని ఇతరుల కోసం వారు ఎన్నో బాధలు పడతారు.లోకంలో ఎంతో తిరుగుతారు.కుంభలగ్న జాతకులు కూడా పడినప్పటికీ వారు పడే బాధలు వేరుగా ఉంటాయి.

స్థూలంగా ఇవీ ఈ రెండు రాశుల ప్రత్యేకతలు.

వీటిలో - మకరలగ్నంలో,శనివారం నాడు,స్వాతీ నక్షత్రంలో, మాఘమాసంలో బహుళ షష్టి రోజున,ధృవయోగంలో మెహర్ బాబా జన్మించాడు.జనన వివరాలను బట్టి చూస్తే శనీశ్వరునికీ, రాహువుకీ,కుజునికీ,కేతువుకీ ఈయన జాతకంలో ఉన్న ప్రాముఖ్యతలు అర్ధమౌతాయి.ఈయన పుట్టినది కూడా రాహు దశలోనే.

శూన్యంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న శనీశ్వరుని చుట్టూ ఎన్నో రింగ్స్ (వలయాలు) ఉన్నట్లు మనం చూడవచ్చు. అదే విధంగా మకర కుంభ లగ్నాలలో పుట్టిన మహనీయుల చుట్టూ ఎందఱో అనుయాయులు అనుచరులు వలయాలుగా ఏర్పడతారు.శనీశ్వరుని చుట్టూ ఉన్న వలయాలను ఇన్నర్ మరియు ఔటర్ రింగ్స్ గా శాస్త్రవేత్తలు గుర్తిస్తారు.అలాగే ఈ మహనీయుల చుట్టూ కూడా ఇన్నర్ సర్కిల్ ఔటర్ సర్కిల్ అనే రెండు వరసలలో అనుచరులు ఏర్పడతారు.ఈ సత్యాన్ని ఎంతమంది మహనీయుల జాతకాలలోనైనా గమనించవచ్చు. ఇదంతా శనీశ్వరుని ప్రభావం వల్ల జరుగుతుంది.

పూవు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా - ఒక మనిషి పుట్టిన సమయంలో ఉన్న గ్రహస్థితులు చూడగానే ఆ మనిషి జాతకం ఏయే గ్రహాల అధీనంలో నడుస్తుందో,ఆ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో, స్థూలంగా ఆ జీవితం ఎలా ఉంటుందో,ఆ మనిషి ఎందుకోసం ఈ భూమ్మీద జన్మ తీసుకున్నాడో,అతని డెస్టినీ ఏమిటో వెంటనే తెలుసుకోవచ్చు. జ్యోతిశ్శాస్త్రాన్ని గనుక సరిగ్గా అధ్యయనం చేస్తే అటువంటి అద్భుతమైన అవగాహనలను అది అందిస్తుంది.

మెహర్ బాబా జాతకాన్ని చూడటం తోనే ఇదొక మహనీయుని జాతకం అని తేలికగా గ్రహించవచ్చు.నవమంలో ఉన్న కేతువు ఉచ్చస్థితిలో ఉన్న బుధుడిని సూచిస్తూ దైవచింతన ఉన్న ఉత్తముడైన తండ్రిని సూచిస్తున్నాడు.చతుర్దాదిపతిగా కుజుడు ద్వాదశంలో మిత్రస్థానంలో ఉంటూ గుప్తమైన ఆధ్యాత్మిక స్థాయులు కలిగిన తల్లిని సూచిస్తున్నాడు.ఈయన ఆత్మకారకుడు కూడా కుజుడే కావడాన్ని బట్టి, తల్లివైపునుంచి బలమైన ఆధ్యాత్మికత ఈయనకు పునాదిగా ఏర్పడింది అని చెప్పవచ్చు.ఈ విధంగా తల్లి దండ్రులనుంచి ఉత్తమమైన సంస్కారాలు ఈయనకు పుట్టుకతో సంక్రమించాయి.


మెహర్ బాబా తల్లిదండ్రుల పేర్లు షెరియార్ ఇరానీ,షిరీన్ ఇరానీ.వీళ్ళు పార్శీలు.బాబా తండ్రియైన షెరియార్ ఇరానీ మంచి ఆధ్యాత్మిక చింతనా పరుడు.పెళ్లి చేసుకోక ముందు ఆయన కూడా ఎంతో తపనతో తనకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించే గురువుకోసం చాలా వెదికాడు.1853 లో పుట్టిన ఈయన తన చిన్నప్పుడు 12 ఏళ్ళ వయసు నుంచీ 20 ఏళ్ళ వయస్సు వరకూ ఇరాన్ అంతా తిరుగుతూ దైవాన్వేషణలో కాలం గడిపాడు. 1870 ప్రాంతాలలో ఇరాన్,ఆఫ్ఘనిస్తాన్,ఇండియాలలో దేశద్రిమ్మరి యైన ఒక సాధువుగా ఆయన దైవాన్ని అన్వేషిస్తూ చాలా ఏళ్ళు తిరిగాడు. భగవంతుని అన్వేషణ చేస్తూ జీవితాన్ని గడపే ఇలాంటివారిని "దెర్విష్" లంటారు.మన భాషలో చెప్పాలంటే ప్రపంచాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా దైవం కోసం మాత్రమే జీవించే తీవ్ర సాధకులని అర్ధం.


ఆ తర్వాత 1874 లో ఆయన ఇండియాకు వలస వచ్చి కొంతకాలం బాంబే లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు.ఆ తర్వాత మళ్ళీ అన్నీ ఒదిలిపెట్టి ఒక పదేళ్ళపాటు గుజరాత్ సింద్ ప్రాంతాలలో దేశమంతా సర్వసంగ పరిత్యాగిగా తిరుగుతూ ఆకలేసినప్పుడు భిక్షాటన గావిస్తూ, చెట్లక్రింద నిద్రిస్తూ పూర్తిగా దైవసాధనలో కాలం గడిపాడు.

అలా దైవం కోసం ఇరవై ఏళ్ళ అన్వేషణ గావించినా ఆయనకు దైవ సాక్షాత్కారం కాలేదు.చివరకు ఆయన విసిగిపోయి ఒక పని చేశాడు. పాతకాలపు సూఫీలలో ఒకడైన షంషుద్దీన్ హఫీజ్ చేసినట్లుగా - ఆరుబైట నేలమీద గుండ్రంగా ఒక గిరిగీసుకుని దానిలో కూచుని దైవం కోసం ఎదురుచూస్తూ తిండీ,నీరూ,నిద్రా మానుకొని 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు అదేపనిగా ధ్యానంలో ఉండే ప్రయత్నం చేశాడు.కానీ 30 రోజులు గడచేసరికి ఆయన ఇక ఏమాత్రం తట్టుకోలేక ఆ గిరిని దాటి బయటకు వచ్చేశాడు. పూర్తిగా నిస్సత్తువ ఆవహించగా దగ్గరలో ఉన్న ఒక నది దగ్గరకు వెళ్లి దానిలో పడిపోయి స్పృహ కోల్పోయాడు.

కొంతసేపటికి ఒక స్వరం వినిపించి ఆయన్ను స్పృహలోకి తెచ్చింది.

'షరియార్ ! నువ్వు వెదుకుతున్న దానిని నీ బిడ్డగా నీవు పొందుతావు'.

అప్పటికి ఆయనకు పెళ్లి చేసుకోవాలని సంకల్పమే లేదు. పూర్తిగా దైవాన్వేషణలో తన జీవితకాలం గడపాలనే ఆయన సంకల్పం.కానీ ఆ సంకల్పానికి విరుద్ధంగా 1892 లో ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది.

చివరకు తమకు తెలిసిన కుటుంబంలోని ఒకమ్మాయిని పెళ్ళిచేసుకుని పూనాలో స్థిరపడ్డాడు.ఆయన వెదుకుతున్న గురువు ఆయనకు దొరికాడో లేదో,దైవ సాక్షాత్కారం ఆయనకు అయిందో లేదో మనకు తెలియదు.కానీ ఆయనకు పుట్టిన బిడ్డ మెహర్ బాబా మాత్రం అద్భుతమైన ఆత్మికస్థితులను అందుకోగలిగాడు.ప్రేమమయుడైన భగవంతుని అవతారంగా ప్రపంచంలో ఒక వెలుగు వెలిగాడు.సత్యమైన దైవమార్గాన్ని అందరికీ చూపిస్తూ కొన్ని వేలమందిని దైవం వైపు నడిపించ గలిగాడు.తన తండ్రి అందుకోలేని దానిని తాను అందుకున్నాడు.

దీనిని బట్టి ఒక విషయం అర్ధమౌతుంది.

ఏదైనా సరే, మన పూర్వీకులలో లేనిదే మనకు కొత్తగా రాదు అనేమాట చాలా నిజం.మన పూర్వీకులలో ఎవరో ఒక మహనీయుడు ఉంటె తప్ప మనకు ఆధ్యాత్మిక చింతన కలుగదు.80% జీన్స్ ని బట్టీ, 20 % పెంపకాన్ని బట్టీ మన జీవితం ఉంటుంది.అంతేగాని ఊరకే ఆశించినంత మాత్రాన ఏదీ రాదు.ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఇది చాలా నిజం.

ఒక వంశంలో చాలామంది మహనీయులు తరతరాలుగా ఉంటూ వస్తున్నపుడు ఆ వంశంలో పుట్టగలిగే మంచి కర్మా మంచి సంస్కారాలూ ఉన్న జీవులు అలా ఆ వంశంలో జన్మిస్తారు. అలాంటప్పుడే వారికి ఆధ్యాత్మికత అనేది ఆ జీన్స్ లోనూ ఆ రక్తంలోనూ వంశపారంపర్యంగా వస్తుంది.

నేచురల్ ఎవల్యూషన్ అనేది వంశక్రమంలో జరుగుతూ ఉంటుంది.దానిని మధ్యలో చెదిరిపోకుండా అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్లడం ఋషి కుటుంబాలలో మాత్రమే సాధ్యమౌతుంది.ఎందుకంటే వారు దానినే పరమగమ్యంగా పెట్టుకుని దానికోసమే శ్రమిస్తారు.ఒక మహనీయుడైన ఋషికి జన్మనివ్వడమే వారి ఏకైక లక్ష్యంగా ఉంటుంది.దానికి తగిన నియమనిష్టలతో కూడిన జీవితాన్ని వారు పెళ్ళికి ముందే గడుపుతారు. కనుక వారి వంశాలలో మహనీయులు జన్మిస్తారు.ఇలా చెయ్యకుండా, షడ్వర్గాలకు లోనైపోతూ,పశువులలాగా ఆస్తులకోసం,జల్సాలకోసం జీవితాలను గడిపే మిగతా వంశాలలో ఈ ఎవల్యూషన్ అనేది ఒక తరంలో కిందికీ,ఒక తరంలో పైకీ పోతూ, ఊగులాడుతూ ఉంటుంది.ఇదంతా సామాన్యులకు అర్ధంకాని కర్మ సంబంధాల సమాహారాల ఫలితంగా జరుగుతుంది.

మహనీయుల అందరి వంశాలలోనూ ఈ పునాదులను మనం గమనించవచ్చు.వివేకానందస్వామి పూర్వీకులలో సన్యాసం స్వీకరించి తపస్సు చేసినవారు తరానికొకరున్నారు.అలాంటి ఋషులు జన్మించిన వంశం గనుకనే ఆయన ఆ కుటుంబంలో జన్మ తీసుకున్నాడు.శ్రీ రామకృష్ణుల తండ్రిగారైన క్షుదీరాం చటోపాధ్యాయ ఒక చిన్న అబద్ధం చెప్పడానికి వ్యతిరేకించి తన ఆస్తి మొత్తాన్నీ పోగొట్టుకున్నాడు.ఆస్తి వదులుకోవడానికైనా సిద్ధపడ్డాడు గాని అబద్ధం చెప్పడానికి ఆయన ఒప్పుకోలేదు.అలాంటి సత్యమైన మనిషి గనుకే ఆయనకు శ్రీరామకృష్ణులు తనయునిగా జన్మించారు.

పాయసాన్ని తెచ్చి ఒక మురికి పాత్రలో మనం ఉంచలేము. దానికొక స్వచ్చమైన పాత్ర కావాలి. అలాగే,తరతరాలుగా ఉన్నత సంస్కారవంతులు లేని వంశాలలోని ఒకతరంలో హటాత్తుగా మహాపురుషుల జననం సంభవించడం ఎన్నటికీ జరుగదు.అది సాధ్యం కాని పని.

ఒక మహనీయుడు ఒక వంశంలో జన్మించాలంటే అంతకు ముందు కొన్ని తరాలుగా ఆ వంశంలో పునాది తయారౌతూ రావాలి.అప్పుడే అలాంటి ఉత్తమమైన జన్మ సాధ్యమౌతుంది. పాతకాలంలో అటు ఏడు తరాలూ ఇటు ఏడు తరాలూ చూచి, మచ్చలేని వంశాన్ని ఎంచుకుని అలాంటి కుటుంబాలలో పెళ్లి సంబంధాలు కలుపుకునేవారు.ఎందుకని? ఇందుకే. ఉత్తమమైన జీన్స్ ను మ్యాచింగ్ చెయ్యడానికే అన్ని తంటాలు పడేవారు. అలా చెయ్యడం వల్లే ఉత్తములైన మనుషులు ఉద్భవిస్తారని వారికి తెలుసు. జాతకాలలో కూడా మ్యారేజి మ్యాచింగ్ చెయ్యడం వెనుక ఉన్న అసలైన రహస్యం ఇదే.ఉత్తములైన సంతానాన్ని ఉద్భవింప జెయ్యడానికి సరిపోయే రెండు జాతకాలను సరిగ్గా మేచింగ్ చేసి వారికి వివాహం చెయ్యడమే జాతక మేళనం యొక్క అసలైన ఉద్దేశ్యం.దురదృష్టవశాత్తూ ఈ కోణాన్ని ఇప్పుడు ఎవరూ స్పృశించడం లేదు.మానవజన్మ యొక్క అసలైన అర్ధం ఏమిటో అందరూ మరచిపోయి మాయామోహాల స్వార్ధపు ఉచ్చులో చిక్కిపోవడమే దీనికి కారణం.

పనికిమాలిన జీవులు వేలూ లక్షలుగా ఎక్కడ బడితే అక్కడ జన్మించవచ్చు. కానీ ఉత్తమతరగతికి చెందిన జీవులు జన్మించాలంటే మాత్రం, దానికి వంశపారంపర్యంగా వస్తున్న స్వచ్చమైన కొన్ని లక్షణాలు ఆయా కుటుంబాలలో ఖచ్చితంగా ఉండాలి.

విత్తనమూ నేలా రెండూ సరిగ్గా ఉన్నప్పుడే అక్కడ మంచి మొక్క ఉద్భవిస్తుంది.ఈ రెంటిలో దేనిలో తేడా ఉన్నా,ఆ తేడా స్పష్టంగా మొక్కలో కూడా ప్రతిఫలిస్తుంది.ఒక శిశువు జననం కూడా అంతే.పిల్లల్ని కనడం అనేది అందరూ అనుకునేటట్లు ఆషామాషీ వ్యవహారం కానేకాదు. అదొక రహస్యమైన సైన్స్.

ఎవరో ఒకరు పుడితే చాల్లే అనుకుంటే ఆ పరిస్థితి వేరు.'ఇలాంటి ఉత్తమమైన లక్షణాలు ఉన్న పిల్లలే మాకు కలగాలి'- అనుకుంటే మాత్రం ఆ భార్యాభర్తలిద్దరికీ పెళ్ళికి అనేక ఏళ్ళ ముందు నుంచే ట్రెయినింగ్ మొదలౌతుంది. 

జీన్స్ అనేవి ఒక మనిషి జీవితంలో ఎంతగా పనిచేస్తాయో దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు.

(ఇంకా ఉంది)