“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 4 (ముద్దు మహిమ)

ముద్దు అనగానే చాలామందికి అసభ్యత గుర్తొస్తుంది.వారి పెదవులు వంకర నవ్వుతో విచ్చుకుంటాయి.దానికి కారణం వారి కుళ్ళిపోయిన మనస్సులే.నిజానికి ముద్దులో అసభ్యత ఏమీ లేదు.

మనకున్న ప్రేమనూ ఆప్యాయతనూ ఎదుటి మనిషికి వ్యక్తీకరించడానికి అదొక సాధనం.కాకపోతే, పెదవులకు పెదవులు కలిపి పెట్టే ముద్దు రగులుతున్న లైంగికపరమైన కోరికకు సంకేతం. అయితే, క్షుద్రమైన అలాంటి ముద్దు గురించి కాదు ఇప్పుడు నేను వ్రాస్తున్నది.స్వచ్చమైన ప్రేమను పంచే,కల్మషం లేని ముద్దు గురించి వ్రాస్తున్నాను.

ముద్దును గురించి,  13 వ శతాబ్దానికి చెందిన ప్రముఖ సూఫీ మార్మికుడు జలాలుద్దీన్ రూమీ తన మార్మిక కవితలలో ఇలా వ్రాస్తాడు.

నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది
కానీ ఈ ముద్దు ఖరీదు ఎంతో తెలుసా?
నీ జీవితం...
ఈ మాట విన్నాక నా ప్రేమ నా జీవితాన్ని తొందరపెడుతోంది
చాలా మంచి బేరం, దీనిని వదులుకోకు
త్వరగా సొంతం చేసుకో...

'ఎన్నో జన్మలు తపన పడి, ఎన్నో కష్టాలు పడితే కూడా దొరకని మహద్భాగ్యం నీ ఒక్క ముద్దుతో దొరుకుతుందా? అలా అయితే ఇంకేం కావాలి? అదే నిజమైతే నా అంత అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు.ఇంత అదృష్టం ఎవరికి దక్కుతుంది? నువ్వు నిజంగా నన్ను ముద్దాడతావా? నేను సిద్ధం'- అని తానే మళ్ళీ అంటాడు.

ఈ ముద్దును నీవు ఆశిస్తే దానికి తగిన మూల్యం చెల్లించాలి.ఈ ముద్దు అంత తేలికగా లభించేది కాదు.ఇది మీ మనుషులకు తెలిసిన అసహ్యపు ముద్దు కాదు.దీనికి ఒక బేరం ఉంది.ఒక వెల ఉన్నది. అదేంటో తెలుసా? నీ జీవితం.

నీ జీవితాన్ని పణంగా పెట్టగలిగితేనే ఈ ముద్దు లభిస్తుంది.ఈ ముద్దును ఒకసారి రుచిచూచావా, ఇక ఆ తర్వాత నీ జీవితం ఇప్పటిలాగా ఉండదు. నువ్వు ఏం అవుతావో నేను చెప్పలేను. అసలు నీవు నీ పూర్వరూపంలో పూర్వస్థితిలో ఉంటావో ఉండవో కూడా చెప్పలేను.నువ్వు నువ్వుగా ఉంటావో లేక పిచ్చివాడివై పోతావో నేను చెప్పలేను.నువ్వెలాంటి మత్తులో పడిపోతావో నేను చెప్పలేను.మరి అలాంటి వెలను నీవు చెల్లించగలవా? దీనికి నీవు సిద్ధమేనా?

రూమీ వ్రాసిన ఇంకొక కవిత ఇది.

మనలో ప్రతి ఒక్కరం
ఒక ముద్దును తీవ్రంగా వాంచిస్తాం
దైవం యొక్క ఆత్మ మన శరీరాన్ని
తాకడమే ఆ ముద్దు

ప్రతి మనిషీ తన జీవితమంతా ఏదో తెలియని ఒకదానికోసం వెదుకుతూనే ఉన్నాడు.అదేంటో తనకు తెలియదు.కానీ ఏదో తెలియని అసంతృప్తి ప్రతివారికీ లోలోపల ఉంటుంది.అదే మనిషిని నడిపిస్తూ ఉంటుంది.భౌతికస్థాయిలో ఆకలి ఎలా మనిషికి చోదకశక్తిగా ఉండి అతన్ని ముందుకు తోస్తూ ఉంటుందో, అలాగే మానసిక స్థాయిలో ఈ 'అసంతృప్తి' అనేదే మనిషికి చోదక శక్తిగా ఉంటుంది.

కానీ అదేమిటో, అసలు తనకు ఏం కావాలో, ఆ కావాల్సినది ఎక్కడ దొరుకుతుందో అతనికి ఎంతమాత్రం తెలియదు. అందుకని రకరకాల వస్తువులలో, మనుషులలో, పరిస్థితులలో, ఆనందాలలో 'దాని' కోసం మనిషి వెదుకుతూ ఉంటాడు. కానీ 'అది' మాత్రం అతనికి దొరకదు.అదేంటో తెలుసా? అదే దైవం యొక్క ముద్దు.అది దొరికిననాడు ఈ వెతుకులాట పరిసమాప్తం అవుతుంది.దానిని పొందినవాడే ఈ లోకంలో నిజమైన అదృష్టవంతుడు.

కోటానుకోట్లు ధనం సంపాదించినవాడు అసలైన అదృష్టవంతుడు కానేకాదు.ఎందుకంటే ఆ ధనం వాడితో రాదు. అమితమైన సంతృప్తినీ అది ఇవ్వదు.ధనమే కాదు ప్రపంచంలో ఏదైనా ఇంతే.ప్రతిదీ నిన్ను ఉడికించి,ఊరించి,తన వెంట తిప్పుకుని చివరకు నిన్ను శ్మశానంలో వదిలేస్తుంది.

ఈ అసలైన 'ముద్దు' ను పొందినవాడే అసలైన ధన్యుడు.వాడికి అసంతృప్తి అనేదే ఉండదు.వాడికి వెదుకులాటా ఉండదు. నిజమైన 'ఆనందం' అంటే ఏమిటో వాడికి మాత్రమే తెలుస్తుంది. అసలైన 'ముద్దు' ను పొందటమే మానవ జీవిత పరమార్ధం.అంతవరకూ మనిషికి ఈ పరుగు ఆగదు. ఆపుదామన్నా అతను ఆపలేడు.ఆ లోపలున్న తపన ఆగనివ్వదు.

తన చిప్పను తెరవమని
ముత్యపుచిప్పను
సముద్రం యాచిస్తున్నది

సముద్రం అంటే దైవం.ముత్యపు చిప్ప అంటే సాధకుని హృదయం.ముత్యపు చిప్పను తెరవమని సముద్రమే ఆ చిప్పను అర్ధిస్తున్నది.కానీ చిప్ప ఆర్ధం చేసుకోలేక పోతున్నది. ఎంత ఖర్మ? అసలు ముత్యపుచిప్ప ఉన్నది సముద్రంలోనే. తన చుట్టూ సముద్రమే ఉన్నది.తన ఉనికికి ఆధారం సముద్రమే.తాను కోరుతున్నది కూడా అదే సముద్రాన్నే.కానీ అదే సముద్రం అడుగుతుంటే తాను మాత్రం తెరుచుకోడానికి సిద్ధంగా లేదు.భయానికి లోనౌతున్నది.ఒక పక్క సముద్రాన్ని కోరుకోవడమూ ఆపలేదు.ఇంకో పక్క తన భయాన్నీ జయించలేదు.ఏమిటీ విచిత్రం? ఇది విచిత్రం కాదు. యుగయుగాలుగా ప్రతి మనిషి ఖర్మే ఇది.ప్రతిమానవుని అంత: సంక్షోభమే ఇది.

"నీ ఇంటిముంగిట్లో నేను నిలిచి ఉన్నాను.తలుపు తడుతున్నాను.నీ హృదయపు తలుపును తెరువు.నేను లోనికి వస్తాను.నాకోసమేగా ఇన్ని యుగాలుగా నీవు ఎదురు చూస్తున్నావు?మరి నేనే నీ ముంగిట నిలిచి ఉంటే, ఇంకా నీకెందుకు సందేహం?" అని దైవం ప్రశ్నిస్తున్నది.కానీ మనిషి మనస్సు అంత త్వరగా దైవాన్ని నమ్మదు.ఆ మనస్సులో ఉన్న భయాలూ అనుమానాలూ అంత త్వరగా పోవు.సాక్షాత్తూ దేవుడే వచ్చి మనిషి ఎదుట నిలబడినా మనిషి నమ్మడు.అదే మనిషి యొక్క అసలైన ఖర్మ.

లోకంలో ఒక భావన ప్రచారంలో ఉన్నది.అదేమంటే - మానవుడు దైవాన్ని వెదుకుతూ ఉన్నాడని,దైవం ప్రత్యక్షం కావడం లేదని లోకం అంటుంది.అది నిజం కాదు.పూర్తిగా అబద్ధం.

సృష్టి ప్రారంభం నుంచీ దైవమే మనిషి వెంట పడుతూ "నన్ను స్వీకరించు"- అంటూ ప్రాధేయపడుతూ ఉన్నాడు.కానీ మనిషి దైవానికి చిక్కకుండా తన 'అహం' వెంట పరుగెత్తుతూ ఉన్నాడు.అదే సమయంలో తానే దైవం కోసం ప్రయత్నిస్తున్నాననీ, దైవం కరుణించడం లేదనీ అంటాడు. ఇదే మానవ హృదయంలోని అసలైన మాయ.మనిషిలోని అసలైన అసత్యపు ఛాయ ఇదే.

నిజమేమంటే - మనిషే దైవాన్ని కరుణించడం లేదు.మనిషి దైవాన్ని కరుణించడమే సాధనా సర్వస్వం.ఇంతకంటే ఇంకేమీ లేదు.

ఇక లిలీ పూవో
ఎంతగా తన ప్రియుని కోసం
ఎదురుచూస్తున్నదో?

ముత్యపు చిప్పకూ లిల్లీ పువ్వుకూ భేదం ఏమిటి? ముత్యపు చిప్ప తన లోపల ఉన్న ముత్యాన్ని చూచుకుని గర్విస్తున్నది.ఆ గర్వమే అది తెరుచుకోలేకపోవడానికి కారణం.ఆ గర్వమే అది సముద్రాన్ని తనలోనికి ఆహ్వానించలేకపోవడానికి గల అసలైన కారణం.దాని స్వార్ధమే దానికి ప్రతిబంధకంగా మారింది.

కానీ లిల్లీ పువ్వు అలా కాదు.దానికి దురాశ లేదు.అది నిండా విరబూసింది. దానికి గర్వం లేదు.అది అమాయకపు ఆహ్వానాన్ని అందిస్తున్నది.అది ధనవంతుల ముంగిట పూసే పువ్వు కాదు.కొండ కోనల్లో స్వచ్చమైన ప్రకృతి ఒడిలో మాయలేని నవ్వును నవ్వే పువ్వు అది.దానిలోపల గర్వం లేదు.అహం లేదు.అందుకే అది విరబూయ గలుగుతున్నది.ఎంతో దూరంలో ఆకాశంలో ఉన్న తన ప్రియుని మనసారా ఆహ్వానించ గలుగుతున్నది.ఆ కాంతిని స్వీకరించ గలుగుతున్నది.

కానీ ముత్యపు చిప్పో? తన స్వార్ధం కారణంగా,తన భయం కారణంగా తనచుట్టూ తనకు ఆధారంగా ఆవరించి ఉన్న సముద్రాన్నే తనలోకి తీసుకోలేక పోతున్నది.ఈ రెంటికీ ఎంత తేడా?

ముత్యపు చిప్పా, లిల్లీ పువ్వూ ఉపమానంతో రూమీ ఎంతో నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యాలను సూక్ష్మంగా చెప్పాడు.

ఈ రెండూ రెండు రకాలైన మనస్తత్వాలకు సూచికలు.తనతోనే ఉన్నదానిని కూడా అందుకోలేని మూర్ఖత్వం ముత్యపు చిప్పదైతే,తనవద్ద ఏమీ లేకున్నా కూడా,ముగ్ధత్వంతో అమాయకంగా వెల్లివిరిసే మనస్సుతో అన్నీ స్వంతం చేసుకునే ప్రజ్ఞ లిల్లీ పువ్వుది.

ఎంతోదూరంలో ఉన్న సూర్యకాంతి లిల్లీ పువ్వు మీద పడుతుంది.తనకు ఆనుకునే ఉన్న సముద్రపు నీరు మాత్రం ఒక్కబొట్టు కూడా ముత్యపుచిప్ప లోనికి పోలేదు.ఎంత విచిత్రం?

అలాగే, నిష్కల్మషంగా విరబూసిన అమాయకమైన హృదయమే దైవాన్ని తనలోకి స్వీకరించగలుగుతుంది.భయమూ స్వార్ధమూ అనుమానాలతో అల్లాడుతూ మూసుకుపోయిన ముత్యపు చిప్పలాంటి హృదయం దైవం అనే జీవజలాన్ని లోనికి తీసుకోలేదు.

సత్య సాధకుడు లిల్లీ పువ్వులా ఉండాలి.అంతేగాని ముత్యపు చిప్పలా ఉండకూడదు.

రాత్రిపూట నేను కిటికీని తెరచి
జాబిలిని లోనికి ఆహ్వానిస్తాను
నీ ముఖాన్ని నా ముఖంపై అద్దమని
నీ ఊపిరిని నాలో నింపమని
అడుగుతాను

నిజమైన సాధకులు రాత్రిపూటే సాధన చేస్తారు.ఒంటరిగా చీకటిలోనే వారు సాధన గావిస్తారు.జాబిలిని లోనికి ఆహ్వానించడం అంటే మన హృదయాన్ని తెరచి దైవాన్ని లోనికి రమ్మని పిలవడమే.ముఖాన్ని ముఖంపైన అద్దటం అంటే ప్రేమగా దైవం మనల్ని ముద్దు పెట్టుకోవడమే.ఊపిరిని తనలో నింపడం అంటే తన ప్రాణమయకోశంలో దైవప్రేమ యొక్క చలనాన్ని నిండుదనాన్నీ ఆవిష్కరించుకోవడమే.

మరి దైవం మనల్ని ముద్దు పెట్టుకోవాలన్నా, మనలో తాను నిండాలన్నా మనం ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? అలా ఉండటమూ, దైవం మననుంచి ఆశిస్తున్న దానిని చెయ్యడాలే 'సాధన' అంటే.అంతేగాని మనకు తోచిన ఏవేవో పిచ్చి పూజలూ పునస్కారాలూ చెయ్యడం అసలైన 'సాధన' కాదు.దైవం ఆశిస్తున్న విధంగా మనల్ని మనం దిద్దుకోవడమే అసలైన సాధన.మనం ఎలా ఉండాలని దైవం కోరుతున్నదో ఆ విధంగా బ్రతకడమే అసలైన సాధన.

భాష తలుపును మూసెయ్యి
ప్రేమ కిటికీని తెరువు
జాబిల్లి తలుపు గుండా రాదు
కిటికీలోనుంచే వస్తుంది

నీవు మాటలతో కాలం గడుపుతూ,ఊరకే వాగుతూ ఉన్నంతవరకూ నీలో ప్రేమ చంద్రోదయం కాదు.నీ మాటలను ఆపాలి.నీ హృదయాన్ని తెరవాలి.అప్పుడు మాత్రమే వెన్నెల ఆ హృదయపు కిటికీ గుండా నీలోకి వస్తుంది.

జీవితమంతా నీవు భయపడుతూ కూచుంటే ఇదెలా సంభవం అవుతుంది? భయాన్ని జయించలేని నీలాంటి పిరికివాడికి నీకెందుకు అసలు దైవచింతన? కిటికీలు తెరచి ప్రియుడిని లోనికి ఆహ్వానించడానికి భయపడే నీకు ప్రేమరత్నాన్ని పొందడానికి అర్హత ఉన్నదా? నువ్వే ఆలోచించుకో.

గ్రంధాలు చదువుతూ,వాటిని వ్యాఖ్యానించుకుంటూ, ఉపన్యాసాలు వింటూ అదే నిజమైన సాధనామార్గమనీ, నిజమైన ఆధ్యాత్మికత అనీ భ్రమిస్తూ ఉన్నంతసేపూ నువ్వు తప్పుదారిలో ప్రయాణిస్తున్నట్లే లెక్క.నీ హృదయాన్ని తెరిపించలేని ఇలాంటి ప్రయాసలన్నీ వృధా ప్రయాసలే. 

ఇంకొక మార్మిక కవితలో రూమీ ఇలా అంటాడు

ఆత్మ నీ పెదవులలోకి
ఎగసినప్పుడు మాత్రమే
నువ్వు కోరుతున్న ముద్దును
నీవు పొందగలవు

పుట్టినప్పటి నుంచే పోయేవరకూ మనిషి దేహం మొత్తం ఏదో తెలియని ఒక స్పర్శను కోరుతూ ఉంటుంది.అదేమిటో తెలియక మనిషి ఇంకొక మనిషి స్పర్శను ఆశిస్తాడు.అది అసలైన పరిష్కారం కాదు.అలాంటి నాసిరకం స్పర్శలతో ఈ దాహం తీరదు.దైవం తన శక్తితో తన ఆనందపు వెల్లువతో నీలోకి దూకినప్పుడు మాత్రమే, నిన్ను తన దివ్యస్పర్శతో లోపలా బయటా తడిపేసినప్పుడు మాత్రమే నీ జన్మజన్మల దాహం తీరుతుంది.

ఆ స్థితిని నీవు పొందాలంటే నీకు అమితమైన ధైర్యం ఉండాలి.అమితమైన త్యాగం ఉండాలి.అమితమైన ప్రేమ ఉండాలి.అమితమైన సాహసం ఉండాలి.లోకులు ఏమనుకుంటారో అని సంకోచిస్తూ కూచుంటే నీ ప్రయాణం ఎప్పుడు మొదలౌతుంది? లోకుల మెప్పుకోసం అనుక్షణమూ దైవాన్ని చులకన చేసే నీకు దైవప్రేమను పొందే అర్హత ఎప్పటికి వస్తుంది? ఈ విధంగా మానసిక భ్రమల్లో కల్లోలాలలో పడి అఘోరిస్తుంటే, దైవచుంబనాన్ని ఎప్పటికి నీవు పొందగలుగుతావు?

ఇంకొక కవితలో రూమీ ఇలా అంటాడు

మొదటిసారి ప్రేమకథను నేను విన్నప్పుడు
నీకోసం వెదకడం మొదలు పెట్టాను
ఎంత పిచ్చివాణ్ణి?
ప్రేమికులు విడిగా ఉండి ఏదో ఒక రోజున
ఎక్కడో ఒకచోట కలుసుకుంటారా?
అలా ఎన్నటికీ కాదు
వారిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు
ఎంత దూరంగా ఉన్నా సరే...

నిజమైన ప్రేమకు దూరం అడ్డంకి కాదు.ప్రేమికులు ఎంతెంత దూరాలలో ఉన్నా ఆ ప్రేమబలం వారిద్దరినీ ఒక్కటిగా పట్టి ఉంచుతుంది.అలాగే, నిజమైన ప్రేమికునికి దైవమూ దూరంగా ఉండలేదు.అతని హృదయంలో దైవం ఎప్పుడూ అమితమైన కాంతితో వెలుగుతూనే ఉంటుంది.

నిజమైన సాధనామార్గం ప్రేమమార్గమే.దీనిలో పూజలుండవు. తంతులుండవు.డబ్బుతో పని ఉండదు.పటాటోపం అక్కర్లేదు. నువ్వేం చేస్తున్నావో ఎవరికీ తెలియనక్కరలేదు.ఆ లోకంలో ఇద్దరే ఉంటారు.నీవూ నీ ప్రియుడూ.అక్కడ అంతా ఆనందం తప్ప ఇంకేమీ ఉండదు.అంతే !!

ఇంకొక కవిత

ప్రేమ అంతం లేని సీమ నుండి వచ్చి
అంతం లేకుండా ఎల్లకాలం అలాగే ఉంటుంది
ఒక్క ప్రేమ పిపాసి మాత్రమే
చావు పుట్టుకల శృంఖలాలనుంచి
విడుదల అవుతాడు
దైవం ఎదుట మనం నిల్చున్నప్ప్పుడు
ప్రేమ అంటే తెలియని హృదయం మాత్రమే
ఆ అంతిమ పరీక్షలో ఓడిపోతుంది

ఒక్క క్షణం ఉండి ఇంకో క్షణంలో అంతరించేది కామమైతే కావచ్చేమోగాని ప్రేమ మాత్రం కాలేదు.ప్రేమ ఎన్నటికీ ఆరిపోకుండా వెలిగే దీపం లాంటిది.దానికి చావూ ఉండదు.అది కొడిగట్టే దీపమూ కాదు.నిజానికి ప్రేమ ఒక్కటే చావునూ పుట్టుకనూ జయించగలుగుతుంది.అది కాలాన్ని అధిగమించి ఎప్పటికీ వెలుగుతూ ఉంటుంది.కర్మబంధాలకు అతీతంగా వెళ్ళగలిగే శక్తి ఒక్క ప్రేమకే ఉంటుంది.

ఈ జన్మ అయిపోయిన తర్వాత మనం దైవం ఎదుట నిలబడాలి.ఈ జన్మలో మనం చేసిన తప్పొప్పుల బేరీజులో మనం నెగ్గాలి.మన జీవితం ప్రేమమయంగా గడిస్తేనే దైవం ఎదురుగా జరిగే ఆ పరీక్షలో మనం నెగ్గుతాం.లేకుంటే ఓడిపోతాం,దైవం ఎదురుగా మన ధనమూ, మన బలమూ,మన పలుకుబడీ,మన అహంకారమూ,మన అతీ ఇవేవీ ఎందుకూ పనిచెయ్యవు.ప్రేమ అనేది నీ హృదయంలో ఉంటే, అదొక్కటే నిన్నా పరీక్షలో గెలిపిస్తుంది.అది లేకుంటే,దైవసమక్షంలో జరిగే పరీక్షలో నీవు ఓడిపోక తప్పదు.

ప్రేమతో వెలగని చీకటి హృదయంలో దైవసాక్షాత్కారం ఎన్నటికీ కాదు.

ఇంకొక కవిత

నేను నీతో ఉన్నప్పుడూ మనకు జాగారమే
నువ్వు నాతో లేనప్పుడూ నాకు జాగారమే
ఈ రెండు జాగారాలను ఇచ్చినందుకు
దైవానికి నా కృతజ్ఞతలు !!

ఈ కవితలో ఎంత అద్భుతమైన భావాన్ని చెప్పాడు రూమీ? సామాన్య ప్రేమికుల మధ్యన కూడా ఇది జరుగుతుంది.ఇద్దరూ దూరంగా ఉన్నప్పుడు విరహవేదనతో నిద్ర పట్టదు. ఇద్దరూ కలసినప్పుడు ఆనందపు పరవశంలో నిద్ర ఉండదు.కనుక వీరికి ఎప్పుడూ జాగారమే. ప్రేమ అనే పిశాచం పట్టినవాడికి ఇక నిద్ర పట్టదు.

సాధకుడు దైవప్రేమతో రగిలిపోతున్నపుడు అతనికి నిద్ర కరువౌతుంది.శ్రీరామకృష్ణులు సాధనదశలో ఉన్నపుడు పన్నెండేళ్ళపాటు ఆయనసలు నిద్రే పోలేదని అంటారు.ఇక దైవం తన హృదయంలోకి ప్రవేశించినప్పుడో,ఆ ఆనంద సంరంభంలో అసలు నిద్రే ఉండదు.కనుక నిజమైన ప్రేమికుని జీవితమంతా నిత్యజాగారమే.ఈ జాగారం ఆనందదాయకమే.

ప్రేయసి నీతో మాట్లాడినా మాట్లాడకున్నా,నీ దగ్గరకు వచ్చినా రాకున్నా రెండూ ఆనందమే.నిజానికి నీ ప్రేయసితో నీకు సంబంధం లేదు.నీ ప్రేమే నీ నిజమైన ప్రేయసి.అదే నీ నిజమైన ప్రియుడు. అది ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. ఇక నీకు చింత ఎక్కడిది?

ఇంకొక కవిత

మధువుతో మత్తిల్లిన నా ప్రేయసి
ఉన్నట్టుండి తలుపు తెరచుకొని లోనికి వచ్చింది
ఎర్రని ద్రాక్ష సారాయిని త్రాగి నా పక్కనే కూచుంది
ఆమె ముంగురులను చూస్తూ వాటిని స్పర్శిస్తూ ఉంటే
నా ముఖమంతా కన్నులయ్యాయి
నా కన్నులన్నీ చేతులయ్యాయి

ప్రేమతో మత్తెక్కిన నీవు నీ ప్రేయసి కోసం ఎంతో ఎదురు చూచావు.అలా ఎంతోకాలం ఎదురుచూచిన తర్వాత తను హటాత్తుగా నీ ఎదుట ప్రత్యక్షమైంది.దైవం ఎప్పుడూ హటాత్తుగానే ప్రత్యక్షమౌతుంది.ముందుగా చెప్పి రాదు.ద్రాక్ష సారాయిని త్రాగిన మత్తులో తనూ ఒళ్ళు తెలియని స్థితిలో ఉంది.ఆమె ముద్దుమోమును చూస్తూ ఆ ముంగురులను సవరిస్తూ ఉంటే,నా దేహం మొత్తం నా చేతులలోకి ప్రవహించింది.నా ఆత్మ తన ఆత్మతో ఒక్కటై పోయింది. అప్పుడేం జరిగిందో నాకేమీ గుర్తు లేదు.గుర్తు ఉండటానికి మేం విడివిడిగా ఉంటే కదా?

ఇంకొక కవిత

నేనెన్నో గ్రంధాలను ఆమూలాగ్రం చదివాను
కానీ ప్రేమ గురించి చెప్పమంటే చెప్పలేను
ప్రేమేమిటో నీకు తెలియాలంటే
నువ్వు నాతో కలసి జీవించాలి
అప్పుడు మాత్రమే అదేమిటో నీకర్ధమౌతుంది
అప్పుడు మాత్రమే....

ప్రేమ అనేది గ్రంధ పాండిత్యంతో వచ్చేది కాదు.అది మాటలలో వివరించబడేదీ కాదు.అందుకే పండితుల ఉపన్యాసాలు వింటుంటే నాకు నవ్వొస్తుంది.వాళ్ళేం వాగుతున్నారో వారికే తెలియదు.ప్రేమ అనేది పాండిత్యంలో లేదు.అది హృదయపు బేరంలో లభిస్తుంది.నీ హృదయాన్నీ నీ ఆత్మనూ నువ్వు పణంగా పెట్టగలవా? అలా చెయ్యగలిగితేనే అది లభిస్తుంది. లేకుంటే నీకది దక్కదు.అది చెయ్యకుండా ఇంకెన్ని చేసినా నీ జీవితం వృధా అవుతుంది తప్ప దైవం నీ దగ్గరకు రాదు.

ప్రేమను గురించి వివరించి చెప్పమంటావా?నీకసలు మతి ఉందా?దానిని అలా చెప్పగలమా?మాటలకు అందే అనుభూతా అది?నువ్వు నాతో కలసి ఉంటేనే అదేంటో నీకు తెలుస్తుంది. నువ్వు నాతో కలసి సహజీవనం చెయ్యాలి.అప్పుడు కూడా నీ నోటిని మూసి నీ హృదయాన్ని తెరచి ఉంచాలి.మౌనంగా నేను చెప్పే ఊసుల్ని నీవు వినగలగాలి.నీ ఆత్మతో నా ఆత్మను నీవు ముద్దు పెట్టుకోవాలి.ఆ సామర్ధ్యం నీకుందా?అప్పుడే ప్రేమంటే ఏమిటో నీకు అనుభవంలోకి వస్తుంది.అంతవరకూ కుదరదు.

ఇంకొక కవిత

ప్రేయసి ఇచ్చే అమృతం రుచిచూస్తే
ఏ రోగమూ ఉండదు
ప్రేయసితో నీవు కలిసే గులాబీ తోటలో
ఏ ముళ్ళూ ఉండవు
ఒక హృదయం నుంచి ఇంకొక హృదయానికి
కిటికీలు తెరచి ఉంటాయని అంటారు
మధ్యలో గోడలే లేకపోతే ఇంక కిటికీలు ఎక్కడ ఉంటాయి?

ఇంకొక అద్భుతమైన భావాన్ని రూమీ ఇక్కడ ఆవిష్కరిస్తాడు. దైవం నీకిచ్చే ప్రేమామృతాన్ని రుచి చూస్తే, నీకు ఇక ఏ రోగమూ రాదు.అంటే - నీ మనస్సు ఇంద్రియాల ఆకర్షణలకు ఏమాత్రం చలించదు.మీరిద్దరూ కలిసే గులాబీ తోటలోని గులాబీలకు ముళ్ళు ఉండవు.అంటే - మీ సంబంధం ఎప్పుడూ అత్యంత ప్రేమతో మనోహరంగానే ఉంటుంది గాని దానిలో విషాదానికి తావు ఉండదు.మీ సమాగమం జరిగే అంతరిక స్థాయిలో దుఖపు ఛాయే ఉండదు.అక్కడంతా ఆనందమే. 

సామాన్యంగా లోకంలో ఒక నానుడి ఉన్నది.ప్రేమికుల హృదయాలలో ఒకరి నుంచి ఇంకొకరికి తెరచి ఉన్న కిటికీల ద్వారా ప్రేమ స్పందనలు సరఫరా అవుతూ ఉంటాయని లోకం అనుకుంటుంది.కానీ మా మధ్యన అసలు గోడలే లేకపోతే ఇంక వాటిలో కిటికీలు ఎక్కడనుంచి వస్తాయి? మా ఇద్దరి మధ్యనా ఏ భేదమూ లేదు.నేనే తాను.తానే నేను అయినప్పుడు ఇంక గోడలేమిటి? కిటికీ లేమిటి? అవెక్కడున్నాయి?

ఇంకొక కవిత

నీ ప్రేయసి హృదయం లేనిదే కావచ్చు
మూర్ఖురాలే కావచ్చు
నిన్ను మరచిపోవచ్చు
అలాగే కానీ...
(తన ప్రేమలో మైమరచి)
అసలు నీకు స్పృహ ఉంటే కదా
ఇవన్నీ తెలియడానికి?

ప్రేమనేది ఒకవైపు నుంచి ఉన్నప్పుడు ఇంకొక వైపునుంచి స్పందన లేనప్పుడు కూడా నీవు బాధపడకు.నీ ప్రేమే నీకు చాలు. ప్రేయసి నిన్ను పట్టించుకుంటే ఎంత? పట్టించుకోకపోతే ఎంత? అసలు వాటిని గుర్తించేటంత స్పృహ నీకుంటే కదా? నీ ప్రేమ మత్తులో నువ్వు మునిగి స్పృహలేకుండా పడి ఉండు. అది చాలదా నీకు? నీ ప్రేయసి హృదయం లేని మూర్ఖురాలైతే నీకెందుకు? అది దాని ఖర్మ. నీ ప్రేమలో నువ్వు ఆనందంగా ఉండు.

దైవం నీకు ప్రసన్నం అయితే కానీ, కాకపోతే కాకపోనీ.నీ ప్రేమ నీకు చాలు. ఆ ప్రేమ మైకంలో నువ్వు ఆనందంగా ఉండు. ఇంకేం కావాలి? తన ఇష్టం వచ్చినపుడు దైవం నీ దగ్గరకు వస్తుందిలే.తనకు నువ్వు ఒక్కడివే కాదుగా? నీలాంటి వాళ్ళు ఇంకా ఎందరున్నారో? వాళ్ళను కూడా తను చూడాలిగా? వాళ్ళను కూడా తన ప్రేమతో ఓదార్చాలిగా? నీ వంతు రావడానికి ఇంకా సమయం పట్టేటట్లు ఉంది.పరవాలేదు.నువ్వు బాధపడకు.నీ ప్రేమ మత్తులో సొక్కిపోయి పడి ఉండు.

ఇంకొక కవిత

నీ హృదయంనుంచి నీ స్వల్పమైన అహం
మాయమైనప్పుడు
చావులేని నీ ప్రియుని నీవు చూస్తావు
అద్దం లేకుండా నిన్ను నీవు చూచుకోలేవు
నీ ప్రియుని వైపు చూడు
అతడే స్వచ్చమైన అద్దం

నీ ప్రియుడిని నీవెందుకు కలుసుకోలేక పోతున్నావు?దానికి ఒకటే కారణం ఉంది.నీలో అహం బాగా గట్టిగా ఉన్నది.అందుకే అతని దర్శనం నీకు కావడం లేదు.ఆ నీచమైన అహాన్ని నీలోనుంచి నిర్మూలించు.ఆ క్షణంలో మాత్రమే నిత్యుడైన నీ ప్రియుడు నీ ఎదురుగా ప్రత్యక్షమౌతాడు.

నీ స్వరూపం ఎలా ఉందో చూచుకోవాలని ఉందా నీకు? నీ దేహాన్ని చూచుకోవాలంటే ఒక అద్దం సరిపోతుంది.నీ ఆత్మను నువ్వు దర్శించాలంటే మాత్రం నీకు తెలిసిన ఏ అద్దమూ సరిపోదు.నీ ప్రియుని కళ్ళలోకి తొంగి చూడు.లోకపు మాయలు ఏమాత్రం లేని స్వచ్చమైన అద్దాలు ఆ కళ్ళు.మిలమిలా మెరిసే ఆ కళ్ళలో నిన్ను నువ్వు చూచుకో. అప్పుడే అసలైన 'నువ్వు' ఎవరో నీకు తెలుస్తుంది.

ఇంకొక కవిత

నీవు నీ ప్రియునితో ఏకమై
మీ ఇద్దరి ఊపిరులు ఒక్కటైనప్పుడు
ఆ క్షణంలో మాత్రమే
నీ గమ్యం నీకు అందుతుంది
ఆ క్షణాన్ని చేజార్చుకోకు
అది మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు

నువ్వు నీ పరిమితమైన అహాన్నీ, నీ స్వల్పవ్యక్తిత్వాన్నీ పూర్తిగా ఆహుతి చేసి,నిన్ను నువ్వు పూర్తిగా మరచిపోయి, నీ ప్రియునితో ఒక్కటిగా మారినప్పుడు మాత్రమే,అతనిలో పూర్తిగా కరగి పోయినప్పుడు మాత్రమే,నువ్వు జీవితమంతా వెదుకుతున్న దేదో నీకప్పుడు అందుతుంది.

ఈ క్షణం కోసమేగా నీవు తెలిసో తెలియకో ఈ లోకంలో పరుగులు పెడుతున్నావు? అదే నీకెదురైనప్పుడు దానిని పొరపాటున కూడా చేజార్చుకోకు.ఒకసారి పోగొట్టుకున్నావా మళ్ళీ అది ఎప్పుడు నీకోసం వస్తుందో చెప్పలేవు,ఈ జన్మలో ఆ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు కూడా.తెలివితక్కువగా ఈ అవకాశాన్ని ఏమాత్రమూ వదలుకోకు.

-------------------------

సూఫీ సిద్ధులు ప్రేమవాదులు.దైవాన్ని వారు 'ప్రియుడు' అని సంబోధిస్తారు. తమను తాము ప్రేయసిగా భావించుకుంటారు. వారిది మధురభావం.

దైవాన్ని చేరుకునే మార్గాలలో మధురభావం అంతటి మధురమైనది లేనేలేదు.మిగతా మార్గాలలో నీవు దైవం చెంతకు చేరవచ్చు.ఆయన్ను దర్శించవచ్చు.కానీ ఆయనలో కలసిపోలేవు.కరగిపోలేవు.ఒక్క మధురభావమే, ఒక్క ప్రేమమార్గం మాత్రమే ఆపనిని చెయ్యగలుగుతుంది.దైవప్రేమ అనేది మన హృదయంలో అమితంగా ఎక్కువై పోయినప్పుడు అది మధురభావంగా మారుతుంది.

ఈ ప్రేమ అనేది తన తీవ్రతలో, నిజమైన ప్రేయసి ప్రియుల మధ్యన ఉన్న ప్రేమకు కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రేమ ప్రభావంతో సాధకుని ఆత్మ, దైవంలో సునాయాసంగా కరగిపోతుంది.దైవంతో ఒక్కటై పోతుంది.

అటువంటి హృదయం ఈ లోకపు అన్ని బంధాలనూ దాటి పోతుంది.మానవ లోకపు నీచత్వాలను చూచి అది పగలబడి నవ్వుతుంది.దానిని ఏ బంధాలూ పట్టి బంధించలేవు.అది పొందే ఆనందాన్ని లోకులు ఎన్నటికీ అర్ధం చేసుకోలేరు.ఏదో తెలియని అతీతమైన మత్తులో అది ఎప్పుడూ మునిగి ఉంటుంది.

ఏ మతంలోనైనా సరే - ప్రేమమార్గాన్ని మించిన మార్గం లేనేలేదు.

జలాలుద్దీన్ రూమీ వ్రాసిన ఈ ముద్దు కవితలలో ఆయన చెబుతున్నది మనుష్య ప్రేమికుల మధ్యన జరిగే మామూలు ముద్దు గురించి కాదు.సాధకుని ఆత్మను దైవం స్వయానా స్పర్శించడమే ఆ ముద్దు. దాని గురించే మార్మికులందరూ కవితలుగా వ్రాశారు.

ముద్దు గురించి ఇంత సోది ఎందుకు వ్రాయవలసి వచ్చింది?

లోకం దృష్టిలో అడుక్కునే పిచ్చిదానిలా కనిపించే బాబాజాన్ తన ఒక్క ముద్దు ద్వారా మేర్వాన్ ను తనలాగే పిచ్చివాడిని చేసింది.అగాధమైన భగవత్ ప్రేమ జలాల లోతుల్లోకి అతణ్ణి త్రోసేసింది.మహనీయులైనవారి స్పర్శకు ఎంతటి ప్రభావం ఉంటుందో చెప్పడానికే ఈ పోస్ట్ వ్రాశాను. 

అద్భుతమైన బాబాజాన్ జీవితాన్ని తర్వాతి పోస్ట్ లో చదువుదాం.ఆమె ఇచ్చిన ఒక్క ముద్దు, మేర్వాన్ జీవితాన్ని ఎలా మార్చి పారేసిందో ముందుముందు చూద్దాం.

(ఇంకా ఉంది)