“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, ఫిబ్రవరి 2016, ఆదివారం

అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 5 (హజ్రత్ బాబాజాన్ అద్భుత జీవితం)

లోకానికి నిజమైన మేలును చేసినవారు ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఆ పనిని చేస్తారు. లోకం మెప్పును వారు ఏమాత్రమూ కోరరు.నిజమైన మహనీయులు కూడా నిశ్శబ్దంగానే ఉంటారు.అలా ఉండబట్టే వారు మహనీయులౌతారు. వారు చేసిన ప్రతి చిన్నపనికీ శిలాఫలకాలు ఏమాత్రం ఉండవు.అలా శిలాఫలకాలు వేయించుకోవడం అల్పులైన మనుషులు చేసే పని.ఉన్నతులైన దైవాత్ములు చేసే పని కాదు.వారికి మనం వేసే శిలాఫలకాలు అక్కర్లేదు.వారి మన: ఫలకాలలో దైవం ఎప్పుడూ నెలకొనే ఉంటాడు.దానిని మించినది ఇంకేం ఉంది ఈ లోకంలో?

కానీ వారి జీవితాలను వ్రాయడం చాలా కష్టం.ఎందుకంటే మిగతా జీవితాలలో లాగా వారి జీవితాలలో బయటకు కన్పించే గొప్ప గొప్ప సంఘటనలు ఏవీ ఉండవు.పటాటోపంతో కూడిన విషయాలు ఉండవు.లౌకికమైన విజయాలు వారి జీవితాలలో ఉండవు.వారి విజయాలన్నీ అంతరికాలే.వారి ప్రయాణం అంతా బయటకు కన్పించని లోలోపలి దారుల్లో సాగుతుంది.ఆ ప్రయాణపు గమ్యాలూ,వాటి ఫలితాలూ ఏవీ కూడా మనకు కనిపించవు. వారు దేనికోసం తపించారో,ఏమి సాధించారో బయటకు తెలియనివ్వరు. ప్రచారం చేసుకోరు.అలా వారి స్థితిని గురించి అందరికీ చెప్పుకోవడాన్ని వారు హర్షించరు.తాము సాధించినదానిని తమకు నచ్చిన ఒకరికో ఇద్దరికో ఇచ్చి మౌనంగా ఈలోకం నుంచి వారు వెళ్ళిపోతారు.అసలు చాలాసార్లు వారు ఎక్కడ పుట్టారో ఎక్కడ పోయారో కూడా తెలీని పరిస్థితి ఉంటుంది.అందుకే వారి జీవితాలను వ్రాయడం చాలా కష్టమైన పని.

బాబా జాన్ జీవితాన్ని గురించి వ్రాసేటప్పుడు ఒకరు నన్నిలా ప్రశ్నించారు.

'ఇప్పటికే ఎందఱో ఆమెను గురించి వ్రాసి ఉన్నారు.అలా వ్రాసిన వారిలో ప్రసిద్దులూ ఉన్నారు.మళ్ళీ మీరెందుకు వ్రాయడం?'

దానికి ఇలా చెప్పాను.

'బాబాజాన్ గురించి వ్రాయకుండా మెహర్ బాబాను గురించి వ్రాయలేము.ఆయనకు మొదటిసారి దైవానుభూతిని కలిగించిన మహనీయురాలు ఆమే.కనుక ఆమెను గురించి విధిగా వ్రాయాలి. పైగా, ఇతరులు వ్రాసిన విధంగా నా వ్రాతలు ఉండవు. నాదైన విభిన్న విధానంలో నేను వ్రాస్తాను.సోకాల్డ్ సోదిభక్తులూ సోది మహనీయులూ వ్రాసే జీవితాలన్నీ అతిశయోక్తులతో అనవసర మహిమలతో నిండిపోయి చాలా చవకబారుగా ఉంటాయి.వాటిలో నిజమైన విషయం ఉండదు.కనుక వారి వ్రాతలకంటే నావే నిజాయితీతో,అసలైన విశ్లేషణతో కూడి ఉంటాయి.'

బాబాజాన్ పూనాలో చనిపోయినప్పుడు ఆమెకు 125 ఏళ్ళని చాలామంది పరిశోధకులు అన్నారు. ఇంకొందరేమో అప్పటికి ఆమెకు 150 ఏళ్ళున్నాయని అన్నారు.1790 నుంచి 1800 మధ్యలో ఆమె పుట్టిందని కొందరు పరిశోధకులు భావించారు.తక్కువలో తక్కువగా 125 ను తీసుకున్నప్పటికీ, ఆమె తన చివరి 25 ఏళ్ళు పూనాలో ఉన్నది గనుక,పూనాకు వచ్చేసరికి ఆమెకు 100 సంవత్సరాలని అనుకోవచ్చు.ఆమె 21-9-1931 న పూనాలో చనిపోయింది. కనుక ఆమె పుట్టినది 1806 అని మనం ఉజ్జాయింపుగా అనుకోవచ్చు.

నా విధానంలో జననమాస సంస్కరణ చెయ్యగా 1806 లో ఉన్న పన్నెండు నెలలలోనూ సెప్టెంబర్  15 న ఆమె పుట్టినట్లుగా తెలుస్తున్నది. ఈ సంస్కరణ ఎలా చేశాను అన్న జ్యోతిష్య వివరణ అంతా ఇక్కడ ఇవ్వదలుచుకోలేదు. అప్పటి కుండలిని మాత్రం ఇక్కడ ఇస్తున్నాను. రాహుకేతువులు రాశిచక్రంలో నీచస్థితిలో ఉండటం చూడవచ్చు.గురు రాహువులు కలసి చండాలయోగంలో ఉండటం చూడవచ్చు.కనుక తన దేశాన్నీ తన మతాన్నీ వదలి పరాయిదేశంలో పరాయిమతంతో సంబంధం ఉన్న ప్రదేశంలో స్థిరపడి తనువు చాలించింది.ఈ జాతకంలో శనీశ్వరుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. అందుకే మళ్ళీ అదే యోగం ఉన్న మెహర్ బాబాకు ఆమె దైవానుభూతిని కలిగించింది.ఆ రోజున స్వాతీ నక్షత్రం నడుస్తున్నది.మెహర్ బాబాది కూడా స్వాతీ నక్షత్రమే.అంతేగాక మెహర్ బాబా జాతకంలో లాగే ఈమె జాతకంలో కూడా శనిచంద్రుల సంయోగం ఉండటాన్ని చూడవచ్చు.ఇది లోతైన ఆధ్యాత్మికస్థితికి సూచిక.గురుశిష్యుల మధ్యన ఇలాంటి నిగూఢమైన జాతకాంశాలు కలగలసి ఉంటాయి.గురుశిష్యుల మధ్యనే కాదు,భార్యా భర్తల మధ్యనా, స్నేహితుల మధ్యనా కూడా జాతక పరమైన కామన్ యోగాలూ అంశాలూ కలగలసి ఉంటాయి.లేకుంటే వారి మధ్య ఆయా బంధాలు ఏర్పడవు.

ఈమె జాతకంలో ఉన్న మరొక్క విశేషం కాలసర్పయోగం. కాలసర్పయోగ జాతకులలో లౌకికంగా అభివృద్ధి అనేది ఉండదు.ఒకవేళ ఉన్నా చాలా లేటుగా 40 ఏళ్ళు దాటిన తదుపరి మాత్రమే వస్తుంది అన్న విషయం ఈమె జాతకంలో కూడా నిజం అయింది.అది ఎలా జరిగిందో ముందుముందు చూద్దాం.

మొత్తమ్మీద ఆమె జాతకంలో, లోకం అనుకుని భయపడే చెడుయోగాలు చాలా ఉన్నాయి.ఆమెకు గురుచండాలయోగం ఉన్నది.కాలసర్పయోగం ఉన్నది.తీవ్రమైన కుజదోషం ఉన్నది.రాహుకేతువుల నీచస్థితి ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి గనుకనే ఆమె భౌతికజీవితం అలా దిక్కులేకుండా,పెళ్ళీ పిల్లలూ లేకుండా,ఆస్తిపాస్తులు లేకుండా,ఒక బిచ్చగత్తె జీవితం అయిపోయింది.పుట్టడం చాలా ధనవంతులైన రాజకుటుంబం లో పుట్టినా జీవితమంతా సంచారం గావిస్తూ చెట్లక్రింద బ్రతికింది.కానీ ఆమె ఆత్మిక జీవితం మాత్రం అత్యున్నతమైన స్థాయిలో వెలిగింది.ప్రపంచంలోని ఏ ధనికుడూ అందుకోలేని అద్భుతమైన దైవికస్థితులను ఆమె అందుకోగలిగింది.

తల్లిదండ్రులు ఈమెకు పెట్టిన పేరు 'గుల్ రుఖ్'.అంటే గులాబీ వంటి ముద్దు మోము కలిగినది అని అర్ధం.ఆమె ఆఫ్ఘనిస్తాన్ లోని బలూచీ లో పఠాన్ తెగకు చెందిన ఒక రాజకుటుంబంలో జన్మించింది.పేరుకు తగినట్లే ఆమె చాలా అందంగా ఉండేది.

శనిచంద్ర సంయోగం సూచించినట్లు ఈమె అతి చిన్నవయసు నుంచే ఆధ్యాత్మిక సంస్కారాలను కలిగి ఉన్నది. చిన్న వయసులోనే ఖురాన్ మొత్తాన్నీ ఈమె కంఠస్థం పట్టింది.అరబిక్, పర్షియన్,పుష్టూ,ఉర్దూ భాషలను నేర్చుకుంది.రోజు విధిగా నమాజ్ చేసేది.దైవధ్యానంలో ఎక్కువకాలం గడుపుతూ ఉండేది.దైవం గురించిన అనుభవాలను సరాసరి పొందాలని తపిస్తూ ఉండేది.తన వయస్సు వారికంటే భిన్నంగా ఈమె ప్రవర్తన ఉండేది.


ఇస్లాం లో 'ఫకీరీ' అని ఒక సాంప్రదాయం ఉన్నది.ఇది మన 'బైరాగి' సాంప్రదాయం వంటిది.బైరాగీ అంటే నిజానికి 'వైరాగి' (వైరాగ్యంతో నిండినవాడు) అని అర్ధం.ఆ మార్గంలో అడుగు పెట్టినవారు పెళ్లి చేసుకోకుండా సంచార సాధువులుగా ఉంటూ, పేదరికాన్ని ఆశ్రయించి,ఇల్లూ వాకిలీ లేకుండా, ఎక్కడపడితే అక్కడ ఉంటూ,ఏది దొరికితే అది తింటూ,ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ,అన్నిటికీ పూర్తిగా దైవం మీద ఆధారపడి ధ్యానంలో కాలం గడపాలి.ఆ సాంప్రదాయం ప్రకారం ఒక సాధువుగా ఉండిపోదామనీ పెళ్ళిచేసుకోకూడదనీ ఆమె నిశ్చయించుకుంది.


ఆ రోజుల్లో పఠాన్ తెగకు చెందిన ఒక అమ్మాయి అవివాహితగా ఉండిపోవడం అంటే అది తల్లిదండ్రులకు చాలా అవమానకరమైన విషయం.ఆమెలో ఏదో లోపం ఉన్నదనీ లేకుంటే ఆమె కేరెక్టర్ మంచిది కాదనీ సంఘంలో పుకార్లు వస్తాయి.వారి కుటుంబానికి అది జీర్ణించుకోలేని విషయం అవుతుంది.అందుకని ఆమె ఇష్టాఇష్టాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసెయ్యాలని తల్లిదండ్రులు నిశ్చయించి ఒక సంబంధాన్ని ఖాయం చేశారు.అప్పుడు ఆమెకు 18 ఏళ్ళు.


ఇంట్లో ఉంటే తనకు పెళ్లి తప్పదు. పెళ్లి చేసుకుంటే తన జీవిత గమ్యమైన దైవసాక్షాత్కారాన్ని తాను పొందటం అసంభవం.ఏది ముఖ్యం? పెళ్ళా? దైవమా? తల్లిదండ్రుల తెలివిలేని నిర్ణయమా లేక తన మనస్సు చెబుతున్న మార్గమా? గుల్ రుఖ్ చాలా మధనపడింది.


చివరకు తన మనస్సే నెగ్గింది.చెప్పా పెట్టకుండా ఒకరోజు రాత్రి ఇంటిలోనుంచి పారిపోయి వెళ్ళిపోయింది.దేవుడు తప్ప ఇంకే దిక్కూ లేనిదానిగా క్రూరమైన ఈ విశాలప్రపంచం లోకి ఒంటరిగా అడుగుపెట్టింది.

ఏమిటా ధైర్యం? 200 సంవత్సరాల క్రితం, అప్పటి ఆచారాలూ కట్టుబాట్లను ధిక్కరిస్తూ,అప్పటివరకూ బయటి లోకాన్ని చూడని 18ఏళ్ళ అందమైన యువతి,చేతిలో పైసా లేకుండా,జీవితాంతం ఎలా బ్రతకాలో అన్న ధ్యాసే లేకుండా, కట్టుబట్టలతో గడప దాటి,నక్కలూ తోడేళ్ళతో నిండిన సమాజంలోకి అడుగు వేసింది.ఈనాటికీ చాలామంది మగవాళ్ళే అలాంటి సాహసం చెయ్యలేరు.


అలా బయటకు అడుగుపెట్టిన మరుక్షణంలోనే భగవంతుని హృదయంలో ఆమె తన స్థానాన్ని పదిలం చేసుకుని ఉంటుంది.తనకోసం అంత తపన పడి అంత త్యాగాన్ని చేసిన వారిని దైవం ఆదరించకుండా ఉంటుందా?అలా ఉండటానికి దైవమంటే మనసు లేని రాతి విగ్రహం కాదుగా?

అలాంటి ఉన్నతమైన త్యాగాలు లేకుండా దైవసన్నిధికి ఎవరు మాత్రం చేరగలుగుతారు?ఇంట్లో కూచుని దొంగపూజలు చేసుకుంటూ మోసపూరిత జీవితాలు గడుపుతూ ఉంటే,దైవం ఎప్పటికి కరుణించేను?


ఈనాటికీ ఒక ఆడపిల్ల ఒంటరిగా ఒక ప్రయాణం చెయ్యాలంటే తొంభై ఆరు జాగ్రత్తలు తీసుకుని ఎంతో ఆలోచించవలసిన పరిస్థితులున్నాయి.ఇక 200 సంవత్సరాల క్రితం అలా బ్రతకడానికి సిద్ధపడాలంటే ఎంత మానసికమైన ధైర్యమూ తెగింపూ తన లక్ష్యం మీద ఎంత ప్రేమా ఉండాలో ఆలోచిస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది.

ఇక అప్పటినుంచి ఆమెయొక్క సాహసోపేతమైన జీవితం మొదలైంది.

తన జన్మస్థలాన్ని వదలిపెట్టిన ఆమె పెషావర్ మీదుగా రావల్పిండి చేరుకుంది.అప్పట్లో అవన్నీ భారతదేశంలో భాగాలే. రావల్పిండిలో ఆమె ఎవరికీ తెలీకుండా అజ్ఞాతంగా కొన్నేళ్ళ పాటు జీవించింది.కాముకుల నుంచీ దుండగుల నుంచీ తప్పించుకోడానికి మగవేషంలో ఆమె తిరుగుతూ ఉండేది.

ఏం తిన్నదో ఏం కట్టుకుందో ఎన్నాళ్ళు పస్తులున్నదో, అసలు ఎక్కడున్నదో, లోకుల వెకిలి మాటలనూ వెకిలి చేష్టలనూ ఎలా సహించిందో, అనారోగ్యాలు వస్తే చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఎలా నెట్టుకొచ్చిందో ఆ దేవుడికే ఎరుక. చుట్టూ విలాసాలతో నిండిన లోకం మధ్యలో నిర్లిప్తంగా తన సాహసోపేతమైన బ్రదుకును సాగిస్తూ దైవం కోసం ఆ యువతి అన్వేషించింది.

దైవమార్గంలో తనకు దారి చూపించే గురువు కోసం రావల్పిండిలో ఆమె చాలా వెదికింది.ఆ క్రమంలో ఆమెకు ఒక హిందూ మహాత్మునితో పరిచయం కలిగింది.ఆమెకు ఉపదేశం చేసిన ఆయన, దగ్గరలోనే ఉన్న ఒక పర్వతపు గుహలో ఉంటూ తపస్సు చెయ్యమని ఆమెకు సూచించాడు.ఆయన ఆజ్ఞను పాటించి ఆమె, దాదాపు ఏదాదిన్నర పాటు ఆ కొండమీద ఉండి ఏకాంత సాధన గావించింది.ఈ ప్రదేశం ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నది.


అప్పటికి ఆమెకు దాదాపు 37 ఏళ్ళు వచ్చాయి.తను వెదుకుతున్న గమ్యం ఇంకా ఆమెకు దొరకలేదు.అయినా ఆమె తన పట్టుదలను కోల్పోలేదు.మళ్ళీ వెతుకులాట సాగించింది. దొరికితే తాను వెదుకుతున్న గమ్యం దొరకాలి.లేదా ఆ ప్రయత్నంలో ప్రాణం పోవాలి.ప్రాణం పోయేలోపు దైవాన్ని దర్శించాలి.ఆయనలో కరిగిపోవాలి.ఆయన తనలో నివాసం ఏర్పాటు చేసుకోవాలి.ఈ జన్మ వృధా కారాదు.దానికోసం జీవితంలో ఇక దేనినైనా తను వదులుకుంటుంది.


ఇదే ఏకైక లక్ష్యంతో ఎన్నో ఏళ్ళు అలా తపిస్తూ దైవధ్యానంలో కాలం గడుపుతూ గురువుకోసం ఆమె అన్వేషించింది. చివరకు, తన సంచార జీవితంలో భాగంగా ముల్తాన్ లో ఒక ముస్లిం మహాత్ముడిని ఆమె కలుసుకుంది.ఆయన పేరు 'మౌలాషా' అని కొందరు పరిశోధకులు తలపోశారు.ఎంతోకాలం నుంచీ ఆమె వెదుకుతున్న దైవానుభూతిని అతడు ఆమెకు కలిగించాడు.ఆ అనుభూతిలో మునిగి ఆమె కొన్ని నెలలు గడిపింది.

నిజానికి,మన తపనను దైవం ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది. ఈ జన్మలోనే కాదు.జన్మజన్మాన్తరాలలో మన గమనాన్నీ మన దిశనూ దైవం నిశితంగా చూస్తూనే ఉంటుంది.అలా చూస్తూ ఉన్నపుడు,మరి ఎందుకు మనల్ని పట్టించుకోదు?ఎందుకు మనకు సాక్షాత్కరించదు?మనల్ని ఎందుకు ఇన్ని కష్టాల పాలు చేస్తుంది? అన్న సంశయాలు తలెత్తుతాయి.

సాధన అనేదీ, దైవానుగ్రహం అనేదీ నిజానికి ఒక పరిణామ ప్రక్రియ.మనిషిలో పరిణామం అనేది చాలా నిదానంగా జరుగుతుంది.మనం ఆశించిన క్షణంలో వెంటనే అది జరగదు. అలా జరగడానికి మన మానసిక ప్రాణిక స్థితులే పెద్ద అడ్డంకిగా ఉంటాయి.అవి మారాలంటే చాలా ఏళ్ళు పడుతుంది.మన దేహ,ప్రాణ,మానసిక స్థితులు ఉన్నతంగా ఎదిగి,పరిణామం చెంది,దైవస్పర్శను తట్టుకోగలిగే స్థితికి చేరినప్పుడు మాత్రమే, దైవం మనకు సాక్షాత్కరిస్తుంది.అప్పుడే మనకు సమాధి స్థితిగానీ ఇంకేదైనా గానీ కలుగుతుంది.ముందుగా మనలో ఆ సంసిద్ధతా,ఆ స్థాయీ ఉండాలి.అవి లేనప్పుడు అలాంటి స్థితులు కలిగినా అవి నిలబడవు.లేదా వాటిని తట్టుకోలేక దేహం రాలిపోతుంది.

ఊరకే మనకు తీవ్రమైన తపన ఉన్నంత మాత్రాన ఈ పరిణామం రాత్రికి రాత్రి జరిగిపోదు.ఈరోజు మనకు ఏదో కాసేపు శ్మశానవైరాగ్యంతో ఏదో కాస్త వ్యాకులత జనించినంత మాత్రాన రేప్పొద్దునకు దైవం వచ్చి మన ఇంటి వాకిటిలో నిలుచోదు.ఆర్డర్ ఇచ్చిన మూడోరోజున ఇంటిదగ్గర డెలివరీ కావడానికి ఇది ఆన్లైన్ కొనుగోలు కాదు.అందుకే ఏళ్ళకేళ్ళపాటు నిరంతరమైన సరియైన సాధన దానికి అవసరం అవుతుంది.నిజమైన సాధకుడు విసుగు లేకుండా సాధన గావిస్తూ, ఫలితాలకోసం ఎదురు చూడకుండా, ఎంతో ఓపికగా వేచి ఉండాలి.

శ్రీ రామకృష్ణులు తరచూ ఒక పాట పాడేవారు. దాని అర్ధం ఇది.

'ఓ యాత్రికుడా ! సరియైన సమయంలో అన్నీ జరుగుతాయి.నీ పయనాన్ని మాత్రం ఆపకు.ఉల్లాసంగా నీ ప్రయత్నాన్ని చేస్తూ ఉండు.నిరాశకు లోనుకాకు.నీ యజమాని నిన్ను చూస్తూనే ఉన్నాడు సుమా ! మరచిపోకు.'

ఆ విధంగా, ముల్తాన్ లో తన ముస్లిం గురువును కలిసే నాటికి బాబాజాన్ ఎంతో పరిపక్వతను  చెంది ఉన్నది.దాదాపు ఏభై సంవత్సరాల నిరంతర తపనా, అంతరిక సంఘర్శణా ఫలితంగా ఆ అంతరిక పరిణామం జరిగింది. కనుక తాను ఆశిస్తున్న భగవదనుభూతిని తట్టుకునే శక్తి అప్పటికి ఆమెకు కలిగింది.అందుకే ఆ సమయంలో ఆ గురువు తారస పడటమూ,ఆ అనుగ్రహాన్ని ఆమెకు కలిగించడమూ జరిగాయి.

కానీ అత్యున్నతమైన ఆ అనుభూతి నుంచి ఆమె క్రిందకు రాలేకపోయింది. అలా క్రిందకు తేవడం ఆ ముస్లిం మహాత్మునికి చేతకాదు.నదిలోకి తొయ్యడం ఆయనకు తెలుసు.కానీ ఒడ్డుకు తేవడం ఆయనకు తెలీదు.ఇవన్నీ మామూలు మనుషులకు అర్ధం కాని అంతరిక ప్రపంచపు విచిత్రాలు.

మామూలు మనుషులు వారి వారి పుస్తకపరిజ్ఞానంతో ఆధ్యాత్మికతను గురించి ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు.అవే నిజాలని నమ్ముతూ ఉంటారు. దైవానుభూతిని పొందిన మహనీయులలో కూడా స్థాయీ భేదాలు ఉంటాయి. వారందరూ ఒకే స్థాయిలో ఉన్న వ్యక్తులు కారు.వారు ఈ లోకంలో పనిచేసే భూమికలు కూడా వేర్వేరుగా ఉంటాయి.వారి కార్యరంగాలు కూడా వేర్వేరుగా ఉంటాయి.

అందువల్లనే, అత్యున్నత నిర్వికల్ప సమాధిని ఆమెకు కలిగించిన ఆ ముస్లిం గురువు దానినుంచి ఆమెను మళ్ళీ మామూలు స్థితికి మాత్రం తేలేకపోయాడు.ఆయనకా శక్తి లేదు. ఆయన పని ఆమెను సముద్రంలోకి తొయ్యడం వరకే.బయటకు తెచ్చే శక్తి ఆయనకు లేదు.కొన్ని సార్లు వారికలా శక్తి ఉన్నప్పటికీ, కంటికి కనిపించని అనేక కర్మానుబంధాల వల్ల, ఆ పని చెయ్యవలసిన వ్యక్తి ఇంకెక్కడో ఉంటాడు.ఆ వ్యక్తిని వెదుకుతూ మళ్ళీ ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది.

ఈ పని కోసమని,రావల్పిండిలో తన మొదటి గురువైన హిందూ మహాత్ముడిని ఆమె మళ్ళీ కలుసుకుంది.మత్తులో మునిగిన పిచ్చిదానిలా తిరుగుతున్న ఆమెను బాహ్యస్పృహతో నిండిన మామూలు స్థితికి ఆయన తీసుకు రాగలిగాడు.నిరంతర దైవానుభూతిలో మునిగి ఉంటూ కూడా బాహ్యస్పృహను నిలుపుకునే స్థితిని ఆమె అప్పటికి పొందగలిగింది.

నిజమైన సాధన అనేది ఎంత కష్టమైన విషయమో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.సాధన అంటే మనం ఇంట్లో చేసుకునే పూజలు కాదు.ఏడాది కొకసారి మనం తిరిగే గుళ్ళూ గోపురాలూ కాదు.పండుగలూ పబ్బాలూ కాదు.మన మొక్కులూ మన కోరికలూ కాదు.మనం కొట్టే కొబ్బరికాయలూ, వెలిగించే అగరువత్తులూ కాదు. పెట్టే నైవేద్యాలూ కాదు.ఇదేదీ అసలైన సాధన కాదు.

సాధన అంటే ఆత్మ సంస్కరణ.ఆత్మపరిణామ క్రియ.బాహ్య తంతులు సాధన కాదు.నిజమైన సాధనలో నువ్వు మారాలి,నీ మనస్సులో మార్పు రావాలి. అంతరికంగా నీ పరిస్థితి దైవికంగా పరిణామం చెందాలి.నానా చెత్తతో నిండి ఉన్న నీ అంతరంగం శుభ్రపడి పరిణామక్రమంలో కొన్ని లక్షల సంవత్సరాలు ముందుకు వెళ్లిపోవాలి.నువ్వు మాయం కావాలి.నీ స్థానంలో దైవం వచ్చి కూచోవాలి.అదే అసలైన సాధన అంటే.

ఈ సంఘటన జరిగేనాటికి ఆమెకు దాదాపుగా 67 ఏళ్ళు వచ్చాయని కొందరు అంటారు.అంటే తాను ఆశిస్తున్న స్థితిని చేరడానికి దాదాపుగా 50 ఏళ్ళ సాధనను ఆమె చేసింది.ఆ విధంగా తానాశిస్తున్న గొప్పదైన నిధిని ఆమె సంపాదించ గలిగింది.ఇక దానిని అర్హులైనవారికి పంచిపెట్టాలి.తాను ఎలాగైతే తపన పడిందో అలా తపన పడుతున్నవారు ఎందఱో ఉంటారు.వారికి సాయం చెయ్యాలి.అందుకోసం మళ్ళీ దేశసంచారం మొదలుపెట్టింది.

మహోన్నతమైన దైవానుభవస్థితిలో ఉంటూ ఆమె ఇరాన్ నుంచి ఇండియా వరకూ ఉన్న ప్రాంతాలలో అంతా సంచారం చేసింది.అహం అనేది పూర్తిగా నశించిన ఆ స్థితిలో ఆమె, హిందూయోగులు చెప్పిన "అహం బ్రహ్మాస్మి"(నేనే దైవాన్ని) అన్న అనుభవంలో లీనమై ఉండేది. దీనినే 'అనల్ హక్' అన్న అరబిక్ పదం కూడా సూచిస్తుంది. 'నేనే దైవాన్ని' అని దీని అర్ధం.దేహస్పృహ లేని ఆమె దైవానుభూతిలో మునిగి అనేక సందర్భాలలో ఇదే మాటను  పైకి గట్టిగా అంటూ పిచ్చిదానిలాగా తిరుగుతూ ఉండేది.


అల్లాను తప్ప ఇంకో దైవాన్ని ఒప్పుకోని ఇస్లాం మతం ప్రకారం ఈ మాట దైవద్రోహం క్రిందకు వస్తుంది.ఈ నేరానికి మరణమే శిక్ష.


ఆచారాలకూ, నిజమైన ఆధ్యాత్మికతకూ ఎప్పుడూ చుక్కెదురే. అందులోనూ ఇతర దేశాలలో ఇది మరీ ఎక్కువ. దైవానుభూతిని పొందిన మహనీయులు అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ ఉన్నారు.కానీ ఒక్క భారతదేశంలో తప్ప మిగిలిన అన్ని దేశాలలోనూ వారు చిత్రహింసలు పెట్టి చంపబడ్డారు.ఇలా చంపబడినది జీసస్ ఒక్కడే అని క్రైస్తవులు భావిస్తారు.కానీ క్రీస్తు కంటే ముందే, దాదాపు 50 మంది దాకా మహనీయులు ఈ విధంగా చిత్రహింసలు పెట్టబడి జనం చేతిలో చంపబడ్డారు. కారణం ఏమంటే - వారిని ఎలా గౌరవించాలో ఆయా దేశాలకు తెలియదు.ఒక్క భారతదేశంలో మాత్రమే మహనీయులు పూజింపబడతారు.దైవంతో సమానంగా గౌరవించబడతారు. మిగతా దేశాలలో అయితే చంపబడతారు.

వివేకానందస్వామి అమెరికాలో ఉన్నపుడు ఒక సంఘటన జరిగింది.

ఒకరోజున స్వామి ఒక ఉపన్యాసం చెప్పి హాలునుంచి బయటకు వస్తున్నారు.అప్పటి వరకూ ఆ ఉపన్యాసం విన్న ఒక బ్లాక్ అమెరికన్ వచ్చి ఆయన్ను కలిశాడు.అతనిలా అన్నాడు.

'సర్.మీరు గనుక ఒక నలభై ఏళ్ళ క్రితం మా దేశానికి వచ్చి ఇలాంటి ఉపన్యాసం చెప్పినట్లయితే జనం మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపేసి ఉండేవారు.'

పరాయి మతాలంటే ఎంత అసహనం విదేశాలలో ఉన్నదో మనం అర్ధం చేసుకోవచ్చు.అదే సమయంలో, వారి మతాలలో అయినా సరే, 'నేనే దైవాన్ని' అన్న మాట ఎవరైనా అంటే - వారిని కూడా చంపి పారేస్తారు.కానీ ఖర్మేంటంటే - సాధనా మార్గంలో నిజంగా నడచే ధీరులకు ఒకానొక స్థాయిలో ఈ అనుభూతి తప్పకుండా కలుగుతుంది.

ఈ స్థాయినే 'అహం బ్రహ్మాస్మి' అన్న మహావాక్యంగా వేదం ప్రస్తుతించింది.అరబిక్ లో ఇదే భావాన్ని 'అనల్ హక్' అనే పదంతో సూచిస్తారు. రెంటి అర్ధమూ ఒకటే.వ్యక్తిపరమైన తన స్వల్పాహంకారం పూర్తిగా నశించి దైవంలో లీనమైన స్థితి అది.ఆ స్థితిలో ఆ మనిషి మిగిలి ఉండడు. ఆ స్థానంలో దైవమే ఉంటుంది.కాకుంటే దేహం నడవాలి గనుక అతికొంచంగా దేహస్పృహ  ఉంటుంది.ఆ కొద్ది స్పృహే అలా అరుస్తుంది.

9 వ శతాబ్దంలో పర్షియాలో నివసించిన మన్సూర్-అల్-హల్లజ్ అనే సూఫీ మహనీయుడు కూడా పూర్తిగా అహం నాశనమైన ఈ స్థితిని అందుకున్నాడు.అతడు కూడా - 'అనల్ హక్' - 'నేనే దైవాన్ని' అని చెప్పేవాడు.ఈ మాటను సహించలేని తురకలు భయంకరమైన ఈ దైవద్రోహ నేరం క్రింద ఆయన్ను చాలాకాలం పాటు జైల్లో పెట్టి చివరకు శిరచ్చేదం చేసి చంపేశారు.

ఈ సంఘటన జరిగి 1000 సంవత్సరాలు గడిచాయి.తొమ్మిదో శతాబ్దం పోయి పంతొమ్మిదో శతాబ్దం వచ్చింది.కానీ మనుషుల మానసిక స్థాయిలో ఏ మార్పూ రాలేదు.ఎన్నేళ్ళు గడచినా నిజానికి మనిషి ఈనాటికీ ఆటవికుడే అని మానసిక శాస్త్రవేత్తలు అంటారు.అది నిజమే అనేదానికి రుజువు బాబాజాన్ జీవితంలో కూడా జరిగింది.

అహం పూర్తిగా నశించిన ఆనంద పరవశ స్థితిలో ఉంటూ బాబాజాన్ 'అనల్ హక్' అని అరుస్తూ తిరగడాన్ని పంజాబ్(ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నది)లోని మత పెద్దలు హర్షించలేకపోయారు.సాంప్రదాయంగా పద్దతిగా ఉంటూ ఖురాన్ చదువుతూ,నమాజ్ చేస్తూ,జీవితం గడుపుతున్న తమకు అందని మహోన్నత స్థితి,ఒక అడుక్కుంటూ తిరిగే పిచ్చిదానికి కలిగిందా? అసంభవం !! దీనికి సైతాన్ పట్టింది.ఇది దైవద్రోహం.కనుక ఈమెను చంపెయ్యాల్సిందే అని నిర్ణయించారు.

ఎలా చంపాలి? అని చర్చోపచర్చలు చేసిన మీదట, బ్రతికుండగానే ఆమెను పూడిచి పెట్టడమే ఈ నేరానికి తగిన శిక్ష అని నిర్ణయించారు.ఈ పని చెయ్యమని అక్కడి రెజిమెంట్ లోని సిపాయీలను ఆజ్ఞాపించారు.వారాపనిని చక్కగా నిర్వర్తించారు.

ఒక గుంత త్రవ్వి,బాబాజాన్ ను పట్టుకుని,అందరూ చూస్తుండగానే,ఆమెను ఆ గుంటలో పడేసి మట్టితో పూడ్చేశారు.ఆ తర్వాత,సైతాన్ని చంపేశామనీ, అల్లా మెచ్చుకునే గొప్ప పని చేశామనీ వారిని వారు మెచ్చుకుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.అంటే - అప్పటికీ ఇప్పటికీ పాకిస్తాన్ లో ఈ హింసాకాండ జరుగుతూనే ఉన్నదన్నమాట.

తర్వాత ఎన్నో ఏళ్ళు గడిచాయి. కాలక్రమంలో అదే సైనికుల రెజిమెంట్ పూనాలోని కంటోన్మెంట్ ఏరియాకు బదిలీ అయి వచ్చింది.అక్కడ వాళ్ళ కళ్ళను నమ్మలేని అద్భుతాన్ని వాళ్ళు చూచారు.తమ చేతులతో తామే పూడిచి పెట్టిన బాబాజాన్ అదే వేషంలో అదే ఆకారంలో ఒక వేపచెట్టు క్రింద కూచుని నిర్వికారంగా ఆకాశంలోకి చూస్తూ ఉండటాన్ని వారు చూచి భయభ్రాంతులకు గురయ్యారు.మొదట అది తమ భ్రమేమో అని అనుకున్నా, దగ్గరనుంచి పరిశీలించిన మీదట, ఆమె ఈమే అని గ్రహించారు.బిత్తరపోయిన ఆ సైనికులు బాబాజాన్ కాళ్ళమీద పడి క్షమాపణ కోరారు.ఆమె ఎదురుగా కవాతు చేసి ఆమెకు సైనిక వందనం ఇచ్చారు.అది చూచిన ఆ వీధిలోని వారికి మతిపోయింది.

ఆ వీధిలోని వారి దృష్టిలో బాబాజాన్ ఒక పిచ్చిది.అడుక్కునే ఒక దిక్కులేని మనిషి.ఆమెకు ఒక సైనిక బెటాలియన్ గౌరవ వందనం చెయ్యడమా? ఇదేమి వింత? ఆమె మామూలు మనిషి కాదనీ, దైవానుభూతి కలిగిన మహనీయురాలనీ,మహిమలు చెయ్యగల సిద్దురాలనీ వారికి అప్పుడు అర్ధమైంది. అప్పటినుంచీ ఆమెను వారుకూడా గౌరవించడం ప్రారంభించారు.

అయితే - నిర్వికారంగా ఉండే బాబాజాన్ వారి గౌరవాన్ని ఏమాత్రమూ పట్టించుకునేది కాదు.వారి తిట్లూ ఆమెను చలింప చెయ్యలేకపోయేవి.వారి గౌరవమూ ఆమెను కదిలించ లేకపోయ్యేది.ఆమె తనదైన లోకంలో నిర్వికారంగా నిశ్చలంగా ఉండేది.

ఆఫ్ఘనిస్తాన్, మక్కా, మదీనా, పెషావర్,రావల్పిండి, పంజాబ్, బాంబే లలో విస్తారంగా సంచరించిన ఆమె తన జీవితపు చివరి ఘట్టంలో పూనా వచ్చి అక్కడ కంటోన్మెంట్ ఏరియాలో ఒక వేపచెట్టు క్రింద స్థిరనివాసం ఏర్పరచుకుంది.అప్పటికే ఆమెకు నూరేళ్ళు దాటి ఉంటాయి.ఆమె పూనా రావడం 1910 ప్రాంతాలలో జరిగింది.

ఆ రోజుల్లో ఆప్రాంతం అంతా ఒక స్లం ఏరియాగా ఉండేది. విపరీతమైన దోమలు పగలే అక్కడ విహరిస్తూ ఉండేవి. పరిశుభ్రత అంతగా ఉండే ప్రదేశం కాదది.అక్కడ ప్లేగు వ్యాధి సూచనలు కూడా కనిపిస్తూ ఉండేవి.మనుషులు పెద్దగా తిరిగేవారు కారు.కానీ రాత్రయ్యేసరికి టౌన్ లో ఉన్న రౌడీలూ, హంతకులూ,త్రాగుబోతులూ,దొంగలూ మొదలైన అసాంఘిక శక్తులన్నీ అక్కడకు చేరేవి.అలాంటి ప్రమాదకరమైన ఏరియాలో ఆమె వచ్చి స్థిరపడింది.

ఎండలో వానలో చలిలో - ఎలాంటి వాతావరణ పరిస్థితిలో నైనా - ఆమె ఆ వేపచెట్టు క్రిందే అలా కూచుని ఉండేది.ఆమె ఆస్తి అంతా ఆమె కట్టుకున్న చిరిగిన బట్టలే.కుంభవృష్టి కురిసి ఆమెను నిలువెల్లా తడిపేసేది.ఎండ వచ్చి ఆమెను ఆర్పేది.కానీ ఆమె మాత్రం ఏమీ పట్టనట్లు అలా కూచుని ఉండేది.ఎప్పుడైనా ఎవరైనా 'టీ'  ఇస్తే తాగేది.తినడానికి ఎవరినీ ఏమీ అడగదు. ఎవరైనా ఏదైనా తినడానికి ఇస్తే, ఆకలైనపుడు కొంత తిని, దానిలో ఎక్కువ భాగాన్ని మాత్రం ఎవరికో ఒకరికి లేదా కుక్కలకో పంచేసేది.ఎవరితోనూ మాట్లాడదు.ఒకవేళ ఎప్పుడైనా ఒకటి రెండు మాటలు మాట్లాడితే చాలా మృదువుగా చిన్నగా మాట్లాడేది.

బలహీనంగా కనిపించే ఆ ముసలి దేహం వెనుక అనంతమైన ఆత్మశక్తి వెలుగుతూ ఉండేది.ఆమె నీలిరంగు కళ్ళు ఏదో తెలియని లోతైన దృష్టితో జ్వలిస్తూ ఉండేవి.ముగ్గుబుట్ట లాంటి ఆమె జుట్టు సహజసిద్ధమైన కిరీటంలా ఆమెకు వన్నె తెచ్చేది. చిరిగిపోయిన బట్టలు ధరించి ఆమె వీధిలో నడుస్తుంటే ఒక మహారాణి నడిచినట్లే ఉండేది.ఆమెలో దేనినీ లెక్కచెయ్యని ధైర్యమూ ఒక విధమైన హుందాతనమూ ఉండేవి.

ఆమె చేసే మహిమలు చాలా సహజంగా ఉండేవి.వాటిలో తంతులు ఏమీ ఉండవు.ఎవరైనా ఏవైనా బాధలతో ఆమె దగ్గరకు వచ్చి ప్రార్ధిస్తే - అవి శరీర బాధలైతే - ఆ శరీర భాగాన్ని తన చేతులతో పట్టుకుని, ఆకాశంలోకి చూస్తూ ఏవో కనిపించని ఆత్మలను శక్తులను పిలిచినట్లు పిలిచేది.'ఇతన్ని వదలి వెళ్ళిపో" అంటూ ఆజ్ఞాపిస్తూ తనలో తాను ఏదో గొణుక్కునేది. ఆశ్చర్యకరంగా - ఆ బాధ ఆ వ్యక్తిని వదలి తత్క్షణమే మాయమయ్యేది.

బాబాజాన్ ఇచ్చిన వరాల వల్ల ఆ ప్రాంతంలో పిల్లలు లేనివారికి పిల్లలు కలిగారు.కంటిచూపు లేనివారికి కంటిచూపు వచ్చింది. అసాధ్యమైన రోగాలు తగ్గిపోయాయి.ఇంకా ఎన్నెన్నో అద్భుతాలను ఆమె చేసింది.ఎన్ని చేసినా తాను మాత్రం దైవం మీద మాత్రమే ఆధారపడి ఉన్న ఒక దిక్కులేని వ్యక్తిగానే ఉంటూ ఎండకూ వానకూ తడుస్తూ ఆమె తన జీవితాన్ని గడిపింది.

ఆకతాయి పిల్లలు ఆమె పైకి రాళ్ళు విసురుతూ ఉండేవారు.ఆమె చిరునవ్వుతూ వారిని చూస్తూ ఉండేది.ఆచార పరాయణులైన హిందువులూ, ముస్లిములూ,ఫార్సీలూ ఆమెను అసహ్యించుకునే వారు.దానినీ ఆమె మౌనంగా సహించేది.వారినీ ఏమీ అనేది కాదు.వారి అజ్ఞానానికి నవ్వుకునేది. కానీ అనవసరంగా ఎవరికీ ఏమీ బోధించేది కాదు.

తుంటరి వాళ్ళు ఆమె దగ్గర ఉన్న వస్తువులు దొంగిలించేవారు.ఆమె పట్టించుకునేది కాదు.తను అనుకున్న పని అయిందన్న ఆనందంలో ఒక బాంబే సేథ్ ఒక బంగారుగాజుల జతను ఆమె చేతికి తొడిగాడు.ఆమె నిర్వికారంగా చూస్తూ ఉన్నది. ఒకరోజున ఒక దొంగ ఆ గాజుల జతను ఆమె చేతినుంచి మొరటుగా లాక్కున్నాడు.ఆమె చెయ్యి తెగిపోయి చాలా రక్తం కారింది.ఆమె అదే నిర్వికారంగా చూస్తూ ఉండిపోయింది.

ఒక రోజు చలిరాత్రి. ఎవరో ఇచ్చిన దుప్పటి కప్పుకుని బాబా జాన్ ఆరుబైట నిద్రిస్తున్నది.ఒక దొంగ వచ్చి ఆ దుప్పటిని లాక్కుందామని ప్రయత్నించాడు. ఆ దుప్పటిలో కొంతభాగం బాబాజాన్ శరీరం క్రింద ఉండటంతో ఆ ప్రయత్నం సాధ్యం కాలేదు.అతనికి ఇబ్బంది కలుగకుండా ఉండటానికి, ఆమె పక్కకు ఒత్తిగిలి ఆ దుప్పటిని అతను లాక్కోడానికి వీలు కల్పించింది.ఆ దుప్పటిని అతను తీసుకుని పోతూ ఉంటే చిరునవ్వుతో చూస్తూ ఆ చలిలో అలా ఉండిపోయింది బాబాజాన్.

ఏమిటా అద్భుతజీవితం??ఇలాంటి వారు కాకుంటే ఇంకెవరు మహనీయులు?

ఒకరోజు ఆమె వొళ్ళు తీవ్రమైన జ్వరంతో కాలిపోతూ ఉండేది. మర్నాడు మామూలుగా చల్లగా ఉండేది.ఎలా ఉన్నా ఆమె ఏమీ చలించేది కాదు.ఏ ఋతువైనా సరే, ఏ కాలమైనా సరే, ఏమీ చలించకుండా ఆ వేపచెట్టు క్రింద నేలమీద దుమ్ములో అలాగే కూచుని ఉండేది.నిజమైన స్థితప్రజ్ఞస్థితికి ఆమె సంకేతంలా ఉండేది.

షిరిడీ సాయిబాబా వంటి ఇతర మహనీయులు కూడా ఒక పాడుబడిన మసీదులోనో లేదా ఇంకేదో కట్టడంలోనో ఒక కప్పుక్రింద ఉండేవారు.బాబాజాన్ వారిని కూడా మించిపోయింది.ఆమె జీవితమంతా దాదాపు నూరేళ్ళ పాటు ఏ ఇంటికప్పు క్రిందా ఉండకుండా ఆకాశం క్రిందనే బ్రతికింది. షిరిడీ సాయిబాబాకు ఆస్తమా ఉండేది.అలాగే మిగతా మహనీయులకు కూడా ఏవేవో శరీర బాధలుండేవి. దైవవశాత్తూ, వానకు తడిసి ఎండకు ఎండి గాలికి ఆరిన బాబాజాన్ కు అలాంటి శరీర బాధలు ఏవీ ఉండేవి కావు.చాలామంది తన సమకాలీన మహాత్ముల కంటే ఆమె ఆరోగ్యం చాలా గట్టిదే అని చెప్పాలి.

ఎవరినైనా సరే - 'బచ్చా' అనీ 'బాబా' అనీ 'బేటా' అనీ మాత్రమె ఆమె సంబోధించేది.అప్పుడప్పుడూ బాంబే వెళ్లి అక్కడ ఉన్న కొందరు సూఫీ మహాత్ములను కలిసి వస్తూ ఉండేది.వారిని కూడా తన పిల్లలుగా ఆమె సంబోధించేది.షిరిడీ సాయిబాబాను కూడా 'బేటా' అని ఆమె పిలిచేది.

ఆమె చుట్టూ ఉన్న 'ఆరా' చాలా బలంగా ఉండి, ప్రేమతరంగాలను నలువైపులా విరజిమ్ముతూ ఉండేది.ఆమెను దర్శించాలని వచ్చిన వారికి కొంత సున్నితత్వం ఉంటే మాత్రం,ఆమెను వదలి పోలేక పోయేవారు.అలా వెళ్ళాలంటే వారికి ఏడుపు వచ్చేసేది.అటువంటి ప్రేమతత్వం ఆమె చుట్టూ ఆవరించి ఉండేది.

మేర్వాన్ కు దాదాపు ఆరేళ్ళ వయస్సు ఉన్నపుడు ఆమె పూనాలో అడుగుపెట్టింది.మేర్వాన్ కుటుంబం ఉన్న దస్తూర్ రోడ్డు లోకి వచ్చి అక్కడ ఉన్న వేపచెట్టు క్రింద నివాసం ఏర్పాటు చేసుకుంది.బహుశా మేర్వాన్ కు దైవానుభూతిని కలిగించడానికే ఆమె అలా వచ్చిందేమో? ఎవరికి తెలుసు?

మేర్వాన్ కు 19 ఏళ్ళ వయస్సు వచ్చేవరకూ,అంటే దాదాపు 12 ఏళ్ళపాటు ఆమె మౌనంగా ఆ చెట్టుక్రిందనే ఉంటూ బ్రతికింది. రోజూ ఆమె కూచున్న చెట్టు ముందు నుంచే మేర్వాన్ స్కూలుకు వెళ్ళేవాడు.క్రమేణా అతడు పెద్దవాడై కాలేజీ చదువుకు వచ్చాడు.రోజూ సైకిల్ మీద అదే దారిలో డెక్కన్ కాలేజీకి పోయి వస్తూ ఉండేవాడు.దారిలో జనంమధ్యలో కూచుని ఉన్న బాబాజాన్ ను చూస్తూ ఉండేవాడు.

ఒకరోజున అలా సైకిల్ మీద పోతున్న మేర్వాన్ ను బాబాజాన్ తన దగ్గరకు రమ్మని కనుసైగ ద్వారా పిలిచింది.ఆమె పిలుపులో ఏం మహత్యం ఉన్నదో? సైకిల్ స్టాండ్ వేసి మేర్వాన్ ఆమెను సమీపించాడు.దగ్గరకు రమ్మని  పిలిచిన ఆమె మౌనంగా అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది.

మేర్వాన్ కళ్ళలోనుంచి ధారగా నీళ్ళు కారడం ప్రారంభించాయి. ఎందుకు ఏడుస్తున్నాడో అతనికే తెలియడం లేదు. కదలలేక, ఉన్నచోటనే అతను స్తంభించి నిలబడిపోయాడు.అనంతమైన దైవప్రేమను తమలో దాచుకున్న ఆ పేద వృద్దురాలి కళ్ళలో అతనికి ఏం కనిపించిందో?కాసేపు అలా ఉన్న మేర్వాన్, తేరుకుని,తన సైకిల్ ను అక్కడే మరచిపోయి,ఏదో ట్రాన్స్ లో ఉన్నవాడిలా ఇంటికి నడచి వెళ్ళిపోయాడు.ఆ చూపు అతనిలో ఏం మార్పును కలిగించిందో వారిద్దరికీ తప్ప ఎవరికి తెలుస్తుంది?

తంత్రదీక్షల్లో దృష్టిదీక్ష అనీ స్పర్శదీక్ష అనీ సంకల్పదీక్ష అనీ రకరకాలున్నాయి.శ్రీరామక్రిష్ణులు తన మాటలలో వీటిని వివరించారు. పక్షులు గుడ్లను పొదుగుతాయి.పక్షి భూమిని వదలి ఆకాశంలోకి ఎగర గలుగుతుంది.అంటే - భౌతికాన్ని వదలి దైవభూమికలో సంచరించగల ప్రజ్ఞకు పక్షి అనేది సంకేతం. కొన్ని పక్షులు స్పర్శతో గుడ్డును పొదుగుతాయి.అది స్పర్శదీక్ష. ఇంకొన్ని పక్షులు చూపుతో వాటిని పొదుగుతాయి.అది దృష్టిదీక్ష. తాబేలు సముద్రంలో ఉంటుంది.కానీ దాని ధ్యాస మొత్తం ఒడ్డున ఉన్న తన గుడ్లపైనే ఉంటుంది.ఆ ధ్యాసతోనే అవి పొదగబడతాయి.ఇది సంకల్పదీక్ష. తాబేలు నివసించే సముద్రం సచ్చిదానంద స్వరూపమై అనంతమైన దైవస్థితికి సంకేతం.ఆ దైవసముద్రంలో ఎల్లప్పుడూ నివసించే మహనీయులకు తాబేలు సంకేతం.గుడ్లన్నీ భూమిమీద ఉంటాయి.కనుక భౌతికవాంఛల వలయాలలో చిక్కి అఘోరిస్తున్న శిష్యులకు ఆ గుడ్లు సంకేతాలు.

ఈ విధంగా రకరకాలైన రహస్యదీక్షలు అసలైన ఆధ్యాత్మిక లోకంలో ఉంటాయి.ఇవి అందరికీ లభించేవి కావు. ఎవరు వీటికి అర్హులో వారికి మాత్రమే ఇవి దక్కుతాయి.ఆయా దీక్షలు లభించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి.ఎంతో పుణ్యబలం ఉండాలి.ఎంతో మంచికర్మ మన ఎకౌంట్లో ఉండాలి. దానికి తోడుగా దైవంకోసం ఎంతో తపన ఉండాలి.త్యాగం ఉండాలి. ధైర్యం ఉండాలి.అప్పుడే అవి లభిస్తాయి.వాటిల్లో దృష్టిదీక్షనే బాబాజాన్ ఆరోజు మేర్వాన్ కు ఇచ్చింది.ఆ దీక్షనివ్వడం కోసం 12 ఏళ్ళుగా అతన్ని సిద్ధం చేస్తూ ఆ వేపచెట్టు కింద ఎండలో వానలో చలిలో అలా కూచుని ఎదురుచూచింది.

గురువుకోసం శిష్యుడు ఎదురు చూస్తాడని సామాన్యంగా లోకంలో వాడుకలో ఉన్న మాట.అది కొన్ని సందర్భాలలో నిజం కావచ్చు.కొన్ని సందర్భాలలో కాకపోవచ్చు.కానీ నిజమైన గురువు మాత్రం శిష్యుని కోసం ఎంతో ఎదురు చూస్తాడనేది అసలైన సత్యం.

నిజమైన గురువు శిష్యుల కోసం ఎంతో పరితపిస్తాడు.వారికోసం కన్నీరు కారుస్తాడు.శ్రీరామకృష్ణుల జీవితమే దీనికి ఉదాహరణ. నరేంద్రాది తన శిష్యుల కోసం ఆయన ఎంతో ఏడ్చాడు. సాయంత్రం కావడంతోనే దేవాలయం మేడమీదకు ఎక్కి -'నాయనలారా ! ఎక్కడున్నారు మీరంతా?మీకోసం అంతా సిద్ధం చేశాను.త్వరగా నా దగ్గరకు రండి.మీ ఆస్తిని మీరు తీసుకోండి. జీవితంలో ఇంకొక రోజు గతించింది.మీరు కనిపించడం లేదు.ఎంతకాలం మీకోసం నేను ఎదురుచూడాలి?' అని భోరున విలపించేవాడు.

ఆయన ఎంతటి ప్రేమమూర్తో దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు.

తర్వాతి కాలంలో వివేకానందాది శిష్యులు ఆయన గురించి గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు.

'గురుదేవులు మమ్మల్ని ప్రేమించినట్లు ఈ లోకంలో ఇంకెవ్వరూ ప్రేమించలేదు.ఆఖరికి మా తల్లిదండ్రులు కూడా అంతగా మమ్మల్ని ప్రేమించలేదు.అటువంటి ప్రేమను ఇంతవరకూ మేము ఎక్కడా చూడలేదు. ఒక్కరోజు మేము కనిపించకపోతే ఆయన విలవిల లాడిపోయేవాడు.మా దగ్గరనుంచి ఆయన ఏమీ ఆశించలేదు.తన దగ్గరున్నదాన్ని మాకివ్వాలనే ఆయన తపించాడు.ఆయన ప్రేమతోనే మమ్మల్ని కట్టి పడేశాడు. లేకపోతే మేము ఇల్లూ వాకిళ్ళూ వదలిపెట్టి ఈ జీవితాన్ని గడుపగలిగే వారమేనా?ఆయన చూపిన అద్భుతమైన ప్రేమ ఒక్కటే మమ్మల్ని అందరినీ ఒకచోటికి చేర్చింది. మమ్మల్ని నడిపిస్తున్న శక్తి అదే.ఆయన ప్రేమపాశానికే మేమంతా కట్టుబడిపోయాము.' 

నిజమైన గురువు యొక్క ప్రేమ ఆ విధంగా ఉంటుంది.

అప్పటినుంచీ మేర్వాన్ ప్రతిరోజూ బాబాజాన్ దగ్గరకు వెళ్లి సాయంత్రం పూట ఆమె పక్కనే కూచుని రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చేవాడు. వారిద్దరూ ఏమీ మాట్లాడుకునే వారు కారు.మౌనంగా ఉన్న వారిద్దరి కళ్ళూ నిష్కారణంగా ధారగా వర్షిస్తూ ఉండేవి. అంతే !!

ఇలా ఉండగా - జనవరి 1914 లో ఒకరోజున ఒక అద్భుతం జరిగింది.ఎన్ని యుగాలనుంచో ఎదురుచూస్తున్న క్షణం మేర్వాన్ జీవితంలో వచ్చింది.

ఆ రోజున ఎప్పటిలాగే, చాలా పొద్దు పోయేవరకూ బాబాజాన్ తో కూచున్న మేర్వాన్, ఇంటికి పోదామని సిద్ధపడ్డాడు. బయలుదేరే ముందు బాబాజాన్ చేతిని ఒకసారి ప్రేమగా ముద్దాడి ఇంటికి పోదామని లేచాడు.రావలసిన సమయం వచ్చిందని బాబాజాన్ కు అర్ధమైంది.తన సాంగత్యంతో మేర్వాన్ లో రావలసిన పరిపక్వత వచ్చిందని ఆమె గ్రహించింది. బాబాజాన్ కూడా లేచి, మేర్వాన్ తలను ఆప్యాయంగా తన చేతులలోకి తీసుకుంది. ఒక్కక్షణం పాటు మేర్వాన్ కళ్ళలోకి ప్రేమగా చూచిన ఆ మహనీయురాలు మేర్వాన్ ను దగ్గరగా తీసుకుని అతని నుదుటిమీద చిన్నగా ముద్దు పెట్టుకుంది.

ఏమిటా ముద్దు మహిమ???

బాబాజాన్ ముద్దు పెట్టుకున్న క్షణంలో మేర్వాన్ కు ఒళ్ళు మొత్తం కరెంట్ షాక్ కొట్టినట్లు ఝల్లుమని జలదరించింది. అతను కళ్ళు తెరచి చూస్తూనే ఉన్నాడు.లోకం మొత్తం గిర్రున తిరిగిపోతూ ఎక్కడో శూన్యంలో లయించి పోయింది.తన వైపు చూచుకున్నాడు.తన దేహమూ లేదు.తన మనస్సూ లేదు. మనసులో ఆలోచనలూ లేవు.అంతా ఒక్క క్షణంలో శూన్యం అయిపోయింది.తానిప్పటివరకూ చూస్తున్న లోకం మాయమైంది.ఏదో తెలియని భూమికలోకి ఒక్కసారిగా ప్రవేశించాడు.'నేను' అన్న ఒక్క స్పృహ మాత్రమే మిణుకు మిణుకుమంటున్న సుదూర నక్షత్రంలా మిగిలి ఉన్నది. చూస్తూ ఉండగానే ఆ 'నేను' కూడా ఏదో తెలియని మహాసముద్రం లాంటి స్పృహలో లయించి పోయింది.ఒక్క క్షణంలో తన వ్యక్తిత్వం మొత్తం అదృశ్యం అయిపోయింది.తానే లేకుండా అయిపోయాడు.

మాటలకు అందని ఆ అనుభవంలో నిలిచి అతను ఎంతసేపు అలా ఉండిపోయాడో అతనికే తెలియదు.ఆ క్షణంలో బాబాజాన్ అనుగ్రహంతో నిర్వికల్ప సమాధిస్థితి తన మీదకు దూకిందని తర్వాత రోజులలో మెహర్ బాబా అన్నాడు.


ఆ రాత్రి ఎన్ని గంటలకు ఇంటికి చేరాడో ఎలా చేరాడో అతనికి తెలియదు.మేడమీద తన గదిలోకి ఎలా వెళ్ళాడో అతనికి తెలియదు. తనగదికి చేరి పక్కమీద పడుకున్నాడే గాని అతను భౌతిక స్పృహలో లేడు. అతని ఒళ్లంతా ఆగకుండా రాత్రంతా కరెంట్ షాకులు కొడుతూ ఉన్నాయి.ఒళ్ళు మొత్తం విద్యుత్తరంగాలు ప్రవహిస్తూ ఉన్నాయి.ఇది అంటూ చెప్పలేని గాఢమైన ఆనందంతో కూడిన మధురమైన బాధ ఒకటి అతని శరీరాన్ని మొత్తం ఊపేస్తూ ఉన్నది. మాట రావడం లేదు.ఆ స్థితిలో ఆ రాత్రంతా అతను పడి ఉన్నాడు.ఆ రోజులలో మెహర్ బాబా ఫోటో ఒకటి మనకు లభిస్తున్నది.ఆ రోజులలో ఆయన మానసిక స్థితి ఎలా ఉండేదో ఈ ఫోటో ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు.

మూడురోజుల పాటు మేర్వాన్ ఆ స్థితిలో ఉండిపోయాడు.ఆ మూడురోజులూ అతనికి శరీరస్ప్రుహ లేదు.నాలుగో రోజున మాత్రమే ఆయనకు శరీరం ఉన్నట్లు కొద్దిగా తెలిసింది.ఆ మూడురోజులూ తన ఐడెంటిటీని పూర్తిగా కోల్పోయిన మేర్వాన్ విశ్వమంతా నిండి ఉన్న చైతన్యమే తానన్న అనుభవంలో ఓలలాడుతూ ఉండిపోయాడు.

అసలా ముద్దుతో ఏం జరిగింది?

ఆ ఒక్క ముద్దుతో మేర్వాన్ ఆజ్ఞాచక్రాన్ని బాబాజాన్ జాగృతం గావించింది.ఇది ఎంత గొప్ప అద్భుతమో అనుభవపూర్వకమైన యోగపరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే అర్ధమౌతుంది. మిగతావారికి అర్ధం కాదు.

నేడు 'చక్రాలు' అనే మాటలు ఎవరు బడితే వారు వాడుతున్నారు.టీవీలలో చూచినా, నెట్లో చూచినా చక్రా హీలింగ్ అనీ చక్రా అవేకెనింగ్ అనీ రకరకాల కోర్సులు కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే నాకు చాలా నవ్వొస్తూ ఉంటుంది.అసలు విషయం ఏమంటే - ఈ రకంగా ప్రచారం చేసుకునే ఎవరికీ కూడా - ఈ చక్రాలేమిటో వాటిని ఎలా మేల్కొలపాలో - అస్సలు తెలియదని నేను బల్లగుద్ది మరీ చెప్పగలను.వారు చెప్పేటంత సింపుల్ విషయం కాదది.అదొక రహస్య విజ్ఞానం.ఎవరికి బడితే వారికి అది అందేది కాదు.దానికి ఎంతో తపస్సు కావాలి. మూడు నెలలు ఆరు నెలల కోర్సులలో వచ్చేది కాదది.జీవితాన్ని పణంగా ఒడ్డేవారికి మాత్రమే అది దక్కుతుంది.

నా చిన్నప్పుడు ఒకాయన 'సింపుల్ కుండలినీ యోగా' అని వాళ్ళ కోర్సులో నన్ను చేరమని అడిగాడు.నాకు చచ్చే నవ్వొచ్చింది.కుండలినీ యోగమనేది అంత సింపుల్ విషయం అయితే అంతంతమంది అన్నన్నేళ్ళు ఇల్లూ వాకిలీ వదిలి పెట్టి పిచ్చివాళ్ళలా తిరగవలసిన అవసరం ఏముంది? మహనీయులు తిండీ నిద్రా మానుకొని ఘోరంగా తపస్సులు చెయ్యవలసిన అవసరం ఏముంది? వాళ్ళు కూడా ఇలా తీరిక సమయంలో సింపుల్ కోర్సులు చేసుకుంటూ ఇళ్లలోనే హాయిగా సంసారాలు చేసుకుంటూ ఉండకపోయారా?

చాలా ఏళ్ళ క్రితం ఇంకొకాయన నాతో ఇలా అన్నాడు. 'సంసారం చేస్తూ కూడా కుండలినీ యోగం చెయ్యవచ్చు.దానికీ దీనికీ ఏమీ సంబంధం లేదు.ప్రతి ఏడూ పిల్లల్ని కంటూ ఉండవచ్చు.కుండలినీ యోగమూ చెయ్యవచ్చు.'

నాకు ఒళ్ళు మండి అతన్ని ఇలా అడిగాను.'అదొక్కటేనా?భార్య చాలకపోతే ఇంకొక ఇద్దరితో సంబంధం కూడా పెట్టుకోవచ్చా?అప్పుడు కుండలిని ఇంకా త్వరగా నిద్ర లేస్తుందేమో?'

'ఏంటా ఎగతాళి  మాటలు?' అని ఆ పెద్దాయన అన్నాడు. అప్పటికి నేను ఆయనకంటే చాలా చిన్నవాణ్ణి.

'ఎగతాళి కాకుంటే మరేమిటి? కుండలినీ యోగానికి బ్రహ్మచర్యం అత్యంత ముఖ్యమైన రూల్ అని అన్ని యోగ గ్రంధాలూ చెబుతున్నాయి.మహనీయులందరూ అదే చెబుతున్నారు.మరి మీరు చెబుతున్నదేమిటి? పతంజలి మహర్షి చూద్దామంటే మొదటి మెట్టైన 'యమం' లోనే బ్రహ్మచర్యాన్ని పెట్టాడు. మీరేమో దానికి పూర్తి వ్యతిరేకంలో చెబుతున్నారు.మీ తప్పుడు ప్రచారాన్ని ఇంకెవరి దగ్గరైనా చేసుకోండి.నా దగ్గర కాదు. బ్రహ్మచర్యం పాటించకుండా కుండలినీ యోగాభ్యాసం చేస్తే పిచ్చి పుట్టడం ఖాయమని వివేకానందస్వామి అన్నారు.నేనలా పిచ్చివాడిని కాదలచుకోలేదు.ఆయనకంటే గొప్పవారా మీ గురువు? నేనిలా అన్నానని పోయి మీ గురువుతో చెప్పండి' - అని చెప్పాను.

సరే ఆ విషయాన్ని ప్రస్తుతానికి అలా ఉంచి మన కధలోకి వద్దాం..

మర్నాడు ఉదయం మేర్వాన్ తల్లి శిరీన్ మా చూచే సరికి - మేడమీద గదిలో తన మంచం మీద వెల్లకిలా పడుకుని కళ్ళు బార్లా తెరిచి కప్పువైపు నిశ్చలంగా చూస్తున్న మేర్వాన్ ఆమెకు కనిపించాడు. "తెల్లారింది. లే నాయనా" - అని ఆమె చెప్పింది. అటునుంచి ఉలుకూ పలుకూ లేదు.అనుమానం వచ్చిన ఆమె దగ్గరకు వెళ్లి అతన్ని తట్టి చూచింది.అయినా అతనిలో చలనం లేదు.కనురెప్ప కొట్టకుండా కప్పువైపు నిర్వికారంగా చూస్తూ ఉన్నాడు.ఏదో జరిగిందని ఆమెకు అర్ధమైంది.

ఆ తర్వాత మేర్వాన్ కు జరగని వైద్యం లేదు.ఇంటికి రాని ఫకీర్లూ, హకీమ్ లూ, భూతవైద్యులూ, నాటువైద్యులూ లేరు. ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా వైద్యాలు చేసినా మేర్వాన్ పరిస్థితిలో మార్పు లేదు.అతనికి పట్టిన భూతం మామూలు భూతం అయితేగా వారి వైద్యాలకు లొంగటానికి?

ఆ తర్వాత కొన్ని నెలలకు మేర్వాన్ తిరిగి మామూలు దేహస్పృహ రావడం ప్రారంభం అయింది.కొంచం దేహస్పృహ వచ్చేసరికి తాను ఇప్పటివరకూ అనుభవిస్తున్న ఆనందస్థితి జారిపోతున్న బాధను అతను తట్టుకోలేక తన తలను గోడలకూ ఇనుపఊచలకూ బాదుకుంటూ కొట్టుకునేవాడు. పిచ్చివాడిలా ఒక గమ్యం లేకుండా బజారులో తిరుగుతూ ఉండేవాడు.తిండి తినేవాడు కాదు.బట్టలు మార్చేవాడు కాదు.ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. మళ్ళీ తన సాయం సమయాలలో మాత్రం అతను బాబాజాన్ ను యధావిధిగా దర్శించేవాడు.ఊరకే ఆమె దగ్గర మౌనంగా కూచునేవాడు.ఆమె కూడా మౌనంగానే ఉండేది. కానీ మేర్వాన్ ను చాలా ముద్దు చేసేది.తన చుట్టూ ఉన్నవారితో ఆమె ఇలా చెప్పేది.

'నా బిడ్డ ముందు ముందు ప్రపంచాన్ని కదిలిస్తాడు.మీరే చూస్తారు.'

ఆమె మేర్వాన్ తో ఇంకా ఇలా చెప్పింది.

'చూడు.నిన్ను సముద్రంలోకి త్రోశాను.బయటకు తేవడం నా పని కాదు.దానికి వేరేవాళ్ళున్నారు.షిరిడీలో నా బిడ్డలు సాయి, ఉపాసనీ ఉన్నారు.వారి దగ్గరకు వెళ్ళు.ఆ పని జరుగుతుంది.'

ఆ తర్వాత మేర్వాన్ శిరిడీకి వెళ్ళడమూ సాయిబాబాను కలవడమూ, తర్వాత ఉపాసనీ మహరాజ్ ప్రియశిష్యునిగా ఏడేళ్ళు ఉండి.బాబాజాన్ ఇచ్చిన మహానుభావాన్ని స్థిరీకరించుకుని 'అవతార్ మెహర్ బాబా' గా రూపాంతరం చెందటమూ ఇవన్నీ జరిగాయి.అవన్నీ ఇంకో పోస్ట్ లో చూద్దాం.

వివేకానందస్వామి జీవితంలో కూడా ఇదే సంఘటన జరగటాన్ని మనం చూస్తాం.శ్రీ రామకృష్ణులు తన హృదయం మీద సుతారంగా తట్టినపుడు ఆయన కూడా ఇదే స్థితికి లోనయ్యాడు. ఆ తర్వాత కొద్ది నెలలు ఆయనకూడా తన అంతరిక అనుభవానికీ, బాహ్యస్పృహకూ మధ్యన త్రిశంకుస్వర్గంలో ఊగులాడాడు.ఆయనకూడా తన తలను హౌరా బ్రిడ్జి దిమ్మలకేసి బాదుకునేవాడు.అయితే మెహర్ బాబా అనుభవానికీ వివేకానంద స్వామి అనుభవానికీ ఒక ముఖ్యమైన తేడా ఉన్నది.

ఈ అనుభవం స్థిరీకరించబడటానికి మెహర్ బాబాకు ఏడేళ్ళ సమయం పట్టింది.ఈ ఏడేళ్ళలో ఆయన ఉపాసనీ మహారాజ్ శిష్యునిగా ఉంటూ ఆ అనుభవాన్ని ఎలా జీర్ణించుకోవాలో నేర్చుకున్నాడు.కానీ వివేకానందుడికి ఈ పనంతా కొన్ని నెలలలోనే అయిపోయింది.ఎవరి దగ్గరకూ తిరగకుండానే శ్రీరామకృష్ణుల అనుగ్రహంతోనే ఈ పని జరిగింది.

"నరేంద్రుడు పిచ్చివాడిలా తిరుగుతున్నాడు.తిండీ నిద్రా లేవు.ఏమైందో కొంచం చూడండి" - అని మిగతా శిష్యులు శ్రీ రామకృష్ణులను అడిగితే ఆయనిలా అన్నారు.

'కొన్నాళ్ళు ఆ స్థితిలో నరేన్ ను ఉండనిద్దాం.అతనా స్థితిని ఎంతగానో కోరుకున్నాడు.త్వరలోనే అతన్ని క్రిందకు తెస్తాను.'

అన్నట్లుగానే కొద్ది నెలలలో నరేన్ తిరిగి మామూలు మనిషయ్యాడు.ఎవరి దగ్గరకూ వెళ్ళవలసిన పని ఆయనకు లేకపోయింది.సరియైన సమయంలో శ్రీరామకృష్ణులే ఆపని చేశారు.

ఆ సంగతి అలా ఉంచి - మళ్ళీ మన కధలోకి వద్దాం.

ఆ తర్వాత మేర్వాన్ మెహర్ బాబాగా రూపాంతరం చెందాడు. కానీ,తనకు దైవానుభూతిని కలిగించిన మహనీయురాలిగా బాబాజాన్ ను అమితంగా గౌరవించేవాడు. తను మొట్టమొదట పెట్టిన స్కూలుకు 'హజ్రత్ బాబాజాన్ స్కూల్' అని పేరు పెట్టడమే ఆయనకు ఆమె అంటే గల గౌరవానికి తార్కాణం.

ఆ తర్వాత బాబాజాన్ ఇంకొక 20 ఏళ్ళు బ్రతికింది.1931 లో ఆమె దేహాన్ని చాలించింది.ఈ లోపల మెహర్ బాబా ఎన్నో దేశాలు తిరిగాడు.ఎంతోమందికి ఆధ్యాత్మికంగా మేలును చేకూర్చాడు. దైవచైతన్యాన్ని ఎందరిలోనో రగిల్చాడు.ఇదంతా బాబాజాన్ చూచింది.తాను చెప్పినది జరగడం ఆమె కళ్ళారా వీక్షించింది.

మెహర్ బాబా పెద్దపెద్ద బంగళాలలో ఉన్నాడు.కార్లలో విమానాలలో ఓడలలో తిరిగాడు.దేశ విదేశాలలో ఎన్నో ఆశ్రమాలూ శాఖలూ స్థాపించాడు.లక్షలాది మంది ఆయన శిష్యులయ్యారు.కానీ బాబాజాన్ మాత్రం అదే వేపచెట్టుక్రింద అలాగే ఉండిపోయింది.ఆమెలో ఏమార్పూ రాలేదు.

తన శిష్యుడు లోకంలో ప్రసిద్ధ గురువైనా కూడా తాను మాత్రం మనసా వాచా కర్మణా దైవాన్ని మాత్రమే ఆశ్రయించిన ఒక దిక్కులేని నిరుపేదరాలే.తన బిడ్డ రాజభవంతులలో ఉన్నా, తాను మాత్రం వేపచెట్టు నీడలోనే ఉంటుంది.ఎప్పటికీ అలా ఉండటమే ఆమెకు ఇష్టం.

ఆమెను ఆ వేపచెట్టు కింద నుంచి వేరే చోటకు మార్చాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.చివరలో ఆమె సమాధిని అక్కడ కాకుండా వేరే ఒకచోట ఏర్పాటు చెయ్యాలని తలపోసిన మునిసిపల్ అధికారులు ఒక స్థలాన్ని ఆమె సమాధికోసం ఎంపిక చేసి ఆమె పర్మిషన్ కోసం అడిగారు.వారిని చూస్తూనే ఆమె ఆగ్రహంతో ఇలా అరిచింది.

'ప్రాణం లేని శవాలైన మీరంతా కలసి బ్రతికున్నవారికి సమాధి కడతారా? అదెక్కడుండాలో మీరు నిర్ణయిస్తారా? వెధవల్లారా? పొండి అవతలకు.'

దైవానుభూతిలో మేలుకుని ఉన్నవారే నిజానికి బ్రతికున్న వారు.ఆ అనుభూతికి దూరంగా లోకాకర్షణలలో చిక్కుకుని ఉన్నవారు ప్రాణంతో ఉన్నప్పటికీ చచ్చినవారి క్రిందే లెక్క. అలా చచ్చిన శవాలైన మనుషులు, దైవంలో లీనమై మేల్కొని ఉన్న మహనీయులకు సమాధిని కట్టిస్తారా? ఎంత విచిత్రం?ఈ లోకంలో ఇలాంటి విచిత్రాలే జరుగుతూ ఉంటాయి మరి.

ఏం చేస్తాం?
బాబాజాన్ 21-9-1931 న భాద్రపద మాసంలో శుక్ల ఏకాదశి రోజున కన్నుమూసింది.ఆ రోజున బృహస్పతి రాశిచక్రంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. చంద్రుడు ఆయనకు సమసప్తకంలో మకరంలో స్థితుడై ఆమె పొందిన అత్యున్నతమైన స్థితిని తెలియజేస్తున్నాడు.దాదాపు 125 సంవత్సరాల తన భౌతిక జీవితాన్ని ముగించిన బాబాజాన్ తను ఎవరికోసమైతే ఇన్నేళ్ళూ తపించిందో తన ప్రియతముడైన దైవంలో అటువంటి శుభదినాన లీనమై పోయింది.

శరద్విషువత్తుకు అది ఒకరోజు ముందు.ఆరోజున సూర్యుడు భూమధ్యరేఖను దాటి ఉత్తరం నుంచి దక్షిణానికి పయనం సాగిస్తాడు.ఖగోళపరంగా జ్యోతిష్యపరంగా ఇది ప్రపంచంలో ఒక ముఖ్యమైన రోజు.ఈ రోజు ప్రపంచంలో పగలూ రాత్రీ సమానంగా ఉంటాయి.హెచ్చు తగ్గులు ఉండవు.ప్రకృతి అంతా సమస్థితిలో ఉంటుంది.సుఖదుఖాలను మానావమానాలను ఆరోగ్య అనారోగ్యాలను ప్రకృతిమార్పులను అన్నింటినీ సమస్థితిలో ఉంటూ స్వీకరించి స్థితప్రజ్ఞస్థితిలో జీవితాన్ని గడపిన బాబాజాన్,ప్రకృతి సమస్థితిలో ఉన్న ఆ రోజున హెచ్చుతగ్గులు లేని అద్వితీయమైన దైవంలో శాశ్వతంగా లీనమైంది.

సమత్వమే దైవం అని అనడం లేదా భగవద్గీత?

మహనీయుల జీవితాలలో జరిగే ప్రతి ముఖ్య సంఘటన వెనుకా ఇలాంటి ఖగోళపరమైన జ్యోతిష్య పరమైన లింకులు దాగి ఉంటాయి.విశ్వానికీ వారికీ సూటి సంబంధం ఉండటమే దీనికి కారణం.విశ్వంలో జరిగే ప్రతి మార్పూ వారి జీవితంలో కూడా ప్రతిఫలిస్తూ ఉంటుంది.

బాబాజాన్ సమాధి నేటికీ పూనాలో కంటోన్మెంట్ ఏరియాలో అదే వేపచెట్టు క్రింద ఉన్నది.అయితే ఇప్పుడా ప్రదేశం ఒకప్పటి స్లం ఏరియా కాదు.చాలా బిజీ రోడ్ అయిపొయింది.అయితేనేం?లౌకిక తాపత్రయాలలో రాత్రీ పగలూ తలమునకలుగా ఉండి అజ్ఞానభ్రాంతిలో బురదలో పందులలాగా జీవితాలు గడుపుతున్న జనజీవనం మధ్యలో అదే వేపచెట్టు క్రింద ఉన్న బాబాజాన్ సమాధి ఈ పిచ్చిజనాన్ని చూస్తూ చిరునవ్వు నవ్వుతూ అదే విధంగా ఇప్పటికీ నిలబడి ఉన్నది.

"దైవంకోసం ఎలా బ్రతకాలో నా జీవితాన్ని చూచైనా నేర్చుకోండిరా పిచ్చివాళ్ళలారా?" అని ఆ సమాధి నుంచి బాబాజాన్ మనకు చెబుతున్నట్లు మీకు అనిపించడం లేదూ?

నాకైతే అలాగే అనిపిస్తోంది మరి !!