“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, ఫిబ్రవరి 2016, శుక్రవారం

అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 6 (త్రిపురాసుర సంహారం)

బాబాజాన్ తనను ముద్దు పెట్టుకోవడం వల్ల మేర్వాన్ తన శరీర స్పృహను కోల్పోయి మూడురోజులు నిశ్చేష్టుడై పడి ఉన్నాడనీ,ఆ తర్వాత కూడా ఆ స్థితి నుంచి పూర్తిగా బయటకు రావడానికి ఆయనకు తొమ్మిది నెలలు పట్టిందనీ ఇంతకు మునుపటి పోస్ట్ లో వ్రాశాను.

దానిని ఇంకొంచం వివరంగా చూద్దాం.

లోకంలో పుస్తకాల ద్వారా ఉపన్యాసకుల ద్వారా ప్రచారంలో ఉన్నది నిజమైన ఆధ్యాత్మికత అని లోకులు అనుకుంటూ భ్రమిస్తూ ఉంటారు.అది నిజం కాదు. నిజమైన ఆధ్యాత్మికతకు అన్నన్ని పుస్తకాల అవసరం లేదు.అన్నన్ని పూజలూ అన్నన్ని తంతులూ అవసరం లేదు.నిజంగా చెయ్యగలిగితే ఒక్క ముద్దుతోనే అంతా అయిపోతుంది.లేదా ఒక స్పర్శతో అంతా అయిపోతుంది.లేదా ఒక్క చూపుతో అంతా అయిపోతుంది.

ఇచ్చేవాడికి నిజంగా శక్తి ఉండాలి.తీసుకునేవాడికి అర్హత ఉండాలి.అంతే.ఈ రెండూ ఉన్నప్పుడు ఎటువంటి తంతులూ లేకుండా ఈ పని చాలా సింపుల్ గా అయిపోతుంది.ఈ రెండూ లేనప్పుడే పూజలూ హోమాలూ తంతులూ వ్రతాలూ నోములూ దీక్షలూ భజనలూ డాన్సులూ అరుపులూ అనవసరమైన గోలా అన్నీ ఉంటాయి.కానీ ఇన్ని చేసినా అక్కడ ఫలితం ఏమీ ఉండదు.

శ్రీరామకృష్ణుల జీవితంలో గమనిస్తే - ఆయన తన శిష్యులకూ భక్తులకూ ఇచ్చిన దర్శనాలూ సమాధిస్థితులూ అన్నీ కూడా - చూపుచే, స్పర్శచే, వాక్కుచే,తలపుచే -  అనే నాలుగు విధాలుగా ఉండటం మనం చూడవచ్చు.

కొంతమంది మీద ఆయన చూపు పడితే చాలు వెంటనే వారివారి ఇష్టదేవత ఎదురుగా నిలబడి వారికి కన్పించేది.శివానందస్వామికి ఆ విధంగా జరిగింది. ఇంకొంతమందికి ఆయన స్పర్శతో సమాధిస్థితి కలిగేది.వివేకానందస్వామికి ఆ విధంగా స్పర్శతో ఆ అనుభవం కలిగింది.విజ్ఞానానందస్వామికి కూడా స్పర్శతోనే సిద్ధి కలిగింది.కొంతమందిని ఆయన ఆశీర్వదిస్తూ - 'నీలో కుండలినీ జాగృతి కలుగుగాక' అనిన మరుక్షణంలో ఆ వ్యక్తిలో కుండలినీ జాగృతి కలిగేది.అద్భుతానందస్వామికి ఈ విధంగా జరిగింది.లేదా 'నీ ఇష్టదేవతా సాక్షాత్కారం కలుగుగాక'- అనిన ఉత్తరక్షణంలో వారి వారి ఇష్టదేవత ఎదురుగా నిలబడి కనిపించేది.కల్పతరు మహోత్సవం రోజున ఎంతోమందికి ఈ విధమైన దర్శనం కలిగింది.

ఇంకొంతమందికి ఈ మూడూ కూడా కాకుండా ఉత్త సంకల్పంతోనే ఆత్మసాక్షాత్కారాన్నీ దైవసాక్షాత్కారాన్నీ శ్రీరామక్రిష్ణులు కలిగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అయితే ఆయన ఈ వరాలను విచ్చలవిడిగా ఎవరికిబడితే వారికి ఇవ్వలేదు.ఆ అర్హతలు ఉన్నవారికే అవన్నీ ఇచ్చాడు. తట్టుకోగల శక్తి ఉన్నవారికే అవన్నీ ఇచ్చాడు.లేకుంటే ముందుగా ఆ తట్టుకునే శక్తిని వారికి కలిగించి ఆ తర్వాత అవి ప్రసాదించాడు.నిజమైన ఏ గురువైనా ఇదే చేస్తాడు.

కనుక, సిద్ధి అనేది ఒక్క క్షణంలోనే కలుగుతుంది.కానీ దానికి ఎన్నో జన్మల సాధన అవసరం అవుతుంది.దీపాన్ని వెలిగించే ప్రయత్నం ఎంతోసేపు చెయ్యవలసి ఉంటుంది.దీపం మాత్రం ఒక్క క్షణంలోనే వెలుగుతుంది.ఇదీ అంతే.

నూనెనూ వత్తినీ దీపాన్నీసమకూర్చుకుని వాటిని సరిగ్గా అమర్చి, దీపాన్ని శుభ్రం చేసుకుని, దీపంలో నూనెపోసి వత్తి అమర్చి,ఆ తర్వాత వత్తిని కొంచం సేపు నాననిచ్చి, అప్పుడు అగ్గిపుల్లతో వెలిగిస్తే ఆ దీపం వెలుగుతుంది.దీపం వెలగడానికి ఎంతసేపు పడుతుంది? ఒక్కక్షణం చాలు. ఒక్కక్షణంలో వత్తి అంటుకుని ఆ గది అంతా వెలుతురు పరచుకుంటుంది.కానీ ఆక్షణం కోసం అంతకు ముందు ఎన్నో గంటలు శ్రమించవలసి ఉంటుంది.

సాధన కూడా ఇంతే.సిద్ధి ఒక్క క్షణంలోనే కలుగుతుంది.కానీ దానికి ఎన్నో ఏళ్ళ నుంచీ మనల్ని మనం తయారు చేసుకోవలసి వస్తుంది.రాకెట్ టేకాఫ్ అయినప్పుడు ఒక్క క్షణంలోనే అంతా జరుగుతుంది.కానీ ఆ క్షణం కోసం ఎన్నో ఏళ్ళ నుంచీ దానికి ప్లానింగ్ చెయ్యవలసి ఉంటుంది.కావలసిన ఏర్పాట్లు అంచెలంచెలుగా చేసుకోవలసి ఉంటుంది.సాధన కూడా ఈ విధంగానే ఉంటుంది.అసలుపని ఒక్క క్షణంలోనే జరుగుతుంది.కానీ దానికి రెడీ కావడానికి మాత్రం చాలామందికి ఎన్నో జన్మలు పడుతుంది.

ప్రతి మనిషిలోనూ మూడు దేహాలుంటాయి.వాటినే స్థూల,సూక్ష్మ,కారణ దేహాలంటారు.శరీరమనేది స్థూలదేహం.మనస్సు ప్రాణం కలిసి సూక్ష్మశరీరం అనబడతాయి.జన్మజన్మలుగా మనలో పోగుపడి ఉన్న సంస్కారాలూ కోరికలూ వాంఛలూ అలవాట్లూ కారణశరీరం అనబడుతుంది.ప్రతిమనిషికీ ఈ మూడూ ఉంటాయి.మామూలు మనుషులు స్థూలదేహాన్ని చూడగలరు. సూక్ష్మ కారణ శరీరాలను చూడలేరు.అంతటి స్థితి వారికి ఉండదు.కానీ దివ్యచక్షువు ఉన్నవారు వాటిని కూడా దర్శించగలరు.వాటిని చూడటం ద్వారానే, ఒక మనిషి యొక్క గత జన్మలూ,ఆ జీవి యొక్క సంస్కారాలూ, సాధనామార్గంలో ఆ జీవికున్న అడ్డంకులూ,పాపపుణ్యాలూ అన్నీకూడా, అద్దంలో చూచినట్లు స్పష్టంగా వారికి అర్ధమౌతాయి.

ఈ మూడు దేహాలున్నట్లే ప్రతి మనిషికీ మూడు స్థితులున్నాయి.అవే జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు.వీనినే - మామూలు భాషలో - మెలకువ, కలలుగనే స్థితి,గాఢమైన నిద్ర అని అనుకోవచ్చు.ప్రతిమనిషీ ఈ మూడు స్థితులలోనే బందీగా పడి ఉంటాడు.వీటిని దాటి ఎప్పటికీ పైకి పోలేడు.వీటి పైన ఏముందో అతనికి అనుభవంలో ఉండదు.నిత్యజీవితంలో మనిషి పడే రొష్టంతా ఈ మూడు స్థితులలోనే ఉంటుంది.ఇంకా చెప్పాలంటే, జనసామాన్యంలో చాలామందికి కలతనిద్రే తప్ప గాడనిద్ర కూడా అనుభవంలో ఉండదు.

ఈ మూడు దేహాలనూ మూడు స్థితులనే త్రిపురములు (మూడు నగరములు) అని మనవాళ్ళు అన్నారు.ఈ మూడింటిలో ఉంటూ వీటిని నడిపిస్తున్న శక్తినే 'త్రిపుర సుందరి' అన్నారు.ఈ మూడింటి పైన ఉన్నదానిని చేరాలంటే ఈ మూడు పురాలనూ దాటిపోవాలి.ఈ ప్రక్రియనే 'త్రిపురాసుర సంహారం' అని పిలిచారు.ఈ వివరాలన్నీ 'శ్రీవిద్యా రహస్యం' లో యధోక్తంగా చర్చించాను.

ఈ మూడు స్థితులనూ దాటాలంటే రెండు షరతులు భర్తీ కావాలి.ఒకటి -నీ మూడు దేహాలూ దీనికి తయారుగా ఉండాలి.రెండు - అలా దాటించగల సమర్ధత కలిగిన గురువు నీకు తారసపడాలి.ఈ రెంటిలో దేనిలో లోటున్నా ఈ పని జరగదు.

అప్పటికే ఆ అనుభవం ఉన్న ఒక గురువు కటాక్షం లేకుండా ఈ మూటినీ దాటడం ఎవరికీ ఎన్నటికీ సాధ్యం కాదు.గురువు సహాయం లేకుండా ఈ పనిని సాధించేవారు ప్రపంచం మొత్తంలో ఒకరో ఇద్దరో ఉండవచ్చు.కానీ సామాన్య జనానికి మాత్రం ఈ పనికి ఒక గురువు అవసరం తప్పకుండా ఉంటుంది.గురుకటాక్షం లేకుండా ఈ పనిని సాధించడం అసాధ్యం.

మేర్వాన్ కు ఆ గురువు బాబాజాన్ రూపంలో వచ్చింది.తన ముద్దు ద్వారా ఈ మూడు స్థితులను ఒక్క క్షణంలో దాటించింది.అతని మూడు దేహాల స్పృహనూ ఒక్క క్షణంలో మాయం చేసేసింది.అతని నిజస్థితిలోకి అతన్ని ఒక్కసారిగా ప్రవేశపెట్టింది.కానీ ఆ చర్య వల్ల కలిగిన షాక్ ను ఆయన కూడా తట్టుకోలేక పోయాడు.
మేర్వాన్ దానికి సిద్ధంగానే ఉన్నాడు.అతని అంతరికస్థితి ఆ 'సడెన్ టేకాఫ్' కు రెడీ గానే ఉన్నది.12 సంవత్సరాలుగా అతనికి తెలీకుండా అతన్ని ఆ 'టేకాఫ్' కు సిద్ధం చేస్తూ అతను నివసిస్తున్న వీధిలోని వేపచెట్టు క్రింద బాబాజాన్ కూచుని ఉన్నది.ఈ పనిమీదే అసలామె పూనా నగరానికి వచ్చింది.ఆ క్షణంలో అతని దేహమూ మనస్సూ ప్రాణమూ మూడూ అందుకు సిద్ధంగానే ఉన్నాయి.అవలా సిద్ధంగా లేకుంటే ఆ 'షాక్' కు ఆ క్షణంలోనే అతను చనిపోయి ఉండేవాడు.అయినా కూడా అది జరిగినప్పుడు అతను తట్టుకోలేక తల్లక్రిందులై పోయాడు.

మేర్వాన్ ను బాబాజాన్ ఏదో కాకతాళీయంగా పిలవలేదు.ఆ పనికోసమే ఆమె పూనా వచ్చింది.ఎన్నో గతజన్మలలో మేర్వాన్ మంచి ఉన్నతమైన సాధకుడనీ ఎంతో అంతరిక పరిపక్వత చెందినవాడనీ ఆమెకు తెలుసు. మెహర్ బాబా జాతకం చూస్తే మనకు కూడా ఈ విషయం తేలికగా అర్ధమౌతుంది.పంచమ నవమాలలో గురువు, శని కేతువులున్న జాతకం సామాన్యమైనది ఎలా అవుతుంది?

కనుక ఆ అనుభవం మేర్వాన్ కు ఏదో కాకతాళీయంగా కలిగినది కాదు.ఆ సమయానికి అది రాసిపెట్టి ఉన్నది.అందుకోసమే మేర్వాన్ పుట్టాడు. అందుకోసమే బాబాజాన్ పూనా వచ్చింది.అంతరిక యాత్రలో అతనికి సహాయం చేసింది.

అసలా సమయంలో మేర్వాన్ కు ఏం అనుభూతి కలిగింది?

ఆ క్షణంలో తన మూడు దేహాలూ తాను కానన్న అనుభవం అతనికి హటాత్తుగా కలిగింది. ఈ మూడూ కాకుంటే మరేమిటి తాను? విశ్వమంతా నిండి ఉన్న ఒక స్పృహే తాను.నిజానికి అక్కడ విశ్వం యొక్క స్పృహ కూడా లేదు.ఉన్నది తానొక్కడే తను తప్ప ఇంకేమీ లేదు.ఆ స్పృహ ఒక సముద్రంలా ఒక నీలాకాశంలా అనంతంగా విస్తరించి ఉన్నది.అదే తాను. నేననే ఆ మహాసముద్రంలో ఒక చిన్న నీటి బిందువు తన భౌతిక శరీరం.

అంతేకాదు. మెలకువా, కలా, గాఢనిద్రా స్థితులను కూడా ఆయన ఆ సమయంలో దాటాడు.కన్నుమూసి తెరిచేలోపు మూడు దేహాలనూ మూడు స్థితులనూ దాటాడు.ఇది మాటలకందని ఒక మహాద్భుతమైన స్థితి. మాటలకు అవసరమైన నోరు భౌతికదేహంలో ఒక భాగమేగా? ఆ దేహాన్ని దాటిపోతే ఇంక మాటలెక్కడ ఉంటాయి?మాటలకు మూలం ఆలోచనలేగా? ఆ ఆలోచనల సమాహారం అయిన మనస్సును కూడా దాటిన స్థితిలో ఇంకేముంటుంది? అదొక అనిర్వచనీయమైన అద్భుతమైన పరిస్థితి.ఆ స్థితిలో నీవు లేవు.కానీ ఉన్నావు.నీకు తెలిసిన నువ్వుగా నువ్వక్కడ లేవు.ఇంకేదో అయిపోయిన స్థితిలోని నేనుగా ఉన్నావు.ఉండీ లేనట్టూ, లేకపోయినా ఉన్నట్టూ ఉన్నావు.ఉండటమూ లేకపోవడమూ ఏకకాలంలో అక్కడ ఉన్నాయి.ఈ అద్భుతం గురించే నా 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకంలో 'గ్రంధి భేదనం' అనే అధ్యాయంలో వివరించి ఉన్నాను.ఆరోజున మేర్వాన్ కు జరిగింది అదే.

మూడురోజుల పాటు మేర్వాన్ ఆ స్థితిలో మాటాపలుకూ లేకుండా పడి ఉన్నాడు.ఆ తర్వాత ఆ స్థితినుంచి క్రిందకు రావడానికి అతనికి తొమ్మిది నెలలకాలం పట్టింది.ఈ తొమ్మిది నెలలలో అతనికి తిండీ నిద్రా రెండూ లేవు.వీటిని నమ్మడం మామూలు మనుషులకు కష్టం అవుతుంది.వారీ విషయాలను ఏమాత్రం నమ్మలేరు.కానీ ఇవన్నీ నిజాలే.మామూలు ప్రపంచానికి అందని,తెలియని, రహస్యమైన ఒక లోకం ఇది.

తల్లి కడుపులో బిడ్డ కూడా తొమ్మిది నెలలే ఉంటుంది.అప్పటికి గాని దాని పెరుగుదల సక్రమంగా పూర్తికాదు.అలాగే ఈ స్థితిని పొందిన వ్యక్తికి కూడా ఆ పరిస్థితి స్టెబిలైజ్ అవడానికి తొమ్మిది నెలల కాలం పడుతుంది.ఒక్కొక్క దేహానికి మూడు నెలల సమయం చొప్పున, మూడు దేహాలకూ తొమ్మిది నెలల రూటింగ్ పీరియడ్ (నిలదొక్కుకునే ప్రక్రియ) ఈ మొత్తం వ్యవహారంలో అవసరం అవుతుంది.ఎందుకంటే నీకు ఇప్పటివరకూ తెలిసిన అన్ని అనుభవాలనూ ఈ కొత్త అనుభవం కూకటివేళ్ళతో పెకలించి అవతల పారేస్తుంది.నీకింతవరకూ తెలియని ఒక అద్భుతమైన లోకంలోకి అది నిన్ను హటాత్తుగా విసరివేస్తుంది.అదే నిజమైన కొత్తజన్మ.అదే అసలైన పునర్జన్మ. అందుకని, తొమ్మిది నెలలకు గాని మనిషి ఆ షాక్ నుంచి బయటకు రాలేడు. మేర్వాన్ కు కూడా అదే జరిగింది.

అలా క్రిందకు వచ్చిన తర్వాత, అటూ ఇటూ కాని త్రిశంకుస్వర్గం వంటి ఆ స్థితినుంచి మళ్ళీ అతన్ని మామూలు మనిషిని చెయ్యడానికి ఇంకొక గురువు అవసరం అవుతుంది.మేర్వాన్ కు ఆ పనిని చెయ్యడానికి దైవం ఏర్పాటు చేసిన గురువులలో ఒకరు, సాయిబాబా శిష్యుడైన ఉపాసనీ మహరాజ్.

ఉపాసనీ మహరాజ్ జీవితం గురించీ, ఆయన మేర్వాన్ పరిస్థితిని ఎలా చక్కదిద్దాడో అదంతా వచ్చే పోస్ట్ లో చూద్దాం.

(ఇంకా ఉంది)