నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

25, ఫిబ్రవరి 2016, గురువారం

అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 8 (జననకాల సంస్కరణ)


ఈ రోజు తేదీల ప్రకారం  మెహర్ బాబా జన్మదినం.మెహర్ బాబా జనన సమయాలు మనకు రెండు లభిస్తున్నాయని చెప్పాను.అవి 4.30 AM మరియు 5.00 AM.ఈ రెంటిలో ఏది సరియైన సమయమో లేదా ఈ రెండూ కూడా కాకుండా మూడోది ఏదైనా ఉన్నదేమో ఈరోజున మనం పరిశీలిద్దాం.

అయనాంశల విషయాని కొస్తే నేను లాహిరీ అయనాంశనే అనుసరిస్తాను.ఇతర అయనాంశలను నేను నమ్మను.ఈ అరగంటలో మూడు నవాంశలు,మకరం నుంచి మీనం       వరకూ మారుతాయి.ఈ మూడింటిలోనూ మకర నవాంశ అయితేనే ఈయన జీవితానికి సరిపోతుంది. కనుక మకర నవాంశను ఖాయం చెయ్యడం జరిగింది.ఈ నవాంశ 4.30 నుంచి 4.35 లోపు ఉదయిస్తుంది.కనుక ఈలోపే జనన సమయం ఉండాలి.

4.30 నుంచి 4.33 వరకూ వృషభ విమ్శాంశ ఉదయిస్తున్నది.అప్పుడు నీచభంగ గురువు నవమంలో ఉంటాడు.ఆ తర్వాత మిథున విమ్శాంశ అవుతుంది.అదైతే ఆయన జీవితానికి సరిపోదు కనుక ఈ మూడు నిముషాలలోనే జననం జరిగి ఉండాలి.రెండు మూడు నిముషాల వ్యవధిలో జననకాల సవరణ చెయ్యాలంటే షష్ట్యంశ స్థాయిని చూడాలి.ఎందుకంటే ఆ స్థాయిలో ప్రతి రెండు నిముషాలకూ లగ్నం మారిపోతుంది.

అందులో చూస్తే - 4.30 & 4.31 వృషభ లగ్నం అయింది.4.32 & 4.33 మిథునలగ్నం అయింది.కనుక రెండవ సెట్ సరియైన జనన సమయం అవుతుంది.ఎందుకంటే అప్పుడే ఆధ్యాత్మిక యోగాన్ని సూచిస్తూ నవమంలో శని శుక్రులు వస్తారు.

ఇకపోతే - చివరిగా - ఈ రెండు నిముషాలలో ఏది సరియైనదో చూడాలి.4.32 అయితే-హోరాలగ్నం నాలుగులోనూ, ఘటీలగ్నం ఆరులోనూ పడుతున్నాయి.ఈయన తల్లిదండ్రులు అంత ధనికులు కారు.ఈయనకు పేరుప్రఖ్యాతులు బాగానే ఉన్నాయి. కనుక ఇది సరికాదు.

4.33 అయితే,హోరాలగ్నం అయిదులోనూ ఘటీలగ్నం తొమ్మిదిలోనూ పడుతున్నాయి.ఈయనకు ధనం అంతా శిష్యులనుంచీ,లోకప్రసిద్ధి అంతా ఆధ్యాత్మికం వైపునుంచీ కలిగింది.కనుక 4.33 ఈయన యొక్క సరియైన జనన సమయం అని నేను నిర్ధారిస్తున్నాను.

ఈ సమయాన్ని ఇంకా శల్యపరీక్ష చెయ్యడానికి ఇంకొంత తతంగం ఉన్నది.ఈ సమయానికి జీవితంలోని ముఖ్య సంఘటనలు సరిపోతున్నాయా లేదా పరిశీలించాలి.ఈ పరిశీలనకు ఆయన జీవితం నుంచి ముఖ్యమైన కొన్ని సంఘటనలనూ తేదీలనూ తీసుకున్నాను.

అవేమిటంటే -

Date Event దశ
25-2-1894
జననం
రా-శు-శు-కు-శు
31-1-1969 మరణం శు-రా-సూ-గు
23-1-1922 మొదటి శిష్య బృందం చేరిక శ-బు-శ-గు
7-5-1924 నెలరోజుల ఉపవాసం శ-శు-కు-చం
10-7-1925 జీవితాంత మౌనం మొదలు శ-శు-శ-సూ
1-4-1928  మెహర్ బాబా కోసం
బాబాజాన్ రావడం
శ-చం-శ-గు
25-2-1943 తల్లి మరణం బు-చం-శ-బు
10-2-1954 అవతార ప్రకటన కే -సూ-గు-గు


జననం

శుక్రుడు పంచమాధిపతి. రాహువు పంచమంలో ఉన్న గురువుకు సూచకుడు. కుజుడు ఆత్మకారకుడు.కనుక ఆధ్యాత్మికయోగాలను సూచిస్తూ జనన సమయ దశ ఖచ్చితంగా సరిపోయింది.

మరణం

వక్రించిన శుక్రుడు లగ్నంలో ఉన్నాడు.రాహువు తృతీయవాసిగా సహజ మరణ కారకుడుగా దోషి. గురువు ఈ లగ్నానికి మంచివాడు కాదు.వ్యయాధిపతి.సూర్యుడు అష్టమాధిపతిగా మారకుడు.కాబట్టి మరణ దశ సరిపోయింది.

మొదటి శిష్య బృందం చేరిక

శని బుధులు తృతీయ నవమాలతో ఉన్న సంబంధం వల్ల ఆధ్యాత్మిక యోగ కారకులు.గురువు పంచమంలో ఉన్నాడు.

నెలరోజుల ఉపవాసం

శనిశుక్రదశ ప్రభావం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.చంద్రుడు సహజ ఆహార కారకుడుగా శనితో కలసి ఉపవాసాన్ని సూచిస్తున్నాడు.కుజుడు ఆత్మ కారకుడుగా తనంతట తాను ఆహారాన్ని మానుకోడాన్ని సూచిస్తున్నాడు.

జీవితాంత మౌనం

శని శుక్రుల దశలో ఇంకేం జరుగుతుంది? పైగా శుక్రుడు వక్రించి వాక్స్థానంలో ఉన్నాడు.సూర్యుడు అష్టమాదిపతిగా నష్టాన్ని సూచిస్తున్నాడు.

మెహర్ బాబా కోసం బాబాజాన్ రావడం

దశమంలో ఉన్న ఉచ్ఛశని-చంద్రులు గొప్పదైన ఆధ్యాత్మిక యోగాన్నిస్తున్నారు.పంచమంలో గురువే ఉన్నాడు.కనుకనే బాబాజాన్ ఈయన ఆశ్రమాన్ని వెదుక్కుంటూ ఆరోజున వచ్చింది.

తల్లి మరణం

తల్లిని సూచిస్తున్న చతుర్దానికి ద్వాదశంలో బుధుడు నీచలో ఉన్నాడు. మాత్రుకారకుడైన చంద్రుడు మారకునిగా శనితో కలసి దశమంలో ఉండి మాతృస్థానాన్ని చూస్తున్నాడు.కనుకనే ఈ దశలో తల్లి మరణం జరిగింది.

అవతార ప్రకటన

కేతువు నవమంలో ఉంటూ ఉచ్ఛబుధునికి సూచకుడుగా గొప్పదైన ఆధ్యాత్మికతను ఇస్తున్నాడు.సూర్యుడు అష్టమాధిపతిగా ద్వితీయంలో ఉంటూ నిగూఢమైన స్టేట్ మెంట్ ను చూపిస్తున్నాడు.గురువు పంచమంలో ఉన్నాడు.ఆయనకు విమ్శాంశలో నీచభంగం అయింది.కనుక ఆ రోజున అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చాడు.   

June 1924 -Dec 1924

ఈ సమయంలో తన శిష్యబృందంతో కలసి పశ్చిమ భారతం, దక్షిణ భారతాలలో ఈయన సంచరించాడు.యాత్రికులకు నమస్కరిస్తూ, కుష్టువారికి సేవచేస్తూ కాలం గడిపాడు. అప్పుడు శని-శుక్రదశలో రాహు, గురు అంతర్దశలు జరిగాయి.శని శుక్రదశలో రాజుకూడా బిచ్చగాడిలాగా దేశాలు పట్టుకుని తిరుగుతాడు.ఇక్కడా అదే జరిగింది.ఒక షెల్టర్ అనేది లేకుండా ఊరూరా తిరుగుతూ యాత్రికులకు నమస్కరిస్తూ కుష్టువారి వ్రణాలు కడుగుతూ కాలం గడపడం ఖచ్చితంగా ఈ దశా ప్రభావమే.

20-12-1927 -- 26-2-1928

శని-చంద్ర దశలలో గురు,శని అంతర్దశలు ఈ సమయంలో జరిగాయి.ఈ రెండు నెలలూ ఈయన ఒక నేలమాళిగ లాంటి గదిని తవ్వించుకుని అందులో ఉండిపోయాడు.ఆ సమయంలో అందులో కూచుని ఏదో పుస్తకం వ్రాసేవాడు. అదేమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.ఈ సమయంలో తన శిష్యబృందంలో అర్హులైన కొద్దిమందిని మాత్రమే ఎంచుకుని వారికి అంతరిక జీవనంలో ప్రత్యేకంగా మార్గదర్శనం చేశాడు.వారిలో చాలామందికి అతీతమైన సమాధి స్థితులూ, భావ పారవశ్యమూ కలిగాయి.వారిలో ఒక కుర్రవాడైతే ఏకంగా నాలుగురోజుల పాటు  సమాధిస్థితిలో ఉండిపోయాడు.ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు ఆ నేలమాళిగే ఆయన సమాధి అయ్యింది.

శనిచంద్రులు మౌనాన్నీ,తన ప్రపంచంలో తాను ఉండటాన్నీ,అంతర్ద్రుష్టినీ, ఇంట్రావర్ట్ స్వభావాన్నీ సూచిస్తున్నారు.ఈ సమయంలో ఖచ్చితంగా అదే జరిగింది.

15-5-1930:--ఈ రోజునుంచి మొదలుపెట్టి పంచగని గుహలో తనను తాను బంధించుకుని రెండువారాలు ఉపవాసదీక్షలో గడిపాడు.అప్పుడు శని-రాహు-రాహు దశ నడిచింది.శని రాహు దశ శపితదశ అని ఎన్నోసార్లు గతంలో వ్రాశాను.ఈయన జీవితంలో కూడా అదే జరిగింది.తనంతట తాను ఒక కొండమీద గుహలో వాలంటరీగా బందీగా ఉండి,తిండీ నీళ్ళూ లేకుండా రెండువారాలు ఉండటం ఈ దశాప్రభావం కాకపోతే మరేమిటి?ఇది జైల్లో పెట్టబడటంతో సమానమే.

26-1-1956 న కేతు-రాహు-శుక్ర-రాహు నడిచినప్పుడు గోదావరీ మాత ఆహ్వానం మేరకు సాకోరీ ఆశ్రమంలో వారం రోజులు నివసించి అందరికీ దర్శనం ఇచ్చాడు.

తృతీయ నవమాలలో ఉన్న రాహు కేతువుల వల్ల దగ్గరలోనే ఉన్న సాకోరీ ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న స్త్రీసాధకురాళ్ళకు ఉత్తేజాన్నిస్తూ ఒక వారం రోజులున్నాడు.రాహు శుక్రుల ప్రభావాన్ని ఇక్కడ గమనించాలి.

7-10-1954 న కేతు-చంద్ర-బుధ-శని దశ జరిగినప్పుడు ఇన్నాళ్ళూ తాను వాడుతున్న అక్షరాల పలకను పారవేసి సైగలద్వారా సూచించడం మొదలు పెట్టాడు.

బుధుడు నవమాధిపతి.కేతు చంద్ర శనులు ఈయన జాతకంలో లోతైన ఆధ్యాత్మికతకు సూచకులు.అందుకే తానిన్నాళ్ళూ వాడుతున్న ఆల్ఫాబెట్ బోర్డును పక్కన పెట్టి, ఆరోజునుంచీ ఊరకే సైగలు మాత్రం చేసేవాడు.

పై సంఘటనలన్నీ ఆయా దశలవారీగా 4.33 అనే సమయానికి ఖచ్చితంగా సరిపోతున్నందున,మెహర్ బాబా జనన సమయం ఉదయం 4 .33 అని నేను నిర్దారిస్తున్నాను.

(ఇంకా ఉన్నది)