“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, నవంబర్ 2015, బుధవారం

దీపావళిని ఇలా జరుపుకుని చూడండి

మనం చేసుకునే దీపావళి అసలైన దీపావళి కాదు.

దీనిలో టపాకాయల మోత తప్ప నిజమైన దీపాలు ఎక్కడా కనిపించవు.స్వచ్చమైన గాలిని సల్ఫర్,పొటాషియం,జింక్,ఫాస్ఫరస్ వంటి రసాయనాల పొగతో నింపడమూ, శబ్దకాలుష్యంతో, టన్నులకొద్దీ చెత్తతో పరిసరాలను పాడు చెయ్యడమే మనం చేస్తున్న దీపావళి.

నిజమైన దీపావళి ఇది కాదు.

అసలు మనం చేసే మతాచరణలన్నీ డొల్లలే.మనం ఆచరించే మతమూ అసలైనది కాదు.మనం చేసుకునే పండుగలూ మనం చేస్తున్న పూజలూ అసలైనవి కావు.మనవన్నీ కృత్రిమ జీవితాలే.నేను చెబుతున్నది పచ్చినిజం.

మన మతం మంచిదే.పండుగలు మంచివే.కానీ వాటిని ఎలా చేసుకోవాలో మనం మర్చిపోయాం.ఎలా వాటిని ఆచరించాలో అనుసరించాలో మనం వదిలేశాం.మనకిష్టమైన ధోరణిలో పోతూ అదే నిజం అనుకుంటున్నాం. అందరికీ అదే నేర్పుతున్నాం.ఎవరైనా తెలిసినవాళ్ళు 'ఇది కాదురా బాబూ' అని చెప్పినాకూడా వినే స్థితిలో మనం లేము.దీనినే అహంకారానికి అజ్ఞానానికీ పరాకాష్ట అంటారు.

నాకు 15 ఏళ్ళు వచ్చేసరికే టపాకాయలు కాల్చడం మీద నాకు ఇంటరెస్ట్ పోయింది.అదొక శుద్ధ అనవసర తంతులాగా నాకు అనిపించింది.ఈ టపాకాయలకూ ఈ పండుగకూ అసలేమిటి సంబంధం? అని నేను ఆలోచించాను.నాకేమీ రీజన్ కనిపించలేదు.పైగా కాలుష్యం కనిపించింది. తెలివిలేకుండా డబ్బును వృధాగా తగలెయ్యడం కనిపించింది.ఒకవైపు కొందరు ఆకలితో అల్లాడుతుంటే ఇంకొకవైపు ఇంకొందరు జల్సాలు చెయ్యడం కనిపించింది.అప్పటినుంచీ లోకం జరుపుకునే దీపావళిని నేను చెయ్యడం మానేశాను.ఇల్లు మొత్తం చీకటి చేసి, అంటే ఎలక్ట్రిక్ దీపాలు ఆపేసి,ఇంటిలో ప్రమిద దీపాలు మాత్రం వెలిగిస్తాను.రాత్రంతా నాకు వీలైనంతసేపు ధ్యానంలో గడుపుతాను.33 ఏళ్ళబాటుగా నేను చేస్తున్న దీపావళి ఇలా ఉంటుంది.

దీనిలో ఇంకొక కోణం కూడా ఉన్నది.దీపావళికి మనం లిటరల్ గా తగలేసే డబ్బుతో ఒక ఇండస్ట్రీ పెట్టి కొన్ని వేలమందిని బ్రతికించవచ్చు.నిజంగా ఆకలితో అలమటిస్తున్నవారి ఆకలి తీర్చవచ్చు.చదువుకోవాలన్న ఆశ ఉండి, డబ్బులు లేనివారిని చదివించవచ్చు.ఇంకా ఎన్నెన్నో చెయ్యవచ్చు.కానీ మనం ఆపనులు మాత్రం చెయ్యం.ఊరకే టపాకాయలు కాల్చి తగలెయ్యడానికి మాత్రం వేలకు వేలు వృధాగా ఖర్చు పెడతాం.

మొన్న మా ప్రెండ్ ఒకాయన ఇలా అన్నాడు.

'ఈసారి లక్షరూపాయలకు టపాకాయలు కొనబోతున్నాను.'

నాకు మతి పోయింది.

'ఎందుకలా?' అడిగాను.

'మన ఫ్రెండ్ ఫలానా నీకు తెలుసు కదా.ఆయన పోయినేడాది ఏభై వేలు పెట్టి గ్రాండ్ గా టపాకాయలు కాల్చాడు.మా వీధి వీధంతా మోత మోగిపోయింది. నేనేమన్నా తక్కువ తిన్నానా? ఈసారి నేను లక్షకు కొనబోతున్నాను.' అన్నాడు.

'మీరిద్దరూ కలసి దేంట్లోనైనా దూకండి.' అన్నాను.

'అదేంటి అలా అన్నావ్? అన్నాడు.

'అవును మరి.మీరు చదువుకున్నవాళ్ళే కదా.ఈ పిచ్చిగోలకు ఏమైనా అర్ధం ఉన్నదా?ఎప్పుడైనా ఆలోచించావా?వెర్రి వెర్రి అంటే వేలాం వెర్రి అన్నట్లు ఒకరిని చూసి ఒకళ్ళు వాతలు పెట్టుకోవడం తప్ప ఇందులో ఏదైనా ఉపయోగపడే పని ఉన్నదా? ఈ డబ్బును ఇంకొక మంచిపనికి సద్వినియోగం చెయ్యవచ్చు కదా.' అడిగాను.

'అదేంటి?దానికోసం మన సరదాలు మానుకోవడం ఎందుకు?' - లాజిక్ ఉపయోగించాడు.

'అసలెందుకు చేస్తున్నామో దాని ఉపయోగం ఏంటో తెలియని సరదాలు ఎందుకు?' అడిగాను.

'మనం దీపావళి మానేస్తే, టపాకాయలు తయారుచేసే కంపెనీలు మూతపడతాయి.వాటి వర్కర్స్ అందరూ రోడ్డున పడతారు.అది నీకు బాగుందా?' - ఈసారి అతి తెలివి ప్రయోగించాడు.

'ఓహో వాళ్ళకోసం నువ్వు చేస్తున్నావా?అలా అయితే వాళ్ళ కుటుంబాలలో కొన్నింటిని దత్తత తీసుకుని పోషించరాదూ బాగుంటుంది? మనుషులు వ్యభిచారం మానేస్తే రెడ్ లైట్ ఏరియాలన్నీ మూత పడతాయి పాపం.అందుకనేనా వాటిని అలా పోషిస్తున్నారు? ' అడిగాను.

'నువ్వు మాట్లాడుతున్నది ఏంటో నీకు అర్ధమయ్యే మాట్లాడుతున్నావా?దానికీ దీనికీ ఏమిటి సంబంధం?' అడిగాడు.

'నా దృష్టిలో - ఆ కొంపలకు పొయ్యేవాడికీ నీకూ పెద్ద తేడా లేదు.ఇద్దరూ చేస్తున్నది పనికిమాలిన పనే.' అన్నాను.

'నీ భావాలు నాకర్ధం కావులే నన్నొదిలెయ్యి.అయినా నేను నా డబ్బులేగా ఖర్చు చేస్తున్నది.లోకుల డబ్బులు కావుగా?నా సరదాకోసం నా కుటుంబసభ్యుల సరదాకోసం చేస్తున్నాను.తప్పేముంది?'అన్నాడు.

ఇక వీడితో అనవసరం అని మాట్లాడకుండా ఊరుకున్నాను.

చాలామంది ఇలాగే ఉంటారు.'నా' అన్న పరిధిని దాటి ఆలోచించలేరు.వీరిని చదువుకున్న మూర్ఖులంటారు.మన దేశంలో ఇలాంటి వాళ్ళే ఎక్కువ. వాళ్ళకర్ధం కాదు.మనం చెబితే వినరు.ఎప్పుడో తల బొప్పి కట్టినప్పుడు మాత్రమే వారికి సత్యం అర్ధమౌతుంది.అలా వాళ్ళంతట వాళ్లకు తెలిసేంతవరకూ మనం ఏమీ చెయ్యలేం.

ప్రతి దీపావళికీ మన దేశంలో పోగయ్యే వాతావరణ కాలుష్యం గనుక ఎంతో ఎవరైనా లెక్కవేస్తే గుండె గుభిల్లుమంటుంది. గాలిలోకి మనం వదిలే టన్నుల కొద్దీ రసాయనపొగ ఎంత ప్రమాదకరమో ఆలోచిస్తే ప్రకృతిని మనం ఎంత ఘోరంగా పాడు చేస్తున్నామో అర్ధమౌతుంది.

ఈ చలికాలంలోనే ఊపిరితిత్తుల రోగాలూ ఉబ్బస రోగాలూ ఎక్కువౌతాయి.ఈ సమయంలో ఆయా రోగులకు స్వచ్చమైన గాలి ఎంతో అవసరం.ఆక్సిజన్ ఎంతో అవసరం. మనమేం చేస్తున్నాం? స్వచ్చమైన గాలి వారికి దొరకకుండా రసాయనాల పొగలతో గాలిని నింపి దానిని పాడు చేస్తున్నాం.పోనీ అలా చెయ్యడం వల్ల మనకు ఒరుగుతున్నదేముంది  - రాక్షసానందం తప్ప.ఇలా గాలిని పాడుచెయ్యడం అవసరమా?

ప్రతి దీపావళి తర్వాత ఆస్మా,బ్రాంఖైటిస్,ఎంఫీసిమా మొదలైన ఊపిరి సంబంధ రోగాలు సమాజంలో సడన్ గా ఎక్కువౌతాయి.కావాలంటే గమనించండి.నేను చెబుతున్నదానిలో నిజం మీకే అర్ధమౌతుంది.

అసలిదంతా ఎందుకు చేస్తున్నామో ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? అసలీ పండుగ వెనుక ఉన్న అర్ధమూ అంతరార్ధమూ ఏమిటి?ఇన్ని టపాకాయలు కాల్చడం అవసరమా?ఇంత గోలా ఇంత శబ్దకాలుష్యమూ ఇంత వాతావరణ కాలుష్యమూ నిజంగా అవసరమా? ఇలాకాకుండా అసలైన విధంలో చక్కగా ఈ పండుగను చేసుకోలేమా?

దేశానికి గానీ మనకు గానీ ప్రకృతికి గానీ ఈ గోలవల్ల ఏమిటి ప్రయోజనం?ఏమీలేదు.ఏమీ లేనప్పుడు మరెందుకు ఇంత హంగామా చెయ్యడం? అంటే - ఏమో? అన్నీ తెలుసు.కానీ డబ్బులు తగలెయ్యకుండా ఉండలేం. అలా ఉంటె నలుగురిలో చులకనైపోతాం అనే సమాధానం వస్తుంది.

మనం బ్రతుకుతున్నది నలుగురికోసమా లేక మనకోసమా?

నిజమైన దీపావళికి టపాకాయలతో ఏమాత్రం సంబంధం లేదు.దీపాలతో సంబంధం ఉన్నది.దీపావళి పేరులోనే ఉన్నది 'దీపం' అని.దీపాలు వెలిగించి చీకటిని తొలగించడమే నిజమైన దీపావళి.ఆ దీపాలను బయటా లోపలా కూడా వెలిగించాలి.బయట దీపాలను ప్రమిదలతో వెలిగిస్తాం.లోపలి దీపాలను ధ్యానంతో వెలిగిస్తాం.అలా చెయ్యడమే నిజమైన దీపావళి.

దీపావళి రాత్రిపూట మన దేశం అంతా అందరి ఇళ్ళలోనూ దీపాలు వెలుగుతూ, ఏ విధమైన టపాకాయల మోతా లేకుండా,ప్రతి ఇంటిలోనూ అందరూ మౌనంగా ధ్యానమగ్నులై తమలోపల కూడా దీపాలు వెలిగించి అంత:తిమిరాన్ని తొలగించుకుని - ఆ విధంగా దీపావళి జరుగుతుంటే చూడాలని నా కోరిక.

ఈ కోరిక ఈ జన్మకు తీరదని నాకు తెలుసు.ప్రకృతి అంత త్వరగా అందరికీ జ్ఞానప్రసాదాన్ని ఇవ్వదనీ నాకు తెలుసు.ఈ లోకం ఏకమొత్తంగా మంచిగా ఎప్పుడూ మారదనీ,జ్ఞానం వైపు ఎదగదనీ,చెప్పినా వినదనీ, ఎక్కడో కొందరు ఆలోచనాపరులు మాత్రమే సత్యాన్ని అనుసరిస్తారనీ, మిగతావారంతా మొండిమూర్ఖులేననీ కూడా నాకు తెలుసు.

అన్నీ తెలిసినా కొన్ని కోరికలు అంత త్వరగా తొలగిపోవుగా !

ఏం చేస్తాం?

కనీసం నన్ను అనుసరిస్తున్న 'పంచవటి' సభ్యులనైనా ఈ విధంగా నిజమైన దీపావళిని జరుపుకోమనీ,లోకంలో అందరూ చేస్తున్న పిచ్చి దీపావళిని జరుపుకోవద్దనీ కోరుతున్నాను.