“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, నవంబర్ 2015, బుధవారం

మర్మవిద్య

మార్షల్ ఆర్ట్స్ లో అత్యున్నత శిఖరాగ్రంలాంటిది - మర్మవిద్య.

ఇది అతి ప్రాచీనకాలంలో మన దేశంలో ఉండేది.మన చేతగానితనం వల్ల, అనేక మన ప్రాచీనవిద్యలలాగే ఇదీ అంతరించిపోయింది.కేరళలో మాత్రం అక్కడక్కడా అతి కొద్దిమంది మాస్టర్స్ దగ్గర ఉన్నది.నేడు చైనాలో జపాన్ లో కూడా ఈ విద్య అక్కడక్కడా మాత్రమే బ్రతికి ఉన్నది.చైనాలో దీనిని Dim Mak Kung Fu(Death Touch) అంటారు.ఈ విద్యను లోతుగా తెలిసిన మాస్టర్లు దీనిని అంత త్వరగా ఎవరికీ చెప్పరు.నేర్పరు.రహస్యంగా తమలోనే ఉంచుకుంటారు.

కారణం?

ఈ విద్య బాగావస్తే, ఉత్త వేళ్ళతో ఒక్క క్షణంలో ఒక మనిషిని చంపేసెయ్యవచ్చు.లేదా పదే పది నిముషాలలో అతనికి పక్షవాతం వచ్చేలా చెయ్యవచ్చు.లేదా అతను క్రమేణా క్షీణించి ఒక ఆరునెలల తర్వాత చనిపోయేలా చెయ్యవచ్చు.ఇదంతా వినడానికి వింతగా అసాధ్యంగా అనిపించవచ్చు.కానీ ఇది నిజం.అందుకే దీనిని మర్మవిద్య అంటారు.

మనుషులలో స్వార్ధపరులు ఎక్కువ. మోసగాళ్ళూ చిత్తశుద్ధి లేనివాళ్ళూ ఎక్కువ.అలాంటి వాళ్లకు ఈ విద్యను నేర్పిస్తే, వాళ్ళు వాళ్ళ స్వార్ధానికి ఈ విద్యను వాడవచ్చు.దీనితో ఎందరికో హాని కలిగించవచ్చు.ఏ ఆధారమూ దొరకని పద్ధతిలో సైలెంట్ గా ఎంతోమందిని చంపవచ్చు కూడా.అప్పుడా పాపం అంతా ఆ నేర్పించిన మాస్టర్ కు చుట్టుకుంటుంది.అందుకే ఎవరికి బడితే వారికి ఈ విద్యను నేర్పడం జరగదు.అది చైనా కావచ్చు,జపాన్ కావచ్చు,లేదా ఇండియా కావచ్చు.ఎక్కడైనా నిజమైన మాస్టర్లు ఇదే సూత్రాన్ని పాటిస్తారు.నికార్సైన వ్యక్తిత్వమూ నూటికి నూరుపాళ్ళు నిజాయితీ ఉన్న శిష్యులకే దీనిని నేర్పడం జరుగుతుంది.అలాంటి వాళ్ళు ఒకవేళ దొరకకపోతే ఈ విద్య ఆ మాస్టర్ తోనే అంతరించి పోతుంది అంతేగాని అర్హతలు లేనివారికి ఇది ఎన్నటికీ నేర్పబడదు.

"డిం మాక్ కుంగ్ ఫూ" లో రెండు రకాలున్నాయి.ఒకటి బిగ్ హ్యాండ్.రెండు స్మాల్ హ్యాండ్.మొదటి పధ్ధతి యాంగ్ శక్తిని ఉపయోగిస్తుంది.దీని ప్రభావం వెంటనే కనిపిస్తుంది.దెబ్బ తగిలిన కొద్ది సెకండ్లలో మనిషి కిందపడి గిలగిలా కొట్టుకుని మరణిస్తాడు.లేదా కోమాలోకి వెళ్ళిపోతాడు.లేదా పక్షవాతానికి గురౌతాడు.రెండవది యిన్ శక్తిని ఉపయోగిస్తుంది.దీని ప్రభావం వెంటనే కనిపించదు.కానీ కొద్ది గంటల నుంచి కొన్ని రోజుల తర్వాత క్రమేణా శరీరంలో దీని లక్షణాలు కనిపించడం మొదలౌతుంది.ఈ లక్షణాలు ఏ మందులకూ తగ్గవు.క్రమేణా ఆ వ్యక్తి క్షీణిస్తూ మరణానికి దగ్గరై చనిపోతాడు.ఏ టెస్టులలోనూ ఏమీ దొరకదు.

మర్మఘాత ప్రయోగం జరిగిన వ్యక్తిలో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి.

>దెబ్బ తగిలిన ప్రదేశం వెంటనే మొద్దుబారినట్లు,తిమ్మిరెక్కినట్లు,లేదా చచ్చుబడినట్లు అనిపిస్తుంది.ఆ ప్రదేశం అంతా కందిపోయి ఎర్రగా అవుతుంది.

>తలతిరుగుతున్నట్లు,పొట్టలో త్రిప్పుతున్నట్లు,వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది.

>ఊపిరి పీల్చుకోవడం కష్టమౌతుంది.గుండె పట్టేసినట్లు అనిపిస్తుంది.

>బలవంతాన ఊపిరి పీల్చుకుంటే దెబ్బ తగిలిన చోట విపరీతమైన నొప్పి కలుగుతుంది.

>ఒళ్లంతా దిగచెమటలు పడతాయి.

>విపరీతమైన నిస్సత్తువగా అనిపించి,కాళ్ళు అసలు ఉన్నాయో లేవో అనిపిస్తూ, నిలబడటమే అసంభవం అవుతుంది.మనిషి జావగారినట్లు కుప్పకూలిపోతాడు.

>కళ్ళముందు నల్లటి వలయాలుగా తిరుగుతున్నట్లు,చూస్తున్న ప్రదేశం గిర్రున తిరిగిపోతున్నట్లు అనిపిస్తుంది.కొన్ని దెబ్బలలో కళ్ళముందు sudden blackout అవుతుంది. 

ఇదంతా ఎలా సాధ్యం అనుకుంటున్నారా? సాధ్యమే.

మనిషి శరీరంలో 360 (Vital Points) మర్మస్థానాలున్నాయి.వాటిల్లో ఒక్కొక్కదానిని కొడితే లేక తడితే ఒక్కొక్క రకమైన ప్రభావం ఆ మనిషిలో కనిపిస్తుంది.కొన్ని వెంటనే పనిచేస్తాయి.కొన్ని స్లో పాయిజన్ లాగా నిదానంగా పనిచేస్తాయి.వీటిల్లో మళ్ళీ 108 మర్మస్థానాలు ముఖ్యమైనవి.మళ్ళీ వీటిల్లో 36 మర్మస్థానాలు మరీ ముఖ్యమైనవి.ఈ 36 మర్మస్థానాలు తక్షణ మరణాన్ని (Instant Death) ను కొనితెస్తాయి.మిగిలిన 72 చావుకంటే ఇంకొంచం తక్కువ స్థాయి (అంటే కోమా, పక్షవాతం,స్పృహ తప్పి పడిపోవడం వంటి) ప్రభావాలను కలిగిస్తాయి.మనిషి శరీరంలో ఈ మర్మస్థానాలనేవి ఎక్కడున్నాయో ఫీలవడం,ఒక్కొక్కదానిని విడివిడిగా గుర్తించడం,వాటిని ఒక్కొక్కదానిని ఏ యాంగిల్ లో ఎంత ఫోర్స్ తో కొట్టాలి? దానికి ఏ రకమైన ఫోర్స్ ను వాడాలి?ఎంత ప్రాణశక్తిని అప్పుడు ఉపయోగించాలి?ఎలా ఉపయోగించాలి?ఆ ప్రాణశక్తిని ఎక్కడనుంచి తీసుకురావాలి?అన్న విషయాలు ప్రాక్టికల్ గా నేర్చుకోవడమే మర్మవిద్య.

దెబ్బ తిన్న మనిషిని తిరిగి స్పృహలోకి రప్పించడం లేదా చావుకు దగ్గరగా ఉన్న వ్యక్తిని వెనక్కు తీసుకురావడం (Revival methods) అనేవి ఈ విద్యలో ఉన్నత స్థాయులు.ఇవి చాలా కష్టమైన ప్రక్రియలు.కానీ ఇవన్నీ నిజాలే.

ఈ విద్య బాగా రావడానికి కనీసం 12 సంవత్సరాల కఠోర సాధన అవసరం అవుతుంది.ఈ సాధన కరాటే కుంగ్ ఫూ స్కూళ్ళలో చేసే ప్రాక్టీస్ కు పూర్తి విభిన్నంగా ఉంటుంది.మామూలు మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ లు కూడా మర్మవిద్య వచ్చిన మాస్టర్ ముందు ఎందుకూ పనికిరారు. మర్మవిద్య అంత ప్రమాదకరమైనది. ఇది బాగా వస్తే, ఒక చిన్న దెబ్బతో మనిషిని స్పాట్ లో కుప్పకూలి చనిపోయేలా చెయ్యవచ్చు.అంత చిన్నదెబ్బ అంత ఎఫెక్ట్ ను ఎలా తెస్తుందా? అని చూచేవాళ్ళు నిర్ఘాంతపోతారు.

కానీ ఈ విద్య వచ్చినవాళ్ళు దీనిని నూటికి 99 శాతం ఉపయోగించరు. ఎందుకంటే - ఎదుటి మనిషికి హాని చెయ్యడం అనే ఉద్దేశ్యం ఉన్నవారికి ఈ విద్య నేర్పబడదు.నేర్చుకున్నా పట్టుబడదు.దీనిని నేర్చుకున్న వారు సాధారణంగా ఎదుటి మనిషిని తాకడానికి కూడా ఇష్టపడరు.ఎందుకంటే ఎదుటి మనిషి శరీరంలోని మర్మస్థానాలు (Vital Nerve Centers) వారికి కనిపిస్తూ ఉంటాయి.పొరపాటున దేనిని తాకితే ఏమౌతుందో అన్న భయం వారిలో ఉంటుంది.వీరు ఎక్కడ బడితే అక్కడ ఫైటింగ్ కు కూడా దిగరు.వారిని ఒక ఫైట్ కు రమ్మని రెచ్చగొట్టడమూ కష్టమే.వారు అంత తేలికగా రెచ్చగొట్టబడరు.

మరి వాడనప్పుడు అంత కష్టపడి దీనిని నేర్చుకోవడం ఎందుకు అని అనుమానం రావచ్చు.దీనిని నేర్చుకోవడం వల్ల ఇతర ఉపయోగాలున్నాయి. ఈ అభ్యాసాలవల్ల మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది.ముసలి వయసులో కూడా ఎవరిమీదా ఆధారపడకుండా ఏ మందులూ అనవసరంగా వాడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. 90 ఏళ్ళ వయసులో కూడా బీపీ షుగరూ ధైరాయిడూ కీళ్ళనొప్పులూ గుండెజబ్బులూ ఊపిరితిత్తుల రోగాలూ కిడ్నీ రోగాలూ ఇలాటి రోగాలు ఏవీ లేకుండా హాయిగా బ్రతకవచ్చు.మానసికంగా ఎలాంటి చీకాకులూ లేకుండా ఎంతో ఉల్లాసంగా ఉండవచ్చు. ఈ ఉపయోగాలు చాలవూ? అసలు ఇతరులను కొట్టవలసిన అవసరం ఏముంది?

విశ్వంలోనూ తన శరీరంలోనూ ఉన్న ప్రాణశక్తిని కంట్రోల్ చెయ్యడం, ఆ శక్తిని శరీరంలోని అన్ని భాగాలకూ తిప్పడం,బయటికి ఫోకస్ చెయ్యడం,తిరిగి దేహంలోకి తీసుకోవడం మొదలైన ప్రక్రియలు ఈ సాధనలో ఉంటాయి. అందుకే ఇది మన యోగసాధనకూ తంత్రసాధనకూ చాలా దగ్గరగా వస్తుంది. ఉన్నతస్థాయిలలో యోగమూ - తంత్రమూ - మర్మవిద్యా ఈ మూడూ ఒక్కటే అయిపోతాయి.అందుకే దీనిని నేర్చుకున్న వ్యక్తి జీవితమే సమూలంగా మారిపోతుంది.అతను ఒక మర్మయోగిగా మారిపోతాడు.ఎంతో పూర్వపుణ్యమూ ఎంతో అదృష్టమూ ఉంటే తప్ప ఈ విద్యను  నేర్చుకునే అవకాశం అందరికీ రాదు.

నాలుగేళ్లనుంచి చాలా సూక్ష్మంగా పరీక్ష చేసిన మీదట నన్ను అనుసరిస్తున్నవారిలో కొందరిని మాత్రం ఈ విద్య నేర్చుకోవడానికి అర్హులుగా సెలెక్ట్ చేశాను.పంచవటి గ్రూపులో నన్ను ఎంతో శ్రద్ధతో అనుసరిస్తున్న ఆరుగురు సభ్యులకు మాత్రం వచ్చే ఆదివారం నుంచీ ఈ మర్మవిద్యా క్లాస్ గుంటూరులో మొదలు పెడుతున్నాను.