“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

18, ఫిబ్రవరి 2015, బుధవారం

Telugu Melodies-PB Srinivas-ఆనాటి చెలిమి ఒక కల...




ఎంతసేపూ హిందీ పాటలు పాడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, తెలుగు పాటలు అసలు లేవా అని కొందరు మహిళా వీరాభిమానులకు అభిమానం దెబ్బతిని నామీద కోపంగా మారుతున్నది.

ఆడవారి కోపానికి గురికావడం మంచిదికాదు గనుక,వారిని శాంతింప జెయ్యడానికి ఈ తెలుగు పాటను పాడుతున్నాను.

ఆనాటి చెలిమి ఒక కల...కల కాదు నిజము ఈ కధ...అంటూ పీ బీ శ్రీనివాస్ గళంలో నుంచి జాలువారిన ఒక శక్తివంతమైన పాట ఇది.

అప్పట్లో ఇది ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ కిందే లెక్క.కానీ పాట భావం మాత్రం ఒక సెమీ విషాదగీతాన్నే తలపిస్తుంది.వెరసి దీనిని ఒక ఫిలసాఫికల్ గీతంగా చెప్పుకోవచ్చు.

ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక సమయంలో 'మనసులోని మమతలను మరచిపోలేక' బాధపడే రోజు ఉంటుంది.ఆ విధంగా చూస్తే ప్రతి మనిషీ ఈ పాటతో హృదయ తాదాత్మ్యతను తప్పకుండా పొందుతాడు.

అందుకే ఇప్పటికీ ఈ గీతం ఒక మధురగీతంగా నిలిచి పోయింది.

పైగా,"చందమామే రానినాడు లేదులే వెన్నెల" అనే మాటలున్న పాటని అనుకోకుండా అమావాస్య రోజునే పాడటం వెనుక గ్రహప్రభావం తప్పకుండా ఉందని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.

మానవ జీవితంపై గ్రహప్రభావానికి ఇది ఇంకొక ఉదాహరణ.

:)

చిత్రం:--పెళ్లిరోజు(1968)
రచన:--రాజశ్రీ
సంగీతం:-ఎం.బి.శ్రీరాం.
గానం:--పీ.బీ.శ్రీనివాస్.
కరావోకే గానం:--సత్యనారాయణ శర్మ

ఈ సినిమాలో హరనాథ్,జమునా జంటగా నటించారు.

ఈ పాటకి సంగీతాన్ని సమకూర్చిన ఎం.బీ.శ్రీరాం అనే ఆయన ప్రముఖ వైణికుడు ఈమని శంకరశాస్త్రిగారికి మేనల్లుడు.ఈయనా పీ బీ శ్రీనివాస్ గారూ స్నేహితులు.ఇద్దరూ ఒకే రకమైన టోపీలు పెట్టుకుని ఉండేవారు. అందుకే, ఇద్దరూ కలసి ఏదైనా ఫంక్షన్ కి వెళితే ఎవరు ఎవరో పోల్చుకోవడం కొత్తవాళ్ళకి కొంచం కష్టం అయ్యేదట.

విని ఆనందించండి.
---------------------------------------------------------------
ఆనాటి చెలిమి ఒక కల
కల కాదు నిజము ఈ కథ
మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా?
ఆనాటి చెలిమి ఒక కల

మనసనేదే లేనినాడు మనిషికేది వెల-2

మమతనేదే లేనినాడు మనసుకాదది శిల
ఆనాటి చెలిమి ఒక కల
కల కాదు నిజము ఈ కథ

చందమామే రానినాడు లేదులే వెన్నెల-2

ప్రేమనేదే లేనినాడు బ్రతుకులే వెలవెల
ఆనాటి చెలిమి ఒక కల
కల కాదు నిజము ఈ కథ

ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం-2

పరిచయాలు అనుభవాలు గురుతుచేయును గతం
ఆనాటి చెలిమి ఒక కల
కల కాదు నిజము ఈ కథ
మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా?

మరచిపోవుట ఎలా?

మరచిపోవుట ఎలా?