“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, జూన్ 2014, ఆదివారం

వింతలోకం

1.
తే||పెట్టి పుట్టుదురిచ్చట పెద్దలగుచు
గోసుమీరగ లోకులు గొప్పలంది
పుట్టి పెట్టకపోయిన ఫలము లేదు
పుట్టగతులను గాంచరు పుడమిలోన

పూర్వపుణ్య బలం వల్ల ఈ జన్మలో అన్నీ అమరిన జన్మ కలుగుతుంది.కానీ అంతటితో గర్వాన్ని పెంచుకొని,ఇప్పుడు దాతృత్వాన్ని కలిగి ఉండక, ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యక,విలాసాలలో కాలం గడిపితే, ముందు జన్మలలో పుణ్యబలం తగ్గి ఘోరమైన పరిస్థితులలో పుట్టడం జరుగుతుంది. 

2.
కం||పుట్టిన చాలదు భువిలో
పుట్టిన దానికి పరులకు పెట్టగ వలయున్
పుట్టియు పెట్టని వారలు
పుట్టలవలె చెదలుబట్టి పోదురు సత్యా

ఈలోకంలో పుట్టడం గొప్పకాదు.పుట్టినడానికి నలుగురికీ చేతనైనంత సహాయం చెయ్యాలి.పుట్టికూడా పెట్టనివారు చెదలు బట్టిన పుట్టలవలె నిరర్ధకులౌతారు.

3.
ఆ||చేసికొన్న కర్మ చెల్లించవలెగాదె
రాజులైన వీతరాగులైన
కర్మపట్టి నడపు మర్మంపు రీతులన్
కర్మ దాటువాడె గట్టివాడు

చేసికొన్న కర్మ ఎంతటివారినీ వదలిపెట్టదు.అది రాజులైనా విరాగులైనా ఎవరు చేసిన కర్మను వారనుభవించక తప్పదు.పూర్వకర్మ చాలా విచిత్రమైన రీతులలో మనిషిని నడిపిస్తుంది.ఆ కర్మగతిని అర్ధం చేసుకొని దానిని జయించిన వాడే నిజమైన ఘనుడు.

4.
ఆ||మదము నిండియున్న మనుజుడెప్పుడు గాని
మంచిమాట లాలకించబోడు
కాలమెదురు వచ్చు కల్లోల సమయాన
కుమిలి ఏడ్చుకొనుచు కుందుగాని

మదం నిండి యున్నపుడు మంచిమాటలు చెప్పినా రుచించవు.కానీ కాలం ఎదురు తిరిగి ఆ మదం మాయమైన రోజున ఏడ్వవలసి వస్తుంది.కాలం ఎవరినీ ఎల్లకాలం చక్కగా చూడదు.

5.
ఆ||కూడబెట్టువారు ఖర్చుజేసెడివారు
వేచిచూచువారు వెరయువారు
జగమునందు నిండు జనసమూహము లెల్ల
దిక్కు దెలియలేక సొక్కువారు

ఈ లోకంలో నాలుగు రకాలైన మనుష్యులున్నారు.

1.కర్మను కూడబెట్టుకుంటున్నవారు.
2.కర్మను ఖర్చు చేస్తున్నవారు.
3.భయంతో జాగ్రత్తగా కర్మను చేస్తున్నవారు.
4.ఏమీ చెయ్యకుండా వేచిచూస్తున్నవారు.

వెరసి వీరెవరూ కర్మరహస్యాన్ని అర్ధం చేసుకున్నవారు కారు.

6.
ఆ||బలిమి యున్ననాడు బంబోతుగా నిల్చు
బలిమి దప్పునాడు బొగిలి ఏడ్చు
హీనులైనవారి మానంబులీ తీరు
సమత నిల్చువాడె సజ్జనుండు

బలం ఉన్నపుడు అట్టహాసంగా విర్రవీగుతారు.బలం పోయినపుడు భోరున ఏడుస్తారు.హీనమనుష్యుల తీరు ఇలాగే ఉంటుంది.ఉన్నా లేకున్నా సమత్వంలో ఉన్నవాడే సజ్జనుడు.

7.
ఆ||ఉన్ననాడు జూడ నువ్వెత్తుగా లేచి
లేనినాడు సొక్కు లౌకికునకు
కర్మచిత్రమెట్లు కనవచ్చు?నిలలోన
కాలుసేతులెల్ల గట్టియుండ

ధనం ఉన్నపుడు గర్వంతో విర్రవీగి,లేనప్పుడు కుంగిపోయే లోకులకు కర్మరహస్యాలు ఎలా అర్ధమౌతాయి?వారి కాళ్ళూ చేతులు కర్మ అనే బలమైన త్రాళ్ళతో కట్టివేయబడి ఉన్నాయి.కనుక వారు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోలేరు.

8.
ఆ||బాధలందుగాని బయలంద రాబోడు
విసిగి ఏడ్చుగాని విడువబోడు
లొట్టిపిట్ట మేయు గట్టి కంటకముల
నోరు కోతబడిన నొచ్చుకొనక

నానాబాధలూ పడుతూ సంసార సముద్రంలో మునకలేస్తూ ఏడుస్తూ ఉంటారుగానీ లౌకికులు దానిని వదలిపెట్టరు.బయటకు రారు.తన నోరు చీరుకొని పోయి రక్తమోడుతున్నా కూడా ఒంటె, ముళ్ళను మేస్తూనే ఉంటుంది గాని విడచిపెట్టదు.

9.
 ఆ||కర్మదగులువాడు కల్ల మీరగలేడు
కల్లమీరబోక కడమ రాదు
కల్లకర్మ నెల్ల కమనీయముగమార్చు
పరుసవేది నంద పట్టుజిక్కు

కర్మజాలంలో చిక్కుకున్నవాడు అసత్యపు పట్టునుంచి బయట పడలేడు. అసత్యాన్ని వదలకపోతే సత్యం అందదు.కల్లయైన కర్మను సుకర్మగా మార్చే పరుసవేదిని పట్టుకుంటే అప్పుడు కర్మరహస్యం అర్ధమౌతుంది.

10.
కం||నానా బాధల నందుచు
హీనంబుల వెంట దిరుగు హీనాత్ములకున్
కానగ వచ్చునె మోక్షము?
దీనాంధుడు గానలేని దినకరు పగిదిన్

గుడ్డివాడు సూర్యుని ఎలాగైతే చూడలేడో అలాగే,హీనమైన విషయాల వెంట పరువెత్తే హీనాత్ములు మోక్షమును ఎలా చూడగలరు?దానికోసం ఎలా ప్రయత్నం చెయ్యగలరు? చెయ్యలేరు.

11.
ఆ||ఏండ్లు బెరుగునంచు హెచ్చులందుటె గాని
ఆయువణగు నంచు నెరుగలేరు
బంధనముల దగిలి భేషజమ్ములె గాని
మోసపోతిరన్న మాటవినరు

వయస్సు పెరుగుతున్నదని పొంగిపోవడమేగాని ఆయువు హరించుకు పోతున్నదని గ్రహించరు లోకులు.రకరకాలైన బంధాలలో చిక్కుకుని విర్ర వీగడమేగాని అనుక్షణమూ మోసగింపబడుతున్నామన్న విషయం వారికి స్ఫురించదు.

12.
కం||నావారలు నావారని
జీవితమంతయు జెలగిన చిత్రపు రీతుల్
జీవన్మరణపు ఘడియల
వివరంబుగ దెలియవచ్చు వడిజను వేళన్

నావాళ్ళు నావాళ్ళని జీవితమంతా ఎవరికోసమైతే నీవు వెంపర్లాడుతున్నావో వారు నీ చివరి ఘడియలలో ఒక్కరైనా నీతో తోడుగా వస్తారా? ఆలోచించు.ఈ విషయం ఇప్పుడు అర్ధం కాదు.చివరి క్షణాలలో కొంత అర్ధమౌతుందేమో?అప్పుడు అర్ధమయ్యీ ఉపయోగం ఏమీ ఉండదు.అప్పటికే అంతా ఆలస్యమై పోతుంది.

13.
కం||మాయను జిక్కిన లోకులు
మాయాతీతుల మటంచు మదిలో నెంచన్
లోయల దిరిగెడి సర్పము
వాయుపధంబున నెగిరెడు వాటము గాదే?

మాయలో నిండుగా కూరుకుని ఉన్న మనుష్యులు తాము చాలా తెలివైన వారమని మాయాతీతులమని భావించుకోవడం ఎంత విచిత్రం?చీకటి లోయలలో రాళ్ళూరప్పల మధ్యన తిరిగే పాము,విశాలమైన ఆకాశంలో తాను హాయిగా ఎగురుతున్నానన్న భ్రమలో ఉండటం వంటిదే ఇదికూడా.

14.
కం||నాకోసమె నావారలు
నాకొరకే వస్తుచయము నానా విధముల్
నాకే సర్వం బనుచున్
వ్యాకులతల జిక్కియుంద్రు లోకులు సత్యా

15.
కం||నేనను గర్వంబందున
తానేమని దెలియలేని తామసుడొకచో
నేనేమను నిజమెరుగగ;
నానాటికి దీరునిచటి నాటకమెల్లన్

నాకోసమే నావారిని నేను ప్రేమిస్తున్నాను.నాకోసమే సమస్త వస్తువులనూ నేను ప్రేమిస్తున్నాను.నేను నేననే గర్వం ఎందుకు?ఇది ఎక్కడనుంచి వస్తున్నది?ఎలా ఉద్భవిస్తున్నది?అసలు ఈ 'నేను' ఎవరు?అన్న ఒక్క విషయం చక్కగా గ్రహిస్తే ఈ నాటకం అంతా ఆరోజే ముగుస్తుంది.

16.
కం||ఎందుకు జేరితినిలలో?
ఎందుకు నేజేయుచుంటి నెంచగ కర్మల్
ఎందుకు జిక్కితి నానా
బంధంబుల నంచు జూడు పదపడి సత్యా

ఈలోకానికి ఎందుకు వచ్చినాను?ఎందుకు ఈ కర్మలను చేస్తున్నాను?ఈ నానా బంధాలలో ఎందుకు చిక్కుకున్నాను?అన్న విషయాలను లోతుగా పరిశీలించి గ్రహించాలి.

17.
కం||నమ్మితి వందరి నిలలో
నమ్మిన ప్రతిచోట నీకు నగుబాటయ్యెన్
నమ్మకుమీ నాటకముల
సొమ్మగు నీయాత్మ నెపుడు నమ్మర సత్యా

ఇప్పటివరకూ అందరినీ నమ్మి మోసపోయావు.నమ్మిన ప్రతిచోటా నీకు మోసమే ఎదురైంది.నగుబాట్ల పాలయ్యావు.ఇక ఈ నాటకాలను నమ్మకు. ఎప్పుడూ నీతోడుగా ఉండే నీ ఆత్మనే ఎల్లప్పుడూ నమ్ము.

18.
ఆ||కాలహరణ జేయు కపటంబులను మీరి
సూటిమార్గమందు వాటమొప్ప
వేగ నడువవలయు వైరాగ్యమును బూని
మోసమందు గలదె మోక్షసుఖము?

అనవసరములైన మాయమాటలనూ కపటపు వేషాలనూ వదలిపెట్టు. వైరాగ్యఖడ్గాన్ని చేతబూని రాజమార్గంలో నడచి ముందుకు సాగు.మోసంతో మోక్షం ఎన్నటికైనా లభిస్తుందా?

19.
కం||ఆశింపకు లోకులకడ;
నాశింపకు లోకమొసగు ఆడంబరముల్
ఆశింపకు మన్యాయపు
మోసంబగు విత్తమెపుడు మదిలో సత్యా

లోకుల వద్ద ఏమీ ఆశించకు.లోకపు ఆడంబరాలను అసలే కోరుకోకు. అన్యాయంగా సంపాదించే ధనాన్నీ కోరకు.ఇవన్నీ నీ కర్మను విపరీతంగా పెంచుతాయి.నిన్ను ఇంకా ఇంకా బంధాలలో బిగిస్తాయి.

20.
ఆ||రెండు మూడునాళ్ళ రంగంబు నేగోరి
కాలదన్న నగునె కలిమికొండ
నిరతముండు విభుని నిర్లక్ష్యమే జేసి
ముద్దు జేయనగునె? మూర్ఖజనుల

రెండు మూడు రోజులుండే ఈ నాటకాన్ని ఆశించి ఎప్పుడూ నీతోడుగా ఉండే శ్రీపర్వతాన్ని కాలదన్నుకుంటావా?నిత్యమూ నీ వెన్నంటి ఉన్న దైవాన్ని నిర్లక్ష్యం చేసి మూర్ఖపు లోకులను చేరదియ్యడం సబబేనా?

21.
ఆ||బ్రదుకు తెరువు కొరకు భవబంధముల జిక్కి
అదియె సర్వమనుచు అరవనేల?
జీవమెటుల గలిగె? జీవనంబేమన్న
చింతనంబు గలుగ చిక్కుదీరు

బ్రతకడం కోసం పని చేస్తున్నాము.కానీ అహంలో చిక్కి పదవులూ ధనమూ పరమార్ధమనీ అదేదో గొప్ప అనీ విర్రవీగడం సరియేనా?అసలు నీలో జీవం ఎలా వచ్చింది?నీ జీవితగమనం ఎటు పోతున్నది?దీని తీరుతెన్నులేమిటి?ఇప్పటివరకూ ఆధ్యాత్మికంగా నీవు అసలేమైనా పొందినావా?లేదా? అనే చింతన నిజంగా చేసిచూస్తే నీ కర్మగతి అర్ధమయ్యి కనులకు కప్పిన గంతలు వీడిపోతాయి. అప్పుడు సత్యమేమిటో తెలుస్తుంది.