“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

9, జూన్ 2014, సోమవారం

చంద్రబాబు ప్రమాణస్వీకార ముహూర్తవిశ్లేషణ-కొత్త ప్రభుత్వం ఎదురుగా ఉన్న సవాళ్లు


నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం నిన్నరాత్రి 7.27 కి జరిగింది.ఈ వేదిక మంగళగిరికి దగ్గర కనుక ఆ ఊరి కోఆర్డినేట్స్ ను తీసుకోవచ్చు.

ఈ సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దానిని బట్టి నూతన ప్రభుత్వ పనితీరు ఎలా ఉంటుందో, రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండబోతున్నదో వారు ఎంతవరకు చెప్పిన పనులు చెయ్యగలుగుతారో ప్రజల మన్ననలను ఎంతవరకు ఎలా పొందగలుగుతారో లేదో చూద్దాం.

ఈరోజు జ్యేష్ట శుక్లఏకాదశి ఆదివారం.తిధి వారముల వరకూ మంచివాటినే  ఎంచుకున్నారు.

చిత్తానక్షత్ర ఒకటోపాదం కుజహోరలో వరీయాన్ యోగంలో వణిజకరణంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది.

ముహూర్తం పెట్టినవారు చతుర్ధశుద్ధీ అష్టమశుద్ధీ ఉండేలా జాగ్రత్త పడ్డారు.అయితే నాకు తెలిసిన వరకూ ఆయనది మిథున లగ్నం 27' అనుకుంటాను.అప్పుడు ముహూర్త లగ్నం సప్తమం అయ్యింది.ఇది అంత మంచి సూచనకాదు.అంటే ఎదుర్కోనవలసిన సమస్యలు అడుగడుగునా ఉంటాయన్న సూచన ఉన్నది.అది నిజమే కదా.దీనిని గ్రహించడానికి జ్యోతిష్యం అక్కర్లేదు.కాని జ్యోతిష్య సూచనలు కూడా నిజానికి అనుగుణంగానే,జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగానే ఉండటం మాత్రమె మనం ఇక్కడ గమనించాలి.



చంద్రబాబు పుట్టిన తేదీ 20-4-1950 ఉదయం 11.28 అంటున్నారు.ఇది నిజమే అయితే ఆయన నక్షత్రం కృత్తిక అయింది.అప్పుడు విపత్తార అయిన చిత్తానక్షత్రం ఉన్న రోజున ఈ ముహూర్తం నిర్ణయించడం కరెక్ట్ కాదు.తను అనుకున్నది చెయ్యడంలో అనేక విపత్తులను ఆయన ఎదుర్కోవలసి ఉంటుంది.

ముందుగా శకున శాస్త్ర సహాయంతో కొన్ని విషయాలు పరికిద్దాం.

జాతీయగీతం ఇంకా పాడుతూ ఉండగానే చివరిలో మ్యూజిక్ లో ఒక చిన్న విరామం వచ్చినపుడు అయిపోయిందని భావించి ముఖ్యమంత్రీ గవర్నరూ ఇద్దరూ కూర్చుండి పోయారు.తప్పును గ్రహించి మళ్ళీలేచి నిలబడ్డారు. అధికారిక కార్యక్రమాలలో ఇది చాలా పొరపాటుగా భావిస్తారు.

శ్రీశ్రీ రవిశంకర్ ను ప్రస్తావిస్తూ చంద్రబాబు 'పండిట్ రవిశంకర్' అన్నారు. చాలామంది ఇలాగే పొరపాటు పడతారు;పండిట్ రవిశంకర్ దివంగత సితార్ విద్వాంసుడు.ఈయన శ్రీశ్రీ రవిశంకర్.ఇంతకు ముందు ఆయన పేరులో మూడు శ్రీలుండేవి ప్రస్తుతం రెండే ఉంటున్నాయి.

ఈ రెంటి సూచన ఏమంటే,

  • కొత్త ప్రభుత్వం కూడా చాలా హాస్యాస్పదమైన కొన్ని తప్పులు చేస్తుంది.కాని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా వెంటనే జరుగుతుంది.
  • కొన్ని సరిదిద్దుకోలేని గ్రహించలేని తప్పులు కూడా జరుగుతాయి.
  • చూడటానికి చిన్నవిగా కనిపించినా అర్ధం చేసుకోగలిగితే వాటి పరిణామాలు పెద్దవిగా ఉంటాయి.

ఇప్పుడు పంచాగ వివరాలను పరికిద్దాం.

ఏకాదశి తిధి:
మంచి పనులు చెయ్యడంలోనూ,ధార్మిక కార్యక్రమాలలోనూ ఆసక్తినీ, దేవబ్రాహ్మణుల పట్ల గౌరవాన్నీ,ఉత్తమ సంకల్పాన్నీ ఈ ముహూర్తం ఇస్తుంది.

చిత్తా నక్షత్రం:
శత్రువిజయాన్నీ,నీతినీ,మంచి ప్లానింగునూ,పద్ధతిగా పనులు నెరవేర్చడాన్నీ ఈ నక్షత్రప్రభావం ఇస్తుంది.ఇది చంద్రబాబు జన్మతార అయిన కృత్తికకు విపత్తార అయింది.తను తలపెట్టిన పనిలో అనేక ఆటంకాలను ఆయన ఎదుర్కోవలసి వస్తుంది.అంత సులభంగా అనుకున్న పనులు జరగవు.నూతనరాజధానీ నిర్మాణమూ రాష్ట్రనిర్మాణమూ అనుకున్నంత తేలికపనులు కావు.

ఆదివారం:
మంచి కార్యనిర్వహణనూ,పరిపాలనా సమర్ధతనూ,శత్రుజయాన్నీ ఇస్తుంది.

వరీయాన్ యోగం:
ధనాన్నీ,భోగాన్నీ,వినయాన్నీ మంచిపనులకు ఖర్చు చేసే బుద్ధినీ,ధర్మకార్య నిర్వహణనూ,సౌజన్యాన్నీ ఇస్తుంది.

వణిజ కరణం:
హాస్యచతురతనూ,ప్రాజ్ఞత్వాన్నీ,సన్మానములు పొందటాన్నీ,వ్యాపార దక్షతనూ ఇస్తుంది.

నాడీజ్యోతిష్య రహస్యవేత్తలకు ఒక విషయం స్పష్టంగా తెలుసు.దశాప్రభావాలు పూర్వకర్మను సూచిస్తాయి.కనుక దశలలో శాపగ్రస్తసమయాలు వచ్చినపుడు బలీయమైన పూర్వశాపాలు బయటకు వస్తాయి.మన కర్మను అనుభవింప చేస్తాయి.ఇది సత్యం.దీనికి ఎవ్వరూ అతీతులు కారు.కాలేరు.తప్పించుకోలేరు.

దానిని తప్పించుకోవాలంటే మార్గాలున్నాయి.కాని వాటిని చెయ్యడానికి అంత త్వరగా మనకు బుద్ధిపుట్టదు.కర్మ అనేది అలాంటి బుద్ధిని పుట్టనివ్వదు. ఒకవేళ రేమెడీలు మొదలుపెట్టినా అనేక అవాంతరాలు మధ్యలో తలెత్తుతాయి.ఊరకే గుళ్ళలో పూజలు చెయ్యడం వల్లా యాగాలు చేయించడం వల్లా ఆ దోషాలు పోవు.ముల్లును ముల్లుతోనే తీయవలసి ఉంటుంది. అంతేగాని డబ్బులు పారేసి చేయించే పూజలు దానిని తొలగించలేవు.  

ఇక్కడ మనందరి కళ్ళూ గిర్రున తిరిగిపోయే ఒక నిజాన్ని గమనిద్దాం.ప్రస్తుతం ఈ కుండలికి ఏ దశ జరుగుతున్నదో తెలుసా??చెబితే మీరు నిర్ఘాంతపోతారు.

కుజ/రాహు/శనిదశ జరుగుతున్నది.అంటే శపితయోగం మళ్ళీ ప్రత్యక్షమైంది. అంతర్ధశా విదశానాధులైన రాహుశనుల వల్ల శపితయోగపు ఛాయ నేనున్నానంటూ వచ్చి మన ఎదురుగా నిలబడింది.కనుక నేను చెప్పిన శాపం విషయం నిజమే అని చంద్రబాబు ప్రమాణస్వీకార ముహూర్త కుండలి ద్వారా కూడా మళ్ళీ రుజువైంది చూచారా?

ఎప్పుడో 56 ఏళ్ళ క్రితం ఆంద్రప్రదేశ్ మొదలైనప్పుడు ఉన్న శాపం నిన్నటి 2014 తెలంగాణా కుండలిలో కనిపించడం ఏమిటి? మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకార కుండలిలో కూడా అది ప్రత్యక్షం కావడం ఏమిటి??కర్మ అనేది మనందరం అనుకునేటట్లు ఒక జడపదార్ధం కాదనీ అది చాలా తెలివైన ఒక "లివింగ్ ఇంటల్లిజెంట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రాం" అనీ అర్ధం కావడం లేదూ??మనం ఎన్ని రకాలుగానైనా దానిని తప్పుకోవాలని ప్రయత్నాలు చెయ్యవచ్చు.కానీ అది ఏదో ఒక రకంగా మన అంచనాలను అధిగమిస్తూ మళ్ళీ ఏదో మూలనుంచి వచ్చి "నేనున్నాను.నిన్ను అంత సులభంగా వదలను" అంటూ ఎదురుగా నిలబడుతుంది.

రాజభవనాలు వదిలివేసి రైల్వే ట్రాక్ పక్కన చెట్లలో పుట్టల్లో గుడారాలు వేసుకుని ప్రమాణస్వీకారం చెయ్యవలసిన ఖర్మపట్టడం శాపం కాకపోతే మరేమిటి?

ఇక ముహూర్త కుండలిని కొంచం పరిశీలిద్దాం.

ఐదింట శుక్రకేతువులు
అనుచరులతో పార్టీ నేతలతో ఘర్షణను రేకెత్తిస్తుంది.చంద్రబాబు ఒకటి చెయ్యాలనుకుంటే ఆయన సహచరుల ఆలోచనలు ఇంకొక విధంగా ఉండవచ్చు.దానివల్ల తిరుగుబాటు దారులు పెరగడమూ దానివల్ల ఆయనకు తలనొప్పులు రావచ్చు.నేత భావాలను అనుచరులు సరిగ్గా అర్ధంచేసుకోలేకపోతే పరిపాలనా నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతాయి. 

ఉద్యోగులను కష్టపడి పనిచెయ్యమంటే వారికి కోపం రావచ్చు.అలా కష్టించి పనిచెయ్యకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు.ఈ కోణంలో ఉద్యోగులకూ సిఎం కూ మళ్ళీ భేదాభిప్రాయాలు రావచ్చు.మంత్రి పదవులు వచ్చాయి హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకునేవారు కష్టపడి పనిచెయ్యాలి అని వెంటాడే ముఖ్యమంత్రిని చూచి ఇదేం గోలరా దేవుడా అని విసుక్కునే రోజులు వస్తాయి.అంచనాలకూ వాస్తవానికీ మధ్యన అంతరాలను అధిగమించలేక నిరాశ చెందడాన్ని ఇది సూచిస్తుంది.

ఆరింట సూర్యుడు
ఇది మంచియోగమే.పరిపాలన బాగుంటుంది.లా అండ్ ఆర్డర్ మళ్ళీ చక్కగా నడవడం మొదలు పెడుతుంది.నేరాలు అదుపులోకి వస్తాయి.దొంగలూ రౌడీలూ భయపడి కుక్కిన పేనుల్లా ఉండటం మొదలుపెడతారు. శత్రు విజయాన్ని ఈ యోగం ఇస్తుంది.

అయితే దీనిలో కొంత నెగటివిటీ కూడా లేకపోలేదు.మొదట్లో బాగా సాయం చేసిన కేంద్రం రాన్రాను కొంత అసహన ధోరణి ప్రదర్శించడం మొదలు పెడుతుంది.ఎంతసేపూ మాకు ఆంద్రరాష్ట్ర సమస్యలు ఒక్కటే కాదు.మేము దేశంలో ఉన్న అన్నిరాష్ట్రాలనూ చూచుకోవాలి.నిధులన్నీ మీకే కావాలంటే ఎలా?కొంచం మీరు స్పీడు తగ్గించండి అన్న ధోరణి కేంద్రంలో కాలక్రమేణా రావడం చూడవచ్చు.

ఏడింట గురుబుధులు:
శత్రువులమీదా సంఘవిద్రోహుల మీదా చంద్రబాబు కొరడా ఝుళిపిస్తాడు. దానితో వారు దిక్కుతోచక బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉన్నది.లా అండ్ ఆర్డర్ చాలా బాగుపడుతుంది.క్రమశిక్షణ పెరుగుతుంది.ఇప్పటివరకూ ఉన్న అరాచకం చాలావరకూ తగ్గిపోతుంది.

ప్రతిపక్షాలు మాత్రం చాలా తెలివిగా చంద్రబాబు యొక్క ప్రతి వైఫల్యాన్నీ ప్రజల్లో బాగా ఎండగట్టడం మొదలు పెడతాయి.వారి పని అదేగా మరి.

పదింట చంద్రకుజులు:
పరిపాలన చాలా పట్టుదలతో క్రమశిక్షణతో సాగుతుంది. మంచి ప్లానింగ్ ఉంటుంది.అయితే,ఈ క్రమంలో కొన్నినష్టాలూ కష్టాలూ తప్పవు.

వారి వారి స్వార్ధపూరిత కోరికలు నెరవేరని వారు అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉన్నది.ఆ అడ్డంకులు నేరుగా కాకుండా లోపల్లోపల ఉంటాయి.అంటే కుట్రల రూపంలో ఉంటాయి.చివరకు వారు ఓడిపోక తప్పదు కానీ ఈ మధ్యలో వచ్చే చికాకులు మాత్రం ఉండనే ఉంటాయి.

నక్షత్రాధిపతీ హోరాదిపతీ అయిన కుజుడు దశమంలో చంద్రమంగళ యోగంలో బలంగా ఉండటం చాలా మంచి సూచన.మంచి పట్టుదలతో కూడిన పరిపాలనను ఇది సూచిస్తున్నది.అయితే చంద్రునికి అష్టమాధిపత్యం రావడం మంచిది కాదు.బయటకు చెప్పినంతగా పనులు జరగడం కష్టం అని సూచన ఉన్నది.

పదకొండింట రాహుశనులు:
అసలైన లాభమూ నష్టమూ కూడా ఈ యోగమే.దీనివల్ల కేంద్రంలోని మిత్రులతో మంచి సంబంధాలు ఉంటాయి.వారి సహాయం కూడా సమయానికి అందుతుంది.

కానీ,వచ్చిన నిధులు అవినీతిలో స్వాహా కాకుండా సక్రమంగా ప్రతి రూపాయీ ప్రజలకోసం రాష్ట్రనిర్మాణం కోసం శుద్ధంగా ఖర్చు చెయ్యడమే పెద్ద సమస్య అవుతుంది.ఎందుకంటే అవినీతి అధికారులూ అవినీతి ప్రజలూ ఉన్నట్టుండి పతివ్రతలు అవుతారా అంటే అనుమానమే.

అనుచరులలో అవినీతిపరులూ కుట్రదారులూ కూడా ఖచ్చితంగా బయలుదేరతారనే సూచనను ఈ యోగం ఇస్తున్నది.ఎందుకంటే శపితయోగం లాభస్థానం నుంచే ఆపరేట్ అవుతున్నది గనుక రాష్ట్ర పునర్నిర్మాణ నిధులు పెద్ద ఎత్తున గోల్ మాల్ అయ్యే అవకాశం బలంగా కనిపిస్తున్నది.ప్రజాధనం వృధా కాకూడదంటే నిత్య జాగరూకత చాలా అవసరం.ఒకవేళ ఇదే జరిగితే ఇప్పుడు మిత్రుడైన పవన్ కళ్యాణ్ అప్పుడు శత్రువుగా మారి విమర్శలకు దిగే ప్రమాదం ఉన్నది.ఈ క్రమంలో మూడేళ్ళ తర్వాత జనసేనపార్టీ బాగా బలపడే సూచనలూ ఉన్నాయి.

అనునిత్యం గమనిస్తూ ప్రతి చిన్నతప్పునూ కూడా పెద్దది చేసి విమర్శింఛి ఎండగట్టే కాంగ్రెస్ వారినీ జగన్ నూ కాచుకోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారబోతున్నది.చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోతే వారు ఊరుకోరు.ప్రజలూ ఊరుకోరు.చెయ్యాలంటే డబ్బులు లేవు.ఈ పరిస్థితిని లాభస్థానంలోని రాహుశనులు స్పష్టంగా సూచిస్తున్నారు.

ఈ యోగంవల్ల యధావిధిగా మొదటి మూడేళ్ళూ శంకుస్థాపనలూ కల్లబొల్లి కార్యక్రమాలూ చేసుకుంటూ పోవడమూ చివరి రెండేళ్లలో మళ్ళీవచ్చే ఎన్నికలలో ఓట్లకోసం హడావుడిగా కార్యక్రమాలు చేయ్యబోవడమే సూచనకు వస్తున్నది.కానీ అందరు రాజకీయులూ చేసే ఇదే ప్లాన్ ను చంద్రబాబు కూడా అమలుచేస్తే  ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం గట్టిగా ఉన్నది. అప్పుడు వచ్చే ఎన్నికలలో గెలవడం సాధ్యంకాదు.కనుక మొదటినుంచీ నిజాయితీగా శుద్ధంగా పనిచెయ్యవలసిన అవసరం ఉన్నది.

దానికి రెండు అడ్డంకులు ఉన్నాయి.

ఒకటి -- సరిపోయినన్ని నిధులు.
రెండు--నిజాయితీతో కష్టపడి ప్రజలకోసమే నిజంగా పనిచేసే నాయకులు.

ఈ రెంటినీ గనుక చంద్రబాబు సాధించగలిగితే ఆయన చెప్పినవి నిజం అవుతాయి.ఈ రెంటిలో ఏది ఫెయిల్ అయినా ఆయన వాగ్దానాలు చెప్పినంత స్థాయిలో నెరవేరవు.

ఇప్పుడు నవాంశ ఏమంటున్నదో చూద్దాం.

నవాంశఫలితాలు:

యోగకారకుడైన శనీశ్వరుడు లగ్నంలో ఉండటం మంచిదే.కాని ఈయన ఈ లగ్నానికి బాధకుడు కూడా అని మరచిపోకూడదు.కనుక అనుకున్నంత త్వరగా పనులు జరగవు.పైగా రెండింట గురుకుజుల వల్ల 12 లో కేతువు వల్లా బాధలు తప్పవు.ఇవి రెండు విధాలుగా ఉంటాయి.

ఒకటి-ప్రతిపక్షాల నుంచి.
రెండు-సొంత పార్టీలోని అసమ్మతివాదుల నుంచి

ఈ రెండు ఫేక్టర్స్ వల్ల ముందుముందు అనేక సమస్యలు తలెత్తుతాయి.

నాలుగింట సూర్యచంద్రులవల్ల ప్రజలు ఆశించినంత అభివృద్ధి జరగడం కష్టం అని సూచన ఉన్నది.కేంద్ర సహాయం కూడా ఆశించినంత మేరకు అందకపోవచ్చు.

లగ్నాధిపతి శుక్రుడు అయిదింట నీచలో ఉన్నందువల్ల పాలకులు ప్రజలకు జవాబులు చెప్పలేని పరిస్థితి ఉంటుంది.అధికారులలో అవినీతి పెరుగుతుంది.

ఎనిమిదింట బుధుని వల్ల ఆర్ధికరంగం అనుకున్నంతగా ఎదగటం కష్టం అని అనిపిస్తున్నది.ఉన్నదానికంటే ప్రదర్శన ఎక్కువగా ఉంటుందని సూచన ఉన్నది.

ఈ ఫలితాలన్నీ ఆయా దశలలో అంతర్దశలలో జరుగుతాయి.

మొత్తంమీద ముందున్నది పూలబాట కాదు ముళ్ళబాట అనే విషయం స్పష్టంగా సూచన ఉన్నది.వెంటాడుతున్న శపితయోగాన్ని ఎదుర్కొంటూ అనుకున్నంత వేగంగా ముందుకు పోవడం ఎంతవరకూ సాధ్యమో ముందుముందు చూడవలసి ఉంటుంది.

మొత్తం మీద శపితయోగాన్ని లాభస్థానంలో ఉంచుతూ మంచి ముహూర్తాన్నే నిశ్చయించారని చెప్పవచ్చు.అంతకంటే దానిని హేండిల్ చెయ్యడం కష్టం. చతుర్ధ అష్టమశుద్ధులు ఉండటం మంచిసూచన.ఉన్నంతలో మంచి ముహూర్తాన్నే ఎంచుకున్నారని చెప్పాలి.

రెండో భాగంలో మరికొన్ని వివరాలు చూద్దాం.