“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

6, జూన్ 2014, శుక్రవారం

తెలంగాణా ఆవిర్భావ కుండలి- ఫలితములు(2)-ఆంధ్రా తెలంగాణా కుండలుల తులనాత్మక పరిశీలన

ఇదే శీర్షికతో వ్రాసిన మొదటిభాగంలో తెలంగాణా ఆవిర్భావకుండలినీ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావకుండలినీ పోల్చి తులనాత్మక పరిశీలన చేస్తానని అన్నాను.అది ఈ పోస్ట్ లో చూద్దాం.

మూడేళ్ళక్రితం నేను ఒకమాట అంటే చాలామంది నన్ను చాలా హేళన చేశారు.అదేమంటే -"ఆంధ్రరాష్ట్రానికి శాపం ఉన్నది ఇది శాపగ్రస్త రాష్ట్రం" అని నేనన్నాను.కావలసిన వారు పాత పోస్ట్ లలో చూడవచ్చు.

మూడేళ్లు తిరగకుండానే రాష్ట్రం మన కళ్ళముందే చాలా హీనంగా రెండు ముక్కలై పోయింది.కనీసం ఎవరి అభిప్రాయాన్నీ లెక్కలోకి తీసుకోకుండా బర్రెగొడ్లను విభజించి బందెల దొడ్డిలోకి తోసినట్లు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించి 'ఇక మీ చావు మీరు చావండి' అనేశారు.

కనీసం ఇక్కడ మనుషులనే వాళ్ళు ఉన్నారనీ వారి అభిప్రాయంకూడా కొంత లెక్కలోకి తీసుకోవాలనీ డిల్లీ ప్రభువులకు ఏమాత్రం తోచలేదు.పైగా మన ప్రజాద్రోహనాయకులు డిల్లీకి పోయి ఉన్నవీ లేనివీ వారికి నూరిపోసి ఇంకోపక్క ప్రజలను వంచించి నానా నాటకాలూ ఆడి శకుని పాత్రను చక్కగా పోషించారు.చివరకు రాష్ట్రం రెండుముక్కలై పోయింది.ఇది శాపఫలితం కాకుంటే మరేమిటి?

రామాయణ కాలంలోని ఆంధ్రులు తమప్రాంతంలో సంచరిస్తున్న విశ్వామిత్ర మహర్షిని తీవ్రంగా ఎగతాళి చేసి అవమానించి ఆయన కోపానికి గురయ్యారని ఒక గాధ ఉన్నది.అనవసరంగా ఆయన్ను విసిగించి అవమానించి బాధపెట్టిన పాపానికి ఆయన కోపించి ఆంధ్రజాతిని శపించాడట.విశ్వామిత్రమహర్షి సత్రయాగం చేసిన ప్రాంతం మాచర్ల దగ్గర ఉన్న 'సత్రశాల' అనే ఊరని ఒక నమ్మకం ఉన్నది.ఆయన ఆంద్రప్రాంతంలో సంచరించాడన్నదానికి చారిత్రిక ఆధారాలున్నాయి.ఎందుకంటే ఆయన యాగం చేస్తున్నపుడు రాక్షసులు వచ్చి దానిని చెడగొట్టాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటే ఆయన దశరధమహారాజును అడిగి యాగరక్షణకోసం యువరాజులైన రామలక్ష్మణులను తీసుకువస్తాడు.ఇది అందరికీ తెలుసు.అంటే విశ్వామిత్ర మహర్షి రాక్షసమూకలు ఉన్న అటవీ ప్రాంతంలో నివసించేవాడనీ అక్కడే యజ్ఞయాగాదులు చేసేవాడనీ తెలుస్తున్నది.

బహుశా యాగాన్ని చెడగొట్టాలని రకరకాల ప్రయత్నాలు చేసిన రాక్షసులు తెలుగువారి పూర్వీకులే కావచ్చు.ఎందుకంటే అతిప్రాచీనమైన 'శతపధబ్రాహ్మణం' లోనే తెలుగువారి ప్రస్తావన ఉన్నది.అప్పట్లో వింధ్యపర్వతాలకు దక్షిణప్రాంతం అంతా దండకారణ్యం అనేవారు.ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అంతా అప్పట్లో దట్టమైన కీకారణ్యం.

పొగరుబట్టి తాగి తందనాలాడుతూ ఆర్ష సాంప్రదాయాలనూ యజ్ఞయాగాలనూ ఎగతాళి చేస్తూ వాటిని నాశనం చేసే అనాగరికులూ ఆటవికులూ అయిన దుర్మార్గులైన మనుష్యులనే రాక్షసులు అని అప్పట్లో అనేవారు. ఋషిపత్నులను కూడా వాళ్ళు చెరబట్టి అపహరించి బలాత్కారం చేసేవారు. రావణుడు సీతాదేవిని అపహరించడం కూడా ఇలాంటి చర్యే.ఇలాంటి పనులు సర్వసాధారణంగా వారు చేసేవారు.

'రాక్షసులు' అంటే వాళ్ళు కొమ్ములూ కోరలూ పెట్టుకొని సినిమాలలో చూపినట్లు ఉండరు.నాగరికత లేని మూర్ఖులనూ దుర్మార్గులనూ ఆటవికులనూ 'రాక్షసులు' అనేవారు.నాగరిక జీవనం గడుపుతూ సత్ప్రవర్తన కలిగిన మనుషులను 'దేవతలు' అనేవారు.    

పోతే విశ్వామిత్రమహర్షి శాపం ఎన్నిరకాలుగా మనల్ని వేధిస్తున్నదో చెప్పడానికి చాలా కొన్ని ఉదాహరణలు మాత్రం చాలు.ఋషిశాపం చాలా భయంకరంగా వెంటాడుతుంది.మన అల్పబుద్దితో దాని శక్తిని మనం అంచనా వెయ్యలేము.

చాలా పాతకాలం విషయాలు వదలిపెట్టి ఒక వెయ్యి ఏళ్ళనాటి విషయాల నుంచీ చెప్పుకుందాం.

ముస్లిం దండయాత్రలకు దూరంగా హాయిగా బ్రతుకుతున్న దక్షిణాదిలో ముసల్మానుల అరాచకాలకు తెర తీసినది మనవారే.మన గుట్టుమట్లన్నీ డిల్లీ సుల్తానులకు చేరవేసి కాకతీయ సామ్రాజ్యాన్ని కూలదోసినది మన ఘనత వహించిన తెలుగువారే.దాని ఫలితంగా మాలిక్ కాఫర్ దక్షిణాదిన అడుగుపెట్టడమే కాక మదురై వరకూ అడ్డువచ్చిన వారిని వచ్చినట్లు ఊచకోత కోసుకుంటూ రక్తపాతాన్ని సృష్టిస్తూ సాగిపోయాడు.అంటే తెలుగుసామ్రాజ్యం ఒకటి కూలిపోవడానికి మనం కారకులవడం మాత్రమెగాక మన సోదరులైన తమిళులను కూడా ఊచకోత కోయించిన ఘనత మన తెలుగువారిదే.దీనిని శాపం అనక ఇంకేమంటారు?

ముస్లింగా మారకముందు మాలిక్ కాఫర్ కూడా ఒక హిందువే అని తెలిస్తే అతను సాగించిన మారణకాండకు మనకు భయం కలగక మానదు.ఆ విషయం ప్రస్తుతానికి అలా ఉంచుదాం.

కనుక మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకోవడమే గాక పక్కవాడి ఇంటికి కూడా నిప్పుపెట్టడమూ రెండూ తగలబడుతుంటే చూచి ఆనందించే శాడిస్ట్ మనస్తత్వం మన తెలుగువారికి మొదట్నించీ అలవాటే అని రుజువౌతున్నది. దీనిని శాపం అనక ఇంకేమంటారు?

నేడుకూడా మన ప్రజలూ నాయకులూ ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు అర్ధంపర్ధం లేకుండా ఎలా వాగుతున్నారో చూస్తె ఒక విషయం అర్ధమౌతుంది. ఇంత నాగరికత పెరిగి, చదువూసంధ్యలు పెరిగిన ఈ రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటె, పదివేల ఏళ్ళ క్రితం రామాయణ కాలంలో మన మనుషులు ఇంకెంత ఆటవికంగా దుర్మార్గంగా ఉండేవారో ఊహించవచ్చు.కనుక విశ్వామిత్ర మహర్షినీ ఇంకొంతమంది మహర్షులనూ అప్పట్లో నానాహింసా పెట్టి వాళ్ళ యజ్ఞగుండాలలో రక్తాన్నీ మాంసాన్నీ గుమ్మరించి హీనంగా ప్రవర్తించడం నిజమే అనడానికి ఎటువంటి అనుమానమూ అక్కర్లేదు.

కడప జిల్లాలోని 'ఒంటిమిట్ట' కు నేను పోయినప్పుడు అక్కడి కోదండ రామాలయంలో ధ్యానంలో ఉన్నపుడు ఆ ప్రదేశంలో ఋషులనూ ఋషిపత్నులనూ అప్పట్లో దండకారణ్యవాసులైన రాక్షసులు ఎలా నానా హింసలు పెట్టి చెప్పరాని పనులు చేశారో నేను ఫీల్ అవగలిగాను.వారు పడిన మానసికక్షోభ తరంగాలు తరంగాలుగా నా హృదయాన్ని తాకింది.'ఒంటిమిట్ట' మీద నేను వ్రాసిన పాత పోస్ట్ లలో ఈ విషయం ప్రస్తావించాను.కావలసిన వారు నాలుగేళ్ల క్రిందటి పాత పోస్ట్ లు ఒకసారి చూడవచ్చు. 

నేడు మన రాష్ట్రాన్ని రెండుగా చీల్చుకోవడం ద్వారా,డిల్లీ ప్రభువులకు బానిసలుగా సలాం చెయ్యడం ద్వారా మళ్ళీ మన శాపగ్రస్త జీవితాలను ఇంకోసారి రుజువు చేసుకున్నాం.తెలుగుజాతికి వెన్నెముక లేదని రుజువు చేసుకున్నాం.దీనిని కూడా శాపం అనక ఇంకేమంటారు?

ఇదంతా జరిగిపోయిన గతం గనుక ఇప్పుడు ఎంత మొత్తుకున్నా ఏమీ ఉపయోగం లేదు.కాని ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే "ఆంధ్రరాష్ట్రానికి ఋషిశాపం ఉన్నది.ఇది శాపగ్రస్తరాష్ట్రం" అని నూటికి నూరుపాళ్ళు ఘంటాపధంగా నేను ఇంతకుముందూ చెప్పిఉన్నాను.ఇప్పుడూ చెప్పగలను.నేనన్న మాటకు జ్యోతిష్యశాస్త్రపరంగా ఋజువులు ఎలా లభిస్తున్నాయో ఈ పోస్ట్ లోనే నిరూపిస్తాను.

దానికంటే ముందు ఇంకో విషయం చెప్పాలి.మొన్న ఒక మిత్రుడు 'తెలంగాణాకు శాపం ఉన్నదని మీరు ఎప్పుడో వ్రాశారట కదా?" అంటూ అడిగాడు.అప్పటికి ఇంకా పుట్టని తెలంగాణాకు శాపం ఉన్నదని మూడేళ్ళ క్రితమే నేనెలా అనగలను?

నేనన్నది అదికాదు.ఆంధ్రరాష్ట్రం గురించే నేనలా అన్నాను.ఇప్పటికీ అదే అంటున్నాను.తెలంగాణాకు ఋషిశాపం లేదు.శపితయోగం ఉన్నపుడు అది ఉద్భవించింది అంతే.ఆంధ్రరాష్ట్రానికి మాత్రం ఋషిశాపం ఉన్నది.ఇది నిజం.ఋషిశాపానికీ శపితయోగానికీ చాలా భేదం ఉన్నది.

మిగిలిన విషయాలు మాట్లాడుకునే ముందు ఆంధ్రరాష్ట్ర కుండలిని ఒక్కసారి తిలకిద్దాం.




తల్లిదండ్రుల జాతకాలనూ పిల్లల జాతకాలనూ పోల్చి చూస్తే కొన్ని గ్రహయోగాలు అవేఅవే రిపీట్ అవుతూ కనిపిస్తాయి.అవే జెనెటిక్ లక్షణాలుగా అనుకోవచ్చు. తల్లిదండ్రుల పోలికలు జీన్స్ లో ఎలాగైతే పిల్లలకు వస్తాయో అలాగే తల్లిదండ్రుల జాతకాలకూ పిల్లల జాతకాలకూ మధ్యన పోలికలు కూడా ఉంటాయి.దివంగత జ్యోతిష్కులు బీజేరావుగారు నన్ను ఈ కోణంలోనే రీసెర్చి చెయ్యమనీ 'జెనెటిక్ ఆస్ట్రాలజీ' సూత్రాలను కనుక్కోమనీ పదేళ్ళక్రితం చెప్పారు.ఆ విషయం ఇంకోసారి మాట్లాడుతాను.

ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు ఆంద్రరాష్ట్రం నుంచి తెలంగాణా విడిపోయింది గనుక ఇంతకు ముందటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తల్లిగానూ తెలంగాణాను పిల్లగానూ అనుకోవచ్చు.కనుక ఈ రెంటిజాతకాల మధ్యన పోలికలు ఉండాలి.ఇంకా చెప్పాలంటే 'జెనెటిక్ సిగ్నేచర్స్' వాటిమధ్యన ఉండాలి.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానిది కర్కాటక లగ్నం.తెలంగాణాది కుంభలగ్నం. కర్కాటక కుంభలగ్నాల మధ్యన షష్టాష్టకం ఉన్నది గనుక పరస్పర శత్రుత్వభావనతో రాష్ట్రం విడిపోయిందని క్లియర్గా కనిపిస్తున్నది.ఇప్పుడైతే అంతా చల్లబడింది గాని మొన్నటివరకూ ప్రజలమధ్యన ఎంత విద్వేష భావాలను సోకాల్డ్ నాయకులు రెచ్చగొట్టారో మనకు తెలుసు.  


ఇప్పుడు ఈ రెండురాష్ట్రాల కుండలుల మధ్యన కొన్ని సామ్యాలను గమనిద్దాం.

1.రెండు చక్రాలకూ మూడింట శుక్రుడున్నాడు.
2.రెండు చక్రాలకూ నాలుగింట సూర్యుడున్నాడు.
3.అంతకంటే ముఖ్యంగా రెండు చక్రాలకూ అష్టమంలో కుజుడున్నాడు.ఇది గొడవలతో ఏర్పడిన రాష్ట్రాలను సూచిస్తున్నది.మొదట్లో ఆంద్రరాష్ట్రం కూడా అల్లర్లతోనే ఏర్పడింది.
4.రెండు చక్రాలకూ నవాంశలో ధనుస్సులో బుధుడున్నాడు.
5.రెండు చక్రాలకూ నవాంశలో అయిదింట కేతువున్నాడు.అలాగే పదకొండులో రాహువున్నాడు.
6.రెండు చక్రాలకూ నవాంశలో ఆరింట కుజుడున్నాడు.
7.హస్తా నక్షత్రంలో ఆంధ్రా ఏర్పడింది.పునర్వసులో తెలంగాణా వచ్చింది.వీటికి అధిపతులు చంద్రుడు గురువు.వీరిద్దరూ ఆంధ్రప్రదేశచక్రంలో కలిసి ఉండటం చూడవచ్చు.అదే తెలంగాణాకుండలిలో వీరిద్దరూ విడిపోయి ఉండటం చూడవచ్చు.అదేగాక చంద్రునికి వెనుకగా గురువు ఉండటం చూడవచ్చు.అంటే ముందున్న ఆంధ్రానుండి వెనుక ఉన్న తెలంగాణా విడిపోయిందని అర్ధం.

చూచారా తల్లీపిల్లల మధ్యన ఉన్నట్లుగా 1956 లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ జాతకానికీ 2014 లో ఏర్పడిన తెలంగాణారాష్ట్రానికీ ఎన్ని పోలికలూ సామ్యాలూ ఉన్నాయో?అంటే 58 ఏళ్ళు గడిచిన తర్వాత నేటికికూడా మళ్ళీ తెలంగాణా రాష్ట్రం విడిపోయే సమయానికి ఆ కర్మసంబంధాలు ఆయా గ్రహచక్రాలలో ఖచ్చితంగా ప్రతిఫలించాయంటే  జ్యోతిష్యశాస్త్రం ఎంత ఖచ్చితమైన డివైన్ సైన్సో అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ముఖ్యంగా చూడవలసినది ఋషిశాపాన్ని గురించి.ఆంద్రరాష్ట్ర నవాంశలో గురువు నీచస్తితిలో ఉండటం స్పష్టంగా కనిపిస్తున్నది.ఇది గురుశాపం.కనుక ప్రాచీనగాధలలో వినవచ్చేటట్లు ఆంద్రరాష్ట్రానికి గురుశాపం ఉన్నదన్న విషయం నిజమే అని ఋజువౌతున్నది.నేను మూడేళ్ళ క్రితం చెప్పినది ఇదే.

వృశ్చికలగ్నానికి తృతీయంలో గురువు నీచలో ఉండటమూ లాభస్థానం నుంచి రాహుశనుల దృష్టి గురువు మీద ఉండటమూ ధర్మస్థానం నుంచి ధర్మాధిపతి అయిన పూర్ణచంద్రుని దృష్టికూడా గురువు మీద ఉండటమూ ఏమి సూచిస్తున్నది?

11 లో రాహుశనులు ఆకతాయితనంతో కూడిన గుంపును సూచిస్తారు.నవమంలో పూర్ణచంద్రుడు ఒక మహర్షిని సూచిస్తాడు.తృతీయం పోసుకోలు మాటలకూ ఎగతాళి చెయ్యడానికీ నోరుపారేసుకోడానికీ సూచిక. నీచగురువువల్ల ఒక మహర్షిని అనవసరంగా నిందించి పాపం మూటగట్టుకున్న ఆకతాయి గుంపు యొక్క ఆగడం కనిపిస్తున్నది.ఇదే మన రాష్ట్రానికున్న ఋషిశాపం.

ఆంద్రరాష్ట్ర అవతరణ కుండలి యొక్క నవాంశచక్రంలో ఋషిశాపం స్పష్టంగా దర్శనమిస్తున్నది. నేను చెబుతున్న విషయం మామూలు మనుషులకు అర్ధం కాకపోయినా జ్యోతిష్యవేత్తలకు చక్కగా అర్ధమౌతుంది.మూడేళ్ళ క్రితం నేను చెప్పిన మాటకు ఇంతకంటే ఋజువు అవసరం లేదనుకుంటాను.

అయితే అప్పట్లో నేను జ్యోతిష్యకుండలిని చూచి ఈ విషయాన్ని చెప్పలేదు. నేను ఆ నిర్ధారణకు రావడానికి అప్పట్లో బలమైన మార్మికకారణాలు కొన్నున్నాయి.తంత్రశాస్త్రజ్ఞానంతో ఆమాటను అప్పట్లో చెప్పాను.వాటిని ఇక్కడ చెప్పినా ఎవరికీ అర్ధంచేసుకునే స్థాయిలేదు గనుక అదెలా చెప్పానో ప్రస్తుతం వివరించబోవడం లేదు.

ఇకపోతే,తెలంగాణా కుండలిలో ఎక్కడా గురుశాపాన్ని సూచించే యోగంలేదు. కనుక ఆ రాష్ట్రానికి ఎలాంటి శాపమూ లేదంటున్నాను.శపితయోగ ప్రభావం మాత్రమె ఆ రాష్ట్రానికి ఉన్నది.ఋషిశాపానికీ శపితయోగానికీ భేదం ఉన్నదని పైనే చెప్పాను.

రెండు చక్రాలకూ అష్టమంలో ఉన్న అంగారకుని వల్ల ఒక బలమైన సూచన ఉన్నది.ఈ రెండు రాష్ట్రాలూ శాంతిగా ఏర్పడిన రాష్ట్రాలు కావు.ఎంతోమంది బలి అయ్యి రక్తతర్పణం చేస్తేగాని ఈ రాష్ట్రాలు ఏర్పడలేదనీ గొడవలూ అల్లర్లతోనే ఈ రాష్ట్రాలు ఏర్పడ్డాయన్న సూచనను ఈ గ్రహయోగం ఇస్తున్నది.అది నిజమే కదా?

ఆంధ్రరాష్ట్ర రాజధానిని హైదరాబాద్ లాగా అన్నిహంగులతో నిర్మించుకోవడం ఇప్పట్లో సాధ్యంకాదు.హైదరాబాద్ నిర్మాణానికి 60 ఏళ్ళు పట్టింది. ఆంద్రరాజధానిని ఆస్థాయిలో అయిదేళ్ళలో నిర్మించడం అసాధ్యం.అది ఎవరివల్లా కాదు.నాయకులు చెబుతున్నంత త్వరగా అన్నీ అయిపోవడానికి ఇది 'మాయాబజార్' సినిమా కాదు.ఇప్పుడు ముప్పైఏళ్ళ పైవయసు ఉన్నవారు ఇంకొక ఏభైఏళ్ళలో అలాంటి రాజధానిని ఆంధ్రాప్రాంతంలో చూడలేరు.ఎందుకంటే అది పూర్తిస్థాయిలో నిర్మితమయ్యే సమయానికి ఇప్పుడు ముప్పైపైన వయసు ఉన్నవారు ఎవరూ బ్రతికి ఉండరు.దీనిని శాపం అనక ఇంకేం అనాలి?

తుక్కునుంచి మళ్ళీ అంతా నిర్మించుకోవాలని నాయకులే అంటున్నారు. టెంట్లు వేసుకుని అడ్మినిస్ట్రేషన్ నడిపే పరిస్థితి ఉందని వాళ్ళే అంటున్నారు. చెట్లకింద కూచుని ఉద్యోగులు పనిచేయ్యవలసి వస్తుందనీ వాళ్ళే చెబుతున్నారు.దీనిని శాపం అనక ఇంకేం అనాలి?

కొంతమంది చేతగానితనం వల్ల ఇప్పుడు ఇన్ని కోట్లమంది ప్రజలు బాధలు పడవలసిన పరిస్థితి వచ్చింది.దీనిని శాపం అనక మరేం అనాలి?

ఇప్పటికీ అర్ధం చేసుకోలేని గుడ్డి చెవిటివాళ్ళకు ఎవరు మాత్రం ఇంతకంటే విపులంగా అర్ధమయ్యేలా చెప్పగలరు?

మన విశ్లేషణకు మళ్ళీ వద్దాం.

ఆంధ్రాకుండలిలో కూడా రాహుశనులు పంచమంలో కలసి ఉండటం చూడవచ్చు.ఇదీ శపితయోగమే.కనుక దీనినుంచి ఏర్పడిన తెలంగాణా కుండలిలో కూడా శపితయోగం ఉన్నది.అందులో కూడా రాహుశనులు కలసి తులా రాశిలో ప్రస్తుతం ఉండటం చూడవచ్చు.ఆంధ్రా రాష్ట్రంలో వృశ్చికరాశిలో అది ఉంటే తెలంగాణా ఆవిర్భావ కుండలిలో దానికి అనుచర (12) రాశి అయిన తులలో ఆయోగం దర్శనమిస్తున్నది.కనుక ఆంధ్రప్రదేశ్ కుండలి నుంచి తెలంగాణాకుండలికి ఈ శపితయోగం బదిలీ అయిందని స్పష్టంగా కనిపిస్తున్నది.శపితయోగం గురించి వివరంగా తెలుసుకోవాలనుకునే వారు నేను వ్రాసిన పాత పోస్ట్ లు ఒకసారి తిరగెయ్యండి.విషయం అర్ధమౌతుంది. 

అంటే తల్లినుంచి పిల్లలకు కొన్ని పోలికలు వచ్చినట్లుగా ఆంధ్రరాష్ట్రం నుంచి శపితయోగం తెలంగాణాకు కూడా బదిలీ అయింది. 

కాకపోతే నీచగురువు రూపంలో ఆంధ్రాకుండలికి ఋషిశాపం ఉన్నది. తెలంగాణాకు అదిలేదు.ఇప్పటివరకూ మనతో కలసి ఉన్నందుకు తెలంగాణాకు కూడా ఆ శాపం వర్తిస్తుంది.కాని ఇప్పుడు విడిపోయినందువల్ల ఆ శాపం నుంచి వారికి విముక్తి లభించింది.కాని ఆంధ్రాకు మాత్రం ఆ శాపం కొనసాగుతూనే ఉన్నది.ఇకముందు కూడా ఉంటుంది.

దీనికి ఇంకొక ఋజువు ఏమిటంటే ఆంధ్రాకుండలిలో ఆత్మకారకుడైన కుజుడు అష్టమంలో ఉన్నాడు.తెలంగాణా కుండలిలో ఆత్మకారకుడైన గురువు పంచమంలో ఉన్నాడు.దీనిని బట్టే ఏ రాష్ట్రానికి ఎలా ఉన్నదో తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఆంధ్రాకంటే తెలంగాణాకు మంచి భవిష్యత్తు ఉన్నది అని చెప్పవచ్చు.

రాష్ట్రం ముక్కలు కావడానికి శాపమే కారణం అన్న మాటకు ఒకే ఒక్క తిరుగులేని ఋజువు ఉన్నది.ఆంధ్రా కుండలిలో ప్రస్తుతం నడుస్తున్న దశలు శాపాన్ని స్పష్టంగా సూచించాలి.ప్రస్తుతం ఆంద్ర ప్రదేశ్ జాతకంలో ఏదశ జరుగుతున్నదో తెలుసా? శని/రాహు/శని/కుజదశ జరుగుతున్నది!!!

ఆంద్రరాష్ట్ర అవతరణ కుండలి ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న శని/రాహు/శని/కుజ దశలో తెలంగాణారాష్ట్రం విడిపోయింది.శని/రాహుదశ అంటే శపితయోగమే.కుజుడు నష్టాన్ని సూచించే అష్టమంలో ఉన్నాడు.శనికుజులు కలిస్తే ఘోరమైన యాక్సిడెంట్ జరుగుతుంది.ప్రస్తుతం జరిగింది అదేగా??చూచారా దశాఫలితం ఎంత ఖచ్చితంగా సరిపోయిందో?ఋషిశాపానికి ఇంతకంటే అద్భుతమైన ఋజువు ఇంకేం  ఉంటుంది???

ఖచ్చితంగా శపితయోగ సూచితదశలోనే ఆంధ్రానుంచి తెలంగాణా రాష్ట్రం విడిపోయింది.అంటే ఇలా రాష్ట్రం ముక్కలైపోవడం కూడా ఋషిశాప ప్రభావమే అని ఖచ్చితమైన రుజువును దశలు చూపిస్తున్నాయి.

ఇంకొన్ని ఋజువులు చూపిస్తాను.

తెలంగాణా విడిపోయిన సమయానికి ఆంద్రరాష్ట్ర కుండలిలో లగ్నాత్ చతుర్దంలో రాహుశనులు ఉన్నారు.చంద్రునినుంచి కుటుంబస్థానంలో వారున్నారు.అంటే ఇల్లు చీలిపోయిందనీ కుటుంబం విడిపోయిందనీ దానికి కారణం శపితయోగం అనీ స్పష్టమైన సూచన కనిపిస్తున్నది.

ఇంకా చూడండి.

ఆంద్ర ప్రదేశ్ జాతకంలో తులారాశిలో సర్వాష్టకవర్గులో 23 బిందువులు వచ్చాయి.ఇది ఏమాత్రం మంచిసూచన కాదు.ఇది సుఖస్థానం.సొంత ఇంటిని సూచించే స్థానం.ప్రజలను సూచించే స్థానం.అక్కడే శపితయోగ సూచకులైన రాహుశనులు ప్రస్తుతం నెలకొని ఉన్నారు.ఇక ప్రజలలో చీలిక రాకా రాష్ట్రం విడిపోకా ఏమౌతుంది???

కనుక ఎవరు ఏ కారణాలు సూచించినా రాష్ట్రం చీలిపోవడం వెనుక బలీయమైన మార్మిక కారణాలున్నాయన్నది స్పష్టం.నాయకులందరూ కర్మచేతిలో కీలుబొమ్మలు మాత్రమే.అలాగే ప్రజలూ కర్మచేతిలో కీలుబోమ్మలే.అందుకే మహర్షులనూ మహానీయులనూ అనవసరంగా తూలనాడి వారి మనస్సును నొప్పించకూడదని ప్రాచీనులు గట్టిగా చెప్పారు.ధనగర్వంతో పొగరెక్కి అలా ఒక ఋషిని ఎగతాళి చేసినందుకేగా శ్రీకృష్ణునివంటి అవతారపురుషుని రక్షణలో సర్వసంపదలతో తులతూగుతున్న యాదవరాజ్యం కూడా ముసలం పుట్టి సర్వనాశనమై పోయింది??ఇప్పుడు తెలుగుజాతికి కూడా అదే శాస్తి జరిగింది.

ఒక మనిషి మాటకు ఇంత శక్తి ఉంటుందా? కోట్లాదిమంది జీవితాలను ఇంతకాలం పాటు శాసించే శక్తి ఉంటుందా? అని అనుమానం రావచ్చు.ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అవినీతితో కుళ్ళిపోయిన రాజకీయనాయకులకే కోట్లాదిమందిని సమ్మోహనపరిచే శక్తి ఉంటె,ఇక జీవితాంతం సత్యమూ, బ్రహ్మచర్యమూ,ధర్మపరమైన జీవితమూ గడిపి,దేవతాసాక్షాత్కారం పొందిన మహర్షులకూ,బ్రహ్మవేత్తలకూ ఎంతటి శక్తి ఉంటుందో ఊహించవచ్చు.వారి మాట అమోఘంగా పనిచేస్తుంది.అది మనుషుల తలరాతలనే మారుస్తుంది. అదే వారి శాపమైతే కాలాన్ని అధిగమించి తరతరాలుగా వెంటాడుతుంది.

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని,ధర్మాన్ని సక్రమంగా అనుసరించడం సాంప్రదాయాన్ని మహానీయులనూ సరిగ్గా గౌరవించడం నేర్చుకుంటే మనం ఇప్పటికైనా అదృష్టవంతులమే.లేకుంటే ముందుముందు మనం పడబోయే బాధలు ఊహించడమే కష్టమని నేను గట్టిగా చెప్పగలను.