“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

13, జూన్ 2014, శుక్రవారం

బ్యాస్ నది దుర్ఘటన-ఇతర ప్రమాదాలు - కారణం ఏమిటి?

రాహుకేతువుల ప్రభావాలు చాలా విచిత్రంగా హటాత్తుగా ఉంటాయి. హటాత్తుగా జరిగే దుర్ఘటనలలో వీరిపాత్ర తప్పకుండా ఉంటుంది.వీరితో పాటు యురేనస్ పాత్ర కూడా ఉంటుంది.

ప్రస్తుతం రాహుకేతువులు రాశిమారబోతున్నాయి.ప్రస్తుతం తులా,మేష రాశులలో ఉన్న వీరు త్వరలో కన్యా మీన రాశులలోకి రాబోతున్నారు.వీరు రాశులు మారేటప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరగడం చాలా సహజం.తాంత్రిక జ్యోతిష్యవిజ్ఞానంలో దీనిని "సంధికాలం" అంటారు.

ఇలాంటి 'సంధికాలం'లో దుడుకుపనులూ సాహసకృత్యాలూ చెయ్యరాదు.కానీ ఆ సమయానికే అలాంటి పనులు చెయ్యాలన్న 'ఊపు' చాలామందిలో వస్తుంది.ఆ 'ఊపే' యమలోకానికి దారి చూపుతుంది.అనుభవించవలసిన కర్మ ఉన్నవారు ఇలాంటి 'ఊపు' కు లోనౌతారు.ఇలాంటి సంధికాలంలో ఈ శక్తులకు చాలా బలం ఉంటుంది.కానీ అవి కొంతమందినే వేటాడతాయి.అందరి వెంటా అవి పడవు.ప్రశాంతంగా ఉన్నవారిని అవి ఏమీ చెయ్యవు.చాలా అస్థిరమైన,డోలాయమానమైన మానసికస్థితిలో ఒక విధమైన భావోద్రేకస్థితిలో ఉన్నవారినే అవి టార్గెట్ చేస్తాయి.

'ఎంతచెప్పినా వినకుండా వెళ్ళాడు ప్రమాదానికి గురయ్యాడు'- అని చాలామంది అనుకోవడం మనం వింటూ ఉంటాం.అలా ఎవరెంతగా చెప్పినా వినని పరిస్థితే కర్మానుభవానికి అసలైన కీలకం.అనుభవించవలసిన బలమైన కర్మ ఉన్నప్పుడు ఎవరు ఎంత చెప్పినా వినబుద్ధి కాదు.మనిషి జుట్టు పట్టుకుని పూర్వకర్మ అలా ఈడ్చుకుపోతుంది.ఇలా జరగటం ఎంతోమంది జీవితాలలో నేను చూచాను. నేటికీ చూస్తున్నాను.

ఉదాహరణకు మొన్న బ్యాస్ నదిలో జరిగిన సంఘటనలో ఒడ్డుమీద నిలబడి ఉన్నవారికి ఏమీ కాలేదు.దుడుకుగా నది లోలోపలకు వెళ్లి రాళ్ళమీద నిలబడి అదేదో గొప్పలాగా ఫీలౌతూ పోజులిచ్చినవారు జలసర్పానికి బలై పోయారు.ఈ వీడియోను గనుక బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే పైనుంచి ఉరుకుతూ వచ్చిన నీరు అనేక తలలున్న ఒక మహాసర్పం లాగా కనిపిస్తుంది.నేను చెప్పిన కోణంలో మళ్ళీ ఇంకొకసారి ఆ వీడియోను చూడండి.నేను చెబుతున్నది నిజమే అని అర్ధమౌతుంది.జాగ్రత్తగా చూస్తె ఆ నీటిలో ఒక మహాసర్పం కనిపిస్తుంది.అదే రాహుప్రభావం. మార్మిక విషయాలు అన్నీ ఇలాగే ఉంటాయి.

మొన్న చనిపోయిన 25 మంది విద్యార్ధుల జాతకాలు పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన కామన్ కాంబినేషన్స్ తప్పకుండా రిపీట్ అవుతూ మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.కొన్ని వందల జాతకాలను పరిశీలించిన మీదట నేను ఈ మాటను చాలా నమ్మకంతో చెప్పగలుగుతున్నాను.జ్యోతిష్యం అనేది ఒక ఖచ్చితమైన డివైన్ సైన్స్ అని నా కేస్ ఫైల్స్ లోని అనేక ఉదాహరణలతో నిరూపించగలను.

ఇలాంటి సంఘటనలలో 'టైమింగ్' అనేది చాలా ఊహాతీతంగా సరిపెట్టబడుతుంది.కొన్ని ఉదాహరణలు చూద్దాం.

1.ఎక్కడినుంచో ఒక కారు వస్తుంటుంది.పెట్రోల్ పోయించుకుందాం అని ఒక బంక్ దగ్గర ఆగుదామని అనుకుంటారు.కానీ మళ్ళీ కొందరు 'తర్వాత వచ్చే పెట్రోల్ బంక్ లో పోయించుకుందాం.ఇక్కడ బాగుండదు.' అంటారు.సరే అని ఆగబోతున్నవారు కూడా మళ్ళీ బయలుదేరతారు.కొద్ది దూరం వెళ్ళేసరికి రైల్వేక్రాసింగ్ దగ్గర రైలును గుద్దుకుని కారులోని వారు అందరూ చనిపోతారు.

ఇది కల్పితం కాదు.ఇలాంటి సంఘటనలను నేను ఎన్నో చూచాను.కనుక చెబుతున్నాను.'పెట్రోల్ బంక్ దగ్గర ఒక్క క్షణం ఆగినా బాగుండేది ఈ ప్రమాదం తప్పేది' అని బ్రతికి బయటపడిన ఒకరో ఇద్దరో ఏడుస్తూ మొత్తుకోవడం చాలాసార్లు చూచాము.

2.దీనికి రివర్స్ గా కూడా జరుగుతుంది.టీ నొ లేదా కూల్ డ్రింక్సో  త్రాగుదామని దారిలో ఆగి ఆ తర్వాత బయలు దేరుతారు.సరిగ్గా ఒక రైల్వే గేట్ దగ్గర ప్రమాదానికి గురౌతారు.

'అక్కడ ఆగకపోయినా బాగుండేది.దీనిని తప్పుకొని ముందుకు పోయి ఉండేవాళ్ళు.అనవసరంగా ఆగి సరిగ్గా ఆ టైముకు చావు నోట్లో పడ్డారు.' అని వాపోవడం కూడా మనం చూస్తుంటాం.

ఇంతకీ నేను చెప్పేదేమంటే ఆగినా ఆగకపోయినా రాసిపెట్టి ఉన్నపుడు ఆ 'టైమింగ్' అనేది చాలా ఖచ్చితంగా కో ఆర్డినేట్ చెయ్యబడుతుంది.ఖచ్చితంగా అదే సమయానికి అక్కడకు చేరి ఆ ప్రమాదం నోట్లో పడతారు.ఒక్క అయిదారు సెకండ్లు తేడా వచ్చినా ఆ ప్రమాదం తప్పిపోతుంది.కానీ అలా జరగదు.చాలా ఖచ్చితంగా అదే సమయానికి వారు అక్కడకు చేరి ప్రమాదానికి గురౌతారు. 

ఇదంతా ఎలా జరుగుతుంది?ఈ టైమింగ్ సరిగ్గా ఆ సమయానికే ఎలా సరిపోతుంది?అనేది మానవ ఊహకు అందదు.ఇక్కడే మనకు కనబడని కొన్ని శక్తులు ఉన్నాయనీ మన ఆలోచన ఒక్కటే 'సుప్రీం' కాదన్న విషయం మనకు తడుతుంది.

చివరి క్షణంలో ప్రయాణం మానుకొని ప్రమాదాన్ని తప్పించుకున్న వారు ఉంటారు.అలాగే అనుకోకుండా చివరి క్షణంలో బయలుదేరి ప్రయాణం చేసి పరలోకానికి వెళ్ళేవారూ ఉంటారు.ఇదంతా అనూహ్యమైన కర్మప్రభావం వల్ల జరుగుతుంది.కర్మను నమ్మవలసిన తప్పనిసరి పరిస్థితి ఇలాంటి సంఘటనలు చూచినప్పుడు మనకు కలుగుతుంది.

ఇలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయని వ్యక్తిగత జాతకాలు చూచి గ్రహించవచ్చు.అలాగే సామూహికంగా కూడా గ్రహించవచ్చు.అలాగే జ్యోతిష్య సహాయం లేకుండా కూడా యోగదృష్టితో తెలుసుకోవచ్చు.ఇవన్నీ సాధ్యమే.అయితే జరగబోయేదాన్ని తప్పించడం సాధ్యమేనా? అన్నది అసలైన ప్రశ్న.

దీనికి రెండు జవాబులున్నాయి.

తప్పించడం సాధ్యమే.

తప్పించడం సాధ్యం కాదు.

దృఢకర్మ అయినప్పుడు దానిని తప్పించడం సాధ్యం కాదు.ఒకవేళ సాధ్యం చెయ్యాలంటే ఆ జీవికి బదులు ఇంకొక జీవిని బలి ఇవ్వవలసి ఉంటుంది.'బలి' అనే కాన్సెప్ట్ దీనినుంచే పుట్టింది.కానీ అలా చెయ్యడం వల్ల ఆ కర్మ సమయానికి పోస్ట్ పోన్ అవుతుంది.ఆ తర్వాత ఇదీ అదీ కలిపి చక్రవడ్డీతో కట్టవలసి వస్తుంది.

దృఢకర్మ కానప్పుడు దానిని మనం తప్పించవచ్చు.అయితే దానికి అతీతదృష్టీ,యోగశక్తీ ఉండాలి.అప్పుడు కూడా ఆ కర్మలో కొంత మనం అనుభవించవలసి వస్తుంది.అలా అనుభవించకుండా దానిని పూర్తిగా కేన్సిల్ చెయ్యడమూ సాధ్యమే.అయితే ఇలా చెయ్యడానికి కొన్ని అర్హతలుండాలి.

కర్మపరిహారం చేయించుకునే వ్యక్తికి నూటికి నూరుశాతం నిజాయితీ ఉండాలి.తానుచేసిన పనులకు పశ్చాత్తాపం ఉండాలి.బాధ ఉండాలి.అలాగే, పరిహారం చేసేవారికి యోగశక్తిలో అత్యున్నత స్థాయులు అంది ఉండాలి.ఆ బాధలు పడే వారిమీద కరుణా జాలీ ఉండాలి.అప్పుడు మాత్రమే కర్మను పూర్తిగా కేన్సిల్ చెయ్యడం సాధ్యమౌతుంది.అయితే ఆ క్రమంలో కూడా ఆ కర్మను ఏదో ఒక దానిచేత అనుభవింపచెయ్యడం జరుగుతుంది.సాధారణంగా అటువంటి యోగులు అలా చెయ్యకుండా,ఆ బాధలు తామే పడి ఎదుటివారికి ఊరటను కలిగిస్తారు.ఎందుకంటే కర్మనియమాన్ని ఉల్లంఘించడం మంచిది కాదని వారికి తెలుసు.

ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు.మామూలు మనుషుల దృష్టికి దూరంగా అతీతంగా జరిగే పనులు.ఇవన్నీ ఎలా జరుగుతాయో సామాన్యజనానికి అర్ధం కావు.కనుక వారికి అర్ధమైన రీతిలో ఏదేదో ఊహించుకుని 'ఇది కారణం అంటే అది కారణం' అనుకుంటూ ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇలాంటి దుర్ఘటనలు జరిగే ప్రదేశంలో కొన్ని శక్తులు వచ్చి చేరుతాయి.లేదా అంతకు ముందు ఎంతోకాలం నుంచీ అక్కడ ఉంటాయి.వాటిని చూచే సామర్ధ్యం ఉంటే ఆ సమయానికి అవి చేసే గోల చాలా దారుణంగా ఉంటుంది. కొన్ని ఆనందంతో గంతులేస్తూ ఉంటాయి.ఇతరులకు హాని జరిగితే చూచి ఆనందించే శాడిస్ట్ మనుషులు ఉన్నట్లే ఈ శక్తులలో కూడా అలాంటివి ఉంటాయి.అవి కాసేపట్లో జరగబోయే దుర్ఘటనను చూస్తూ ఆనందంతో పిచ్చిగా గంతులేస్తూ ఉంటాయి.ఇంకొన్ని మంచిశక్తులు బాధపడుతూ,చుట్టూ ఉన్నవారికి కొన్ని సూచనలు చెయ్యాలని,ప్రమాదాన్ని తప్పించాలనీ ప్రయత్నిస్తూ ఉంటాయి.వాటి శక్తిమేరకు అవి కొన్ని సూచనలు చెయ్యగలుగుతాయి కూడా.కాని అక్కడ మూగిఉన్న జనంలో ఎవరూ సామాన్యంగా వాటిని పట్టించుకోరు.అంతటి అంతర్దృష్టి వారికి ఉండదు.

అలాంటి సన్నివేశాలలో ఆయా పరిసరాలలో ఏదో తెలియని ఒక విధమైన 'ఊపూ ఉత్సాహమూ'ఉంటాయి.ఎవరిమాటా ఎవరూ వినే పరిస్థితి అక్కడ ఉండదు.అంతా గోలగోలగా ఉంటుంది.ఇలాంటి శక్తులకు ఖచ్చితంగా అలాంటి పరిస్థితులే కావాలి.అలాంటి భావోద్రేక వాతావరణం వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది.ఇక అవి విజ్రుంభిస్తాయి.యోగదృష్టి ఉంటే నేను వర్ణించిన 'సీన్' అంతా ప్రత్యక్షంగా దర్శించవచ్చు.ఇది అబద్దమో అతిశయోక్తో ఎంతమాత్రం కాదు.ఇదంతా నిజమే.అయితే చూచే శక్తి మనకు ఉండాలి.

ఇలాంటి ప్రమాదాలలో చిక్కుకున్న వారిలో కొందరు ఇతరులను రక్షించి తాము బలైపోతారు.ఇది మరీ విచిత్రం.ఇలాంటి కర్మను అర్ధం చేసుకోవడంలో ఎన్నో లోతుపాతులు ఉంటాయి.ఎన్నో పెర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయి. ఆయా లోతులు గమనిస్తే దిగ్భ్రమ కలుగుతుంది.మానవజీవితం ఎంత విచిత్రమైనదో వెంటనే అర్ధమైపోతుంది.

సరే మార్మికకారణాలు అలా ఉంచుదాం.ఎవరో కొద్దిమంది తప్ప అందరూ వీటిని అర్ధం చేసుకోలేరు.అనుసరించలేరు.కనుక వాటిని కాసేపు పక్కన ఉంచి మనం మామూలుగా చెయ్యగలిగేవి ఎంతవరకూ చెయ్యగలమో చూద్దాం.

ఈరోజుల్లో విద్యార్ధులకు 'స్కిల్స్' అనేవి ఏమీ ఉండటం లేదు.కనీసం 'స్కౌటింగ్' మొదలైన నైపుణ్యాలూ, లైఫ్ సేవింగ్ స్కిల్సూ వారిలో శూన్యం.ఎంతసేపూ కోళ్ల ఫారంలో కోళ్ళను ఉంచి టైముకు గింజలువేసి వాటిచేత గుడ్లు పెట్టించినట్లుగా, కార్పోరేట్ కాలేజీలలో హాస్టళ్ళలో వారిని ఉంచి,రోజుకు ఇరవైనాలుగు గంటలూ చదివించి వాళ్ళచేత మార్కులు రాబడుతున్నారు గాని,జీవితంలో ఉపయోగపడే ఇతర నైపుణ్యాలు వారికీ ఏమీ నేర్పడం లేదు.పైగా ఎండ తగిలితే పిల్లలు కందిపోతారని ఏసీ క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.అలాంటి పిల్లలలో రోగనిరోధక శక్తి వేగంగా క్షీణించి కొంచంసేపు ఎండలోకొస్తే కూలబడి సెలైన్ పెట్టవలసిన పరిస్థితికి వారు వస్తున్నారు.

ఈ క్రమంలో విద్యార్ధులు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవడం ఒకటి.రెండోది చదువు తప్ప ఇంకేమీ చాతకాని దద్దమ్మలుగా వాళ్ళు తయారౌతున్నారు.ఎడిషనల్ స్కిల్స్ చాలా అవసరం అన్న విషయం వారికి తోచడం లేదు.మనమూ నేర్పడం లేదు.ఇది చాలా తప్పు.

పోతే,తల్లిదండ్రులు చేస్తున్న ఇంకొ ఘోరమైన తప్పు ఏమంటే,పదో తరగతికి ఇంకా రాకముందే స్మార్ట్ ఫోన్ కొని ఇవ్వడమూ ఒక స్పోర్ట్స్ బైక్ కొనివ్వడమూ అచ్చోసిన ఆంబోతులాగా ఊరిమీద వదిలేయ్యడమూ చేస్తున్నారు.దీనివల్ల ఎనిమిది తొమ్మిది తరగతులలోనే ప్రేమలు,ఇల్లు వదిలి లేచిపోవడాలు,పెళ్ళికి ముందే ఎబార్షన్లూ,నానా భ్రష్టత్వాలూ కలుగుతున్నాయి.నేర్పవలసిన అసలైన 'లైఫ్ సేవింగ్ స్కిల్స్' మాత్రం నేర్పకుండా ఇలాంటి దరిద్రాలు వాళ్లకు మనమే నేర్పిస్తున్నాం.ఏదన్నా జరిగితే మళ్ళీ మనమే ఏడుస్తున్నాం.ఇదీ మన వరస.

ఇలాంటి సంఘటనలకు వ్యవస్థా కారణమే,వారివారి కర్మా కారణమే.వ్యవస్థనూ దిద్దుకోవాలి.కర్మనూ బాగుచేసుకోవాలి.ఈ రెండు ప్రయత్నాలూ చెయ్యనంత కాలం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.

ఇంకొక విషయం.

దాదాపు ఇంకొక నెల నెలన్నరవరకూ ఇలాంటి ఘోరాలూ ప్రమాదాలూ రోజుమార్చి రోజు వినక తప్పదు.ఎందుకంటే అప్పటివరకూ గ్రహస్తితి అలాంటి దుర్ఘటనలకు అనుకూలంగా ఉన్నది.రాహుకేతువులు రాశులు మారి "స్టేబుల్" అయ్యేవరకూ అన్ని రకాలుగా జాగ్రత్త అవసరం.