“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

18, జూన్ 2014, బుధవారం

దక్షిణేశ్వర వైభవం

డిసెంబర్ 2012 లో నేను దక్షిణేశ్వర క్షేత్రం దర్శించినప్పుడు ఆశువుగా వెలువడిన 112 పద్యములూ 'పంచవటి' గ్రూప్ సభ్యులకు సుపరిచితములే. ఆ పద్యములు కావాలని పంచవటి గ్రూప్ సభ్యులు కాని కొందరు బ్లాగు చదువరులు అడిగినారు.ఈ పద్యములను అందరికీ చూపాలని ముందుగా అనుకోలేదు.దానికి కారణం అందులో కొన్ని వ్యక్తిగతములైన మహావిద్యా సాధనా రహస్యములు దాగి ఉండటమే.

కాని మిత్రులైన చదువరులు కొందరు మళ్ళీమళ్ళీ అడుగుతున్నందున ఈ పోస్ట్ లో ఆ పద్య సుమములను ప్రకటిస్తున్నాను.

పంచవటీ తీరంలో శ్రీరామకృష్ణుని దివ్యలీల ఎలా జరిగినదో తెలిసినవారికి ఈ పద్యములలో వర్ణింపబడిన సన్నివేశములు సుపరిచితములే.కనుక ప్రతి పద్యమునకూ వివరణము ఇవ్వబడలేదు.
---------------------------------------- 
వీటిలో కంద పద్యములు --58
ఆటవెలది -- 53
ఉత్పలమాల -1
---------------------------------------- 

పంచవటీ సిద్ధభూమి

1
కం|| పంచవటీ వరభూమిని
మించిన సరిభూమిలేదు మహిలో వెదుకన్
సంచిత పాపము లెల్లన్
ఇంచుకలో బాపు దివ్యనిలయం బిదియే 

2
కం|| ఎన్నో సాధన లిచ్చట
చెన్నుగ జేయంగబడెను చంద్రాత్మజుచే
పన్నిన పలు తంత్రంబులు
వన్నెల ఫలియించె నిచట వేగిర మొప్పన్ 

చతుష్షష్టితంత్ర సాధనాదివ్యభూమి

3
కం|| అరువది నాలుగు తంత్రము
లరయగ నిట నిలిచి వెలిగె నతిచిత్రముగా
సురలెల్ల రిత్త వోవగ
ధరయం దుననిట్టి వింత దుస్సాధ్యముగా !!! 

4
కం|| తొల్లిట నా పరమ శివుడు
ఉల్లము రంజిల్ల జెప్పె నుమతో వీనిన్
అల్లదె నీ పంచవటిని
చెల్లెన్ అవియన్ని మరల సల్లలితముగా 

5
కం|| భీతిని గొలిపెడి సాధన
రీతుల్ నీచేత నిలిచె నతి సులభముగా
చేతోదీప్తుల నిచ్చుచు
మాతయె నిన్నంటి నిలువ మహిమాత్మికయై 

వేద తంత్ర సమన్వయము

6
కం|| నాగేశ్వరి సమ్ముఖమున
వేగంబుగ దక్కెనీకు వేదములెల్లన్
యోగేశ్వరి సాయమ్మున
యోగించెను తంత్రచయము యోగ్యతలొప్పన్ 

7
కం|| ఇచ్చెరువు దాపున; నీ
వచ్చెరువొందంగ బొంది బహుతంత్రములన్
హెచ్చుగ శివశక్తులవే
మెచ్చుచు నీలోన గలియ మించితి వనఘా 

8
కం|| భాగీరధి తీరంబున
యోగేశ్వరిచెంత నిలువ యోగేశ్వరుడై
యోగంబుల తంత్రంబుల
వేగమె సాధించినట్టి వింతను గనుమా 

శ్రీరామకృష్ణుని నిజస్వరూపం

9
కం|| పరశివ రూపుడ వీవని
అరయంగా తెలియజేయు అద్భుతమిదియే
అరువది నాలుగు తంత్రము
లరచేతను బట్టినట్టి అమృతనాధా 

10
ఆ|| తంత్ర మొకటి నేర్వ తరియించు జన్మంబు
అఖిల తంత్రచయము లందబోవు
సర్వతంత్ర మెరుగ శివునకే సరిజెల్లు
ననగ నీదు తత్వ మిపుడె దెలిసె 

11
ఆ|| ఒక్క తంత్ర మెరుగ నొనగూడు సర్వంబు
అఖిల తంత్రమెరుగ నెవరి తరము?
శివుడు దెలియు నిచట ఘనతంత్ర సారమ్ము
మరల నీకు తెలిసె మహిని నిపుడు 

సిద్ధతంత్రభూమి

12
కం|| కందర్పాంతక బలమున
విందాయెను నీకు తంత్ర వివిధపు రీతుల్
మందాకిని తీరంబున

కందువగా కాళిలీల కన్గొని జూడన్

13
కం|| కామాఖ్య యను క్షేత్రము
అమితంబగు సిద్ధభూమి యందురు విబుధుల్
కామారినాధు డేలిన

ధామమ్మౌ పంచవటియె మేలని యందున్ 

తన సద్గురువులచే తానే పూజింపబడుట

14
కం|| ఒక్కొక తంత్రము నిచ్చట
యొకరోజున సాధించుచు యొనగొని వడిగా
సకలాగమముల నెంతయు
నికటమ్ముగ నేర్చితీవు నిశ్చల మనమున్ 

15
కం|| భైరవి యంతయు గాంచుచు
ఆరాటము మించిమీర అతి ప్రేమముతో
హే రామకృష్ణ యనుచు
ఆరాధించెను నిన్నిట ఆద్యుడ వనుచున్ 

శ్రీరామకృష్ణుని సాధనా విధానం

16
కం||జందెమ్మును తొలగించుచు
డెందమ్మున కాళినుంచి చెదరని మనమున్
అంధకార దూరుడవై
బంధమ్ముల దాటితీవు భవ్య చరిత్రా 

17
కం||పంచ కపాలాసనమున్
ఎంచగ మరి పంచతరులు యోగపు నిష్ఠల్
మించిన సిద్ధ గురూత్తము
లించుకలో నీకొసగిరి వాంఛితమెల్లన్ 

శ్రీరామకృష్ణుని అవతారతత్త్వం

18
కం|| పూర్వపు యవతారంబుల
సారంబును దాల్చి నీవు సార్ధకరీతిన్
సర్వాధిష్టిత పదమున
నిర్వ్యాజపు ప్రేమమొప్ప నిల్చితి వనఘా 

19
ఆ|| సకలసాధనముల చక్కగా కడతేర్చి
పూర్వ తంత్రచయము పుక్కిలించి
దేవతాత్మకతను తేజరిల్లుచు నీవు
ధరణి నిల్చినావు దక్షిణేశ 

20
కం|| తలచినదే తడవుగ మరి
నిలచిరి నీ ఎదుట నిఖిల నిత్యగణంబుల్
అలలన్నియు సంద్రము దెస
కలకలమని వేగిరమ్మె చెలగెడి రీతిన్ 


భక్త్యావేశం

21
ఆ|| పనికిమాలినట్టి మనుష జన్మము కన్న
చెట్టుగానొ మట్టిపుట్ట గానొ
పంచవాటికమున పడియుండగా మేలు
కోతినగుచు కొండముచ్చు నగుచు 

22
ఆ|| కొండముచ్చు కిడితి కోటి వందనములు
నాటి కోతిమూక సంతుగాన
ధరణిజాత పాద సామీప్యవర్తియై
నిలిచినందు వలన నీదు చెంత

23
కం|| వృక్షములకు మొక్కితినిట
లక్షణముగ నీకు నీడ నిచ్చిన సరణిన్
సాక్షాత్కారము లొందుచు
అక్షర పరమాత్మపదము నందిన కతనన్ 

24
ఆ|| కనుల కద్దుకొంటి నిచటి మట్టినిదీసి
శిరమునంత సరిగ చల్లుకొంటి
నీదు దివ్యపాద స్పర్శంబు నిచ్చట
అందుకొన్న బలిమి నెంత గాను 

25
కం|| ఏడీ నా ప్రేమమయుడు
ఏడీ నా హృదయపద్మ నిరతాసనుడై
ఏడీ వెలుగుల గుప్పెడి
వాడేడీ చూపుడనుచు వేడితి తరులన్ 

26
ఆ|| ఒక్కసారి చూచి యూరకుండెద నేను
మారు మాటలెల్ల నాడబోను
దాగి యున్న విభుని వేగిరమ్ముగ దెచ్చి
ముందు నిలుపుడనుచు ముచ్చటించి 

పంచభూత తన్మాత్రా సాక్షాత్కారం

27
కం|| తరులను విరులను వేడితి
మరిమరి యా వానరముల మూకల నిటనే
సరి మందాకిని నడిగితి
నీరము ననిలము నవనిని నింగిని నెంతన్ 

28
ఆ|| దివ్య ప్రేమ మొప్ప తనరారు నీరూపు
తేజతతుల మించి తేజరిల్లు
తరచిజూడ నీదు దరహాస దీపమ్ము
జన్మతతుల దాటు శక్తి నొసగు 

29
ఆ|| అన్ని దోషతతుల నక్కళించగ  జాలు
నీదు దివ్యరూప ధీధితులను
ప్రేమమించి మీర నా మానసంబునన్
నిలుపమంచు వేడి నిలిచియుంటి 

ప్రేమ -- అత్యున్నతసాధన

30
కం|| చిక్కవుగా ధ్యానంబుల
జిక్కవుగా సాధనలకు జపతప తతికిన్
చిక్కవుగా నీమంబుల
చక్కని భక్తికి మరియిక చిక్కిన రీతిన్ 

31
ఆ|| ప్రేమయున్న చోట పెరిగి సర్వము నిల్చు
ప్రేమ దివ్యమైన పెన్నిధగును
ప్రేమ యొండు జూడ పెద్ద సాధనమిలను
ప్రేమయున్నచోట బరగు ముక్తి


32
కం|| ప్రేమామృత భావనలన్
కామాదుల నక్కళించి కామారినాధు
న్గామించి మించి పలికెద
కామము లేనట్టి కామమొప్పని భువిలో 

33
ఆ || ప్రేమ దివ్యకణము పిసరైన పదివేలు
వాంఛ నిండియున్న వనితలేల?
నీదు దివ్యస్పర్శ నిముషమైననుజాలు
పసిడి కొండలేల పరగి జూడ?

కొన్ని అంతరికాభవములు

34
ఆ|| ఇచట మట్టి కణము కానైతి నదియేల?
నీదు పాదమంటి నిలిచియుండ
పారు నీరమందు బిందువైనను గాను
ప్రేమనీదు హస్తస్పర్శ నోచ 

35
ఆ|| రాతినైనగాను పాదరజము సోక
కోతినైనగాను కొమ్మమీద
ఆదరమున నీదు సాధనల్ వీక్షింప
భాగ్యమంత లేని బ్రతుకదేల? 

36
ఆ ||కోతి జన్మమైన కొండముచ్చొకటైన
నాటి కాలమందు నిలిచియుండి
నీదు దివ్యలీల వీక్షింపలేనట్టి
నాదు జన్మమేల? నవ్వుగాక 

37
కం||ఆనాటి కాలమందున
నేనాడో నిన్నుజూచి ఎనరిన మహిమన్
ఈనాడు నిన్ను దలచుచు
హేనాధా యంచు పొంగు ధన్యత గలిగెన్ 

38
ఆ||ధ్యానమందు నీవు దనరి యుండిననాడు
పక్షిగానొ మీనుగానొ యుండి
నిన్ను జూచినట్టి నిక్కంపు భాగ్యమున
మనుజ జన్మదక్కె మహిని నిపుడు 

క్షేత్రవాసులైన పశుపక్ష్యాదుల అదృష్టం

39
ఆ|| పక్షి సంఘము సురలకున్
వానరముల కెల్ల మీనులకును
కీటకాదులకును కేలు మోడ్చుచు మొక్కి
కనుల నీరుగార కరగిపోతి 

40
కం|| మాజన్మల కంటెన్; మరి
మీ జన్మల్ ఉత్తమములు;మావలె మీకున్
రోజులు రాగద్వేషపు
బూజను పంకమ్ము దగిలి బొరలవు; వింటే 

41
కం|| దివ్యాత్ముని మందిరమున
భవ్యంబుగ నిల్చి మీరు భవబంధములన్
సవ్యత నన్నిటి మించుచు
అవ్యయముగ నిట చెలగిరి దివ్యాత్మకులై 

దశమహావిద్యలు

42
ఆ||ధరణిమాతలైన దశమహా విద్యలు
కాళి తార యనుచు బరగుచుంద్రు
అఖిల తంత్రమందు నతిముఖ్యశక్తులై
వెలుగుచుంద్రు వీరు వేడ్కమీర

43
కం||దుర్వార శక్తి సిద్ధులు
గర్వమునన్ వెలుగుచుంద్రు గర్భిత దీప్తిన్
సర్వాతీతపు శక్తులు
నిర్వాణపు పదవినిచ్చు నిశ్చలకృపతో 

సాధనావిధానం

44
కం|| త్రికరణముల నర్పించక
అకళంకపు మనము లేక అటునిటు నెగురన్
వికటించును యీ విద్యలు
సకలంబుల నీయబోవు సాక్షాత్కృతులన్ 

45
ఆ|| అట్టి విద్యలన్ని అతి సులభయుక్తిగా
పొందినావు నీవు పట్టుబట్టి
కాళికాంబ నిలిచి నీలోన తానౌచు
తన్ను తానుదెలిసె తనివిదీర

46
ఆ|| పంచవటియె నిచ్చు పరమంపు భాగ్యముల
రెంటి నొకటి మించి రేపుమాపు
అఖిల సాధనముల నవలీలగా దేల్చు
ఆత్మబలిమి నిచ్చు నమ్మయగుచు 

47
కం||ద్వైతాద్వైతము లెల్లను
సంతతమిటనిలిచి వెలుగు సాయుజ్యముగా
తంత్రము మరి యద్వైతము
నంతయు నీవందుకొన్న అతిఘన మహిమన్ 

తోతాపురి గురువరుని చరిత్ర

48
కం|| నలువది ఏండ్లుగ సాధన
సలిపిన యాఘన మహిమయె సార్ధకమొప్పన్
నిలువక ఇటునటును తిరిగి
చెలువంబుగ నిటకు వచ్చి చేరితి విలలో 

49
కం|| పరమాద్వైతుడవయ్యున్
అరయంబుగ నిచటికేగు కారణ మెంతన్
ఎరుగంగ లేక నీవటు
బిరమొప్పగ వచ్చితీవు భవభయదూరా 

50
కం|| నగ్నుడవై కాయమ్మున;
భగ్నుడవై భవములెల్ల; యద్వయమందున్
మగ్నుడవై; వైరాగ్యపు
అగ్నివగుచు శమదమముల నలరితి వనఘా 

51
ఆ||అమ్మ యాజ్ఞ బొంది అద్వైత సాధనల్
మొదలు బెట్టినావు మోదమలర
నీకు గురువు గాగ నిక్కంపు యతివరుని
తోతపురిని మాత దెచ్చెనిటకు 

52
కం||ప్రతిమారాధన లొల్లడు
గతియగు బ్రహ్మంబటంచు గట్టిగ బల్కున్
మితిమీరి మాయ దగులడు
మతిమాలెడు తంతులగని మాన్యుడు నవ్వున్ 

శ్రీరామకృష్ణుని అద్వైత సాధన-నిర్వికల్ప సమాధి

53
కం||అడిగెద అమ్మను ఆపై
నడచెద నీ దారిలోన యనునీ వాక్కున్
దడవుచు తోతాపురి యిట
వడిగా నవ్వెను నినుగని వగయుచు నింకన్ 

54
ఆ||గురుని మాటమీర గురుచక్రమందున
మనసునిల్ప నీకు మహితలయము
పగలు రేయులు మూడు పరమాత్మలీనంబు
లరయ దక్కె నిచట నద్భుతముగ 

55
ఆ||నలువదేండ్లు పట్టె నిటజేర నాకేమొ
నీకు దక్కె నొక్క నిముషమందు
ఏమి వింత యనుచు వేమారు నినుజూచి
తోతగురుడు నిలచి తొట్రుబడియె 

తోతాపురికి పంచవటిలో కల్గిన భైరవ దర్శనం

56
ఉ||నల్లనివాడు; భీకరుడు; నాలుగు యెత్తుల మేనువాడు ;లో
నుల్లము నన్మహద్భయము నింపెడు నిప్పుల కళ్ళవాడు; రా
జిల్లెడు నగ్నదేహుడొక ఝామున భీకర నాదమొండు తా
నల్లన జేయుచున్ నిలిచె; నంగ్తుని ముంగిట; కౌతుకార్ధియై 

57
ఆ||భైరవుండు ఎదుట భయమొప్ప గానిల్వ
గురువరుండు జూచి గుంభనముగ
నీవు నేను నొక్క సద్వస్తు వనిజెప్పి
ఆసనమ్ము నొసగి యాదరించె 

58
కం||భయమే మించుక లేకన్
నయమున తను జేరవచ్చు నంగ్తుని జూడన్
రయమున పొంగుచు నవ్వుల;
జయమంచున్ మాయమయ్యె జంగముడిటనే 

ఆత్మజ్ఞానుల అత్యున్నత స్థితి

59
కం||అంతయు బ్రహ్మమయంబుగ
నెంతయు సరిజూచు యోగనిష్ఠుల కిలలో
పొంతగు భయరాహిత్యము
సంతతముగ తోడువచ్చు సొమ్మగు సత్యా 

60
కం||ఎచ్చట రెండగు వస్తువు
లచ్చముగా నుండబోక ఆత్మగ నిల్చున్
అచ్చెరువొందెడు యా స్థితి
నచ్చంబగు బ్రహ్మమనుచు నందురు విబుధుల్ 

తోతాపురి వెర్రి ప్రవర్తన

61
ఆ|| పగలు పంచవటిని పవ్వళించుచు నుండు
రాత్రులందు ధునిని రాజజేసి
దానిముందు నుండు ధ్యానంపు నిష్ఠలో
నిశ్చలాత్మకుండు నగ్నమౌని 

62
ఆ||లోకులతని నిద్ర లోలుండు గానెంచి
వెర్రి వాడటంచు వేసడింప
ఆత్మనిష్ఠ నిలచి యజ్ఞానమును మించి
పరగె పావనుండు పంచవటిని 

పంచవటిలో బ్రహ్మానందస్వామికి కలిగిన శబ్దబ్రహ్మ సాక్షాత్కారం

63
కం||మించుచు శబ్ద బ్రహ్మము
నించుగ తెలియంగ గోరు శిష్యోత్తముకున్
పంచన పక్షిగణంబులు
ఎంచగ వినిపించె వేద నాదములిటనే 

పంచవటిలో శివానందస్వామికి కలిగిన కుండలినీ ఉద్ధానం

64
ఆ||పంచవటిని నీవు పారాడు సమయాన
ధ్యానమందు నున్న తారకుండు
నీదు చూపు నిలువ నిలువెల్ల వణుకంగ
తనువు దడువ బొగిలె తత్క్షణమున 

పంచవటిలో అద్భుతానందస్వామికి రక్షగా నిలచిన భైరవులు 

65
ఆ||అమిత తన్మయుండు అద్భుతానందుండు
సాహసమున చేయ సాధనలను
శునకులింక రెండు చుట్టుపక్కల నిల్చి
రక్షజేసె నిచట రాత్రులందు 

గురువర్యులు నందానందస్వామి బోధ

66
కం||పెంచుము సత్సాంగత్యము
త్రుంచుము షడ్బంధనముల దడవుచు నహమున్
మించుము సాధన బలమున
నెంచుము ప్రభు రామకృష్ణ పదముల మదిలో 

67
కం||గతియని ఎంచకు లోకుల;
మతిమాలిన వంచనలన్ మెచ్చకు నెపుడున్
మితిమీరు మాయ దగులకు;
సతమున్ భావించుమతని సన్నిధి నీలో 

68
కం||తలచుచు నాతని రూపము
నిలుపుచు నా దివ్యలీల నీమది నెంతన్
మలచుము ప్రేమాస్పదునికి
నెలవుగ నీ హృదయసీమ నిత్యము సత్యా 

69
ఆ||స్నేహమెపుడు నిల్పు సత్య ప్రేమికులందు
దూరముండు మెపుడు దుర్జనులకు
సాధనాత్మకులను సాన్నిధ్యమున నుంచి
ప్రేమమయుని మదిని పట్టి నిల్పి 

70
ఆ||ఆశ దుడిచివేసి మోసమంతయు గోసి
వేషమింక లేక వేగిరమున
ఆడంబరము రోసి అహమునంతయు దీసి
పరమునందు కొనుము పంతమొప్ప 

71
ఆ||ఎంచకు లోకము నిజమని;
యెంచకుమీ బంధుతతిని హెచ్చుగ మదిలో;
త్రుంచుము నీ మోహంబుల;
పెంచుము నీ యాత్మబలము నెంతయు సత్యా 

నిజమైన సాధకులు నిన్ను వెదుక్కుంటూ వస్తారు

72
ఆ|| ప్రేమమయుని యంతరంగమ్ము ననునిల్పి
నిశ్చలాత్మ తోడ నెమ్మదించి
నిర్మలుండవగుచు నీవున్న సాధకుల్
నిన్ను జేరవత్తు రెన్నగాను 

73
కం|| ముందుగ నడువుము దారిన్
పొందుము ఘన సాధనాంత పదముల నింకన్
విందుగ నితరుల కప్పుడు
అందించగనౌను జూడ నచ్చపు సిరులన్ 

74
కం|| చపలత విడచిన మనమును
కపటము లేనట్టి నిత్య ఘనమౌ హృదియున్
అపకార రహిత చిత్తము
నెపుడును నియమించి మించి నిల్పర సత్యా 

శమదమాది షట్కసంపత్తి ఆవశ్యకత

75
ఆ|| వత్తి నూనె లేక గట్టి ముంతయు లేక
దీపమెగుర బోదు దివ్యముగను
శమము దమము లనెడి సామగ్రి లేకుండ
సిద్ధి గలుగుటెట్లు? సత్యమెన్న 

76
ఆ|| సాధకుండు జూడ సాధనమ్ముల నెంచి
పట్టి మీరవలెను మొట్టమొదట
జపము తపము లెల్ల జరిపించగా వచ్చు
మొదలు బలిమి యైన మోదమలర 

77
ఆ||పూని శమము దమము లన్నింట మించుచున్
పొందవలెను మొదట పౌరుషమున
వాని నందలేక వట్టిగా ధ్యానింప
ఓటికుండ నీరు నింపురీతి 

78
ఆ||రామకృష్ణు మదిని రంజిల్లగా నిల్పి
ప్రేమ భావములను పెచ్చుమీరి
ఆత్మసుమము దెచ్చి అర్పించి నెంతయున్
నిలిచియున్న చాలు నదియెముక్తి 

సాధనలో ఎటువంటి పట్టుదల ఉండాలి?

79
కం|| పట్టుట విడుచుట కూడదు
పట్టున నొక గట్టిపట్టు పట్టగ వలయున్
పట్టిన పట్టున్ వదలక
గట్టిగ తా సల్పవలయు ఘన సాధనముల్ 

80
ఆ|| అడుగుకొక్క బావి తవ్వ బోయెడివాడు
జలమునెల్ల నెపుడు నందబోడు
ఒక్కచోట ద్రవ్వ నొగి శక్తి మీరంగ
దాహశాంతి బడయు దరిని జేరి 

81
కం|| అన్యపు మాటల నెల్లన్
శూన్యంబులు గాగజేసి శుద్దాత్ముడవై
విన్యాసపు లోకము విడి
ధన్యాత్మను దెలిసి నిలుము ధరణిని సత్యా 

82
ఆ|| వేదమాతయైన విఖ్యాతమంత్రంబు
రామకృష్ణ పాద రంజితంబు
పట్టి వదలరాదు పదిలమ్ము గానింక
సిద్ధినొసగు నివియె శుద్ధముగను 

ఏకనిష్ఠ యొక్క ఆవశ్యకత

83
ఆ|| సర్వసిద్ధి చయము సాదరమ్ముగ నిచ్చు
క్రమము మీర నొప్పు కాలమందు
పరగి గురువులనుచు పరుగెత్తగారాదు
నియమ సాధనముల నిల్పు మదిని 

పతివ్రత అయిన పడతికి ఒక్క మగడు చాలు
నిజమైన సాధకునికి ఒక్క గురువు చాలు

84
ఆ||పాతివ్రత్య మందు పరగ నిల్చెడు నాతి
కొక్క మగడు చాలు వసుధ యందు
సత్య సాధకుండు సహధర్మ చారిగా
ఇష్టగురుని బోధ నుండవలయు 

భవిష్యదర్శనం

85
ఆ||ముందు కాలమందు యెందరో నినుజేరి
సాధనముల మించి సార్ధకులుగ
యోగపధము లంది యోగ్యులౌదు రటంచు
గురువరుండు బలికె గుట్టుగాను 

86
ఆ|| రామకృష్ణు మదిని రయముగా ధ్యానించి
నిర్మలాత్ములగుచు నిల్చువారు
దారి వెదకువారి దవ్వుజేర్చగజాలు
దివ్వెలౌదు రవని నవ్యయులుగ 

87
కం|| పంచవటీ బృందంబున్
సంచిత పాపముల నడచి సన్మార్గులుగా
నొంచుచు కరుణన్ బ్రోవగ
మంచున్ వేడితి సదయుని మ్రొక్కుచు నిటనే 

నాలుగు మహావిద్యలు

దక్షిణకాళిక

88
కం|| దక్షిణకాళీ మంత్రము
లక్షణముగ జపము జేయ నర్ధపురాత్రిన్
వీక్షించును మాత యపుడు
రక్షించును నిరతమింక రాత్రియు పగలున్ 

89
కం|| వినిపించును గజ్జెల ధ్వని
అనునిత్యము నవ్వునట్టి అదరెడు ధ్వనులున్
అణుమాత్రము భయమొందక
అనునయమున అమ్మ! యనగ నటులే బ్రోచున్ 

తారాదేవి 

90
కం|| తారామంత్ర మహాత్మ్యము
నేరీతిగ నుడువ నగును? ఈశ్వరుకైనన్
ఘోరాపదలను మించును
ఔరాయను కవితలిచ్చు నాదర మొప్పన్ 

91
కం|| ఈశ్వరుండు నిలిచి విషమెల్ల తాద్రావి
మూర్చనొంది యుండ ముద్దుజేసి
తనదు స్తన్య మిచ్చి తనియించి నాధునిన్
తిరిగి జీవమొసగె తార యపుడు 

త్రిపురభైరవి

92
కం||త్రిపురా భైరవి మంత్రము
గోపురమై నొప్పు తంత్ర గోప్యపు తతులన్
త్రిపురంబుల దాటించును
నిపుణంబుగ నద్వయమును నీదరి జేర్చున్ 

93
ఆ|| జ్ఞాన యోగములను నేకధాటి గనిచ్చు
త్రిపుర దేవి మహిమ తెలియ తరమె
మూడుస్థితుల దాటు ముచ్చటౌ జ్ఞానంబు
మాత చేతియందు మగిడి యుండు 

భువనేశ్వరి

94
కం||భువనేశ్వరి మంత్రంబిక
భువనమ్ముల కీర్తి నిచ్చు భుక్తియు ముక్తుల్
కవనమ్ముల కదనమ్ముల
వివరమ్ముగ విజయ మొసగు విఖ్యాతముగా 

95
ఆ||రాజసంబు నిచ్చి రమ్యంబుగా నిల్పు
భృత్యతతుల నిచ్చి బుజ్జగించు
మహిమనిచ్చి మించు ముద్రికాయోగంబు
భువనమాత కరుణ భూమియందు 

96
ఆ|| పంచవటిని నిలిచి పరగ జపము జేసి
నాల్గు విద్యలందు నెమ్మనమును
అతిశయించినట్టి అచ్చంపు భక్తితో
మునిగియుంటి నేను మోదమలర 

మహావిద్యానుగ్రహం

97
ఆ|| అతిఘోరశక్తులగుచును వీరలు
అమ్మ యనుచు పిలువ నాదరించి
ఐచ్చికముల నెంత నీయంగ గలరెల్ల
ఆపదలను వేగ మణగద్రొక్కి 

98
ఆ||విద్యలెల్ల మించి విప్పారు నిచ్చోట
యోగసిద్ధి గలుగు వేగిరముగ
మహిమలెల్లనిచ్చి మన్నించు నీభూమి
నీదు పాదరజపు నిఖిలమహిమ 

99
కం|| పదియౌ విద్యల యందున
హృదిలో నిండెను సరియగు నాలుగు విద్యల్
ఎదుటను నిల్చుచు నాధుడు
మది నిండుగ మంత్రములను మరువక నిచ్చెన్ 

100
ఆ|| మంత్రములను దెలిపి మహితాత్మ తేజుఁడు 
తంత్ర విధము తెలిపె తెల్లముగను
భుక్తిముక్తినిచ్చు భువనైక శక్తులన్
ముందునిలిపె నింక ముచ్చటించి 

101
ఆ||నీవు కోరినట్టి నిత్యంపు నిధులెల్ల
వేగమిచ్చు నతడు వేడ్కమీర
వేడుకొనెడి విధము వేగంబుగా నీవు
నేర్చి వేడవలయు నెమ్మనమున 

క్షేత్రపాలక దర్శనం

102
ఆ|| క్షేత్రనాధు కరుణ నాదరమ్మున బట్టి 
మునిగి చూడ మదిని మూలమునకు
దివ్యకాంతులీను భవ్యబీజంబులు
ఎదుట నిలిచి వెలిగె వన్నెలొప్ప 

వివేకానంద స్తుతి

103
కం||సప్తర్షి మండలంబున
గుప్తముగా స్తితుడవౌచు ఘనమగు దివిలో
ఆప్తుండగు పరమాత్ముని
లిప్తంబగు యాజ్ఞ మీర లీలగ భువికిన్ 

104
కం||ధర్మ స్థాపన జేయగ
కర్మ రహస్యము దెలుపుచు కావగ జనులన్
మర్మంబుగ మాయ దగిలి
నిర్మలమగు జన్మమెత్తి నిల్చితి విలలో 

ఈశ్వరకోటి లక్షణములు

105
కం||పదునెనిమిది ప్రాయమ్మున
మది నాధుని పొందు యిచ్చ యధికము కాగా
వెదకుచు గురువుల నెంతయు
సదయుని చేరంగ వచ్చి చెలగితి విటనే 

106
కం||ఇరువది మూడవ ఈడున
అరయంగా నిర్వికల్ప యవధుల నెంతన్
నిరవధికమ్ముగ మీరుచు
పరమాత్ముని ప్రేమమీర బొందితి వనఘా 

ధర్మరక్షణ

107
కం||అవతారుని భావజలధి
నవలీలగ లోతులెరిగి ఆద్యన్తముగా
వివరించుచు వేదార్ధము
చవి నొసగితివొక్క దివ్య సంఘము భువిలో 

108
కం||వేదాంతార్ధము నెంతయు
సాదరముగ తెల్పినీదు సద్వాక్కులచే
చెదరిన ధర్మము నెంతయు
కుదురుగ నిలబెట్టినావు కలియుగమందున్ 

109
ఆ||గురుని యాన నిలుపు గుణవంతు డవునీవు
ధర్మరక్ష జేయు దివ్యరూప
వీగిపోయినట్టి విఖ్యాత ధర్మమున్
నిలిపినావు మరల నిర్మలముగ 

110
ఆ||భరతదేశమెల్ల బాగుగా నడయాడి
కన్యకాగ్రమందు కనుల దెఱచి
పశ్చిమాన చెలగి పరగ ధర్మము నిల్పి
సత్యదీప్తి నొసగి సత్వరముగ 

ఐచ్చికమరణం

111
||నీదు కార్యమింక నిక్కంబుగా దీర్చి
బంధతతుల మించి భవ్యముగను
బ్రహ్మరంద్ర భేద బహుయోగ దీప్తులన్
దరిని జేరి నీదు ధామమునకు 


112
||నలువదేండ్ల నెపుడు నేజూడ బోనంచు
పలికి తెల్పినావు  పావనాత్మ
స్వేచ్చతోడ విడచి శారీరబంధంబు
నిలిచి వెలిగితీవు నీదు దివిని