19, ఏప్రిల్ 2022, మంగళవారం

రాబోయే 14 ఏళ్ళు - పంచవటి ఆశ్రమం - లోకం నడక

సరిగ్గా 14 ఏళ్ల క్రితం, అంటే 2008 లో 'ఆలోచనా తరంగాలు' బ్లాగ్ వ్రాయడం మొదలుపెట్టాను. దానికి ప్రేరణ - అప్పటికి 30 ఏళ్లుగా నేను నడుస్తున్న ఆధ్యాత్మికమార్గంలో పొందిన అనుభవాలను, అందుకున్న జ్ఞానసంపదను, అర్హతలున్న నలుగురికీ పంచాలన్న ఉద్దేశ్యమే. సరిగా అదే సమయంలో, వరుణగ్రహం కుంభరాశిలోకి అడుగుపెట్టింది. ఇంటర్ నెట్ అనేది కళ్ళు తెరిచి ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చేసింది. భూగోళం మూలమూలల్లో ఉన్న ఏకమనస్కులైన మనుషులందరూ వర్చువల్ గా ఒకచోటకు చేరడం మొదలైంది.

ఈ 14 ఏళ్లలో నా భావజాలం నచ్చిన ఎందరో నన్ను అనుసరిస్తూ వచ్చారు. వారిలో కొందరు ఎంతో ఆత్మీయులుగా మారారు. కొందరు మధ్యలో మనసులు మార్చుకుని వేరేదారులలో వెళ్లిపోయారు. నేను అవేవీ పట్టించుకోకుండా, నా భావజాలాన్ని లోకానికి పరిచయం చేస్తూ వచ్చాను. ఇప్పటికి 58 ప్రామాణికములైన పుస్తకాలను వ్రాశాను. వాటిలో 40 ప్రచురింపబడ్డాయి. మిగతావి రాబోతున్నాయి. మొత్తం 100 పుస్తకాలను వ్రాయాలన్నది నా సంకల్పం.

నా భావజాలాన్నీ సాధనామార్గాన్నీ వివరిస్తూ ఎంతో వ్రాశాను. ఉపన్యాసాలలో చెప్పాను. 20 రోజులపాటు రాత్రీపగలూ ఆపకుండా వినగలిగినంత నిడివిగల నా ఆడియో ఉపన్యాసాలు ఇప్పటికే తయారయ్యాయి. ఇవన్నీ పంచవటి సభ్యులకు అందుబాటులో ఉన్నాయి.

కుంభరాశి అనేది లోకానికి నీరుపోస్తున్న మనిషి ఆకారంలో ఉంటుంది. అంటే, బోధన చెయ్యడం, ఉపకారం చెయ్యడం, సాయం చెయ్యడం, జీవాన్ని అందించడం మొదలైన సూచనల రూపంలో దీని ఆకారం ఉంటుంది. ఈ చిత్రానికి అనుగుణంగానే ఈ పద్నాలుగు ఏళ్లలో నా భావజాలం ఏమిటో లోకానికి బోధింపబడింది. ఈ కోణంలో చూస్తే, కుంభరాశి అద్భుతంగా పనిచేసింది.

నిన్నటినుంచీ వరుణుడు మీనరాశిలోకి అడుగుపెట్టడంతో, నేను నడుస్తున్న దిశాగమనం మారింది.

మీనం అంత్యరాశి మరియు ఆధ్యాత్మికరాశి. ఇక్కడ మాటలుండవు. అనుభవం మాత్రమే ఉంటుంది. కనుక రాబోయే 14 ఏళ్లలో, నిజమైన ఆధ్యాత్మికశక్తి అనేది లోకానికి చూపించబడుతుంది. ఇప్పటివరకూ చెప్పిన బోధన, సాధనారూపాన్ని దాల్చి, మానవాతీతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ ట్రెండ్ 2036 వరకూ నడుస్తుంది.

ఇది పంచవటిలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది.

మీరు గమనించారా? గత 14 ఏళ్లుగా సోషల్ మీడియా ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. కుంభంలో నుంచి పారే నీటిలా, కమ్యూనికేషన్ వరదలై పారింది. అన్నీ అందరికీ తెలిశాయి. సమాచారం ప్రతివారి టిప్స్ లో ఉంటూ వచ్చింది. ఇదంతా కుంభరాశిలోని వరుణుని ప్రభావం.

కానీ ఇప్పుడు ట్రెండ్ మారబోతున్నది.

ఉత్త సమాచారమనేది కొంతకాలానికి బోరు కొడుతుంది. ఎంతసేపూ తెలుసుకుంటూ ఉండటమేనా? తెలుసుకున్నదానిని అనుభవంలోకి తెచ్చుకోవద్దా? అనే ధోరణి మొదలౌతుంది. కనుక నేటినుంచీ ప్రాక్టికాలిటీ మీద ఫోకస్ ఎక్కువౌతుంది. సమాచారాన్ని తెలుసుకోవడమేగాక, తెలుసుకున్న దానిని ఆచరణలోకి తెచ్చుకుని లాభాలను పొందాలనే ప్రాక్టికల్ ధోరణి నేటినుంచీ విపరీతంగా పెరగబోతున్నది. మీనం ఆధ్యాత్మికరాశి గనుక ఆ కోణంలో ఇది ఉంటుంది.

అయితే, ఇది రెండు రకాలైన దారులలో నడుస్తుంది.

ఒకటి - మీనరాశి సూచించే సక్రమమైన ఆధ్యాత్మికమార్గం.

లోకంలో ఎందరోగురువులు ఎన్నోస్కూల్స్, ఎన్నోమార్గాలు కుప్పలుతెప్పలుగా ఉన్నప్పటికీ,  దురదృష్టవశాత్తూ అసలైనవీ సరైనవీ చాలాకొన్నే ఉన్నాయి. 'మహాత్మా' అని పేరుపెట్టుకున్నవారందరూ మహాత్ములు కానట్లే, సద్గురువులమని ప్రచారాలు చేసుకునే వారందరూ సద్గురువులూ కారు. ప్రచారం లేకుండా గుప్తంగా ఉన్నవారు కాకుండానూ పోరు. లెక్కనేది ఉండవలసింది దేవుడి దృష్టిలోగాని, మనిషి దృష్టిలో కాదు. కనుక, సక్రమమైన ఆధ్యాత్మికదారులు కూడా ఇప్పుడు అందరికీ తెలిసేలాగా ఓపెన్ అవుతాయి. అసలైన ఆధ్యాత్మికచింతన అనేది వెల్లువలాగా లోకాన్ని ముంచెత్తుతుంది. ఎంతోమంది మనుషులు అతీతమైన ఆధ్యాత్మికానుభవాలను పొందుతారు.

రెండు - వరుణుడి అధీనంలో ఉండే వ్యసనాలు.

మానవజాతిలో అందరూ ఒకేసారి ఆధ్యాత్మికులు కాలేరు గనుక, అదిలేనివాడికి మిగిలింది వ్యసనాలే గనుక, మనుషులలో ఎక్కువమంది వ్యసనపరులౌతారు. అంటే, త్రాగుడు, డ్రగ్స్, సెక్స్ మొదలైన వ్యసనాలు విపరీతంగా పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్,  రాబోయే 14 ఏళ్లలో వరదలాగా విజృంభిస్తుంది. ప్రస్తుతం 13, 14 ఏళ్ల వయసులో ఉన్నవారిమీద ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సరియైన దారిలో పెట్టబడకపోతే, ఈ తరం పిల్లలందరూ ముందుముందు వ్యసనపరులయ్యే ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా మిక్కుటంగా ఉంది.

ఇదీ, ముందుముందు 14 ఏళ్లలో ప్రపంచం నడవబోయే తీరు.

'పంచవటి' లో మాత్రం, ఆచరణాత్మకమైన అసలైన ఆధ్యాత్మికత విజృంభించబోతున్నది. పంచవటి సభ్యులు, దానిని అనుసరిస్తున్నవాళ్ళు, నేటినుంచీ నిజమైన ఆధ్యాత్మికశక్తి యొక్క ప్రభావాన్ని ప్రత్యక్షంగా స్పష్టంగా రుచి చూడబోతున్నారు. గమనించుకుంటే, చాలామంది జీవితాలలో ఈ మార్పులను వారు ఇప్పటికే గమనిస్తారు.

2022 ఆగస్టు నుండి క్రియాశీలం కాబోతున్న మా ఆశ్రమం, నిజమైన ఆధ్యాత్మికశక్తికీ, ధ్యానమయమైన జీవితానికి, అతీతములైన యోగానుభవాలకూ కేంద్రబిందువు కాబోతున్నది. వరుణగ్రహం రాశిమార్పు దీనినే సూచిస్తున్నది !

ఈ జోస్యం నిజం కావడాన్ని ముందుముందు మీరందరూ చూడబోతున్నారు !

read more " రాబోయే 14 ఏళ్ళు - పంచవటి ఆశ్రమం - లోకం నడక "

వరుణుని (నెప్ట్యూన్) మీనప్రవేశం - ఫలితాలు

నా జ్యోతిష్యవిధానంలో, శనికక్ష్యకు బయటగా ఉన్న యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో గ్రహాలను కూడా నేను లెక్కిస్తాను. ఇప్పుడు శాస్త్రవేత్తలు ప్లూటోను గ్రహంగా లెక్కించడం లేదు. కానీ చాలా రుజువులు కనిపించిన మీదట, ఇప్పటికీ ప్లుటోను కూడా గ్రహంగానే నేను లెక్కిస్తాను.

ఇకపోతే, నెప్ట్యూన్ ను వరుణుడు అని మనం పిలుస్తాం. ఈ గ్రహం ఒక్కొక్క రాశిలో 14 ఏళ్లపాటు ఉంటుంది. గతంలో, 25 ఏప్రియల్ 2008 న మకరాన్ని వదలిపెట్టి కుంభంలోకి ప్రవేశించింది. అప్పటినుంచీ నిన్నటివరకూ కుంభంలో ఉన్నది. నిన్న, కుంభాన్ని వదలి మీనంలోకి ప్రవేశించింది. మరొక్క 14 ఏళ్లపాటు అంటే, 2036 వరకూ మీనంలో సంచరిస్తుంది.

ఈ గోచారఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం.

------------------------------------------------------------------------

మేషం

చాలాకాలం నుంచీ ఉంటున్న ప్రదేశాన్ని విడచిపెడతారు. లాభం తగ్గుతుంది. ఖర్చు ఎక్కువౌతుంది.

వృషభం

లాభాలతో కూడిన జీవితం మొదలౌతుంది. ఇది 2036 వరకూ నడుస్తుంది. ఊహించినదానికంటే ఎక్కువ కూడబెడతారు.

మిధునం

వీరి వృత్తి ఉద్యోగాలు మందగిస్తాయి. అయితే, లిక్కర్ వ్యాపారం మాత్రం బాగుంటుంది. వైద్యులకు బాగుంటుంది.

కర్కాటకం

దూరదేశాలకు వెళతారు. భక్తిమార్గంలో మునుగుతారు. ఆధ్యాత్మికచింతన, ముఖ్యంగా తంత్రసాధన రాణిస్తుంది.

సింహం

పిత్రార్జితం కలసి వస్తుంది. విపరీతమైన లాభాలుగాని, విపరీతమైన నష్టాలు గాని ఉంటాయి. త్రాగి వాహనాలు నడిపితే యాక్సిడెంట్లో పోతారు.

కన్య

వివాహజీవితం, సమాజసంబంధాల పైన ఫోకస్ ఉంటుంది. ఘర్షణ తప్పదు. మాఫియాలతో, దొంగలముఠాలతో సంబంధాలు ఏర్పడతాయి.

తుల

శత్రుబాధ, రోగబాధ పెరుగుతాయి. జలప్రమాదం జరుగుతుంది. త్రాగుడుకు బానిసలై లివర్, కిడ్నీ జబ్బులు తెచ్చుకుంటారు.

వృశ్చికం

ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది. పిల్లలు వ్యసనాలకు బానిసలై పాడైపోతారు.

ధనుస్సు

తల్లికి గండం. జాతకులకు మానసిక వ్యాధి లేదా గుండెజబ్బు తలెత్తవచ్చు.

మకరం

అతివాగుడు, మాటదూకుడు ఎక్కువౌతాయి. జలగండం ఉంది.

కుంభం

కుటుంబం పెరుగుతుంది. మాట చెల్లుబాటు అవుతుంది.

మీనం

త్రాగుడుకు వ్యసనాలకు బానిసలౌతారు. లేదా అసలైన ఆధ్యాత్మికమార్గంలో ఉంటే రాణిస్తారు.

ఈ ఫలితాలు చాలా విశాలమైన పరిధిలో ఉంటూ 14 ఏళ్లపాటు నడుస్తాయి. వీటిలోపల మిగతా గ్రహాల ప్రభావం నడుస్తుంది. ఈ మొత్తం సమీకరణాన్ని అర్ధం చేసుకుంటే, మన జీవితమేంటో, ఎలా నడుస్తుందో అర్ధమౌతుంది.
read more " వరుణుని (నెప్ట్యూన్) మీనప్రవేశం - ఫలితాలు "

18, ఏప్రిల్ 2022, సోమవారం

అవధూత - అవదూత

'ఒద్దురా చూడకండిరా తలలు పాడౌతాయి' అని ఎంత మొత్తుకున్నా కూడా నా శిష్యులు కొంతమంది యూ ట్యూబ్ లో నానాచెత్తా చూస్తూనే ఉంటారు. అందులోనుంచి నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.

'Wandering Mystic' అనే పదం గురించి మీ అభిప్రాయం ఏమిటి గురువుగారు?' అంటూ ఈ మధ్యనే ఒక శిష్యపరమాణువు అడిగాడు.

ఎవరిగురించి ఈ మాటను అడుగుతున్నాడో అర్ధమైంది.

'నువ్వు పుట్టడానికి 20 ఏళ్ల ముందు ఆ మాటను మొదటిసారి విన్నాను' అని చెప్పాను.

పరమాణువు దానిని పట్టించుకోలేదు.

'ఈ మధ్య కొందరు స్వామీజీలు సైకిలు యాత్రలు, పాదయాత్రలు, కారు యాత్రలు చేస్తున్నారు. వాళ్ళు తమను తాము ఈ విధంగా పిలుచుకుంటున్నారు. అందుకని అడిగాను.  వాళ్ళను ఆ పేరుతో పిలవవచ్చా?' అడిగాడు.

'మనకి తెలివి లేకపోతే ఏమైనా పిలవవచ్చు' అన్నాను.

'అసలా పదానికి అర్ధం చెప్పండి గురూజీ' అడిగాడు పరమాణువు.

'ఏం లేదు. గాలిలా గాలికి తిరిగేవాడు అని అర్ధం. అవధూత అని కూడా మన గ్రంధాలలో అంటారు. దత్తాత్రేయులవారు ఆ పదానికి అసలైన నిర్వచనం' అన్నాను.

'అయితే, తిరగడం తప్పంటారా?' అన్నాడు.

'తిరగడం తప్పుకాదు. పనిమీద తిరగడం తప్పు. అవధూతకు పని ఉండదు' అన్నాను.

'వివేకానందస్వామి, పరమహంస యోగానంద మొదలైన వాళ్ళు ఎన్నో దేశాలలో తిరిగి ధర్మప్రచారం చేశారు కదా? వాళ్ళు అవధూతలు కారా?' అడిగాడు.

'కారు. అవధూతది వారికంటే పైస్థాయి. అయితే, వారుకూడా స్వార్ధపూరితంగా తిరగలేదు. నిస్వార్ధంగా ధర్మప్రచారం చేసి లోకానికి వెలుగుదారిని చూపించారు. అవధూత అదికూడా చెయ్యడు. లోకం ఎలా పోయినా అతనికనవసరం. నీవు చెప్పినవారు మహనీయులే గాని, అవధూతలు కారు. ధర్మం క్షీణించిన ఒక కాలంలో వారు వచ్చారు. దానికి కొంచం బలాన్నిచ్చి వెళ్లిపోయారు' అన్నాను.

'మరి నేడు దేశాలు తిరుగుతున్న స్వామీజీలు ఏ కేటగిరీలోకి వస్తారు?' అడిగాడు.

'అందరూ ఒకే కేటగిరీలోకైతే రారు. స్వార్ధం లేకుండా, వ్యాపారం చెయ్యకుండా, అసలైన సనాతనధర్మాన్ని ఉన్నదున్నట్లు చెబుతుంటే వారు మహనీయులు. లేకుంటే కాదు' అన్నాను.

'మనం కూడా ఆశ్రమం పెడుతున్నాం కదా? మనం ఏ కేటగిరీలోకి వస్తాము?' అన్నాడు.

'మనమైనా, ఎవరైనా అంతే. పైన చెప్పిన రూలే' అన్నాను.

'మరి Wandering Mystic లక్షణాలెలా ఉంటాయి?' అడిగాడు.

'అతను దేనికీ అంటడు, దేనినీ అంటించుకోడు. దేనినీ కట్టుకోడు. దేనికీ కట్టుబడడు. ఒక స్థిరమైన భావజాలమంటూ అతనికి ఉండదు. ఒక స్థిరనివాసమూ ఉండదు. లోకమే అతని ఇల్లు. శ్రీవిద్యారహస్యం 25 వ అధ్యాయం చదువు తెలుస్తుంది' అన్నాను.

'అలాంటివాళ్ళసలు ఉన్నారా?' అడిగాడు. 

'ఉన్నారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దత్తాత్రేయస్వామి అలాంటివారే' అన్నాను.

'ఆయనక్కూడా అవతారాలను సృష్టించారు కదా మనవాళ్లు? అవి నిజాలేనా?' అడిగాడు.

'ఆ సృష్టించిన వాడినే అడుగు. నేను సృష్టించలేదు. నాకు తెలీదు. నా అవతారమే నాకర్ధం కావడం లేదు. ఇక దత్తాత్రేయస్వామికి ఎన్ని అవతారాలో నాకేం తెలుస్తుంది?' అన్నాను. 

'మరి అవధూతలమని ప్రచారాలు చేసుకుంటున్నవాళ్లంతా ఎవరై ఉంటారు?' మళ్ళీ అడిగాడు  పట్టువదలని పరమాణువు.

నాకు విసుగు మొదలైంది.

'బహుశా అవదూతలై ఉంటారు' అన్నాను.

'అంటే?' ప్రశ్నార్ధకంగా ధ్వనించాడు పరమాణువు.

'అంటే, అవలక్షణాలున్న దూతలని అర్ధం. ఎవరి దూతలో నువ్వే తెలుసుకో. ఇక విసిగించకు, పనిచూసుకో' అని ముగించాను.

కధ కంచికి మనం ఆఫీసుకి.

read more " అవధూత - అవదూత "

16, ఏప్రిల్ 2022, శనివారం

కర్ణపిశాచి - భవిష్యత్ జోస్యం

పొద్దున్నే కర్ణపిశాచి ఫోన్ చేసింది.

'ఏంటి చాలా రోజులకి వినిపించావ్?' అడిగా.

'ఉద్యోగంలో ఈ మధ్య కొంచం బిజీగా ఉన్నా. నేనేం నీలాగా పర్మనెంట్ జాబ్ కాదుకదా. కష్టపడాలి తప్పదు' అంది. 

'సర్లే ఏంటో చెప్పు' అన్నా. 

'ఏం లేదు. నువ్వెప్పుడూ జరిగిపోయిన తర్వాత జ్యోతిష్యాలు రాస్తుంటావు కదా. కనీసం ఒక్కసారైనా ముందు జరగబోయేది చెప్పు'  అని ముచ్చటపడింది.

'ఏంటి అవమానిస్తున్నావ్? పాతపోస్ట్ లు చదువు ఒక్కసారి. సత్యసాయిబాబా ఎప్పుడు పోతాడో డేట్స్ తో సహా చెప్పా కరెక్ట్ గా. అలాంటివి బొచ్చెడున్నాయి' అన్నా.

'సర్లే గతం ఎందుకుగాని ఇప్పుడు చెప్పు ప్లీజ్' అని బతిమాలింది.

'సర్లే వినుకో. మే 13 కి అటూ ఇటూగా యూకే లో గాని, పాకిస్తాన్ లో గాని ఒక సంఘటన జరుగుతుంది. అది ఒక ప్రముఖవ్యక్తి మరణం గాని, ఒక దుర్ఘటన గాని అవుతుంది' అన్నా.

'సరే పందెం. జరగకపోతే ఏంటి చెప్పు?' అడిగింది.

'జరగకపోతే, నిన్ను నేను వెకేషన్ ట్రిప్ కి తీసికెళ్తా నువ్వు కోరుకున్న చోటకి' అన్నా సీరియస్ గా.

'జరిగితే?' అంది

'జరిగితే నువ్వు నన్ను తీసికెళ్లాలి' అన్నా.

'అంటే, ఏది జరిగినా నాకు తప్పదన్నమాట?' అంది

'అంతేగా మరి?' అన్నా.

'అలాగా? ఏం మనుషులు చాల్లేదా పిశాచాలతో పెట్టుకుంటున్నావ్?' అంది.

'పొద్దున్నే నా పనేదో నేను చేసుకుంటుంటే ఫోన్  చేసి కదిలించింది ఎవరు?' అన్నా కోపంగా. 

'సర్లే నిన్నడిగాను చూడు అది నా తప్పు. ఇప్పుడు చూడు ఇరుక్కుపోయాను. సరే 14 న కలుస్తా మళ్ళీ. మేం మాటిస్తే తప్పం అది మా పిశాచాల రూలు' అంది.

'నేను బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉంటా' అన్నా నవ్వుతూ.

'ఖర్మ' అంటూ ఫోన్ కట్ చేసింది కర్ణపిశాచి.

కధ కంచికి మనం పనిలోకి.

read more " కర్ణపిశాచి - భవిష్యత్ జోస్యం "

9, ఏప్రిల్ 2022, శనివారం

మా క్రొత్త పుస్తకం 'దృగ్దృశ్య వివేకము' విడుదలైంది

ఈరోజు శ్రీరామనవమి. మన భారతీయులకు చాలా పవిత్రమైన రోజులలో ఒకటి.

అందుకని ఈ రోజున మా సంస్థనుండి మరొక అమూల్యమైన గ్రంధాన్ని విడుదల చేస్తున్నాను. దానిపేరు -
'దృగ్దృశ్య వివేకము'. శృంగేరీపీఠ జగద్గురువులైన శ్రీ భారతీతీర్ధస్వామివారు రచించిన  అమూల్యమైన ఈ అద్వైతగ్రంధానికి నా వ్యాఖ్యానం ఈ రోజున విడుదలవుతున్నది. 

ఇది నా కలం నుండి వెలువడుతున్న 40 వ పుస్తకం.

శ్రీ భారతీతీర్ధస్వామివారు క్రీ. శ 1328 నుండి 1370 వరకూ శృంగేరీపీఠానికి జగద్గురువులుగా ఉన్నారు. విజయనగర సామ్రాజ్య స్థాపనాచార్యులైన శ్రీ విద్యారణ్యస్వామివారికి వీరు గురువులు. విజయనగరరాజైన హరిహరరాయలు, వీరిని ఎంతో గౌరవించి, కొంత భూమిని వీరికి దానమిచ్చినట్లు శాసనములున్నాయి.

కనుక ఈ పుస్తకం దాదాపు 700 ఏళ్ల నాటిది.

'దృగ్దృశ్య వివేకము' అంటే, 'చూచేవాడు, చూడబడేది' అనిన వివేకమని అర్ధం. సమాధిస్థితిని చక్కగా వివరించడం ఈ గ్రంధపు ప్రత్యేకత. సమాధి, సవికల్పము, నిర్వికల్పము అంటూ రెండు విధములని చెబుతూ, వీనిలో సవికల్పమనేది మరలా దృశ్యానువిద్దము, శబ్దానువిద్ధమని రెండు విధములుగా ఉంటుందని వర్ణిస్తుంది. ఈ రెంటినీ మించినది నిర్వికల్పము.

వెరసి ఈ మూడుసమాధులు, బాహ్యాంతరభేదములతో ఆరువిధములుగా ఉంటాయని, ఈ ఆరువిధములైన సమాధులను సాధకులు నిత్యమూ అభ్యసించవలసి యుంటుందని, అప్పుడు సాధనలో చరమావస్థయైన బ్రహ్మప్రాప్తి వారికి కలుగుతుందని చెప్పబడింది. 

దీనిలో 46 సంస్కృతశ్లోకాలున్నాయి. వీటికి సరళములైన 46 తెలుగు పద్యములను ఆటవెలదిలో వ్రాసి, ఒక్కొక్క శ్లోకానికీ ఇంకా సులభమైన వివరణనిచ్చాను.

మా 'పంచవటి పబ్లికేషన్స్' నుండి విడుదలైన ఇతర గ్రంథములతో బాటు ఈ గ్రంధం కూడా, అద్వైతాభిమానులైన జిజ్ఞాసువుల అభిమానమును చూరగొంటుందని నా విశ్వాసం.

ఈ గ్రంథరచనలో నాకు చేదోడువాదోడుగా నిలిచిన నా శ్రీమతి సరళాదేవికి, సంస్కృత శ్లోకములను తెలుగులోనికి తెచ్చి, ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ మొదలైన పనులలో నిరంతరం సహకరించిన శిష్యురాళ్లు అఖిల, లలితలకు, ముఖచిత్ర డిజైనర్ శిష్యుడు ప్రవీణ్ కు నా కృతజ్ఞతలు ఆశీస్సులను తెలియజేస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం కూడా google play books నుండి లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా రాబోతున్నది. చదివి ఆనందించండి మరి !

read more " మా క్రొత్త పుస్తకం 'దృగ్దృశ్య వివేకము' విడుదలైంది "

4, ఏప్రిల్ 2022, సోమవారం

2, ఏప్రిల్ 2022, శనివారం

ఇమ్రాన్ ఖాన్ జాతకం - గోచార శపితయోగం


పాకిస్తాన్ పరిస్థితి దృష్ట్యా ఇమ్రాన్ ఖాన్ జాతకంవైపు ఒక చూపును సారిద్దాం. పండగనాడు కూడా పాతమొగుడేనా అన్నట్టు, ఉగాది పండుగనాడైనా సాయిబుగారి జాతకం చూద్దాం.

జాతకానికి అలాంటి పట్టింపులేవీ ఉండవుగా మరి !
 
పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్, 5 అక్టోబర్ 1952 న లాహోర్ లో పుట్టాడు. ఇతనిది అశ్వనీ నక్షత్రం. ఈ నక్షత్రం వారికి దేహశక్తి ఎక్కువగా ఉంటుంది. గుర్రంలాగా కష్టపడగలరు. కనుక, మిలటరీ, ఆటలు, బాక్సింగ్ వంటి యుద్ధవిద్యలు వీరికి బాగా నప్పుతాయి. కుజుడు గనుక మంచిస్థితిలో ఉంటే వీటిలో రాణిస్తారు. ఈ జాతకంలో కుజుడు మిత్రస్థానం లోనే ఉన్నాడు. నవాంశలో స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. పైగా, గజకేసరీయోగంతో కోణదృష్టిలో ఉన్నాడు. కుజబలం ఉంది గనుక క్రికెటర్ గా రాణించాడు.

ఇదే గజకేసరీయోగం అధికారాన్ని కూడా ఇచ్చింది. దానికి బలం చేకూర్చినది ఉచ్చబుధునితో కలసి ఉన్న బుధాదిత్య యోగం. అందుకే పాకిస్తాన్ కు పీఎం అయ్యాడు. అయితే, శనిస్పర్శవల్ల ఈ యోగం భంగమైపోతుంది. దీనికి ముహూర్తం సరిగ్గా ఫిబ్రవరి 24 న, అదికూడా శనీశ్వరునితోనే, పడింది. ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, చేసిన తప్పులకు శిక్షలు వేసేది శనీశ్వరుడే అని. దీనిని ఎవరూ తప్పించుకోలేరు. 

24 ఫిబ్రవరి 2022

ఆ రోజున ఇమ్రాన్ రష్యా వెళ్ళాడు పుతిన్ని కలవడానికి. ఆ సమయంలో అతని జాతకం ఏమీ బాగాలేదు. కారణం? గోచారశని ఆ రోజున అతని రాహువుమీద డిగ్రీయుతితో సంచరించాడు. ఇది శపితయోగాన్ని నిద్రలేపుతుంది. ఇతని నవాంశలో శనిరాహువు లిద్దరూ సింహంలో ఉన్నారు. అధికారపరంగా శపితయోగం ఉంది. కనుక అదేరోజున ఇమ్రాన్ ఖర్మకాలింది.

సరిగ్గా, అదేరోజున పుతిన్, ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ సమయంలో ఇమ్రాన్ పక్కనే హోటల్లో టిఫిన్ చేస్తున్నాడు. ఆ సమయానికి అతనక్కడుండటం అమెరికాకు అనుమానం తెప్పించింది. 'వీడు మనతో నాటకాలేస్తున్నాడు. మనదగ్గర డబ్బులు తీసుకుని రష్యాకు వంతపాడుతున్నాడు. వీడిని దించేద్దాం' అనుకుంది. పావులు కదిపింది. తన చేతిలో ఉన్న పాక్ రాజకీయవర్గం చేత ఇమ్రాన్ ప్రభుత్వానికి సపోర్ట్ విరమింప జేయించింది. అవిశ్వాస తీర్మానం పెట్టించింది. ఇమ్రాన్ పని అయిపోయింది. రేపటితో ఇతని పదవి ఊడిపోతుంది.

నవాంశలోని శపితయోగం అలా పనిచేసింది.

ఇతనిజాతకంలో గజకేసరీయోగం ఉంది నిజమే. అయితే,  గురువు వక్త్రత్వం వల్ల అది బలహీనంగా ఉంది. ప్రస్తుతం ఇతనికి నడుస్తున్న గోచార శపితయోగం ముందు దాని బలం వీగిపోయింది. పదవీగండం ఏర్పడింది.

నవాంశలో ఇంకొక యోగం కూడా ఉంది. అదే, మిథునంలో అమావాస్యయోగం. మిథునమంటే అమెరికా. కనుక, అమెరికా వల్ల ఇతని జీవితంలో అమావాస్య ఏర్పడింది. ఏ అమెరికాను చూచుకొని ఇన్నాళ్లూ మనతో విర్రవీగారో అదే అమెరికా వల్ల ఇప్పుడు పాకిస్తాన్ లో ప్రభుత్వం మారుతోంది.

ఈ తెలుగు ఉగాది ఇమ్రాన్ పదవికి ఎసరుపెట్టబోతున్నది. షెబాజ్ షరీఫ్ కు అదృష్టం పట్టబోతున్నది. ఈ విధంగా గ్రహాలముందు రాజులూ మహారాజులూ కూడా తలలు వంచవలసిందే మరి ! ఆఫ్టరాల్ వాళ్ళూ మనలాంటి మానవమాత్రులేగా !
read more " ఇమ్రాన్ ఖాన్ జాతకం - గోచార శపితయోగం "

మా క్రొత్త పుస్తకం "అపరోక్షానుభూతి" విడుదలైంది.

నేడు శుభకృత్ నామ సంవత్సర ఉగాది. గత రెండేళ్లుగా మానవజాతి పడుతున్న బాధలనుండి విముక్తి లభించి, శుభం జరిగే సంవత్సరం  మొదలౌతున్నది. అందుకని, ఈ రోజున మా సంస్థనుండి మరొక అమూల్యమైన గ్రంధాన్ని విడుదల చేస్తున్నాను.

నా కలం నుండి వెలువడుతున్న 39 వ పుస్తకంగా, ఆదిశంకరులవారు రచించిన అమూల్యమైన అద్వైతగ్రంధం 'అపరోక్షానుభూతి' ఈ రోజున విడుదలవుతున్నది. ఈ గ్రంధం వయసు కనీసం 1300 ఏళ్ళు.

'అపరోక్షానుభూతి' అంటే Direct Experience అని అర్ధం.

దీనిలో 144 సంస్కృతశ్లోకాలున్నాయి. వాటికి హృద్యములైన 150 తెలుగు పద్యములను వ్రాసి, ఒక్కొక్క శ్లోకానికీ సులభమైన వివరణనిచ్చాను. అద్వైతమంటే ఏమీ తెలియనివారు కూడా, ఈ గ్రంధమును చదవడం వల్ల దాని లోతుపాతులను, అసలైన అర్ధాలను సులభంగా తెలుసుకోగలుగుతారు.

నేటి ఆధ్యాత్మికలోకంలో చాలా గందరగోళాలున్నాయి. దానికి అనేక కారణాలు.  వాటిలో ఒక కారణం - సాంప్రదాయమార్గాలను, తత్త్వాలను, గ్రంధాలను ఎవరికిష్టం వచ్చినట్లు వారు వ్యాఖ్యానిస్తూ ఉండటమే. విశృంఖలంగా విజృంభిస్తున్న సోషల్ మీడియా కూడా దీనికి పాలుపోస్తున్నది. ఇలాంటి గందరగోళాలలో ఒకటి, అద్వైతమంటే ఏమిటో సామాన్యజనానికి తెలియకపోవడం. 'అదేంటో మాకు తెలుసు' అనుకుంటున్నవారు కూడా, అసలైన దృష్టికోణం లేకపోవడంతో, అద్వైతాన్ని తప్పుగా అర్ధం చేసుకుని, తమకు తెలిసినదే అద్వైతమనిన భావనలో ఉన్నారు. మా గ్రంధం, ఈ అపప్రధను దూరం చెయ్యడానికి ఉద్దేశించబడింది.


ఈ గ్రంథంలోని మొదటి నూరు శ్లోకములలో, దేహము, సృష్టి, జీవుడు, ఆత్మ, బ్రహ్మముల గురించిన స్పష్టమైన వివరణ అనేకములైన ఉపమానముల సహాయంతో ఇవ్వబడింది. ఆ తరువాత శ్లోకములలో, పదిహేను సాధనలతో కూడిన సాధనావిధానం చెప్పబడింది. అష్టాంగయోగంలోని ఎనిమిది మెట్లకు తోడుగా మరొక్క ఏడు మెట్లు చెప్పబడినాయి. అయితే, వీటికి యోగపరములైన అర్ధాలను చెప్పకుండా, అద్వైతపరములైన అర్ధాలను చెప్పినారు శంకరులవారు. ఆయన పరమాద్వైతి కావడంవల్ల, ఇది విచిత్రంగా ఏమీ అనిపించదు.

మొదటగా ద్వైతభావనను ఖండిస్తూ, చివరకు అద్వైతభావనను కూడా తొలగిస్తూ, బ్రహ్మప్రాప్తిని సూటిగా సహజానుభూతిగా చేకూర్చే ప్రయత్నం ఈ గ్రంధంలో మనకు దర్శనమిస్తుంది.

సాధనాసంపత్తి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, దానిని అందుకోవడానికి వారివారి అర్హతలను, అవసరాన్ని బట్టి రాజయోగము, హఠయోగముల సహాయం తీసుకోవాలని దీని చివరి శ్లోకములలో చెప్పబడింది. 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' లో మేము అనుసరించే విధానం సరిగ్గా ఇదే !

ఇంతకు ముందు, 'పంచవటి పబ్లికేషన్స్' నుండి విడుదలైన 'ఆత్మబోధ' తో బాటు ఈ గ్రంధం కూడా, అద్వైతాభిమానులైన మేధావుల, జ్ఞానమార్గసాధకుల  అభిమానమును చూరగొంటుందని నా విశ్వాసం. ముందుముందు, ముఖ్యములైన మిగిలిన అద్వైతగ్రంధములను కూడా మా సంస్థనుండి మీరు పొందబోతున్నారు.

ఈ గ్రంథరచనలో నాకు చేదోడువాదోడుగా నిలిచిన నా శ్రీమతి సరళాదేవికి, సంస్కృత శ్లోకములను తెలుగులోనికి తెచ్చి, ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ మొదలైన పనులలో నిరంతరం సహకరించిన శిష్యురాళ్లు అఖిల, లలితలకు, ముఖచిత్ర డిజైనర్ శిష్యుడు ప్రవీణ్ కు నా కృతజ్ఞతలు ఆశీస్సులను తెలియజేస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం కూడా google play books నుండి లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా రాబోతున్నది. చదివి ఆనందించండి మరి !

read more " మా క్రొత్త పుస్తకం "అపరోక్షానుభూతి" విడుదలైంది. "

1, ఏప్రిల్ 2022, శుక్రవారం

బుష్రా మనేకా ఖాన్ జాతకంలో మాంత్రిక యోగాలు

ఇవాళ అమావాస్య. కనుక ఇలాంటి పోస్ట్ రాయకపోతే ఎలా మరి? భూతాలు బాధపడతాయి. కాబట్టి చదూకోండి.

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మూడోభార్య బుష్రా మనేకా ఖాన్. ఈమె ఇండియా దగ్గరలో ఉన్న పాక్ పట్టణం లో 16-8-1974 న పుట్టింది. ఇక్కడే సూఫీ సాధువు బాబా ఫరీద్ దర్గా ఉంది. ఈయన ఉదారబోధనలను సిక్కుల గ్రంధమైన గురు గ్రంథసాహెబ్ లో కూడా పొందుపరచారు. ఆమె బాబా భక్తురాలైంది. సూఫీ తత్త్వాలను బాగా నేర్చుకుంది.

2017 లో తన మొదటిభర్త అయిన ఖ్వార్ మనేకా కు విడాకులిచ్చి ఇమ్రాన్ ఖాన్ ను 2018 లో పెళ్లాడింది. అప్పుడామెకు 44 ఏళ్ళు. 1952 లో పుట్టిన ఇమ్రాన్ ఖాన్ కు అప్పటికి 66 ఏళ్ళు. ఇద్దరికీ 22 ఏళ్ల తేడా ఉన్నది. అయినా సరే, ఈ పెళ్లి జరిగింది. దానికి వెనుక అనేక కధలున్నాయి.

పాకిస్తాన్ కు ప్రధానమంత్రి కావాలని తపిస్తున్న క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్, అప్పటికే సూఫీ పీర్ గా పేరు పడిన  బుష్రాను ఆశీస్సులకోసం కలిశాడు. ఇమ్రాన్ ఖాన్ గత 30 ఏళ్లుగా సూఫీ తత్వానికి దగ్గరౌతూ వచ్చాడు. బుష్రా అందులో బాగా మునిగితేలుతున్న వ్యక్తి. ఆమె అదుపులో రెండు జిన్ (భూతాలు) ఉన్నాయని, వాటిని కంట్రోల్ చేస్తూ ఆమె పనులు సాధిస్తుందని పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఏదైనా ఉపాయం చెప్పమని కోరిన అతనికి ఏవేవో ఇస్లామిక్ రెమెడీలు చెబుతూ ఉండేది. అప్పటికే ఆమెకు మొదటి భర్త, అయిదుగురు పిల్లలున్నారు.

మాంసంతో హోమాలు చేయడం వంటి క్షుద్రపూజలు కొన్ని, క్రింది స్థాయి సూఫీలలో ఉంటాయి. వారికి బ్లాక్ మేజిక్ కూడా తెలిసి ఉంటుంది.అలాంటివి ఇమ్రాన్ కోరికను తీర్చలేవని, అతని కోరిక చాలా పెద్దదని, అది తీరాలంటే అతను ఒక సరియైన యువతిని పెళ్లి చేసుకోవాలని, ఒక జిన్ (భూతం) ఈమె కలలో కనపడి రెమెడీ చెప్పిందట. సరేనన్న బుష్రా, తన చెల్లెలిని గాని, కూతురిని గానీ చేసుకోమని ఇమ్రాన్ కు చెప్పిందట.  ఇది భూతానికి నచ్చలేదు. అందుకని మళ్ళీ ఆమె కలలోకొచ్చి, 'వాళ్ళొద్దు నువ్వే ఇతన్ని చేసుకో. లేకపోతే నీ సంగతి చూస్తా' అని ఘంటాపధంగా చెప్పిందట. ఈ విషయమంతా వినిన ఈమె భర్త ఎంతో కుమిలిపోయి, 'అయ్యో, ఇలాంటి ఉత్తమమైన ఆశయానికి నేనెందుకు అడ్డుగా ఉండాల'ని బాధపడి, వెంటనే ఈమెకు విడాకులిచ్చేశాడు. అప్పుడు లైన్ క్లియరైంది. ఇమ్రాన్ ఈమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన ఆర్నెల్లలోనే అతని కోరిక నెరవేరింది. పాకిస్తాన్ కు ప్రధానమంత్రి అయ్యాడు. రెమెడీలు పనిచేశాయి. భూతాలూ పనిచేశాయి.  ఆ విధంగా బుష్రా, ఇమ్రాన్ కు థర్డ్ లేడీ అయి, పాకిస్తాన్ కు ఫస్ట్ లేడీ అయి కూచుంది.

అంటే, ఈ కధ ప్రకారం. క్షుద్రపూజలతో, భూతాలదయతో ఇమ్రాన్ పాకిస్తాన్ పీఎం అయ్యాడన్నమాట !

ప్రముఖులు స్వామీజీల ఆశీస్సులను తీసుకోవడం, మాంత్రికుల సహాయం తీసుకోవడం చరిత్రలో మామూలే. ఒకప్పటి ఆంధ్రా సీఎం NTR కూడా చీర కట్టుకుని రాత్రిపూట ఏవేవో పూజలు చేసేవాడని పుకార్లున్నాయి. ఇందిరాగాంధీకి కూడా చంద్రస్వామి అని ఒక తాంత్రికసాధువు సహాయం చేసేవాడు. అంతకంటే మొదట్లో ధీరేంద్రబ్రహ్మచారి అని ఇంకొకాయన ఉండేవాడు. అంతెందుకు? ప్రెసిడెంట్ రీగన్ భార్య అయిన నాన్సీ రీగన్ కూడా సైకిక్స్ సహాయం తీసుకునేదని, అలా తీసుకుని, భర్తకు రాజకీయ సలహాలిచ్చేదని అంటారు. అంటే, ప్రపంచదేశాల రాజకీయగతిని అరిజోనా ఎడారిలో ఉన్న సైకిక్స్ నిర్ణయించేవారన్నమాట ! భలేగా ఉంది కదూ వినడానికి ! అతి ప్రాచీనకాలంలో కూడా, యుద్ధానికి పోబోయేముందు రావణాసురుడు స్వయంగా హోమం చేసి మరీ కొట్లాటకు బయలుదేరేవాడని చెబుతారు. కనుక, మానవాతీత శక్తుల సహాయం కోరడం రాజులకు రాజకీయులకు మామూలే. పేర్లెందుకు గాని, ఇది నేటికీ జరుగుతూనే ఉంది.

చూడబోతే లోకం అనుకునేటట్లు బుష్రా దగ్గర ఏవో మాంత్రికశక్తులున్నట్లే ఉంది. చార్ట్ వేసి చూద్దాం !
  • ఈమె అమావాస్యకు ముందురోజున పుట్టింది. కనుక, అలాంటి పోకడలు ఉంటాయి.
  • పుష్యమీ నక్షత్రంలో ఈమె పుట్టింది. ఇది మంచి అదృష్ట నక్షత్రమే. వీరికి పూజలు పునస్కారాలు అలవాట్లు ఉంటాయి. అది ఏ మతమైనా సరే ఈ నక్షత్రం అలా పనిచేస్తుంది !
  • రాహుకేతువులు 5/11 స్థానాలలో నీచస్థితిలో ఉన్నాయి. గురువు నీచస్థితిలో ఉన్నాడు. నవాంశలో శని నీచస్థితిలో ఉన్నాడు. అది, రాశిలగ్నాత్ దశమకేంద్రమైంది. కనుక ఈమెకు మంత్రాలూ, క్షుద్రపూజలలో ప్రవేశం తప్పకుండా ఉంటుంది.
  • చంద్రలగ్నంలో ఇంకో మూడు గ్రహాలున్నాయి. ఇవన్నీ కుజ శనులచేత అర్గల బందీలయ్యాయి. అంటే, ఈమెకు సన్యాసయోగముంది. కానీ భంగమైంది. అందుకే పెళ్లి చేసుకున్నప్పటికీ ఒక సూఫీ గురువుగా చెలామణీ అయింది. ఇది మాంత్రిక యోగమే.
  • పంచమంలో నీచరాహువున్నాడు. కుజుడిని సూచిస్తున్నాడు. లగ్నంలో ఉన్న నాలుగు గ్రహాలకు, రాహువుకు పరస్పరమైన కోణదృష్టి ఉన్నది. ఇదికూడా మాంత్రికయోగమే. కనుక, క్షుద్రపూజలు, రహస్యమైన రెమెడీలు చెయ్యడం మొదలైన అలవాట్లు ఈమెకుంటాయి.
  • సప్తమంలో నీచగురువున్నాడు. అంటే, ఈమె భర్త (లు) కూడా సాంప్రదాయ ఇస్లాం పోకడలకు దూరంగా జరుగుతారని అర్ధం. దీనిని నిజం చేస్తూ, మొదటి భర్తా సూఫీ తత్త్వాన్ని ఇష్టపడేవాడే, రెండో భర్త అయిన ఇమ్రాన్ కూడా గత 20 ఏళ్ళనుంచీ సూఫీ తత్త్వాన్ని ఇష్టపడుతున్నవాడే.
  • చంద్రుడూ శుక్రుడూ దగ్గరగా ఉన్నారు. దీనివల్ల ఈమెకు కలలు, దర్శనాల వంటి భ్రమలు కలుగుతాయి. అందుకే ఈమెకు కలలో జిన్ కనపడి ఇమ్రాన్ని చేసుకోమని చెప్పింది.
  • సూర్యుడూ బుధుడూ చాలా దగ్గరగా ఉన్నారు. నవాంశలో బుధుడు నీచస్థితిలో ఉన్నాడు.  ఈమె ఇంట్రావర్ట్ గా ఉండేది. అమెరికాలో చదువుకున్నప్పటికీ, పెద్దగా ఎవరితోనూ కలిసేది కాదు. స్నేహితుల సర్కిల్స్ లో ఈమెకు 'విచ్' (మంత్రగత్తె) అని పేరుండేది. అవసరమైతే, తనకోసం ఏమైనా చేయడానికి రెడీ అవుతుంది. అందుకే, 44 ఏళ్ల వయసులో, అయిదుగురు పిల్లలను వదిలేసి రెండో వివాహం చేసుకుంది.
సరే, ఇదంతా బాగానే ఉంది. ప్రస్తుత పరిస్థితి ఏంటి? అదీ చూద్దాం.

ప్రస్తుతం ఈమెకు రాహుకేతువులు దశమ చతుర్ధస్థానాలలోకి రాబోతున్నాయి. అంటే, వృత్తి, ఇల్లు, గృహసౌఖ్యాలు ప్రభావితాలౌతాయి. అదేగా జరుగుతోంది మరి !

ఇంటిలో అశాంతి రేగుతోంది. ఇమ్రాన్ పదవి ఏమౌతుందో ఎల్లుండి తెలుస్తుంది. ఫస్ట్ లేడీ అనే పదవి ఊడిపోబోతున్నది. ఏక్షణం ఏమౌతుందో ఎవరు ఎవరిని చంపుతారో తెలియని పాకిస్తాన్లో వీరి భవిష్యత్తు ప్రశ్నార్ధకం !

ఇదే నెలలో ఈమెకు అష్టమశని మొదలు కాబోతున్నది. అది, సెప్టెంబర్ 2024 వరకూ ఉంటుంది. ఇది ఈమెకు మంచిసమయం కాదు. ఖచ్చితంగా ఈమె భర్త అయిన ఇమ్రాన్ కి కూడా మంచిది కాదు. అతని జాతకం విడిగా చూద్దాం !

మరి ఈమె క్షుద్రపూజలు, ఈమె అధీనంలో ఉన్నాయని చెప్పబడే జిన్లు (భూతాలు) ఈమెను రక్షిస్తాయా? అంటే, గ్రహప్రభావం నుంచి ఏ భూతాలూ ఎవరినీ రక్షించలేవు. మనం చేసుకున్న కర్మను మించిన పెద్ద భూతం ఇంకేదీ ఈ సృష్టిలో లేదు. అది పక్వానికి వచ్చినపుడు ఏ క్షుద్రపూజలూ ఏమీ పని చెయ్యవు. అన్నీ ఎదురు తిరుగుతాయి. ప్రస్తుతం ఈమెకూ, ఇమ్రాన్ కూ అదే జరుగుతున్నట్లుంది.

అయినా మన పిచ్చిగాని, అమెరికా అనే పెనుభూతంతో విరోధం తెచ్చుకుంటే భూమ్మీద ఏ భూతమూ మనల్ని రక్షించలేదు. ఎక్కడో తోరాబోరా గుహల్లో దాక్కున్న లాడెన్ అనే భూతాన్ని కూడా వేటాడి మట్టుపెట్టింది అమెరికా భూతం. మరి, రష్యాకి దగ్గరౌతూ, దానితో పెట్టుకుంటే ఊరుకుంటుందా? అదేమైనా మొదటి భర్తా, పోనీలే అని పెద్దమనసుతో డైవోర్స్ కి ఒప్పుకోడానికి? ఇంత చిన్న లాజిక్ బుష్రా కి తెలీకపోవడమేంటి?

చూద్దాం గ్రహాలూ కర్మా గెలుస్తాయో, బుష్రా కంట్రోల్లో ఉన్న జిన్ లు గెలుస్తాయో !
read more " బుష్రా మనేకా ఖాన్ జాతకంలో మాంత్రిక యోగాలు "

రాహుకేతువుల లీల - 2022

నాస్తికులు, హేతువాదులు ఎన్నైనా మాట్లాడవచ్చు గాక ! కానీ, సయింటిఫిక్ గా ఆలోచించేవారికి చూచేవారికి, కొన్ని విషయాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూనే ఉంటాయి. గ్రహస్తితులకు, భూమ్మీదగాని, వ్యక్తిగత జీవితాలలో గాని జరిగే సంఘటనలకు సూటి సంబంధాలు కనిపిస్తూనే ఉంటాయి.

ప్రస్తుతం భూమ్మీద రాహుకేతువుల లీల నడుస్తోంది. ఇంకొక 12 రోజులలో వీరు రాశులు మారబోతున్నారు. నేను పదేళ్లనుంచీ చెబుతున్నాను. ఈ విషయం కొన్ని వందలసార్లు రుజువైంది. పెద్దగ్రహాల మార్పులు జరగబోయేముందు, దానికంటే ముందుగా వాటి సంధ్యాప్రభావం (twilight effect) ఉంటుందని చెప్పాను. అదే ఇప్పుడు జరుగుతోంది.

దేశాలమీద వీరి ప్రభావాలు ఎలా ఉన్నాయో చూద్దామా !

పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ కు మూడిన వైనం

మొన్నమొన్నటిదాకా అంతా బాగానే ఉంది. ఇమ్రాన్ రష్యా వెళ్లి పుతిన్ తో చేతులు కలిపి వచ్చాక, పాకిస్తాన్లో సినిమా మారిపోయింది. రాహుకేతువుల ప్రభావం స్పష్టంగా పనిచెయ్యడం మొదలైంది. కొన్ని రాజకీయపక్షాలు రూలింగ్ పార్టీకి మద్దతును ఉపసంహరించుకున్నాయి. ఇమ్రాన్ పని ఖాళీ అయింది.

దీని వెనుక అమెరికా హస్తం ఉందని ఇమ్రాన్ అంటున్నాడు. అమెరికా వెనుక గ్రహప్రభావం ఉందని నేనంటున్నాను. అమెరికా వెనుకే కాదు, అమ్మమ్మ ఆవకాయ పచ్చడి పెట్టడం వెనుక కూడా అదే ఉంటుంది. చూచే దృష్టితో చూస్తే అర్ధమౌతుంది.

రాహువు మేషంలోకి ప్రవేశించబోతున్నాడు. మేషం పాకిస్తాన్ కూ, బ్రిటన్ కూ సూచిక. కనుక ఆ దేశాలలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. 18 ఏళ్ళక్రితం 2004 లో కూడా రాహుకేతువులు ఇదే స్థితిలో ఉన్నాయి. అప్పుడు కూడా పాకిస్తాన్ లో పీ ఎం మారాడు. ఇది కాకతాళీయమెలా అవుతుంది మరి?

కుర్చీని కాపాడుకోడానికి ఇమ్రాన్ క్షుద్రపూజలు చేయిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. వేలాది కోళ్లను హోమం చేస్తూ ఏవేవో అర్ధరాత్రిపూజలు చేయిస్తున్నాడట. అసలితని మూడో భార్యే ఒక ఇస్లామిక్ మాంత్రికురాలు.  అప్పట్లో ఈమె దగ్గర జాతకం చెప్పించుకోడానికి వెళ్ళాడు. ఆమె జాతకం బాలేక ఇతని బుట్టలో పడింది. లేదా, ఇతనిమీదే వశీకరణ మంత్రం ప్రయోగించి ఉండవచ్చు. అయితే, గ్రహాలు పిచ్చివి కావు కదా ! ఇలాంటి క్షుద్రపూజలు ఎన్నింటినో అవి చూచి ఉంటాయి. అయినా, అమెరికాకు తెలియనివా ఈ క్షుద్రపూజలు ! ఎన్ని చేస్తే ఈ స్థితికొచ్చింది అది ! కనుక ఇమ్రాన్ అర్జెంట్ గా రాహుకేతు స్తోత్రం చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇస్లాం ఒప్పుకుంటుందో లేదో !

కుదేలైన శ్రీలంక 

కర్కాటకం సింహం మధ్యలో శ్రీలంక ఉంటుంది. చతుర్దంలోకి కేతువు ఇంకా రాలేదు. రాబోతున్నాడు. అప్పుడే దేశం అల్లకల్లోలమై పోతోంది గమనించండి. తిండిగింజల్లేవు. డీజిల్ లేదు. డబ్బుల్లేవు. ఇన్ ఫ్లేషన్ ఘోరంగా పెరిగింది. జనాలు పడవలెక్కి తమిళనాడులోకి చొరబడుతున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, మోడీగారిని కలిసి, వారికి సహాయం చేయడానికి పర్మిషన్ అడిగాడు. ఎందుకంటే, శ్రీలంక సమస్య సూటిగా తమిళనాడును ప్రభావితం చేస్తుంది గనుక !

రష్యా ఉక్రెయిన్ యుద్ధం

2014 నుంచీ ఇది నడుస్తున్నప్పటికీ, ఫిబ్రవరి 2022 లోనే ఇది ఊపందుకుంది, అఫీషియల్ గా మొదలైంది. ఇది కూడా రాహుకేతువుల ముందస్తు ప్రభావమే. ఈ మధ్యనే న్యూక్లియర్ బాంబ్ అమర్చబడిన రష్యా విమానాలు  ఉక్రెయిన్ దగ్గరగా ఎగిరాయి. ఏప్రియల్ 13 న రాహుకేతువులు రాశులు మారాక,  న్యూక్లియర్ వార్ మొదలు కాబోతున్నదా? రష్యా గనుక ఉక్రెయిన్ పైన న్యూక్లియర్ బాంబ్ వేస్తే, ఇక అన్ని దేశాలూ రంగంలోకి దిగుతాయి. అప్పుడు ప్రపంచదేశాలన్నీ రష్యా అనుకూల, ప్రతికూల వర్గాలుగా విడిపోతాయి. ఈ పరిస్థితి, మూడో ప్రపంచ యుద్ధంగా మారబోతున్నదా? ఇజ్రాయెల్ పాలస్తీనాలు దానిని ప్రారంభిస్తాయని అందరూ ఎదురు చూస్తుంటే, రష్యా ఉక్రెయిన్లు తొందరపడ్డాయన్న మాట !  చూద్దాం ఏమౌతుందో !

ఈ గోల ఇలా ఉంటే, ఇంకో పక్కనుంచి WHO వచ్చి, 'ఇంకో భయంకరమైన కరోనా వైరస్ రాబోతోంది'  అని అరుస్తున్నది. ఈ మధ్యన అదొక జోకరైపోయింది. దానిమాటలు ఎవరూ నమ్మడం లేదు. 'వస్తే రానీ వచ్చినపుడు చూద్దాంలే' అని ఎవరూ కరోనాను పట్టించుకోవడం లేదు. ప్రతిరోజూ చచ్చేవాడికి భయమేముంటుంది గనుక ! 

దీనికి తోడు ఏప్రియల్ 26 న శనీశ్వరుని రాశిమార్పు ఉన్నది. దాని ఫలితాలను త్వరలో వ్రాస్తాను. అప్పటివరకూ ప్రపంచదేశాల పరిస్థితులలో మార్పులను గమనిస్తూ, రాహుకేతు స్తోత్రం చదువుకుంటూ ఉండండి !

read more " రాహుకేతువుల లీల - 2022 "