“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, ఏప్రిల్ 2022, సోమవారం

శాక్రమెంటో షూటింగ్ - మృత్యుభాగం

నిన్న (3 ఏప్రియల్ 2022) రాత్రి 2 గంటల ప్రాంతంలో కాలిఫోర్నియా స్టేట్ లోని శాక్రమెంటో డౌన్ టౌన్ లో మాస్ షూటింగ్ జరిగింది. ఆరుగురు చనిపోయారు. 12 మంది గాయపడ్డారు. ఇంతవరకూ ఎవరూ దొరకలేదు. ఇదొక గ్రూప్ కొట్లాట అని పోలీసులు అంటున్నారు.

అమెరికాలోని డౌన్ టౌన్ ఏరియాలలో గన్ కల్చర్ మామూలే. కాకుంటే, కొన్ని కొన్ని గ్రహస్థితులలోనే అది నిద్రలేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అలాంటిది ఒకటి జరిగింది. 

లగ్నం ధనుస్సు 10 డిగ్రీలయింది. అంటే, ఆ సమయంలో శాక్రమెంటోలో ధనుర్లగ్నం ఉదయిస్తున్నది. దీనికి అర్గళం పట్టి ఉండటాన్ని చూడవచ్చు. అదే విధంగా, దీనికి సప్తమమైన మిధునరాశికి (అమెరికాకు) కూడా అర్గళం పట్టి ఉండటాన్ని గమనించవచ్చు. లగ్నం  నుంచి చూస్తే ఆరింట రాహువు ఉచ్ఛస్థితిలో ఉంటూ గొడవలను, యాక్సిడెంట్లను సూచిస్తున్నాడు. మిధునం నుండి చూస్తే, ఆరింట ఉచ్చకేతువుంటూ నాశనాన్ని సూచిస్తున్నాడు. ధనుస్సు నుండి కుటుంబస్థానమైన మకరం శనికుజుల యాక్సిడెంట్ యోగంవుంది. ఇది సప్తమదృష్టితో అమెరికాకు కుటుంబస్థానమైన కర్కటకాన్ని చూస్తోంది. ఈ శనికుజులకు, నీచ బుధుడు, కేతువు (కుజుడు) లతో అర్గళం పట్టింది. అంటే, నీచబుద్ధివల్ల హింసాత్మక సంఘటనలు జరుగుతాయని అర్ధం. మరి ఇలా జరగడం వింతేముంది?

జ్యోతిష్య విద్యార్థుల కోసం ఈ పోస్ట్ లో, ఇంకొక క్రొత్త విషయాన్ని పరిచయం చేస్తున్నాను. అది మృత్యుభాగమనే బిందువు.

సూక్ష్మజ్యోతిష్య శాస్త్రంలో చాలా లోతైన విషయాలుంటాయి. వాటిలో ఒకటి మృత్యుభాగం లేదా మృత్యుస్ఫుటం. ఇది ఒక గణితబిందువు. దీనిని లెక్క ఎలా వేయాలన్నది కేరళ జ్యోతిష్య గ్రంధమైన ప్రశ్నమార్గంలో చెప్పబడింది.

మృత్యుస్ఫుటాన్ని లెక్కించే విధానం

గుళికస్ఫుటాన్ని 7 చేత హెచ్చించి, దానికి సూర్యస్ఫుటాన్ని కలిపితే, వచ్చే డిగ్రీలను మృత్యుభాగం లేదా మృత్యుస్ఫుటం అంటారు. ఇది మృత్యువును సూచిస్తుంది. 

గుళిక అనేది ఒక భౌతికగ్రహం కాదు, ఖగోళంలోని ఒక సెన్సిటివ్ బిందువు మాత్రమే. జ్యోతిష్యశాస్త్రంలో ఇలాంటి సెన్సిటివ్ బిందువులు చాలా ఉన్నాయి. వీటిని కూడా గ్రహాలనే అంటారు. జ్యోతిశ్శాస్త్రపరంగా, గ్రహమంటే, మనల్ని ప్రభావితం చేసే ఒక ఎనర్జీ పాయింట్ అని మాత్రమే అర్ధం. అందుకనే సూర్యుడిని, చంద్రుడిని, రాహుకేతువులనూ గ్రహాలుగానే లెక్కిస్తాము. ఎందుకంటే అవి మనల్ని ప్రభావితం చేస్తాయి గనుక.

ఎష్ట్రానమీలో భౌతికగ్రహాలనే గ్రహమంటారు. ఎస్ట్రాలజీలో అయితే,, మనల్ని ప్రభావితం చేసే ఊహాత్మక ఎనర్జీ పాయింట్స్ ని కూడా గ్రహాలనే అంటారు. ఈ తేడాను గమనించాలి.  

గుళికను కేరళజ్యోతిష్యంలో, ముఖ్యంగా ప్రశ్నశాస్త్రంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. రాహుకేతువుల లాగే, రాశిచక్రంలో ఇదీ ఒక సెన్సిటివ్ బిందువే.  దీనిగురించి పదేళ్ల క్రితం ఒక పోస్ట్ వ్రాశాను చూడండి.

ప్రస్తుతచక్రంలో గమనించండి. 

గుళిక - వృశ్చిక 10.46 = 220.46

గుళిక x 7 = 1545. 22

దీనికి సూర్యడిగ్రీలను కలుపగా - 1545. 22 + మీన 19. 26

= 1545. 22 + 349. 26

= 1894. 48

= 360 గుణకాలను ఐదింటిని తీసివేయగా 1894. 48 - 1800

= 94. 48

= కర్కాటకం 4. 48 డిగ్రీలు. 

మృత్యుభాగం కర్కాటకం 4 డిగ్రీలయింది. ఇది అమెరికాకు కుటుంబస్థానమైంది. చావును సూచించే ప్లూటో (యమగ్రహం) మకరం 4 డిగ్రీలమీద ఉంటూ ఖచ్చితమైన సమసప్తకదృష్టితో దానిని చూస్తున్నది. అంటే ఏమిటి? ఆ ప్రాంతంలో చావు కరాళనృత్యం చేస్తుందని అర్ధం. అదేగా జరిగింది?

మృత్యుభాగమనేది వ్యక్తిగత జాతకాలలో కూడా పనిచేస్తుంది. గ్లోబల్ జాతకాలలో కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం శాక్రమెంటో షూటింగ్ లో అదే పనిచేసింది.