నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, ఏప్రిల్ 2022, శనివారం

మా క్రొత్త పుస్తకం 'దృగ్దృశ్య వివేకము' విడుదలైంది

ఈరోజు శ్రీరామనవమి. మన భారతీయులకు చాలా పవిత్రమైన రోజులలో ఒకటి.

అందుకని ఈ రోజున మా సంస్థనుండి మరొక అమూల్యమైన గ్రంధాన్ని విడుదల చేస్తున్నాను. దానిపేరు -
'దృగ్దృశ్య వివేకము'. శృంగేరీపీఠ జగద్గురువులైన శ్రీ భారతీతీర్ధస్వామివారు రచించిన  అమూల్యమైన ఈ అద్వైతగ్రంధానికి నా వ్యాఖ్యానం ఈ రోజున విడుదలవుతున్నది. 

ఇది నా కలం నుండి వెలువడుతున్న 40 వ పుస్తకం.

శ్రీ భారతీతీర్ధస్వామివారు క్రీ. శ 1328 నుండి 1370 వరకూ శృంగేరీపీఠానికి జగద్గురువులుగా ఉన్నారు. విజయనగర సామ్రాజ్య స్థాపనాచార్యులైన శ్రీ విద్యారణ్యస్వామివారికి వీరు గురువులు. విజయనగరరాజైన హరిహరరాయలు, వీరిని ఎంతో గౌరవించి, కొంత భూమిని వీరికి దానమిచ్చినట్లు శాసనములున్నాయి.

కనుక ఈ పుస్తకం దాదాపు 700 ఏళ్ల నాటిది.

'దృగ్దృశ్య వివేకము' అంటే, 'చూచేవాడు, చూడబడేది' అనిన వివేకమని అర్ధం. సమాధిస్థితిని చక్కగా వివరించడం ఈ గ్రంధపు ప్రత్యేకత. సమాధి, సవికల్పము, నిర్వికల్పము అంటూ రెండు విధములని చెబుతూ, వీనిలో సవికల్పమనేది మరలా దృశ్యానువిద్దము, శబ్దానువిద్ధమని రెండు విధములుగా ఉంటుందని వర్ణిస్తుంది. ఈ రెంటినీ మించినది నిర్వికల్పము.

వెరసి ఈ మూడుసమాధులు, బాహ్యాంతరభేదములతో ఆరువిధములుగా ఉంటాయని, ఈ ఆరువిధములైన సమాధులను సాధకులు నిత్యమూ అభ్యసించవలసి యుంటుందని, అప్పుడు సాధనలో చరమావస్థయైన బ్రహ్మప్రాప్తి వారికి కలుగుతుందని చెప్పబడింది. 

దీనిలో 46 సంస్కృతశ్లోకాలున్నాయి. వీటికి సరళములైన 46 తెలుగు పద్యములను ఆటవెలదిలో వ్రాసి, ఒక్కొక్క శ్లోకానికీ ఇంకా సులభమైన వివరణనిచ్చాను.

మా 'పంచవటి పబ్లికేషన్స్' నుండి విడుదలైన ఇతర గ్రంథములతో బాటు ఈ గ్రంధం కూడా, అద్వైతాభిమానులైన జిజ్ఞాసువుల అభిమానమును చూరగొంటుందని నా విశ్వాసం.

ఈ గ్రంథరచనలో నాకు చేదోడువాదోడుగా నిలిచిన నా శ్రీమతి సరళాదేవికి, సంస్కృత శ్లోకములను తెలుగులోనికి తెచ్చి, ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ మొదలైన పనులలో నిరంతరం సహకరించిన శిష్యురాళ్లు అఖిల, లలితలకు, ముఖచిత్ర డిజైనర్ శిష్యుడు ప్రవీణ్ కు నా కృతజ్ఞతలు ఆశీస్సులను తెలియజేస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం కూడా google play books నుండి లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా రాబోతున్నది. చదివి ఆనందించండి మరి !