“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, ఏప్రిల్ 2022, శనివారం

మా క్రొత్త పుస్తకం "అపరోక్షానుభూతి" విడుదలైంది.

నేడు శుభకృత్ నామ సంవత్సర ఉగాది. గత రెండేళ్లుగా మానవజాతి పడుతున్న బాధలనుండి విముక్తి లభించి, శుభం జరిగే సంవత్సరం  మొదలౌతున్నది. అందుకని, ఈ రోజున మా సంస్థనుండి మరొక అమూల్యమైన గ్రంధాన్ని విడుదల చేస్తున్నాను.

నా కలం నుండి వెలువడుతున్న 39 వ పుస్తకంగా, ఆదిశంకరులవారు రచించిన అమూల్యమైన అద్వైతగ్రంధం 'అపరోక్షానుభూతి' ఈ రోజున విడుదలవుతున్నది. ఈ గ్రంధం వయసు కనీసం 1300 ఏళ్ళు.

'అపరోక్షానుభూతి' అంటే Direct Experience అని అర్ధం.

దీనిలో 144 సంస్కృతశ్లోకాలున్నాయి. వాటికి హృద్యములైన 150 తెలుగు పద్యములను వ్రాసి, ఒక్కొక్క శ్లోకానికీ సులభమైన వివరణనిచ్చాను. అద్వైతమంటే ఏమీ తెలియనివారు కూడా, ఈ గ్రంధమును చదవడం వల్ల దాని లోతుపాతులను, అసలైన అర్ధాలను సులభంగా తెలుసుకోగలుగుతారు.

నేటి ఆధ్యాత్మికలోకంలో చాలా గందరగోళాలున్నాయి. దానికి అనేక కారణాలు.  వాటిలో ఒక కారణం - సాంప్రదాయమార్గాలను, తత్త్వాలను, గ్రంధాలను ఎవరికిష్టం వచ్చినట్లు వారు వ్యాఖ్యానిస్తూ ఉండటమే. విశృంఖలంగా విజృంభిస్తున్న సోషల్ మీడియా కూడా దీనికి పాలుపోస్తున్నది. ఇలాంటి గందరగోళాలలో ఒకటి, అద్వైతమంటే ఏమిటో సామాన్యజనానికి తెలియకపోవడం. 'అదేంటో మాకు తెలుసు' అనుకుంటున్నవారు కూడా, అసలైన దృష్టికోణం లేకపోవడంతో, అద్వైతాన్ని తప్పుగా అర్ధం చేసుకుని, తమకు తెలిసినదే అద్వైతమనిన భావనలో ఉన్నారు. మా గ్రంధం, ఈ అపప్రధను దూరం చెయ్యడానికి ఉద్దేశించబడింది.


ఈ గ్రంథంలోని మొదటి నూరు శ్లోకములలో, దేహము, సృష్టి, జీవుడు, ఆత్మ, బ్రహ్మముల గురించిన స్పష్టమైన వివరణ అనేకములైన ఉపమానముల సహాయంతో ఇవ్వబడింది. ఆ తరువాత శ్లోకములలో, పదిహేను సాధనలతో కూడిన సాధనావిధానం చెప్పబడింది. అష్టాంగయోగంలోని ఎనిమిది మెట్లకు తోడుగా మరొక్క ఏడు మెట్లు చెప్పబడినాయి. అయితే, వీటికి యోగపరములైన అర్ధాలను చెప్పకుండా, అద్వైతపరములైన అర్ధాలను చెప్పినారు శంకరులవారు. ఆయన పరమాద్వైతి కావడంవల్ల, ఇది విచిత్రంగా ఏమీ అనిపించదు.

మొదటగా ద్వైతభావనను ఖండిస్తూ, చివరకు అద్వైతభావనను కూడా తొలగిస్తూ, బ్రహ్మప్రాప్తిని సూటిగా సహజానుభూతిగా చేకూర్చే ప్రయత్నం ఈ గ్రంధంలో మనకు దర్శనమిస్తుంది.

సాధనాసంపత్తి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, దానిని అందుకోవడానికి వారివారి అర్హతలను, అవసరాన్ని బట్టి రాజయోగము, హఠయోగముల సహాయం తీసుకోవాలని దీని చివరి శ్లోకములలో చెప్పబడింది. 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' లో మేము అనుసరించే విధానం సరిగ్గా ఇదే !

ఇంతకు ముందు, 'పంచవటి పబ్లికేషన్స్' నుండి విడుదలైన 'ఆత్మబోధ' తో బాటు ఈ గ్రంధం కూడా, అద్వైతాభిమానులైన మేధావుల, జ్ఞానమార్గసాధకుల  అభిమానమును చూరగొంటుందని నా విశ్వాసం. ముందుముందు, ముఖ్యములైన మిగిలిన అద్వైతగ్రంధములను కూడా మా సంస్థనుండి మీరు పొందబోతున్నారు.

ఈ గ్రంథరచనలో నాకు చేదోడువాదోడుగా నిలిచిన నా శ్రీమతి సరళాదేవికి, సంస్కృత శ్లోకములను తెలుగులోనికి తెచ్చి, ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ మొదలైన పనులలో నిరంతరం సహకరించిన శిష్యురాళ్లు అఖిల, లలితలకు, ముఖచిత్ర డిజైనర్ శిష్యుడు ప్రవీణ్ కు నా కృతజ్ఞతలు ఆశీస్సులను తెలియజేస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం కూడా google play books నుండి లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా రాబోతున్నది. చదివి ఆనందించండి మరి !