“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, ఏప్రిల్ 2022, సోమవారం

అవధూత - అవదూత

'ఒద్దురా చూడకండిరా తలలు పాడౌతాయి' అని ఎంత మొత్తుకున్నా కూడా నా శిష్యులు కొంతమంది యూ ట్యూబ్ లో నానాచెత్తా చూస్తూనే ఉంటారు. అందులోనుంచి నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.

'Wandering Mystic' అనే పదం గురించి మీ అభిప్రాయం ఏమిటి గురువుగారు?' అంటూ ఈ మధ్యనే ఒక శిష్యపరమాణువు అడిగాడు.

ఎవరిగురించి ఈ మాటను అడుగుతున్నాడో అర్ధమైంది.

'నువ్వు పుట్టడానికి 20 ఏళ్ల ముందు ఆ మాటను మొదటిసారి విన్నాను' అని చెప్పాను.

పరమాణువు దానిని పట్టించుకోలేదు.

'ఈ మధ్య కొందరు స్వామీజీలు సైకిలు యాత్రలు, పాదయాత్రలు, కారు యాత్రలు చేస్తున్నారు. వాళ్ళు తమను తాము ఈ విధంగా పిలుచుకుంటున్నారు. అందుకని అడిగాను.  వాళ్ళను ఆ పేరుతో పిలవవచ్చా?' అడిగాడు.

'మనకి తెలివి లేకపోతే ఏమైనా పిలవవచ్చు' అన్నాను.

'అసలా పదానికి అర్ధం చెప్పండి గురూజీ' అడిగాడు పరమాణువు.

'ఏం లేదు. గాలిలా గాలికి తిరిగేవాడు అని అర్ధం. అవధూత అని కూడా మన గ్రంధాలలో అంటారు. దత్తాత్రేయులవారు ఆ పదానికి అసలైన నిర్వచనం' అన్నాను.

'అయితే, తిరగడం తప్పంటారా?' అన్నాడు.

'తిరగడం తప్పుకాదు. పనిమీద తిరగడం తప్పు. అవధూతకు పని ఉండదు' అన్నాను.

'వివేకానందస్వామి, పరమహంస యోగానంద మొదలైన వాళ్ళు ఎన్నో దేశాలలో తిరిగి ధర్మప్రచారం చేశారు కదా? వాళ్ళు అవధూతలు కారా?' అడిగాడు.

'కారు. అవధూతది వారికంటే పైస్థాయి. అయితే, వారుకూడా స్వార్ధపూరితంగా తిరగలేదు. నిస్వార్ధంగా ధర్మప్రచారం చేసి లోకానికి వెలుగుదారిని చూపించారు. అవధూత అదికూడా చెయ్యడు. లోకం ఎలా పోయినా అతనికనవసరం. నీవు చెప్పినవారు మహనీయులే గాని, అవధూతలు కారు. ధర్మం క్షీణించిన ఒక కాలంలో వారు వచ్చారు. దానికి కొంచం బలాన్నిచ్చి వెళ్లిపోయారు' అన్నాను.

'మరి నేడు దేశాలు తిరుగుతున్న స్వామీజీలు ఏ కేటగిరీలోకి వస్తారు?' అడిగాడు.

'అందరూ ఒకే కేటగిరీలోకైతే రారు. స్వార్ధం లేకుండా, వ్యాపారం చెయ్యకుండా, అసలైన సనాతనధర్మాన్ని ఉన్నదున్నట్లు చెబుతుంటే వారు మహనీయులు. లేకుంటే కాదు' అన్నాను.

'మనం కూడా ఆశ్రమం పెడుతున్నాం కదా? మనం ఏ కేటగిరీలోకి వస్తాము?' అన్నాడు.

'మనమైనా, ఎవరైనా అంతే. పైన చెప్పిన రూలే' అన్నాను.

'మరి Wandering Mystic లక్షణాలెలా ఉంటాయి?' అడిగాడు.

'అతను దేనికీ అంటడు, దేనినీ అంటించుకోడు. దేనినీ కట్టుకోడు. దేనికీ కట్టుబడడు. ఒక స్థిరమైన భావజాలమంటూ అతనికి ఉండదు. ఒక స్థిరనివాసమూ ఉండదు. లోకమే అతని ఇల్లు. శ్రీవిద్యారహస్యం 25 వ అధ్యాయం చదువు తెలుస్తుంది' అన్నాను.

'అలాంటివాళ్ళసలు ఉన్నారా?' అడిగాడు. 

'ఉన్నారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దత్తాత్రేయస్వామి అలాంటివారే' అన్నాను.

'ఆయనక్కూడా అవతారాలను సృష్టించారు కదా మనవాళ్లు? అవి నిజాలేనా?' అడిగాడు.

'ఆ సృష్టించిన వాడినే అడుగు. నేను సృష్టించలేదు. నాకు తెలీదు. నా అవతారమే నాకర్ధం కావడం లేదు. ఇక దత్తాత్రేయస్వామికి ఎన్ని అవతారాలో నాకేం తెలుస్తుంది?' అన్నాను. 

'మరి అవధూతలమని ప్రచారాలు చేసుకుంటున్నవాళ్లంతా ఎవరై ఉంటారు?' మళ్ళీ అడిగాడు  పట్టువదలని పరమాణువు.

నాకు విసుగు మొదలైంది.

'బహుశా అవదూతలై ఉంటారు' అన్నాను.

'అంటే?' ప్రశ్నార్ధకంగా ధ్వనించాడు పరమాణువు.

'అంటే, అవలక్షణాలున్న దూతలని అర్ధం. ఎవరి దూతలో నువ్వే తెలుసుకో. ఇక విసిగించకు, పనిచూసుకో' అని ముగించాను.

కధ కంచికి మనం ఆఫీసుకి.