“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

19, ఏప్రిల్ 2022, మంగళవారం

రాబోయే 14 ఏళ్ళు - పంచవటి ఆశ్రమం - లోకం నడక

సరిగ్గా 14 ఏళ్ల క్రితం, అంటే 2008 లో 'ఆలోచనా తరంగాలు' బ్లాగ్ వ్రాయడం మొదలుపెట్టాను. దానికి ప్రేరణ - అప్పటికి 30 ఏళ్లుగా నేను నడుస్తున్న ఆధ్యాత్మికమార్గంలో పొందిన అనుభవాలను, అందుకున్న జ్ఞానసంపదను, అర్హతలున్న నలుగురికీ పంచాలన్న ఉద్దేశ్యమే. సరిగా అదే సమయంలో, వరుణగ్రహం కుంభరాశిలోకి అడుగుపెట్టింది. ఇంటర్ నెట్ అనేది కళ్ళు తెరిచి ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చేసింది. భూగోళం మూలమూలల్లో ఉన్న ఏకమనస్కులైన మనుషులందరూ వర్చువల్ గా ఒకచోటకు చేరడం మొదలైంది.

ఈ 14 ఏళ్లలో నా భావజాలం నచ్చిన ఎందరో నన్ను అనుసరిస్తూ వచ్చారు. వారిలో కొందరు ఎంతో ఆత్మీయులుగా మారారు. కొందరు మధ్యలో మనసులు మార్చుకుని వేరేదారులలో వెళ్లిపోయారు. నేను అవేవీ పట్టించుకోకుండా, నా భావజాలాన్ని లోకానికి పరిచయం చేస్తూ వచ్చాను. ఇప్పటికి 58 ప్రామాణికములైన పుస్తకాలను వ్రాశాను. వాటిలో 40 ప్రచురింపబడ్డాయి. మిగతావి రాబోతున్నాయి. మొత్తం 100 పుస్తకాలను వ్రాయాలన్నది నా సంకల్పం.

నా భావజాలాన్నీ సాధనామార్గాన్నీ వివరిస్తూ ఎంతో వ్రాశాను. ఉపన్యాసాలలో చెప్పాను. 20 రోజులపాటు రాత్రీపగలూ ఆపకుండా వినగలిగినంత నిడివిగల నా ఆడియో ఉపన్యాసాలు ఇప్పటికే తయారయ్యాయి. ఇవన్నీ పంచవటి సభ్యులకు అందుబాటులో ఉన్నాయి.

కుంభరాశి అనేది లోకానికి నీరుపోస్తున్న మనిషి ఆకారంలో ఉంటుంది. అంటే, బోధన చెయ్యడం, ఉపకారం చెయ్యడం, సాయం చెయ్యడం, జీవాన్ని అందించడం మొదలైన సూచనల రూపంలో దీని ఆకారం ఉంటుంది. ఈ చిత్రానికి అనుగుణంగానే ఈ పద్నాలుగు ఏళ్లలో నా భావజాలం ఏమిటో లోకానికి బోధింపబడింది. ఈ కోణంలో చూస్తే, కుంభరాశి అద్భుతంగా పనిచేసింది.

నిన్నటినుంచీ వరుణుడు మీనరాశిలోకి అడుగుపెట్టడంతో, నేను నడుస్తున్న దిశాగమనం మారింది.

మీనం అంత్యరాశి మరియు ఆధ్యాత్మికరాశి. ఇక్కడ మాటలుండవు. అనుభవం మాత్రమే ఉంటుంది. కనుక రాబోయే 14 ఏళ్లలో, నిజమైన ఆధ్యాత్మికశక్తి అనేది లోకానికి చూపించబడుతుంది. ఇప్పటివరకూ చెప్పిన బోధన, సాధనారూపాన్ని దాల్చి, మానవాతీతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ ట్రెండ్ 2036 వరకూ నడుస్తుంది.

ఇది పంచవటిలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది.

మీరు గమనించారా? గత 14 ఏళ్లుగా సోషల్ మీడియా ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. కుంభంలో నుంచి పారే నీటిలా, కమ్యూనికేషన్ వరదలై పారింది. అన్నీ అందరికీ తెలిశాయి. సమాచారం ప్రతివారి టిప్స్ లో ఉంటూ వచ్చింది. ఇదంతా కుంభరాశిలోని వరుణుని ప్రభావం.

కానీ ఇప్పుడు ట్రెండ్ మారబోతున్నది.

ఉత్త సమాచారమనేది కొంతకాలానికి బోరు కొడుతుంది. ఎంతసేపూ తెలుసుకుంటూ ఉండటమేనా? తెలుసుకున్నదానిని అనుభవంలోకి తెచ్చుకోవద్దా? అనే ధోరణి మొదలౌతుంది. కనుక నేటినుంచీ ప్రాక్టికాలిటీ మీద ఫోకస్ ఎక్కువౌతుంది. సమాచారాన్ని తెలుసుకోవడమేగాక, తెలుసుకున్న దానిని ఆచరణలోకి తెచ్చుకుని లాభాలను పొందాలనే ప్రాక్టికల్ ధోరణి నేటినుంచీ విపరీతంగా పెరగబోతున్నది. మీనం ఆధ్యాత్మికరాశి గనుక ఆ కోణంలో ఇది ఉంటుంది.

అయితే, ఇది రెండు రకాలైన దారులలో నడుస్తుంది.

ఒకటి - మీనరాశి సూచించే సక్రమమైన ఆధ్యాత్మికమార్గం.

లోకంలో ఎందరోగురువులు ఎన్నోస్కూల్స్, ఎన్నోమార్గాలు కుప్పలుతెప్పలుగా ఉన్నప్పటికీ,  దురదృష్టవశాత్తూ అసలైనవీ సరైనవీ చాలాకొన్నే ఉన్నాయి. 'మహాత్మా' అని పేరుపెట్టుకున్నవారందరూ మహాత్ములు కానట్లే, సద్గురువులమని ప్రచారాలు చేసుకునే వారందరూ సద్గురువులూ కారు. ప్రచారం లేకుండా గుప్తంగా ఉన్నవారు కాకుండానూ పోరు. లెక్కనేది ఉండవలసింది దేవుడి దృష్టిలోగాని, మనిషి దృష్టిలో కాదు. కనుక, సక్రమమైన ఆధ్యాత్మికదారులు కూడా ఇప్పుడు అందరికీ తెలిసేలాగా ఓపెన్ అవుతాయి. అసలైన ఆధ్యాత్మికచింతన అనేది వెల్లువలాగా లోకాన్ని ముంచెత్తుతుంది. ఎంతోమంది మనుషులు అతీతమైన ఆధ్యాత్మికానుభవాలను పొందుతారు.

రెండు - వరుణుడి అధీనంలో ఉండే వ్యసనాలు.

మానవజాతిలో అందరూ ఒకేసారి ఆధ్యాత్మికులు కాలేరు గనుక, అదిలేనివాడికి మిగిలింది వ్యసనాలే గనుక, మనుషులలో ఎక్కువమంది వ్యసనపరులౌతారు. అంటే, త్రాగుడు, డ్రగ్స్, సెక్స్ మొదలైన వ్యసనాలు విపరీతంగా పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్,  రాబోయే 14 ఏళ్లలో వరదలాగా విజృంభిస్తుంది. ప్రస్తుతం 13, 14 ఏళ్ల వయసులో ఉన్నవారిమీద ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సరియైన దారిలో పెట్టబడకపోతే, ఈ తరం పిల్లలందరూ ముందుముందు వ్యసనపరులయ్యే ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా మిక్కుటంగా ఉంది.

ఇదీ, ముందుముందు 14 ఏళ్లలో ప్రపంచం నడవబోయే తీరు.

'పంచవటి' లో మాత్రం, ఆచరణాత్మకమైన అసలైన ఆధ్యాత్మికత విజృంభించబోతున్నది. పంచవటి సభ్యులు, దానిని అనుసరిస్తున్నవాళ్ళు, నేటినుంచీ నిజమైన ఆధ్యాత్మికశక్తి యొక్క ప్రభావాన్ని ప్రత్యక్షంగా స్పష్టంగా రుచి చూడబోతున్నారు. గమనించుకుంటే, చాలామంది జీవితాలలో ఈ మార్పులను వారు ఇప్పటికే గమనిస్తారు.

2022 ఆగస్టు నుండి క్రియాశీలం కాబోతున్న మా ఆశ్రమం, నిజమైన ఆధ్యాత్మికశక్తికీ, ధ్యానమయమైన జీవితానికి, అతీతములైన యోగానుభవాలకూ కేంద్రబిందువు కాబోతున్నది. వరుణగ్రహం రాశిమార్పు దీనినే సూచిస్తున్నది !

ఈ జోస్యం నిజం కావడాన్ని ముందుముందు మీరందరూ చూడబోతున్నారు !