19, మార్చి 2022, శనివారం

ఏప్రిల్ 13 న రాహుకేతువుల రాశిమార్పు - ఫలితాలు

వచ్చే నెల 13 తేదీన రాహుకేతువులు రాశులు మారుతున్నారు. వీరు ఒకటిన్నర ఏళ్ళుగా, వృషభ-వృశ్చిక రాశులలో ఉన్నారు. ఇప్పుడు రాహువు వృషభం నుంచి మేషానికి, కేతువు వృశ్చికం నుంచి తులకు మారుతున్నారు. ఈ రాశులలో ఏదాదిన్నరపాటు ఉండబోతున్నారు.

ఈ మార్పులవల్ల ప్రపంచజనాభా అయిన 760 కోట్లమంది జీవితాలలో అనేక మార్పులు రాబోతున్నాయి. అవేమిటో చూద్దాం.

మేషరాశి 

వీరి కుటుంబజీవితం ప్రభావితమౌతుంది. దూకుడు ఎక్కువౌతుంది. దానివల్ల ఆరోగ్యంలో బీపీ లాంటి తేడాలొస్తాయి. భార్య లేదా భర్తను ఇబ్బంది పెడతారు. బాధ్యతలు, మానసికచింతలు పెరుగుతాయి. జీవిత భాగస్వాములలో ఒకరివల్ల మరొకరికి ఇబ్బందులు పెరుగుతాయి. 

వృషభరాశి

వీరికి, వీరి జీవిత భాగస్వామికి జీవితంలో హటాత్ మార్పులు కలుగుతాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. చక్కెరవ్యాధి తలఎత్తవచ్చు. ఆస్పత్రి సందర్శనం జరుగుతుంది. దీర్ఘరోగాలు నిద్రలేస్తాయి. క్రొత్త పరిచయాలు, విలాసాలు, విందులు పెరుగుతాయి. వాటివల్ల రోగాలు కలుగుతాయి. శత్రువులు బలహీనమౌతారు.

మిధునరాశి

సంతానభావం నిద్రలేస్తుంది. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడతారు. అకస్మాత్తు లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి. సంతానానికి విలాసజీవితం మొదలౌతుంది. కానీ దానివల్ల మంచి జరగదు. మానసికంగా చెదిరిపోతారు. మొండిధైర్యమూ, ఆధ్యాత్మికచింతనా పెరుగుతాయి. రహస్యలాభాలు కలుగుతాయి.

కర్కాటకరాశి

ఇల్లు, ఆఫీసు ఈ రెండింటి మీదా గ్రహదృష్టి పడుతుంది. దూరప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగులు హటాత్తుగా ఇంటికి చేరుకుంటారు. ఆఫీసులో పరపతి పెరుగుతుంది. మాట చెల్లుబాటు అవుతుంది. వీరి ఇంటి వాతావరణాన్ని, ఆఫీసుపని అదుపు చేస్తుంది. ఈ ఒకటిన్నరేళ్ల కాలంలో ఈ రాశి వ్యక్తులు చాలామంది రిటైరౌతారు. అయినవాళ్లు దూరమౌతారు.

సింహరాశి

వీరికి ఈ రాహుకేతువుల మార్పు మంచిని చేస్తుంది. ధైర్యం పెరుగుతుంది. దూకుడు, చొరవలు కలుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. లేదా దూరప్రాంతాలకు నివాసాన్ని మారుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కన్యారాశి

ఈ గ్రహమార్పు వీరికి మంచిది కాదు. ఇంట్లో, కుటుంబపరంగా చికాకులు గొడవలు పెరుగుతాయి. అనుకోని హటాత్ గొడవలు, మాటామాటా అనుకోవడాల వల్ల నష్టపోతారు. ఆర్ధికంగా నష్టాలుంటాయి. దీర్ఘరోగాలు నిద్రలేస్తాయి. యాక్సిడెంట్ కావచ్చు. కొంతమందికి కాలం చెల్లుతుంది కూడా. 

తులారాశి

జీవిత భాగస్వామి నుండి హింస ఎక్కువౌతుంది. ఇంట్లో గొడవలు, కలతలు, మాటపట్టింపులు ఎక్కువౌతాయి. వ్యాపార భాగస్వాముల చేతిలో మోసపోతారు. జీవితంలో సమతుల్యత లోపిస్తుంది. సుఖానికి దూరమౌతారు.

వృశ్చికరాశి

వీరికి ధైర్యమూ దూకుడూ పెరుగుతాయి. దానివల్ల బీపీ మొదలైన రోగాలు తలెత్తుతాయి. శత్రుబాధ పెరుగుతుంది. వీరికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతాయి. దురదృష్టం మొదలౌతుంది. విందులు వినోదాలు రహస్యస్నేహాలు  ఎక్కువౌతాయి. అకస్మాత్తుగా ఆస్పత్రి పాలౌతారు. 

ధనూరాశి

అనుకోని లాభాలు ఎదురౌతాయి. సంతానానికి ధైర్యం పెరుగుతుంది. వారికి మంచికాలం మొదలౌతుంది. రెండేళ్లుగా పడుతున్న కష్టాలు పోతాయి. కలిసొస్తుంది. పాతస్నేహితులు విడిపోతారు. క్రొత్తస్నేహాలు మొదలౌతాయి.

మకరరాశి

ఇంట్లో చికాకులు, గొడవలు, మాటపట్టింపులు మొదలౌతాయి. ఇల్లు, ఆఫీసు ఈ రెండు భావాలూ నిద్రలేస్తాయి. బీపీ వస్తుంది. కిడ్నీ సంబంధ రోగాలు తలెత్తవచ్చు. వీరి ఉద్యోగాన్ని, ఇంటి వాతావరణం అదుపు చేస్తుంది. వృత్తిలో పెనుమార్పులుంటాయి. ఈ ఒకటిన్నరేళ్ల కాలంలో ఈ రాశి వ్యక్తులు చాలామంది రిటైరౌతారు.

కుంభరాశి

వీరికి ఈ గ్రహమార్పు మంచిని చేస్తుంది. ధైర్యం పెరుగుతుంది. ఉల్లాసంగా, చొరవగా దూసుకుపోతారు. ఆధ్యాత్మికచింతన ఎక్కువౌతుంది. పరిచయాలు, విహారయాత్రలు, విలాసాలు, విందులు జరుగుతాయి. దూరప్రాంతాలకు నివాసాన్ని మారుస్తారు.

మీనరాశి

వీరికి ఈ గ్రహమార్పు మంచిది కాదు. కుటుంబంలో గొడవలు కలతలు మొదలౌతాయి. మాటపట్టింపులు ఎక్కువౌతాయి. దురుసుమాటలవల్ల నష్టపోతారు. ఆర్ధికనష్టాలను చవిచూస్తారు. దీర్ఘరోగాలు పెరుగుతాయి. మందులకు లొంగవు.

ఇవి స్థూలమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగతజాతకాన్ని, జరుగుతున్న దశను పరిశీలిస్తూ, ఈ గోచారాన్ని కూడా కలుపుకుని చూచుకోవాలి. అప్పుడు మిగతా అన్ని ఫలితాలు బాగా సరిపోతాయి. ఆయా లగ్నాలవారు కూడా ఇవే ఫలితాలను చూచుకోవాలి.

జాగ్రత్తలు తీసుకోండి మరి !

read more " ఏప్రిల్ 13 న రాహుకేతువుల రాశిమార్పు - ఫలితాలు "

మనసుకి మాస్కు

నిన్నొక శిష్యురాలితో హైద్రాబాద్ మెట్రోలో  ప్రయాణిస్తున్నా. వాళ్ళీ మధ్యనే అమెరికానుంచి ఇండియాకు కాపురం మార్చేశారు. మెట్రోలో  ప్రయాణం తనకు అలవాటు లేకపోతే, అమీర్ పేట దాకా ఎదురెళ్లా. అక్కడ మెట్రో  మారి ఇంటికొస్తున్నాం.

జనం బాగానే ఉన్నారు. కొంతమంది మాస్క్ లు వేసుకున్నారు. కొంతమంది వేసుకోలేదు. ఉన్నట్టుండి శిష్యురాలికి ఒక అనుమానం తలెత్తింది.

'అసలీ మాస్క్ గోలేంటి? ఈ రోగం ఎందుకొచ్చిందో మనుషులకి?' మాస్క్ వేసుకునే అడిగింది. 

మాస్కు తియ్యకుండా లోలోపలే నవ్వాను. 

'విను మరి. ఏ రోగమైనా లోపలి స్థితిని బట్టే బయటొస్తుంది. మనుషుల మనసులకి మాస్కులు పెరిగాయి.  లోపలొకటి బైటకొకటి. మాస్కు లేకుండా  ఉన్నదున్నట్టు స్వచ్ఛంగా మాట్లాడేవాళ్ళని నీ జీవితంలో నువ్వసలు  చూశావా ఇప్పటిదాకా?' అడిగా.

కాసేపు ఆలోచించి, 'లేనట్టే ఉంది' అంది.

'అందరూ మనసులకి మాస్కులేసుకుని బ్రతుకుతున్నారు కాబట్టి, ముఖాలకు కూడా  మాస్కులొచ్చాయి. నువ్వెలా ఉంటే ప్రకృతి కూడా నీకదే ఇస్తుంది. వెరీ సింపుల్'  అన్నా.

శిష్యురాలు తెలివైంది.

'మరైతే, ఇంత గోలలో కూడా కొంతమందికి కరోనా సోకలేదు. వాళ్ళు వాక్సిన్ కూడా వేసుకోలేదు. మరి వాళ్ళ మనసులకి మాస్కులు లేనట్టేగా?' అంది.

'అంతేగా. దానికి నేనేగా పెద్ద ఉదాహరణ?' అన్నా సీరియస్ గా.

'సరేలే. నీకున్నన్ని మాస్కులు ఇంకెవరికీ ఉండవేమో లోకంలో?' అంది తను.

'అవును. స్వార్ధంతో  అందరూ మాస్కులు వేసుకుంటే, నిస్వార్ధంగా మీకోసం నేను వేసుకుంటాను. అంతే తేడా' అన్నా.

శిష్యురాలికి నాతో చనువెక్కువ.

'అబ్బో. ఇది నీ మాస్కా?' అంది.

'అంతేగా మరి' అన్నా అస్సలు నవ్వకుండా.

'ఇదంతా నిజమేనా అసలు?' అంది అనుమానంగా చూస్తూ.

'నా మాస్కంత నిజం, మెట్టుగూడ వచ్చింది. దిగు' అంటూ డోర్ వైపు నడిచా.

తనేం చేస్తుంది పాపం? తిట్టుకుంటూ నాతోబాటు రైలు దిగింది. 

read more " మనసుకి మాస్కు "

బుజ్జిపాప తత్త్వాలు - 6 ( బంగ్లాదేశ్ ఫైల్స్)

ఇస్కాన్ టెంపుల్ మళ్ళీ

విధ్వంసం పాలైంది

ఇస్లామిక్ రాక్షసత్వం

ఇంకోసారి లేచింది

ఓ బుజ్జిపాపా !


రాధాకృష్ణ విగ్రహాలు

రౌడీల పాలయ్యాయి

అడ్డొచ్చిన హిందువులకు 

అరవబాదుడెదురైంది

ఓ బుజ్జిపాపా !


శాంతి శాంతి అనే మతం

అసలు రంగు వెల్లడైంది

నాటకాల తురకమతం

నల్లరంగు పులుముకుంది

ఓ బుజ్జిపాపా !


హింసకు హింసే ప్రతిగా

హిందూత్వం మేల్కొనాలి

వీధికొక్క శివాజీలు

వెల్లువగా రావాలి

ఓ బుజ్జిపాపా !


ఇండియాకు వచ్చేసి

ఇక్కడే ఉంటున్న

లక్షలాది బంగ్లాలను

బయటకు తోసెయ్యాలి

ఓ బుజ్జిపాపా !


ఒరిస్సా బెంగాలు

బీహారు హైడ్రాబాదు

అన్నిచోట్ల స్థిరపడిన

బంగ్లా రోహింగ్యాలను

ఏరిపారవెయ్యాలి 

ఓ బుజ్జిపాపా !

లేకపోతే..ముందుముందు...


బంగ్లాదేశ్ ఫైల్సంటూ

ఇంకో సినిమా తీసుకోని

దాన్ని చూసి ఏడుస్తూ

నవ్వుకుంటు ఉండాలి

ఓ బుజ్జిపాపా !

read more " బుజ్జిపాప తత్త్వాలు - 6 ( బంగ్లాదేశ్ ఫైల్స్) "

17, మార్చి 2022, గురువారం

బుజ్జిపాప తత్త్వాలు - 5 ( హిజాబ్ గొడవ)

మతం గురించి మాట్లాడే

హక్కు కోర్టుకెక్కడిది?

మా చట్టం మాకుంది

అది ఎడారిలో పుట్టింది

ఓ బుజ్జిపాపా !


రాయితీలు బొక్కుతాము

రాజ్యాంగపు హక్కంటాము

ఈ దేశపు ఆత్మతోటి

ఎప్పటికీ కలువబోము

ఓ బుజ్జిపాపా !


యూనిఫాము వేసుకోము

జాతీయగీతం పాడబోము

కోర్టు తీర్పు పాటించము

మేమెడారి మనుషులం

ఓ బుజ్జిపాపా !


ఆడదాన్ని బ్రతకనీము

బ్రతికినా ఎదగనీము

పిల్లలయంత్రం లాగా

పవిత్రంగ చూస్తాము

ఓ బుజ్జిపాపా !

read more " బుజ్జిపాప తత్త్వాలు - 5 ( హిజాబ్ గొడవ) "

బుజ్జిపాప తత్త్వాలు - 4 ( కాశ్మీర్ ఫైల్స్)

కాశ్మీరు ఫైల్సన్నీ

పండిట్ల ఏడుపులే

కనుక బ్యాన్ చెయ్యాలి

ఓ బుజ్జిపాపా !


మావాళ్లు రాక్షసులే

మావన్నీ దౌష్ట్యాలే

కానీ వాటిని దాచాలి

ఓ బుజ్జిపాపా !


ఈ  దేశంలో ఉంటూ

ఇక్కడి తిండే తింటూ

పాకిస్తాన్ని పొగడాలి

ఓ బుజ్జిపాపా !


రాజ్యాంగం చాటుగాను

రంజుగా దాక్కుంటాం

డెమోక్రసీ పేరుమీద

డెవిల్ పనులు చేస్తుంటాం

ఓ బుజ్జిపాపా !


పండిట్లను చంపేస్తాం

పాకిస్తాన్ జై అంటాం

ఎవడో సినిమా తీస్తే

మైనారిటీ రైట్సంటాం

ఓ బుజ్జిపాపా !


ప్రత్యేకపు హోదాతో

ఫండ్సన్నీ వాడుకోని

పండిట్లను చంపేస్తూ

పాక్ పోయి వస్తుంటాం

ఓ బుజ్జిపాపా !


ప్రజలందరు ఎన్నుకున్న

పండంటి ప్రభుత్వాన్ని

కూల్చాలని చూస్తుంటాం

కుట్రలెన్నొ చేస్తుంటాం

ఓ బుజ్జిపాపా !

read more " బుజ్జిపాప తత్త్వాలు - 4 ( కాశ్మీర్ ఫైల్స్) "

14, మార్చి 2022, సోమవారం

బుజ్జిపాప తత్త్వాలు - 3 (మోడ్రన్ జీవితాలు)

పగలంతా టెలిగ్రాము

రాత్రంతా ఇంస్టాగ్రాము

పెరుగుతుంది కిలోగ్రాము

ఓ బుజ్జిపాపా !


పగలూ రాత్రీ సోషల్ మీడియాలో కాలం గడుపుతూ ఉంటే, ఒంటికి తగినంత వ్యాయామం లేక ఊబకాయం వస్తుంది. రోగాలు పెరుగుతాయి. 


ఎన్నారై నడమంత్రులు

పేరెంట్సే హనుమంతులు

పిల్లలేమొ పనిమంతులు

ఓ బుజ్జిపాపా !


ఇండియాలో మధ్యతరగతి నుండి అమెరికాకు వెళ్లి ఎన్నారైలయిన వాళ్లకు నడమంత్రపు సిరి వస్తుంది. గర్వం పెరుగుతుంది. వారికి బేబీ సిట్టింగ్ చేయడానికి వారి తల్లిదండ్రులు హనుమంతునిలాగా సముద్రాలు దాటి పోయి వస్తుంటారు. వారు సంపాదించిన డబ్బంతా వారి పిల్లలు బాధ్యతారహితంగా ఖర్చుచేస్తారు.

ఆన్లైన్లో ఆర్దర్లు

మనుషులలో బోర్డర్లు

మానవత్వ మర్దర్లు

ఓ బుజ్జిపాపా !


ప్రతి ఇంట్లోనూ ఆన్లైన్ లో ఆహారం ఆర్డర్ చేసి తెప్పించుకొని తినడం ఎక్కువైంది. ఎవరి ఫోన్ లో వారు కాలం గడుపుతూ కుటుంబ సభ్యుల మధ్యన దూరాలు పెరుగుతున్నాయి. ఫలితంగా, మానవత్వం మంటగలిసిపోతున్నది.


ఇంటివంట కరువాయె

తెగహోటలు బిల్లాయె

పిల్లలు వస్తాదులాయె 

ఓ బుజ్జిపాపా !


ఎక్కువమంది ఆడాళ్ళు ఇంట్లో వంటలు చేయడం లేదు. హోటలు బిల్లు విపరీతం అవుతున్నది.  జంక్ ఫుడ్ ఎక్కువై, చిన్నపిల్లలు కూడా ఊబకాయులై పహిల్వాన్ల మాదిరి ఊరిపోతున్నారు.


సెల్లు ఫుల్లు బిజీ ఆయె 

సొల్లు వాగి సొలసిపోయె 

కుళ్ళుబ్రతుకు కుంపటాయె 

ఓ బుజ్జిపాపా !


ఎవరి మొబైల్ చూచినా ఇప్పుడు బిజీగా ఉంటోంది. పోనీ మాట్లాడేది ఏమైనా ముఖ్యమైన విషయమా అంటే అదీ ఉండదు. అంతా సొల్లే. ఈ కుట్రలు  కుతంత్రాలతో జీవితం కుళ్లిపోతున్నది.


వెల్తు కార్డు హెచ్చిపోయె 

హెల్తు కార్డు పుచ్చిపోయె

మార్క్స్ కార్డు మంటలాయె

ఓ బుజ్జిపాపా !


అందరిదగ్గరా డబ్బు బాగానే మూలుగుతున్నది. ఆరోగ్యాలు మాత్రం పుచ్చిపోతున్నాయి. ప్రతి ఆస్పత్రీ కిటకిటలాడుతోంది. మనిషి జీవితానికి పడే మార్కులు మాత్రం  నానాటికీ తగ్గిపోతున్నాయి.

read more " బుజ్జిపాప తత్త్వాలు - 3 (మోడ్రన్ జీవితాలు) "

13, మార్చి 2022, ఆదివారం

బుజ్జిపాప తత్త్వాలు - 2 ( కరోనా బ్రతుకులు)

మొన్నేమో డెల్టా అంట

నిన్న ఒమిక్రానంట

రేపు డెల్టాక్రానంట

ఓ  బుజ్జిపాపా !


మొదట్లో డెల్టా అన్నారు. తర్వాత ఓమైక్రాన్ అన్నారు. రేపు డెల్టాక్రాన్ వస్తుందంట.


వాక్సిన్ వద్దన్నవారు

చచ్చి శవాలయ్యారు

వాక్సిన్ ఇమ్మన్నవారు

జీవచ్ఛవాలయ్యారు

ఓ బుజ్జిపాపా !


మాకు వాక్సిన్ వద్దన్నవారిలో చాలామంది (ఇతరరోగాలుంటే) చనిపోయారు. శవాలై కాటికి తరలిపోయారు. మూడు వాక్సిన్లూ వేయించుకుని హాయిగా ఉన్నామని అనుకుంటున్న వారిది భ్రమ మాత్రమే. జాగ్రత్తగా గమనించుకుంటే వాక్సిన్ సైడ్ ఎఫెక్టులు ఎవరికి  వారికే కనిపిస్తాయి. వాక్సిన్ పడినవారు బ్రతికున్నారు గాని, జీవచ్ఛవాల మాదిరి బ్రతికున్నారు. ఏదైనా శవమే, ఒకటి చచ్చినది, ఒకటి బ్రతికినది. అంతే !


రోజుకొక్క వేరియంటు

లాక్ డౌనుల కోవనెంటు

తినడానికి చొప్పదంటు

ఓ బుజ్జిపాపా !


మాటమాటకీ ఏదో ఒక వేరియంట్ రావడం, లాక్ డౌన్ అనడం. ఈ గోలలో పడి ఎన్నో వ్యాపారాలు, జీవితాలు తారుమారయ్యాయి. ప్రభుత్వానిదీ తప్పుకాదు. ప్రజలదీ తప్పుకాదు. తప్పంతా గ్లోబల్ కర్మది. 


రోజుకొక్క మాస్కువేయు

టాస్కును భరియించలేక

మాస్కు విసరిపారవేసి

మందుగొట్టె సామాన్యుడు

ఓ బుజ్జిపాపా !


భయపడుతున్న మధ్యతరగతి వారే ఇంకా మాస్కు వాడుతున్నారు. 'ఎన్నాళ్లీ మాస్కు' అంటూ సామాన్యుడు మాత్రం దాన్ని తీసిపారేసి జల్సాగా మందుకొడుతూ హాయిగా ఉంటున్నాడు.


ప్రతిరోజూ న్యూసుచూసి

భయపడుతూ చావలేక

మాస్కు విసరిపారవేసి

రోడ్డుకెక్కె సామాన్యుడు

ఓ బుజ్జిపాపా !


ప్రతిరోజూ చావుకన్న

ఒక్కరోజు చావుమేలు

కరోనాలు గిరోనాలు 

జానే దేవ్ అంటున్నాడు

ఓ బుజ్జిపాపా !


'భయంతో రోజూ చావడమెందుకు? కరోనా వస్తే చద్దాంలే. పోయేదేముంది?' అనుకుంటూ ప్రస్తుతం చాలామంది దానిని లెక్కచేయడం లేదు. లోకం తీరు ఇలా తయారైంది.

read more " బుజ్జిపాప తత్త్వాలు - 2 ( కరోనా బ్రతుకులు) "

12, మార్చి 2022, శనివారం

బుజ్జిపాప తత్త్వాలు - 1 ( దేవుడు చేసిన మనుషులు)

శివుడొక్కడె దేవుడంటె 

చింతబరిక తియ్యాలి

విష్ణువొకడే దేవుడంటే

వీపు సాఫు చెయ్యాలి

ఓ బుజ్జిపాపా !


అమ్మవారి పూజ చేస్తూ

ఆడదాన్ని హింసపెడితే

అట్లకాడ కాల్చాలి

పొద్దుగాల పూజలంటూ

హద్దుమీరి తిరుగుతుంటే

మొద్దు తిరగవెయ్యాలి

ఓ బుజ్జిపాపా 


మీ మతం చెడ్డదంటూ

మతం మారిపొమ్మంటే

మత్తు దింపి చూపాలి

మాటకొస్తే నీతి చెబుతూ

మానవత్వం మాయమైతే

మాడు అంటి పంపాలి

ఓ బుజ్జిపాపా

read more " బుజ్జిపాప తత్త్వాలు - 1 ( దేవుడు చేసిన మనుషులు) "

9, మార్చి 2022, బుధవారం

రాజమండ్రి స్మృతులు - 3

వచ్చిన పని అయిపోయాక, సాయంత్రం పూట రామకృష్ణా మఠానికి బయలుదేరాము.  దారిలో, ఒకప్పుడు మేమున్న ఇంటిని గుర్తుపట్టలేకపోయాము. అంతగా అక్కడంతా మారిపోయింది. అన్నీ షాపులు వచ్చేశాయి. గోదారి గట్టుమీదుగా వెళుతుంటే, 'ఇక్కడ రేవులు బాగుంటాయి. సాయంత్రం పూట జనం వచ్చి కూచుంటారు. క్రమేణా దీనినొక టూరిస్ట్ సిటీగా మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి' అన్నాడు జానకిరామ్.

'నా చిన్నపుడు ఈ గోదారి ఒడ్డున చాలా తిరిగేవాడిని. ఇప్పుడేవేవో ఆశ్రమాలు చాలా కనిపిస్తున్నాయి' అన్నాను. 

'అవును. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ బాగుంటుంది. కొన్ని ఇతర ఆశ్రమాలు కూడా ఉన్నాయి. చివరకు ఇక్కడ కట్టిన శ్మశానం కూడా ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. ఈ శ్మశానాన్ని చాలా మోడ్రన్ గా కట్టింది కార్పొరేషన్' అన్నాడు జానకిరామ్.

దాని ఎదురుగా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లు చాలా కనిపించాయి. 'మరి వాటిల్లో మనుషులు పొద్దున్నే లేచి తలుపులు తీస్తే, శవాలు తగలబడటం కన్పిస్తుంది కదా. అది వాళ్లకు నచ్చుతుందా?' అడిగాను.

'అందుకేనేమో, ప్రస్తుతం ఆ కాంప్లెక్స్ ని షాపింగ్ కాంప్లెక్స్ గా మార్చేశారు' అన్నాడు.

నవ్వొచ్చింది. 'అంతేలే. శవం తగలబడేలోపు బంధువులు షాపింగ్ చేసుకోవచ్చు. ఒక పనైపోతుంది. టైం వేస్ట్ కాకుండా ఉంటుంది' అన్నా.

గోదారి ఒడ్డున ఉన్న రామకృష్ణా మిషన్ బిల్డింగ్ దాటుకుని కారు పోతోంది. చిన్నపిల్లాడిగా అక్కడికొచ్చిన జ్ఞాపకాలు తిరిగొచ్చాయి. అలా ప్రయాణించిన కారు చివరకు మఠం ప్రాంగణాన్ని చేరుకుంది.

మొదటిసారిగా, 1974 లో నేను రామకృష్ణామఠానికి మా అమ్మగారితో కలసి వచ్చాను. అప్పుడు నాకు 11 ఏళ్ళు. అప్పట్లో శ్రీ నందానందస్వామివారు మఠాధ్యక్షులుగా ఉండేవారు. 'బాలల వివేకానందుడు' అనే పుస్తకాన్ని ఆయన నాకిచ్చారు. అప్పట్లో మఠం ఇక్కడుండేది కాదు. వీరభద్రపురంలో ఉండేది. స్కూల్ అయిపోయిన తర్వాత, ఎన్నోసార్లు రాజమండ్రి స్టేషన్ దగ్గర మేమున్న ఇంటినుండి దాదాపు 5 కి. మీ దూరం నడుచుకుంటూ పాతమఠానికి వచ్చి, ఆరతి అయిపోయేదాకా ఉండి, స్వామీజీని దర్శించి, నమస్కారం చేసుకుని మళ్ళీ నడుచుకుంటూ వెనక్కు వెళ్ళేవాడిని. ఈ పది కి.మీ నడకలోనూ జపం చేస్తూనే నడిచేవాడిని. ఆ చిన్నవయసులో అలాంటి సాధనకు ప్రేరణ స్వామీజీ యొక్క అనుగ్రహమే.

ఆయన నన్నెంతో అభిమానించేవారు. కారణాంతరాలవల్ల మఠంలో బ్రహ్మచారిగా చేరలేకపోయాను. సంసారినయ్యాను. అయినా సరే, ఎంతో తరువాతి కాలంలో నాకు 35 ఏళ్ల వయసులో ఆయన దేహత్యాగం చేసేవరకూ, అనేక సందర్భాలలో అనేక విషయాలలో ఆయన నాకు మార్గదర్శనం చేశారు. మారుమూల గ్రామం పూనూరులో జరిగిన నా ఉపనయనానికి ఆయన నడిచి వచ్చారు. విజయవాడలో, ఆదోనిలో మా ఇంటికి వచ్చారు. మంత్రాలయం ఆయనతో కలసి వెళ్ళాను.  1992 లో జరిగిన గోదావరి పుష్కరాలలో ఆయన్ను ఇదే రాజమండ్రిలో కలుసుకున్నాను. నా సాధనామార్గంలో ఒక గురువైన ఆయనకు ప్రతిరోజూ నమస్కరిస్తూనే ఉంటాను. ఎన్నో సాధనాపరమైన విషయాలను ఆయన దగ్గర నేర్చుకున్నాను.  నా 'శ్రీవిద్యా రహస్యం' గ్రంధంలో ఆయా అనుభవాలను కొన్నింటిని వ్రాశాను. అవన్నీ గుర్తొచ్చాయి.

వారిమీద భక్తితోనే, ఈ రోజువరకూ నేను వ్రాసిన ప్రతి పుస్తకాన్నీ మా అమ్మగారికీ, స్వామివారికీ అంకితం చేస్తూ వస్తున్నాను. ఈ జ్ఞానసంపదంతా వారు పెట్టిన భిక్షే.

చాలాకాలం తర్వాత మళ్ళీ ఇక్కడకొచ్చాను. క్రొత్త మఠాన్ని దర్శించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న వినిశ్చలానంద స్వామివారు గుంటూరు వాస్తవ్యులే గాక, యువకునిగా ఉన్నప్పటినుండీ నాకు పరిచయస్తులే. మా ఇద్దరిదీ ఒకే వయసు కావడంతో దాదాపు స్నేహితులలాగా మేము మాట్లాడుకుంటాం. గుంటూరులో మా ఇంటికి కూడా ఆయనొచ్చారు. దాదాపు 20 ఏళ్ల క్రితం, 'శ్రీ రామకృష్ణ పుంథి' అనే బెంగాలీ గ్రంధం కోసం నేనాయనను సంప్రదిస్తే, దాని ఇంగ్లీషు అనువాదం A Portrait of Sri Ramakrishna అనే పుస్తకాన్ని ఆయన నాకు ఇచ్చారు. అప్పట్లో ఢిల్లీ వెళ్లే పని పడింది. దాదాపు 700 పేజీలున్న ఆ పుస్తకాన్ని ఆ ప్రయాణంలో ఏకబిగిన చదివేశాను. ఎలా ఢిల్లీ వెళ్లానో, ఎలా వచ్చానో గుర్తులేదు. అంతగా దానిలో లీనమయ్యాను.

రంగనాథానందస్వామివారు హైద్రాబాద్ మఠం అధ్యక్షులుగా ఉన్న రోజులలో, వినిశ్చలానంద స్వామివారు ఆయన దగ్గర సేవకునిగా ఉన్నారు. ఆయన శిక్షణలో నిగ్గుతేలిన వ్యక్తి ఈయన.

మఠంలోని రామకృష్ణాలయం, మన దక్షిణాది ఆలయగోపుర విధానంలో కట్టబడి చాలా బాగుంది.  ఆఫీసులో వాకబు చేస్తే స్వామీజీ ప్రస్తుతం మఠంలో లేరని, రంపచోడవరం మెడికల్ క్యాంప్ లో ఉన్నారని తెలిసింది. ఒక మొబైల్ వ్యాన్ లో అక్కడి ఏజన్సీ ఏరియాలోని గిరిజనులకు మెడికల్ సహాయాన్ని అందించే కార్యక్రమంలో ఆయన ప్రస్తుతం ఉన్నారు. వ్యక్తిగత జీవితమనేది ఏమీ లేకుండా, ఒక్క పైసా బ్యాంక్ బేలన్స్ లేకుండా, తమదంటూ ఏ విధమైన స్వార్ధమూ లేకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా, భగవంతుని ధ్యానంలో ఉంటూ, జీవులకు భగవద్భావంతో సేవను చేస్తున్న వీరు కదా అసలైన దేవతలంటే అని ఒళ్ళు పులకరించింది. మనస్సులోనే నమస్కారం చేసుకున్నాను.

ఆయనతో ఫోన్లో మాట్లాడాను. గుంటూరు విషయాలను, మద్రాస్ మఠంలో ఆయన బ్రహ్మచారిగా ఉన్నపుడు 1982 లో ఆయన్ను మొదటిసారి కలిసిన విషయం, గుంటూరు బ్రాడీపేటలోని వారింటికి ఆయనతో కలసి నేను వెళ్ళిన విషయం - అవన్నీ గుర్తు చేశాను. ఆయనకవన్నీ గుర్తున్నాయి. చాలా సంతోషపడ్డారు. తాను టూర్లో ఉన్నానని, ఇంకోసారి తనున్నపుడు వచ్చి మఠంలో తమ అతిధిగా  కొన్నాళ్ళు ఉండాలని ఆయనన్నారు. తప్పకుండా వస్తానని చెప్పాను. మఠమంతా తిప్పి చూపించమని స్టాఫ్ కు పురమాయించారు. ఆయనకిద్దామని తెచ్చిన నా పుస్తకాలను కొన్నింటిని మఠం ఆఫీసులో ఇచ్చాను.

ఆయన ఆదేశానుసారం, స్టాఫ్ వచ్చి మఠం ఆవరణ అంతా మాకు చూపించారు. విద్యార్థులకు జరుగుతున్న కంప్యూటర్ క్లాసులు, ఇతర సబ్జెక్టుల బోధన, మఠంలో రకరకాల మొక్కల పెంపకం. పెంపుడు తాబేళ్లు, ధ్యానమందిరం, గెస్టులకోసం కట్టిన 'స్వామి నందానంద భవనం' లను చూచాము. స్వామీజీ ఆఫీస్ రూములో, గత అరవై ఏళ్లలో అక్కడ పనిచేసిన ఆరేడుగురు అధ్యక్షస్వామీజీల ఫొటోలున్నాయి. వాటిలో స్వామి నందానందగారి ఫోటోను చూచినప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగాయి. 1972 నుండి 1979 వరకూ ఆయనక్కడ ఉన్నారు.

ఆ తర్వాత అక్కడనుండి బయలుదేరి గోదారి తీరంలో ఉన్న రామకృష్ణా మిషన్ భవనాలకు చేరుకున్నాం. మఠంలో సాధువులు ఉంటారు. జపధ్యానాది సాధనలు జరుగుతాయి. మిషన్ కేంద్రంలో సేవాకార్యక్రమాలు జరుగుతాయి. ఆ విధంగా వివేకానందస్వామి ఏర్పాటు చేశారు. స్టాఫ్ కూడా మాతో అక్కడకు వచ్చారు. అది పూర్తిగా మెడికల్ సెంటర్. మల్టీ మెడికల్ హాస్పిటల్. మధ్యాన్నం 1 గంట వరకూ సేవలందిస్తుంది. సిటీలోని అందరు స్పెషలిస్టులు అక్కడకొచ్చి ఒక గంట సేపు సేవలందించి వెళతారు. చీకటి పడటంతో మూసేసి ఉంది. కానీ మాకోసం తలుపులు తెరిపించి మరీ అన్ని విభాగాలను చూపించారు.

అవన్నీ చూచి, వారినుంచి సెలవు తీసుకుని, వెనక్కు బయలుదేరాము. గోదావరి గట్టున కొద్దిసేపు కూర్చుని వెళదామని అన్నాను. ఒక మనుషులు లేని రేవులో కూర్చుందామని చూస్తే, అక్కడ అంత శుభ్రంగా లేదు. అందుకని ఇస్కాన్ ఘాట్ లో బాగుంటుందని అక్కడకు తీసుకెళ్లారు. అక్కడ ఘాట్ కు వెళ్ళేదారిలో నాలుగైదు మఠాలు కనిపించాయి. అన్నీ చాలావరకూ నిర్మానుష్యంగా ఉన్నాయి. కొన్ని నకిలీ స్వాముల ఆశ్రమాలలో మాత్రం జనాలున్నారు. గోదారి ఒడ్డున మెట్లమీద కాసేపు కూచున్నాము. అక్కడి మనుషుల ఎచ్చులు, వేషాలు కాసేపు చూచాక అక్కడుండాలనిపించలేదు.  పవిత్రమైన స్థలాలను తమ చీప్ ప్రవర్తనలతో అపవిత్రం చెయ్యడం ఎంత బాగా వచ్చో మనుషులకి? అని అసహ్యం చేసింది. గోదావరి జిల్లాలలోని సగటుమనుషులలో అతిప్రవర్తనలు, అతివాగుడులు చాలా ఎక్కువ. డీసెంట్ బిహేవియర్ ఆశించేవారికి అవి వెగటు పుట్టిస్తాయి.

ఇక అక్కడనుంచి లేచి, వెనక్కు వస్తుంటే, ఆ ఆశ్రమాల మధ్యలో మళయాళస్వాములవారి వ్యాసాశ్రమభవనం కనిపించింది. సత్యమైన ఋష్యాశ్రమాలు ఎలా ఉంటాయో, అలాగే నిర్మానుష్యంగా ఉంది. వెంటనే ఆగి, బయటనుంచి ఆయన ఫొటోకు నమస్కారం చేసుకున్నాను. ఆయన నిజమైన తపస్వి, వేదాంతి, జ్ఞాని. నందానందస్వామివారు ఆయన్ను ఎంతో గౌరవించేవారు. ప్రస్తుతపు ఎందరో నకిలీస్వాముల మధ్యనున్న సత్యమైన సాధువులలో, బ్రహ్మజ్ఞానులలో ఆయనొకరు. ఆయన శిష్యపరంపర కూడా నిజమైన జ్ఞానుల పరంపరయే.

ఆయన ఆశ్రమం ముందు ఆగి, నమస్కారం చేసుకుని, బయలుదేరుతుంటే, నాతో ఉన్నవారు ఇలా అన్నారు, 'మిగతా ఆశ్రమాలలోకి వెళ్ళరా?' అని.

'వెళ్ళను' అని అన్నాను.

అడిగినవారి ముఖాలలో ప్రశ్నార్ధకాలను చూచి, 'వాటిల్లోకి వెళితే ఈ గోదారి చాలదు. ఆ బురదను కడుక్కోడానికి కాశీకెళ్లి గంగలో మునగవలసి వస్తుంది' అన్నా నవ్వుతూ.

'మరి వాటిల్లో కొన్నింటిలో జనాలు బాగానే ఉన్నారు కదా?' అని వారన్నారు.

'ఉంటారు. జనగొఱ్ఱెలకు అసలుకంటే నకిలీనే ఎక్కువగా నచ్చుతుంది. అదే కలిమహత్యం. లోకంలో మీరు చూస్తున్నదంతా నిజమనుకోకండి. రండి పోదాం. ' అంటూ కారు దగ్గరకు దారితీశాను.

గెస్ట్ హౌస్ ఖాళీ చేసి, రైలెక్కాము. 

'త్వరలో మళ్ళీ ఇంకోసారి రాజమండ్రి వెళ్ళాలి. రామకృష్ణ మఠంలో మా ఫ్రెండ్ స్వామీజీ గారితో ఒకటి రెండు రోజులు గడపాలి. నందానందస్వాములవారి గతస్మృతులను మళ్ళీ నెమరు వేసుకోవాలి' అని ఆలోచిస్తూ మర్నాడు పొద్దునకు హైద్రాబాద్ చేరుకున్నాము. 

(అయిపోయింది)

read more " రాజమండ్రి స్మృతులు - 3 "

7, మార్చి 2022, సోమవారం

రాజమండ్రి స్మృతులు - 2

రాజమండ్రిలో పని ముగించుకుని కడియం కు బయలుదేరాము. ఆ దారిలో పోతుంటే చిన్నప్పటి సంగతులు మరికొన్ని గుర్తొచ్చాయి.

మొదటిసారి నేను సత్యసాయిబాబాను గురించి విన్నది రాజమండ్రిలోనే. ఇదే దారిలోనే ఉన్న ఒక స్కూల్ లో ఆయన దిగారు. అందరూ తండోపతండాలుగా పోయి చూస్తున్నారు. నేనూ ఇంకా నలుగురు పిల్లలమూ కలసి ఆయన్ను చూద్దామని వెళ్ళాము. ఆ స్కూలు బిల్డింగు లోపలెక్కడో ఆయనున్నారు. మామూలుగా వెళ్లి, అందరినీ చూచినట్లు చూడటమే అని అమాయకంగా అనుకున్నా. అక్కడ పరిస్థితి అలా లేదు. కాసేపు చూచి విసుగుపుట్టి అక్కడనుంచి వచ్చేశాము. తర్వాతకాలంలో అఫీషియల్ డ్యూటీ మీద ధర్మవరం వెళ్ళినపుడు చాలాసార్లు ఆయన్ను చూచాను. చివరాఖరికి అలా పోయాడు పాపం !

అక్కడే ఆయన బొమ్మలున్న ఉంగరాలు, గొలుసులు అమ్ముతున్నారు. వాటిని కాసేపు చూచి, అక్కణ్ణించి బయలుదేరి వస్తూ పక్కనే ఉన్న చెరుకుతోటలలోకి వెళ్ళాము. ఎక్కడనుంచో బెల్లం వాసన వస్తుంటే, దానిని వెదుక్కుంటూ ఆ చెరుకుతోట మధ్యలోకి వెళ్లి చూచాము. ఒక పెద్దగుంటలో చెరుకురసాన్ని పోసి, కాస్తున్నారు. అప్పట్లో మనుషులలో మంచితనం ఇంకా బ్రతికి ఉండేది. నడుచుకుంటూ పల్లెలు దాటి పోతుంటే, ఎక్కడికి పోతున్నారని వివరాలు కనుక్కుని మంచినీళ్లు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడన్నిటినీ ఖరీదు కడుతున్నారు. ఆ చెరుకుతోటలో ఉన్న రైతు ఎవరోగాని, ఉడుకుతున్న చెరుకురసాన్ని మాకు తలాకాస్తా గ్లాసులో పోసి ఇచ్చాడు త్రాగమని. భలే రుచిగా ఉంది చెరుకుపానకం..

ఈ విషయం చెబుతుంటే వింటున్న జానకిరామ్, 'ఈ ఊర్లలో పెద్దవాళ్ళు ఇప్పటికీ అదే తింటారు.  దిబ్బరొట్టి, బెల్లంపాకం కలిపి తింటారు. అదే వాళ్ళ ఆహారం' అన్నాడు.

మా కారు డ్రైవరేమో, 'మనం వెళ్లే చోటకు దగ్గరలోనే రావులపాలెం అనే ఊరిలో RK Hotel అని ఉంటుంది.  అందులో దిబ్బరొట్టి, బెల్లంపాకం దొరుకుతాయి. టేస్ట్ చూస్తారా?' అన్నాడు.

'ఆ బెల్లం పాకాన్ని మన ఇంట్లో తయారు చేసుకోవచ్చా?' అడిగాను నేను.

నవ్వాడతను.

'కుదరదండి. చెరుకురసాన్ని తీగపాకంలాగా కాయాలి. దానికొక పద్దతుంటుంది. అలా చేస్తేనే అది వస్తుంది. అలాంటి తిండ్లు మా గోదారి జిల్లాల్లో చాలా ఉన్నాయి. పనస ఆకుల్లో  ఇడ్లీ ఉడకబెట్టి చేస్తారు. రెండిడ్లీ తిన్నారంటే మధ్యాన్నం దాకా మీకు ఆకలి వెయ్యమన్నా వెయ్యదు. పనసఆకులోని ప్రోటీన్ అంతా ఇడ్లీలోకి దిగి, ఇడ్లీ రంగు పసుపు పచ్చగా మారిపోతుంది. చాలా బాగుంటుంది' అన్నాడు.

అవన్నీ వింటుంటేనే నోరూరేలాగా ఉంది గోదారిజిల్లా యాసలో అతను చెప్పిన వర్ణన.

మెహర్ బాబా గారిని గురించి కూడా మొదటిసారిగా రాజమండ్రిలోనే విన్నాను. మేమక్కడున్నపుడే ఆయన రాజమండ్రికి వచ్చారు. మాకు దగ్గర్లోనే ఉన్నారు కూడా. కానీ, ఆయన గురించి పెద్దగా తెలియకపోవడం, నేను బాగా చిన్నపిల్లాడిని కావడాల వల్ల ఆయన్ను చూడలేకపోయాను. కొంచం పెద్దయిన తర్వాత, ఆయన సాహిత్యం చదివాక ఈ విషయంపైన చాలా బాధపడ్డాను కూడా. కానీ, సాధనలో నలిగిన తర్వాత, ఆ బాధ పోయింది. 

అప్పట్లో శ్యామలా టాకీసులో సినిమాకెళితే ఇంటర్వెల్ లో స్లైడ్స్ వేసేవాళ్ళు. వాటిలో మెహర్ బాబా స్లైడ్ కూడా ఉండేది. Dont worry Be happy అని దానిమీదుండేది. అది చూచి అమ్మను అడిగాను, 'ఆయనున్న చోటకెళ్లి చూద్దామా?' అని. అమ్మకు స్వతంత్రం లేదు. నవ్వి ఊరుకుంది పాపం. ఆ విధంగా మెహర్ బాబా గారిని దేహంతో చూడలేకపోయాను.

కడియంలో పని ముగించుకుని వెనక్కు వస్తుంటే, దారిలో అనేక మొక్కల నర్సరీలు కనిపించాయి. 'మన ఆశ్రమానికి కావలసిన మొక్కలన్నీ ఇక్కడనుంచి తీసుకోవచ్చు, మనకు కనీసం రెండులారీల మొక్కలు కావలసివస్తాయి. కొన్ని వేలరకాల మొక్కలు ఇక్కడుంటాయి' అని వాళ్ళన్నారు. అలాగే చేద్దామని, మళ్ళీ ఒకసారి పర్సనల్ గా వచ్చినపుడు, ఆ నర్సరీలన్నీ నిదానంగా చూచి, మన ఆశ్రమానికి కావలసిన మొక్కలను కొందామని నిర్ణయించాము.

మీ ఊరికి వెళ్ళొచ్చామని ఒక శిష్యునితో అంటే, 'మీకెలా అనిపించింది?' అనడిగాడు.

'బానే ఉంది. గోదారి జిల్లాలంటే నాకు ఇష్టమే' అని అన్నాను.

'మనుషులెలా అనిపించారు?' అన్నాడు నవ్వుతూ.

'బాగుంటుందని ప్రకృతిని గురించి నేనన్నాను. నీళ్లు, పచ్చదనం ఎక్కడ చూచినా ఉంటాయి. అవి నాకు నచ్చుతాయి. అదే మనుషులలో అయితే, కావలసినన్ని అవలక్షణాలు అగుపించాయి. మగాళ్లలో అయితే అత్యాశ, అనుమానం, భయం, డబ్బుయావలు బాగా ఎక్కువ. ఆడాళ్ళలో అయితే ఓవర్ పొసెసివ్ నెస్, భయం, జెలసీలు ఎక్కువ. అన్ని ప్రాంతాలలో అన్నీ ఉంటాయి గాని, కొన్ని చోట్ల కొన్ని ఎక్కువగా ఉంటాయి. గోదారిజిల్లాలలో ఇవి ఎక్కువ' అని చెప్పాను. 

రకరకాలైన వంటలకు, మంచితిండికి గోదావరిజిల్లాలు పెట్టింది పేరు. ఆ మాటకొస్తే కోస్తాజిల్లాలన్నీ మంచి తిండిపుష్టి ఉన్నవే. విశాఖనుంచీ నెల్లూరు వరకూ ఏ ప్రాంతపు తిండి ఆ ప్రాంతానికుంది. కానీ దారిలో చాలాచోట్ల హైద్రాబాద్ బిర్యానీ అని హోటళ్లు చాలా కనిపించాయి.  అదేంటి అనడిగితే, 'ఇప్పుడెక్కడ చూసినా ఇదెక్కువైంది' అని వాళ్ళు చెప్పారు. నిజమే అనిపించింది. నాన్ వెజ్ తిండి ఇప్పుడు బాహాటం అయిపోయింది. పాతకాలంలో అయితే, ఎక్కడో మిలటరీ హోటల్ అని ఒక్కటి ఉండేది. ఇప్పుడు శాకాహారహోటల్ని వెతుక్కోవాల్సి వస్తోంది. నేను నిజామాబాద్ వెళ్ళినపుడు అదే జరిగింది. ఒక వెజ్ హోటల్ కోసం గంటపాటు ఆటోలో వెతుక్కుంటూ తిరిగాం. ఎక్కడచూచినా సిగ్గులేకుండా రోడ్లమీద పెట్టి, ఫ్లెక్షీలలో బొమ్మలు పెట్టి, మరీ మాంసాహారం అమ్ముతున్నారు. సమాజంలో పేట్రేగిపోతున్న విచ్చలవిడితనానికి, నీతీనియమాలు లోపించడానికి, పెడపోకడలు, క్రైమ్ రేట్లు పెరగడానికి, విపరీతమైన ఈ మాంసాహారపు వాడకం కూడా ఒక కారణమని నా ఊహ.

అదే విధంగా, త్రాగటం కూడా ఇప్పుడు చాలా ఎక్కువైంది. ఒకప్పుడు భయం భయంగా దాక్కొని త్రాగేవాళ్ళు. ఇప్పుడు బాహాటంగా త్రాగుతున్నారు. కాలేజి అమ్మాయిలు అబ్బాయిలు త్రాగుతున్నారు. దిగజారుతున్న సమాజానికి ఇది నిదర్శనం.

ప్రస్తుతం అందరిదగ్గరా డబ్బులు ఎక్కువయ్యాయి. కానీ నీతీ నియమాలు తగ్గిపోయాయి. కదిలిస్తే అందరూ నీతులు చెబుతున్నారు. కానీ పాటిస్తున్నవాళ్ళు ఎక్కడా లేరు. అందరికీ ఈగోలు ఎక్కువయ్యాయి. ఇది మంచికి కాదు. కరోనా అందుకే వచ్చి ఒక దులుపుడు దులిపింది. అయినా మనుషులలో మార్పు రావడం లేదు. అందుకే, ముందు ముందు దీని బాబులాంటిది ఇంకోటి రాబోతోంది.

ఆలోచనలలో పడ్డాను. అందరూ మౌనంగా ఉన్నారు. కారు ముందుకు దూసుకుపోతోంది.

వెళ్ళినపని చూచుకొని, రాజమండ్రికి తిరిగివచ్చి లంచ్ చేసి కొద్దిగా విశ్రాంతి తీసుకున్నాము. సాయంత్రం ఖాళీ దొరికితే, రామకృష్ణమఠానికి వెళ్లాలని ప్లాన్.

(ఇంకా ఉంది)

read more " రాజమండ్రి స్మృతులు - 2 "