7, సెప్టెంబర్ 2020, సోమవారం

Ma Anand Sheela - జాతక పరిశీలన - 2

ఇప్పుడు  ఈమె జాతకాన్ని సంస్కరించి జనన సమయాన్ని రాబడదాం. నేను చేయబోయే విశ్లేషణ జ్యోతిష్య విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చాలా కష్టమైన సమగ్రమైన విశ్లేషణ. పైపైన జ్యోతిష్యం వచ్చిన వాళ్లకు అర్ధం కాదు. జాగ్రత్తగా గమనించండి.

జీవితంలో కొన్ని సంఘటనలు తెలిసిన వాళ్ళకు, అంటే కొంచం పెద్ద అయినవాళ్లకు జననకాల విశ్లేషణ చేసే విధానం వేరుగా ఉంటుంది. జనన సమయాన్ని రికార్డ్ చేయకపోతే, చిన్నప్పుడే దానిని రాబట్టే విధానం వేరుగా ఉంటుంది. రెండూ శాస్త్రసమ్మతమైనవే. ఇందులో మొదటిదాన్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నాను.

వర్గచక్రాలనేవి భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న అద్భుతమైన ఉపకరణాలు. వాటిని వాడి జనన సమయం తెలియని వారి జాతకంలో దానిని ఎలా బయటకు తియ్యవచ్చో ఇప్పుడు చూడండి.

వికీ పీడియా ప్రకారం,  ఆరుగురు సంతానంలో  షీలా చిన్నది. కనుక ఆమెది వృషభ, కర్కాటక, వృశ్చిక, మీన లగ్నాలలో ఏదో ఒకటి అవ్వాలి. 5, 7, 9 భావాలను బట్టి ఆమె మనస్తత్వం, ఆమె గురువు, ఆమె ప్రేమవ్యవహారాలు, పెళ్లిళ్లు వీటన్నిటికీ ఈ నాలుగు లగ్నాలు మాత్రమే సరిపోతాయి..

     

 

28 - 12 - 1949 న రేవతి నక్షత్రం ఉన్నది. అందులోని నాలుగు పాదాలు ఈ లగ్నాలను కలిగి ఉన్నాయి.-

రేవతి  - 2 : 4.08 - 6.23 వృశ్చిక లగ్నం

రేవతి - 3: 11.51 - 13.21 మీన లగ్నం

రేవతి - 3: 15.03 - 17.01 వృషభ లగ్నం

రేవతి - 4: 19.13 - 21.28 కర్కాటక లగ్నం

దాదాపు 17 గంటల వ్యవధిలో ఈ నాలుగు లగ్నాలు ఒక్కొక్కటి దాదాపు రెండు గంటలపాటు ఉంటాయి. వాటిల్లో నుంచి సరియైన లగ్నాన్ని, జనన సమయాన్ని మనం రాబట్టాలి.

రేవతి - 2

ఇది 4.08 - 6.13 మధ్యలో వృశ్చిక లగ్నంతో ఉన్నది. నవాంశలో చంద్రుడు మకరం ఉంటూ, రాశి తుల్య నవాంశ పద్దతిలో అక్కడున్న మూడు గ్రహాలను ఆవరిస్తున్నాడు. మకరరాశి చాలా మొండి మనస్తత్వాన్నిస్తుంది. వీళ్ళు ఓటమిని అంగీకరించే మనుషులు కారు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ చివరకు విజయాన్ని సాధిస్తారు.

ద్వాదశాంశలో చంద్రుడు వృశ్చికరాశిలో నీచలో ఉన్నాడు. 4.31 - 4.41 మధ్యలో మకర లగ్నం ఉదయిస్తోంది. నీచ శుక్రుడు నవమంలో ఉంటూ నీచ గురువును సూచిస్తున్నాడు. కనుక జనన సమయం ఈ మధ్యలోనే ఉండాలి.


నవాంశలో 4.37 వరకూ సింహ లగ్నం ఉన్నది. తరువాత కన్యాలగ్నం ఉదయిస్తోంది. ఈమె జీవితానికి సింహ లగ్నమే సరిపోతుంది.  ఎందుకని? అక్కడనుంచి అయితేనే గురువు నవమంలో ఉన్నాడు గనుక. నీచ రాహువు బుద్ధిస్థానంలో ఉన్నాడు గనుక. 4 భావాధిపతిగా మనస్సును సూచిస్తున్న క కుట్రలకు కుతంత్రాలకు కారణమైన 8 లో ఉన్నాడు గనుక. కనుక జనన సమయం 4.31 నుండి 4.37 మధ్యలో ఉండి ఉండాలి.


త్రింశాంశ చక్రం మనస్తత్వాన్ని స్పష్టంగా సూచిస్తుంది. చంద్రుడు మకరంలో శుక్రునితో కలసి ఉంటూ ఈమె జీవితాన్ని సరిగానే చూపిస్తున్నాడు. మకరంలో ఉన్న శుక్రుడు జాతకుడికి సంప్రదాయ విరుద్ధమైన నడవడికనూ, ఒక విధమైన విచ్చలవిడి జీవితాన్ని ఇస్తాడు. లగ్నం కన్య అవుతూ ఈమె తన జీవితంలో చాలా భాగం ఒంటరిగానే ఉండవలసిన పరిస్థితిని చూపుతున్నది. లగ్నంలో ఉన్న కుజుడు సమస్యలకు లొంగని తెలివైన మొండి మనస్తత్వాన్నిస్తున్నాడు.

ఇంకా సూక్ష్మంగా వెళ్ళడానికి షష్ట్యంశ సహాయం తీసుకోవాలి. 4.40 నుండి 4.41 వరకూ మకరలగ్నమే ఉదయిస్తూ నవమంలో నీచ శుక్రునితో, పంచమ లాభస్థానాలలో ఉచ్చరాహు కేతువులతో కలసి ఉన్నది.

నవమ నీచశుక్రుడు ఓషోని సూచిస్తున్నాడు. పంచమ ఉచ్చ రాహువు నేరపూరిత మనస్తత్వాన్నీ ఒకటి కంటే ఎక్కువ ప్రేమ వ్యవహారాలనూ సూచిస్తున్నాడు. 


అష్టోత్తరాంశ చక్రంలో 4.41 వృశ్చిక లగ్నం అవుతూ ఈమె జీవితాన్ని ఇంకా స్పష్టంగా చూపిస్తున్నది. ఎలా? 9 వ అధిపతి చంద్రుడు 3 లో ఉంటూ 9 ని చూస్తున్నాడు. పంచమంలో కేతువు రహస్య ప్లానులను ఇస్తున్నాడు. 6 లో ఉన్న 10 వ అధిపతి ఉచ్చ సూర్యుడు విపరీతమైన అధికారాన్నిస్తున్నాడు. కనుక ఈమె జనన సమయం 4.41 AM అవుతున్నది.

దశను పరిశీలిస్తే బుధ -శుక్ర -రాహు దశ అవుతూ, ఈమె జనన గతిని చూపిస్త్తున్నది. కనుక ఈ విశ్లేషణ ప్రకారం 4.41 ఈమె జనన సమయం అవుతున్నది.



రేవతి - 3

ఈ నక్షత్రపాదంలో చంద్రుడు కుంభరాశిలోకి వస్తున్నాడు. కుంభరాశివారు నిస్వార్ధదానగుణం కలిగి ఉంటారు. సాయపడే తత్త్వం వీరికి పుట్టుకతో వస్తుంది. నా ఉద్దేశ్యం ప్రకారం తన గురువైన ఓషోని ఈమె నిజంగానే మనస్పూర్తిగానే ప్రేమించింది. ఈ మధ్య ఇండియాకు వచ్చినపుడు కరణ్ జోహార్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా 'నాకిప్పటికీ ఓషో అంటే గౌరవమే' అంది. షీలా ఆరిగాన్ వదిలి పారిపోయినప్పుడు ఓషో ఆమెను నానా బూతులు తిట్టాడు.అయినా సరే షీలా ఆయనను ఒక్కమాట అనలేదు. ఈ కోణంలో ఓషో కంటే షీలా మంచిదని అనిపిస్తుంది.

ద్వాదశాంశలో చూస్తే, కుంభ లగ్నం ఈమె జీవితాన్ని చక్కగా ప్రతిబింబిస్తుందని అనిపిస్తుంది.  నవమంలో రాహువు ఉంటూ ఉచ్చశనిని సూచిస్తున్నాడు. ఈ యోగం ఒక శక్తివంతుడైన అదే సమయంలో దుర్మార్గుడైన గురువును సూచిస్తుంది. నవమాదిపతి శుక్రుడు అష్టమంలో నీచలో ఉంటూ గురువు వల్ల ఈమె జీవితంలో జరిగే గొప్ప నష్టాన్ని చూపిస్తున్నాడు. కుజుడు చంద్రుడు ఏకాదశంలో ఉంటూ శని గురువుల చేత చూడబడుతూ ఆమె పైన ఉన్న అన్నలను అక్కలకు సూచికలుగా ఉన్నారు. కనుక 13.15 నుండి 13.22 వరకు ఉన్న కుంభలగ్నం ఇక్కడ సరిపోతున్నది.

మనస్తత్వాన్ని సూచించే త్రింశాంశలో వృశ్చికలగ్నం ఉదయిస్తోంది. ద్వాదశంలో ఉచ్చశని అనేక మందిని రహస్యకుట్రలతో ముంచడాన్నిస్తాడు. సప్తమంలో బుధుడు ఉంటూ తెలివైన విరోధులను చూపుతున్నాడు. మకరంలో తృతీయంలో ఉన్న చంద్రుడు శుక్రుడు నవమాన్ని చూస్తూ ఒకరి కంటే ఎక్కువమందితో సంబంధాలున్న గురువును ఇస్తున్నారు. 12 లో ఉన్న ఉచ్చ శని సామాన్య జనాన్ని హింస పెట్టడాన్ని సూచిస్తున్నాడు.


షష్ట్యంశ చక్రంలో 13. 19 మరియు 13. 20 లు ఈమె జీవితానికి సరియైన సూచికలుగా ఉన్నాయి. నవమంలో నీచ శుక్రుడు ఉంటూ, నీచుడైన సెక్స్ గురువును చూపిస్తున్నాడు.  

పంచమంలో ఉచ్చ స్థితిలో ఉన్న రాహువు శుక్రునికి కారకుడుగా ఒకటిని మించి ప్రేమ వ్యవహారాలను సెక్స్ సంబంధాలను చూపుతున్నాడు. చతుర్ధంలోని బుధుడు చంద్రుడు ఈమె జీవితంలోని ఒడుదుడుకులకు కష్టాలకు గొడవలకు కారకులౌతున్నారు.

ఇంకా లోతుగా వెళ్లి అష్టోత్తరాంశను చూస్తే 13.19 సరిగ్గా సరిపోతున్నది. తృతీయంలో నీచ గురువుంటూ నవమంలో ఉన్న బుధుని చూస్తూ, ఒక తెలివైన చెడ్డ గురువు చేతిలో ఈమె మోసపోతుందని చెబుతున్నాడు.

ఈ సమయానికి బుధ - రాహు - గురుదశ నడిచింది. రాహువు లగ్నంలో ఉన్నాడు. ఇది గురు చండాలయోగం. గత జన్మనించి వచ్చిన గురుశాపం ఇది. బుధుడు నీచ గురువు కర్మస్థానమైన తృతీయాన్ని, ప్రేమవ్యవహారాలను సూచించే పంచమాన్ని, వివాహాలకు కారకమైన సప్తమాన్ని చూస్తున్నారు.

రేవతి - 3

15.03 నుంచి 17.01 మధ్యలో వృషభలగ్నం ఉదయిస్తోంది.

దీనిలో చంద్రుడు మళ్ళీ కుంభరాశిలోకి వచ్చి ఉన్నాడు. దీని ఫలితాన్ని పైన వివరించాను కనుక మళ్ళీ చెప్పనవసరం లేదు. 15.40 నుంచి 15.52 మధ్య ఉన్న సమయం ఈమె జీవితాన్ని చాలా సరిగా చూపిస్తున్నది. ఎందుకంటే నీచ రాహువు నవమంలో ఉంటూ, గురువుకు కారకుడౌతూ గురుచండాల యోగాన్నిస్తూ ఒక దుర్మార్గుడైన గురువును సూచిస్తున్నాడు.

ద్వాదశాంశను చూస్తే, 15.40 నుండి 15.48 వరకు కన్యా లగ్నం ఉదయిస్తూ, నవమాది పతి అయిన నీచ శుక్రునితో కూడి ఉన్నది. ఆ తరువాత తులాలగ్నం అవుతున్నది. 9 లో 12 వ అధిపతి అయిన సూర్యుడు ఉంటూ, రహస్య కార్యకలాపాలున్న గురువునిస్తున్నాడు. 10 లో గురు శనులుంటూ అమెరికాకు సంబంధం ఉన్నట్టి బలమైన పూర్వకర్మను చూపుతున్నారు. కనుక ద్వాదశాంశను బట్టి జనన సమయం 15.40 నుండి 15.48 మధ్యలో ఉంటుంది.

త్రింశాంశను చూద్దాం. 15.40 నుంచి15.46 మధ్యలో కన్యా లగ్నం ఉన్నది. 15.47 మరియు 15.48 లలో మీనలగ్నం అవుతున్నది. ఈ రెంటిలో మీన లగ్నమే సరిపోతుంది. దీనినుంచి నీచ చంద్రుడు నవమంలో ఉంటూ ఒక రహస్య కుట్రలు చేసే ఒక నీచగురువు నిస్తున్నాడు. రాహువు గురువులు లగ్నంలో ఉండటం భయంకరమైన గురుచండాల యోగం. కనుక ఈ చక్రం మనకు 15.47 మరియు 15.48 అనే రెండు సమయాలనిస్తున్నది.

ఇప్పుడు షష్ట్యంశకు వద్దాం. ఈ రెండు సమయాలకూ ఇది వృషభ లగ్నాన్నే చూపిస్తున్నది. కనుక ఇంకా లోతుకు పోవాలి.

అష్టోత్తరాంశను చూస్తే, 15.47 వృశ్చిక లగ్నమౌతున్నది. త్రుతీయంలో నీచ గురువుంటూ నవమాన్ని చూస్తున్నాడు. ఓషోని సరిగా సూచిస్తున్నాడు. 15.48 అయితే లగ్నం ధనుస్సు అవుతూ ఈమె జీవితాన్ని సరిగా చూపలేకపోతోంది.  కనుక 15.47 అనేది ఈమె జనన సమయం అవుతూన్నది. 

ఈ సమయంలో బుధ - రాహు - శుక్రదశ నడుస్తూ ఈమె జీవిత గమనాన్ని చాలా సరిగ్గా చూపిస్తున్నది.




రేవతి - 4

ఈ నక్షత్ర పాదంలో కర్కాటక లగ్నం 19.13 నుంచి 21.28 వరకూ ఉదయిస్తున్నది.

ద్వాదశాంశ ప్రకారం మకర లగ్నం 20.22 నుండి 20.30 వరకూ ఉన్నది. నవమంలో నీచ గురువుంటూ మళ్ళీ ఓషో ఎలాంటివాడో చూపిస్తున్నాడు. 9 వ అధిపతి బుధుడు లగ్నంలోకి వచ్చి ఈమె జీవితం మీద ఉన్న బలమైన గురు ప్రభావాన్ని సూచిస్తున్నాడు.
4/10 ఇరుసులో ఉన్న రాహు కేతువులు స్వదేశంలోనూ విదేశంలోనూ అపజయాలనిస్తున్నారు. 6 లో ఉన్న గురు శనులు గురువుతో ఇతర శిష్యులతో, సామాన్య జనంతో విరోధాన్నిచ్చారు. 

ఒక్కసారి వెనక్కు వచ్చి నవాంశ ను గమనిస్తే, 20.28 వరకూ వృశ్చిక లగ్నమని, తరువాత రెండు నిముషాలలో అది ధనుర్లగ్నం అవుతున్నదని చూడవచ్చు. ఈ రెంటిలో ఈమె జీవితానికి వృశ్చికలగ్నమే సరిగ్గా సరిపోతున్నది. ఎందుకని? 2/8 ఇరుసులోని నీచ రాహు కేతువులు వివాహ జీవితాన్ని పాడుచేశాయి. 5 లో ఉన్న కుజ చంద్రులు మొండి మనస్తత్వాన్నిచ్చాయి. 6 లోని గురువు గురువుతో శతృత్వాన్నిచ్చాడు. కనుక నవాంశను బట్టి ఈమె జనన సమయం 20.22 నుండి 20.28 మధ్యలో ఉంటుంది.

త్రింశాంశను గమనిద్దాం. 20.22 నుండి 20.28 వరకూ ఇక్కడ మీనలగ్నమే ఉదయిస్తూ బలమైన గురుచండాలయోగాన్ని కలిగి ఉంటున్నది. నవమంలో నీచ చంద్రుడు మళ్ళీ నీచ గురువును చూపిస్తున్నాడు. 8 లో ఉచ్చశని వల్ల లోకాపవాదం వచ్చింది. విలన్ గా ముద్ర వేయబడింది. అయితే, మిగతా విషయాల కోసం ఇంకా లోతులకు వెళ్ళాలి.

షష్ట్యంశ లోకి వెళదాం. 20.22 మరియు 20.23 రెండూ మకర లగ్నమే అవుతున్నది. నీచ శుక్రుడు నవమంలో ఉంటూ ఒక సెక్స్ గురువును చూపిస్తున్నాడు. శుక్ర క్షేత్రమైన పంచమంలో ఉన్న రాహువు బుధుడు ఒకటి కంటే ఎక్కువ ప్రేమ వ్యవహారాలను, పెళ్ళిళ్ళను చూపిస్తున్నారు. శుభ పాపార్గళం పట్టిన లగ్నం ఎటూ తేలని జీవితాన్ని చూపిస్తోంది.

అష్టోత్తరాంశను చూద్దాం. ఇందులో 20.22 అనేది వృషభ లగ్నాన్ని ఇస్తున్నది. నవమలో నీచ గురువున్నాడు. సరిగా సరిపోయింది. 3 లో కుజ చంద్రులు దురుసు మాటను, 4 లో రవి రాహువులు సుఖం లేని జీవితాన్ని, 5 లో శని బుధులు తెలివైన బాధక గురువును ఇచ్చారు. 

ఈ సమయానికి జననకాల దశగా బుధ శని శని దశ నడుస్తున్నది. ఈ దశ ఈమె యొక్క మూడు పెళ్ళిళ్ళను, ప్రేమ వ్యవహారాలను, ఈమెకున్న శాపాలను, వేదనలను, గురువువల్ల పడే బాధలను చూపిస్తున్నది.


ఇప్పటి వరకూ మనం చేసిన విశ్లేషణను బట్టి మనకు నాలుగు సమయాలు వచ్చాయి. వీటిని మనం చిత్రిక పట్టాలి. అవి :

1. 4.41 AM

2. 13.19 PM

3. 15.47 PM

4. 20.22 PM

షీలా జీవితంలో జరిగిన సంఘనలతో ఈ సమయాలను పోల్చి చూచి వీటిలో ఏది సరియైనదో నిర్ణయించాలి. వాటిలో ఓషో మరణం ముఖ్యమైన సంఘటన. ఓషో 1990 జనవరి 19వ తేదీన అనుమానాస్చపద పరిస్థితులలో పూనాలో చనిపోయాడు.

జనన సమయ పరీక్ష

4.41 గంటల జాతకం వృశ్చిక లగ్నం - మీనరాశి

ఆ రోజున రవి- చంద్ర - బుధదశ నడిచింది. సూర్యుడికి గురువుకి సంబంధం లేదు. నీచచంద్రుడు నవమాధి పతిగా ఉంటూ నీచ గురువును సూచిస్తున్నాడు. బుధుడు నవమానికి పన్నెండులో ఉంటూ గురువు చావును సరిగానే చూపిస్తున్నాడు.

13.19 గంటల జాతకం మీనలగ్నం మీనరాశి 

ఓషో చనిపోయిన రోజున ఈ జాతకానికి చంద్ర - చంద్ర - చంద్రదశ నడిచింది. నవమాదిపతి అయిన కుజినిచేత చూడబటటం తప్ప చంద్రునికి గురువు మరణంతో సూటి సంబంధం లేదు. కనుక ఈ సమయం సరిపోదు.

15.47 గంటల జాతకం వృషభలగ్నం మీనరాశి

ఆ రోజున చంద్ర - రాహు - రాహుదశ నడిచింది. నవమమైన మకరం నుండి చంద్రుడు రాహువు తృతీయంలో ఉంటూ ఆయుస్శును పాడుచేస్తున్నారు. చంద్రురుడు మారకుడు. నవమాదిపతి అయిన శని నుండి చంద్రుడు రాహువు ఇద్ద్దరూ 8 ఇంటిలో ఉంటూ గురువు చావును సూచిస్తున్నారు. కనుక ఈ సమయం కరెక్ట్ గా సరిపోతున్నది. 

20.22 గంటల జాతకం కటకలగ్నం మీనరాశి

ఆ రోజున చంద్ర - శని - శనిదశ నడిచింది. ఇది మానసిక వేదనను ఇస్తుంది. శని 8 వ అధిపతి అవుతూ 9 కి 12 గా గురువు చావును సూచిస్తున్నాడు. చంద్రుడు ఆయుస్సును  సూచించే మూడవ ఇంటిలో ఉన్నాడు. శని నాశనాన్నిచ్చే 8 వ ఇంటిలో ఉన్నాడు. చంద్రుడు శని ఇద్దరూ షష్టాష్టకంలో ఉన్నారు.

1965/66 లో ఉన్నత చదువుల కోసం షీలా అమెరికాకు వెళ్ళింది.

20.22 - శుక్ర - చంద్రదశ నడిచింది. శుక్రుడు 4 అవ అధిపతిగా విద్యనిస్తాడు. చంద్రుడు లగ్నాదిపతిగా 9 లో ఉంటూ విదేశ గమనాన్నిచ్చాడు.

15.47 - శుక్ర శుక్ర దశ. లగ్నాధిపతి అయిన శుక్రుడు 9 లో ఉంటూ విదేశీయాత్రనిచ్చాడు.

1981 లో ఓషోకి సెక్రటరీ అయింది. అమెరికాకు వెళ్లారు.

15.47 - శుక్ర - కేతుదశ. కేతువు ఉచ్చబుధునికి కారకుడు. తెలివైన కుట్రను చూపిస్తున్నాడు. భూకారకుడైన కుజునితో ఉంటూ అమెరికాలో భూమి కొనుగోలును చూపుతూన్నాడు. 

20.22 - రవి - రాహు దశ. ఈ సంఘటనను చూపడం లేదు.

1984 నుంచి 85 - ఆరిగాన్ లో గొడవలు - కుట్రలు

20.22 - రవి దశలో బుధ, కేతు శుక్ర దశలు. రవి 6 లో ఉండటం వల్ల గొడవలు ఉంటాయి. కానీ నేరాలు ఘోరాల సూచన లేదు. 

15.47 - రవి దశలో గురు, శని అంతర్దశలు. రవి 8 లో రహస్య కుట్రలిస్తాడు. 9 లో ఉన్న గురువు గురువును సూచిస్తాడు. శని 9 అధిపతిగా బాధకుడు. గురువు చేతిలో కీలుబొమ్మగా మారి నానా నేరాలు చెయ్యడం సూచన ఉన్నది. కనుక  15.47 బాగా సరిపోతున్నది. 

13 Sept 1985 న ఈమె ఓషోని వదిలేసి యూరప్ కి పారిపోయింది.

15.47 chart - రవి - శని - శుక్రదశ నడిచింది. రవి 8 లో ఉంటూ గురువును వదిలెయ్యడం చూపుతున్నాడు. 9 వ అధిపతి అయిన శని బాధకుడు, గురువు వల్ల బాధలను సూచిస్తున్నాడు. లగ్నాధిపతి 9 లో ఉంటూ విదేశాలకు పోవడాన్నిస్తున్నాడు. ఈ సమయం మళ్ళీ సరిపోతున్నది.

పై విశ్లేషణను బట్టి, 28.12.1949 న 15.47 అనేది ఆమె ఖచితమైన జనన సమయంగా నేను భావిస్తున్నాను. 

ఈ సమయానికి ఉన్న వృషభ లగ్న జాతకం ఈమె జీవితంలో అన్ని సంఘటనలను సరిగ్గా చూపిస్తున్నది. మచ్చుకి ఈ క్రింది విషయాలు గమనించండి.

  • 11 వ భావం నుండి ఈమె అయిదుమంది అన్నలు అక్కలు సరిపోతున్నారు.
  • 9 లో ఉన్న నీచ గురువు ఈమె తండ్రిని సూచిస్తున్నాడు. ఆయనొక మహానుభావుడు. 16 ఏళ్ళ వయసులో కూతురిని అమెరికాకు పంపిస్తూ - 'నీకు మొదట తారసపడిన స్నేహితుడిని తొందరపడి పెళ్లి చేసుకోకు. కొంతమందితో సెక్స్ ఎంజాయ్ చేయి. ఆ తరువాత వారిలో నీకు బాగా నచ్చిన ఎవడో ఒకడిని ఎంచుకో' - అన్న జ్ఞానబోధ చేసిన మహా గొప్ప తండ్రి.
  • 9 లోని నీచ గురువు, ఈమె గురువైన ఓషోని కూడా సూచిస్తాడు. ఈమె చేత అడ్డమైన పనులన్నీ చేయించిన ఓషో, చివరకి తను తెలివిగా తప్పుకున్నాడు. ఈమెను జైలు పాలు చేశాడు.
  • 4 లో శని శత్రుస్థాన స్థితి వల్ల సంసార సౌఖ్యం ఉండదు. సుఖం ఉండదు. శాంతీ ఉండదు.
  • 5 లో కుజ కేతువుల వల్ల మహా మొండి మనస్తత్త్వం, చావు తెలివీ ఉంటాయి.
  • లగ్నాధిపతి శుక్రుడు 9 లో మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల జీవితమంతా విదేశాలలో నివాసం ఉంటుంది.
  • ఈ జాతకం ఈమె యొక్క గట్టి మనస్సుని కూడా కరెక్ట్ గా చూపిస్తున్నది. నా ఉద్దేశ్యంలో, ఇంకొక ఆడపిల్ల అయితే ఇన్ని కష్టాలను, అది కూడా విదేశాలలో ఉంటూ, ఒంటరిగా తట్టుకునేదే కాదు. వృషభలగ్న జాతకులు అలాంటి వారే. ఎన్ని కష్టాలనైనా తట్టుకుని ధైర్యంగా నిలబడతారు.

ఓషోని వదిలేసి షీలా చాలా మంచిపని చేసిందని నా ఉద్దేశం. ఈమె జీవితాన్ని ఓషో పూర్తిగా భ్రష్టు పట్టించాడు. ఒకవేళ ఇంకా ఇంకా ఓషోతోనే ఉండి ఉన్నట్లయితే ఈమె జీవితం ఇంకా సర్వనాశనం అయిపోయి ఉండేది.

ఓషో ఈమెను నానా బూతులు తిట్టినా ఈమె తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అక్కడే ఈమె ఔన్నత్యము, ఓషోపట్ల ఈమెకున్న గౌరవము బయటపడుతున్నాయి. మొదట లక్ష్మిని, తర్వాత షీలాను, ఆ తర్వాత హాస్యను తన స్వార్ధానికి  వాడుకోబట్టే చివరకు ఓషో హత్య చేయబడ్డాడు. అంతేకాదు, ఆయన ప్రేమికురాలు సేవకురాలు అయిన వివేక్ కూడా చంపబడింది. అవన్నీ ఇంకోసారి చూద్దాం.

ప్రస్తుతం ఈమెకు రాహు దశ జరుగుతున్నది. లాభస్థానంలో ఉన్న రాహువు, గోచారంలో లాభంలో ఉన్న శని ఈమెను మళ్ళీ భారతదేశానికి తెచ్చారు. ఈమె జీవితం మీద సినిమాలు తీయిస్తున్నారు. ఇప్కపుడామెకు 70 ఏళ్ళు వచ్చాయి. కనీసం ఇప్పుడైనా ఈమె జీవితంలో సంతోషం నిండాలని కోరుకుందాం ! 

read more " Ma Anand Sheela - జాతక పరిశీలన - 2 "

2, సెప్టెంబర్ 2020, బుధవారం

Ma Anand Sheela - జాతక పరిశీలన - 1

పోయిన వారాంతంలో 'Netflix' లో 'Wild Wild Country' docu-series మళ్ళీ ఇంకోసారి చూశాను. 2019 లో  దీనిని మొదటిసారి  చూసినప్పటికీ, అప్పట్లో  రకరకాల పనులలో తలమునకలుగా ఉంటూ పైపైన మాత్రమే చూడగలిగాను. ఇప్పుడు కాస్త తీరిక చిక్కింది. అందుకని మొత్తం ఆరు భాగాలూ చూశాను. Way brothers ఈ సీరీస్ ని చాలా ఆసక్తికరంగా తీశారనే చెప్పాలి. అయితే వాళ్ళు, ఇంకా చాలా కోణాలని అందులో చూపించలేదు. ఎందుకో తెలియదు. దానిమీద ఇంకోసారి చాలా తీరికగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మాత్రం షీలా జాతకం వరకూ చూద్దాం. ఎందుకంటే, ఓషో సంస్థ పతనానికి ఆమె కూడా ముఖ్యకారకురాలు కాబట్టి.

ఓషో ప్రభావం ఇండియానుంచి అమెరికాకు విపరీతంగా వ్యాపించడానికి ముఖ్య కారకురాలు మా  ఆనంద్ షీలా లేదా షీలా అనే గుజరాతీ మహిళ.  ఆయన్ను అమెరికా తీసుకెళ్లింది, అక్కడ ఆరిగన్ రాష్ట్రంలో  రజనీష్ పురం పెట్టడానికి, పెరగడానికి, కూలిపోవడానికి, అక్కడ జరిగిన నేరాలకు, ఘోరాలకు, చివరికి అందరూ జైలు పాలవ్వడానికి, వీటన్నిటికీ కారకురాలిగా లోకం ముందు దోషిగా నిలబడిన వ్యక్తి షీలా. ఈమె జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

వికీపీడియా ప్రకారం ఈమె 28-12-1949 తేదీన గుజరాత్ లోని బరోడాలో పుట్టింది. దీనినిప్పుడు వడోదర అంటున్నారు. జనన సమయం తెలియదు. అయినా సరే, మనకేమీ ఇబ్బంది లేదు గనుక, జాతకాన్ని పరిశీలిద్దాం. ఈమె జాతకాన్ని పైన చూడవచ్చు.

ఈమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు షీలా అంబాలాల్ పటేల్. కొన్నికొన్ని కులాలకు కొన్ని గుణాలు ఖచ్చితంగా ఉంటాయన్న విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. కులాన్ని మనం ఎంత కాదన్నా, దీనిని కాదనలేం. పటేల్ వర్గానికి చెందినవారు మంచి వ్యవహారవేత్తలు. బిజినెస్ లు చెయ్యడంలో గాని, సంస్థలు నడపడంలో గాని, వ్యవహారాలు చక్కబెట్టడంలో గాని వీళ్ళు సిద్ధహస్తులు. అమెరికాలో ఉన్న గుజరాతీలలో వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీలలో ఉన్నారు. న్యూజెర్సీ లోని జెర్సీ సిటీ లో ఉన్న ఇండియా స్క్వేర్ లేదా లిటిల్ గుజరాత్ అంతా వీళ్ళ మయమే. అమెరికాలో ఉన్న ప్రతి 10 మంది భారతీయులలో ఒకరు తప్పకుండా పటేల్ అవుతారు. వీళ్ళు అంత వ్యాపారవేత్తలు. ఈమె కూడా పటేల్ కుటుంబంలోనే పుట్టింది. అందుకే అలాంటి వక్రమైన తెలివితేటలున్నాయి.

ఎంతగా కాదనుకున్నప్పటికీ, భారతీయ ఆధ్యాత్మికచింతనా మార్గంలో ఓషో పాత్రను పూర్తిగా కాదనలేం. ఆయన సంస్థలో ఎన్ని ఘోరాలు, నేరాలు జరిగినా, ఆయన పుస్తకాలను, ఆయన ఆలోచనాధోరణిని మాత్రం కాదనడం కష్టం. మాటలవరకూ ఆయన చాలా గొప్పదైన, ఆచరణాత్మకమైన ఫిలాసఫీని చెప్పాడు. చేతల్లో ఎంతవరకూ ఆచరించాడనేది తరువాతి సంగతి. అందులో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడనేది వాస్తవం. అందరినీ విమర్శించి చివరకు తానే నవ్వులపాలయ్యాడు. ఏదేమైనప్పటికీ, ఇండియా, అమెరికాలు రెండూ ఓషోని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేవు. ఓషో తరువాత వచ్చిన గురువులందరూ కొద్దో గొప్పో ఆయన ఫిలాసఫీని చెబుతున్నవాళ్ళే.

షీలాది రేవతీనక్షత్రం రెండోపాదం. శుక్లనవమి బుధవారం నాడు పరిఘా యోగంలోఈమె పుట్టింది. నాదికూడా రేవతీనక్షత్రం రెండోపాదమే. అందుకేనేమో, లోకమంతా షీలాని ఎంత తిట్టినా, నాకెందుకో ఆమెను చూస్తే 'అయ్యో పాపం' అనిపిస్తుంది. ఓరెగాన్ లో జరిగిన నేరాలన్నీ ఓషో, షీలాలు కలిసే చేశారు. అయితే, ఓషో మాత్రం బయటపడకుండా తెరవెనుక కూచుని, అన్నీ షీలా చేత చేయించేవాడు. చివరికి తాను అమాయకుడిలా నటించి, ఆమెని బలిపశువును చేశాడు. ఇది ఓషో చేసిన అతి పెద్ద తప్పు. చేసేదంతా చేయించి, చివరకు ఒక ఆడపిల్లను బలిచెయ్యడం చాలా ఘోరమైన పాపం. ఇదొక గురువు లక్షణం కానేకాదు.

ఓషో  చెప్పిన ఉపన్యాసాలు, ఆయన మాట్లాడిన విషయాలు, తనను  గురించి తాను చెప్పుకున్న మాటలు, చేయించుకున్న ప్రచారాలు చూస్తే, ఆయన స్థాయి బుద్ధునికంటే ఎక్కువగా తోస్తుంది. మరి అంత శక్తి ఉన్నవాడు షీలా ఎలాంటిదో గ్రహించలేక పోయాడా? మొదట్లోనేమో 'నువ్వు నాతొ ప్రేమలో ఉన్నావు. నేను నీతో ప్రేమలో ఉన్నాను' అన్నాడు. చివర్లోనేమో 'అదొక బజారుముండ. నేను తనతో పడుకోలేదని తనకి కుళ్ళు' అన్నాడు. అంత ఛండాలంగా ఒక ఓపెన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఒక గురువుని నేనిప్పటివరకూ చూడలేదు.

క్లుప్తంగా చెప్పాలంటే, Zorba the Buddha అనేది ఆయన విధానం. అంటే అత్యంత భోగాలు అనుభవిస్తూ కూడా, ఒక బుద్ధుడున్న స్థితిలో ఉండే వ్యక్తి అనర్ధం. ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఎవడూ దీనిని చెయ్యలేడు. ఓషో కూడా  ఊరకే మాటలు చెప్పాడు గాని, ఆచరణలో ఘోరంగా విఫలమయ్యాడు. ఆ క్రమంలో మాయమాటలు చెప్పి ఎన్నో జీవితాలను నాశనం చేశాడు.

జీవితాలను బాగు చేసేవాడు, మనుషులను జ్ఞానమార్గంలో నడిపించి మోక్షానికి దారి చూపేవాడు 'గురువు' అన్న పదానికి అర్హుడౌతాడు గాని, జీవితాలు నాశనం చేసి, చివరికి 'నాకేం తెలీదు' అని తప్పించుకునేవాడు కాలేడు. అదే విధంగా - 'చేసేపని ఎలాగున్నా పరవాలేదు, చేరే గమ్యం ప్రధానం' అని చెప్పేవాడు అసలు గురువే కాడు. చేసే పనిని బట్టి, నడిచే నడకను బట్టి గమ్యం ఉంటుంది గాని దానికి భిన్నంగా ఉండదు. ఒళ్ళంతా బురద పూసుకుని పెంటలో నడుస్తూ, 'చివరికి నేను స్వర్గాన్ని చేరతాను' అనుకుంటే అది జరిగే పని కాదు.

1970 ప్రాంతాలలో పూనాలోని ఓషో ఆశ్రమంలో 'థెరపీ' లనబడే గ్రూప్ మెడిటెషన్లు జరిగేవి. విదేశీయులకు కూడా అవి చాలా ఖరీదైన ప్రోగ్రాములు. వాటిలో భారతీయులకు ప్రవేశం లేదు. అవి చాలా రహస్యంగా జరిగేవి. వాటిలో హింస, కొట్టుకోవడం, గ్రూప్ సెక్స్ మొదలైన చండాలమంతా ఉండేది. వాటిల్లో పాల్గొనేవాళ్ళలో చాలామందికి కాళ్ళు చేతులు విరిగిన సంఘటనలు, ముఖాలు వాచిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ అవి ఎంతో మానసిక ఊరటని, విశ్రాంతిని, రిలీఫ్ ని ఇచ్చేవి. వాటికోసం విదేశీయులు బారులు తీరేవాళ్ళు. కానీ వాళ్ళు తెచ్చుకున్న డబ్బులు త్వరలోనే అయిపోయేవి. ఏం చెయ్యాలో తెలీక, కొంతమంది తెల్ల అమ్మాయిలు పూనాలో వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించి మరీ ఆ ప్రోగ్రాములలో పాల్గొనేవాళ్లు. తెల్లబ్బాయిలు డ్రగ్స్ అమ్మేవాళ్ళు. ఓషో ఈ రెంటినీ తప్పని చెప్పేవాడు కాదు. వారిని ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించమనేవాడు.  అవి కట్టి ప్రోగ్రాములు చెయ్యమనేవాడు. పైగా, ఎవరిదగ్గరైనా పడుకున్నప్పుడు కూడా ధ్యానం ఎలా చేయవచ్చో ఉపన్యాసాలిచ్చేవాడు. అంటే,  శిష్యులు ఏమై పోయినా తనకు మాత్రం డబ్బే ప్రధానమని చెప్పకనే చెప్పేవాడు. ఈ కోణంలో ఓషో రక్తంలోని  ఒక నీచమైన జైన్ వ్యాపారస్తుడు బయటపడతాడు. ఓషో జైన్ మతస్తుల ఇంట్లో పుట్టాడు.

ధ్యానం కోసం పూనా వీధుల్లో ఒళ్ళమ్ముకోడానికి సిద్ధపడిన ఆ అమ్మాయిలను తలచుకుంటే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత శుద్ధమైన, ఎంత అమాయకమైన మనసులో వాళ్ళవి ! ఏం? అలాంటి వాళ్ళకోసం ధ్యానాన్ని ఉచితంగా నేర్పలేకపోయాడా ఇన్ని నీతులు చెప్పిన ఓషో? నీ బోడి ధ్యానాన్ని చెయ్యడానికి ఒకమ్మాయి ఒళ్ళమ్ముకోవాలా? దరిద్రుడా ! నువ్వొక గురువా అసలు? నీ కుటుంబసభ్యులలో ఎవరైనా ఆ పని చేస్తే నీకెలా ఉంటుంది? అప్పుడు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తావా? ఎందుకు నీ పుస్తకాలు? వాటిల్లో నీతులు? పనికిమాలిన చెత్త !'

ఇవన్నీ చూచాడు గనుకనే యూజీ - 'ఓషో ఒక అమ్మాయిల బ్రోకర్' అన్నాడు.

ఆ అమ్మాయిలు గనుక ఇప్పుడు చనిపోయి ఉంటే, ఖచ్చితంగా స్వర్గంలో ఉంటారు. ఓషో ఖచ్చితంగా నరకంలో ఉంటాడు. ఇది నిజం ! 

'ప్రజల పాపాలకు రాజుకు శిక్ష పడుతుంది, శిష్యుల పాపాలకు గురువుకు శిక్ష పడుతుంది' - అంటారు. శిష్యులు తప్పు దారిలో పోతుంటే సరిదిద్దాల్సింది పోయి, వాళ్ళచేత  నానా ఛండాలపు పనులు చేయించి, చివరలో వాళ్ళ ఖర్మకు వాళ్లను వదిలేసి తాను విమానమెక్కి పారిపోవడం ఒక్క ఓషోకే చెల్లింది. షీలా కూడా అదే చేసింది. ఇద్దరూ కలిసి  వాళ్ళను అమాయకంగా నమ్మిన అందర్నీ ముంచారు. ఇదా గురుత్వమంటే ?

ఈమె జాతకంలో చూడగానే కనిపించే అంశం గురువు నీచత్వం. ఎవరి జాతకంలో నైతే గురువు నీచలో ఉంటాడో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడం ఈ  జన్మలో సాధ్యం కానే కాదు,  మిగతా గట్టి యోగాలు ఉండి, అవి సాయపడితే తప్ప. సాధారణంగా ఇలాంటి జాతకులకు  ఒక నీచమైన గురువు లభిస్తాడు. లేదా, ఆ గురువు వల్ల వీళ్లకు భ్రష్టత్వం పడుతుంది. లేదా వీళ్ళే గురువును వెన్నుపోటు పొడుస్తారు. లేదా వీళ్ళే ఒక దొంగ గురువుగా అవతారం ఎత్తుతారు. ఎలా చూచినప్పటికీ, ఇది ఒక సూటియైన గురుదోషమే. ఈ కారణం చేతనే ఈ జాతకులు ఎంత గింజుకున్నా ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించలేరు. అలా జరగడానికి వాళ్ళ పూర్వకర్మమే  కారణం అవుతుంది. పూర్వజన్మలో వీళ్ళు గురుద్రోహులై ఉంటారు. కనుక ఈ జన్మ ఇలా పోవలసిందే. లేదా, ఒక నిజమైన గురువు దొరికితే ఆయన సేవలో తరించాల్సిందే. ఈ గురుశాపం వల్ల వీళ్లకు ఇతర రెమెడీలు కూడా పనిచేయవు.

ఈమె జాతకం చాలా విచిత్రమైనది. ఈమె జాతకంలోని గ్రహస్థితులను గమనిద్దాం.

ధనుస్సులో రవి 

ఇది చాలా ఆశపోతు మనస్తత్వాన్ని, దురహంకారపు తత్త్వాన్ని ఇస్తుంది. ధనుస్సు సహజధర్మ స్థానం కనుక మతపరంగా ఎదగడం, ధార్మిక సంస్థలలో ఉన్నత పదవులు నిర్వహించడం జరుగుతుంది.

మీనంలో రాహు చంద్రులు 

రాహుచంద్రులు కలిస్తే అది ఒక మాఫియా లీడర్ మనస్తత్వాన్నిస్తుంది. కానీ ఇక్కడ రాహువు గురుక్షేత్రంలో ఉంటూ గురువును సూచిస్తున్నాడు. ఇదొక గురుచండాల యోగం. అంటే, ఛండాలపు గురువు లభిస్తాడని అర్ధం. అంతేగాక, సంప్రదాయ విరుద్ధమైన పనులు, నేరాలు చేసే యోగం ఉందని అర్ధం. హింసాత్మక కార్యక్రమాలకు, అనైతికమైన పనులకు, నేరపూరితమైన చర్యలకు ఈ యోగం ప్రేరకమౌతుంది. మీనం ఆధ్యాత్మిక రాశి గనుక, ఈ పనులన్నీ ఒక ఆధ్యాత్మిక సంస్థ ముసుగులో జరుగుతాయని తెలుస్తున్నది.

కన్యలో కుజ కేతువులు

ఇదొక భయంకరమైన అహంకార యోగం. ఇక్కడ కేతువు ఉచ్చబుదుడిని సూచిస్తున్నాడు. కనుక విపరీతమైన తెలివినీ, అదే సమయంలో మహామొండిదైన అధికారపూరిత మనస్తత్వాన్నీ తనమాటే సాగాలన్న పంతపు ధోరణినీ ఈ యోగం సూచిస్తుంది. దీనినే 'చావు తెలివి' అని మనం అంటూ ఉంటాం.

సింహంలో శని

దొడ్డిదారిన అధికారంలోకి రావడం, కొంతకాలం చక్రం తిప్పడం, తరువాత ఒక తోకచుక్కలాగా రాలిపోవదాన్ని ఈ యోగం సూచిస్తుంది. ఈ క్రమంలో చాలా చెడ్డ పేరును కూడా సంపాదించడం జరుగుతుంది. 

మకరంలో బుధ గురు శుక్రులు

తను అనుకున్నది సాధించడానికి ఏ పనిని చేసినా పరవాలేదనే ఆలోచనా, దానికి అవసరమైన ప్లానింగూ, అనుచరులూ, చివరకు అంతా సర్వనాశనం కావడం ఈ యోగం వల్ల జరుగుతుంది. లోకంలో గొప్ప పేరును ఈ యోగం ఇస్తుంది. కానీ ఆ పేరుతో బాటు దారుణమైన చెడ్డపేరు కూడా వస్తుంది.  బుద్ధి కారకుడైన బుధునితో నీచగురువు ఉండటం, ఒక నీచగురువు ఈమె బుద్ధిని పాడు చేస్తాడని సూచిస్తోంది. అక్కడే శుక్రుడుండటం ఈమెకు చాలామందితో ఉన్న సంబంధాలను, అది కూడా ఆ గురువు సంస్థలో ఉన్నవాళ్ళతో, సూచిస్తోంది. 

ఇవన్నీ షీలా జీవితంలో జరిగినట్లు మనం స్పష్టంగా గమనించవచ్చు.

(ఇంకా ఉంది)

read more " Ma Anand Sheela - జాతక పరిశీలన - 1 "

31, ఆగస్టు 2020, సోమవారం

'యోగ యాజ్ఞవల్క్యము' E Book నేడు విడుదలైంది




మా 'పంచవటి పబ్లికేషన్స్' నుంచి 'యోగ యాజ్ఞవల్క్యము' అనబడే ఇంకొక మహత్తరమైన యోగశాస్త్రగ్రంధమును ప్రచురిస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మొత్తం 504 శ్లోకములలో ప్రాచీన యోగశాస్త్రమును వివరించిన ఈ గ్రంథం దాదాపుగా రెండువేల సంవత్సరముల క్రిందటిది. ప్రాచీనమైన ఈ గ్రంథంలో వైదిక సాంప్రదాయానుసారమైన యోగమార్గం వివరింపబడి గోచరిస్తున్నది. వేదకాలపు మహర్షియైన యాజ్ఞవల్క్యఋషి తన సతీమణియైన బ్రహ్మవాదిని గార్గికి చేసిన బోధగా ఈ గ్రంథం చెప్పబడింది.

యాజ్ఞవల్క్యఋషి మహాతపస్సంపన్నుడు, ద్రష్ట, శాపానుగ్రహ సమర్థత కలిగిన అతిప్రాచీన వైదికఋషులలో ఒకరు. ఈయన బుద్ధునికంటే దాదాపు 400 సంవత్సరములు ముందటివాడని భావిస్తున్నారు. శుక్లయజుర్వేదము, శతపథబ్రాహ్మణము, బృహదారణ్యకోపనిషత్తు వంటి అనేక చోట్ల ఈయన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఉపనిషత్తులలో చెప్పబడిన అద్వైతభావనను అతిప్రాచీనకాలంలో ఈయనే మొదటిసారిగా లోకానికి బోధించినట్లు భావిస్తున్నారు. వైదికసంప్రదాయములను, యోగమార్గముతో మేళవించే ప్రయత్నాన్ని మొదటగా ఈయన చేశారు. ఈయనకు గార్గీ వాచక్నవి, మైత్రేయి అనే ఇద్దరు భార్యలున్నారు. వీరిద్దరూ కూడా మహాసాధ్వులు. భర్తవలెనే తపస్సంపన్నులు. అంత ప్రాచీనకాలంలో కూడా బ్రహ్మవాదినులైన స్త్రీలు శాస్త్రాధ్యయనము మరియు తపస్సులను చేసేవారని, పండితసభలలో, ఋషిసభలలో కూర్చుని గహనములైన వేదాంతసిద్ధాంతములను ఋషులతో తర్కబద్ధంగా వాదించేవారని మనకు వీరి చరిత్రల వల్ల తెలుస్తున్నది.

ఈ గ్రంథం పన్నెండు అధ్యాయములతో నిండి ఉన్నది. వీనిలో, వైదికధర్మమార్గము, దాని విధులతోబాటు, వర్ణాశ్రమధర్మములు, అష్టాంగయోగము మరియు దాని విభాగములైన, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు, తంత్రసాధనయైన కుండలినీయోగము మొదలైనవి ఒక్కొక్కటి సవివరముగా చెప్పబడినాయి. ఆధ్యాత్మికమార్గంలో జ్ఞాన, కర్మ, యోగముల ప్రాముఖ్యతను వివరించిన యాజ్ఞవల్క్యులు, విధిపూర్వకంగా చేయవలసిన వైదికనిత్యకర్మలను చేస్తూనే, అష్టాంగయోగమును కూడా ఆచరించాలని బోధిస్తారు.


ఈ ప్రాచీనగ్రంథములోని భావములను, విధానములను, తరువాతి కాలమునకు చెందిన యోగోపనిషత్తులు, హఠయోగప్రదీపిక, ఘేరండసంహిత మొదలైన ఇతరగ్రంథములు స్వీకరించాయి. గాయత్రీమహామంత్రముతోను, ఓంకారము తోను చేయబడే వైదికప్రాణాయామము, అశ్వినీదేవతలు చెప్పిన మర్మస్థాన ప్రత్యాహారము, అగస్త్యమహర్షి ప్రణీతమైన ప్రత్యాహారము, సగుణ నిర్గుణ ధ్యానములు ఈ గ్రంథముయొక్క ప్రత్యేకతలు.


వైదికధర్మమార్గమును, అష్టాంగయోగమును, తంత్రమును సమన్వయం చేయాలన్న ప్రయత్నం ఈ గ్రంథం లో మనకు గోచరిస్తుంది. యోగాభిమానులకు ఈ ప్రాచీనగ్రంథం ఎంతో ఉత్తేజాన్ని కలిగించి, వారిని దైవమార్గంలో ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నాను.


యధావిధిగా ఈ గ్రంధం కూడా google play books నుంచి లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

read more " 'యోగ యాజ్ఞవల్క్యము' E Book నేడు విడుదలైంది "

29, ఆగస్టు 2020, శనివారం

సిద్ధసిద్ధాంత పద్ధతి ప్రింట్ పుస్తకం విడుదలైంది


వరుసగా ప్రింట్ అవుతున్న నా పుస్తకాల పరంపరలో భాగంగా ఈరోజున  గోరక్షనాథులు రచించిన 'సిద్ధసిద్ధాంత పద్ధతి' ప్రింట్ పుస్తకాన్ని, హైదరాబాద్ లోని మా ఇంటినుంచి నిరాడంబరంగా విడుదల చేశాము.

ఈ పుస్తకం కూడా యధావిధిగా google play books నుంచి లభిస్తుంది.

read more " సిద్ధసిద్ధాంత పద్ధతి ప్రింట్ పుస్తకం విడుదలైంది "

24, ఆగస్టు 2020, సోమవారం

U.G - 8 ( వెదుకులాట - రమణమహర్షి సందర్శనం )

ప్రతిమనిషి జాతకంలోనూ దానికే ప్రత్యేకమైన కొన్ని గ్రహయోగాలుంటాయి. అవి ఆ మనిషియొక్క పూర్వకర్మను, ఈ జన్మలో అతనిదైన ప్రత్యేక జీవనమార్గాన్ని సూచిస్తూ ఉంటాయి. అలాగే  యూజీగారి జాతకంలో కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి కుటుంబస్థానంలో శని, బుధ, చంద్రుల కలయిక.

ఇది తీవ్రమైన ఆధ్యాత్మికయోగాలలో ఒకటి. ఈ యోగం చాలా లోతైన అంతర్ముఖత్వాన్నిస్తుంది. అదీగాక యూజీగారికి సరియైన సమయంలో సరియైన దశలు నడిచాయి. ఆధ్యాత్మిక దశలన్నవి మనిషి జీవితంలో చిన్నప్పుడే రావాలి. అవి ముసలితనంలో వస్తే ఉపయోగం ఉండదు. అప్పటికి అంతా అయిపోయి ఉంటుంది. కనుక అవి ఆ మనిషిపైన బలమైన ప్రభావాన్ని చూపలేవు. విజయవంతమైన ఏ జాతకంలోనైనా, గ్రహానుకూలత, దశానుకూలతలు తప్పకుండా ఉండాలి. అప్పుడే, అవి సూచించేది ఏ రంగమైనా, ఆ జాతకుడు వాటిలో విజయాలను సాధిస్తాడు. ఈ రెండూ లేకపోతే ఆ జీవితం వృధా అవుతుంది. మహనీయులందరికీ, ఆధ్యాత్మికదశలు చిన్ననాడే మొదలైనట్లు మనం వారివారి జీవితాలలో గమనించవచ్చు.

గురుదశ చివరలో పుట్టిన యూజీగారికి చిన్నప్పుడే 19 ఏళ్ల శనిమహర్దశ మొదలైంది. ఇది అంతర్ముఖత్వాన్నిచ్ఛే దశ. దానిననుసరించి 17 ఏళ్ల బుధ మహర్దశ జరిగింది. దాని తరువాత 7 ఏళ్ల కేతుదశ జరిగింది. ఈ విధంగా చిన్నతనం నుంచీ, మొత్తం 43 ఏళ్ల పాటు ఏకధాటిగా ఆయన జీవితంలో ఆధ్యాత్మిక సాధనను,  చింతనను, సిద్ధిని కలిగించే దశలు నడిచాయి. వీటి ఫలితంగా ఆయన 49 వ ఏట ఆయనకు సిద్ధి కలిగింది. దానినాయన 'కెలామిటీ (విపత్తు) అని పిలిచారు. సిద్ధి అనేటటువంటి ఆధ్యాత్మికపరమైన పదాన్ని ఆయన వాడలేదు.

యూజీగారిలో కనిపించే ఒక అద్భుతమైన అంశం ఏమంటే, ఎక్కడా ఆధ్యాత్మికపరమైన వేషంగాని, శ్లోకాలు, గ్రంధాలనుంచి ఉదహరించడం వంటి చేష్టలుగాని లేకుండా, ఒక జ్ఞాని లేదా అవధూతయొక్క సహజస్థితిగా మన గ్రంధాలలో చెప్పబడిన స్థితిలో ఆయన సూటిగా ప్రతిక్షణమూ  జీవించారు. ఆయన మాటలను పైపైన వినడం వల్ల, లేదా ఆయన వేషాన్ని చూడటంవల్ల, లోకులు ఆయనను సరిగ్గా అర్ధం చేసుకోవడం కంటే, మోసపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. అందుకే లోకం ఆయన్ను సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయింది. ఒక గొప్ప జ్ఞానిని లోకం  పోగొట్టుకుంది.

అయితే, నిజంగా చూస్తే, ఆయనవల్ల మనకేమీ ఉపయోగం లేదు. ఒక జ్ఞాని వల్ల లోకానికి ఏమీ ఉపయోగం ఉండదు. తన దివ్యశక్తిని ఉపయోగించి  ఏ జ్ఞానీ లోకానికి ఎటువంటి మేలునూ చెయ్యడు. మనం 'మేలు' అనుకునేది ఆయనకొక పెద్ద విషయంగా కనిపించదు. మానవజీవిత పరిణామప్రక్రియలో ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకున్న మనిషి ఏ విధంగా ఉంటాడో మాత్రమే ఆయన్ను చూచి మనం గ్రహించవచ్చు. అయితే, దానివల్ల మనకేమీ మేలు జరుగదు. 

'మీలో ఆకలిని నేను కలిగించలేను' అని యూజీ తరచూ అనేవారు. మరెందుకు ఇలాంటివాళ్ళంటే మనకు ఆకర్షణ? అంటే, వాళ్ళు మన భవిష్యత్తుకు సూచికలు. మన భవిష్యత్తును వారిలో చూస్తుంటాం గనుక వారంటే మనం ఆకర్షించబడతాం. విపరీతమైన అంతరిక వెదుకులాట వల్ల యూజీగారు ఒక స్థితిని పొందాడు. దానిని 'సహజస్థితి' అన్నాడు. ఆ స్థితిలోనే తరువాతి జీవితమంతా గడిపాడు. అయితే ఇదంతా, 'కెలామిటీ' గా ఆయన జీవితంలో చెప్పబడే సంఘటన తర్వాత సహజంగా ఆయనకు వచ్చిన స్థితి. దానిగురించి తర్వాత ముచ్చటించుకుందాం.

ప్రస్తుతం కొంచం వెనక్కు వెళదాం.

గుడివాడలో తన విద్యాభ్యాసం తర్వాత ఆయన మద్రాస్ యూనివర్సిటీలో BA Hons (Philosophy&Psychology) కోర్సులో చేరారు. అప్పటికింకా శనిమహర్దశే ఆయన జీవితంలో జరుగుతోంది. చిన్నప్పటినుంచీ దివ్యజ్ఞానసమాజంతో ఉన్న సంబంధాల వల్ల అప్పటి అడయార్ ధియోసఫీకల్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన అరుండేల్ తోనూ, వైస్ ప్రెసిడెంట్ అయిన జినరాజదాసతోనూ ఆయనకు బాగా పరిచయం ఉండేది. వారికి కూడా ఆయనంటే మంచి అభిప్రాయమూ, ఆయన ఆధ్యాత్మిక భవిష్యత్తు మీద ఆశా ఉండేవి. ఆ పరిచయంవల్ల ఆయన అడయార్ సొసైటీలోనే ఉంటూ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉండేవాడు. వేసవికాలం సెలవలలో హిమాలయాలకు పోతూ వస్తూ ఉండేవాడు.

సైకాలజీలో చెప్పబడే 'మనసు' ఎక్కడుందో ఆయనకు అర్ధమయ్యేది కాదు. దేహానికున్న అనుభూతులు (sensations) మాత్రమే ఆయనకు కనిపించేవిగాని మనసనేది ఎక్కడా కనిపించేది కాదు. ఆ విషయాన్నే తన ప్రొఫెసర్ ను ఆయన అడిగాడు. ఆ సమయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా అదే యూనివర్సిటీలో పనిచేసేవారు. ఇంకొక బెంగాలీ ప్రొఫెసర్ కూడా ఈయనకు ఫిలాసఫీ పాఠాలు చెప్పేవాడు. ఆయన్నే - ''మనసు' అంటే ఏమిటి? మీరు చెప్పే మనసు నాకెక్కడా కనిపించడం లేద' ని యూజీ అడిగారు.

దానికాయన ఇలా అన్నాడు - 'చూడు. నీకు పరీక్ష పాసవ్వాలని ఉంటే, పుస్తకాలలో చదివిన దానిని ముక్కున పెటుకుని పరీక్ష వ్రాయి. డిగ్రీ చేతికొస్తుంది. అంతేగానీ ఇలాంటి ప్రశ్నలడక్కు'. మనసంటే తనకు కూడా తెలీదని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నాడు. ఆయనలోని నిజాయితీ యూజీకి నచ్చింది.

నా చిన్నప్పుడు నా గురువులలో ఒకరిని నేనూ ఇదే మాట అడిగాను. అప్పుడు నాకు 13 ఏళ్ళుంటాయి. అప్పట్లో నేను వేదాంతగ్రంధాలను విపరీతంగా చదువుతూ ఉండేవాడిని, వాటిల్లో చెప్పబడిన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే పదాలు నాకర్ధమయ్యేవి కావు.

'మనసంటే ఏమిటి ?' అని అడిగాను.

'ఆలోచనే మనసు' అని ఆమె చెప్పారు.

కొన్నాళ్ళు దీనిని గమనించాక నాకర్ధమైన దానిని మళ్ళీ ఇలా అడిగాను.

'ఆలోచన ఏముంది? ఉన్నవి అనుభూతులు, జ్ఞాపకాలు, వాటిని మళ్ళీమళ్ళీ కావాలనుకోవడమే కదా? అని నేనడిగాను.

అంటే, ఇవే మాటలను నేను వాడలేదు. ఇంత పెద్దమాటలు ఆ వయసులో నాకు తెలీవు కూడా.

'ఏదైనా 'ఇట్లా' అని అనిపిస్తుంది. అది నచ్చితే మళ్ళీ అలాగే అవాలనిపిస్తుంది. అది గుర్తుంటుంది. ఇదిగాక మనసంటే ఏమిటి?' అనడిగాను.

'అలా అనుకోవడమే మనసు' అని ఆమె అన్నారు. ఆ సమాధానం నన్ను సంతృప్తి పరచలేదు. కానీ కాదనే ధైర్యం అప్పట్లో లేదు. నిజమేనేమో అని ఊరుకున్నాను. ఆ ఘట్టం అంతటితో ముగిసింది.

ప్రతి ఆధ్యాత్మిక ప్రయాణీకునికీ ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్న ఎదురౌతుంది. దానికి జవాబు కొందరికి దొరుకుతుంది. మరికొందరికి దొరకదు. దొరకడానికీ, దొరకకపోవడానికీ భేదం వెదుకులాటలోని తీవ్రతాలోపమేనేమో? కొందరు వారి వెదుకులాటను మధ్యలోనే ఆపేస్తారు. ఇంకొందరు ఆరిపోని తపనతో దానిని చివరివరకూ కొనసాగిస్తారు. కానీ ఏ వెదుకులాటా ఎప్పుడూ అంతం కాదు. కొన్నాళ్ళు ఆరిపోయినట్లు కనిపించినా మళ్ళీ అది రగులుతుంది, వెలుగుతుంది.

దీన్నుంచి మనకొక విషయం అర్ధమవుతుంది. యూజీగారికి మనసనేది చిన్నప్పటి నుంచే లేదు. లేదా, మిణుకు మిణుకుమంటున్న దీపంలాగా ఉంది. దీనికి సూచనగా ఆయన జాతకంలో చంద్రుడినీ, బుధుడినీ, యముడైన శని మ్రింగేశాడు. మనసుకు కారకుడు చంద్రుడనీ, బుద్ధికి కారకుడు బుధుడనీ మనకు తెలుసు. శనికి యముడని పేరుంది. మరణానికి నాశనానికి శని కారకుడు. కనుక మనస్సూ బుద్ధీ అన్నవి పుట్టుకతోనే యూజీగారిలో చాలా తక్కువస్థాయిలో ఉన్నాయన్న సంగతి ఈ పరిశీలనతో అర్ధమౌతున్నది. గతజన్మలలో ఎంతో సాధన చేసినవారికి మాత్రమే ఇలాంటి స్థితి పుట్టుకతో వస్తుంది. ఇది యోగగ్రంధాలలో చెప్పబడిన అమనస్కస్థితికి కొద్దిగా ముందుండే పరిస్థితి. ఇదే విషయాన్ని కౌమారనాడి కూడా  చెప్పింది

చిన్నప్పటినుంచీ తాతగారింట్లో చూచిన అతి ఆచారాలమీద, ఆచరణలో కనిపించని గొప్పమాటలు సూక్తులమీద, అప్పటికే ఆయనకు అసహ్యం ఏర్పడి ఉన్నది. డివైన్ లైఫ్ సొసైటీ శివానందగారి 'ఆవకాయ' సంఘటనతో గురువుల మీద కూడా నమ్మకం పోయింది. కానీ లోలోపలి తృష్ణ చావకపోగా ఇంకా ఎక్కువైపోయింది. గ్రంధాలూ, మహనీయులూ చెబుతున్న 'మోక్షం' అంటే ఏమిటి? అది నిజంగా ఉందా? ఉంటే ఇంత సాధన చేస్తున్న తనకు అదెందుకు దొరకడం లేదు? అన్న విసుగు, కోపం ఆయనలో బాగా పెరిగిపోయాయి. కానీ, దారి చూపించేవారు కనపడటం లేదు. వెతుకుతున్నది దొరకడం లేదు. ఏం చేయాలి?

హిమాలయాలలో చేసిన సాధనల వల్ల ఆయనకు చాలా రకాల సమాధిస్థితులు కలిగాయని ఆయనే అన్నారు. కానీ ఆయనకు తృప్తి కలుగలేదు. ఇదొక వింతగా మనకు అనిపిస్తుంది. కానీ ఇది నిజమే.

మనస్సు అన్నది ఉన్నంత వరకూ ఎన్ని రకాలైన సమాధిస్థితులు కలిగినప్పటికీ, మనిషికి అంతిమశాంతి లభించదు. మనోనాశం అనేది కలిగినప్పుడు మాత్రమే 'మోక్షం' లభిస్తుంది. ఈ విషయాన్ని వివేకానందస్వామి జీవితంలో కూడా చూడవచ్చు. శ్రీరామకృష్ణులు జీవించి ఉన్నప్పుడే ఆయనకు నిర్వికల్పసమాధి కలిగింది. కానీ, ఆయన పోయిన ఎన్నో ఏళ్ళకు, స్వామి తన పరివ్రాజక దశలో దేశమంతా తిరుగుతున్న దశలో, ఎక్కడో రాజస్తాన్ నుంచి కలకత్తాలోని తన సోదరశిష్యులకు వ్రాసిన ఉత్తరంలో ఇలా అంటారు - 'నాకు దైవసాక్షాత్కారం కలగలేదు. నాకు శాంతి లభించలేదు. ఎంతగానో దానికోసం తపిస్తున్నాను. కానీ అది కనుచూపు మేరలో కనపడటం లేదు'.

దీనర్ధం ఏమిటి? నిర్వికల్పసమాధిని పొందిన వ్యక్తి ఇలా అనడం ఏమిటి? వింతగా ఉంది కదూ ? అదేమరి ! మామూలుగా మనం అనుకువేదీ, నిజంగా ఆధ్యాత్మికమార్గంలో జరిగేదీ పూర్తి భిన్నంగా ఉంటుంది. మనం పుస్తకాలలో చదివేది, టీవీ ప్రవచనాలతో వినేది అంతా చాలావరకూ చెత్త మాత్రమే ! అక్కడ జరిగేది ఒకలాగా ఉంటుంది, మనం చెప్పుకునే ముచ్చట్లు మరోరకంగా ఉంటాయి. 

ధ్యానంలో అనుభవాలు,   దర్శనాలు,   సమాధిస్థితులు  వేరు. కొద్ది సాధనతో అవి చాలా తేలికగానే కలుగుతాయి. కానీ మనోనాశం, అహంకార నిర్మూలనం అనేవి అంత తేలికగా దక్కవు. వాటిని పొందటం టీవీలలో ప్రవచనాలు వినడమంత తేలిక, పుస్తకాలూ చదవడమంత సులభమూ, పురాణకాలక్షేపం వంటి చవకబారు పనీ కాదు. వినేవారికే కాదు, ఆ ప్రవచనాలు చెప్పేవారికి కూడా ఈ స్థితులేవీ అందుబాటులో ఉండవు. దక్కవు కూడా! అంతరికాన్వేషణలో రగిలిపోతూ, చావు అంచులవరకూ పోయి, దాని తర్వాత ఏముందో రుచి చూచినవానికి మాత్రమే అవి లభిస్తాయి. మనోనాశమంటే ఊరకే కబుర్లు చెప్పడం కాదు !

ఆధ్యాత్మికమార్గం, మిఠాయి అంగళ్లు ఉన్న ఒక బజారు వంటిది. అక్కడ, కొందరు మౌనంగా మిఠాయిలు తింటూ ఉంటారు, కొంతమంది ఆ తింటున్నవారిని చూస్తూ ఉంటారు, మరికొంతమంది ఊరకే వాగుతూ మిఠాయి తింటే ఎలా ఉంటుందో, ఎలా దానిని తినాలో ఇతరులకు వివరిస్తూ ఉంటారు. కానీ, తినేవాడికొక్కడికే దాని రుచి తెలుస్తుంది. చూసేవాడికీ తెలియదు, వాగేవాడికీ తెలియదు. వినేవాడికి అసలే తెలియదు. 

అనుభవం లేనివాడు వాగుతుంటే, వాడి వాగుడును వినేవాళ్ళు మరీ దద్దమ్మలు. వాళ్ళకసలేమీ తెలియదు, అర్ధంకాదు. లోకమంతా ఇలాంటి వినే  దద్దమ్మలే ఎక్కువగా ఉంటారు. ఇదీ ఆధ్యాత్మికలోకపు మాయాజాలాల్లో ఒక మాయాజాలం !

శ్రీరామకృష్ణులు దీనినే ఇంకో విధమైన తేలికపదాలలో చెప్పారు.

'కొంతమంది సముద్రాన్ని గురించి విన్నారు. కొంతమంది దానిని దూరంనుంచి చూచారు. మరి కొంతమంది దానిదగ్గరకు వెళ్ళారు. అతి కొద్దిమంది దాని నీటిని రుచి చూచారు. వారిలో మరీ అతి కొద్దిమంది సముద్రంలో అడుగుపెట్టారు.  అలా, అడుగుపెట్టినవారిలో కూడా ఒకరో ఇద్దరో మాత్రమే దానిలో కరగిపోయారు' అన్నారాయన.  సాధనా సారాంశమంతా ఇంతే !

మనసు దేనినైనా ఊహించగలదు. దేనినైనా పొందగలదు. కానీ ఆ ఊహలలో, ఆ దర్శనాలలో అంతిమశాంతి లేదు. నిజంగా చెప్పాలంటే ఎంతటి గొప్ప అనుభవమైనా మన ఊహే ! మనసనేది ఉన్నంతవరకూ, ఇంకా చెప్పాలంటే, నేననేది ఉన్నంతవరకూ మనిషికి శాంతి లేదు. కానీ అదెలా పోతుందో తెలియదు. నేననేది ఎక్కడుంది? అని వెదికితే మాత్రం అదెక్కడా కనపడదు. అది లేదు, కనపడదు, కానీ మనల్ని ఒదిలి పోదు, దానితోనే దాని చుట్టూతానే అంతా ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో ఇదే అసలైన సమస్య.   

అలాంటి నిస్సహాయస్థితిలో ఉన్నపుడు ఒక స్నేహితుని సలహాతో యూజీ, రమణమహర్షిని దర్శించారు. రమణాశ్రమంలో రమణమహర్షితో జరిగిన భేటీ, ఆయన జీవితాన్ని మరొక మలుపు తిప్పింది.

(ఇంకా ఉంది) 

read more " U.G - 8 ( వెదుకులాట - రమణమహర్షి సందర్శనం ) "

14, ఆగస్టు 2020, శుక్రవారం

'ఇలాంటి మొగుళ్ళు కూడా ఉంటారా?' - ప్రశ్నశాస్త్రం

10-8-2020 శనివారం ఉదయం 11. 30 కి ఒక ఫోనొచ్చింది.

'నమస్తే అండి సత్యనారాయణ శర్మగారేనా?' అడిగిందొక మహిళాస్వరం.

'అవును' అన్నా ముక్తసరిగా. ఆడవాళ్ళ ఫోనంటేనే నాకు భయమూ, చిరాకూ రెండూ ఒకేసారి కలుగుతాయి. ఎందుకంటే, వారిలో విషయం ఉండకపోగా అనవసరమైన నస మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే చిరాకు కలిగిస్తుంది. సోది చెప్పకుండా సూటిగా విషయం మాట్లాడే ఆడవాళ్లను చాలా తక్కువమందిని ఇప్పటిదాకా చూచాను. ఆఫ్ కోర్స్ ! వాళ్ళ అవసరం ఉన్నపుడు మాత్రం చాలా సూటిగానే మాట్లాడతారనుకోండి. అది వేరే విషయం !

'నా పేరు హేమలత. ఫలానా వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేశారు' అంది.

'అలాగా. చెప్పండి ఎందుకు ఫోన్ చేశారు?' అడిగా.

'నేనొక సమస్యలో ఉన్నాను. ప్రశ్న చూస్తారని అడగడానికి ఫోన్ చేశా' అన్నదామె.

రిఫర్ చేసినాయన నా క్లోజ్ ఫ్రెండ్ కనుక వెంటనే ఎదురుగా ఉన్న లాప్ టాప్ తెరిచి ప్రశ్నచక్రం వేశా. తులాలగ్నం అయింది. చంద్రుడు సప్తమంలో ఉండి లగ్నాన్ని సూటిగా చూస్తున్నాడు.

'మీ వివాహజీవితం గురించి మీరు అడగాలనుకుంటున్నారు' అన్నాను.

'నిజమే. అదే నా సమస్య' అందామె.

సప్తమాధిపతి కుజుడు ఆరో ఇంట్లో ఉన్నవిషయాన్ని, సుఖస్థానంలో శని ఉన్న విషయాన్ని గమనిస్తూ 'మీ ఆయనకు మీకూ గొడవలు. మీకు సంసారసుఖం లేదు' అన్నాను.

'నిజమే. కానీ ఆ గొడవలు ఎందుకో చెబితే మీరు ఆశ్చర్యపోతారు' అందామె.

అంటే, మామూలు సమస్య కాదన్నమాట. అంతగా చెప్పలేని సమస్యలేముంటాయా? అని ఒక్క క్షణకాలం పాటు ఆలోచించాను.

భర్తను సూచించే కుజునినుండి అతని మనస్సుకు సూచిక అయిన నాలుగో ఇంట్లో ఉఛ్చరాహువు శుక్రుడు ఉండటాన్ని గమనించాను. ఈ యోగం ప్రకారం వివాహేతర సంబంధాన్ని మొగుడే ప్రోత్సహిస్తూ ఉండాలి. కానీ ఈ విషయాన్ని ఎలా అడగడం? బాగోదేమో అని సంశయిస్తూ ఉండగా -'తన స్నేహితులతో బెడ్ పంచుకోమని మా ఆయన పోరు పెడుతున్నాడు. ఈ విషయాన్ని చెప్పినా ఎవరూ నమ్మరు' అందామె.

'ఓరి దేవుడో?' అని తెగ ఆశ్చర్యమేసింది. వాళ్ళాయన వృత్తి ఏంటా అని గమనించాను. కుజుని నుండి దశమంలో ఉఛ్చకేతువు గురువు ఉన్నారు. గురువు వక్రీస్తూ వృశ్చికంలోకి పోతున్నాడు. శని వక్రీస్తూ ధనుస్సులోకి వచ్చి కేతువును కలుస్తున్నాడు. దశమాన్ని ఉఛ్చరాహువు శుక్రుడు చూస్తున్నారు. అంటే, పైకి నీతులు చెబుతూ లోలోపల అనైతికపు పనులు చేసే రంగమన్నమాట. అదేమై ఉంటుంది? రాహుశుక్రులు సహజతృతీయమైన మిధునంలో ఉంటూ సినిమా ఫీల్డ్ ని సూచిస్తున్నారు.

'మీ ఆయనది సినిమా ఫీల్డా?' అడిగాను.

'అవును. మా ఆయన ఫలానా' అని చెప్పిందామె.

నాకు మతిపోయినంత పనైంది.

'ఎందుకలా?' అడిగాను ఆమెనోటినుంచి విందామని.

'బిజినెస్ ప్రొమోషన్ కోసం, కొత్త కొత్త సినిమా ఛాన్సులకోసం, తన ఫ్రెండ్స్ దగ్గర, కొంతమంది నిర్మాతల దగ్గర పడుకోమని గొడవ చేస్తున్నాడు. భరించలేక విడాకులు కోరుతున్నాను' అందామె.

'ఆ పనికోసం కాల్ గాళ్స్  చాలామంది ఉంటారు. పెళ్ళాన్ని పడుకోబెట్టాల్సిన పనేముంది?' అడిగాను.

'కాల్ గాళ్స్ వాళ్లకూ తెలుసు. మా ఆయన వాళ్లకు చెప్పక్కర్లేదు. హీరోయిన్స్ కంటే అందంగా పుట్టడం నా ఖర్మ' అందామె.

'మంచిపని, గో ఎహెడ్. మీకు సపోర్ట్ గా పేరెంట్స్ లేరా?' అన్నాను.

'మా నాన్న ఒక ఉన్నతాధికారి. కానీ రెండేళ్లక్రితం చనిపోయారు. అంతేకాదు అప్పటినుంచీ మా మామగారు మా అమ్మను వేధిస్తున్నాడు' అన్నదామె.

నా తల గిర్రున తిరిగింది.

'నేను విన్నది నిజమేనా?' అని అనుమానంగా మళ్ళీ చార్ట్ లోకి తలదూర్చాను.

కుజునినుంచి దశమాధిపతి గురువు, ఈమె భర్త తండ్రిని, అంటే మామగారిని సూచిస్తాడు. శుక్రునినుంచి నాలుగో అధిపతి బుధుడు ఈమె తల్లిని సూచిస్తాడు. గురువు వక్రించి వృశ్చికంలోకి వచ్చి, కోణదృష్టితో బుధుడిని చూస్తున్నాడు. గురువు మీద రాహుశుక్రుల దృష్టి ఉంటూ ఆమె చెబుతున్నది నిజమే అని సూచిస్తున్నది.

'బాబోయ్!' అనుకున్నా.

'మీ మామగారు మీ అమ్మకు వరసకు అన్నయ్య అవుతాడు కదమ్మా?' అడిగాను.

'అవునండి. అమ్మ ఆయనతో అదే అంటే, 'ఈ ఫీల్డ్ లో అలాంటి  వరసలేవీ ఉండవు. మీ అమ్మాయిని మావాడు చెప్పినట్లు వినమను. నువ్వు నేను చెప్పినట్లు విను' అని ఫోర్స్ చేస్తున్నాడు' అందామె.

'మరి మీరేం అనుకుంటున్నారు' అడిగాను.

'ఆ ఇంటిని వదిలి బయటకు వచ్చేశాను. అమ్మ దగ్గర ఉంటున్నాను. మంచి లాయర్ దగ్గర డైవోర్స్ కి కేస్ ఫైల్ చేశాను. గెలుస్తామా? ఎన్నాళ్ళు పడుతుంది?' అడిగింది.

దశలు గమనించాను. ప్రస్తుతం కేతువు - రాహువు - రవి నడుస్తోంది. ఇప్పుడు పని జరగదు. భవిష్యత్ దశలను గమనిస్తూ "2021 జనవరి - మార్చి మధ్యలో మీ పని జరుగుతుంది, నువ్వు కేసు గెలుస్తావు. ధైర్యంగా ఉండు. పోరాడు." అని చెప్పాను.

'థాంక్స్' అంటూ ఆమె ఫోన్ పెట్టేసింది.

నాలో ఆలోచనా తరంగాలు మొదలయ్యాయి.

'ఇలాంటి మొగుళ్ళు, ఇలాంటి మామలు కూడా ఉంటారా? ఏమో? భార్యే అలా చెబుతున్నపుడు నమ్మకుండా ఎలా ఉండగలం? అందులోనూ సినిమా ఫీల్డ్ లో ఉన్నంత రొచ్చు ఇంకెక్కడా ఉండదన్నది అందరికీ తెలిసినదే, నిజమే కావచ్చు' అనుకున్నా.

'ఈ భూమ్మీద మనం బ్రతికేది నాలుగురోజులు. ఇక్కడ మన బ్రతుకే శాశ్వతం కాదు. అందులో డబ్బనేది అసలే శాశ్వతం కాదు. వీటికోసం ఇంత దిగజారాలా? పైగా ప్రతిరోజూ కరోనాతో ఎంతోమంది పోతున్నారని వింటున్నాం. మనకు తెలిసినవాళ్ళే చాలామంది చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కూడా ఇంత ఛండాలమా?' అనిపించింది.

మనకనిపిస్తే ఏముపయోగం? వాళ్ళకనిపించాలి కదా? వాళ్లకు అవే ముఖ్యంగా కన్పిస్తున్నాయి మరి ! మనమేం చెయ్యగలం? ఈ ప్రపంచంలో ఎవరు చెబితే ఎవరు వింటారు గనుక? ఎవరి ఖర్మ వారిది. అంతే.

ఆలోచన ఆపి నా పనిలో నేను పడ్డాను.

కథకంచికి మనం మన పనిలోకి.

(వ్యక్తిగతకారణాల రీత్యా పేర్లు, కధనం మార్చడం జరిగింది. కధనం మారినా, కధ నిజమైనదే !)

read more " 'ఇలాంటి మొగుళ్ళు కూడా ఉంటారా?' - ప్రశ్నశాస్త్రం "

7, ఆగస్టు 2020, శుక్రవారం

U.G - 7 ( శనిచంద్రయోగం - సాధనలు)

జాతకంలో నిజమైన ఆధ్యాత్మిక చింతనకు సూచిక - శనిచంద్ర యోగం. ఒకమనిషి జీవితంలో ఇది లేనిదే నిజమైన ఆధ్యాత్మికసాధన జరుగనే జరుగదు. అయితే, ఇదే యోగం  జీవితంలో చాలా బాధలను, వేదనను కూడా ఇస్తుంది. ఇవి లేకుండా ఆధ్యాత్మికమార్గంలో నడక  కుదరనే కుదరదు. అదే విచిత్రం మరి !

బాధల చీకటిరాత్రి నుంచే దివ్యత్వపు సూర్యోదయానికి దారి ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి ! ఒకరి జీవితం చిన్నప్పటినుంచీ కులాసాగా, దేనికీ లోటు లేకుండా సాగిపోతుంటే అలాంటివ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించడం ఎప్పటికీ సాధ్యం కానేకాదు. అలాంటివారికి కుహనా ఆధ్యాత్మికత, నకిలీ మతవేషాలు, రకరకాల దీక్షలు, సాంప్రదాయాలు, సాధనలు  వంటబట్టచ్చేమోగాని నిజమైన యోగసిద్ధి కలగడం మాత్రం కల్ల. మహనీయుల అందరి జాతకాలలోనూ బాధాపూరితమైన ఈ శనిచంద్రయోగం ఉంటుంది. అయితే, రకరకాల తేడాలతో ఉంటుంది. దాని బలాన్ని బట్టి వారికి కలిగే సిద్ధి కూడా ఉంటుంది.

ఇదే యోగం వల్ల జాతకుని తల్లికి చాలా బాధలు కలుగుతాయి. లేదా తల్లి మరణిస్తుంది. నిజమైన ఆధ్యాత్మికతకు ఇది ఇంకొక సూచన. అయితే, కష్టాలు పడిన ప్రతివారూ, తల్లి చనిపోయిన ప్రతివారూ గొప్ప జ్ఞానులు, సిద్ధులు అవుతారని అర్ధం చేసుకోకూడదు. కడుపులో చల్ల కదలకుండా వేళకు పూజలు చేసుకుంటూ, జపాలు చేసుకుంటూ ఉండేవారు ఆధ్యాత్మికంగా ఉన్నతులని అనుకోకూడదు. వారిలో చాలామంది మహా దురహంకారపూరితులై ఉంటారు. 'మేము చాలా ఆచారపరాయణులం, మహాభక్తులం' అనే అహంకారం పెరగడానికి మాత్రమేగాని ఇతరత్రా అవి ఎందుకూ ఉపయోగపడవు.

జ్ఞానసిద్ధికైనా, దైవసాక్షాత్కారానికైనా ఎంతో అంతరికసంఘర్షణ అవసరమౌతుంది. ఎంతో అంతరికవేదనను పడవలసి వస్తుంది. లోలోపల ఎంతో మారవలసి ఉంటుంది. ఇవేవీ లేకుండా ఊరకే మొక్కుబడిగా పూజలు, జపాలు, ధ్యానాలు చేస్తూ, దేవుడిని కోరికలు కోరుకుంటూ ఉండేవారు ఎన్నేళ్ళైనా అలాగే ఉంటారుగాని వారికి సిద్ధి లభించదని మాత్రమే నేను చెబుతున్నాను.

నేను గుంటూరులో ఉన్న రోజుల్లో, అంటే 1997 ప్రాంతాలలో, నా స్నేహితుడొకడు ఒక శ్రీవిద్యోపాసకుని గురించి తెగ ఊదరగొట్టేవాడు. ఆయన చాలా గొప్ప సాధకుడని, రోజుకు ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు  జపం చేస్తూనే ఉంటాడని చెప్పాడు. నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ మావాడి పోరు పడలేక ఒకసారి మారుతీనగర్లో ఉన్న ఆయన దగ్గరకు వాడితో కలసి వెళ్ళవలసి వచ్చింది. ఒక్క పది నిముషాలు ఆయనతో మాట్లాడాక 'ఓకే అండి! ఉంటాను మరి' అంటూ ఆయన జవాబుకోసం కూడా ఎదురుచూడకుండా బయటకొచ్చేశాను.

నా వెనుకే హడావుడిగా బయటకొచ్చిన మావాడు 'ఏంటి? అలా వచ్చేశావ్? ఆయన శక్తిని తట్టుకోలేకపోయావా?' అన్నాడు భక్తిగా.

'నీ మొహం ! ఇంకోసారి నీమాట అస్సలు నమ్మను. ఎందుకురా  ఇలాంటివాళ్ల దగ్గరకు నన్ను తీసుకొస్తావ్?' అంటూ ముక్కచీవాట్లు  పెట్టాను వాడికి.

'నా ప్రశ్నకు జవాబు చెప్పు' రెట్టించాడు వాడు.

'ఆచారపరాయణుడే గాని శక్తిహీనుడు. అనుభవశూన్యుడు. నీలాంటి వాళ్లకి బాగా సరిపోతాడు. ఆయన దగ్గర ఉపదేశం తీసుకో. నీ జన్మ ధన్యమౌతుంది' అన్నాను.

ఆ కధ అంతటితో ముగిసింది. ఇలాంటి 'మడికంపు' గాళ్ళను చాలామందిని చూచాను. బయటవేషం తప్ప, ఉత్త పనికిమాలిన తంతులు తప్ప, అంతరిక ఔన్నత్యం ఎక్కడా వీరిలో ఉండదు. వారి నిత్యజీవితంలో అయితే అస్సలు కనపడనే కనపడదు. లోకం ఇలాంటివాళ్ళను చూచి చాలా మోసపోతుంది. లోకం నిండా నకిలీ మనుషులే గనుక, ఇలాంటి నకిలీ మహాత్ములే లోకానికి నచ్చుతారు. సహజమే !

యూజీగారి జాతకంలో కుటుంబస్థానంలో శనిచంద్రయోగం ఉన్నది. ఇది తల్లిగారికి మరణాన్ని కొనితెచ్చింది. అదే విధంగా యూజీగారికి  జీవితమంతా స్థిరత్వం లేకుండా ప్రయాణాలు చెయ్యడాన్నిచ్చింది. మానసికంగా లోతైన సంఘర్షణను అంతర్మధనాన్ని ఇచ్చింది. కుండలినీ జాగృతి కలిగి దేహంలో భరించలేని నరకబాధల్ని పెట్టింది.

యూజీగారు పుట్టినపుడున్న గురుమహర్దశా శేషం 2 సం || 2 నెలలు. అది 1920 ఆగస్టుతో అయిపోయింది. సెప్టెంబర్ నుంచీ 19 సంవత్సరాల శనిమహర్దశ మొదలైంది. ఇది ఆయనకు 21 ఏళ్ళు నిండేవరకూ నడిచింది. ఆ సమయంలోనే ఆయనకు ఆధ్యాత్మిక పునాదులు పడ్డాయి. లేదా, అప్పటిదాకా పెంచుకున్న నమ్మకాలు కూలిపోయాయి. శనిమహర్దశ అనేది మనిషిని మనిషిగా నిలబెడుతుంది.

చాలామంది 'శని' అంటే భయపడతారు. కానీ నా దృష్టిలో శనిని మించిన శుభగ్రహం లేదంటాను. ఎందుకంటే, జీవితమంటే ఏంటో మనిషికి అర్ధమయ్యేది ఆయనవల్లనే. ఆయన దశలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, చికాకులు  తప్పకుండా వస్తాయి. కానీ, అవే మనిషి జీవితానికి పరిపూర్ణతనిస్తాయి. వాటిని చవిచూడకుండా, ఎప్పుడూ సుఖాలలో తేలుతూ ఉండేవాడికి జీవితం అర్ధం కాదు.  ఉన్నతమైన జీవితం అసలే అర్ధం కాదు. మనిషికి కలిగే నిజమైన ఆధ్యాత్మికపురోగతి కూడా శనిదశలోనే కలుగుతుంది.

యూజీగారికి 3 ఏళ్ళనుంచి 8 ఏళ్లవరకూ, అంటే, 1921 నుండి 1926 వరకూ ఆయనకు పురాణాలు, వేదాంతగ్రంధాలు, శాస్త్రాలు పరోక్షంగా నేర్పించబడ్డాయి. ఆయనకిలాంటి శిక్షణ ఇవ్వడం కోసం తాతగారు తన లాయరు ప్రాక్టీస్ మానుకున్నారు. ఎనిమిదేళ్లకే ఆయనకు చాలా శ్లోకాలు కంఠతా వచ్చేశాయి. కానీ, ఆచారపు ఆధ్యాత్మికత అంటే మొహం మొత్తడం మొదలైంది.

ఆధ్యాత్మికంగా ఎదగడమనేది ఎన్నో జన్మలనుంచీ సాగుతున్న ఒక ప్రయాణం. అది సజీవనదిలాగా గలగలా పారుతూ ఉండాలి. అంతేగాని దానిని కృత్రిమంగా తయారుచెయ్యలేం. బోధలద్వారా, ట్రయినింగ్ ఇవ్వడంద్వారా దానిని మనిషికి నేర్పలేం. అది జరిగే పని కాదు. అందుకనే, చిన్నప్పటినుంచీ మతాచారాలు, పూజలు, పద్ధతులు నేర్పించబడిన పిల్లలు, ప్లాస్టిక్ మొక్కలలాగా అందంగా తయారౌతారు గాని వారిలో జీవకళ ఉండదు. చిన్నప్పటినుంచీ నిష్టగా వేదం నేర్చుకున్న  పురోహితులందరూ ఆధ్యాత్మికతకు దూరమైపోయేది  అందుకే. వారికి తంతులొస్తాయి. కానీ సహజంగా లోలోపల సాగవలసిన సాధనాజలం వారిలో ఉండదు. అది మాత్రం ఎండిపోయి ఉంటుంది. జీవితంలో డబ్బొక్కటే పరమావధి అయి కూచుంటుంది. సాంప్రదాయబద్ధమైన మార్గంలో ఉంటూ, నిజమైన సాధన కూడా దానితోపాటు సాగించిన మనిషిని ఇంకా నేను చూడవలసి ఉంది. కొన్ని వందలమందిని ఇప్పటికి చూచాను, కానీ అలాంటివాడు ఒక్కడుకూడా ఇప్పటికి నాకు తారసపడలేదు. అది జరగదని నాకర్ధమైపోయింది.

మతాన్ని బలవంతంగా నేర్పడం ద్వారా, మనిషిని దైవానికి దూరం చేస్తున్నామని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే అది నిజం కాబట్టి !

ఆ సమయంలో యూజీగారికి శని మహర్దశలో శని, బుధ, కేతు అంతర్దశలునడిచాయి. బుధుడు శనితోనే కలసి ఉన్నాడు. కేతువు ద్వాదశంలో ఉన్నాడు. కేతువు ద్వాదశంలో ఉన్నపుడు, అది ఉఛ్చగాని, నీచగానీ అయితే గొప్ప ఆధ్యాత్మిక యోగాన్నిస్తాడు. 'ఆ జాతకుడికి అదే ఆఖరుజన్మ' అని జ్యోతిష్యగ్రంధాలన్నాయి. అయితే, ఉఛ్చకేతువు ఇచ్ఛే యోగం వేరుగా ఉంటుంది, నీచకేతువు ఇచ్ఛే యోగం వేరుగా ఉంటుంది.

ధ్యానంలో ఉన్నపుడు ఏడ్చి విసిగించిందని తన మనవరాలిని తాతగారు చితక్కొట్టడం, తల్లిగారి తద్దినం రోజున తనతోబాటు ఉపవాసం ఉండవలసిన తద్దినం బ్రాహ్మలు చక్కగా వీధిచివరి హోటల్లో టిఫిన్ చేస్తూ యూజీగారికి దొరికిపోవడం, అలవాటు ప్రకారం ఆంజనేయస్వామికి మొక్కుకోకముందే తననుకున్న కోరిక తీరి ఆశ్చర్యానికి గురిచేయడం - లాంటి సంఘటనలన్నీ చిన్నారి యూజీలో ఆలోచనను రేకెత్తించాయి. 'అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి?' అని ప్రశ్నించేటట్లు చేశాయి. మాట్లల్లో తప్ప చేతల్లో కనిపించని ఆచారాలంటే ఆయనకు తీవ్రమైన అసహ్యం కలిగి, తాతగారి ఎదుటనే తన జంధ్యాన్ని తెంపి పారేశాడు. యోగకరమైన శనిదశ అనేది అలాంటి ముక్కుసూటి మనస్తత్వాన్నిస్తుంది.

అంత చిన్నవయసులో కూడా, కులనియమాలను ఆయన పాటించేవాడు కాదు. మానవత్వానికి మాత్రమే పెద్దపీట వేసేవాడు.

1932 లో ఆయనకు 14 ఏళ్ల వయసులో, శివగంగ పీఠాధిపతి తన మందీమార్బలంతో వారింటికి వచ్చారు. అప్పుడు యూజీగారికి సరిగ్గా శని - చంద్రదశ జరుగుతున్నది. ఆయననుసరించి తానుకూడా సన్యాసం తీసుకుంటానని యూజీగారు తన కోరికను వెలిబుచ్చారు. యూజీగారిది మరీ లేతవయసు కావడంతో ఆ శంకరాచార్యస్వామి, యూజీగారి కోరికను మన్నించలేదు. పోతూ పోతూ ఆయన శివమంత్రాన్ని యూజీగారికి ఉపదేశం చేశారు. ఆ రోజునుంచీ కొన్నేళ్లపాటు ప్రతిరోజూ 3000 సార్లు ఆయన శివమంత్రాన్ని క్రమం తప్పకుండా జపించేవాడు. ఈ విధంగా, శనిచంద్ర దశ ఆయన సాధనకు బీజాలు వేసింది.

అప్పటినుంచీ తనకు 21 ఏళ్ళు వచ్చేవరకూ ప్రతి వేసవికాలపు సెలవలలోనూ యూజీగారు హిమాలయాలకు వెళ్లి స్వామి శివానందగారి ఆశ్రమంలో ఉంటూ తీవ్రమైన సాధన చేశాడు. శివానందగారి దగ్గర యూజీగారు  యోగాసనాలు,ప్రాణాయామం, ధ్యానం మొదలైనవన్నీ నేర్చుకున్నాడు. ఋషీకేశ్ లో యూజీగారికి ఒక గుహ ఉండేది. దానిలో కూచుని రోజుకు పదినుంచి పదిహేడు గంటలపాటు జపం, ధ్యానం చేసేవాడు. ఆ సమయంలో తనకు ఎన్నో సమాధిస్థితులు కలిగాయని తర్వాతి కాలంలో ఆయన చెప్పాడు. 

ఆ సమయంలో ఆయన జాతకంలో శని - రాహుదశ నడిచింది. ఆ విధంగా రోజులతరబడి తిండీనీళ్ళూ మానుకొని  ఉపవాసాలుంటూ, హిమాలయగుహలలో తపస్సు చేశాడు యూజీగారు. కొన్నాళ్ళు పచ్చిగడ్డిని ఆహారంగా తింటూ సాధన చేస్తూ ఉండేవాడు. ఇది శపితదశ అన్న విషయం నా వ్రాతలు చదివేవారికి విదితమే. ఇది మనిషిని నానాబాధలు పెడుతుంది. లేదా, ఆ బాధల్ని మనమే పడాలి. అప్పుడు అది శాంతిస్తుంది. సాధకులైనవాళ్లు వాళ్ళను వాళ్ళే హింసపెట్టుకుంటారు గనుక శపితదశ ప్రత్యేకంగా వారిని ఇంకేదో బాధలకు గురిచేసే పని ఉండదు. సాధనకోసం స్వయంగా వాళ్ళే ఆ బాధలు పడతారు. కనుక శపితదశ సాధకులమీద పనిచేయదు.

కానీ, అందరికీ సాత్వికాహారాన్ని ప్రబోధించే శివానందస్వామి, ఒకరోజున ఆవకాయ కలిపిన అన్నాన్ని ఇష్టంగా తింటూ యూజీగారి కంటబడ్డాడు. ఆ దెబ్బతో ఆయనంటే యూజీగారికి  విరక్తి పుట్టింది. 'మమ్మల్నేమో గడ్డిగాదం తినమని  చెబుతున్నాడు, ఈయనేమో తలుపులేసుకుని ఆవకాయ తింటున్నాడు. ఇది కరెక్ట్ కాదు' అనుకున్నాడు. శివానందాశ్రమాన్ని వదిలేశాడు.

శివానందస్వామి తమిళుడు. పెద్ద పొట్టతో ఉండే ఈయన మంచి భోజనప్రియుడు. ఎన్నో పుస్తకాలు వ్రాసి, ఎంతో వేదాంతప్రచారం చేశాడు. ఇప్పటికీ రిషీకేశ్ లో వాళ్ళ ఆశ్రమం ఉంది. అలాంటి చిన్నవిషయం మీద ఆయనతో యూజీగారి బంధం అలా తెగిపోయింది. ఆవకాయకు కారకుడు రాహువన్నది గుర్తుంటే శని - రాహుదశలో అది యూజీగారి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందో అర్ధమౌతుంది.

యూజీగారు చిన్నప్పటినుంచీ మహా ముక్కుసూటి మనిషి. ఒకటి చెబుతూ ఇంకొకటి చేస్తే ఆయనకు చిర్రెత్తుకొచ్చేది. ఇదే  పాయింట్ మీద జిడ్డు కృష్ణమూర్తితో కూడా ఆయన విభేదించాడు. రోసలిన్ తో జిడ్డుకున్న అక్రమసంబంధం థియోసఫీ సర్కిల్స్ లో అందరికీ తెలిసిన విషయమే. కానీ బయటపడేవారు కాదు. చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేకపోవడంతో జిడ్డును కూడా యూజీ వదిలేశాడు. అయితే ఇది చాలాఏళ్ల  తర్వాత జరిగింది.

14 ఏళ్ళనుంచి 21 ఏళ్ల వయసువరకూ యూజీగారికి శివానందస్వామితోనూ, మద్రాస్ ధియోసఫీ సర్కిల్స్ తోనూ సంబంధాలున్నాయి. అది 1939 సంవత్సరం. అప్పటికి ఆయనకు 21 ఏళ్ళొచ్చాయి. శివానందస్వామితో తెగతెంపులయింది. ఆయన జీవితంలో బుధమహర్దశ మొదలైంది.

(ఇంకా ఉంది)

read more " U.G - 7 ( శనిచంద్రయోగం - సాధనలు) "

గాయకులు - సంఖ్యాశాస్త్రం

ఈ లోకంలో ప్రతిమనిషీ ప్రక్కమనిషికంటే విభిన్నుడే. అలాగే ప్రతిజాతకమూ ప్రక్కవారి జాతకం కంటే తేడాగానే ఉంటుంది. కానీ ఒకే రంగంలో ఉన్నవారి జాతకాలలో కొన్నికొన్ని పోలికలుంటాయి. అవి జ్యోతిష్యపరంగానూ కనిపిస్తాయి. అలాగే,  సంఖ్యాశాస్త్రపరంగానూ కనిపిస్తాయి.  నిజానికి,అంకెలన్నీ గ్రహాలే. కనుక సంఖ్యాశాస్త్రం కూడా జ్యోతిషశాస్త్రంలో భాగమే.

గాయకులకు శని మరియు రాహుకేతువులతో గట్టిసంబంధం ఉంటుంది. ఎందుకంటే,  సంగీతం నేర్చుకోవాలంటే చాలా గట్టి పట్టుదల ఉండాలి. అలాగే క్రొత్త క్రొత్త ప్రయోగాలు చెయ్యాలంటే కూడా రాహుకేతువులు సంబంధం ఉండాలి. ఒక వ్యక్తి జీవితంలో రాహువు ప్రభావం లేనిదే అతనికి ఆటా, పాటా, మాటా ఏవీ రావు. కనుక వీరందరికీ 2,,4,8, అంకెలతో  ఖచ్చితమైన సంబంధం ఉంటుంది. నా పద్ధతిలో రాహువును 2 అనీ, కేతువును 4 అనీ భావిస్తాము. పుస్తకాలలో మీరు చూచే సంఖ్యాశాస్త్రానికీ నా విధానం తేడాగా ఉంటుంది. గమనించండి.

ఇప్పుడు ప్రసిద్ధగాయకులు పుట్టినతేదీలను  పరిశీలిద్దాం.

ఈ తేదీలలో శతాబ్దపు సంఖ్యను  లెక్కించవలసిన పనిలేదు. ఎందుకంటే 1900 నుంచి 1999 మధ్యలో పుట్టినవారికి 19 అనేది అందరికీ ఉంటుంది గనుక. అలాగే  ఆ తర్వాత పుట్టినవారికి 20 అనేది అందరికీ కామన్ గా ఉంటుంది గనుక ఆ సంఖ్యలను  పట్టించుకోవలసిన పనిలేదు.

K L Saigal
Born 11-4-1904
2-4-4
రాహువు - కేతువు - కేతువు. పుట్టిన తేదీ 2 అయింది. నెల 4 అయింది. సంవత్సరం కూడా నాలుగే.

సైగల్ మంచి గాయకుడే అయినా త్రాగుడుకు అలవాటుపడి జీవితాన్ని విషాదాంతం చేసుకున్నాడు. రాహుకేతువుల ప్రభావం ఆయనమీద అలా పనిచేసింది. 

Kishore Kumar
Born 4-8-1929
4-8-2
కేతువు - శని - రాహువు
పుట్టినరోజు 4 అయింది.

అమరగాయకుడైన ఇతని జీవితం కూడా బాధామయమే. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత కూడా శాంతిలేకుండానే ఈయన చనిపోయాడు.

Died 13-10-1987
4-1-6 = 2
చనిపోయిన రోజు రూట్ నంబర్ కూడా 4 అవడం గమనించాలి.

Mohammad Rafi
Born 24-12-1924
24-12-24

ఇదొక రిథమ్. ఈయన పుట్టినతేదీలోనే ఒక రిథమ్ ఉండటం చూడవచ్చు. 2,4 అంకెలు మళ్ళీ మళ్ళీ వస్తూ రాహుకేతువుల ప్రభావాన్ని సూచిస్తున్నాయి.

Died 31-7-1980
4-7-8
4,8 అంకెలను కేతు, శనుల ప్రభావాన్ని గమనించండి.

Mukesh Madhur
Born 22-7-1923
22-7-23

2 అంకె మూడుసార్లు రావడాన్ని పుట్టిన తేదీ రూట్ నంబర్ 4 అవడాన్ని గమనించండి.


Manna Dey
Born 1-5-1919
1-5-1

ఈయన మీద ఈ గ్రహాల ప్రభావం లేదు. కనుకనే కొన్నాళ్ల తర్వాత సినీరంగానికి దూరమయ్యాడు.

Talat Mahamood
Born 24-2-1924
24-2-24

ఇక్కడ కూడా 2,4 అంకెల ప్రభావాన్ని చూడవచ్చు. ఈయన జననతేదీలో కూడా రిథమ్ ఉన్నది. కొన్నేళ్లు బాగా వెలిగిన ఈయన సినీరంగానికి దూరమై ఘజల్ సింగర్ గా మిగిలాడు.

Bhupender singh
Born 6-2-1940
6-2-4
రాహుకేతువుల ప్రభావం స్పష్టం.

Jagjith singh
Born 8-2-1941
8-2-41
2,4,8 అంకెల ప్రభావం గమనించండి.

Died 10-10-2011
1-1-2 = 4
రాహుకేతువుల ప్రభావం స్పష్టం.


Lata Mangeshkar 
Born 28-9-1929
28-9-29

ఈమె పుట్టిన తేదీలో కూడా రిథమ్ ఉన్నది. 2,8 అంకెల ప్రాబల్యత రాహువు, శనుల ప్రభావాన్ని సూచిస్తున్నది.

Nukala China Satyanarayana
Born 4-8-1923
4-8-5
8
2,4,8 అంకెల ప్రభావం కనిపిస్తోంది. పుట్టినతేదీ 4 అయింది.


Died 11-7-2013
2-7-4
4
మళ్ళీ 2,4 అంకెలు వచ్చాయి. చనిపోయిన తేదీ రూట్ నంబర్ 2 అయింది. మొత్తం తేదీ రూట్ నంబర్ 4 అయింది.

Ghantasala Venkateswara Rao
Born 4-12-1922
4-12-22
2,4 అంకెల సీక్వెన్స్ ను గమనించండి.
పుట్టిన తేదీ మళ్ళీ 4 అయింది.

Died 11-2-1974
2-2-74
2-2-2
ఈ తేదీకూడా మళ్ళీ 2,4 అంకెల పరిధిలోనే ఉన్నది. 

P.Susheela
Born 13-11-1935
4-2-8
అవే అంకెలు మళ్ళీ కనిపిస్తూ రాహు, కేతు, శనుల ప్రభావాన్ని సూచిస్తున్నాయి.

గాయకులు చాలామంది పుట్టిన తేదీ 4  గాని, 13 గాని, 22 గాని, 31 గాని అవుతూ రూట్ నంబర్ 4 అవుతుంది. వారి జననతేదీలో ఉండే మిగతా అంకెల వల్ల వారి జీవితంలో ఆయా మిగతాగ్రహాల పాత్ర ఉంటుంది.

సామాన్యంగా గాయకుల జీవితాలు విషాదాంతం అవుతాయి. కళాకారులకి కూడా అంతే. బయటప్రపంచం వారిని ఆరాధించవచ్చు. కానీ వారి వ్యక్తిగతజీవితాలు చివరకు విఫలమే అవుతాయి. వారి జీవితాలు పూలపాన్పులలాగా ప్రపంచానికి గోచరిస్తాయి. కానీ బయట ప్రపంచానికి కనపడని చీకటి కోణాలు వారి జీవితాలలో ఉంటాయి. దానికి కారణం వారి జీవితంలో ఉన్న రాహు, కేతు, శనుల ప్రభావం. ఎంతమంది గాయకుల జననతేదీలను చూచినా ఇవే సీక్వెన్సులు మీకు కన్పిస్తాయి.
read more " గాయకులు - సంఖ్యాశాస్త్రం "