నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

24, ఆగస్టు 2020, సోమవారం

U.G (Uppaluri Gopalakrishna Murti) - Astro analysis - 8 ( వెదుకులాట - రమణమహర్షి సందర్శనం )

ప్రతిమనిషి జాతకంలోనూ దానికే ప్రత్యేకమైన కొన్ని గ్రహయోగాలుంటాయి. అవి ఆ మనిషియొక్క పూర్వకర్మను, ఈ జన్మలో అతనిదైన ప్రత్యేక జీవనమార్గాన్ని సూచిస్తూ ఉంటాయి. అలాగే  యూజీగారి జాతకంలో కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి కుటుంబస్థానంలో శని, బుధ, చంద్రుల కలయిక.

ఇది తీవ్రమైన ఆధ్యాత్మికయోగాలలో ఒకటి. ఈ యోగం చాలా లోతైన అంతర్ముఖత్వాన్నిస్తుంది. అదీగాక యూజీగారికి సరియైన సమయంలో సరియైన దశలు నడిచాయి. ఆధ్యాత్మిక దశలన్నవి మనిషి జీవితంలో చిన్నప్పుడే రావాలి. అవి ముసలితనంలో వస్తే ఉపయోగం ఉండదు. అప్పటికి అంతా అయిపోయి ఉంటుంది. కనుక అవి ఆ మనిషిపైన బలమైన ప్రభావాన్ని చూపలేవు. విజయవంతమైన ఏ జాతకంలోనైనా, గ్రహానుకూలత, దశానుకూలతలు తప్పకుండా ఉండాలి. అప్పుడే, అవి సూచించేది ఏ రంగమైనా, ఆ జాతకుడు వాటిలో విజయాలను సాధిస్తాడు. ఈ రెండూ లేకపోతే ఆ జీవితం వృధా అవుతుంది. మహనీయులందరికీ, ఆధ్యాత్మికదశలు చిన్ననాడే మొదలైనట్లు మనం వారివారి జీవితాలలో గమనించవచ్చు.

గురుదశ చివరలో పుట్టిన యూజీగారికి చిన్నప్పుడే 19 ఏళ్ల శనిమహర్దశ మొదలైంది. ఇది అంతర్ముఖత్వాన్నిచ్ఛే దశ. దానిననుసరించి 17 ఏళ్ల బుధ మహర్దశ జరిగింది. దాని తరువాత 7 ఏళ్ల కేతుదశ జరిగింది. ఈ విధంగా చిన్నతనం నుంచీ, మొత్తం 43 ఏళ్ల పాటు ఏకధాటిగా ఆయన జీవితంలో ఆధ్యాత్మిక సాధనను,  చింతనను, సిద్ధిని కలిగించే దశలు నడిచాయి. వీటి ఫలితంగా ఆయన 49 వ ఏట ఆయనకు సిద్ధి కలిగింది. దానినాయన 'కెలామిటీ (విపత్తు, మహాప్రమాదం)' అని పిలిచారు. సిద్ధి అనేటటువంటి ఆధ్యాత్మికపరమైన పదాన్ని ఆయన వాడలేదు.

యూజీగారిలో కనిపించే ఒక అద్భుతమైన అంశం ఏమంటే, ఎక్కడా ఆధ్యాత్మికపరమైన వేషంగాని, శ్లోకాలు, గ్రంధాలనుంచి ఉదహరించడం వంటి చేష్టలుగాని లేకుండా, ఒక జ్ఞాని లేదా అవధూతయొక్క సహజస్థితిగా మన గ్రంధాలలో చెప్పబడిన స్థితిలో ఆయన సూటిగా ప్రతిక్షణమూ  జీవించారు. ఆయన మాటలను పైపైన వినడం వల్ల, లేదా ఆయన వేషాన్ని చూడటంవల్ల, లోకులు ఆయనను సరిగ్గా అర్ధం చేసుకోవడం కంటే, మోసపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. అందుకే లోకం ఆయన్ను సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయింది. ఒక గొప్ప జ్ఞానిని లోకం  పోగొట్టుకుంది.

అయితే, నిజంగా చూస్తే, ఆయనవల్ల మనకేమీ ఉపయోగం లేదు. ఒక జ్ఞాని వల్ల లోకానికి ఏమీ ఉపయోగం ఉండదు. తన దివ్యశక్తిని ఉపయోగించి  ఏ జ్ఞానీ లోకానికి ఎటువంటి మేలునూ చెయ్యడు. మనం 'మేలు' అనుకునేది ఆయనకొక పెద్ద విషయంగా కనిపించదు. మానవజీవిత పరిణామప్రక్రియలో ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకున్న మనిషి ఏ విధంగా ఉంటాడో మాత్రమే ఆయన్ను చూచి మనం గ్రహించవచ్చు. అయితే, దానివల్ల మనకేమీ మేలు జరుగదు. 

'మీలో ఆకలిని నేను కలిగించలేను' అని యూజీ తరచూ అనేవారు. మరెందుకు ఇలాంటివాళ్ళంటే మనకు ఆకర్షణ? అంటే, వాళ్ళు మన భవిష్యత్తుకు సూచికలు. మన భవిష్యత్తును వారిలో చూస్తుంటాం గనుక వారంటే మనం ఆకర్షించబడతాం. విపరీతమైన అంతరిక వెదుకులాట వల్ల యూజీగారు ఒక స్థితిని పొందాడు. దానిని 'సహజస్థితి' అన్నాడు. ఆ స్థితిలోనే తరువాతి జీవితమంతా గడిపాడు. అయితే ఇదంతా, 'కెలామిటీ' గా ఆయన జీవితంలో చెప్పబడే సంఘటన తర్వాత సహజంగా ఆయనకు వచ్చిన స్థితి. దానిగురించి తర్వాత ముచ్చటించుకుందాం.

ప్రస్తుతం కొంచం వెనక్కు వెళదాం.

గుడివాడలో తన విద్యాభ్యాసం తర్వాత ఆయన మద్రాస్ యూనివర్సిటీలో BA Hons (Philosophy&Psychology) కోర్సులో చేరారు. అప్పటికింకా శనిమహర్దశే ఆయన జీవితంలో జరుగుతోంది. చిన్నప్పటినుంచీ దివ్యజ్ఞానసమాజంతో ఉన్న సంబంధాల వల్ల అప్పటి అడయార్ ధియోసఫీకల్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన అరుండేల్ తోనూ, వైస్ ప్రెసిడెంట్ అయిన జినరాజదాసతోనూ ఆయనకు బాగా పరిచయం ఉండేది. వారికి కూడా ఆయనంటే మంచి అభిప్రాయమూ, ఆయన ఆధ్యాత్మిక భవిష్యత్తు మీద ఆశా ఉండేవి. ఆ పరిచయంవల్ల ఆయన అడయార్ సొసైటీలోనే ఉంటూ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉండేవాడు. వేసవికాలం సెలవలలో హిమాలయాలకు పోతూ వస్తూ ఉండేవాడు.

సైకాలజీలో చెప్పబడే 'మనసు' ఎక్కడుందో ఆయనకు అర్ధమయ్యేది కాదు. దేహానికున్న అనుభూతులు (sensations) మాత్రమే ఆయనకు కనిపించేవిగాని మనసనేది ఎక్కడా కనిపించేది కాదు. ఆ విషయాన్నే తన ప్రొఫెసర్ ను ఆయన అడిగాడు. ఆ సమయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా అదే యూనివర్సిటీలో పనిచేసేవారు. ఇంకొక బెంగాలీ ప్రొఫెసర్ కూడా ఈయనకు ఫిలాసఫీ పాఠాలు చెప్పేవాడు. ఆయన్నే - ''మనసు' అంటే ఏమిటి? మీరు చెప్పే మనసు నాకెక్కడా కనిపించడం లేద' ని యూజీ అడిగారు.

దానికాయన ఇలా అన్నాడు - 'చూడు. నీకు పరీక్ష పాసవ్వాలని ఉంటే, పుస్తకాలలో చదివిన దానిని ముక్కున పెటుకుని పరీక్ష వ్రాయి. డిగ్రీ చేతికొస్తుంది. అంతేగానీ ఇలాంటి ప్రశ్నలడక్కు'. మనసంటే తనకు కూడా తెలీదని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నాడు. ఆయనలోని నిజాయితీ యూజీకి నచ్చింది.

నా చిన్నప్పుడు నా గురువులలో ఒకరిని నేనూ ఇదే మాట అడిగాను. అప్పుడు నాకు 13 ఏళ్ళుంటాయి. అప్పట్లో నేను వేదాంతగ్రంధాలను విపరీతంగా చదువుతూ ఉండేవాడిని, వాటిల్లో చెప్పబడిన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే పదాలు నాకర్ధమయ్యేవి కావు.

'మనసంటే ఏమిటి ?' అని అడిగాను.

'ఆలోచనే మనసు' అని ఆమె చెప్పారు.

కొన్నాళ్ళు దీనిని గమనించాక నాకర్ధమైన దానిని మళ్ళీ ఇలా అడిగాను.

'ఆలోచన ఏముంది? ఉన్నవి అనుభూతులు, జ్ఞాపకాలు, వాటిని మళ్ళీమళ్ళీ కావాలనుకోవడమే కదా? అని నేనడిగాను.

అంటే, ఇవే మాటలను నేను వాడలేదు. ఇంత పెద్ద మాటలు ఆ వయసులో నాకు తెలీవు కూడా.

'ఏదైనా 'ఇట్లా' అని అనిపిస్తుంది. అది నచ్చితే మళ్ళీ అలాగే అవాలనిపిస్తుంది. అది గుర్తుంటుంది. ఇదిగాక మనసంటే ఏమిటి?' అనడిగాను.

'అలా అనుకోవడమే మనసు' అని ఆమె అన్నారు. ఆ సమాధానం నన్ను సంతృప్తి పరచలేదు. కానీ కాదనే ధైర్యం అప్పట్లో లేదు. నిజమేనేమో అని ఊరుకున్నాను. ఆ ఘట్టం అంతటితో ముగిసింది.

ప్రతి ఆధ్యాత్మిక ప్రయాణీకునికీ ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్న ఎదురౌతుంది. దానికి జవాబు కొందరికి దొరుకుతుంది. మరికొందరికి దొరకదు. దొరకడానికీ, దొరకకపోవడానికీ భేదం వెదుకులాటలోని తీవ్రతాలోపమేనేమో? కొందరు వారి వెదుకులాటను మధ్యలోనే ఆపేస్తారు. ఇంకొందరు ఆరిపోని తపనతో దానిని చివరివరకూ కొనసాగిస్తారు. కానీ ఏ వెదుకులాటా ఎప్పుడూ అంతం కాదు. కొన్నాళ్ళు ఆరిపోయినట్లు కనిపించినా మళ్ళీ అది రగులుతుంది, వెలుగుతుంది.

దీన్నుంచి మనకొక విషయం అర్ధమవుతుంది. యూజీ గారికి మనసనేది చిన్నప్పటి నుంచే లేదు. లేదా, మిణుకు మిణుకు మంటున్న దీపంలాగా ఉంది. దీనికి సూచనగా ఆయన జాతకంలో చంద్రుడినీ, బుధుడినీ, యముడైన శని మ్రింగేశాడు. మనసుకు కారకుడు చంద్రుడనీ, బుద్ధికి కారకుడు బుధుడనీ మనకు తెలుసు. శనికి యముడని పేరుంది. మరణానికి నాశనానికి శని కారకుడు. కనుక మనస్సూ బుద్ధీ అన్నవి పుట్టుకతోనే యూజీగారిలో చాలా తక్కువస్థాయిలో ఉన్నాయన్న సంగతి ఈ పరిశీలనతో అర్ధమౌతున్నది. గతజన్మలలో ఎంతో సాధన చేసినవారికి మాత్రమే ఇలాంటి స్థితి పుట్టుకతో వస్తుంది. ఇది యోగగ్రంధాలలో చెప్పబడిన అమనస్కస్థితికి కొద్దిగా ముందుండే పరిస్థితి.

చిన్నప్పటినుంచీ తాతగారింట్లో చూచిన అతి ఆచారాలమీద, ఆచరణలో కనిపించని గొప్ప మాటలు సూక్తులమీద, అప్పటికే ఆయనకు అసహ్యం ఏర్పడి ఉన్నది. డివైన్ లైఫ్ సొసైటీ శివానందగారి 'ఆవకాయ' సంఘటనతో గురువుల మీద కూడా నమ్మకం పోయింది. కానీ లోలోపలి తృష్ణ చావకపోగా ఇంకా ఎక్కువైపోయింది. గ్రంధాలూ, మహనీయులూ చెబుతున్న 'మోక్షం' అంటే ఏమిటి? అది నిజంగా ఉందా? ఉంటే ఇంత సాధన చేస్తున్న తనకు అదెందుకు దొరకడం లేదు? అన్న విసుగు, కోపం ఆయనలో బాగా పెరిగిపోయాయి. కానీ, దారి చూపించేవారు కనపడటం లేదు. వెతుకుతున్నది దొరకడం లేదు. ఏం చేయాలి?

హిమాలయాలలో చేసిన సాధనల వల్ల ఆయనకు చాలా రకాల సమాధిస్థితులు కలిగాయని ఆయనే అన్నారు. కానీ ఆయనకు తృప్తి కలుగలేదు. ఇదొక వింతగా మనకు అనిపిస్తుంది. కానీ ఇది నిజమే.

మనస్సు అన్నది ఉన్నంత వరకూ ఎన్ని రకాలైన సమాధిస్థితులు కలిగినప్పటికీ, మనిషికి అంతిమశాంతి లభించదు. మనోనాశం అనేది కలిగినప్పుడు మాత్రమే 'మోక్షం' లభిస్తుంది. ఈ విషయాన్ని వివేకానందస్వామి జీవితంలో కూడా చూడవచ్చు. శ్రీరామకృష్ణులు జీవించి ఉన్నప్పుడే ఆయనకు నిర్వికల్పసమాధి కలిగింది. కానీ, ఆయన పోయిన ఎన్నో ఏళ్ళకు, స్వామి తన పరివ్రాజక దశలో దేశమంతా తిరుగుతున్న దశలో, ఎక్కడో రాజస్తాన్ నుంచి కలకత్తాలోని తన సోదరశిష్యులకు వ్రాసిన ఉత్తరంలో ఇలా అంటారు - 'నాకు దైవసాక్షాత్కారం కలగలేదు. నాకు శాంతి లభించలేదు. ఎంతగానో దానికోసం తపిస్తున్నాను. కానీ అది కనుచూపు మేరలో కనపడటం లేదు'.

దీనర్ధం ఏమిటి? నిర్వికల్ప సమాధిని పొందిన వ్యక్తి ఇలా అనడం ఏమిటి? వింతగా ఉంది కదూ ? అదేమరి ! మామూలుగా మనం అనుకువేదీ, నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో జరిగేదీ పూర్తి భిన్నంగా ఉంటుంది. మనం పుస్తకాలలో చదివేది, టీవీ ప్రవచనాలతో వినేది అంతా చాలావరకూ చెత్త మాత్రమే ! అక్కడ జరిగేది ఒకలాగా ఉంటుంది, మనం చెప్పుకునే ముచ్చట్లు మరో రకంగా ఉంటాయి. 

ధ్యానంలో అనుభవాలు, దర్శనాలు, సమాధిస్థితులు  వేరు. కొద్ది సాధనతో అవి చాలా తేలికగానే కలుగుతాయి. కానీ మనోనాశం, అహంకార నిర్మూలనం అనేవి అంత తేలికగా దక్కవు. వాటిని పొందటం టీవీలలో ప్రవచనాలు వినడమంత తేలిక, పుస్తకాలూ చదవడమంత సులభమూ, పురాణకాలక్షేపం వంటి చవకబారు పనీ కాదు. వినేవారికే కాదు, ఆ ప్రవచనాలు చెప్పేవారికి కూడా ఈ స్థితులేవీ అందుబాటులో ఉండవు. దక్కవు కూడా! అంతరికాన్వేషణలో రగిలిపోతూ, చావు అంచులవరకూ పోయి, దాని తర్వాత ఏముందో రుచి చూచినవానికి మాత్రమే అవి లభిస్తాయి. మనోనాశమంటే ఊరకే కబుర్లు చెప్పడం కాదు !

ఆధ్యాత్మిక మార్గం, మిఠాయి అంగళ్లు ఉన్న ఒక బజారు వంటిది. అక్కడ, కొందరు మౌనంగా మిఠాయిలు తింటూ ఉంటారు, కొంతమంది ఆ తింటున్నవారిని చూస్తూ ఉంటారు, మరికొంతమంది ఊరకే వాగుతూ మిఠాయి తింటే ఎలా ఉంటుందో, ఎలా దానిని తినాలో ఇతరులకు వివరిస్తూ ఉంటారు. కానీ, తినేవాడికొక్కడికే దాని రుచి తెలుస్తుంది. చూసేవాడికీ తెలియదు, వాగేవాడికీ తెలియదు. వినేవాడికి అసలే తెలియదు. అనుభవం లేనివాడు వాగుతుంటే, వాడి వాగుడును వినేవాళ్ళు మరీ దద్దమ్మలు. వాళ్ళకసలేమీ తెలియదు, అర్ధంకాదు. లోకమంతా ఇలాంటి వినే  దద్దమ్మలే ఎక్కువగా ఉంటారు. ఇదీ ఆధ్యాత్మిక లోకపు మాయాజాలాల్లో ఒక మాయాజాలం !

శ్రీరామకృష్ణులు దీనినే ఇంకో విధమైన తేలికపదాలలో చెప్పారు.

'కొంతమంది సముద్రాన్ని గురించి విన్నారు. కొంతమంది దానిని దూరం నుంచి చూచారు. మరి కొంతమంది దానిదగ్గరకు వెళ్ళారు. అతి కొద్దిమంది దాని నీటిని రుచి చూచారు. వారిలో మరీ అతి కొద్దిమంది సముద్రంలో అడుగు పెట్టారు.  అలా, అడుగుపెట్టినవారిలో కూడా ఒకరో ఇద్దరో మాత్రమే దానిలో కరగిపోయారు' అన్నారాయన.  సాధనా సారాంశమంతా ఇంతే !

మనసు దేనినైనా ఊహించగలదు. దేనినైనా పొందగలదు. కానీ ఆ ఊహలలో, ఆ దర్శనాలలో అంతిమశాంతి లేదు. నిజంగా చెప్పాలంటే ఎంతటి గొప్ప అనుభవమైనా మన ఊహే ! మనసనేది ఉన్నంతవరకూ, ఇంకా చెప్పాలంటే, నేననేది ఉన్నంతవరకూ మనిషికి శాంతి లేదు. కానీ అదెలా పోతుందో తెలియదు. నేననేది ఎక్కడుంది? అని వెదికితే మాత్రం అదెక్కడా కనపడదు. అది లేదు, కనపడదు, కానీ మనల్ని ఒదిలి పోదు, దానితోనే దాని చుట్టూతానే అంతా ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో ఇదే అసలైన సమస్య.   

అలాంటి నిస్సహాయస్థితిలో ఉన్నపుడు ఒక స్నేహితుని సలహాతో యూజీ, రమణమహర్షిని దర్శించారు. రమణాశ్రమంలో రమణమహర్షితో జరిగిన భేటీ, ఆయన జీవితాన్ని మరొక మలుపు తిప్పింది.

(ఇంకా ఉంది)