నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

4, సెప్టెంబర్ 2021, శనివారం

ప్రత్యూష బెనర్జీది హత్యా ఆత్మహత్యా?

సిద్ధార్ధ అనే హిందీ నటుడిది జాతకం వేశాక, 'ఇతనితో బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) అనే సీరియల్లో నటించిన ప్రత్యూష బెనర్జీ అనే అమ్మాయి కూడా చనిపోయిందని, అదికూడా 2016 లో నని  కొందరు నాతో చెప్పారు. నేనీ సీరియల్సూ, చెత్తా చెదారమూ, చూడను గనుక, అసలు మా ఇంటికి టీవీ కనెక్షన్ పీకించేశాను గనుక, నాకీ విషయాలు తెలియవు. ఈలోపల, ఆ అమ్మాయిది హత్యో ఆత్మహత్యో చూడమని, కర్ణపిశాచి నా ఎడమచెవిలో సవాల్ విసిరింది. మనుషులు చూడమని అడిగితే మనం చూడం కదా, సర్లే పాపం పిశాచి అడిగిందని చూస్తున్నా ! మనుషులకంటే అవే నయం మరి !

ఈ అమ్మాయి 10-8-1991 న ఉదయం 4. 20 కి జంషెడ్ పూర్లో పుట్టిందని వివరాలు దొరికాయి. నిజమో కాదో దేవుడికెరుక. అయినా జాతకం చూద్దాం.

తెలుగులో కూడా ఒక ప్రత్యూష అనే నటి ఉండేదని, ఆమె కూడా ఇలాగే చంపబడిందని, ఆమెను రేప్ చేసిన నీచులు హాయిగా తప్పించుకుని, ప్రస్తుతం అమెరికాలో హ్యాపీగా తిరుగుతున్నారని నాతో కొందరన్నారు. ప్రకృతి న్యాయస్థానంలో వాళ్లకు భయంకరమైన శిక్ష తప్పదని వారితో అన్నాను. సరే ఆ విషయమలా ఉంచి, ఈ చార్ట్ లోకొద్దాం.

ఈ అమ్మాయి అమావాస్య రోజున పుట్టింది. అది లగ్నంలోనే ఉంది. కనుక ఈమెది చీకటిజీవితమే. అయితే గురువు కూడా ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. గతకర్మ కొంత మంచిది. అందువల్ల అదృష్టం కలసి వస్తుంది. అయితే, ఇది కాలసర్పయోగజాతకం. శత్రుస్థానంలో శపితయోగం కూడా ఉంది. సప్తమ అష్టమాధిపతి అయిన శని, శత్రుస్థానంలో శపితయోగంలో ఉండటం వల్ల, ప్రియుడు లేదా భర్త ఈమె చావుకు కారకుడౌతాడని సూచన స్పష్టంగా ఉన్నది. వక్రులైన బుధశుక్రులు కూడా లగ్నంలోకి వస్తారు. లగ్నం తీవ్రమైన పాపార్గళానికి గురయ్యింది. ఈ కారణాలచేత, ఈ అమ్మాయి చాలా మంచిదని, అమాయకురాలని, తేలికగా మోసపోతుందని, క్రిమినల్స్ నుంచి ఎంతో వత్తిడికి గురవుతుందని, చివరకు విషాదాంతమని చెప్పవచ్చు.

కర్కాటక లగ్నానికి బుధశుక్రశనులు మంచిని చెయ్యరు. వీరిలో బుధశుక్రులు డిగ్రీ కంజంక్షన్ మీదున్నారు. వీరితో పంచమాధిపతి కుజుడు కలిసున్నాడు. వీరందరూ మారకస్థానంలో ఉన్నారు. పైగా, నీచకేతువు నక్షత్రంలో ఉన్నారు. స్నేహాలు, ప్రేమవ్యవహారాలే ఈమె బలవంతపు చావుకు కారణమౌతాయని ఇవి చెబుతున్నాయి.

ఈ అమ్మాయి 1-4-2016 న ఉరేసుకుని చనిపోయినట్లు లోకాన్ని నమ్మించారు. ఆ రోజున, ఈమె జాతకంలో శుక్ర-రాహు-రాహు-కేతుదశ నడిచింది. రాహువు శత్రుస్థానంలో నీచస్థితిలో ఉంటూ శనితో కలసి శపితయోగంలో ఉన్నాడు. శుక్రుని సంగతి పైన చెప్పాను. కేతువు నీచబుధుడిని సూచిస్తూ ద్వాదశంలో ఉంటూ రహస్యాలను, కుట్రలను, బలవంతపు చావును సూచిస్తున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో లగ్నాధిపతి అయిన చంద్రుని పాత్ర లేదు. కనుక ఈమెది ఆత్మహత్య కాదు.

1-4-2016 న  ముంబాయి లో గ్రహస్థితి ఇలా ఉంది.

మారకస్థానంలో గురురాహువులు సంచరిస్తూ గురుఛండాలయోగాన్నిస్తున్నారు.  అంటే, బాంబే సినీ ఫీల్డ్ లోని మాఫియా పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. పంచమంలో దుర్ఘటనాయోగం స్పష్టంగా ఉంటూ తీవ్రమైన షాక్ ను సూచిస్తున్నది. నవమంలో నీచబుధుడు, ఉచ్ఛశుక్రుడు ఉంటూ, ఆయుష్య స్థానాన్ని చూస్తున్నారు. సినీ పెద్దలనుంచి  సెక్స్ పరమైన ట్రాప్ లు, కుట్రలు, వాటిల్లో ఇరుక్కోవడం క్లియర్ గా కనిపిస్తున్నాయి. అదే రోజున ఈ అమ్మాయి చంపబడింది.

ఉరిచావులలో రుజువయ్యే జైమినీమహర్షి సూత్రం ఈ జాతకంలో లేదు. గమనించండి. దీనిగురించి గతంలో కొన్ని జాతకాలలో వ్రాశాను, చూసుకోండి.

కనుక ఈ అమ్మాయిది హత్యేగాని, ఆత్మహత్య కాదని చెబుతున్నాను. ఈ అమ్మాయి సినీమాఫియా ఉచ్చులో ఇరుక్కుంది. మోసపోయింది. బయటకు రాలేకపోయింది.  హత్యకు గురయ్యింది. ఇందులో ప్రియుడిపాత్ర ఖచ్చితంగా ఉంది. లోకాన్ని నమ్మించవచ్చు, నేరస్థులు తప్పించుకుని తిరుగవచ్చు. కానీ వారికి శిక్ష తప్పదు. అదెలా పడుతుందో  మానవమాత్రులకర్ధం కాదు. నాకర్ధమైనా బయటకు చెప్పను, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు నష్టం లేదు.

సరేనా పిశాచీ ! ఇంకెప్పుడూ ఇలాంటి జాతకాలు చూడమని అడక్కు.