“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

15, సెప్టెంబర్ 2021, బుధవారం

మార్చలేనప్పుడు, తెలుసుకోవడమెందుకు?

మా బంధువులలో ఒకాయన ఈ మధ్యనే ఫోన్ చేశాడు.

'మీ జ్యోతిష్య పోస్టులు క్రమం తప్పకుండ చదువుతూ ఉంటాను, కానీ నాదొక సందేహం. మీరన్నీ అయిపోయాక వ్రాస్తారేంటి? ముందు వ్రాయాలిగాని' అన్నాడు.

'ముందు వ్రాసేవాళ్ళు బోలెడుమందున్నారు. అందుకని నేను వెనుక వ్రాస్తూ ఉంటాను. ఇది నా పద్ధతి' అన్నా నవ్వుతూ.

'అలాకాదు. చెప్పండి' అడిగాడాయన.

'ఏమీ లేదు. మొదట్లో వ్రాసేవాడిని. తరువాత విసుగొచ్చి ఆపేశాను. జరగబోయేవి తెలుసుకోవడం పెద్ద విషయం కాదు, అది లోకంలో అయినా సరే, మనుషుల జీవితాలలో అయినా సరే. వాటిని ఆపడం మన చేతకానప్పుడు, అది మన పనికూడా కానప్పుడు, అలా వ్రాసి, కాలరెగరేసుకోవలసిన ఖర్మ నాకు లేదు. అలాంటి గొప్పలు నాకవసరం లేదు. అదీగాక, గ్లోబల్ కర్మ మ్యాప్ ను ముందే బజార్నపెట్టడం మంచిది కాదు. అలా చేస్తే, గ్రహాల కోపానికి గురవ్వవలసి వస్తుంది. చాలా మంది జ్యోతిష్కుల జీవితాలలో ఘోరమైన ఎదురుదెబ్బలు తగలడం ఇందువల్లనే. అందుకని, ఏదైనా జరిగాక చెప్పడమే శ్రేయస్కరం.

రెండోది - అలా భవిష్యత్తును చెబుతానని, రెమెడీలు చెబుతానని, టాంటాం వేసుకుని జనాన్ని మోసం చేసి డబ్బులు సంపాదించాల్సిన ఖర్మ నాకు లేదు. వద్దు కూడా. అందుకని నేనింతే. అదంతే' అన్నాను.

'ఇలా చెప్పి ఉపయోగం?' అన్నాడాయన.

'ప్రతిదానికీ ఉపయోగమేముంటుంది? జరిగే సంఘటనలకూ గ్రహచలనానికీ సంబంధాలున్నాయని చెప్పడమే నా ఉద్దేశ్యం. అంతకంటే ఏమీ లేదు' అన్నాను.

'జరిగేవాటిని మార్చలేనప్పుడు, తెలుసుకోవడమెందుకు?' అడిగాడాయన.

'బుద్ధిలేక' అని ముగించాను.