“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, సెప్టెంబర్ 2021, సోమవారం

మకరంలో వక్ర శని గురువులు - యూరప్, అమెరికాల పైన ప్రభావాలు

సెప్టెంబర్ 15 న వక్ర గురువు మకరంలోకి ప్రవేశించాడు. అప్పటికే అక్కడ వక్ర శని ఉన్నాడు. ఇద్దరూ మళ్ళీ మకరంలో కలుసుకున్నారు. అయితే, ఇద్దరూ వక్రస్థితిలో ఉన్నారు. వీరివల్ల, ధనుస్సుకు మళ్ళీ అర్గళం పట్టింది. పరోక్షంగా మిధునానికీ పట్టింది. ఇక, ప్రపంచరంగస్థలం మీద మళ్ళీ క్రొత్త నాటకాలు మొదలయ్యాయి. మళ్ళీ కాలదిక్సూచి యూరప్, అమెరికాల పైకి మళ్లింది.

హైతీ అనే కరీబియన్ ద్వీపదేశం మీకు గుర్తుండే ఉంటుంది. దీని ప్రెసిడెంట్ ని ఆ మధ్య హత్య చేశారు. తరువాత ఒక భయంకర భూకంపం ఈ దేశాన్ని కుదిపేశింది. అయితే, ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న గొడవల మధ్యన హైతీ భూకంపాన్ని ఎవరూ పట్టించుకోలేదు. హైతీలోని నిరుపేద నల్లోళ్లు ఏమైతే ఎవరికెందుకు? ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ గడ్డం మావయ్య తుక్కు రేగ్గొడుతున్నాడు. ముందాసంగతి చూడాలి మరి !

ఆ హైతీనుండి, వేలాదిమంది పడవల్లో, నడుచుకుంటూ, రకరకాలుగా వచ్చి టెక్సాస్ బార్డర్ లోనుంచి అమెరికాలో ప్రవేశించాలని చూస్తున్నారు. డెల్ రియో అనే బ్రిడ్జి క్రింద వేలాది మంది వచ్చి తలదాచుకున్నారు. వాళ్లందరినీ కొంత తిండి పెట్టి, పాకెట్ మనీ కింద నూరు డాలర్లిచ్చి, మళ్ళీ విమానాలలో ఎక్కించి, మెక్సికోలో వదిలేస్తున్నారు అమెరికా వాళ్ళు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్లు కొట్టిన దెబ్బకి, దిక్కుతోచక మేముంటే, మధ్యలో మీ గోలేంటి? వెళ్లిపోండి, ఎవరినీ ప్రస్తుతం మా దేశంలోకి తీసుకోలేమంటూ బైడెన్ గారు హుకుం జారీ చేశారు.

మకరంలో ఉన్న గురుశనులు వక్రీకరణవల్ల ధనుస్సులోకి వచ్చినట్లు అవుతుంది. వారి సప్తమదృష్టి కూడా కర్కాటకం నుండి మిధునంలోకి వెళుతుంది. కర్కాటకం, వృశ్చికం, మీనం అనే మూడు రాశులూ ద్వీపాలను, ద్వీపకల్పాలనూ సూచిస్తాయి. కరీబియన్ దీవులు కర్కాటకరాశి అధీనంలో ఉన్నాయి. కనుక అక్కడనుండి ప్రజల వెల్లువ, అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది.  

అమెరికాలో పరిస్థితి అలా ఉంటే, ఇక్కడ యూరప్లో అగ్నిపర్వతం ఒకటి బద్దలైంది.

స్పెయిన్లోని కేనరీ ద్వీపం ఒకదానిలో బ్రద్దలై లావాను వెలువరిస్తున్న అగ్నిపర్వతపు ధాటికి నాలుగు ఊర్లను ఖాళీ చేయించింది ఆ దేశం. ప్రజలనందరినీ ఇళ్లలోనే ఉండమని, బయట తిరగవద్దని హెచ్చరించింది.

అగ్నితత్వ రాశి అయిన ధనుస్సులో ఉన్న శనిగురువులమీద, భూతత్వ రాశి అయిన కన్యనుంచి, భూకారకుడైన కుజుని చతుర్ధ దృష్టిని గమనిస్తే, ఈ అగ్నిపర్వతం ఎందుకు పేలిందో, అదికూడా స్పెయిన్ లోనే ఎందుకు జరిగిందో, స్పష్టంగా అర్ధమౌతుంది.

నవాంశలో, జలతత్వ రాశి అయిన మీనంలో కలసి ఉన్న నీచశని, కుజుల మీద, భూతత్వ రాశి అయిన కన్యనుండి గురువు దృష్టిని గమనిస్తే, అగ్నిపర్వతం పగిలి అగ్నిద్రవమైన లావా ఎందుకు  పారుతున్నదో ఇంకా స్పష్టత వస్తుంది.

ఇప్పుడర్ధమయ్యాయా, టెక్సాస్ లో హైతీ శరణార్ధుల వెల్లువ, స్పెయిన్లో అగ్నిపర్వత ప్రేలుడుల వెనుక ఉన్న  గ్రహస్థితులు?