“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

21, సెప్టెంబర్ 2021, మంగళవారం

మహంత్ నరేంద్ర గిరి మరణం - ఇది ఆత్మహత్యేనా?

Anand Giri - Narendra Giri
ప్రయాగ రాజ్ లో ABAP ( అఖిల భారతీయ అఖారా పరిషత్) అధ్యక్తుడు మహంత్ నరేంద్ర గిరి ఉరిపోసుకుని చనిపోయారని వార్త.  అయిదు  పేజీల సూయిసైడ్ నోట్ వ్రాసిపెట్టి మరీ ఆయన చనిపోయాడు. బాగంబరి గడ్డి మఠానికి ఈయన అధిపతే గాక, బడే హనుమాన్ మందిరానికి మహంత్ కూడా. ఈయన శిష్యుడైన స్వామి ఆనంద్ గిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకొక ఇద్దరు శిష్య పరమాణువులు పరారీలో ఉన్నారు.

ఈయన శిష్యుడైన స్వామి ఆనంద్ గిరికిప్పుడు 40 ఏళ్ళు. ఇతనికి పన్నెండేళ్ల వయసులో, హరిద్వార్ లో తన గురువైన స్వామి నరేంద్ర గిరిని కలిశాడు. అప్పటినుంచీ ఆయన శిష్యరికంలో ఉంటూ, నేటికి ఉప మహంత్ అయ్యాడు. స్వామి అయినప్పటికీ, తన కుటుంబంతో సన్నిహిత  సంబంధాలను కలిగి ఉన్నాడు. ఈ విషయమై, స్వామి నరేంద్రగిరి ఈయనను మందలించినట్లు తెలుస్తోంది. అంతేగాక, హనుమాన్ ఆలయం ఫండ్స్ ని దుర్వినియోగం  చేస్తున్నాడని, అలా చెయ్యవద్దని కూడా గురువైన నరేంద్రగిరి, తన శిష్యుడైన ఆనందగిరిని మందలించినట్లు వార్త. ఇంత చెప్పినా, వినక, గురువుపైననే తిరిగి ఆరోపణలు మోపాడు ఆనందగిరి. ఆశ్రమం నుండి ఆనందగిరిని బహిష్కరించాడు నరేంద్రగిరి. ఆ తరువాత లిఖితపూర్వకంగా క్షమాపణ కోరిన ఆనందగిరిని క్షమించి, మళ్ళీ ఆశ్రమంలోకి తీసుకున్నాడు. ఇదంతా గత చరిత్ర. ప్రస్తుతం ఇలా అనుమానాస్పద పరిస్థితులలో, అర్ధాంతరంగా చనిపోయాడు గురువైన మహంత్ నరేంద్ర గిరి.

శిష్యుడైన ఆనందగిరి యోగా శిక్షకుడు. ఈయన ఇండియాలోనూ, విదేశాలలోనూ యోగా నేర్పిస్తూ ఉంటాడు. పైగా కొంచం జల్సా మనిషిలా కనిపిస్తాడు. ఈ సంఘటన జరిగిన సమయానికి  ఇతను హరిద్వార్ లో ఉన్నాడు. పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు.

తన మరణానికి, శిష్యుడైన ఆనందగిరి, ఇంకా ఇద్దరు శిష్యులూ కారకులని సూయిసైడ్ నోట్ లో వ్రాసి ఉంది. అది అబద్దమని, ఇదంతా కుట్రని ఆనందగిరి అంటున్నాడు. సర్వసంగపరిత్యాగి అయిన నరేంద్రగిరి ఆత్మహత్య చేసుకోవలసిన పనేమిటి? సన్యాసికి చావైనా బ్రతుకైనా ఒకటే కదా? పైగా ఆత్మహత్య మహాపాపమని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా ! ఒక మఠాధిపతి ఆత్మహత్యా? ఎంత విడ్డూరం? అసలేం జరిగింది?

ఇప్పుడు జ్యోతిష్యశాస్త్ర సహాయం తీసుకుందాం.

గురువు వక్రించి మకరంలోకి అడుగుపెట్టిన కొద్దిరోజులకే ఈ సంఘటన జరిగింది.  మకరం భారతదేశం  గనుక, గురువు మఠాధిపతులకు సూచకుడు గనుక, వక్రించి వక్రశనితో కలసి ఉన్నాడు గనుక, నీచస్థితిలో ఉన్నాడు గనుక, వివాదాస్పదమైన ఈ సంఘటన జరిగింది. చూచారా ఎంత కరెక్ట్ గా ఉంటాయో గ్రహప్రభావాలు?

గురుశిష్యులిద్దరివీ జాతకాలు మనకు తెలియవు. కనుక ప్రశ్నశాస్త్ర సహాయం తీసుకుందాం.

ప్రశ్న సమయం: 21 సెప్టెంబర్ 2021; ఉదయం 9. 42 గంటలు; హైదరాబాద్;

తులా లగ్నాధిపతి శుక్రుడు లగ్నంలోనే ఉన్నాడు కనుక లగ్నబలం ఉన్నది. ఆత్మహత్య కాదు. లగ్నానికి పాపార్గళం పట్టి ఉన్నది. ద్వాదశంలో రవికుజ ఉచ్చబుధులున్నారు. రవికుజులు దగ్గరగా ఉన్నారు. రవి ఏకాదశాధిపతిగా గుప్తశత్రువులను సూచిస్తాడు. అంటే, తనవారిగా నటిస్తూ తనకే గోతులు త్రవ్వెవారన్నమాట. బుధుడు అతితెలివిని సూచిస్తున్నాడు. రవి అధికారులను సూచిస్తున్నాడు. ద్వాదశం రహస్య కుట్రలను సూచిస్తున్నది. అంటే, పక్కలో బల్లాల్లాంటి, తెలివైన, అధికారం చేతిలో ఉన్న, శత్రువులని అర్ధం. ద్వితీయంలోని ఉచ్ఛకేతువు మళ్ళీ  కుజుని సూచిస్తూ, తన కుటుంబంలోనే ఉన్న బలమైన శత్రువుల వైపు వేలెత్తి  చూపిస్తున్నాడు. ఇది ధనస్థానం కావడంతో, లక్షలాది రూపాయల ఫండ్స్ దుర్వినియోగం కన్పిస్తున్నది. ఈ  ఇద్దరి మధ్యనా మహంత్ నరేంద్ర గిరి నలిగిపోయాడని గ్రహాలు చూపిస్తున్నాయి.

చతుర్దంలో ఉన్న వక్ర నీచ గురువు, వక్రశనుల వల్ల, ఇంటిపోరు, కుట్రలు, కుతంత్రాలు సూచితం అవుతున్నాయి. సాటి సాధువులు, ఆశ్రమ అధికారుల పాత్ర స్పష్టంగా కన్పిస్తున్నది. వారు వక్రించి తృతీయమైన ధనుస్సులోకి  రావడం, ఆయుస్సు దెబ్బతింటుందని సూచిస్తున్నది. గురువు మకరంలోకి వచ్చాకనే ఇది జరిగింది. గురువు షష్ఠాధిపతిగా, శత్రువైన మరొక మతగురువుకు సూచకుడు.

మనఃకారకుడైన చంద్రుడు షష్ఠంలో ఉంటూ, శత్రువుల కుట్రను సూచిస్తున్నాడు. ఈయన దశమాధిపతి కావడం వల్ల, ఆశ్రమంలో ఆధిపత్య పోరు ఈ మరణానికి కారణమని తెలుస్తున్నది.

అష్టమంలో ఉన్న ఉచ్చరాహువు కుట్రలకు, కుతంత్రాలకు, నాశనానికి సూచకుడు. ఈయన పంచమదృష్టి ద్వాదశంలో ఉన్న మూడు గ్రహాలపైన పడుతున్నది. కనుక, ఇదంతా పెద్ద కుట్ర అన్న విషయం స్పష్టంగా కన్పిస్తున్నది.

సప్తమంలో 20 డిగ్రీలలో ఉన్న యురేనస్, లగ్న డిగ్రీలైన 24 ను చాలా దగ్గరగా వీక్షిస్తూ, ఇది బలవన్మరణమని, హత్యేనని స్పష్టంగా సూచిస్తున్నాడు.

తృతీయంలో  పాపగ్రహాలు లేవుగాని, తృతీయానికి పాపార్గళం పట్టింది. కనుక జైమిని మహర్షి సూత్రం మళ్ళీ నిజమైంది. ఉరే మరణానికి కారణమైంది. అయితే, అది తను పోసుకున్నదా, పోయబడిందా అంటే, రెండోదే నిజమని అనిపిస్తున్నది.

నవాంశ చక్రాన్ని రాశితుల్య నవాంశ విధానంలో పరిశీలిద్దాము. రాశిలగ్నాత్ సప్తమంలో ఉన్న భయంకరమైన శపితయోగం వల్ల, మరణం తప్పదని తెలుస్తున్నది. రాశిలగ్నాన్ని కొట్టిన రాహుకేతువుల వల్ల హత్య అని గ్రహాలు చెబుతున్నాయి. దశమాధిపతి అయిన చంద్రునిపై సంచరిస్తున్న ఉచ్చ శుక్ర కుజులవల్ల, శిష్యులలో అమ్మాయిల గొడవలు, అనైతిక ప్రవర్తనలు ఉన్నాయని తెలుస్తున్నది.

ప్రశ్నదశ, శని-బుధ-కేతువుల దశ అయింది. శని వల్ల, ఆశ్రమంలో కుట్రలు, బుధుని వల్ల మతపరమైన లుకలుకలు, అతితెలివి కుట్రలు, కేతువు వల్ల ఇంటిలో (ఆశ్రమంలో) ఫండ్స్ దుర్వినియోగం స్పష్టంగా కన్పిస్తున్నాయి.

ఎలాంటి గొడవలకైనా  డబ్బు, అధికారం, అమ్మాయిలు ఈ మూడే కారణాలవుతాయి. అది కుటుంబమైనా, ఆశ్రమమైనా, దేశాలైనా ఇంకేదైనా సరే, ఈ సూత్రం మాత్రం మారదు. ఇది నేటిది  కాదు, మానవజాతి పుట్టిననాటినుండీ నడుస్తున్న చరిత్ర. ఈ చరిత్ర కూడా అదే. కామకాంచనాలకు ఎవరూ అతీతులు కారు, వారు దేవతలైనా సరే. ఒకవేళ అయ్యారంటే, వారు దేవతలకంటే అధికులే.

ఇంతకీ అసలు ప్రశ్నకు జవాబు చెప్పలేదేమంటారా? ఏంటా అసలు ప్రశ్న? ఈయనది హత్యా ఆత్మహత్యా అనేగా? చెప్పేశాను. మీకే అర్ధం కావడం లేదు.  ఇంత చెప్పాక కూడా ఇంకా చెప్పమంటే, ఇంకెంత చెప్పినా మీకర్ధం కాదని అర్ధం !

ఉంటా మరి !