Love the country you live in OR Live in the country you love

3, జూన్ 2021, గురువారం

శ్రీలంక తీరంలో మునిగిన ఓడ - జ్యోతిష్యం ఏమంటోంది?

20-5-2021 న 'X-Press Pearl' అనే సరుకుల ఓడ శ్రీలంక తీరంలో తగలబడిపోవడం మొదలుపెట్టింది. దానిలో కొన్ని వేల లీటర్ల నైట్రిక్ యాసిడ్ ఉన్నది. ఓడలో ఉండే నూనె ఎలాగూ ఉన్నది. అప్పటినుంచీ శ్రీలంక నేవీ, భారత కోస్ట్ గార్డ్, రెండూ కలసి విశ్వప్రయత్నం చేసినా ఆ ఓడలోని మంటలను ఆర్పలేకపోయారు. చివరకది నిన్న సముద్రంలో మునిగిపోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు శ్రీలంక వణికిపోతున్నది ఎందుకంటే - అందులో ఉన్న ఆయిలు, నైట్రిక్ యాసిడ్ సముద్రంలో కలిస్తే చేపలన్నీ హరీమంటాయి, బీచ్ లన్నీ విషపూరితం అవుతాయి. అక్కడి ప్రజల జీవనాధారమైన చేపల వ్యాపారం మాయమౌతుంది. జనజీవనం అల్లకల్లోలం అవుతుంది.

గ్రహాలేమంటున్నాయో చెప్పనా?

మామూలుగా శ్రీలంక లగ్నాన్ని కుంభంగా లెక్కిస్తారు జ్యోతిష్కులు. కానీ నేనది సింహమని నమ్ముతాను. దానికి కొన్ని కారణాలున్నాయి.
  • శ్రీలంక  అసలు పేరు సింహళదేశం. అంటే, సింహాలుండే  దేశమని అర్ధం.
  • శ్రీలంక జెండా మీద కత్తిని పట్టుకున్న సింహం ఉంటుంది.
కనుక శ్రీలంక లగ్నం సింహమని నేను విశ్వస్థిస్తాను. అక్కడనుంచి నా విశ్లేషణను చూడండి.
  • మే 20 న చంద్రుడు సింహరాశిలో ఉంటూ, నా లాజిక్ నిజమని చెబుతున్నాడు.
  • 4/10 ఇరుసులో ఉచ్ఛరాహుకేతువులతో సింహానికి అర్గళం పట్టింది. అంటే ఆ దేశానికి మూడిందని అర్ధం.
  • శత్రు రోగ ఋణ స్థానమైన షష్ఠంలో శని ప్లూటో లుంటూ, జలతత్వరాశి అష్టమమూ అయినా మీనాన్ని చూస్తున్నారు. అంటే, మత్స్యసంపద దెబ్బతింటుందని అర్ధం. ప్రస్తుతం ఈ ఓడ మునగడం వల్ల అదే జరగబోతున్నది.
  • శని ప్లూటో లు షష్టాష్టక దృష్టితో సింహచంద్రుడిని చూస్తున్నారు. రాహు శుక్రులను కోణదృష్టితో చూస్తున్నారు. రాహువు రసాయనాలకు, యాసిడ్స్ కు కారకుడని మనకు తెలుసు. శని ఆయిల్ కి సూచకుడు. శుక్రుడు నీటికి సూచకుడు.
  • రాహుశుక్రులు చంద్రునితో కేంద్రదృష్టిలో ఉన్నారు. జలప్రమాదం సూచితం.
  • అన్నింటినీ మించి, చతుర్ధమూ, జలతత్వరాశీ అయినా వృశ్చికంలో కుజుని సూచిస్తూ ఉచ్చ కేతువున్నాడు. దీనివల్ల నీటిలో అగ్ని సూచితమౌతున్నది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా వినని ఈ ఓడ చివరకు నిన్న మునిగిపోవడం మొదలుపెట్టింది. సరిగ్గా నిన్ననే కుజుడు మరొక జలతత్వరాశి అయిన కర్కాటకంలోకి అడుగుపెట్టాడు. అది ద్వాదశమౌతూ నష్టాన్ని సూచిస్తున్నది.

ఈ మొత్తం ప్రహసనంలో ఒక విచిత్రం ఉన్నది. 20 వ తేదీన కుజునిపాత్రను జలతత్వరాశిలోని కేతువు పోషించాడు. నిన్న కుజుడే సముద్రాన్ని సూచించే కర్కాటకంలోకి అడుగుపెట్టాడు. వృశ్చికం, కర్కాటకం రెండూ జలతత్వరాశులే. వినాశనకారకులైన శని ప్లుటోలు చూస్తున్న మీనం కూడా జలతత్వమే. ప్రస్తుతం ఆ ఓడ తనలో ఉన్న 25 టన్నుల నైట్రిక్ యాసిడ్ తో, ఇతర ప్రమాదకర రసాయనాలతో సహా సముద్రంలో మునిగిపోతోంది.

గ్రహప్రభావం ఎంత విచిత్రంగా పనిచేస్తుంది !