“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

3, జూన్ 2021, గురువారం

ఇరాన్ యుద్ధనౌక మునక - నీచకుజుని ప్రభావం

2-6-2021 బుధవారం నాడు ఇరాన్ నేవీలో అతిపెద్ద యుద్ధనౌక 'ఖర్గ్' మంటల్లో చిక్కుకుని గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో మునిగిపోయింది.  తెల్లవారు ఝామున 2. 25 కి మొదలైన ఈ తంతు తెల్లవారి 8. 30 కి ముగిసింది.

విచిత్రంగా, అదే సమయంలో కుజుడు మిధునం నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. అది ఆయనకు నీచస్థానం. అదే సమయంలో ఈ ఓడ కాలిపోయి కూలిపోవడం ఎంత కరెక్టుగా జరిగిందో చూస్తే జ్యోతిశ్శాస్త్ర విద్యార్థులకే కాదు, అందులో లోతుపాతులు తెలిసినవారికి కూడా దిమ్మతిరిగిపోతుంది.

కుజుడంటే యుద్ధమని, అగ్ని యని మనకు తెలుసు. అదే విధంగా, కర్కాటకమంటే నీరని కూడా తెలుసు. ఈ రెంటినీ కలుపుకుని చూడండి ఏం కనిపిస్తుంది? తగలబడిపోతూ నీటిలో మునిగిపోతున్న యుద్ధనౌక కనిపించిందా లేదా?

నా పరిశోధన ప్రకారం మధ్యప్రాచ్యం ధనూరాశిలో ఉంటుంది. కనుక ధనుస్సును లగ్నంగా తీసుకుని చూస్తే, అష్టమం లోకి అంటే, నాశనంలోకి అడుగుపెడుతున్న కుజుడు కన్పిస్తాడు. మునిగిపోతున్న నౌక కనిపిస్తుంది.

గంటగంటకూ దృశ్యం ఎలా మారిందో చూద్దామా?

2.25 AM: కుజుడు మిధునం 29.57 డిగ్రీలో; బుధుడు కర్కాటకం 0.14 డిగ్రీలో.

3.25 AM: కుజుడు మిధునం 29.59 డిగ్రీలో; బుధుడు కర్కాటకం 0.14 డిగ్రీలో.

4.25 AM: కుజుడు మిధునం 00.00 డిగ్రీలో; వక్రబుధుడు కర్కాటకం 0.13 డిగ్రీలో

8.30 AM: కుజుడు మిధునం 00.07 డిగ్రీలో; బుధుడు కర్కాటకం 0.11 డిగ్రీలో, అంటే ఖచ్చితమైన యుతి అన్నమాట. సరిగ్గా అదే సమయానికి, ఓడమునక పూర్తయింది.

ఈ ఓడ పేరు ఖర్గ్. ఇందులోని 'ఖ' అనే అక్షరానికి కుజుడు అధిపతి. లెక్క సరిపోయిందా మరి?

ఇంతకీ, ఈ ఓడ మునిగిపోవడం ప్రమాదమా లేక ఇందులో ఎవరిదైనా హస్తం ఉందా? వెల్ ! అన్నీ చెప్పేస్తే ఎలా? కొన్ని ఎప్పటికీ రహస్యాలుగానే ఉండాలి మరి !