“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

27, జూన్ 2021, ఆదివారం

కెనడాలో బయటపడిన 751 పిల్లల సామూహిక సమాధులు - ప్రభువా నీ యిచ్ఛయే నెరవేరుగాక !

గతనెల 25 వ తేదీన కాంలూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్లో బయటపడిన పిల్లల సమాధుల ఉదంతాన్ని ప్రపంచం మరచిపోకముందే మరొక ఘోరం బయటపడింది. ఈ సారికూడా కెనడాలోనే, మరైవల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో 751 మంది పిల్లల సామూహికసమాధులు బయటపడ్డాయి. ఇది సస్కచ్చవాన్ రాజధానియైన రెజీనా కు 87 మైళ్ళదూరంలో ఉంటుంది. ఈ స్కూలు 1899 నుండి 1997 వరకూ నడిచింది.

ఈ ఘోరం రెండురోజులక్రితం పౌర్ణమి ఘడియలలో బయటపడింది. కెనడాలో దాదాపుగా పదివేల మంది నేటివ్ పిల్లలు ఈ విధంగా గల్లంతైనవాళ్లున్నారు. వీళ్ళందరూ ఈ క్రిస్టియన్ స్కూళ్లలోనే గల్లంతయ్యారు.

అప్పట్లో ఈ పిల్లల్ని బలవంతంగా ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్చుకున్నారు. అక్కడ వాళ్ళ భాష మాట్లాడనిచ్చేవారు కారు. పిల్లలను శారీరకంగా మానసికంగా హింసించేవారు. సెక్స్ నేరాలు కూడా జరిగేవి. బాలికా విద్యార్థులకు క్రైస్తవ సన్యాసుల ద్వారా ఫాదర్ల ద్వారా పుట్టిన పిల్లల శవాలు కూడా ఈ సమాధులలో లభించాయని అంటున్నారు. వినడానికి చాలా బాగుంది కదా !
 
ఇంతకంటే అమానుషం, ఘోరం ఇంకెక్కడా ఉండదు. అయ్యా పోపుగారు ! వినబడుతోందా కనబడుతోందా ? కొంచం మాట్లాడండి ! మానవజాతికి మీ వాళ్ళు చేసిన నేరాలకు, అపరాధాలకు క్షమార్పణ చెప్పి కనీసం మీ పాపాలను ఇప్పుడైనా కొంచం కడుకునే ప్రయత్నం చెయ్యండి.

ఓ ప్రభువా ! స్వర్గంలోలాగా భూమిపైన కూడా నీ యిచ్ఛయే నెరవేరుగాక -  చిన్నపిల్లలపైన కూడా. ఆమెన్ !

ఇప్పుడు జ్యోతిష్యం వైపు కొంచం తొంగి చూద్దాం. గతనెలలో నేను వ్రాసిన పోస్టులో కర్కాటక రాశి కెనడాకు సూచిస్తుందన్నాను. అది నిజమైంది చూడండి మరి !

రెండు రోజుల క్రితం శుక్రుడు అప్పుడే కర్కాటక రాశిలో ప్రవేశించి చావులకు సమాధులకు కారకుడైన ప్లుటోతో ఖచ్చితమైన సమసప్తక దృష్టిలోకి వచ్చాడు. శుక్రుడూ చంద్రుడూ ఇద్దరూ చిన్నపిల్లలను అందులోను ఆడపిల్లలను సూచిస్తారని మనకు తెలుసు. చూడండి మరి శుక్రుడు ప్లుటోతో దృష్టిలోకి రావడంతోనే ఈ సమాధులు బయటపడ్డాయి ! పౌర్ణమి  ఛాయలోనే ఇది జరిగింది. పౌర్ణమి రోజున చంద్రునిపైన సూర్యునివెలుగు పూర్తిగా పడుతుంది. చంద్రుడు వెలుగులోకి వస్తాడు. అలాగే, అదే రోజున, చంద్రుడు సూచించే చిన్నపిల్లల సమాధులు వెలుగులోకి వచ్చాయి. ఇలా ఉంటాయి గ్రహప్రభావాలు !

50 రోజుల ప్రభావం కొనసాగుతోంది !