“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, మార్చి 2020, సోమవారం

పద ఇంటికి....

పనికిరాని మాటల్లో
పలుకులేని తోటల్లో
తిరుగుతావెందుకు  నేస్తం?
పద ఇంటికి

స్నేహమెరుగని  బీడుల్లో
ప్రేమ తెలియని నీడల్లో
వెతుకుతావెందుకు నేస్తం?
పద ఇంటికి

నిన్ననుకోని ఊరికోసం
కన్నుకలపని వారికోసం
విలపిస్తావెందుకు నేస్తం?
పద ఇంటికి

వదిలేసిన ఊరికోసం
వ్యధ నింపిన వారికోసం
ఎదురుచూస్తావెందుకు నేస్తం?
పద ఇంటికి

చదరంగపు పావుకోసం 
తిరిగిరాని నావకోసం
తీరంలో ఎందుకు నేస్తం?
పద ఇంటికి

నీ చేతిని విసిరే వారికోసం
నిన్నెపుడూ కసిరే వారికోసం
ముసురులో బయటెందుకు నేస్తం?
పద ఇంటికి

స్వార్ధం నిండిన మనుషుల కోసం
ఆర్ద్రత తెలియని మనసుల కోసం
ఆశగా ఉన్నావెందుకు నేస్తం?
పద ఇంటికి

ఎండలు మండిపోతుంటే
బండలు భళ్ళున పగుల్తుంటే
వానెలా వస్తుంది నేస్తం?
పద ఇంటికి

ఎడారి ఇసుక భూముల్లో
తడంటూ తెలియని సీమల్లో
గులాబీలెలా వస్తాయి నేస్తం?
పద ఇంటికి

జాడలేని ఉదయం కోసం
తోడురాని హృదయం కోసం
వాడిపోతూ పూస్తావెందుకు నేస్తం?
పద ఇంటికి

పిలుపు వినని వారికోసం
తలచుకోని వారికోసం
మలుపులో ఉన్నావెందుకు నేస్తం?
పద ఇంటికి

శుష్కహృదయాల లోకంలో
సున్నితమైన ప్రేమకోసం
చుట్టూ చూస్తావెందుకు నేస్తం?
పద ఇంటికి

వధ్యశిలపై తలను పెట్టి
కసాయి కత్తిలో కరుణకోసం
బేలగా చూస్తావెందుకు నేస్తం?
పద ఇంటికి