“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

19, మార్చి 2020, గురువారం

జై కరోనా పెద్దమ్మా !

ఈ ప్రపంచానికి కొత్త దేవత
కరోనా మాత !
ఎందుకో తెలుసా నాయనలారా?

ప్రవక్తలొచ్చారు పోయారు
ఎవరూ వాళ్ళ మాట వినలేదు
సంస్కర్తలొచ్చారు పోయారు
ఎవరూ వాళ్ళ గోడు పట్టించుకోలేదు

మతాలు వెలిశాయి
మనిషి వ్యాపారంగా మారాయి
దేవుళ్ళు పుట్టారు
అంగళ్ళలో బొమ్మలయ్యారు

మంచి చెబితే ఎవరూ వినలేదు
పద్ధతులు నేర్పితే ఎవరికీ లెక్కేలేదు
ఒద్దురా బాబూ అంటే ఎవరూ ఆగలేదు
ఇలా ఉండాల్రా అంటే ఎవరూ తల తిప్పలేదు

ఇలా సాగింది ప్రపంచ నాటకం
కళ్ళున్నవాళ్ళు చూశారు చూశారు
ఎంతో బాధ పడ్డారు
దేవుడిని ఇలా ప్రార్దించారు

దునియా సబ్ ఖరాబ్ హోగయా
కుచ్ తో కరోనా....కుచ్ తో కరోనా
దేవుడు చిరునవ్వు నవ్వాడు
అప్పుడొచ్చింది కరోనా మాత !

దేవుడిని నమ్మనివాళ్ళు
అకస్మాత్తుగా మహా భక్తులయ్యారు
నీతి లేదనే వాళ్ళు, హటాత్తుగా
మహా నీతిపరులయ్యారు

పార్టీలు పబ్బాలు అని తిరిగేవాళ్ళు
ఇల్లే కదలడం లేదు
తాగుళ్ళూ తందనాలూ అనేవాళ్ళు
నీళ్ళు కూడా త్రాగడం లేదు

అంటూ సొంటూ లేదనేవాళ్ళు
అరవైసార్లు చేతులు కడుగుతున్నారు
సెంటు చాల్లే స్నానం వద్దు అనేవాళ్ళు
కుంటుకుంటూ స్నానాలు చేస్తున్నారు

అంటరానితనం మహాపాపం అనేవాళ్ళు
అయినవాళ్ళనే తాకడం లేదు
మనుషులంతా ఒక్కటేనని అరిచేవాళ్ళు
మరో మనిషికి ఆరడుగుల్లో ఉంటున్నారు

భాయీ భాయీ అంటూ వాటేసుకునేవాళ్ళు
బాబోయ్ బాబోయ్ అంటూ పారిపోతున్నారు
దగ్గేవాడినీ తుమ్మేవాడినీ వదిలేసి
దిక్కులకొకరు పరిగెత్తుతున్నారు

ప్రేయసీ ప్రియులు దూరంనుంచే
సరసాలు సాగిస్తున్నారు
భార్యాభర్తలు వేర్వేరు మంచాల్లో
నీరసంగా శయనిస్తున్నారు

పోపుని ప్రభువే కాపాడలేదు
తిరుపతి క్యూలో అసలు జనమే లేరు
షిరిడీ చిన్నబోయింది
ఖొమైనీకి కోరింతదగ్గు పట్టుకుంది
పీఠాధిపతులు పీటల కింద దాక్కుంటున్నారు

అల్లా అడ్రసు అసలే లేదు
యెహోవా ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు
ఇండియా దేవుళ్ళందరూ ఇష్టానుసారం పారిపోయారు
కరోనా మాతే ఇప్పుడందరి దేవత !

గుళ్ళూ మసీదులూ చర్చిలూ
అన్నీ అర్జెంటుగా మూతపడ్డాయి
వ్యాపారాలూ వ్యవహారాలూ హరీమన్నాయి
మానవ సంబంధాలన్నీ మనుగడ కోల్పోతున్నాయి

గుళ్ళలో తీర్ధప్రసాదాలు
గుంభనంగా మాయమయ్యాయి
చర్చిల్లో మసీదుల్లో ప్రార్ధనా సమావేశాలు
చల్లచల్లగా సర్దుకున్నాయి

అధికారుల దర్పం పారిపోయింది
ధనికుల డబ్బు పనికిరాకుండా పోయింది
రాజుకీ పేదకీ తేడా ఉన్నట్టుండి మాయమైంది
నిజమైన సమానత్వం రాత్రికి రాత్రే వెల్లివిరిసింది

కరోనాకి రూపం లేదు
అది పెద్ద ప్రవక్త కూడా కాదు
దానికొక ఫిలాసఫీ అంటూ లేదు
అదేమీ టీవీల్లోకొచ్చి ఉపన్యాసాలివ్వదు

కరోనా కులాన్నీ చూడదు మతాన్నీ చూడదు
కుళ్ళురాజకీయాలు దానికసలే తెలీదు
బీదా గొప్పా తారతమ్యమే దానిలో లేదు
రికమెండేషన్ దానితో అసలే పనిచెయ్యదు
గీత దాటితే కోత కోసి వాత పెట్టి
మోత మోగించడం మాత్రమే దానికి తెలుసు

అందుకే అందరూ దానికి దణ్ణం పెట్టి
బుద్ధిగా క్యూలో నించుంటున్నారు
అందరూ మంచివాళ్లయ్యారు
మంచిగా ప్రవర్తిస్తున్నారు

ఎవరూ బోధించకుండానే
శాకాహారులౌతున్నారు
ఎవరూ నేర్పకుండానే
దుబారా తగ్గిస్తున్నారు

అమ్మా బాబూ అంటే ఎవడూ వినడు
కాల్చి వాత పెడితేనే
కళ్ళు తెరుచుకుంటాయి మనిషికి
ఈ మాత్రం తెలీదూ ప్రకృతికి?

కరోనా మాత దెబ్బకి
మూతపడని బిజినెస్ లేదు
దెబ్బతినని ఇల్లు లేదు
తెరుచుకోని కళ్ళూ లేవు

పాతకాలంలో అమ్మ పోసేది
జాతరలు చేసి పొంగళ్ళు ఎత్తేవాళ్ళు
ఇప్పుడు కరోనా పెద్దమ్మ సోకుతుందని
నాటకాలు మానేసి బుద్ధిగా ఉంటున్నారు

ప్రస్తుతం మనందరం ఒకటే చెయ్యాలి
అర్జెంటుగా కరోనా పెద్దమ్మకి గుడి కట్టాలి
ఆమె ఎక్కడికీ పోకుండా మనతోనే ఉండాలి
ప్రపంచ జనాభా మాత్రం సగానికి తగ్గాలి

అప్పుడైనా మనిషి మనిషిగా ఉంటాడేమో?
అప్పుడైనా అవసరానికీ విలాసాలకూ
అంతరం మనిషికి అర్ధమౌతుందేమో?
మంచీ మర్యాదా భయమూ భక్తీ
మానవమృగాలలో అప్పుడైనా మేల్కొంటాయేమో?

కరోనా ఎక్కడికీ పోకూడదు ఇక్కడే ఉండాలి
ప్రతి సీజన్ లోనూ మనల్ని ఇలాగే కరుణిస్తూ
దారి తప్పుతున్న వాళ్ళని ఇలాగే కాటేస్తూ
విచ్చలవిడి తనాన్ని ఎక్కడికక్కడ కబళిస్తూ

కరోనా కాళిక అవతారం
జరగాలి మానవ సంహారం
తగ్గాలి అనవసర భూభారం
అప్పుడే జరుగుతుంది
మనిషి మనిషికీ ప్రకృతికీ చేస్తున్న
తప్పులకు పరిహారం