“The gates of the winehouse are wide open. Come ye all who want to enjoy a good drink”

30, మార్చి 2020, సోమవారం

ఏవో అతీత లోకాలు ....

ఏవో అతీతలోకాలు
నన్ను పిలుస్తున్నాయి
ఏవో అదృశ్యహస్తాలు
నన్ను కలుస్తున్నాయి

పొద్దున్నే తాకే నీరెండ
ముద్దు ముద్దుగా పలకరిస్తుంది
మండించే మధ్యాన్నపుటెండ
మనోజ్ఞంగా అనిపిస్తుంది

చలచల్లని పిల్లగాలి
అమాయకంగా ఆదరిస్తుంది
ఈడ్చికొట్టే వేడిగాడ్పు
అలౌకికపు ఆనందాన్నిస్తుంది

పొద్దున్నే నిద్రలేచే
తోటలోని ప్రకృతికన్య
ముగ్దమనోహరంగా చూచి
మురిపెంగా నవ్వుతుంది

మండించే మధ్యాహ్నం
మాయలన్నీ మాయం చేసి
మహస్సును మనస్సులోకి
మౌనంగా దింపుతుంది

సాయంత్రపు నీడలలో
సరసాల సంధ్యాసుందరి
మరచిపోయావా అంటూ
చేతులు సాచి పిలుస్తుంది

అర్ధరాత్రి నిశ్శబ్దం
ఆర్ణవంలా ఆవరించి
అగాధపు ఔన్నత్యాన్ని
అడ్డులేకుండా అందిస్తుంది

చూడలిగితే
ప్రతిక్షణమూ ప్రత్యేకమే
పాడగలిగితే
ప్రతిరాగమూ అతీతమే

అందరూ ఉన్న ఆర్భాటం
అనవసరపు ఆనందాన్నిస్తే
ఎవరూ లేని ఏకాంతం
ఎల్లలు లేని వెల్లువనిస్తుంది

ప్రేయసి ఎదురుగా ఉన్నా
ఆపలేని ఆనందమే
అందరాని సీమల్లో ఊహైనా
మాటరాని మనోజ్ఞమే

ఎవరన్నారు?
అన్నీ ఉంటేనే ఆనందమని
నేనంటున్నా
అది తెలివిలేని ఆలోచనని

ఏదీ నీతో లేకున్నా
ఎవరూ నీతో రాకున్నా
నీ మనసే ఒక స్వర్గమని
నీ ఉనికే ఒక మోక్షమని

చూచే చూపుంటే
స్వర్గమే నీ చుట్టూ కనిపిస్తుంది
తలచే మనసుంటే
దేవతే నీకోసం దిగి వస్తుంది....