“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

29, ఫిబ్రవరి 2020, శనివారం

Siddhi Day (29-2-1956)

అరవిందుల యోగమార్గంలో ఫిబ్రవరి 29 కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ తేదీ నాలుగేళ్ళకు ఒకసారి లీప్ ఇయర్ లో మాత్రమే వస్తుంది. అరవిందులు, మదర్ ఇద్దరూ అంతకుముందు దాదాపు 40 ఏళ్ళనుంచీ సాధించాలని ప్రయత్నించిన Supramental Descent అనేది 1956 వ సంవత్సరంలో ఇదేరోజున జరిగిందని వారి భక్తులు, అరవిందుల యోగావలంబులు నమ్ముతారు. జరిగిందో లేదో ఎవరికీ తెలీదు. కానీ మదర్ చెప్పారని అందరూ నమ్ముతున్నారు. అంతే !

Super Mind అనేది నేలమీదకు దిగి వస్తే ఏం జరుగుతుంది? అసలు Super Mind అంటే ఏమిటి? అంటే - అరవింద సాహిత్యంలో దీనికి చాలా వివరణలున్నాయి. అరవిందులు, మదర్ ఇద్దరూ దీనిమీద చాలా మాట్లాడారు. వ్రాశారు.

Super Mind అంటే, చీకటితో నిండిన మనిషి మనసుకీ, వెలుగుతో నిండిన దైవానికీ మధ్యలో ఉండే దివ్యమనస్సు. అదికూడా వెలుగుతో నిండి ఉంటుంది. సత్యస్వరూపమైన దైవం భూమిమీదకు దిగి రావాలంటే ముందుగా వెలుగుతో కూడిన ఈ సూపర్ మైండ్ అనేది ఇక్కడకు రావాలి. అప్పుడు దైవం రావడానికి సరియైన పునాది ఈ భూమ్మీద పడుతుందని వారు అనేవారు. దానికోసం వారిద్దరూ వారి జీవితమంతా ప్రయత్నించారు.

ఇది భూవాతావరణంలోకి దిగి వస్తే, మనిషి జీవితం పశుస్థాయి నుంచి దివ్యత్వస్థాయికి అతిత్వరగా ఎదుగుతుంది. అప్పుడు భూమిమీద పేదరికం, అసమానత్వం, దుఖం, బాధలు, ఏడుపులు, లేమి, రోగం, మరణం అన్నీ మాయమైపోతాయని వారు భావించారు. అవన్నీ అదేరోజున మాయం కాకపోయినా, Supramental descent ప్రభావం వల్ల క్రమేణా ఇవన్నీ భూమినుంచి తుడిచిపెట్టుకుని పోతాయనీ, కొన్నాళ్ళకు భూమి స్వర్గంగా మారుతుందనీ, ఎక్కడా ఎవరికీ ఏ బాధలూ ఉండవనీ, వారు భావించారు. అయితే ఇది పూర్తిగా జరగడానికి ఎన్నేళ్ళు పడుతుందో మాత్రం వారు ఖచ్చితంగా చెప్పలేదు. కొంతమంది అంతరంగ శిష్యులు చెప్పినదాని ప్రకారం, ఇది జరగడానికి దాదాపుగా 300 ఏళ్ళు పడుతుందని వారన్నారు.

ఒక సందర్భంలో M. P. Pandit గారు తన ఉపన్యాసంలో ఇలా చెప్పారు.

'ఒకరోజున మదర్ ఇలా అడిగారు.

'సూపర్ మైండ్ భూమికి దిగి వచ్చిన తర్వాత భూమి మొత్తం దివ్యత్వంతో నింపబడటానికి ఎంతకాలం పట్టవచ్చు?'

దానికి అరవిందులు ఇలా అన్నారు.

'బహుశా 300 ఏళ్ళు పట్టవచ్చు'

భూవాతావరణంలోకి దానిని దించే ముందుగా, తమతమ శరీరాలలోకి దీనిని దించాలని వారు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో, తన మనస్సులోకి దీనిని దించడంలో అరవిందులు సఫలమైనా, శరీరకణాల స్థాయికి దీన్ని తేవడంలో ఆయన విఫలమయ్యారు. ఈ ప్రక్రియను మదర్ కొంతవరకూ సాధించారని అంటారు. శరీరకణాలను కూడా దైవీకరించే ప్రక్రియలో ఆమె చాలావరకూ విజయం సాధించారని, కాంతి శరీరాన్ని ఆమె కొంతవరకూ పొందారని, వారి భక్తులు భావిస్తారు. ఆమె వేసుకున్న సాక్స్ ను తొలగిస్తే ఆమెకు పాదాలు లేవనీ వాటి స్థానంలో కాంతి మాత్రమే ఉందనీ ఆమెను చివరిదశలో చూచినవారు చెప్పారని మొన్న పాండిచేరిలో మూర్తిగారు నాతో అన్నారు. ఇందులో నిజానిజాలు మనకు తెలియదు. ఎందుకంటే, గోరంతలను కొండంతలు చెయ్యడం భక్తులకు చాలా సరదాగా ఉంటుంది. "అదుగో పులి అంటే, ఇదుగో తోక" అంటారు భక్తులు. ఎవరి భక్తులైనా ఇంతే. కానీ అందులో ఎంత నిజం ఉందో మనం చెప్పలేం.

నిండునూరేళ్ళు దాటినా మదర్ బ్రతుకుతారనీ, భూమ్మీద స్వర్గాన్ని ఆవిష్కరిస్తారనీ అందరూ నమ్మారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ మదర్ 94 ఏళ్ళ వరకూ బ్రతికారు. ఇంకేముంది ఆరేళ్ళే కదా, నూరేళ్ళను పూర్తి చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ వారి ఆశలను మధ్యలోనే త్రుంచేస్తూ మదర్ 1973 లో తన 94 వ ఏట చనిపోయారు. Supramental Descent అనేది నిజంగా జరిగిందో లేదో ఎవరికీ తెలీని మిస్టరీగా మిగిలిపోయింది.

నూరేళ్ళు బ్రతకడం అనేది దివ్యత్వానికి కొలబద్ద కాదు. నూరేళ్ళు బ్రతికిన వాళ్ళు ఎందఱో ఈ భూమ్మీద ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి మంచి జీన్స్ వస్తే, మనం జాగ్రత్తగా ఆహారనియమాలు పాటిస్తూ ఉంటె, నూరేళ్ళు బ్రతకవచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ శరీరం మొత్తం దివ్యత్వంతో నిండటం, భౌతిక శరీరకణాలు కూడా కాంతితో శక్తిలో ఆనందంతో నింపబడటం అనే ప్రక్రియను వారు సాధించాలని చూచారు. దానికి Supramental Descent అవసరం అని వారన్నారు. అది భూవాతావరణంలో 29-2-1956 న జరిగిందని మదర్ అన్నారు.

వారు చెప్పినట్టుగా 1956 లోనే ఈ అద్భుతం జరిగి ఉన్నట్లయితే, మరి అప్పటికీ నేటికి, 64 ఏళ్ళు గడిచాయి. ఈనాటికీ మనిషి జీవితంలో అప్పటికంటే పెద్దగా మార్పేమీ రాలేదు. ఇంకా చెప్పాలంటే, అప్పటికంటే ఇప్పుడు నేరాలు పెరిగాయి, ఘోరాలు పెరిగాయి, అవినీతి పెరిగింది, నల్లధనం పెరిగింది, మోసాలు పెరిగాయి, తాగుళ్లు, తందనాలు, రేపులు, హత్యలు పెరిగాయి, మనిషికీ మనిషికీ అంతరం పెరిగింది. అసమానతలు విపరీతంగా పెరిగాయి, మతాల మధ్యన ద్వేషం పెరిగింది. అసహనం పెరిగింది. రోగాలు పెరిగాయి. చెడు అనేది అన్ని రకాలుగా విపరీతంగా పెరిగింది. మరి Super Mind భూమిమీదకు వచ్చినట్లా? రానట్లా? అని నన్నడిగితే రాలేదనే అంటాను. వచ్చినా అది మనలో ఇంకలేదనీ అంటాను.

మరి సూపర్ మైండ్ రాకపోతే, మదర్ 29-2-1956 న ఎందుకలా చెప్పారు? అది అబద్దమా? ఆమె అబద్దం ఎందుకు చెబుతారు? ఆ అవసరం ఆమెకు ఏముంది? లేక అదంతా ఆమె భ్రమా? అంటే, ఆమె భ్రమలకు అతీతురాలు కాలేదా? కాకపోతే ఆమెను అవతారంగా ఎందుకు పూజిస్తున్నారు? ఏమో? ఎవ్వరికీ తెలీదు. ఇవన్నీ జవాబులు లేని ప్రశ్నలే. ఏదేమైనప్పటికీ అరవిందులు, మదర్ చెప్పిన "మానవశరీరం దైవీకరించబడటం" అనే ప్రక్రియ మాత్రం ఇంతవరకూ ఎవ్వరిలోనూ జరగలేదు. ఇకముందు జరుగుతుందో లేదో ఎవరికీ తెలీదు. ఎవరికి తోచిన వివరణలు వారిస్తున్నారు. దానిని రకరకాలుగా సమర్ధించుకుంటున్నారు. కానీ, అందరినీ అయోమయంలో వదిలేసి వాళ్ళిద్దరూ మాత్రం వెళ్ళిపోయారు. వారి భక్తులు మాత్రం వారిని అవతారాలని పూజిస్తున్నారు. ప్రపంచం యధావిధిగా నడుస్తోంది !

కానీ ఈ 64 ఏళ్ళలో చాలా మార్పులు జరిగాయి. మొదట్లో టెలిగ్రాఫ్ ఉండేది, తర్వాత టెలిఫోన్ వచ్చింది, ఆ తర్వాత టెలివిజన్ వచ్చింది, కంప్యూటర్ వచ్చింది, మొబైల్ వచ్చింది, సోషల్ నెట్ వర్క్ వచ్చింది. ప్రపంచం ఒక చిన్న ఊరై పోయింది. చైనా తుమ్మితే భూమి మొత్తానికీ జలుబు చేస్తోంది. ఇండియాలో టెంపరేచర్ పెరిగితే భూమి మొత్తానికీ జ్వరం వస్తోంది. దేశాల మధ్యనా, మనుషుల మధ్యనా దూరాలు తగ్గిపోయాయి. కానీ ఒకే ఇంట్లో ఉండే మనుషుల మధ్యన దూరాలు పెరిగిపోయాయి. ఇండియాలో కూచుని అమెరికాలో ఉన్నవాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నారు, కానీ ఇండియాలో అదే ఇంట్లో ఒకరితో ఇంకొకరు మాట్లాడుకోవడం లేదు. వేరేవేరే రూముల్లో కూచుని ఎవరెవరితోనో ఫోన్లు మాట్లాడుకుంటున్నారు.

ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకే పక్కమీద పడుకుని ఉన్న భార్యాభర్తలు వారివారి ఫోన్స్ లో వేరేవేరే వారితో వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారు గాని ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు.

అంటే, సైన్స్ పెరిగింది, విలాసాలు పెరిగాయి, సరదాలు పెరిగాయి, సుఖాలు పెరిగాయి, భౌతికంగా దూరాలు తగ్గాయి, కానీ మానసికంగా దూరాలు పెరిగాయి. మనుషులు ఇంకాఇంకా దిగజారుతున్నారు, మనసులు ఇంకాఇంకా దిగజారుతున్నాయి. మరి మనిషిని దైవత్వానికి దగ్గర చేసే సూపర్ మైండ్ మన మధ్యకు వచ్చినట్లా రానట్లా?

అసలా రోజున గ్రహాల పరంగా ఏం జరిగిందో చూద్దాం.

ఆ రోజుకు ఉన్న గ్రహస్థితి ఇది. ఇది భూమి మొత్తానికీ వర్తించే సంఘటన గనుక లగ్నాన్ని లెక్కలోకి తీసుకోనక్కరలేదు. గ్రహాల స్థితులను మాత్రమే గమనిద్దాం.

శుక్రుడు, గురువు ఉచ్చస్థితిలో ఉన్నారు. వీరిలో శుక్రుడు డైరెక్ట్ గా ఉంటే, వక్రత్వం వల్ల గురువు కూడా ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. వారిద్దరి మధ్యనా కోణదృష్టి ఉన్నది. రాహుకేతువులు నీచస్థితిలో ఉన్నారు. నీచరాహువుతో కూడిన శపితయోగం కనిపిస్తోంది. నవాంశలో కూడా రాహుకేతువులు నీచలోనే ఉన్నారు. అయితే రాశులు మారారు. శుక్రుడు నవాంశలో కూడా ఉచ్చస్థితిలోనే ఉన్నాడు. వక్రగురువు స్వస్థానంలోకి వచ్చి శుక్రునితో కలిశాడు. శనిచంద్రులు కన్యారాశిలో కలిశారు. అయితే, రాహుకేతువులకిద్దరికీ నీచభంగం అయింది. ఎలా? వృశ్చికరాశినాధుడైన కుజుడు చంద్రుని నుంచి చతుర్ధకేంద్రంలో ఉన్నాడు. అలా రాహువుకి నీచత్వం పోయింది. వృషభరాశినాధుడైన శుక్రుడు చంద్రుని నుంచి సప్తమకేంద్రంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అలా శుక్రునికి నీచత్వం పోయింది.

ఇకపోతే, ఈ గ్రహాల పరిస్థితి మొత్తంలో ఒక విచిత్రమైన అమరిక ఉన్నది. అదేంటంటే - ఉచ్చగురుదృష్టి రాహుశనుల మీద ఉంది. వారి దృష్టి ఉచ్చశుక్రునిమీద ఉంది. ఆ శుక్రునిదృష్టి మళ్ళీ గురువుమీద ఉంది. అంతేకాకుండా, ఉచ్చగురువు, నీచరాహువు, ఉచ్చశుక్రుల దృష్టి చంద్రునిమీద ఉంది. ఈ గ్రహాలన్నీ ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటూ ఒక energy field ని సృష్టిస్తున్నాయి. అంటే ఆ రోజున ఒక అతీతమైన వెలుగు, శక్తి మానవమనస్సు మీద ప్రతిఫలించాయని అర్ధం. బహుశా మదర్ చెప్పిన సూపర్ మైండ్ అవతరణ అంటే ఇదేనేమో !

అయితే మరి, భూవాతావరణం ఎందుకు బాగవలేదు? భూమి స్వర్గంగా ఎందుకు మారలేదు? అంటే, మనం ఇలా అనుకోవచ్చు. భూమి దివ్యత్వాన్ని సంతరించుకునే ప్రాసెస్ ఆ రోజున మొదలైంది. అంతేగాని, తెల్లారేసరికి మనుషులందరూ దేవతలుగా మారిపోరు. కనీసం అలా మారాలని ప్రయత్నించేవారికి ఒక చానల్ ఆరోజు నుంచీ అందుబాటులోకి వచ్చింది. ఎంతవరకు ఆ వెలుగును మనం అందుకుంటాం? అన్నదాన్ని బట్టి మనం దేవతలుగా మారుతామా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. మన ప్రయత్నం లేకుండా దానంతట ఏదీ భౌతికప్రపంచంలోనే జరగదు. ఇక ఆధ్యాత్మిక లోకంలో ఎలా జరుగుతుంది?

ఈ భావనని సూచిస్తూ, రాహుకేతువుల నీచస్థితీ, శపితయోగమూ ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అంటే, మనిష్టప్రకారం మనం అన్ని వెధవపనులూ చేస్తూ కూచుంటే, సూపర్ మైండ్ వచ్చి మనకన్నీ చేసిపెట్టదు. దానిని అందుకోవడానికీ, మనల్ని భౌతికపరిధిలో పట్టి ఉంచుతున్న రాహుకేతువులు + శనీశ్వరుల శాపాన్ని తొలగించుకోవడానికి మనం చాలా కష్టపడాలి. అప్పుడే ఈ నీచత్వం పోతుంది. దేవగురువైన బృహస్పతీ, రాక్షసగురువైన శుక్రుడూ తమతమ ఉచ్చస్థితులలో కలసి, ఈ శాపాన్ని మార్చి, మానవమనస్సుపైన తమ శక్తిని ప్రసరింపజేసినప్పుడే ఈ అద్భుతం జరుగుతుందన్న సూచన ఈ గ్రహాల అమరికలో దాగుంది.

కనుక మదర్ చెప్పినది నిజమే కావచ్చు. సూపర్ మైండ్ అనేది ఆ రోజున భూమిమీదకు దిగి ఉండవచ్చు. దానిని అందుకోవడం మన వంతు. ఎంతగా మనం దానిని స్వీకరించి మనలో ఒక భాగంగా దానిని మార్చుకోగలిగితే అంతగా మనలో దివ్యత్వం వికసిస్తుంది. అందుకు సాధన అవసరం.

మనం దేవతలుగా మారాలా లేదా రాక్షసులుగా దిగజారాలా అన్నది మన చేతిలో ఉంది. ఏం చెయ్యాలి అన్నది మనిష్టం ! కానీ దేవతలుగా మారాలంటే మాత్రం, దానికి కావలసిన దారి ఆరోజున ప్రకృతిలో ఏర్పడింది. అది ఇప్పటికీ మన ఎదురుగా సిద్ధంగానే ఉంది. అందుకోవడం మన వంతు !

పోయినసారి ఈ తేదీ 29-2-2016 న వచ్చింది. మళ్ళీ నాలుగేళ్ల తర్వాత ఇప్పుడొచ్చింది. అయితే, తిధుల ప్రకారం చూస్తె, ఈరోజు మాఘ బహుళ చతుర్ధి అయింది. అది ఫిబ్రవరి 12 నే అయిపోయింది. తేదీల ప్రకారమైనా, తిధుల ప్రకారమైనా, మొత్తమ్మీద ఇదొక ప్రత్యేకమైన రోజు అనేది మాత్రం నిస్సందేహం !

ఆ సూపర్ మైండ్ ను అందుకోవడానికి, ఆ వెలుగుదారిలో నడవడానికి మనంకూడా ప్రయత్నిద్దాం ! అంతకంటే మనం మాత్రం ఏం చెయ్యగలం గనుక??