The secret of spiritual life lies in living it every minute of your life

6, ఫిబ్రవరి 2020, గురువారం

పాండిచేరి, ఆరోవిల్ యాత్ర - 3 (నాకోసం వంగిన ఆకాశం)

సాయంత్రం ఏడు ప్రాంతంలో బయలుదేరి బీచ్ కి వెళ్లాను. ఆశ్రమానికి రెండు లైన్ల అవతలే బీచ్ ఉంటుంది. బీచ్ లోనే పాండిచేరి సెక్రటేరియట్ ఉంది. బీచ్ పెద్ద గొప్పగా ఏమీ లేదుగాని, సెక్రటేరియట్ ముందే ఉండటంతో, కొంచం బాగానే దాని బాగోగులు చూస్తున్నారు. యధావిధిగా అక్కడక్కడా గుంపులు గుంపులుగా జనమూ లవర్లూ కూచుని ఏదేదో మాట్లాడుకుంటూ కనిపించారు. వాళ్ళలో కొన్ని గుంపులు తెలుగువారివి కూడా ఉన్నాయి. ఎందుకంటే పెద్దపెద్దగా తెలుగులో మాట్లాడుకుంటున్నారు గనుక.

చీకటి పడింది. కానీ బీచ్ ఒడ్డునే ఉన్న ఇళ్ళ లైట్లు పడి కొంచం కాంతీ కొంచం చీకటీ కలగలిసి సంధ్యాసమయాన్ని గుర్తుకు తెస్తున్నాయి. అక్కడే ఒకవైపుగా ఇసుకలో కూచున్నాను.

అరవిందులు 1910 లో ఇక్కడకు వచ్చారు. అప్పటికే ఆలీపూరు బాంబు కేసులో ఆయన జైలు శిక్ష అనుభవించి ఉన్నారు. అరవిందులు తీవ్రవాది. స్వాతంత్ర్యం కోసం ఆయుధాలు చేతబట్టి బ్రిటిషు వారితో పోరాడాలని భావించిన తీవ్రవాదులకు ఆయన నాయకుడు. చిన్నప్పటినుంచీ ఇంగ్లండు లో ఉంటూ చదువుకున్నవాడు. ఆలీపూరు బాంబు కేసులో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే, జైలులోనే, ఆయనకు ఆధ్యాత్మిక ద్వారాలు తెరుచుకున్నాయి. వివేకానందస్వామి స్వరాన్ని ఆయన జైలులో విన్నారు. ఆ స్వరం - యోగసాదనలో మెట్లను ఆయనకు నేర్పించింది. Overmind అనే స్థాయికి ఎలా చేరాలో వివేకానందస్వామి స్వరమే తనకు బోధించిందని అరవిందులు చాలాసార్లు అనేవారు. ఆలీపూర్ జైల్లోనే అరవిందులకు కృష్ణదర్శనం కలిగింది.

వివేకానందులు 1902 లో దేహాన్ని వదిలేశారు. వైస్రాయిని చంపాలని ప్రయత్నించిన ఆలీపూర్ బాంబ్ కేసులో 1909 లో అరవిందులు జైల్లో ఉన్నారు. అంటే, తను చనిపోయిన ఏడేళ్ళ తర్వాత వివేకానందస్వామి తన సూక్ష్మస్వరంతో అరవిందులకు మార్గదర్శనం చేశారు. జైల్లోంచి బయటకొచ్చిన అరవిందులు మళ్ళీ తీవ్రవాద కార్యక్రమాలలో మునిగారు. ఇది బ్రిటిషు ప్రభుత్వానికి నచ్చలేదు. మళ్ళీ అరెస్టునుంచి తప్పించుకోవడం కోసం అరవిందులు పారిపోయి, ఫ్రెంచ్ పాలనలో ఉన్న పాండిచేరికి ఓడలో వచ్చేశారు. అక్కడ తలదాచుకున్నారు. 1910 నుంచి 1950 వరకూ అక్కడే ఉన్నారు. 1950 లో ఆయన చనిపోయారు.

బీచ్ లో కూచుని ఉన్న నాకు - 'అరవిందులు కలకత్తానుంచి ఓడలో పారిపోయి ఇక్కడకు వచ్చినపుడు ఇదే బీచ్ లో దిగారేమో? లేదా ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదో రేవులో దిగారేమో?' అనిపించింది. సముద్రంలోకి చూచాను. దూరంగా ఏదో ఓడ ఆగి ఉన్నట్లు లైట్ కనిపించింది. అది ఓడో లేక లైట్ హౌసో అర్ధం కాలేదు.

రకరకాల ఆలోచనలతో కాసేపు ఆ బీచ్ లో అలా కూచున్నాను. క్రమేణా ఆలోచనలు ఆగిపోయాయి.

చీకట్లో ఆకాశంలోకి చూస్తున్న నాకు - మేఘాలతో నిండిన ఆకాశం ఒక్కసారిగా వంగి నా తలను స్ప్రుశించినట్లు అనిపించింది. అది నా ఊహ కాదు. ఎందుకంటే నేనే ఊహనూ ఆసమయంలో చెయ్యడం లేదు. సడన్ గా ఈ విచిత్రమైన అనుభూతి కలిగింది. ఎవరైనా పెద్దవారి పాదాలను తాకాలని మనం వంగినప్పుడు, వారు కూడా వంగి మనల్ని లేవనెత్తుతారు కదా ! ఆకాశం మొత్తం ఒక మనిషిలా క్రిందకు వంగి నా తలను తాకిన ఫీలింగ్ ఒక్కసారిగా కలిగి ఒళ్ళు జలదరించింది.

చుట్టూ చూచాను. చుట్టూ గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్న జనాల ఆరాలు పరమ దరిద్రంగా అనిపించాయి. అందరూ ఏదేదో లౌకిక విషయాల గురించే మాట్లాడుకుంటున్నారు గాని ఒక్కడి మనస్సూ ఉన్నతమైన స్థాయిలో లేదు. ఏ ఒక్కడూ ధ్యానస్థితిలో లేడు.

ఎక్కడైనా మనుషులింతే ! గుళ్ళోకి కూడా చేపల మార్కెట్ ని తోడు తీసికెళతారు. ఇలాంటి ప్రదేశంలో కూడా ఇలాంటి చెత్త వాగుడులో కాలం గడుపుతున్న మనుషుల మధ్యన కూచోవాలని అనిపించలేదు.

లేచి గెస్ట్ హౌస్ కి దారి తీశాను. ఎదురుగా ఉన్న ఒక చిన్న హోటల్లో రెండు ఇడ్లీ తిని, రూమ్ కి చేరి బెడ్ పైన వాలాను.

బీచ్ లో కలిగిన అనుభవం తలచుకుంటే సంతోషం వేసింది. పూర్ణయోగంలో ఇలాంటి అనుభవాలు కలగడం సహజమేనని నాకు తెలుసు. ఈ అనుభవం అర్ధం ఏమిటో కూడా నాకు తెలుసు. దానిని తలచుకుంటే చాలు మళ్ళీ అదే అనుభూతి కలుగుతోంది. అరవిందుల అనుగ్రహంగా దీనిని భావించాను.

అదెప్పటికీ నా గుండెలలో భద్రంగా ఉంటుంది.

'రేపు ఆరోవిల్ కి వెళ్ళాలి' - అనుకుంటూ నిద్రకు ఉపక్రమించాను.

(ఇంకా ఉంది)