“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, ఫిబ్రవరి 2020, శుక్రవారం

Garj Baras Pyasi Dharti Par - Jagjit Singh


బ్లాగులో నా పాటల్ని పోస్ట్ చేసి చాలా కాలమైంది. కానీ నేను పాటలు పాడుతూనే ఉన్నాను. అది నాకొక వ్యాపకం. నాకు తెలిసి నాకు అయిదారేళ్ళ వయసు నుంచే నేను కూనిరాగాలు తీస్తూ ఉండేవాడిని. అందుకని, సంగీతం నా రక్తంలోనే ఉందని నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను. అయితే, ఆ సంగీతానికి పునాది ఆధ్యాత్మికత కావడంతో సంగీతం నా సాధన కెప్పుడూ ఆటంకం కాలేదు. పైగా ఎంతో దోహదకారి అయింది.

మంచి సంగీతం శ్రీ రామకృష్ణులను సమాధిస్థితిలోకి తీసుకుపోయేది. నిజమైన సంగీతం యొక్క విలువ అదే. మనిషికి ధ్యానస్థితిని అలవోకగా అందించడమూ, భగవంతుని సన్నిధికి అతని మనసును చేర్చడమే సంగీతం యొక్క పరమావధి అని నేను విశ్వసిస్తాను. అలాంటి పాటలనే నేను ఇష్టపడతాను. ఆ పాటలు సాంప్రదాయ కీర్తనలే కానక్కరలేదు. సినిమా పాటలలో కూడా అలాంటి 'ఆత్మ' ఉన్న పాటలు కొన్నున్నాయి. ఘజల్స్ లో అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. ప్రతి ఘజలూ అలాటిదే.

నేను ఘజల్ లవర్ ని అని చెప్పటానికి గర్విస్తాను.

ఇప్పుడే స్మూల్ లో పాడిన ఈ ఘజల్ ని వినండి, నేను పైన వ్రాసినది అంతా సత్యమే అని మీరూ ఒప్పుకోక తప్పదు. ఈ ఘజల్ గురించి మీకు కొంత వివరణ అవసరం.

ఈ పాట 1994 నాటిది. Insights అనే ఆల్బంలోది ఈ పాట. దీనిని పాడినది జగ్జీత్ సింగ్. సంగీత ప్రేమికులకు ఆయన గురించి పరిచయం అవసరం లేదు. అయినా సరే, కుష్వంత్ సింగ్ ఆయన గురించి ఏమన్నాడో ఒక్క మాట చెబుతాను. కుష్వంత్ సింగ్ ఇలా అన్నాడు.

'జగ్జీత్, మెహదీహసన్ కంటే బాగా పాడుతాడు. దిలీప్ కుమార్ కంటే అందంగా ఉంటాడు'.

ఈ ఒక్క కితాబు చాలు జగ్జీత్ ఎలాంటివాడో చెప్పడానికి ! ఈయన పాటలు పాడే శైలిని , "బోల్ ప్రధాన్" అంటారు. అంటే, పదాలను సుతారంగా పలకడంలో ఈ శైలి అంతా దాగుంటుంది. అందుకే, జగ్జీత్ సింగ్ పలికినట్లు పదాలను సుతారంగా, రాగయుక్తంగా పలికే గాయకులు బహు అరుదు.

ఇక రచయిత గురించి. ఈ ఘజల్ను వ్రాసింది నిదా ఫజలి అనే కవి. అద్భుతమైన పాటలను ఎన్నింటినో ఈయన వ్రాశాడు.  భూపేందర్ పాడిన 'కభీ కిసీ కొ ముకంమల్ జహా నహీ మిల్తా' అనే పాటను వ్రాసినది కూడా ఈయనే. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న మారణకాండను ఉద్దేశించి ఈయన ఈ ఘజల్ వ్రాసినట్లు తోస్తుంది. ఈ ఘజల్ చివరి చరణం ఈ ట్రాక్ లో లేదు. కానీ దానిని కూడా ఇక్కడ ఇచ్చాను, దాని అనువాదంతో సహా.

చదవండి. వినండి. కరిగిపొండి.
--------------
Garaj baras pyasi dharti par - Phir pani de Moula
Chidiyo ko daane, bachchon ko - Gud dhani de Moula

Do aur do ka jod hamesha - Chaar kaha hota hai
Soch samajhne Walon ko thodi - Naadani de Moula

Phir roshan kar Zeher ka pyala - Chamka nayee salibe
Jhooton mi duniya me sach ko - Taabani de Moula

Phir moorat se baahar aakar - Chaaro aur bhikar jaa
Phir mandir ko koyee meera - Deewani de Moula

Tere hote koyi kisee ki - Jaan ja dushman kyu ho
Jeene walon ko marne ki - Aasani de Moula

Translation

O Lord ! To this thirsty and parched Earth
Give torrents of water again
Give feed to the birds
And sweet meats to the children

Two and two does not always add up to four
To these learned scholars
who are full of intelligence
Give a little innocence !

Let there be men who can drink from the cup of poison
and who can embrace the cross
So that a new world may emerge !
On this world of falsehood, shower your light of Truth

Come out from the idol
and spread your presence all around
Install a love crazy Mira in the temple instead

When you are here
why should there be enmity between men?
To those who live
give a teaching of peaceful death

O Lord ! To this thirsty and parched Earth
Give torrents of water again
Give feed to the birds
And sweet meats to the children
----------------------------------------------
తెలుగు స్వేచ్చానువాదం

ఓ ప్రభూ !

దాహంతో ఎండిపోయి ఉన్న ఈ భూమికి
మళ్ళీ వర్షపు ధారలను ఇవ్వు
పక్షులకు ఆహారాన్నివ్వు
చిన్నపిల్లలకు తినుబండారాలివ్వు

ఎల్లప్పుడూ రెండు రెళ్ళు నాలుగు అవదు
పాండిత్యంతో నిండిపోయి ఉన్న వీరికి
కొంచం అమాయకత్వాన్నివ్వు

విషాన్ని ధైర్యంగా త్రాగే వాళ్ళు మళ్ళీ రానీ
శిలువను ధైర్యంగా మోసేవాళ్ళు మళ్ళీ రానీ
కొత్త ప్రపంచం మళ్ళీ ఉద్భవించనీ
అసత్యంతో నిండిపోయి ఉన్న ఈ లోకంలో
సత్యపు వెలుగును ప్రసరించు

విగ్రహం లోనుంచి బయటకు వచ్చి
నీ వెలుగును భూమి నలుమూలలా వెదజల్లు
ప్రేమతో పిచ్చిదై పోయిన మీరాను
ప్రతి గుడిలోనూ ప్రతిష్టించు

నువ్విక్కడే ఉన్నప్పుడు
మనుషుల మధ్యన ఇంత ద్వేషం ఎందుకు?
ప్రశాంతంగా ఎలా చనిపోవాలో
బ్రతికున్నవారికి కొంచం నేర్పించు

ఓ ప్రభూ !
దాహంతో ఎండిపోయి ఉన్న ఈ భూమికి
మళ్ళీ వర్షపు ధారలను ఇవ్వు
పక్షులకు ఆహారాన్నివ్వు
చిన్నపిల్లలకు తినుబండారాలివ్వు
------------------------------

అత్యంత ఉన్నతమైన ఫిలాసఫీని నింపుకున్న ఘజల్ ఇంతకంటే ఇంకొకటి నాకు కన్పించడం లేదు. అందుకే, ఈ ఘజల్ ని నేను అమితంగా ఇష్టపడతాను.

నిదా ఫజలి ఎంత గొప్ప స్వాప్నికుడో అంత గొప్ప కవి. ఎంత గొప్ప భావాలను ఈ చిన్నచిన్న పంక్తులలో అలవోకగా పొదిగాడో?

ఎంతో కాలం నుంచీ గొంతెండిపోయి బీటలు వారి ఉన్న నేలకు వర్షపు ధారలనివ్వు అనడంలో, "దివ్యచైతన్యపు స్పర్శకు నోచక, ఎన్నో యుగాలుగా చీకటిలో అజ్ఞానంలో మగ్గుతున్న భౌతికచేతనపైన నీ వెలుగునీ, నీ ఆనందాన్నీ, నీ శక్తినీ వర్షించు ప్రభూ!" అన్న అరవిందుల ఆరాటం గోచరిస్తుంది. ఒక యోగి తప్ప, ఒక సూఫీ తప్ప ఇలాంటి ఘజల్ వ్రాయలేడు !

'పక్షులకు ఆహారాన్నివ్వు చిన్నపిల్లలకు తినుబండారాలివ్వు' - అనడంలో సృష్టిలోని అమాయకజీవులకు ఆహారాన్ని ప్రసాదించు అన్న ప్రార్ధన దాగుంది. లోకంలో, తెలివైన జీవులు ఎలాగైనా బ్రతుకుతాయి. పక్క జీవిని దోచుకోనో, చంపో అవి బ్రతకగలవు. కానీ అమాయకపు జీవులు అలా బ్రతకలేవు. మన చుట్టూ ఉన్న పిట్టలు, పశుపక్ష్యాదులు, చిన్నపిల్లలు అలాంటివే. వాటికి బ్రతికే అవకాశం ఇవ్వమని, వారిని రక్షించమని దైవాన్ని ప్రార్దిస్తున్నాడు కవి. ఇది మిడిల్ ఈస్ట్ లోని పరిస్థితులకు అద్దం పడుతున్నది.

ఎల్లప్పుడూ రెండు రెళ్ళు నాలుగు అవదు
పాండిత్యంతో నిండిపోయి ఉన్న వీరికి
కొంచం అమాయకత్వాన్నివ్వు

అనే పాదంలో ఏంటో గొప్ప హృద్యమైన భావాన్ని లిఖించాడు ఫజలి.

లోకం ఎప్పుడూ గణితంతో మాత్రమే నడవదు. లెక్కలతోనే అన్నీ జరగవు. రెండురెళ్ళు నాలుగే కావాలని రూలేమీ లేదు. అది గణితంలో అయితే అంతేనేమో ! కానీ, హృదయపు లోకంలో అలా ఉండదు. అక్కడ లెక్కలు ఉండవు. ప్రేమసామ్రాజ్యంలో లెక్కలకు చోటు లేదు. లెక్కలతో, జమలతో, వ్యాపారధోరణితో కుళ్లిపోయి ఉన్న నేటి మనుషులలో, మేధావులలో, చిన్నపిల్లలకుండే అమాయకత్వాన్ని ప్రేమని కొంచమైనా ఇవ్వు ప్రభూ ! అని ప్రార్ధిస్తాడు కవి.

ప్రపంచానికి పట్టిన దరిద్రం ఏమంటే - అతితెలివి. అతి వ్యాపారధోరణి. ప్రతిదానినీ డబ్బుతో కొలిచే లేకి మనస్తత్వాలే. తెలివి ఎక్కువై ప్రస్తుతం చస్తున్నాం మనం ! ఇది కొంచం తగ్గి, ప్రేమ, అమాయకత్వం, ఉదారత్వం మళ్ళీ ఉదయిస్తే గాని మన బ్రతుకులు బాగుపడవు. నిజమైన ఆనందం అంటే ఏమిటో అప్పుడు గాని మనకు దక్కదు.

విషాన్ని ధైర్యంగా త్రాగే వాళ్ళు మళ్ళీ రానీ
శిలువను ధైర్యంగా మోసేవాళ్ళు మళ్ళీ రానీ
కొత్త ప్రపంచం మళ్ళీ ఉద్భవించనీ
అసత్యంతో నిండిపోయి ఉన్న ఈ లోకంలో
సత్యపు వెలుగును ప్రసరించు

అనే పాదాలలో కవి ఇంకో అద్భుతమైన భావాన్ని పలికిస్తాడు.

విషాన్ని ధైర్యంగా త్రాగినవాడు సోక్రటీస్. ఎందుకోసం అలా త్రాగాడాయన? సత్యం కోసం ! అలాగే, శిలువను ధైర్యంగా ఎక్కినవాడు జీసస్. ఎందుకోసం అలా చేశాడాయన? మనుషుల అజ్ఞానం పోగొట్టడం కోసం ! అలాంటి ఉన్నతజీవులను మళ్ళీమళ్ళీ ఈ అసత్యపు చాయ నిండి ఉన్న లోకంలో పుట్టించు. వాళ్ళ అవసరం ఇప్పుడు మాకెంతైనా ఉంది. సత్యం కోసం మరణించేవాళ్ళు, సాటిమనిషి కోసం తన స్వార్ధాన్ని కొంచం త్యాగం చేసేవాళ్ళూ ఇప్పుడు కావాలి. అలాంటి మనుషులు వస్తేగాని, ఈ భూమి మళ్ళీ బ్రతకదు.

అసత్యంతో నిండిపోయి ఉన్న ఈ లోకంలో
సత్యపు వెలుగును ప్రసరించు

అనే పాదంలో "అసతోమా సద్గమయ" (అసత్యం నుండి మమ్మల్ని సత్యంలోకి నడిపించు) అనే ఋగ్వేదమంత్రం స్ఫురించడం లేదూ? అన్ని మతాల ప్రార్ధనా ఇదేగా? ఇంతకంటే వేరే ఏముంది?

విగ్రహం లోనుంచి బయటకు వచ్చి
నీ వెలుగును భూమి నలుమూలలా ప్రసరించు
ప్రేమతో పిచ్చిదై పోయిన మీరాను
ప్రతి గుడిలోనూ ప్రతిష్టించు

అనే పాదం కూడా బంగారమే !

దేవుడు గుడిలో ఉంటె సరిపోదు. బయటకు రావాలి. లోకంలో తన ప్రేమనీ, కరుణనీ, సౌందర్యాన్నీ, సత్యాన్నీ వెదజల్లాలి. విగ్రహంలో ఉంటె ఏమాత్రమూ సరిపోదు. అన్ని గుడులలోనూ విగ్రహాలున్నాయి. కానీ మనుషులు ద్వేషంతోనూ, స్వార్ధంతోనూ కుళ్లిపోయి ఉన్నారు. ఇలా ఉంటే ఉపయోగం ఏముంది?

అలాగే, గుడిలో ఉండవలసింది, చాందసులైన మనుషులూ, మతనాయకులూ, దొంగస్వామీజీలూ, మూర్ఖులైన మౌల్వీలూ కారు. దైవం మీద ప్రేమతో పిచ్చిదైపోయిన 'మీరా' లాంటి సున్నితహృదయులు గుళ్ళలో మతాలలో నాయకులుగా ఉండాలి. అప్పుడే మతాలు బాగుపడతాయి - అంటాడు. ప్రస్తుత మతనాయకులలో లోపించినవి హృదయమూ, ప్రేమలేగా?

మతాల మధ్యన ప్రస్తుతం ఉన్న ద్వేషాలను తీర్చడానికి ఒక గొప్ప ప్రతిపాదన చేశాడు ఫజలి. దేవుడు గుడిని వదలిపెట్టి సమాజంలోకి రావాలి. ప్రేమా హృదయమూ సహానుభూతీ ఉన్న మనుషులు మతనాయకులుగా గుళ్ళలో ఉండాలి. అప్పుడే ఈ లోకం బాగుపడుతుంది.

నువ్విక్కడే ఉన్నప్పుడు
మనుషుల మధ్యన ఇంత ద్వేషం ఎందుకు?
ప్రశాంతంగా ఎలా చనిపోవాలో
ఈ మనుషులకు కొంచం నేర్పించు

ఈ చరణంలో, ఇంకో గొప్ప భావాన్ని వెలువరుస్తాడు.

లోకాన్ని సృష్టించింది దైవమేనని అన్ని మతగ్రంధాలూ చెబుతాయి. లోకంలో దైవమె ఉంది అంటాయి. మళ్ళీ ఒకరికొకరు ద్వేషంతో కొట్టుకు చస్తుంటారు. ఇదేంటి? అని ప్రశ్నిస్తాడు. ఈ మనుషులకు ప్రశాంతంగా చావడం తెలీదా? ఇలా యుద్ధాలు చేసుకుంటూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ చావడం ఒక గొప్పా? అని అడుగుతాడు. ప్రశాంతంగా నీ ధ్యానంలో జీవించి, నీ ధ్యానంలో మరణించడం ఈ మూర్ఖులకు నేర్పించు ప్రభూ అన్న ప్రార్ధన కవి హృదయంలో నుంచి వెలువడుతుంది.

అందుకే అంటాను నేను - ఈ ఘజల్ మామూలు పాట కాదు. అత్యున్నతమైన వేదాంతాన్ని తనలో నింపుకున్న అద్భుతమైన గీతం అని ! నా స్వరంలో దీనిని వినండి. ఆ తర్వాత, జగ్జీత్ సింగ్ స్వరంలో ఒరిజినల్ పాటను వినండి. మంత్రముగ్ధులౌతారు. మిమ్మల్ని మీరే మరచిపోతారు. ఏదో మత్తులో తేలిపోతారు. మీకు తెలీకుండానే మీ కళ్ళు వర్షిస్తాయి. హృదయం బరువెక్కుతుంది. ధ్యానతన్మయత్వం మీకు అప్రయత్నంగా కలుగుతుంది.

అదీ ఈ ఘజల్ మహాత్యం !