“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, ఫిబ్రవరి 2020, మంగళవారం

Astro - Homoeo Retreat - Feb 2020






















































ఈ సంవత్సరానికి మొదటి జ్యోతిష్య - హోమియో సమ్మేళనం 16th Feb 2020 న హైదరాబాద్ లో జరిగింది. దీనికి పంచవటి సభ్యులు నలభైమంది హాజరయ్యారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరువరకూ ఏకధాటిగా ఈ కార్యక్రమం జరిగింది.

9 నుంచి మధ్యాన్నం రెండువరకూ జరిగిన జ్యోతిష్యసమ్మేళనంలో మొదటి రెండుగంటలు జ్యోతిష్యశాస్త్ర పునాదులను మళ్ళీ ఒకసారి త్వరగా నేర్పించాను. ఇంతకుముందు మేము చేసిన Astro workshops లో అవన్నీ చెప్పాను. కానీ ఈ సబ్జెక్ట్ మళ్ళీ మళ్ళీ చెప్పవలసినది గనుక ఒకసారి మళ్ళీ బేసిక్స్ నుంచి మొదలుపెట్టి నేర్పించాను. కానీ, సోది లేకుండా, నా పద్ధతిలో విశ్లేషణ ఎలా చెయ్యాలో, దానికి ఏయే ప్రాధమిక అంశాలు అవసరమో అంతవరకే నేర్పించాను. దానికే మొదటి రెండు గంటలు పట్టింది.

2000 సంవత్సరంలో తెలుగువిశ్వవిద్యాయం నుంచి నేను జ్యోతిష్యం MA చేశాను. అంటే నేటికి 20 ఏళ్లయింది. అంతకు ముందు 5 ఏళ్ళనుంచీ నేను జ్యోతిష్యం నేర్చుకుంటూనే ఉన్నాను. అయితే, ఈ  కోర్సుకు అది మొదటి బ్యాచ్. అప్పటినుంచీ నేను చేస్తున్న రీసెర్చి వల్ల అనేక కొత్త టెక్నిక్స్ దానిలో కనుక్కున్నాను. ఇవి పుస్తకాలలో ఎక్కడా మీకు దొరకవు. ఆ టెక్నిక్స్ ను నా శిష్యులకు నేర్పించాలనే ఉద్దేశ్యంతో ఈ రిట్రీట్స్ పెడుతున్నాను. అంటే, నా 25 ఏళ్ళ పరిశోధనా ఫలితాలను వారికి పంచిపెడుతున్నాను.

11 గంటలనుంచి 2 గంటలవరకూ, జ్యోతిష్యశాస్త్రంలో నేను ఉపయోగించే కిటుకులు, సూత్రాలను కొన్నింటిని వారికి నేర్పించడమే గాక, కొన్ని జాతకాలను వారిచేతనే విశ్లేషణ చేయించాను. మిగతా సూత్రాలను తరువాత జరిగే సమ్మేళనాలలో వివరిస్తాను.

జ్యోతిష్యం కోసం మేమిన్నాళ్ళు "జగన్నాధహోర" ఫ్రీ సాఫ్ట్ వేర్ వాడుతున్నాము. అందులో మాకు కావలసిన దానికంటే చాలా ఎక్కువ లెక్కడొక్కలు ఉన్నాయి. అన్ని మాకు అవసరం లేదు. మాది చాలా simple and straight approach. కనుక మాదంటూ ఒక జ్యోతిష్య సాఫ్ట్ వేర్ ను మేమే డెవలప్ చేస్తున్నాము. త్వరలో మా "పంచవటి" సంస్థ నుంచి దానిని విడుదల చెయ్యడం జరుగుతుంది. అది Windows, Mac, Mobile అన్ని ప్లాట్ ఫాం ల మీదా పనిచేస్తుంది. ఆ విధంగా దానిని తయారు చేస్తున్నాము. దానిపేరు Satya Jyotish (SJ) అని నిర్ణయించడం జరిగింది. 

చివరగా వారికొక విషయం చెప్పాను.

"డబ్బుకోసం జ్యోతిష్యశాస్త్రాన్ని ఎప్పుడూ వాడకండి. దురాశకు లోనుకాకండి. దీనిని ఎగతాళిగా, సరదాగా తీసుకోకండి. ఇది చాలా పవర్ ఫుల్ సైన్స్. జాగ్రత్తగా దీనిని డీల్ చెయ్యకపోతే, మీ చేతులు కాలిపోతాయి. నా సాధనామార్గంలో నడిస్తేనే మీరు దీనిని సరిగ్గా అర్ధం చేసుకోగలుగుతారు, చెయ్యగలుగుతారు. Ordinary astrology ని వదలి, Spiritual astrology ని అర్ధం చేసుకోండి. మీమీ జీవితాలలో అన్వయించుకోండి. ఆచరించండి. మీమీ కుటుంబాలను బాగు చేసుకోండి, మీమీ ఆరోగ్యాలను బాగు చేసుకోండి. నేను చూపుతున్న ఆధ్యాత్మికమార్గంలో నడచి, సాధనామార్గంలో ఎదగండి. లోకంలో ఉన్న అజ్ఞానపు చీకట్లను పోగొట్టే దీపాలుగా మారండి" అని నా శిష్యులకు చెప్పాను.

ఈ విధంగా ఉదయంపూట జ్యోతిషశాస్త్ర సమ్మేళనం ముగిసింది.

లంచ్ తరువాత జరిగిన హోమియో సమ్మేళనంలో  ఈ క్రింది విషయాలను వారికి వివరించాను.

1. హోమియోపతి ఎలా పుట్టింది? దాని ప్రాముఖ్యత ఏమిటి? డా || హన్నేమాన్ జీవితం. 
2. రోగం అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? ఎలా వస్తుంది ?
3. ప్రాణశక్తి అంటే ఏంటి? రోగాన్ని అది ఎలా నయం చేస్తుంది?
4. పొటెన్సీ  అంటే ఏమిటి? అందులో ఎన్ని స్కేల్స్ ఉన్నాయి? వాటినిఎలా తయారు చేస్తారు? వాటిని ఎలా ఎప్పుడు వాడాలి? 
5. హోమియోపతిలో - Plant, Mineral, Animal, Poisonous, Disease products - ఇలా ఎన్ని రకాలైన ఔషధాలున్నాయి? అవి ఎలా పని చేస్తాయి ? వేటిని ఎప్పుడు వాడాలి?
6. ఇంగ్లీషు వైద్యానికి హోమియో వైద్యానికి ఉన్న తేడాలేమిటి? రోగం తగ్గడం అంటే ఏమిటి? దానికి మనమేమేం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు?
7. ఎక్యూట్ మరియు క్రానిక్ రోగాలలో హోమియో మందులు ఎలా వాడాలి? పోటేన్సీలు ఎలా వాడాలి? రిపీట్ ఎలా చెయ్యాలి?

ఆ తర్వాత, మా అమ్మాయి డా || శ్రీభార్గవి MD (Homoeo), హోమియోపతి మీద క్లాసు తీసుకుంది. దానిలో First Aid Remedies - Homoeopathy గురించి దాదాపు 20 రకాలైన ఔషధాలను వివరిస్తూ, నిత్యజీవితంలో ప్రతివారికీ వచ్చే అనేక బాధలకు ఆ మందులను ఎలా వాడాలో తను చక్కగా వివరించింది.

ఆధ్యాత్మికం అనేది మా జీవితాలలో అన్ని విషయాలలోనూ అంతర్లీనంగా ఉంటూనే ఉంటుంది గనుక - జ్యోతిష్యాన్ని, హోమియోపతిని కూడా ఆధ్యాత్మికసాధనతో మేళవిస్తూ, నిత్యజీవితంలో వాటిని ఎలా ఉపయోగించుకోవాలో  చెప్పడం జరిగింది.

ఇన్నేళ్ళుగా నేను రిట్రీట్స్  జరుపుతూ ఉన్నప్పటికీ Advanced level లో Subject ను చెప్పడం ఇదే మొదటిసారి. ఏడాదికి కనీసం నాలుగు రిట్రీట్స్ ఇకపైన జరపాలన్న సంకల్పాన్ని అందరూ వ్యక్తం చేశారు. అలాగే చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. ఈ పునాదులనుంచి మొదలుపెట్టి, ముందుముందు క్లాసులలో ఈ సైన్సులలోని Advanced topics కూలంకషంగా నేర్పించడం జరుగుతుంది.

ప్రసిద్ధ కర్నాటక సంగీత విద్వాంసులు T.P. Chakrapani గారు, వారి శిష్యురాలు కుమారి నవ్య గార్ల సాంప్రదాయ కీర్తనలతో సమావేశం జయప్రదంగా ముగిసింది.

జ్యోతిష్యశాస్త్రం, హోమియోపతి, ఆధ్యాత్మికసాధనల గురించి ఎన్నో క్రొత్త విషయాలను, ఇంకెన్నో క్రొత్త Insights ను మనసులలో నింపుకుని, "మళ్ళీ త్వరలో అందరం కలుసుకుందాం" అన్న మంచిసంకల్పంతో అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు.