నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

4, అక్టోబర్ 2016, మంగళవారం

భారత్ పాకిస్తాన్ యుద్ధాలు - జ్యోతిశ్శాస్త్ర పరిశీలన - 1

ఈ మధ్యన పాకిస్తాన్ మీద జరిగిన సర్జికల్ స్ట్రైక్ తో మోడీ అంటే ఏమిటో అందరికీ బాగా తెలిసొచ్చింది.భారతదేశం అంటే పిరికి దేశం కాదన్న విషయం ప్రపంచానికి తెలిసింది.

తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నప్పటికీ - ఎల్లకాలం దాడులు చేయించుకుంటూ కూర్చోబోమని నీచపు దేశమైన పాకిస్తాన్ కు ఈ చర్య ద్వారా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది.భారతదేశం అంతా మోడీ వెంట ఉండి ఈ దాడులను సమర్ధిస్తున్నది. సైన్యానికి జేజేలు పలుకుతున్నది.

పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ లూ, వారికి కొమ్ము కాస్తున్న సైన్యమూ, పాకిస్తాన్ ప్రభుత్వపు అదుపులో లేవన్న విషయం అందరికీ తెలిసినదే. నిజానికి ప్రభుత్వమే వీరి అదుపులో ఉన్నది. మేమూ టెర్రరిజం బాధితులమే అని పాకిస్తాన్ చెప్పే మాట నిజమే అయితే, ఆ టెర్రరిస్టులను అంతం చేస్తున్నందుకు భారత్ కు వారు కృతజ్ఞతలు చెప్పాలి.కానీ ఆ దేశం అలా చెయ్యడం లేదు. ఇక్కడే పాకిస్తాన్ నీచపు బుద్ధి స్పష్టంగా కనిపిస్తున్నది.

ఈ విషయాన్ని పాకిస్తాన్ నుంచి వచ్చి మన దేశంలో స్థిరపడిన గాయకుడైన అద్నాన్ సమీ ఒక్కడే కరెక్ట్ గా ధైర్యంగా చెప్పాడు.మిగిలిన మేధావులూ, కళాకారులూ ఎవ్వరూ ఈ మాట అనలేదు.అందుకు మనం అద్నాన్ సమీని అభినందించాలి.

ఈ నేపధ్యంలో - అసలు ఇప్పటిదాకా జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధాలలో జ్యోతిష్య పరమైన కోణాలు ఏమున్నాయి?ఆయా సందర్భాలలో ఏఏ గ్రహాలు ప్రధానమైన పాత్రను పోషించాయి అన్న విషయం మీద కొంత రిసెర్చి చేశాను.

ఈ రీసెర్చిలో గుర్తించిన అంశాలు:--

1. భారత్ లగ్నం వృషభం. పాకిస్తాన్ లగ్నం మేషం.కనుక ఆయా లగ్నాలపైనా వీటికి విక్రమ సుఖస్థానాల పైనా క్రూర గ్రహాల ప్రభావం.

2. యుద్ధాలలో రాహువు,కుజుడు,శనీశ్వరుల పాత్ర.

యుద్ధం అనేది ప్రతిరోజూ రాదు గనుక, Slow moving planets నే ఈ విశ్లేషణలోకి తీసుకోవాలి.అందులోనూ క్రూర గ్రహాలైన వీరిదే ప్రధానమైన పాత్ర ఉండాలి.

ఈ ప్రాధమిక అవగాహనతో, ఒక్కొక్క యుద్ధాన్నీ ఆ సమయంలో గ్రహాల స్థితినీ వరుసగా పరిశీలిద్దాం.

1947 భారత్ పాకిస్తాన్ యుద్ధం

ఈ యుద్ధం అక్టోబర్ 1947 లో మొదలై డిసెంబర్  1948 వరకూ సాగింది. ఈ యుద్ధంలో ముఖ్యాంశం - కాశ్మీర్.

ఈ యుద్ధం మొదలైనప్పుడు రాహువు వృషభం మొదట్లో ఉచ్చస్థితిలో ఉన్నాడు.ఒక్క నెలలో రాశి మారి మేషంలోకి వచ్చాడు.

మేషం అనేది పాకిస్తాన్ లగ్నం కనుక కాశ్మీర్ మీద కన్నేసిన ఆ దేశం కాశ్మీర్ మీద దురాక్రమణకు దిగింది.రాహుస్పర్శతో ఆ దేశానికి దురాశా దుడుకుతనమూ పుట్టుకొచ్చాయి.

శనీశ్వరుడు వృషభం నుంచి మూడింట విక్రమ స్థానంలో ఉండటంతో మన దేశం దీటుగా స్పందించింది.ఈ స్థితి జూలై 1948 వరకూ కొనసాగింది. కానీ ఆగస్ట్ లో శనీశ్వరుడు సింహం లోకి వచ్చి మన సుఖస్థానాన్ని ఆక్రమించాడు.కనుక అప్పటినుంచీ మనకు నష్టాలు మొదలయ్యాయి. మహారాజా హరిసింగ్ భారత్ లో కలుస్తున్నట్లు ప్రకటించి సంతకం పెట్టినప్పటికీ, న్యాయంగా మనకు రావలసిన కాశ్మీర్లో నాలుగింట ఒక వంతు భాగాన్ని మనం పోగొట్టుకున్నాం.యుద్ధ కారకుడైన కుజుడు వృషభం నుంచి సుఖస్థానం లోనే ఉండటం మనం గమనించవచ్చు.

1965 భారత్ పాకిస్తాన్ యుద్ధం


పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఈ యుద్ధం 1965 లో ఆగస్ట్ - సెప్టెంబర్ లలో జరిగింది. దానికి కొన్ని నెలల ముందు నుంచే సరిహద్దు అవతల నుంచి పాకిస్తాన్ రెచ్చగొట్టుడు చర్యలు మొదలయ్యాయి.

సరిగ్గా ఈ సమయంలో మళ్ళీ రాహువు వృషభంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శనీశ్వరుడు వక్రస్తితిలో ఉంటూ భారత్ లగ్నం అయిన వృషభం నుంచి మూడు నాలుగు స్థానాలను వీక్షిస్తున్నాడు.యుద్ధం మొదలైనప్పుడు కుజుడు కన్యారాశిలో ఉంటూ పాకిస్తాన్ లగ్నమైన మేషరాశిని చూస్తున్నాడు.ఆ తర్వాత నెలలో తులా రాశిలో ప్రవేశించి తన అష్టమదృష్టితో భారత్ లగ్నమైన వృషభరాశిని వీక్షిస్తున్నాడు. కనుక యుద్ధంలో గెలిచినప్పటికీ, మనకు కూడా నష్టం బాగానే జరిగింది.

ఈ రెండు యుద్ధాలలో రాహువు,కుజుడు,శనీశ్వరుల పాత్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 18 ఏళ్ళ తేడాతో జరిగినప్పటికీ ఈ రెండు యుద్ధాల సమయాలలోనూ ఈ గ్రహాలు అవే స్థానాలలో ఉండడాన్ని లేదా ప్రభావితం చేస్తుండటాన్ని మనం గమనించవచ్చు.

(ఇంకా ఉంది)