“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

6, అక్టోబర్ 2016, గురువారం

భారత్ పాకిస్తాన్ యుద్ధాలు - జ్యోతిశ్శాస్త్ర పరిశీలన - 3

రెండు దేశాలకూ స్వాతంత్రం వచ్చిన ఈ 70 ఏళ్ళలో పైన మనం చెప్పుకున్న పెద్ద యుద్ధాలే గాక చిన్న చిన్న యుద్ధాలు చాలా జరిగాయి. వాటికి ఉదాహరణలుగా సియాచిన్ యుద్ధాలను చెప్పుకోవచ్చు.

వీటిని వరుసగా చూద్దాం.

Operation Meghdoot - April 1984


ఈ యుద్ధంలో మనం విజయం సాధించి సియాచిన్ గ్లేషియర్ మీద మన జెండాను ఎగుర వెయ్యగలిగాం.ఈ సమయంలో గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం.

యధావిధిగా రాహుకేతువులు వృషభ వృశ్చికాలలో ఉన్నారు.నవాంశలో కూడా వర్గోత్తమ స్థితిలో ఉంటూ బలంగా ఉన్నారు.శనీశ్వరుడు తులలో ఉంటూ మన విక్రమస్థానమైన కర్కాటకాన్ని వీక్షిస్తూ మన సైన్యానికి బలాన్ని ఇస్తున్నాడు.కానీ నవాంశలో నీచ స్థితిలో పాకిస్తాన్ లగ్నంలో ఉంటూ, దానికి నీచపు బుద్ధిని ఆపాదిస్తున్నాడు. కుజుడు కేతువుతో కలసి వృశ్చికంలో ఉంటూ తన సప్తమ దృష్టితో వృషభంలో ఉన్న రాహువును వీక్షిస్తున్నాడు.అంతేగాక తన అష్టమ దృష్టితో పాకిస్తాన్ కు విక్రమస్థానమైన మిధున రాశిని చూస్తున్నాడు. కనుకనే వాళ్ళు కూడా మనకు గట్టి పోటీ ఇవ్వాలని ప్రయత్నించారు.కనుక మన సూత్రం ఇక్కడ కూడా మళ్ళీ రుజువైంది.


Operation Rajiv June-July 1987

సియాచిన్ లో అత్యంత ఎత్తైన ప్రదేశాన్ని పాకిస్తాన్ ఆక్రమించి దానికి "కైద్ పోస్ట్" అని పేరు పెట్టుకుంది. అక్కడ వాళ్ళు తిష్ట వేసుకుని ఉండటం వల్ల క్రింది లేయర్స్ లో ఉన్న మన సైన్యానికి ప్రమాదకరంగా మారింది. ఈ పోస్టును ఆక్రమించాలని మనవాళ్ళు చేసిన రెండు ప్రయత్నాలు బెడిసి కొట్టాయి.ఈ ఆపరేషన్స్ లో జరిగిన కాల్పులలో లెఫ్టినెంట్ రాజీవ్ పాండే మరణించాడు. అందుకని జూన్ జూలై  1987 నెలలలో మనవాళ్ళు చేసిన ఫైనల్ ఆపరేషన్ లో విజయవంతంగా ఈ పోస్ట్ ను పాకిస్తాన్ సైనికుల నుంచి స్వాధీనం చేసుకోగలిగారు.రాజీవ్ పాండే పేరుమీద దీనిని "ఆపరేషన్ రాజీవ్" అని పిలిచారు.సుబేదార్ బాణాసింగ్ నేతృత్వంలో సాధించిన ఈ విజయాన్ని పురస్కరించుకుని ఈ శిఖరానికి "బాణా టాప్" అని మనవాళ్ళు పేరు పెట్టారు.ఈ సమయంలో గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం.ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఒకటి బయట పడుతున్నది.యధావిధిగా శనీశ్వరుడు వృశ్చికంలో ఉంటూ వృషభాన్ని చూస్తున్నాడు.నవాంశ చక్రంలో అయితే రాహుకేతువులు నీచలో ఉంటూ వృశ్చిక వృషభాలలో నెలకొని ఉన్నారు.రాశులు అవే అయినప్పటికీ - స్థితులు మాత్రం మారాయి.నీచలో ఉన్న నోడల్ యాక్సిస్ అనేది మన లగ్నాన్ని కొట్టింది గనుక ఈ ఆపరేషన్ మనకు చాలా కష్టం అయింది.


అయితే విచిత్రం అది కాదు. జూన్ నెలలో ఈ ఆపరేషన్ మొదలు పెట్టినపుడు కుజుడు పాకిస్తాన్ యొక్క విక్రమ స్థానమైన మిధునంలో ఉన్నాడు.కనుక వాళ్ళు మనకంటే advantageous position లో బలంగా ఉన్నారు.కానీ జూలై నెల వచ్చే సరికి కుజుడు కర్కాటకం లోకి నీచస్థితి లోకి వచ్చేశాడు.అంటే - మన విక్రమస్థానం లోకి వచ్చి మనకు బలాన్ని ఇవ్వడం ప్రారంభం చేశాడు.కనుక అప్పటినుంచీ మనకు కాలం కలసి వచ్చి, అంతకు ముందు రెండు ఆపరేషన్స్ లో ఓడిపోయినప్పటికీ, ఈసారి మాత్రం గెలుపు మనదే అయింది. 



దీనికి తోడుగా - నవాంశ చక్రంలో రాహు కేతువులు కూడా రాశులు మారి తులా మేష రాశులలోకి వచ్చారు.కనుక పాకిస్తాన్ లగ్నమైన మేషాన్ని సూటిగా కొట్టడం జరిగింది.కనుక అప్పటినుంచీ వారికి ఓటమి మొదలైంది.

ఈ విధంగా భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగిన ప్రతిసారీ శనీశ్వరుడు, రాహువు,కుజుల పాత్ర చాలా స్పష్టంగా మనకు గోచరిస్తున్నది.

(ఇంకా ఉంది)