“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, ఆగస్టు 2016, గురువారం

గురువుగారి కన్యారాశి ప్రవేశం - ఫలితాలు

హమ్మయ్య.

గత కొన్ని నెలలనుంచీ రాహుస్పర్శతో సింహరాశిలో బాధపడుతున్న గురువుగారు రేపు సింహరాశిని వదలి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నారు.ఈ రాశిలో ఒక ఏడాది పాటు ఉంటారు.

ఈ గోచార ఫలితంగా గురువుకు రాహువు దూరం కావడంతో - ప్రస్తుతానికి లోకానికి టెర్రరిష్టుల బాధ కొంచం తగ్గినట్లే.దీనికి నిదర్శనమే ఈ మధ్యనే జరిగిన నకిలీ నక్సలైటు 'నయీం' ఎన్ కౌంటర్.ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇక ఈ ఉగ్రవాద బాధ కొంచం తగ్గుముఖం పడుతుంది.అంతవరకూ మేలే.

ఇకపోతే, యధావిధిగా పన్నెండు రాశుల వారికీ ఈ గోచార (transit) మార్పు వారి వారి జీవితాలలో స్పష్టమైన మార్పులను కొన్నింటిని తప్పకుండా తీసుకొస్తుంది.

మనిషి జీవితం ఖచ్చితంగా గ్రహచారం ప్రకారమే నడుస్తుంది.ఇందులో ఏమీ అనుమానం లేదు.ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.మనం నమ్మనంత మాత్రాన సూర్యుడు పడమరలో ఉదయించడు కదా?

సరే ఆ సంగతి అలా ఉంచి గురువు గారి కన్యారాశి ఫలితాల గురించి మాట్లాడుకుందాం. మీరు గనక గమనిస్తుంటే - గత రెండు రోజులనుంచీ మీ జీవితంలోనూ మీ చుట్టుపక్కల ఉన్నవారి జీవితాలలోనూ స్పష్టమైన మార్పులను కొన్నింటిని మీరు గమనించే ఉంటారు.ఈ మార్పులన్నీ గురుగ్రహ గోచార ఫలితాలే.ఎంతోకాలం నుంచీ పెండింగ్ లో ఉన్న కొన్నికొన్ని పనులు ఈ రెండురోజుల్లో టక్కున జరిగిపోవడం మీరు గమనించగలరు.ఇవి గురుగ్రహ గోచార ఫలితాలే.

గురువుగారి కన్యారాశి సంచారం కృష్ణానదికి పుష్కరాలను తెస్తుంది.ఆ గోల గురించి మళ్ళీ ఇంకో పోస్ట్ లో మాట్లాడుకుందాం.

ప్రస్తుతానికి ద్వాదశ రాశులకు గురుగోచార ఫలితాలు చూద్దామా?

మేషరాశి
ఉద్యోగంలో మార్పులు వస్తాయి.బాధ్యతలు పెరుగుతాయి.పదోన్నతి రావచ్చు.కొత్త ఉద్యోగంలో కూడా చేరవచ్చు.కనుక పనిలో వత్తిడి ఎక్కువౌతుంది.ఆరోగ్యం బాగుపడుతుంది.శత్రువులు పెరిగినా అదుపులోనే ఉంటారు.

వృషభరాశి
ఆధ్యాత్మిక చింతన,పుణ్యక్షేత్ర సందర్శనా కలుగుతాయి.సంతానానికి మంచి సమయం.షేర్ మార్కెట్ లో లాభాలొస్తాయి.ప్రేమ వ్యవహారాలు మొదలౌతాయి.

మిధునరాశి
విద్యలో ఉన్నతి కలుగుతుంది.ఇంటిలో చికాకులు తగ్గి శాంతిగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది.వాహన సౌఖ్యం కలుగుతుంది.రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభిస్తుంది.

కటకరాశి
ధైర్యం సన్నగిల్లుతుంది.దగ్గర ప్రయాణాలు చాలా చెయ్యవలసి వస్తుంది. సోదరులకు మంచి జరుగుతుంది.ఇతరులతో సంబంధాలు మంచిగా ఉంటాయి.

సింహరాశి
ధనలాభం ఉంటుంది.మాట పలుకుబడి పెరుగుతుంది.కంటి ఆపరేషన్లు సక్సెస్ అవుతాయి.విద్యలో ఔన్నత్యం కలుగుతుంది.

కన్యా రాశి
వివాహం జరుగుతుంది.దూర దేశ ప్రయాణాలు ఉంటాయి.వ్రుత్తి ఉద్యోగాలలో ఔన్నత్యం వస్తుంది.అహంకారం పెరుగుతుంది.తద్వారా అనవసర భేషజాలకు పోయి భంగపాటు పడతారు.

తులారాశి
అనుకోని ఖర్చులు ఎక్కువై పోతాయి.ఆస్పత్రి పాలవుతారు.లేదా ఆస్పత్రిని సందర్శిస్తారు.డాంబిక (show devotion) భక్తి పెరుగుతుంది.నష్టాలు కలుగుతాయి.ఆత్మీయులు గతిస్తారు.

వృశ్చిక రాశి
లాభాలు కలుగుతాయి.అన్నింట్లోనూ లాభసాటిగా ఉంటుంది.సోదరులకు మంచి జరుగుతుంది.ధైర్యం పెరుగుతుంది.

ధనూరాశి
వృత్తి ఉద్యోగాలలో మంచి జరుగుతుంది.పదోన్నతులూ దూరప్రయాణాలూ కలుగుతాయి.విద్యలో ఉన్నతి వస్తుంది.ఆత్మవిశ్వాసం మెరుగౌతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది.

మకరరాశి
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.దూరదేశాలు,పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలోని పెద్దవారి ఆరోగ్యం బాగుపడుతుంది.మరికొందరికి పెద్దలు గతిస్తారు.

కుంభరాశి
జీవితంలో ధనపరంగా నష్టాలు కనిపిస్తాయి.అనుకోని అవాంతరాలు ఎదురౌతాయి.ఆపరేషన్లు జరుగవచ్చు.అయితే,ఆరోగ్య సమస్యలు, దీర్ఘరోగాలు అదుపులోకి వస్తాయి.

మీనరాశి
శత్రువులు అదుపులోకి వస్తారు.ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.దూరదేశాలలో ఉన్నవారితో సంబంధాలు మెరుగౌతాయి.మాట పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార ఆలోచనలు కలుగుతాయి.

Note:--

ఈ ఫలితాలు సార్వజనీనమైనవి.అంటే కోట్లాదిమందిమీద వ్రాసేవి గనుక అందరికీ అన్నీ జరగవు.కానీ కొన్ని మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి.ఫలితాలు చూచేటప్పుడు దశా ఫలితాలను గోచార ఫలితాలు అనుసరిస్తాయి గాని వాటిని దాటి స్వతంత్ర ఫలితాలను ఇవ్వలేవు.కనుక వ్యక్తిగత జాతకంలో ఏయే దశలు జరుగుతున్నవో చూచుకొని ఆ ఫలితాలతో గోచార ఫలితాలను అన్వయించుకోవాలి.అప్పుడే సరియైన భవిష్యత్తు గోచరమౌతుంది.ఆ తర్వాత ఆ ఫలితాలను బట్టి సరియైన పరిహారాలను త్రికరణ శుద్ధిగా చేసుకోవాలి.అప్పుడు మాత్రమే కర్మను జయించడం సాధ్యమౌతుంది.