“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, ఆగస్టు 2016, బుధవారం

మా అమెరికా యాత్ర - 37 (గౌరీమా - శ్రీ శారదేశ్వరీ ఆశ్రమ స్థాపన)


1886 వ సంవత్సరంలో ఆగస్ట్ 15 రాత్రి శ్రీ రామకృష్ణులు తన దేహాన్ని చాలించారు. అప్పటికి ఆయనకు సరిగ్గా 50 ఏళ్ళు మాత్రమే.సరిగ్గా అరవై ఏళ్ళ తర్వాత 1947 లో అదే తేదీన మన దేశానికి స్వతంత్రం వచ్చింది.అరవై అనేది శని గురువుల గోచారంలో చాలా ప్రాముఖ్యమైన సంఖ్య.అరవై ఏళ్ళలో గురువు 5 సార్లు, శనీశ్వరుడు 2 సార్లు రాశిచక్రాన్ని చుట్టి వస్తారు.అంతేగాక అరవై ఏళ్ళ క్రితం ఎక్కడున్నారో అదే స్థానంలో మళ్ళీ కలుస్తారు.కనుకనే మనిషి కూడా షష్టిపూర్తి అనేది అరవై ఏళ్ళకే జరుపుకోవడం జరుగుతుంది.

శ్రీ రామకృష్ణులు దేహం చాలించిన అరవై ఏళ్ళకు మనకు స్వతంత్రం వచ్చింది.ఇలాంటి సంఘటనల వెనుక ఉన్నట్టి మార్మికమైన సూచనలు అర్ధాలు ఏమిటో మనవంటి అల్పబుద్ధులకు ఎలా తెలుస్తాయి?


ప్రస్తుతానికి ఈ జ్యోతిష్య కోణాన్ని అలా ఉంచి, మన కధలోకి వద్దాం.

శ్రీ రామకృష్ణుల దేహత్యాగం తర్వాత ఆయన భక్తులందరూ చెల్లాచెదరై పోయారు.మానసికంగా వారు చాలా క్రుంగి పోయారు. ఆయన దేహంతో లేకపోవడాన్ని భరించలేని వారిలో చాలామంది తాము కూడా చనిపోదామనే అనుకున్నారు. అంతటి ప్రేమను వారు ఆయన వద్ద చవి చూచారు.కానీ ఆత్మహత్య మహాపాపం గనుక వారాపనిని చెయ్యలేదు. ఆయన లేని కలకత్తాలో ఉండలేక అందరూ దేశం నలుమూలలా తీర్ధయాత్రలకు బయలుదేరారు.గౌరీమా కూడా ఆ విధంగా దాదాపు పదేళ్ళు అనేక క్షేత్రాలు తిరుగుతూ అక్కడ తపస్సు చేస్తూ కాలం గడిపింది.అన్నింటికీ తపస్సే మూలమని వారు తమ దైవం దగ్గర నేర్చుకున్నారు.


అలా దాదాపు పదేళ్ళు గడిచాక, గుర్వాజ్ఞను నెరవేర్చడానికి ఆమె కంకణం కట్టుకుంది.ఆ విధంగా 1895 వ సంవత్సరంలో శ్రీ శారదేశ్వరీ ఆశ్రమ శంకుస్థాపన గంగానదీ తీరంలోని బారక్ పూర్ అనే చోట జరిగింది.


జీవనదులన్నీ తమతమ మూలాలలో చాలా చిన్నవిగానే మొదలౌతాయి. మొదట్లో ఈ ఆశ్రమం కూడా చాలా చిన్నదిగానే ప్రారంభించబడింది.ఈ ఆశ్రమం యొక్క ఆశయాలు చాలా ఉన్నతమైనవి.ముఖ్యంగా స్త్రీల జీవితాలను బాగుచెయ్యడం ప్రధానమైన ఆశయంగా ఉంటూ,హిందూ సంస్కృతిని, వేదోపనిషత్తుల జ్ఞానాన్నీ వారికి నేర్పుతూ, అత్యంత పవిత్రమైన సాధనామయమైన జీవితాన్ని ఎలా గడపాలో ఆచరణాత్మకంగా వారికి శిక్షణ నిస్తూ ఈ ఆశ్రమం సాగింది.దానికి తోడుగా స్త్రీలు తమ కాళ్ళపైన తాము నిలబడి ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఎలా సంపాదించుకోవాలో చెబుతూ దానికి అవసరమైన లౌకిక విద్యనూ,హాండిక్రాఫ్ట్స్ మొదలైన పనులను వారికి ఆశ్రమంలో నేర్పించేవారు.


గౌరీమా ఇలా అనేవారు.

'స్త్రీలకు సరియైన విద్యను నేర్పాలి.వారిని విద్యాశక్తులుగా తీర్చిదిద్దాలి.అలా చెయ్యకపోతే వారు అవిద్యా శక్తులుగా మిగిలిపోతారు.'

ఈ ఆశ్రమాన్ని శ్రీరామకృష్ణుల శిష్యులైన వివేకానందస్వామి, బ్రహ్మానందస్వామి,శివానందస్వామి మొదలైన మహనీయులు ఎందఱో సందర్శించారు.భారతీయ స్త్రీలను, యువతను ఎలా శక్తివంతులుగా చెయ్యాలి, మన హిందూ ధర్మాన్ని ఎలా తిరిగి ఉద్ధరించి మన దేశానికి తిరిగి పూర్వవైభవాన్ని ఎలా తేవాలి? అన్న విషయం పైన వివేకానందస్వామి సుదీర్ఘంగా గౌరీమాతో చర్చించేవారు.ఈ విషయం మీద గౌరీమా మనసులో ఉన్న ప్రణాళికలను విన్న వివేకానంద స్వామి ఎంతో సంతోషించి ఈ విధంగా అన్నారు.

"మన విద్యావిధానం ఎలా ఉండాలంటే,అది విద్యతో బాటు వ్యక్తిత్వానికి మాత్రమే పెద్దపీట వెయ్యాలి.ఈ ఆశ్రమం నుంచి గార్గి,మైత్రేయి,అరుంధతి వంటి మహా తపస్వినులు, బ్రహ్మ వాదినులు,విదుషీమణులు భవిష్యత్తులో ఉద్భవించాలి. వారేకాదు అంతకంటే ఉన్నతమైన స్త్రీలు ఇక్కడనుంచి పుట్టుకురావాలి.స్త్రీలు ఔన్నత్యాన్ని పొందటం వల్లనే ఏ దేశమైనా బాగుపడుతుంది.ఈ విధంగా మన దేశం తిరిగి తన పూర్వవైభవాన్ని పొందాలి."

క్రమేణా గౌరీమా ఉన్నతమైన జీవితాన్ని చూచి ఉత్తేజితులైన స్త్రీలు ఆశ్రమంలో చేరసాగారు.వారిలో ఎక్కువమంది విధవలు, లేదా భర్తచేత వెళ్ళగొట్టబడి చేతిలో డబ్బులేక రోడ్డున పడిన అభాగినులు,లేదా పేద కుటుంబాల నుంచి వచ్చిన అవివాహితలు ఉండేవారు.ఆశ్రమ స్కూలులో వారే టీచర్లుగా పనిచేసేవారు.ఆశ్రమంలోని మిగతా పనులు కూడా వారే చేసుకునేవారు.కులగోత్రాలతో సంబంధం లేకుండా అటువంటి అభాగినులను చేరదీసి అటువంటి వారిని అత్యన్నతమైన జాతి వజ్రాలుగా మహనీయులైన స్త్రీమూర్తులుగా గౌరీమా తీర్చిదిద్దేది.

ఆశ్రమం పెట్టగానే సరిపోదుకదా! దానికి సరిపోయిన ఆర్ధిక వనరులు కావాలి.డబ్బు దగ్గరకు వచ్చేసరికి ఏ కాలంలోనైనా ఏ యుగంలోనైనా మనుషుల ప్రవర్తన ఒకే విధంగా ఉంటుంది. డబ్బనేది చాలావరకూ మంచి పనులకు వినియోగం కాదు. మంచికి విరుద్ధమైన స్వార్ధపూరితమైన పనులకే అది ఎక్కువగా వినియోగం కాబడుతుంది.ఇది లోక సహజం.

ఆశ్రమం మొదలైన కొత్తలో చాలా పేదరికంలో వాళ్ళు బ్రతికేవారు.కనీసం నిత్యావసరాలకు కూడా వారి వద్ద డబ్బు ఉండేది కాదు.అప్పట్లో ఆశ్రమంలో 25 మంది స్త్రీలు ఉండేవారు. స్కూలులో దాదాపు 60 మంది విద్యార్దినులు ఉండేవారు. చాలాసార్లు ఆశ్రమంలో తినడానికి తిండిగింజలు కూడా ఉండేవి కావు.అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గౌరీమా ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసి అలా వచ్చిన ఆహారంతో వారిని పోషించేది.

ఎవరైనా దానికి అభ్యంతర పెడితే ఆమె ఇలా అనేది.

'ఎందుకమ్మా మీరు బాధపడతారు?నేను సన్యాసినిని.భిక్షాటన నా ధర్మం. ఇందువల్ల నాకేమీ బాధ లేదు.మీరు ఆకలితో ఉంటే నేనెలా చూడగలను?'

సర్వసంగ పరిత్యాగినియై ఉండి, తనకంటూ జీవితాంతం ఏమీ దాచుకోని ఆమె,ఆ దిక్కులేని అభాగినుల కోసం ఊరంతా తిరుగుతూనే ఉండేది.ఎవరెవరినో కలసి సహాయం అర్ధిస్తూ ఉండేది.పొద్దున్న ఆశ్రమం లోనుంచి బయటకు వెళ్ళిన ఆమె సాయంత్రానికి డస్సిపోయి మళ్ళీ ఇంటికి చేరేది.

ఈ క్రమంలో ఆమె ఎన్నో చీదరింపులనూ, తిట్లనూ సహించింది. ఆమె కలసిన వారిలో సహాయం చేసేవారు ఉండేవారు, విసుక్కునేవారు ఉండేవారు,తిట్టేవారు ఉండేవారు,ఎగతాళిగా మాట్లాడేవారు ఉండేవారు.వారు ఎలాంటి వారైనా, తనతో ఏ విధంగా ప్రవర్తించినా సరే,ఆమె అన్నింటినీ మౌనంగా భరించేది.తన గురువూ దైవమూ అయిన శ్రీరామక్రిష్ణులను స్మరిస్తూ సహనంతో ఆ అభాగినులకోసం పనిచేసేది.

అంతమాత్రం చేత ఎవరు డబ్బులిచ్చినా ఆమె తీసుకునేదని భావించితే పప్పులో కాలేసినట్లే.ఈ సందర్భంగా రెండు సంఘటనలు వినండి.

ఒకసారి ఒకాయన చాలా పెద్ద మొత్తాన్ని ఆశ్రమానికి విరాళంగా ఇస్తానని ముందుకొచ్చాడు.అప్పట్లో డబ్బు అనేది వారికి చాలా అవసరం కూడా.ఇంకొకరైతే ఎగిరి గంతేసి ఆ డబ్బు తీసుకునే వారు.కానీ గౌరీమా ఆ ధనాన్ని స్వీకరించనని ఖరాఖండిగా చెప్పేసింది.ఆ తరువాత విచారిస్తే - ఆ వ్యక్తి ఆ డబ్బును అవినీతి మార్గాలలో సంపాదించాడని తెలిసింది.

ఇంకొక వ్యక్తి 50,000 రూపాయలను ఆశ్రమానికి విరాళంగా ఇస్తానని ముందుకొచ్చాడు.1900 ప్రాంతాలలో అది ఎంత పెద్ద మొత్తమో మీరు ఊహించవచ్చు.అతని గురించి విచారిస్తే కొన్ని నిజాలు గౌరీమాకు తెలిశాయి.అవేమంటే - అతని అన్న చనిపోయాడు.అన్న ఆస్తిలో వదినకు వాటా వస్తుంది.ఆ వాటాను ఆమెకు రాకుండా చేసి, అలా తను కాజేసిన డబ్బులో కొంత భాగాన్ని పాపపరిహారంగా ఆశ్రమానికి ఇవ్వాలని అతను తలపోశాడు.గౌరీమా ఆ డబ్బును ఏమాత్రం తీసుకోకపోగా అతన్ని పిలిచి చీవాట్లు పెట్టింది.

'ఒక ఆడదాన్ని మోసం చేసి, ఆమెను రోడ్డున పడేసి,అలా కాజేసిన డబ్బులో నాకు వాటా ఇవ్వాలని తలపోస్తున్నావా నీచుడా? ఇలా చెయ్యడం ద్వారా భయంకరమైన పాపాన్ని నీవు మూట గట్టుకుంటున్నావు.ఇప్పటికైనా నీ బుద్ధిని మార్చుకుని మీ వదినకు న్యాయంగా రావలసిన వాటాను ఆమెకు ఇవ్వు.నువ్వు అయిదు లక్షలిచ్చినా సరే నీ డబ్బు నేను తాకను కూడా తాకను' అని ఖచ్చితంగా అతనితో చెప్పేసింది.

పేదరికాన్నైనా సహించేది గాని, వ్యక్తిత్వం లేనివారి విరాళాలు ఆమె స్వీకరించేది కాదు.అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఆమెది.

సేవ పేరుతో విదేశీ మతాన్ని మనపైన రుద్దాలని చూచిన మదర్ తెరెసా వంటి వారిని ఈనాడు మనం మహనీయురాలని పూజిస్తున్నాం.అవార్డులిస్తున్నాం.కానీ గౌరీమా, సిస్టర్ నివేదిత, సిస్టర్ దేవమాత వంటి అసలైన మహనీయులను మనం మర్చిపోయాం.కనీసం వారిని తలచుకోను కూడా తలచుకోము. ఇదీ మన ఖర్మ.

మదర్ తెరెసా ఫోటో పెట్టుకోవడం నేడు చాలామంది హిందువుల ఇళ్ళలో ఒక ఫేషన్ గా మారింది.అలా పెట్టుకుంటే అతనొక పెద్ద ఆదర్శప్రాయుడని ఉన్నతమైన భావాలు కలిగినవాడని నలుగురూ అనుకోవడానికి అలాంటి ఫోటోలు పెట్టుకుంటూ జనాన్ని మోసం చేస్తూ ఉంటారు చాలామంది. ఇలాంటి అజ్ఞానులను చూస్తే నాకుమాత్రం తన తల్లిదండ్రుల ఫోటోలు బయట పారేసి ఎవరో ముక్కూ ముఖం తెలియని వారి ఫోటోలు ఆ స్థానంలో పెట్టుకుని వారే తమ తల్లిదండ్రులని ప్రచారం చేసుకునే నీచులు గుర్తొస్తారు. అలాంటి వారిని చూచి, వీళ్ళకు ఎప్పుడు బుద్దొస్తుందా అని నేను చాలా జాలిపడతాను.

భారతీయుడైన వాడు తన ఇంటిలో ఉంచుకోవలసింది దొంగ బాబాలు,దొంగస్వామీజీలు,రాజకీయ నాయకులు,మదర్ తెరెసాల ఫోటోలు కావు.హిందువైన ప్రతివాడి ఇంట్లోనూ భగవంతుని అవతారమైన శ్రీరామకృష్ణుల ఫోటో ఉండాలి. శ్రీమాత శారదాదేవి ఫోటో ఉండాలి.వివేకానందస్వామి ఫోటో ఉండాలి.గౌరీమా ఫోటో ఉండాలి.అలా ఉన్నప్పుడే మన దేశం నిజంగా బాగుపడుతుంది.ఎందుకంటే, అసలైన దివ్యమూర్తులు వీరే.దీనతతో హీనతతో దిక్కులేక బాధపడుతున్న లక్షలాది మన దేశప్రజలను చూచి విలపించిన దయామూర్తులు వీళ్ళు. మన దివ్యత్వాన్ని మన ధార్మిక వారసత్వాన్నీ మనకు తిరిగి గుర్తు చెయ్యడమేగాక, వాటిని పునరుద్ధరించి తిరిగి మనకు ప్రసాదించిన దేవతా స్వరూపాలు వీళ్ళు.

వీళ్ళను మరచిపోయి ఎవరో మదర్ తెరేసాలనూ, దొంగ బాబాలనూ,దొంగ స్వాములనూ గౌరవిస్తూ పూజిస్తూ ఉన్నంత వరకూ మనకు నిష్కృతి ఎలా కలుగుతుంది? ఔన్నత్యం ఎలా వస్తుంది? మన ధర్మాన్ని మనం మరచిపోవడం అంటే మన తల్లిదండ్రులను మనం మరచిపోవడమే.

ఇలా ఉన్నాం గనుకనే మన ఆధ్యాత్మిక స్థితి ఇలా ఏడ్చింది.

మదర్ తెరేసాకు వందేళ్ళ ముందు గౌరీమా యొక్క అత్యున్నతమైన ఉజ్జ్వలమైన నిస్వార్ధమైన దైవమయమైన జీవితాన్ని ఈ దేశం కనులారా వీక్షించింది.కానీ నేటికీ మనకు మదర్ తెరెసా అంటే ఎవరో తెలుసుగాని గౌరీమా అంటే ఎవరో తెలియదు.ఎంత దౌర్భాగ్యులం మనం?గౌరీమా వంటి నిజమైన మహనీయులను మనం మరచిపోవడం వల్లనే మనకు ధార్మిక దౌర్భాగ్యం దాపురించింది.

మాయ అంటే ఇదిగాకపోతే మరేమిటి?

150 సంవత్సరాల క్రితం-శ్రీరామకృష్ణుల ప్రేరణతో సమాజంలోని స్త్రీల దుస్థితిని,పేదల దౌర్భాగ్యాన్ని పోగొట్టాలని వివేకానందస్వామి, బ్రహ్మానందస్వామి, శివానందస్వామి, అఖండానంద స్వామి,గౌరీమా మొదలైన మహనీయులు పడిన తపనా, చేసిన కృషీ ఫలితంగానే ఈనాడు స్త్రీలు కూడా బాగా చదువుకుంటున్నారు.ఉద్యోగాలు చేస్తున్నారు.వాళ్ళు కూడా ఆర్ధికంగా స్వతంత్రులుగా మారి మగవాళ్ళ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కుంటున్నారు.పాత కాలంలోలా "మా ఖర్మ ఇంతేలే" అని చచ్చేవరకూ ఏడుస్తూ మగవాడి దౌర్జన్యానికి బలైపోయి వాళ్ళు జీవితాలను వెళ్ళబుచ్చడం లేదు. నిస్వార్ధపరులూ దైవాంశ సంభూతులూ అయిన మహనీయుల సంకల్పబలమూ,వారు చేసిన అవిరళకృషుల ఫలితమే నేడు మనం చూస్తున్న ఈ మాత్రం సమానత్వమైనా !

సమానత్వం నిజంగా వచ్చిందా? స్త్రీల బ్రతుకులు నిజంగా బాగుపడినట్లేనా?అని మీరు ప్రశ్నించవచ్చు.నిజమే.ఇంకా సమానత్వం పూర్తిగా రాలేదు.ఒప్పుకుంటాను.కానీ 150 సంవత్సరాల నాటికీ ఇప్పటికీ వచ్చిన మార్పును గమనించండి.బాహ్యంగా మనకు కనిపిస్తున్న ఈ మార్పు అనేది ప్రభుత్వాలు తెచ్చిన మార్పు కాదు.బడా దొంగలైన రాజేకీయ నాయకులు తెచ్చిన మార్పు కాదు.వాళ్ళు ఉత్త మాటలు మాత్రమే చెబుతారు.పనులు మాత్రం వారి స్వార్ధానికే చేసుకుంటారు.

ప్రపంచ భావజాలంలో మహనీయులు మౌనంగా తెచ్చిన మార్పు ఫలితమే ఈనాడు సమాజంలో మనం చూస్తున్న ఈ మార్పు. వారి త్యాగాల ఫలితమే,వారి తపస్సు ఫలితమే - ఈనాడు మనం చూస్తున్న ఈ మార్పు.ముందు కాలాలలో సామాజికంగా ఇంకా పెనుమార్పులు తప్పకుండా వస్తాయి.ఇప్పటివరకూ నిస్సహాయులుగా ఉండిపోయిన స్త్రీలు,బలహీనులు,బలాన్ని సంతరించుకోవడం తప్పకుండా జరుగుతుంది.

శ్రీ శారదేశ్వరీ ఆశ్రమాన్ని విస్తరించడంలో ప్రతి అడుగులోనూ గౌరీమా ఎంతో శ్రమించింది. గురువు కిచ్చిన మాటకోసం 80 ఏళ్ళ పెద్దవయసులో కూడా అనారోగ్యాన్ని ఏమాత్రమూ లెక్క చెయ్యకుండా ఆమె నిరంతర కర్మ వీరురాలిగా బ్రతికింది. ఆమె ఉత్త మాటలపురుగు కాదు.తాను చెప్పిన ఆదర్శాలను తన జీవితంలో చేసి నిరూపించి చూపించింది.ఆమె మనవంటి సామాన్యురాలే అయితే, శ్రీరామకృష్ణుల కటాక్షాన్ని పొందగలిగేదా?

భక్తుల విరాళాలతో విలాస జీవితాలు గడుపుతూ ఏవేవో దిక్కుమాలిన పూజలను జనాల నెత్తిన రుద్దుతున్న నేటి సోకాల్డ్ స్వామీజీలు - గౌరీమా కాలిగోటికి కూడా సరిపోలరని నేను ఘంటాపధంగా చెప్పగలను.

ఆమె మనస్సు నిరంతరం హిమాలయాల సానువుల్లోనే విహరిస్తూ ఉన్నప్పటికీ, ఆమె దేహం మాత్రం నిరంతరం నిస్వార్ధ కర్మ రంగంలో ఉండింది.ఆత్మలో నిశ్చలత్వం, శరీరంతో నిరంతర నిష్కామ సేవ చేస్తూ భగవద్గీతలో చెప్పినట్లు కర్మలో అకర్మను, అకర్మలో కర్మను వీక్షిస్తూ మహాయోగినియై, బ్రహ్మనిష్టురాలై ఆమె జీవితాన్ని గడిపింది.

హిమాలయాలలో ఉండగా ఆమె చేసిన ఘోరమైన తపస్సును చూచిన పరమపూజ్య భోలానాద్ పరమహంస అనే సద్గురువు తన తీర్ధయాత్రలలో భాగంగా కలకత్తాకు వచ్చినపుడు గౌరీమా శిష్యులతో ఇలా అన్నాడు.

"గౌరీమా ఇప్పుడు కర్మిష్టిగా మీకు కనిపిస్తున్నది.కానీ ఆమె ఎంత గొప్ప తపస్వినియో మీకు తెలియదు.హిమాలయాలలో ఆమె చేసిన ఘోరమైన తపస్సును మేము చూచాము.మీలోని బలమైన మగవారు కూడా అటువంటి తపస్సును కలలో కూడా చెయ్యలేరు.మీరిప్పుడు బోనులోని సింహాన్ని చూస్తున్నారు. నిర్భయంగా ఠీవిగా కొండల్లో అడవులలో తిరిగిన సింహాన్ని మేము చూచాము."

క్రమేణా ఆమె దివ్యమైన జీవితాన్నీ ఉన్నతమైన ఆదర్శాలనూ చూస్తున్న ప్రపంచం నుంచి ఆమెకు సహాయం అందసాగింది.ఆ ఆదర్శాలకు ప్రభావితులైన అనేకులు ఆమెకు అనుచరులుగా చేరసాగారు.కానీ ఆమె పేరు ప్రఖ్యాతులను ఆమడ దూరంలో ఉంచేది.ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి.

ఆశ్రమం కొత్త భవనం ప్రారంభోత్సవ సమయంలో ఒక సంఘటన జరిగింది.ఆమెకు చెప్పకుండా చేయించిన శిలాఫలకం మీద "ఈ ఆశ్రమం సన్యాసిని గౌరీమా చేత స్థాపించబడినది" అని శిష్యులు చెక్కించారు.ఆ ఫలకం చూస్తూనే ఆమె కోపంతో ఇలా అరిచింది.

'ఎవరు ఈ పని చేసింది?'

ఇలా అంటూ ఆమె ఆశ్రమం లోనికి రాకుండా వెనక్కు వెళ్లిపోసాగింది.భయపడిన కొందరు శిష్యులు 'అందులో ఏమి తప్పు ఉందని?' అడిగారు.దానికి ఆమె ఇలా జవాబిచ్చింది.

'ఈ ఆశ్రమం శ్రీమాతది. ఆమె పేరు అక్కడ ఉండాలి.నా పేరు కాదు.అసలు నేనెవర్ని?నా పేరు అక్కడ ఎందుకు చెక్కించారు?' ఇలా అంటూ తన పేరుతో ఉన్న శిలా ఫలకాన్ని తొలగించేవరకూ ఆమె ఊరుకోలేదు.

తనకు ఎవరైనా ప్రత్యేక గౌరవాన్ని ఇస్తే ఆమె నెగటివ్ గా స్పందించేది.ఆమె చాలాసార్లు ఇలా అనేది.

"పేరు ప్రఖ్యాతులనేవి పందిపెంట అంత దరిద్రమైనవి.వాటిని చెత్తా చెదారంతో సమానంగా భావించాలి.మన కర్మను నిస్సంగంగా నిర్మోహంగా మనం చెయ్యాలి.కర్మను యోగంగా చేస్తున్నపుడు మీ మనస్సులలో పేరుకోసం గుర్తింపు కోసం యావ ఉన్నట్లయితే ఆరోజే మీరు ఆధ్యాత్మికంగా చనిపోయినట్లు గుర్తుంచుకోండి."

ఒకరోజున కలకత్తాకు వచ్చిన గాంధీ,కస్తూర్బాలు,చిత్తరంజన్ దాస్ తో కలసి గౌరీమాను దర్శించారు.ఆ సమావేశం సందర్భంలో భగవద్గీతను గురించి, త్యాగం యొక్క విశిష్టతను గురించి,శ్రీ రామకృష్ణుల మహోజ్జ్వల దివ్య జీవితాన్ని గురించి ఆమె చేసిన ప్రసంగానికి వారు ముగ్ధులై పోయారు.కానీ, వారిలో చిత్తరంజన్ దాస్ మాత్రమే గౌరీమా పాదాలకు ప్రణామం చేశాడు గాని గాంధీ చెయ్యలేదు.ఆయనకు అంతటి అహంకారం ఉండేది.ఏం చేస్తాం?అలాంటి వాళ్ళు మనకు నాయకులయ్యారు మరి !

ఒక మహనీయురాలిని ఇంకొక నిజమైన మహనీయురాలో నిజమైన మహనీయుడో మాత్రమే గుర్తించగలరు గాని ఊరకే 'మహాత్మా' అని ఎవరో ఇచ్చిన బిరుదును తగిలించుకున్నవారు ఎలా గుర్తించగలరు?

నిరంతరం కర్మరంగంలో నిస్వార్ధంగా పనిచేస్తూ కూడా, ఆమె ఉన్నతములైన సమాధి స్థితులలో ఉంటూ ఉండేది.ఇదెలా సాధ్యమని భావిస్తున్నారా?మరి ఎటువంటివారి కటాక్షాన్ని ఆమె పొందింది? ఒక సంఘటనను ఇక్కడ ప్రస్తావిస్తాను.

తన ఆశ్రమాలలో ఒక దానికి "పంచవటి ఆశ్రమం" అని తన గురుదేవుల సాధనా రంగస్థలం యొక్క పవిత్రమైన పేరును ఆమె పెట్టుకుంది.ఒకరోజు సాయంత్రం తన ఆశ్రమంలోని చెట్టు క్రింద నిలబడి ఈ కృష్ణ కీర్తనను ఆమె ఆలపించసాగింది.

ప్రభూ ! నీ పాదాలు నిత్యానంద నిలయాలు
అక్కడ భయం అనేది లేదు
వాటిని తాకిన నేనీ లోకంలో నిర్భయంగా తిరుగుతాను
నాకు అలసట కలిగితే నీ కౌగిలిలో సేదదీరుతాను
పరమ సౌందర్యమయమైన నీ ముఖాన్ని
ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాను...

ఈ పాట పాడుతున్న ఆమె మనస్సు క్రమేణా బాహ్యస్మృతిని కోల్పోయి సమాధిలోకి వెళ్ళిపోయింది.శరీరాన్ని మరచిపోయిన ఆమె అలాగే శిలావిగ్రహం లాగా ఆ చెట్టుక్రింద నిల్చుని ఉండిపోయింది.ఆమెకు శ్వాస లేదు.కనురెప్పలు కదలడం లేదు.నాడి ఆడడం లేదు. చీకటి పడింది. రాత్రి ముగిసింది. తెల్లవారింది. కానీ ఆమె అలాగే శిలా విగ్రహంలాగా ఆ చెట్టుక్రింద నిలబడే ఉన్నది.ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల ప్రజలు ఉదయం నుంచీ తండోపతండాలుగా వచ్చి ఆమెకు పూలతో అభిషేకం చెయ్యసాగారు. అయినా ఆమెలో ఏ చలనమూ లేదు.మర్నాడు మధ్యాన్నం దాదాపు పదకొండు గంటలకు ఆమె మెల్లిగా సమాధిని వదలి బాహ్యస్పృహలోకి వచ్చింది.అంటే దాదాపుగా 17 గంటలపాటు ఆమె శిలావిగ్రహంలా నిలబడి సమాధి స్థితిలో ఉండిపోయింది.

శ్రీ రామకృష్ణుల అనుగ్రహమంటే అది !

ఆమె శిక్షణలో ఎందఱో స్త్రీలు మహనీయులైన ఋషీమణులుగా ప్రకాశించారు.ఆమె రక్షణలో ఎందఱో అభాగినులు మళ్ళీ తమ తమ జీవితాలలో వెలుగును చూచారు.తన గురుదేవుల దేహత్యాగం తర్వాత 56 ఏళ్ళు ఆమె బ్రతికింది. కానీ అనుక్షణం ఆయన చెప్పిన మార్గంలోనే నడుస్తూ,ఆయన చెప్పిన పనిని తూచా తప్పకుండా చేస్తూ,తన చివరిరోజు వరకూ ఆయన కిచ్చిన మాటను నెరవేర్చడానికి కష్టపడింది.తన వారసత్వాన్ని కొనసాగించే సమర్ధులైన దేవతలవంటి స్త్రీ మూర్తులను తయారు చేసే వ్యవస్థను నెలకొల్పింది.  

ఈ విధంగా ఎంతో పవిత్రమైన ధన్యమైన తపస్సంపన్నమైన జీవితాన్ని తన గురుదేవుల కిచ్చిన మాట ప్రకారం జనారణ్యం అయిన కలకత్తా నగరంలో జనమధ్యంలోనే గడపిన పరమపూజ్య గౌరీమా 1938 సంవత్సరపు శివరాత్రి రోజున సమాధి స్థితిలో దేహాన్ని వదలి వేసింది.

శివరాత్రి రోజున గౌరీమా తన అంతరంగ శిష్యులతో ఇలా చెప్పింది.

'గురుదేవులు మళ్ళీ నా హృదయాన్ని తన దారంతో బంధించి లాగుతున్నారు.56 ఏళ్ళ క్రితం ఆయన మొదటి సారిగా ఇలా లాగి నన్ను ఆయన దగ్గరకు చేర్చుకున్నారు.మళ్ళీ ఇప్పుడు నా హృదయాన్ని ఆయన పట్టి లాగుతున్నారు.నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది.'

చీకటి పడుతూ ఉండగా ఆమె ఇలా అన్నది.

"ఈరోజున వేరే విషయాలు ఏమీ మాట్లాడను.నా గురువు, నా దైవం, మనందరి దైవం అయిన శ్రీరామకృష్ణుల గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం."   

ఇలా అంటూ ఆమె తన గురుదేవుల దివ్యజీవితం గురించి అనర్గళంగా రెండు గంటలపాటు మాట్లాడింది.ఆ తర్వాత ' గురు శ్రీరామకృష్ణా, గురు శ్రీరామకృష్ణా, గురు శ్రీరామకృష్ణా..' అని మూడుసార్లు ఉచ్చరించింది.ఆ తర్వాత తన చుట్టూ కూర్చుని ఉన్న శిష్యులతో - 'అందరూ నిశ్శబ్దంగా ఉండండి.నన్ను కదిలించకండి' అని చెప్పింది.అలా చెబుతూ మెల్లిగా కన్నులు మూసుకుని ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయింది.

ఎనభై ఏళ్ళ సుదీర్ఘమైన పవిత్ర తపోమయ జీవితాన్ని గడపిన ఆ మహనీయురాలు తన ఇష్టదైవమైన శ్రీ రామకృష్ణులను ధ్యానిస్తూ శివరాత్రి పూట తన ఇష్టానుసారంగా దేహాన్ని సమాధిస్థితిలో వదిలేసి ఎవరినైతే తన జీవితమంతా ధ్యానించిందో వారి దగ్గరకు చేరుకుంది.

ఆమె ఈ భూమి మీద బ్రతికిన 80 ఏళ్ళలో - మొదటి 40 ఏళ్ళను తన శరీరాన్నీ మనస్సునూ ఏమాత్రమూ లెక్కచెయ్యకుండా భగవంతుని పట్ల పరిపూర్ణ శరణాగతితో తీవ్రమైన తపస్సులో గడిపింది.మిగిలిన 40 ఏళ్ళూ తన గురుదేవుల కిచ్చిన మాట కోసం - దిక్కులేని స్త్రీలను చేరదీసి వారిని ఉజ్జ్వలమైన దివ్యమూర్తులుగా తీర్చి దిద్దుతూ నిరంతర కర్మవీరురాలిగా నిస్వార్ధమయమైన జీవితాన్ని గడపింది.చివరకు శివరాత్రి సమయంలో స్వచ్చందంగా సమాధిస్థితిలో దేహాన్ని వదిలేసి ఒక మహాయోగినిలా భగవంతునిలో ఐక్యం అయింది.

"మృడాని" అన్న శివుని పేరును తల్లిదండ్రులు ఆమెకు ఇచ్చారు. "గౌరీ" అన్న దీక్షా నామాన్ని గురుదేవులు ఇచ్చారు.ఈ రెంటినీ సార్ధకం గావిస్తూ శివరాత్రి నాడు శివస్వరూపుడైన శ్రీరామకృష్ణుల పాదాల చెంతకు ఆమె శాశ్వతంగా చేరుకుంది.

ఏమిటా జీవితం !! ఏమిటా వ్యక్తిత్వం !!

మహనీయులు ఈ లోకంలో పుట్టే తీరూ,ఇక్కడ బ్రతికే తీరూ, ఇక్కడనుంచి నిష్క్రమించే తీరూ - అన్నీ విలక్షణంగానే అద్భుతంగానే ఉంటాయని చెప్పడానికి గౌరీమా జీవితమే స్పష్టమైన ఉదాహరణ.

ఇలాంటి వాళ్ళు కారా ప్రాతస్మరణీయులు? ఇలాంటి వాళ్ళు కారా పూజార్హులు? ఇలాంటి వాళ్ళు కారా లోకానికి నిజమైన గురువులు? ఇలాంటి వారి వల్ల కాదా ఈ భరతభూమిలో ఇంకా ధర్మం నిలిచి ఉన్నది? ఇలాంటి వారు పుట్టడం వల్ల కాదా ఈ భూమి బ్రద్దలు కాకుండా ఇంకా నిలబడి ఉన్నది?

గౌరీమా స్థాపించిన 'శ్రీ శారదేశ్వరీ ఆశ్రమం' ఈనాటికీ కలకత్తాలో ఉన్నది.ఈ ఆశ్రమానికీ రామకృష్ణా మిషన్ కూ సంబంధం లేదు. ఈ ఆశ్రమంలో గురువులుగా ఈనాటికీ స్త్రీలే పరంపరగా వస్తున్నారు.ప్రస్తుతం 'వందనా మా' అనబడే దివ్యమూర్తి నేతృత్వంలో ఈ ఆశ్రమం గౌరీమా పెట్టిన - బ్రహ్మచర్యం, తపస్సు,నిస్వార్ధసేవ,స్త్రీ జనోద్దరణ - అనే ఆశయాలకు అనుగుణంగా నడుస్తూనే ఉన్నది.

గౌరీమా తర్వాత ఈ ఆశ్రమానికి అధ్యక్షులుగా దుర్గామా, సువ్రతా మా, వందనా మా - అనబడే దివ్యమూర్తులు వచ్చారు.వీరిలో ప్రస్తుతం "వందనా మా" జీవించి ఉన్నారు.వీరెవ్వరూ మామూలు మనుషులు కారు. "వందనా మా" ఆరేళ్ళ వయసులో దీక్షా స్వీకారం చేసి,18 ఏళ్ళ వయసులో సన్యాసం స్వీకరించిన మహనీయురాలు.ఈమెకిప్పుడు 90 ఏళ్ళు.వారి ఉజ్జ్వలములైన జీవితాలను గురించి నేను చెబితే చాలా పేలవంగా ఉంటుంది. మీ అంతట మీరే చదవండి.

ఈ ఆశ్రమం వెబ్ సైట్ ఇక్కడ చూడవచ్చు.

http://saradeswariashram.org/


ఈ ఆశ్రమం యొక్క రెండు ప్రత్యేకతలు మీకు ప్రస్తావిస్తాను.

ప్రపంచంలో రెండు అత్యంత విలువైన వస్తువులు ఈ ఆశ్రమంలో ఉన్నాయి.ఒకటి - గౌరీమా జీవితాంతం పూజించిన శక్తివంతమైన దామోదర సాలగ్రామం. రెండు - శ్రీ రామకృష్ణులు తన సాధనా సమయంలో వాడిన జపమాల.

శ్రీరామకృష్ణులు శారదామాతను జగజ్జనని అయిన లలితాదేవిగా అర్చించారు.దీనినే షోడశీపూజ అంటారు.ఈ షోడశీపూజా సమయంలో, తన సాధనా ఫలాన్ని మొత్తాన్నీ తన జపమాలతో సహా, శ్రీమాత పాదాల వద్ద సమర్పించి నేలపైన సాగిలపడి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశారు ఆయన. అప్పటినుంచీ ఆ జపమాల శ్రీమాత వద్దనే ఉన్నది.ఈ జపమాలను శ్రీమాత తన దేహత్యాగ సమయంలో గౌరీమా శిష్యురాలైన దుర్గామా కు ఇచ్చారు.అప్పటి నుంచి ఆ జపమాల 'శ్రీ శారదేశ్వరీ ఆశ్రమం' లో ఉన్నది.

ప్రపంచంలోని అత్యంత విలువైన వస్తువు ఏదంటే చాలామంది చాలా రకాలైన సమాధానాలు ఇవ్వవచ్చు.కానీ నేను మాత్రం తడుముకోకుండా ఒక్కటే చెబుతాను.భగవంతుని అవతారం అయిన శ్రీరామకృష్ణులు వాడిన జపమాలను మించిన విలువైన వస్తువు ఈ భూమ్మీద ఎక్కడా లేదు.కోహినూర్ వజ్రమైనా సరే ఈ జపమాల ముందు చెత్తతో సమానం నాకు.అలాంటి అద్భుతమైన వస్తువు ఈ ఆశ్రమంలో ఇప్పటికీ ఉన్నది.

వారి ప్రాణాలకంటే ఎక్కువగా ఈ రెండు వస్తువులనూ వారు ఈనాటికీ రక్షించుకుంటూ వస్తున్నారు.

గౌరీమా గురించి ఇంత సుదీర్ఘంగా ఎందుకు వ్రాయవలసి వచ్చిందని మీకు అనుమానం రావచ్చు.

నేను అమెరికా వెళ్ళినపుడు మిషిగన్ గాంగెస్ లో స్పిరిట్యువల్ రిట్రీట్ జరిపిన mothers trust/mothers place ashram ఈ శారదేశ్వరీ ఆశ్రమానికి అమెరికాలో ఉన్న ఏకైక బ్రాంచ్ కావడమే ఇదంతా వ్రాయడానికి కారణం.

ఈ అమెరికా ఆశ్రమానికి అధ్యక్షురాలిగా ఉన్న "ఇవా ష్రోడర్" అనబడే స్త్రీమూర్తి యొక్క సన్యాసనామం కూడా - 'గౌరీవ్రత పురీదేవి" కావడమూ, ఈమె కూడా అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన సన్యాసిని కావడమూ,ఆమె నన్నూ మా బృందాన్నీ ఎంతగానో అభిమానించి,'గురూజీ' అంటూ నన్ను సంబోధించి ఎంతో ఆత్మీయంగా మమ్మల్ని చూడడమూ - ఈ సంఘటనలన్నీ వివరించే ముందుగా,దీనికంతా మూలమైన అసలు "గౌరీమా" ఎవరో ఆమె జీవితం ఎంత అద్భుతమైనదో చెప్పడం కోసమే ఇదంతా వ్రాస్తున్నాను.

పొద్దున్న లేచిన దగ్గరనుంచీ పరమ స్వార్ధంతో, అహంకారంతో, కుళ్ళుతో మనస్సులు నింపుకుని, విలాసాల కోసం,వినోదాల కోసం అమూల్యమైన జీవితాన్ని వృధా చేసుకుంటూ అదే పెద్ద ఘనకార్యం అన్నట్లు బ్రతుకుతున్న మనమెక్కడ? శరీరాన్నీ దాని సుఖాన్నీ ఏమాత్రమూ లెక్కచెయ్యని తీవ్రమైన తపోదీక్షలో భగవంతుని దర్శనాన్ని పొంది, సర్వజీవులలోనూ ఆయన్నే చూస్తూ, లోకపు పాపాన్నీ, దాని ఫలితమైన దుఖాన్నీ కడగాలని జీవితాంతం నిస్వార్ధంగా ప్రయత్నించిన గౌరీమా వంటి మహనీయులెక్కడ? మనకూ వారికీ అసలు పోలికేమైనా ఉన్నదా కొంచమైనా? 

మనమంతా తలలు వంచి మ్రొక్కవలసిన 'గౌరీమా' దివ్యజీవితం గురించి చదివారు కదా ! మీలో ఎవ్వరికీ తెలియని అద్భుతములైన విషయాలు తెలుసుకున్నారు కదా !

వచ్చే పోస్ట్ లో mothers trust/mothers place ashram గురించీ,నా అమెరికా యాత్ర సందర్భంగా అక్కడ జరిగిన అద్భుతాల గురించీ చదవండి.

(ఇంకా ఉంది)