“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, ఆగస్టు 2016, మంగళవారం

మా అమెరికా యాత్ర - 35 (గౌరీమా - గురూపదేశం)

వెనక్కు వచ్చిందే గాని మృడాని మనస్సంతా దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల పాద సన్నిధిలోనే ఉంది. కొద్దిగా వీలు చిక్కగానే ఆమె ఒక్కతే దక్షిణేశ్వరం బయలుదేరింది.ఈసారి తోడుగా ఎవరినీ తీసుకు వెళ్ళలేదు.ఒక్కతే దేశమంతా నిర్భయంగా తిరిగిన అమ్మాయి,ఆమెకు భయమేముంది?కలకత్తాలోనే ఒకచోట నుంచి ఇంకొక చోటకు వెళ్ళడానికి ఆమెకు తోడెందుకు?ఆ విధంగా అతి త్వరలోనే మళ్ళీ శ్రీ రామకృష్ణులను ఒంటరిగా దర్శించింది.

ఆయన ఎంతో ప్రేమగా ఆమెను ఆహ్వానించారు.

ఆయన పాదాల మీద వాలిపోయి కన్నీటితో వాటిని అభిషేకించిందామె.

తన దు:ఖావేశం తగ్గి కొద్దిగా స్థిమితపడిన తర్వాత లేచి కూర్చుని, తన మనస్సును తొలుస్తున్న ప్రశ్నలను ఆయన ముందు ఒక్కొక్కటిగా ఉంచింది మృడాని.

'మీరిక్కడే మానవరూపంలో ఉండి నన్నెందుకు ఇన్నేళ్ళూ ఎక్కడెక్కడో తిప్పారు?'

'నువ్వు మొదటిరోజే నన్ను గుర్తిస్తే ఇంత సాధన నీవు చేసేదానవా?' అని ఆయన ఎదురు ప్రశ్నించారు.

'సాధన ఎందుకు చెయ్యాలి? జపతపాది సాధనల పరమార్ధం మీ దర్శనమే కదా? మీరే ఎదురుగా ఉన్నపుడు ఇంకా నాకు సాధన ఎందుకు?' అడిగిందామె.

'నేను చెబుతున్నదీ అదే.మనం ఈలోకానికి వచ్చింది మనకోసం కాదు.అందరిలా మన పొట్టకోసం మనం ఇక్కడకు రాలేదు. లోకమంతా స్వార్ధంలోనూ పాపంలోనూ కూరుకుపోయి ఉన్నది. ఆ భారం భూమి భరించలేనంతగా తయారైంది.కనుక ఆ పాపాన్నీ ఆ స్వార్దాన్నీ ప్రక్షాళన చెయ్యాల్సిన సమయం వచ్చింది.నేనందుకే ఈ భూమికి వచ్చాను.నాతో బాటుగా మిమ్మల్నందరినీ కూడా ఈ భూమికి తెచ్చాను.' అన్నారాయన నవ్వుతూ.

'అలాంటప్పుడు మమ్మల్ని మీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా.ఇలా దూరంగా ఉంచడం ఎందుకు?' అన్నదామె.


'మీరందరూ ఇక్కడకు వచ్చింది ఆ పాపప్రక్షాళనా కార్యక్రమంలో నాకు సహాయం చెయ్యడానికి మాత్రమే.నువ్వొక్కదానివే కాదు ఇంకా చాలామంది మన బృందంలో ఉన్నారు.మీరు చెయ్యవలసిన పని ఎంతో ఈ లోకంలో ఉన్నది.దానికోసం ఇదంతా నీకు శిక్షణ మాత్రమే.

తపస్సు ద్వారానే ఔన్నత్యం కలుగుతుంది.తపస్సు ద్వారానే పాపప్రక్షాళన జరుగుతుంది.ఉత్త మాటలవల్ల అది జరగదు. మీరు చేసిన తపస్సు మీకోసం కాదు.ఆ అవసరం మీకు లేదు.మీరంతా నిత్యముక్తులు,నా అంతరంగ బృందంలోని వారు.మీకు బంధం లేదు.మీ తపస్సంతా లోకం కోసమే.నువ్వు చేసిన తపస్సు వల్ల ఈ దేశపు స్త్రీలకు ఎంతో మేలు జరుగుతుంది.వారి ఔన్నత్యాన్నికి అడ్డు పడుతున్న చెడుకర్మ నీలాంటి పవిత్రాత్ముల తపస్సు వల్ల తొలగిపోతుంది.ఎన్నో కోట్లాదిమంది స్త్రీల పాపఖర్మాన్ని నీ తపస్సు ద్వారా నీవు భరించి వారికి శాంతిని చేకూర్చాలి.అదే నీ వంటివారి జీవనగమ్యం.

నువ్వు నా ఎదురుగా కూచుని ఉంటే,ఇటువంటి తపస్సును, ఎప్పటికీ చెయ్యలేవు.నానుంచి నీ దృష్టిని మరల్చుకోలేవు. కనుకనే నిన్ను నానుంచి దూరదూరంగా ఉంచి ఇన్నాళ్ళూ దేశాలు తిప్పాను.' అన్నారాయన.

'మరి ఇప్పుడెందుకు కనిపించారు?' అడిగిందామె.

'నీ శిక్షణ అయిపోయింది.ఇప్పుడు నీకు పరిపక్వత వచ్చింది. ఇన్నేళ్ళూ నీవు చేసిన తపస్సువల్ల నీలో ఎంతో నిశ్చలత్వమూ, ధైర్యమూ కలిగాయి.లోకం ఎలా ఉంటుందో మనుషుల మనస్సులు ఎంత చండాలంగా ఉంటాయో, వాళ్ళ ప్రవర్తనలు ఎంత స్వార్ధపూరితాలుగా దరిద్రంగా ఉంటాయో నీవు అనుభవపూర్వకంగా చూచావు.ఈ స్వార్ధపూరిత లోకంలో, నీవిప్పుడు ఒంటరిగా ఉంటూ కూడా పవిత్రురాలవై బ్రతకడమే గాదు,ఎంతోమందిని నీవిప్పుడు ఉద్ధరించగలుగుతావు.బురదలో ఉంటూ కూడా పద్మంలా స్వచ్చంగా నీవిప్పుడు ప్రకాశించగలవు. అంతేగాక నీ తపోశక్తితో ఎంతోమందికి నీవు సహాయం చెయ్యగలవు.అందుకే నీకిప్పుడు నేనెవరో తెలియజేశాను.' అన్నారాయన.

'నేనేమీ అలాంటివి చెయ్యను.ఈ కుళ్ళు లోకంతో అలాంటి అవసరం నాకు లేదు.ఈ లోకంలో ఎవరి ఖర్మ వారిది.ఈ లోకోద్ధరణ పని నాకెందుకు?' అన్నదామె.

చిరునవ్వు నవ్వారు శ్రీ రామకృష్ణులు.

'నీ చేతిలో ఏముంది?నువ్వు స్వతంత్రురాలనని అనుకుంటున్నావా? ఎందుకు నిన్నీ లోకంలోకి తెచ్చానో ఆపని నువ్వు చెయ్యక తప్పదు.నీకిష్టమున్నా సరే, లేకున్నా సరే.' అన్నారాయన.

'సరే.వింటాను.మీరు చెప్పినట్లే లోకం కోసం పాటుపడతాను. కానీ నా మనస్సు ఎల్లప్పడూ మీ ధ్యానంలోనే ఉండాలి.లోకంలో ఎంత కర్మ చేస్తున్నప్పటికీ ఒక్క క్షణం కూడా మిమ్మల్ని నేను మరచి పోకూడదు.మీ దర్శనం నాకు నిత్యమూ కలుగుతూ ఉండాలి.అలాంటి స్థితిలో నన్నుంచితే మీరు చెప్పినట్లు లోకోద్ధరణ కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటాను.' అన్నదామె.

'నువ్వు అడుగుతున్నది నిత్యసమాధి స్థితి.నిత్యసమాధిలో ఉంటే,నీ కర్మేంద్రియాలు పనిచెయ్యవు గనుక, ఆ స్థితిలో నువ్వు ఎంతమాత్రమూ కర్మ చెయ్యలేవు.నీ గమ్యం అది కాదు.

కనుక నువ్వు అడిగిన మొదటివరం ఇస్తానుగాని రెండవవరం ఇప్పుడే ఇవ్వను.నీ మనస్సు నిత్యమూ నా ధ్యానంలోనే ఉంటుంది. కానీ నా దర్శనం మాత్రం నిత్యమూ నీకు కలగదు.ఆ స్థితిలో ఎల్లప్పుడూ నువ్వుంటే,అంతటి ఆనందపు వెల్లువను భరించలేని నీ శరీరం,21 రోజుల తర్వాత పండుటాకులా రాలిపోతుంది.అందుకని, అవసరం అయినప్పుడూ, నాకు ఇష్టం అయినప్పుడూ మాత్రమే నీకు కనిపిస్తాను.నిత్యమూ నా దర్శనం నీకు లభించదు.ఈ లోకంలో చెయ్యవలసిన పని పూర్తి చేసిన తర్వాత నువ్వు నా దగ్గరకే వస్తావు.ఆ తర్వాత ఎల్ల కాలమూ నాతోనే ఉంటావు.' అన్నారాయన.

తన జీవితగమ్యం ఏమిటో, తానెందుకు ఈ భూమికి వచ్చానో, అసలు తానెవరో, శ్రీ రామకృష్ణులెవరో, ఆయనకూ తనకూ ఉన్న బంధం ఏమిటో,ఈ జీవితం అయిపోయాక తానెక్కడికి పోవాలో - అన్నీ మృడానికి ఆ క్షణంలో అర్ధమై పోయాయి."మానవజీవిత మౌలిక ప్రశ్నలకు" ఆ విధంగా ఆమెకు సమాధానం లభించింది.

'భిద్యతే హృదయగ్రంధి శ్చిద్యతే సర్వసంశయా:' - అనిన వేదవాక్యం ప్రకారం ఆమె హృదయ గ్రంధులన్నీ వీడిపోయాయి. ఆమె సందేహాలన్నీ మాయమై పోయాయి. తానెవరో తనకు తెలియడంతో ఆత్మసాక్షాత్కారం ఆమెకు లభించింది.శ్రీ రామకృష్ణులెవరో తెలియడంతో దైవసాక్షాత్కారం దొరికింది.ఆ విధంగా ఆమె జీవితం పరిపూర్ణంగా ధన్యత్వాన్ని సంతరించుకుంది.

ఒక సద్గురువు లభించడమే, మనిషి జీవితంలో మహాదృష్టం అనబడుతుంది.అలాంటిది సాక్షాత్తూ భగవంతుడే గురువుగా లభించడం ఇంక ఎంత అదృష్టమో ఊహించలేము. ఊహకు అందనంత పుణ్యం మనతో ఉంటేగాని ఇలాంటి అద్భుతం సాధ్యం కాదు. ఆ అదృష్టం మృడానికి దక్కింది.

తనతో మాట్లాడిన తర్వాత, కాళికాలయంలోనే ఒక వైపున ఉన్న నహబత్తులో నివసిస్తున్న శ్రీమాత వద్దకు వెళ్లి ఆమె ఆశీస్సులు పొందమని శ్రీరామకృష్ణులు మృడానిని పంపించారు.సాక్షాత్తు జగజ్జనని ప్రతిబింబాన్ని శ్రీమాతలో చూచిన మృడాని అప్రతిభురాలై పోయింది. ఎన్నాళ్ళ తర్వాతో కనిపించిన తన కూతురిని దగ్గరకు తీసుకున్నట్లుగా శ్రీమాత మృడానిని అక్కున జేర్చుకుంది.

హిమాలయాలలో సాధువేషంలో సంచరించినప్పటికీ మృడాని ఇంతవరకూ సాంప్రదాయబద్దంగా సన్యాసం స్వీకరించలేదు. కనుక ఒకరోజున శ్రీరామకృష్ణులే స్వయంగా మృడానికి తన చేతులమీదుగా సన్యాస దీక్షను ఇచ్చారు.ఆ సమయంలో ఆమెకు 'గౌరీమాతా పురీదేవి' అన్న నూతన నామధేయాన్ని ప్రసాదించారు.దశనామీ సాంప్రదాయంలో 'పురి' అన్న నామాన్ని శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యులందరూ కలిగి ఉంటారు.ఎందుకంటే వారి గురువులైన 'పరమహంస తోతాపురి' కూడా 'పురి' అన్న శాఖకు చెందినవారు కనుక.

బృందావనంలో తనకు దర్శనమిచ్చిన శ్రీకృష్ణుడు, 'గౌరీ' అన్న పేరుతో తనను పిలవడం అప్పట్లో ఆమెకు చాలా వింతగా అనిపించింది. తన పేరు మృడాని అయితే తనను 'గౌరీ' అని కృష్ణుడెందుకు పిలిచాడో అని ఆమె అనుకుంటూ ఉండేది.కానీ ఇప్పుడు మళ్ళీ శ్రీరామకృష్ణులు కూడా అదే నామాన్ని తన సన్యాస దీక్షా సమయంలో తనకు ఇవ్వడంతో ఆమెకు చాలా సంతోషం కలిగింది.

ఆయనిలా అన్నారు.

'శివుని కోసం పార్వతి ఎంతో తపించింది.ఎంతో తపస్సు చేసింది.అసలే తెల్లనైన ఆమె,నిద్రాహారాలు లేని ఆ భయంకరమైన తపోఫలితంగా యింకా తెల్లగా పాలిపోయినట్లు అయింది.ఆమెలాగే నువ్వూ నాకోసం తీవ్రమైన తపస్సు చేశావు. గౌరిలాగే నీవూ ఆకలిదప్పులను,చలిని ఎండను మానావమానాలను మౌనంగా సహించావు.కనుక నీకు కృష్ణునిలా దర్శనం ఇచ్చినపుడు అదే పేరుతో నిన్ను పిలిచాను.ఇప్పుడు కూడా నీకు 'గౌరీ' అన్న పేరునే ఇస్తున్నాను.

శ్రీ రామకృష్ణులు ఆమెను 'గౌర్దాసీ' అని కూడా పిలిచేవారు.ఈ మాటకు అర్ధం గౌరాంగుని (చైతన్య మహాప్రభుని) దాసి అని అర్ధం.

మృడాని జీవితంలో ఆనందపు దినాలు ప్రవేశించాయి. దు:ఖమనేది ఆమె జీవితం నుంచి సంపూర్ణంగా మాయం అయిపోయింది.తాను ఎవరికోసమైతే వెదుకుతూ ఉన్నదో వారే ఎదురుగా కనిపించి, తనను దగ్గరకు తీసుకుని కరుణిస్తే, అంతకంటే ఆమెకు కావలసినది ఇంకేముంటుంది?

క్రమేణా ఆమె దక్షిణేశ్వర పరిసర ప్రాంతాలలోనే నివసించ సాగింది. రాత్రిళ్ళు శ్రీమాతతో ఆమె గదిలో నిద్రించేది.

ఈ విధంగా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజున ఒక వింత సంఘటన జరిగింది.

ఆ రోజున మృడాని నహబత్తు దగ్గర శ్రీమాతతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రీ రామకృష్ణులు అక్కడకు వచ్చారు.ఆయన చేతిలో ఒక కుండా దానిలో నీరూ ఉన్నాయి.

ఆ నీటిని నేలమీద ధారగా పొయ్య సాగారాయన.

ఆయన ఏం చేస్తున్నారో అర్ధం కాక మృడాని ఆయనవైపే విచిత్రంగా చూడసాగింది.

'ఏంటలా చూస్తున్నావు? నేను నీరు పోస్తున్నాను.నువ్వు మట్టి కలుపు' అన్నారాయన నర్మగర్భంగా నవ్వుతూ.

'అక్కడ మట్టి లేదు.అదంతా కంకర.లేని మట్టిని ఎలా కలుపను?' అందామె.

శ్రీ రామకృష్ణులు మళ్ళీ నవ్వారు.

'నీకర్ధం కావడం లేదు.ఈ కనిపిస్తున్న మట్టిని కలపమని నేను నీకు చెప్పడం లేదు.

ఈ దేశంలో స్త్రీల పరిస్థితిని చూడు.ఎంత ఘోరంగా ఉన్నదో?వారికి చదువు లేదు.ఆర్ధిక స్వతంత్రం లేదు.బలం లేదు.విలువ లేదు.ఎప్పుడూ ఎవరో ఒకరి రక్షణలో బ్రతకాలి.ఎవరో ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతకాలి.చీదరలూ, విసుగులూ,తిట్లూ,దెబ్బలూ అన్నీ భరించాలి.అనుక్షణం ఎవరో ఒకరికి భయపడుతూ బ్రతకాలి.దానికి తోడు భర్త మంచివాడైతే పరవాలేదు.కానీ అతడే ఒక మూర్ఖుడూ,వ్యసనపరుడూ, దుర్మార్గుడూ అయితే ఇక ఆ స్త్రీ బ్రతుకు నరకమే. వీటన్నిటికీ తోడుగా సమాజంలో ఉన్న బాల్యవివాహాల వంటి ఆచారాలు చూడు.

చిన్నప్పుడే భర్తను కోల్పోయిన స్త్రీ బ్రతుకు ఇంకెంత నరకమో చూడు.తమ్ముడో అన్నో ఎవరో ఒకరి ఇంట్లో ఆమె వంటమనిషిగా పనిమనిషిగా తన జీవితాంతం బ్రతుకును వెళ్ళబుచ్చాలి. కోరికలు అణచివేసుకుని ఒక మానసిక రోగిలా తయారై ఆ విసుగును అందరిమీదా చూపిస్తూ, అధికారం చెలాయించాలని ప్రయత్నిస్తూ నిరర్ధకమైన బ్రతుకును గడపాలి.ఈ విధంగా కోట్లాది మంది స్త్రీల జీవితాలు ఈ దేశంలో మట్టిలో కలసి పోతున్నాయి.

ఈ దేశంలో స్త్రీల బ్రతుకులు ఇలా తెల్లవారి పోవలసిందేనా? వీరికోసం నువ్వు ఏమీ చెయ్యలేవా?

నేను నీరు పోస్తున్నాను.నువ్వు మట్టిని కలుపు - అంటే అర్ధం ఇదే.మీకు కావలసిన జీవమూ బలమూ నేనిస్తాను.మీకు ప్రాణాధారంగా నేనుంటాను.పనిని మీరు చెయ్యాలి.ఏ మట్టిలో అయితే ఈ స్త్రీల జీవితాలన్నీ కలుస్తున్నాయో అదే మట్టిని నీవు కలపాలి.అదే మట్టిలోనుంచి,అదే మట్టితో, ఒక అద్భుతమైన కట్టడాన్ని నీవు కట్టాలి.దానికి కావలసిన నీటిని నేనిస్తాను.

ఈ లోకంలో నీకోసం నువ్వు చెయ్యవలసిన పని ఏమీ లేదు.నీవు కర్మకు అతీతురాలవయ్యావు.ఇప్పుడు సాటి స్త్రీలకోసం నువ్వు పనిచెయ్యాలి.వారి బ్రతుకులు బాగుపడడానికి నువ్వు కృషి చెయ్యాలి. మట్టిని కలపమని నేను చెప్పడంలో అర్ధం ఇదే. నువ్వు మట్టిలో చేతులు పెట్టాలి.ఆ బురదను కలపాలి. దానినుంచి ఒక కట్టడాన్ని నిర్మించాలి.ఆ క్రమంలో నీ చేతులు బురదగా మారినా నువ్వు చలించకూడదు.ఇదంతా నీ స్వార్ధం కోసం కాదు నిస్వార్ధంగా నువ్వు చెయ్యాలి.కనీసం పేరు ప్రతిష్టల కోసమూ, జనుల గౌరవం కోసమూ, మెప్పు కోసమూ కూడా నువ్వు ఆశపడకూడదు.స్త్రీల జీవితాలను నువ్వు బాగు చెయ్యాలి. ఇదంతా నీకోసం కాదు, నాకోసం చెయ్యాలి. నువ్వు సిద్ధమేనా?' అన్నారు శ్రీ రామకృష్ణులు.

సమాజంలోని ఈ పరిస్థితులన్నీ మృడాని స్వయానా చూచినవే. ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నపుడే తాను చిన్నప్పటి నుంచీ చూచిన అనేకమంది స్త్రీల బాధామయ జీవితాలు తన కళ్ళముందు మెదలి ఆమెకు కన్నీరు ధారలు కట్టింది.

ఆయన చెబుతున్నది నిజమే.తనకు ఈ జీవితంలో సాధించవలసినది ఇంకేముంది? జీవిత పరమార్ధాన్ని తాను అందుకుంది.ఆ పైన బ్రతికినా చనిపోయినా తనకు ఒకటే.కనుక ఇకపై బ్రతికిన నాలుగు రోజులు లోకంకోసం, మరికొన్ని జీవితాలను బాగుచెయ్యడం కోసం బ్రతకడమే తప్ప వేరే మార్గమూ గమ్యమూ అర్ధమూ తనకు మాత్రం ఇంకేమున్నాయి గనుక?

ఆమె ఇంకే మాత్రమూ ఆలోచించలేదు.

'మీ ఆజ్ఞను పాటిస్తాను.ఇకపై నా జీవితాన్ని స్త్రీ జనోద్ధరణకు అంకితం చేస్తాను.' అని ఆమె తన గురుదేవులకు వెంటనే మాటిచ్చింది.

(ఇంకా ఉంది)