“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

17, జులై 2016, ఆదివారం

మా అమెరికా యాత్ర - 29 ( గాంగెస్ ఆశ్రమం - శ్రీ యంత్రం )























ఆదివారం ఉదయం గాంగెస్ శ్రీరామకృష్ణ యూనివర్సల్ టెంపుల్ లో 'శ్రీవిద్య' మీద ప్రసంగం ఇచ్చాను.దానికి పంచవటి మెంబర్స్ మాత్రమేగాక అక్కడి అమెరికన్స్ కూడా హాజరయ్యారు.ఆ వివరం అంతా ఇదే సీరీస్ 12 పార్ట్ లో వ్రాశాను.

మేమక్కడకు వెళ్ళేసరికే, ఆ హాల్లో అమెరికన్స్ చాలామంది ఉండి, ప్రేయర్ చేస్తున్నారు.వాళ్ళలో కొందరికి చిన్న చిన్న పిల్లలున్నారు.ఆ పిల్లలచేత ప్రేయర్ చేయిస్తున్నారు.ఆ ప్రేయర్ కూడా అన్ని మతాల ప్రేయర్స్ నూ కలగలిపిన యూనివర్సల్ ప్రేయర్ గా ఉన్నది. అందులో మనదైన - అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ' అనే భావాన్ని ఇంగ్లీషులో అంటూ, ఆ పిల్లలచేత అనిపిస్తూ ప్రేయర్ చేశారు. చాలా ముచ్చటగా అనిపించింది.

ఒక మధ్యవయసు అమెరికన్ స్త్రీ,  వాళ్ళ చేత ప్రేయర్ చేయిస్తూ, అక్కడ కనిపించింది. ఆ తర్వాత తెలిసింది చాలా ఏళ్ళ క్రితమే ఆమె హిందూ సాంప్రదాయం ప్రకారం సన్యాసం స్వీకరించిందనీ ఆమె పేరు - శక్తివ్రత మా  - అనీ.

మనవాళ్ళతో బాటు అమెరికన్స్ కూడా శ్రద్ధగా కూచుని 'శ్రీయంత్రం' గురించిన వివరణ వినడం చాలా ఆశ్చర్యంతో బాటు ఆనందమూ కలిగించింది.ఆ తర్వాత తెలిసింది ఏమంటే - వాళ్ళలో చాలామందికి శ్రీ యంత్రం గురించి చాలా అవగాహన ఉన్నదనీ, దానిగురించి వాళ్ళు చాలా రీసెర్చి చేస్తున్నారనీ తెలిసింది.

ఇదే సమయంలోనే మైకేల్, జూలియా అనే ఇద్దరు నా వద్దకు వచ్చి పరిచయం చేసుకుని మాట్లాడారు.మరుసటి రోజున దీక్షాస్వీకారం చేసి వాళ్ళు నా శిష్యులయ్యారు.

ఉపన్యాసం అయ్యాక, టెంపుల్ వెనుకగా ఉన్న హాల్లో బఫే విందు జరిగింది.

ఆ సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు అమెరికన్స్, వారు శ్రీయంత్రం మీద చేసిన రేఖా గణిత రీసేర్చిని నాకు వివరించారు. వారిలో ఒకరి పేరు రివర్.తనను తాను సరదాగా 'రివరానంద' అని పిలుచుకుంటూ ఉంటాడు. ఇంకొకాయన పేరు ఏదో ఉంది కాని ఆయన్ను అందరూ 'ప్రేమ్' అని పిలుస్తారు. అందరూ చాలా మంచివాళ్ళలా కనిపించారు.

ఈ ప్రేమ్ అనే అమెరికన్ అతని భార్యా కలసి కొన్ని ప్రయోగాలు చేశారట. ధ్వని అనేది ఇసుక లేదా నీటిలో ఎలాంటి షేప్స్ తీసుకువస్తుంది? అనేదే ఆ ప్రయోగాల సారాంశం.ఈ సైన్సును Cymatics అంటారు. Cymascope అని ఒక యంత్రం ఉంటుంది.దానిలో ఉన్న ప్లేట్ లో ఇసుక గాని, నీరు గాని పోసి, ఏదైనా ఒక సౌండ్ వైబ్రేషన్ తో దానిని వైబ్రేట్ చేస్తే, ఆ ఇసుకలోగాని, నీటిలో గాని రకరకాలైన ముగ్గులు లేదా యంత్రాల  వంటి షేప్స్ వస్తాయి.క్లుప్తంగా ఇదే ఈ సైన్స్.

ప్రేమ్ అతని భార్యా కలసి 'ఓమ్' అనే సౌండ్ ను వైబ్రేట్ చేసి చూస్తే, అది శ్రీచక్రం లాంటి ఒక షేప్ ను ఇసుకలోనూ నీటిలోనూ తెచ్చిందని వాళ్ళు చెప్పారు.వాళ్ళు చేసిన ప్రయోగాల ఫోటోలను కూడా నాకు చూపించారు. ప్రణవనాదానికీ శ్రీయంత్రానికీ భేదం ఏమీ లేదని మనం శ్రీవిద్యా సాంప్రదాయంలో విశ్వసిస్తాం.దానినే వీరు సైన్స్ యంత్రాల పరంగా నిరూపిద్దామని ప్రయత్నిస్తున్నారా? అనిపించింది.

వాళ్ళతో ఇంకొక విషయం కూడా చెప్పాను.

1990 లో అమెరికాలోని  ఒరెగాన్ స్టేట్ లోని ఒక ఎండిపోయిన నీటి మడుగు బెడ్ మీద రాత్రికి రాత్రి హటాత్తుగా ఒక బ్రహ్మాండమైన శ్రీయంత్రం ప్రత్యక్షమైంది.ఇది చిన్నా చితకా చిత్రం కాదు.దాదాపు 13 మైళ్ళ విస్తీర్ణంలో ఈ యంత్రం హటాత్తుగా ఆ లేక్ బెడ్ లో ప్రత్యక్షమైంది.ఆ గీతలన్నీ చాలా స్పష్టంగా చాలా ఖచ్చితంగా ఎవరో మిషన్ తో కొలిచి గీచినట్లుగా ఉన్నాయి. ఇదెలా జరిగిందో, అంత సంక్లిష్టమైన శ్రీయంత్రాన్ని 13 మైళ్ళ విస్తీర్ణంలో అంత స్పష్టంగా రాత్రికి రాత్రి ఎవరు గీచారో,ఎవరికైనా సరే ఇదెలా సాధ్యమో,ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు.ఇది గ్రహాంతర వాసుల పనే అని చాలామంది ఇప్పటికీ నమ్ముతున్నారు.ఎందుకంటే దీనిని ఈ రకంగా గియ్యడం మానవ మాత్రుల వల్ల జరిగే పని కాదు.

ఆ లింక్ ఇక్కడ చూడండి.

http://www.labyrinthina.com/sriyantra.html

దానిగురించి వాళ్ళతో మాట్లాడాను. ఈ అద్భుతం గురించి వాళ్లకు తెలుసు. కానీ వాళ్ళు కూడా దీని గురించి ఏమీ చెప్పలేక పోయారు.అది ఒక మిరకిల్ అని వాళ్ళు కూడా నాతో అన్నారు.

వాళ్ళ లోని ఓపన్ మైండ్, ఏదైనా ఒకదాన్ని పట్టుకుంటే దాని చివర వరకూ అర్ధం చేసుకోవాలన్న తపనా, రీసెర్చి చేసే గుణమూ,నమ్మితే పూర్తిగా నమ్మే తత్వమూ, నాకు బాగా నచ్చేశాయి.

అందరూ మాకు కనిపించారు గాని 'గౌరీమా' మాత్రం కనిపించలేదు. ఆమె తన ఇంట్లోనే ఉంటారుగాని సాధారణంగా బయటకు రారని తెలిసింది.

దేవాలయంలో 'గౌరీమా' (శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యురాలు) ఫోటో చూచినప్పుడే నాకు ఆశ్చర్యం కలిగింది. ఈమె కూడా ఆ పేరే ఎందుకు పెట్టుకుందో?దీని వెనుక ఏమైనా కధ ఉన్నదా అని నాకు సందేహం వచ్చింది. సమయం వచ్చినపుడు తెలుస్తుందిలే అని మౌనంగా ఊరుకున్నాను.

ప్రస్తుతం ఈ ఆశ్రమానికి ఇన్ చార్జ్ గా ఉన్న అమెరికన్ వనిత ' స్వామిని గౌరీవ్రత పురీ దేవి' (ఈమెనే సంక్షిప్తంగా గౌరీమా అని పిలుస్తారు) జీవితం నిజంగా చాలా అద్భుతమైనది. ఆమె గురించి తెలుసుకోబోయే ముందు, శ్రీ రామకృష్ణుల ప్రత్యక్షశిష్యురాలైన 'గౌరీమా' గురించి వచ్చే పోస్ట్ లో తెలుసుకుందాం.ఎందుకంటే ఆమె యొక్క తపోప్రభావమే నేడు గాంగెస్ లో ఈ ఆశ్రమం రావడానికి వెనుక గల బలమైన శక్తి గనుక.

(ఇంకా ఉంది)