“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, అక్టోబర్ 2015, శుక్రవారం

నా అవార్డ్ వెనక్కిచ్చేస్తా జాగ్రత్త !!

ప్రస్తుతం దేశంలో ఒక పెద్ద ఫార్స్ నడుస్తోంది.

చాలామంది మేధావులూ,మేత-ఆవులూ తమతమ బిరుదులనూ అవార్డులనూ వెనక్కిచ్చేస్తున్నారు.ఇది చాలా సంతోషించదగిన విషయం. ఇదేంటీ ఇలా అంటున్నారని చదువరులకు అనుమానం రావచ్చు.

వీరందరూ వీరి బిరుదులనూ అవార్డులనూ వెనక్కు వాపస్ చెయ్యడానికి ఒక గొప్ప కారణాన్ని చూపిస్తున్నారు.అదేంటంటే - దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఉన్నాయట.వాక్స్వాతంత్ర్యం లేదట.హిందూమతం అందరిమీదా రుద్దబడుతోందట.ఇవీ కారణాలు !!

వీరు చూపిస్తున్న కారణాలు ఏవీ నిజాలు కావు.

అసలు నిజమేమంటే - ఈ అవార్డులన్నీ గత ప్రభుత్వంలో పైరవీ చేసి తెచ్చుకున్నవి.మన దేశంలో నిజమైన టాలెంట్ కు గుర్తింపు ఎప్పుడూ లేదన్నది పచ్చివాస్తవం.అవార్డుల వెనుక ఎన్నెన్ని భాగోతాలు జరుగుతాయో ఇప్పుడు హైస్కూలు పిల్లాడిని అడిగితే చెబుతాడు.పైరవీలు, రికమెండేషన్లు లేకుండా మన దేశంలో ఏ అవార్డూ ఎవరికీ రాదు.పాత ప్రభుత్వంలో అలా అవార్డులు తెచ్చుకున్నవారు ఇప్పుడు తమతమ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తున్నారు.అసలు సంగతి ఇదే.

అసలు ఇలాంటి వారికి అవార్డులు ఇవ్వడమే అతి పెద్ద తప్పు.ఎందుకంటే - పార్టీకీ దేశానికీ తేడా తెలియని వారికి అసలు అవార్డులు ఎందుకట? వీరంతా దేశభక్తులు కారు.ఒక పార్టీ భక్తులు.ఆ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదుగనుక అదిచ్చిన అవార్డులను వీరు వెనక్కిచ్చేస్తున్నారు.ఈ అవార్డును మనకిచ్చింది ఒక పార్టీ కాదు, దేశం అన్న స్పృహ ఉంటే వారాపని చెయ్యరు.

కానీ వారలా వాపస్ ఇస్తున్నారంటే దానర్ధం ఏమంటే - "మాకు ఈ అవార్డులు మా ప్రతిభ ఆధారంగా రాలేదు.మేము వీటిని ప్రభుత్వంతో పైరవీ చేసి తెచ్చుకున్నాము.ఇప్పుడా ప్రభుత్వం లేదుగనుక మాకు చాలా బాధగా ఉన్నది.అందుకే ఏ చిన్న సాకు దొరికినా మా అవార్డులను వాపస్ చేస్తామని బెదిరిస్తాము." అని ఈ చర్యల ద్వారా వారే వారి గుట్టును బయట పెట్టుకుంటున్నారు.

ఇది తప్ప వీరి చర్యల వెనుక ఇంకేమీ లాజిక్కు నాకు కనపడటం లేదు.పార్టీకీ దేశానికీ తేడా తెలియని వారు మేధావులెలా అవుతారో నాకేమీ అర్ధం కావడం లేదు.

అసలిలాంటి వారికి అవార్డులు ఇవ్వడమే అతి పెద్ద తప్పు.అసలైన అర్హులు సమాజంలో ఎంతోమంది అజ్ఞాతంగా ఉండగా - ఇలాంటి పైరవీదారులకు అవార్డులు ఇవ్వడం అంటే ప్రభుత్వాధికారాలను దుర్వినియోగం చెయ్యడం తప్ప ఇంకేమీ కాదు.అయినా మన దేశంలో అధికారం అనేది సక్రమంగా ఎప్పుడు వినియోగం చెయ్యబడింది గనుక?

ఒక చిరుద్యోగి చాలా నిరాడంబరంగా బ్రతుకుతూ తన జీతంలో సింహభాగాన్ని సమాజంలో లేనివాళ్ళకు సాయం చెయ్యడానికి ఉపయోగిస్తున్నాడు.ఇంకొక సామాన్యుడు తన అవసరాలు ఎన్నింటినో మానుకొని లేనివాళ్ళకు సాయపడుతున్నాడు.ఇంకొక డ్రిల్లు మాస్టారు తన జీతం మొత్తాన్నీ తను పనిచేస్తున్న స్కూలు అభివృద్ధికే ఖర్చుపెడుతున్నాడు.ఇంకొక వ్యక్తి ఒకపూట తిండి తను మానుకొని ఆ డబ్బుతో ఇంకొకరి ఆకలిని తీరుస్తున్నాడు.ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఎంతోమంది అజ్ఞాతంగా ఉన్నారు.వీరికి పేరు ప్రతిష్టలు అక్కర్లేదు.వీరు అవార్డులు ఆశించరు.బిరుదులూ ఆశించరు.ఆత్మతృప్తికోసం ఇవన్నీ చేస్తుంటారు.దేశభక్తితో ఇవన్నీ చేస్తుంటారు.అసలైన పద్మశ్రీలూ పద్మభూషణ్ లూ ఇలాంటి వారికి ఇవ్వాలి. అంతేగాని పార్టీ తొత్తులకూ పైరవీదార్లకూ బడా వ్యాపారస్తులకూ ఆర్ధిక మోసగాళ్ళకూ ఇప్పటికే మదించి ఉన్న తిమింగలాలకూ,కోట్లు ఉంచుకుని ఒక వెయ్యి దానం చేసేవాళ్ళకూ పేరు ప్రతిష్టలకోసం గొప్పకోసం 'సేవలు' చేసేవాళ్ళకూ కాదు.

ఇలాంటి కుహనా మేధావులంతా త్వరగా బయటపడి తమతమ అసలు రంగులు బయట పెట్టుకుంటే చాలా మంచిది.ఇలా బెదిరించడం వల్ల ఏమీ ఉపయోగం లేదనీ, అది వారివారి మేధోశూన్యతను బయటపెట్టుకోవడం మాత్రమేననీ ఇలాంటి వారు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

ప్రస్తుతం దేశంలో వారంటున్న ఎమర్జెన్సీ పరిస్థితులు ఎక్కడున్నాయో నాకైతే ఏమీ కనపడటం లేదు.ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు గనుక వాక్స్వాతంత్రానికి కూడా ఏమీ భంగం వాటిల్లలేదు.ఒకవేళ నిజంగా అలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులే గనక ఉంటే - వీరంతా ఇలా అవార్డులను వెనక్కు ఇవ్వగలిగేవారా?ఇలా ప్రభుత్వాన్ని బెదిరించగలిగేవారా?ఎమెర్జెన్సీలో ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలియదా?

ఇకపోతే హిందూమతం సంగతి.మనకు స్వతంత్రం వచ్చాక హిందూమతం నష్టపోయినంతగా మనదేశంలో ఇంకే మతమూ నష్టపోలేదు.అన్నిమతాలూ బాగానే బలపడ్డాయి.బలహీనం అయింది హిందూమతమే.అసలు ఈ దేశంలో హిందూమతం ఉన్నది గనుకనే ఇతర మతాలవారు హాయిగా బ్రతకగలుగుతున్నారు.మన పొరుగు దేశాన్ని చూస్తే ఈ విషయం చాలా చక్కగా మనకు అర్ధమౌతుంది.ఇంకాఇంకా హిందూమతాన్ని ఆడిపోసుకోవడం ఎందుకు?

ఇతర మతాలవారు హాయిగా డబ్బులిచ్చి మరీ ప్రచారాలు చేసుకుంటూ మత మార్పిడులు చేస్తూ, మతహింసకు పాల్పడుతూ,మన డబ్బుతో వారివారి మతయాత్రలు చేసుకుంటూ మళ్ళీ మనమీదే బురదజల్లుతూ ఉంటే అప్పుడంతా బాగానే ఉంది.ఇప్పుడు హిందూమతం గురించీ దాని విలువల గురించీ ఎవరైనా కొంచం మాట్లాడితే అది పెద్ద మతవాదం అయిపోతున్నది.అసలీ పోకడను ఇన్నాళ్ళనుంచీ పెంచి పోషించినది నెహ్రూ అనుచరులూ, కమ్యూనిస్టులూ.ఈ పోకడను అభివృద్దిగా వారు భావించారు.ఇది ఎంత అభివృద్దికి దారితీసిందో నేటి పరిస్థితులే చెబుతున్నాయి.బాగుచెయ్యడం ఎక్కడనుంచి మొదలుపెట్టాలో తెలియనంతగా సమాజాన్ని సర్వనాశనం చేసేశారు ఇప్పటిదాకా పరిపాలించిన పార్టీలు.ఇదీ దేశాన్ని వీరు చేసిన అభివృద్ధి !!

వీరిలో మొదటివారేమో బ్రిటిష్ కల్చర్ కు దాసానుదాసులు.బ్రిటిష్ వారు మన దేశాన్ని వదలిపోయినా వారి భావజాలాన్ని వీరు ఇప్పటికీ పెంచి పోషిస్తూనే ఉన్నారు.రెండవవారేమో చైనా తొత్తులు.నేటి చైనాను చూసైనా వీరు నేర్చుకోవాలి.కానీ వారాపనిని చెయ్యరు.చైనాలో ఇప్పుడు తమ కళలమీదా సాంస్కృతిక వారసత్వం మీదా వారికి మళ్ళీ ప్రేమ పెరుగుతున్నది.తమ చైనీస్ కల్చర్ ను ప్రపంచవ్యాప్తంగా వారు చాలా గొప్పగా ప్రమోట్ చేసుకుంటున్నారు.ఇక్కడ వీరేమో మన సంస్కృతికి వ్యతిరేక విషబీజాలను ఈనాటికీ ఇంకా చల్లుతూనే ఉన్నారు.వీరిద్దరూ మొదటగా మన దేశపు ప్రాచీన సంస్కృతిని ప్రేమించడం ఇప్పటికైనా నేర్చుకోవాలి.

ఏదేశమైనా తన సంస్కృతి ఆధారంగానే అభివృద్ధి చెందాలి.అలా జరగడమే అసలైన మార్గం కూడా.తన సంస్కృతిని తానే మర్చిపోవడం ఎలాంటిదంటే, అది ఒక చెట్టు తన వేర్లను విస్మరించినట్లుగా అవుతుంది.అప్పుడా చెట్టు ఎంతోకాలం బ్రతకలేదు.ఎదగలేదు.మన మూలాలను మనం ఎప్పుడూ మరచిపోకూడదు.వీళ్ళకు ఇంత సింపుల్ విషయమే తెలియదు.వీళ్ళు మేధావులట !! వీళ్ళని మేధావులుగా గుర్తించడమే మనం చేస్తున్న అతి పెద్ద పొరపాటు.ఈ రెండువర్గాలూ మాయమైతే గాని మన దేశంలో నిజమైన అభివృద్ధి కనిపించదు.అసలైన అభివృద్ధి నిరోధకులు వీరే.

అయినా దమ్మిడీ కూడా విలువలేని అవార్డులను వెనక్కిచ్చేస్తే వారికి మాత్రం పోయేదేముంది ? అలా ఇవ్వడం వల్ల దేశానికి వచ్చే నష్టం మాత్రం ఏముంది? ఈ తాటాకు చప్పుళ్ళతో వీళ్ళు ఎవర్ని బెదిరించాలనుకుంటున్నారో??